గెలుపు

చెవిలో స్క్రూ పెట్టి మెదడుని కెలికినట్టు అనిపించింది. కాస్మోపొలిటన్ క్లబ్బుకెళ్ళాను. అక్కడివారి చూపులు మారిపోవడం గమనించాను. ఎవరూ ఏమీ అడగలేదు, అయితే అందరూ నా గురించే ఆలోచిస్తున్నారు. ఒంటరిగా కూర్చున్నప్పుడు రంగప్ప వచ్చాడు. నన్ను చూసి నవ్వి నేరుగా నా దగ్గరకొచ్చి కూర్చున్నాడు. చేయూపి మందు ఆర్డర్ ఇచ్చాడు. ‘పిల్లాడు కోలుకుంటాడు. అయితే కొంచం కష్టం. ఎముకల్లో కూడా టీబీ ఉంది,’ అన్నాడు. ‘చెప్పింది.’ అన్నాను.

‘మీ భార్య మంచిది!’ నేను తడబడే గొంతుతో, ‘ఏం, వస్తాను అని చెప్పేసిందా?’ అన్నాను. ‘ఇంకా లేదు,’ అని చిన్నగా నవ్వాడు. ‘రెండు రకాల ఆడవాళ్ళుంటారు. ఒకరకం ఆడవాళ్ళని కోరికలు నడిపిస్తాయి. మరోరకం ఆడవాళ్ళని బాధ్యతల ఒత్తిళ్ళు నడిపిస్తాయి. మంచి ఆడవాళ్ళు ఒత్తిళ్ళకు లొంగొపోతారు.’ గట్టిగా నవ్వి, ‘ఎలాగైతేనేమి లొంగిపోతారు,’ అన్నాడు.

‘మనం దీని గురించి మాట్లాడొద్దు,’ అన్నాను. ‘అవును ఇంకా గడువుంది కదా,’ అన్నాడు. నేను అతని కళ్ళల్లోకి చూసి, ‘ఐదు లక్షలకు అంబాసిడర్ ఏజెన్సీ తీసుకోవడం గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజే అన్ని వివరాలూ చూశాను,’ అన్నాను. అతను నా కళ్ళల్లోకి చూసి ‘ఇంకా పదహారు రోజులు. చూద్దాం…’ అన్నాడు. నాకూ కలిపే మందు ఆర్డర్ చెప్పాడు. అతనికి ఇష్టమైన బ్లాక్‌లేబుల్! అతని వల్ల ఆ బ్రాండ్ రుచి నన్నూ అంటుకుంది.

ఆ తర్వాతనుంచి రోజూ కాస్మొపొలిటన్ క్లబ్‌కు వెళ్ళాను. ప్రతి రోజూ అతణ్ణి చూశాను. అప్పుడప్పుడు వచ్చి నాతో ఏదైనా నవ్వుతూ మాట్లాడేవాడు. నేను ఒంటరిగా ఉన్నా ఎవరూ వచ్చి ఏం జరుగుతోందని అడగలేదు. అతనినీ అడిగి ఉండరు. అయితే అందరూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని గడువుకోసం చూస్తున్నారు.

ఎప్పుడూ లేనిది ఒక రోజు నాచ్చిముత్తు నా దగ్గరకొచ్చి మాట్లాడాడు. నేను క్లబ్ నుండి బయటకి మెట్లు దిగుతుంటే నాతోబాటు వచ్చాడు. మామూలుగా నాలాంటి తక్కువ స్థాయి వాణ్ణి దూరంగానే పెడతాడు. ఆ రోజుమాత్రం నా భుజాన చేయి వేసి ‘నీకు నా కొడుకు వయసుంటుంది…’ అన్నాడు. ‘చెప్పండి గవుండరయ్యా,’ అన్నాను.

“నా వయసు డెబ్బై. పద్దెనిమిదేళ్ళప్పుడు నా మైనర్ జీవితం మొదలుపెట్టాను. నా అనుభవం నుండి చెప్తున్నాను. రంగప్ప చెప్పేదే సరైంది. ధనవంతులందరికీ అది తెలుసు. ఆడవాళ్ళకి ఏదో ఒక కష్టం ఉంటుంది. దాన్నుండి బయటపడటానికి కావలసిన ఆత్మవిశ్వాసమో దానికి తగిన తెలివో వాళ్ళకు ఉండదు. మరొకరి అండ కావలసిందే. మరో రకమైన ఆడవాళ్ళు వాళ్ళ తాహతుకంటే ఎక్కువ దొరికుండాలన్న భావనలో ఉంటారు. ఈ ఇద్దర్నీ లొంగదీసుకోవచ్చు. నేను ఎక్కువ చెప్పుకోను. అయితే రంగప్పకంటే ఎక్కువమందిని లోబరచుకున్నవాణ్ణే. అనుకున్న ప్రతిసారీ నెగ్గాను. ఒక్కచోట కూడా ఓడిపోలేదు.’

నేను కదలకుండా నిలిచిపోయాను. కాళ్ళు మాత్రం వణుకుతున్నాయి. అతను తమిళంలో, ‘చప్పుడు లేకుండా ఆమెనూ పిల్లల్నీ తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. లేదూ ఒక రూపాయే కదా, గడువు ముగిసేలోపే నువ్వు చెప్పింది తప్పని ఒప్పేసుకుని సవాలునుండి తప్పుకో,’ అన్నాడు. ‘అదెలా?’ ‘సరే నాయనా, అలానే జరుగుతుంది. నేను ఓటమిని ఒప్పేసుకుంటాను మా ఆవిడ జోలికి రావద్దు అని అందరి ముందూ చెప్పేయ్. అంతే! అయిపోతుంది. నీకంటే పై స్థాయివాడి దగ్గరే కదా ఓడిపోతున్నావు? అవును, నవ్వుతారు. ఒక పది రోజులు దాని గురించి మాట్లాడుకుంటారు, ఆపైన మరిచిపోతారు. అంతా సహజంగా అయిపోతుంది కొన్నాళ్ళకు. అలాకాకుండా ఏదైనా జరిగితే నీ జీవితం తారుమారైపోతుంది. ఆపైన ప్రశాంతంగా జీవించలేవు, నీ ఇష్టం.’

‘చూద్దాం!’ గట్టిగా అన్నాను. ‘ఏం చెప్తావు?’ అనడిగాడు నాచ్చిముత్తు గౌండర్. ‘చూద్దాం…’ అని నేను మళ్ళీ చెప్పాను. ఆయన నన్ను చూస్తూ కారెక్కాడు. అతను మాట్లాడాక నేను మరింత గట్టిబడ్డాను. తాడో పేడో తేల్చుకోవలసిందే, చివరిదాక వెనకాడకూడదు అని నాకు నేను పలుమార్లు చెప్పుకున్నాను. నెగ్గితే కలిగే సంతృప్తి మరే మార్గంలోనూ నాకు ఇక దొరకదు. ఈ అవకాశాన్ని పాడుచేసుకుని ఆ తర్వాత జీవితకాలం దీన్ని గురించి చింతిస్తూ జీవించలేను అనిపించింది.

మంత్రమో తంత్రమో ఏదీ రంగప్ప చెయ్యడం లేదు. ఒక ఆడదాని మనసు దోచుకోడానికి మగాడు ఏవైతో చేస్తాడో అవే చేస్తున్నాడు. మాటల్లో ఆమె చదువునీ అందాన్నీ పొగిడాడు. అదీ చాకచక్యంగా చెప్పాడు. ఆ పొగడ్తలన్నీ నేను తనదగ్గర చెప్పినట్టు ఆమెకు చెప్పాడు. పిల్లలకి బొమ్మలు, కానుకలు కొనిచ్చాడు. ఆమె బెరుకు వదుల్చుకుని వాటిని తీసుకోవడం మొదలుపెట్టాక ఆమెకు కూడా చిన్న చిన్న కానుకలివ్వడం మొదలెట్టాడు. వాటిని ఇవ్వడానికి అతనే కొన్ని సందర్భాలను సృష్టించుకున్నాడు. ‘పెద్ద హాస్పిటల్‌కు వెళ్తున్నాము. కొంచం మంచి దుస్తుల్లో వెళ్తే బాగుంటుంది,’ అని డ్రైవర్‌తో చెప్పించాడు. ఆ తర్వాత అతనే ఆమెకు చీరలు కొనిచ్చాడు. ఖరీదైన చీరలు. డ్రైవర్ ద్వారా పంపించినందువల్ల తిరస్కరించలేకపోవడము, తప్పుబట్టలేకపోవడమూ జరిగింది. అయితే పంపింది ఎవరన్నది తీసుకున్న వారి అంతరాత్మకు తెలుసు.

ఒక రోజు ఆమె మెడలో బంగారు గొలుసు వేసుకునుండటం గమనించాను. నాకు చూపించి జమీందారు కొనిచ్చాడని చెప్పింది. అరక్షణం ఆమె చూపు నన్ను తప్పించి మళ్ళీ చూసింది. ‘ఊరికే ఇచ్చాడా?’ అని నేను అడిగాను. ‘లేదు. మీకు ఇవ్వాల్సిన రొక్కానికి బదులుగా ఇది ఇస్తున్నాను అన్నారు. మీతో మాట్లాడుతానని కూడా చెప్పారు, చెప్పలేదా?’ అనడిగింది. ‘అవును, చెప్పారు,’ అన్నాను.

‘ఐదు కాసులు!’ అంది. ‘ఇప్పుడు వారానికి మూడు రోజులు పెద్ద హాస్పిటల్‌కు వెళ్ళాల్సొస్తోంది. కొంచం గొప్పగా కనిపిస్తేనే మనల్ని పట్టించుకుంటారు.’ భోజనం తెచ్చిపెట్టింది. వడ్డించలేదు. నేనే పెట్టుకుని తిన్నాను. పిల్లాడికి బట్టలు మారుస్తూ, ‘హాస్పిటల్ బెడ్‌లోనే ఒంటికి పోసేశాడని తిడుతున్నారు నర్సులు. అక్కడి నర్సులు ఎలా ఉన్నారనుకుంటున్నారు? ఒక్కొక్కరూ పెద్దింటి శీమాటీల్లా కొప్పులపైన తెల్ల టోపీలు పెట్టుకుని భలే స్టైల్‌గా ఉన్నారు. లూసియా అనొక గయ్యాళి, ఇంగ్లీషులోనే కయ్యిమంటుంది. ఇతనితో వెళ్ళడంవల్లే నాతో గౌరవంగా మాట్లాడుతున్నారు. సాదాసీదాగా కనిపించేవాళ్ళని తీసిపడేసినట్టు చూస్తారు. చచ్చినాకూడా పట్టించుకోరు,’ అంది.

ఆమెను చూడకుండానే ‘అవునా?’ అన్నాను. ఆమె ఇలా తన చర్యలను సమర్థించుకుంటూ ఎటు పోతుందా అని ఆలోచించాను. అవును, దాన్లో పడటానికే. అనుమానమే లేదు. నేను నెగ్గడానికి ఒక్క శాతంకూడా అవకాశం లేదు. ఒకవేళ ఆ ఒక్క శాతంలో నేను నెగ్గానంటే నా జీవితం తారస్థాయికి చేరుకుంటుంది. పాతకాలం బ్రిటిష్ యోధులు ద్వంద్వ యుద్ధం చేస్తారు అని విన్నాను. ఏడుసార్లు మార్చి మార్చి కాల్చుకోవాలి. ఇద్దర్లో ఒకరే ప్రాణంతో ఉండగలరు. మరొకరు చనిపోయే అవకాశాలే ఎక్కువ. అయినప్పటికీ ఎల్లప్పుడూ ద్వంద్వయుద్ధానికి కాలుదువ్వుతూనే ఉంటారు. ఆ ద్వంద్వ యుద్ధం మొదలయ్యేప్పటివరకు జీవించిన రోజులు అర్థవంతమవుతాయి. ఒక్కొక్క నిముషమూ, ఒక్కొక్క క్షణమూ ప్రాణసమానమవుతుంది. ద్వంద్వ యుద్ధంకంటే పెద్ద జూదం మరొకటుండదు అని తెల్లవాళ్ళు చెప్తే విని ఉన్నాను. ఇదీ ఒక ద్వంద్వ యుద్ధమే. గెలవాలి. లేదంటే మరణమే.

అయితే నేను నిజంగానే చచ్చిపోగలనా? చచ్చిపోతానని అనిపించట్లేదు. చావుగురించి ఇంతగా ఆలోచించే వాడు చచ్చిపోలేడు. చచ్చిపోవాలనుకునేవాళ్ళు ఆ క్షణంలో నిర్ణయిస్తారు. ఇంత ఆలోచిస్తున్నాను కాబట్టి నేను తప్పించుకునే మార్గాలనూ కనుక్కునే ఉంటాను. లోలోపల చాలా రకాల సమర్థింపులను సృష్టించుకునుంటానేమో కూడా. రోజు రోజుకీ అహం పెరిగిపోతూ ఉంది. క్షణం గడవడం గగనంగా ఉంది. పది నిముషాలెంత పొడవైనవో తెలుసుకున్నాను.

తర్వాత నా పిల్లాడి రూపంలో ఓ ఒత్తిడి వచ్చిపడింది. నేను ఆఫీసులో ఉన్నప్పుడు హాస్పిటల్‌ సిబ్బందినుండి ఒకడు సైకిలేసుకుని నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. పిల్లాడికి సీరియస్ అయిందని, హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టూ చెప్పాడు. నేను రిక్షా పట్టుకుని హాస్పిటల్‌కెళ్ళాను. నా భార్య పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతులు పట్టుకుని భోరుమని ఏడ్చింది పెద్దగా.

‘ఏమైంది?’ అన్నాను. ‘తెలియడంలేదు… తెలియడంలేదు!’ అంది. లోపలికెళ్ళి డాక్టర్‌ని కలిశాను. ఉత్తరాది డాక్టర్. వచ్చీరాని తమిళంలో మాట్లాడాడు. ‘దీనికొక మందుంది. అది ఇచ్చాము. ఇప్పుడు ఆ మందు రెసిస్ట్ చెయ్యడం ప్రారంభించింది. జ్వరం పెరిగిపోతూ ఉంది.’ ‘ఏం చేద్దాం డాక్టర్?’ ‘చూద్దాం…’ అన్నాడు. ‘అంతా దేవుడి చేతుల్లో ఉంది!’

అతను ఏం చెప్పొస్తున్నాడన్నది అర్థం అయింది. ‘ఇంకేమైనా మందుందా?’ అనడిగాను. ‘ఒక మందుంది. కనిపెట్టి ఒక ఏడాది కూడా కాలేదు. లండన్‌నుండి తెప్పించాలి. విమానంలో రావాలి. అది రావాలంటేకూడా నాలుగైదు రోజులు పట్టొచ్చు. అంతవరకు జ్వరం కంట్రోల్‌లో ఉండాలి,’ అన్నాడు.

నేను బయటికొచ్చిచూస్తే అక్కడ రంగప్ప ఉన్నాడు. నా భార్య ఏడుస్తూ అతనితో మాట్లాడుతూ ఉంది. నన్ను చూడగానే రంగప్ప, ‘ఉండండి నేను మాట్లాడి వస్తాను…’ అని లోపలికెళ్ళాడు. నేను సడలిపోయి కూర్చున్నాను. కంగారుగా, ‘ఏమన్నారు డాక్టర్?’ అని అడిగింది. నేను, ‘తను రానీ అడుగుదాం…’ అన్నాను. ఆ అర్థంలేని జవాబుతో నా భార్యని నేనే అతని మీదకి నెట్టేశాను.

రంగప్ప బయటికొచ్చి నాతో, ‘లండన్‌లో మందుందట. ఇప్పుడే టెలిగ్రామ్ ఇచ్చి తెప్పించేస్తాను. నాలుగైదు రోజుల్లో వచ్చేస్తుంది. అంతవరకు పిల్లాడి ఆరోగ్యం నిలకడగా ఉండేలా చూసుకోమని చెప్పాను,’ అన్నాడు. నా భార్య, ‘అక్కణ్ణుండా… అయ్యో!’ అంది. ‘ఖర్చుగురించి ఆలోచించకండి. సార్ నాకు చాలా దగ్గర వ్యక్తి. ఏంతైనా నేను చూసుకుంటాను.’ ఆమె ఏడుస్తూ చేతులెత్తి దణ్ణంపెట్టింది. అలా సోలిపోయి బెంచ్ మీద కూర్చుని ఏడుస్తోంటే రంగప్ప నా దగ్గరకొచ్చి, ఆమెను చూసుకోండని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆమె ఏడుస్తూ ఉంటే నేను పక్కన ఊరకే నిల్చున్నాను. కాసేపయ్యాక నిట్టూరుస్తూ చలించిపోయినట్టు బయటకొచ్చాను. నా భార్య పరుగెట్టుకుంటూ వచ్చి నా చేతులు పట్టుకుంది. ‘ఏం చెప్పారు? ప్రాణానికేం కాదు కదా?’ అనడిగింది. ‘ఏం కాదు. కోలుకుంటాడు.’ ‘జమీందారు చూసుకుంటానన్నారు. ఆయన రూపంలో ఆ కొండమీది దేవుడే దిగొచ్చి చెప్పినట్టు ఉంది. అతని కాళ్ళమీద పడిపోవాలనిపించింది.’

‘పడ్డావా?’ అని నాలో నేనే అనుకున్నాను. ‘అతనేనండీ ఇక అన్నీ మనకి. అతనే అంతా!’ అని ఏడుపు మధ్యలో మాట్లాడింది. ఆమెకు కొంచం మతిస్థిమితం తప్పినట్టు అనిపించింది. హాస్పిటల్‌లో ఎవరూ ఉండకూడదని చెప్పేశారు. రంగప్ప సిబ్బందిని అక్కడే ఉంచేట్టు చెప్పాడు. నేను ఆమె భుజాలు పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాను. పక్కింటి బామ్మని పిల్లల్ని చూసుకోడానికి ఏర్పాటు చేసింది. బామ్మ వాళ్ళకు ఇచ్చిన గంజి తాగినట్టులేరు. ఏడుస్తూ నిద్రపోయినట్టున్నారు.

సాయంత్రం ఏడు గంటలకు లేచింది లత. ‘నేను ఇక్కడ ఉండలేను. ఇక్కడ నిద్రపోలేను. నేను వెళ్తాను…’ అంది. ‘ఏం చేస్తావక్కడ?’ ‘నేనక్కడే ఉంటాను. నా పిల్లాడికి దగ్గరగా ఉంటాను…’ అని పిచ్చిదాన్లా మాట్లాడింది. ఏమీ చెయ్యలేనని అర్థం అయింది. సైకిల్ రిక్షా పిలిపించి ఆమెను తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాను. ‘ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఉండాలంటే వరండాలో ఉండాల్సిందే!’ అని చెప్పాడు డాక్టర్. ‘వరండాలోనే ఉంటాను. నేను వరండాలోనే ఉంటాను…’ అంది. ఆమెను కూర్చోబెట్టి నేనూ కూర్చున్నాను. తెల్లవార్లూ ఇద్దరం నిద్రపోలేదు.

తెల్లారాక ఆమెను అక్కడే వదిలిపెట్టి ఇంటికొచ్చి పిల్లల్ని బడికి పంపించి దోసెలు వేసుకుని తిని పడుకున్నాను. మధ్యాహ్నం దాటింది లేచేసరికి. సాయంత్రం హాస్పిటల్‌కి వచ్చాను. అక్కడ నా భార్య లేదు. జమీందార్ వచ్చాడు, అతనితో కార్లో వెళ్ళినట్టు చెప్పాడు అక్కడి వాచ్‌మన్. నా ఒంటిలో రక్తమంతా వడిగి కారిపోయినట్టు అయింది. బెంచి మీద కూలబడ్డాను. ఎంతసేపలా కూర్చున్నానో మరి, ఎనిమిదింటికి డాక్టర్ వచ్చాడు. ‘పిల్లాడి పరిస్థితి అలానే ఉంది. అయితే ఇంకా దిగజారిపోలేదు. మందుతో బాగవుతుంది,’ అన్నాడు.

‘ఆ మందు పనిచేస్తే ఇంక భయంలేదు.’ అని నమ్మకంగా పలికాడు. నీళ్ళు నిండిన నా కళ్ళను చూసి, ‘మీరు ముందే చూపించుండాల్సింది. మీరిచ్చిన ఆ చిన్న చిన్న మందులవల్లే రెసిస్టెన్స్ వచ్చినట్టుంది. చూద్దాం, నమ్మకంతో ఉండండి,’ అని వెళ్ళిపోయాడు.

నేను అక్కడే కూర్చున్నాను. తెల్లవారాక కాని తెలియలేదు బెంచ్ మీదే పడుకున్నానని. అక్కడే ముఖం కడుక్కుని ఆఫీసుకెళ్ళి లెటర్లేమైనా వచ్చాయేమోనని చూశాను. కొన్ని లెటర్లు పంపాను. ఇంటికెళ్ళి పిల్లలు బడికెళ్ళారా అని చూశాను. ఆ రోజు ఆదివారం. నిద్రపోతూ ఉన్నారు. నా భార్య ఇంటికి రాలేదని బామ్మ చెప్పింది. రెండో అబ్బాయి ‘అమ్మేదీ?’ అని రాత్రి పదే పదే అడిగాడట.

‘ఇక్కడే ఉండండి, ఇంటికెళ్ళకండి…’ అని చెప్పి బామ్మకి డబ్బిచ్చి హాస్పిటల్‌కు వచ్చాను. హాస్పిటల్‌లో నా భార్య ఉంది. వరండాలో మరో చివర ఉన్న ఆమెను చూడగానే తెలిసిపోయింది, ఏదో జరిగిందని. పక్కనే చేతులు కట్టుకుని మరో వైపుకు చూస్తూ రంగప్ప నిల్చునున్నాడు. నా అడుగుల చప్పుడు విని ఇద్దరూ తిరిగి చూశారు. ఆయన నా దగ్గరకొచ్చి ‘సాయంత్రం కాస్మోపొలిటన్ క్లబ్బులో కలుసుకుందాం. ఆర్డర్ ఇచ్చిన మెడిసిన్ రేపు ఉదయం వచ్చేస్తుందట…’ అని చెప్పి వెళ్ళిపోయాడు.

దేహభారం పది రెట్లు పెరిగిపోయిన వాడిలా నేను ఆమె దగ్గరకు వెళ్ళాను. ఆమె నావైపుకు తిరిగైనా చూడలేదు. ‘ఏమన్నాడు డాక్టర్?’ అని అడిగాను. ఏమీలేదన్నట్టు తలూపింది. ఆమె పక్కనే కూర్చున్నాను. పదేపదే అమె ముఖాన్నే చూస్తూ ఉన్నాను. ఒక్క రోజులోనే ఆమెకు పది పదిహేనేళ్ళు పెరిగిపోయినట్టు అనిపించింది. ఆమెకు తెలిసిన జీవితం మొత్తంగా మారిపోయినట్టు, ఆమె శరీరంలోంచి మరో మనిషి బయటకొచ్చి కూర్చున్నట్టుగా ఉంది.

ఆ రోజంతా అక్కడే ఉన్నాను. ఆమె శిలలా కూర్చుండిపోయింది. కాసేపటికి, ‘ఇంటికి వస్తావా?’ అనడిగాను. తల ఆడించింది. ఇంటికి తీసుకొచ్చాను. వచ్చే దార్లో కూడా అలానే ఉంది. ముఖం వాచిపోయుంది. నేను ఓరకంట ఆమె ముఖాన్నే చూస్తూ ఉన్నాను. ఏమైంది? ఎలా అడిగేది?

రిక్షాలో కూర్చుంటున్నప్పుడు నాకు కొంచం అర్థం అయినట్టనిపించింది. నా ఒళ్ళు మెల్లగా సడలిపోయింది. నవ్వూ కన్నీరూ కలిసి వచ్చాయి. మహాభారతంలో ధర్మరాజు తర్వాత భార్యని పెట్టి జూదమాడినవాణ్ణి నేనే! ఎవరికైనా ఇది చెప్పాలి. వినేవాళ్ళు పగలబడి నవ్వుతారు. ఎవరికి తెలుసు? నా కథని సినిమాగా తీసినా తీస్తారు. నాకే తెలీకుండా పైకే నవ్వేశాను. తిరిగి ఆమె వైపు చూశాను. ఆమె అక్కడ లేదు.

ఇంటికి రాగానే పరుగెట్టుకుంటూ వచ్చి తనను హత్తుకుని ఏడ్చిన రెండో అబ్బాయి తల నిమిరింది. అయితే తలవంచి వాడిని చూడలేదు. పెద్దోడు వచ్చి, ‘శివుడెక్కడమ్మా?’ అనడిగితే, ‘వచ్చేస్తాడు,’ అని సన్నగా చెప్పింది. తర్వాత కాళ్ళు చాపుకుని గోడకానుకుని కూర్చుంది. బామ్మ పక్కనున్న అగ్రహారంనుండి రుబ్బిన దోసె పిండి కొనుక్కొచ్చింది. అందరికీ బామ్మే దోసెలేసి పెట్టింది. నేను చేయి కడుక్కోడానికి వెళ్ళినప్పుడు పెరట్లోని అరుగుమీద కూర్చుని లత దోసెలు తింటుండటం చూశాను.

ఆమె చూపు వేరే ఎక్కడో ఉంది. చెమ్మగిల్లిన కళ్ళు. అయితే ఎక్కడినుండో ఒక ప్రత్యేకమైన వెలుగు ఆమె మీద పడుతున్నట్టు చాలా అందంగా కనిపించింది.

చాప పరచుకుని దుప్పటిని తలమీదుగా కప్పుకుని సోయిలేనట్టు నిద్రపోయింది. నేను ఆమెనే చూస్తూ నిలబడ్డాను. అవును. నేను పూర్తిగా ఓడిపోయాను. అదే, మరో దారిలేదు. కాస్మోపొలిటన్ క్లబ్బుకు వెళ్ళి రంగప్పను ఫేస్‌చెయ్యాలి; లేదంటే, నేను మగవాణ్ణి అయితే, ఇలానే వెళ్ళి ఉరేసుకోవాలి. అయితే ‘ఆ’ విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఏం నిర్ధారించుకోవాలి? ఆమెను లేపి ఆ విషయం అడగాలా? ఏమని? రాత్రి అతనితో గడిపావా అనా? అంతకంటే కాస్మోపొలిటన్ క్లబ్బుకు వెళ్ళడమే ఉత్తమం. అయితే అక్కడికెళ్ళి అవమానంతో ముడుచుకుపోయి నిల్చోవడంకంటే చచ్చిపోవడం మంచిది.

ఎందుకు చావాలి? ఇలానే పారిపోవచ్చు. పిల్లల్నీ ఆమెనీ రంగప్ప వదిలేయడు. ఒకవేళ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇప్పుడే మొదలవబోతుందేమో… బాగా అలసటగా అనిపించింది. ఒంటినిండా నీళ్ళు నిండిపోయినట్టు చేతులూ కాళ్ళూ భారంగా ఉన్నాయి. బయల్దేరు. అంతే!

అయితే అలా వెళ్ళిపోడానికి కుదరదు అని అంతరాత్మకి తెలిసినట్టుంది. ఏం జరిగిందన్నది నిర్ధారించుకోకుండా ఎక్కడా ప్రశాంతంగా జీవించడం నా వల్ల కాదు అన్నది తెలిశాక కంగారు కొంచం తగ్గింది. పెరట్లోకెళ్ళి తొట్లో ఉన్న మంచి నీళ్ళు ముంచి పోసుకుని స్నానం చేశాను. నీళ్ళన్నీ అయిపోయినా ఒళ్ళు మాత్రం కాగిపోతూనే ఉంది.

నాకున్నవాటిల్లోనే మంచి షర్ట్ వేసుకున్నాను. కొత్త నల్లకోటు తగిలించుకున్నాను. బంగారు పూతపూసిన గుండీలున్నాయి. ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే వీటిని వేసుకుంటాను. వెండి మూతవున్న పెన్ను. కళ్ళజోడు. బయల్దేరే ముందు నన్ను నేను ఒక సారి చూసుకున్నాను. ఒక ధైర్యం వచ్చింది.

వెళ్ళేప్పుడు సరస్వతి కఫే లోపలికెళ్ళి పొట్ట పగిలేలా నాలుగు మసాలా దోసెలు తిన్నాను; ఒక పొంగల్ కూడా. లేవలేకపోయాను. అయితే తిని బయటికొచ్చాక కంగారంతా పోయింది. ఒక రకమైన గర్వం వంటబట్టింది.

నేను వెళ్ళేసరికి కాస్మోపొలిటన్ క్లబ్బులో అందరూ ఉన్నారు. అందర్నీ రంగప్ప పిలిచినట్టు తెలిసింది. నేను లోపలకి వెళ్ళగానే మేనేజర్ కొంటెగా నవ్వాడు. నేను వెళ్ళి ఒక టేబిల్ దగ్గర కూర్చున్నాను. అందరూ నన్నే చూస్తున్నారు. అయినప్పటికీ ఎప్పట్లా మామూలుగానే ఉన్నట్టు కనబడే ప్రయత్నం చేస్తున్నారు. ఊపిరి పీల్చుకునే చప్పుడు కూడా వినిపించేంత నిశ్శబ్దంగా కాస్మోపొలిటన్ క్లబ్ ఉండటం ఇప్పుడేనేమో అనుకున్నాను.

బయట రంగప్ప బ్యూక్ కారు శబ్దం వినిపించింది. నా ఎడమ కాలు మాత్రం అసంకల్పితంగా ఊగుతోంది. ఎవరో, ‘వస్తున్నాడు,’ అని గొణిగారు. ఒకటి రెండు స్పూన్లు కదిలిన చప్పుడు వినిపించింది. నేను తలవంచుకుని కూర్చునున్నాను. రంగప్ప పనివాడు అతని వస్తువులున్న బాస్కెట్ పట్టుకొచ్చి టేబిల్ మీద పెట్టాడు. వెనకే బూడిద రంగు సూట్‌లో రంగప్ప తన టోపీ చేతబట్టుకుని వచ్చాడు. వుడెన్‌ఫ్లోర్ మీద అతని ల్యాన్కేస్టర్ షూలు శబ్దం చేశాయి. మీసాలకు నూనె రాసి తిప్పుకునున్నాడు. రొమ్ముమీద గడియారపు బంగారు గొలుసు మెరిసింది.

అతను నా ముందుకు రాగానే లేచి నమస్కారం అని చెప్పాను. అతను ఉత్సాహమైన మందహాసంతో కూర్చున్నాడు. సర్వర్ని పిలిచి మందు తెమ్మని సైగ చేశాడు. నాతో, ఈరోజు మన పందెం గడువు చివరి రోజు!’ అన్నాడు. నాచ్చిముత్తు ‘నాయక్కరూ, ఇదంతా ఏంటి? వద్దు,’ అన్నాడు. ‘ఉండనివ్వండి. నేను ఆడిన మాట కదా?’ అన్నాడు రంగప్ప. ‘ఇదంతా ఇప్పుడు మాట్లాడుకోవద్దు,’ అన్నాడు నాచ్చిముత్తు. నేను మాత్రం గట్టిగా ‘మాట్లాడనివ్వండి…’ అన్నాను.

‘అవును. నేను మాట్లాడి తీరాలిప్పుడు!’ అంటూ రంగప్ప చప్పట్లు కొట్టాడు. ‘అందరూ వినండి. నేను పందెపు రొక్కాన్ని నమశ్శివాయంకు ఇవ్వడానికి వచ్చాను!’ నాకు ఆ మాటలు అర్థం కాలేదు. విన్నవాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ‘నేను ఓడిపోయాను. కాబట్టి ఇదిగో, ఐదు లక్షలకుగాను చెక్కును నమశ్శివాయంకు ఇస్తున్నాను.’ తన జేబులోనుండి ఒక బ్రౌన్ కవర్ తీసి టేబిల్ మీద పెట్టాడు. తర్వాత క్లబ్బులో ఉన్న అందరూ లేచి నిల్చుని చప్పట్లు కొట్టారు.

‘శుభం… మీరు ఓడిపోయారు. అయితే ఇంత పెద్ద రొక్కం…’ అని నాచ్చిముత్తు ఏదో చెప్పబోయాడు. ‘ఇది నేనాడిన మాట!’ అన్నాడు రంగప్ప. ‘ఇది నాకు సంతోషమే. నేనే చెప్పానుగా, నేను ఇందులో ఓడిపోవాలని కోరుకుంటున్నానని! నా ఆవేశమే నాకు కొన్ని గొప్ప విషయాలను నేర్పించింది… నాకొక నమ్మకం కలిగింది. దానికి నేను నమశ్శివాయంకి ధన్యవాదాలు చెప్పాలి.’

మళ్ళీ చప్పట్లు, నవ్వులు. నాట్రాయన్ నా భుజంమీద చేయి వేసి ‘నెగ్గారు…’ అన్నాడు. నాకెటువంటి సంతోషమూ కలగలేదు అన్నది నాకే ఆశ్చర్యమేసింది. పైన తిరిగే ఫేన్‌లు ఎందుకు ఇంత శబ్దం చేస్తున్నాయని పొంతనే లేకుండా ఆలోచిస్తున్నాను. ‘ఐదు లక్షలు!’ అని ఎవరో చెప్తున్నారు.

అందరికీ రంగప్పే మందు ఆర్డర్ చేశాడు. సేవకుల్లో ఉత్సాహం పుంజుకుంది. ఎక్కడ చూసినా నవ్వులు, కేరింతలు. నేను కుర్చీ చప్పుడయ్యేలా లేచి భుజాలు ముడుచుకుని బయటకి నడిచాను. అంతా సద్దుమణిగిపోయి అందరూ నా వంక చూస్తున్నారు. నాట్రాయన్, ‘మీ చెక్!’ అని నా భుజం పట్టుకున్నాడు. దానిని తాకడానికే నా చేయి వణికింది. అతనే దానిని నా కోటు జేబులో పెట్టాడు. నేను ధన్యవాదాలు అని గొణుక్కుంటూ ఎవర్నీ చూడకుండా మెట్లవైపు నడిచాను. రిక్షాలో ఎక్కి కూర్చున్నప్పుడు ఏదో అతిపెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నట్టు తోచింది. చల్లగాలి ఒంటిని తాకుతున్నా చెమటలు పట్టాయి.

ఆ డబ్బుతోనే అంబాసిడర్ ఏజెన్సీ తీసుకున్నాను. డబ్బు సంపాయించాను. ఇప్పుడు నాలుగు నగరాల్లో ఉన్న ఎస్.ఆర్.ఎన్. సన్స్ అండ్ ఆటోమొబైల్స్ అలా మొదలైంది!” అన్నారు ఎస్.ఆర్. నమశ్శివాయం.

కథ పూర్తవ్వగానే ప్రభాకర్ చిన్నగా నవ్వాడు. “నేను ఊహించాను” అన్నాడు సహదేవుడు. నేను చేతులూ కాళ్ళూ కొంచం కదిపి ఒళ్ళు విరుచుకున్నాను. సంతృప్తిగా ఉంది. అయినా ఎందుకో కొంత అసంతృప్తిగానే అనిపించింది. ఎందుకంటే అదొక కథలా, అతిసంప్రదాయబద్ధమైన ముగింపుతో ఉంది కాబట్టి!

అయితే వెంటనే నమశ్శివాయం ఆ అసంతృప్తిని బద్దలుకొట్టారు. మత్తులో గడ్డం రొమ్ముకు తగిలేలా తలదించుకుని వణికే గొంతుతో చెప్పారు.

“ఆ తర్వాత ముప్పై ఏళ్ళకు రంగప్ప చనిపోయాడు. ఆ తర్వాత మరో పదేళ్ళకి నా భార్య చనిపోయింది. అప్పటికి మేము మనవళ్ళూ మనవరాళ్ళందర్నీ చూసేశాము. చనిపోయే ముందు ఆమె నాకొక నిజం చెప్పింది; ఆ ఐదు లక్షలు ఆమెను గెలుచుకున్నందుకు రంగప్ప ఇచ్చిన రొక్కం అని!”

(కథ మూలం: వెట్‌ఱి)


జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.