గెలుపు

పెళ్ళయిన పన్నెండేళ్ళలో ఒకటి రెండు సార్లు చిన్న గొడవలొచ్చాయి. ఆమె ఎప్పుడూ ఎదురు మాట్లాడకుండా- నేనేమంటే దానికే సరే అనాలి, ఎలా అంటే అలానే ఒప్పేసుకోవాలి -అన్నదానికి మనసుని సిద్ధం చేసుకున్నట్టు ఉంటుంది. ఆమెకంటూ సొంత అభిప్రాయమో, కోరికో, ఆసక్తో, అభిరుచో, చివరికి శరీరం కూడా ఉన్నట్టు నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. అన్నిటికంటే పెళ్ళయిన ఏడాది తర్వాత తనకి సంభోగంలో కూడా ఆసక్తి ఉన్నట్టు అనిపించలేదు. ఎప్పుడైనా సాయంత్రం పూట సూచాయగా తెలియజేస్తాను. తెలియజేయనవసరంలేదు, నా చూపులోనే అర్థం చేసుకుంటుంది. ఆమె ముఖమూ, ప్రవర్తనా మారిపోతాయి. ఏదో రహస్యాన్ని కాపాడుకునేదానిలా ముడుచుకుపోతున్నట్టు కనిపిస్తుంది.

రాత్రి పిల్లలు నిద్రపోయాక నా గదిలో నేను పరుపుపైన కాచుకునుంటాను. చీకట్లో మెల్లమెల్లగా నడిచొచ్చే అడుగుల చప్పుడు వినబడేది. నా గదిలోనే పడుకుని నన్ను హత్తుకున్నప్పుడు నాకోసమే ఆమె తన శరీరాన్ని అందిస్తున్నట్టు ఉండేది. ఒక బంకమట్టి బొమ్మలా ఆమె. నేను ఎలాక్కావాలంటే అలా పిసికి ఆకారాన్ని మార్చుకోవచ్చు. సబ్బుమీద ఒత్తిన తాళంచెవి అచ్చులా నా ఒంటి ఒంపులు ఆమెలో ఉంటాయి. అందులో నేను నా ఒంటిని బిగించుకుంటే చాలు.

ఏం జరగబోతుంది? ఈ రాష్ట్రంలోనే పెద్ద ధనవంతుడు. చదువులోనూ అందంలోనూ గొప్పవాడు. తన బలంకొద్దీ ఆమె కోసం ప్రయత్నాలు మొదలుపెడితే నేనేమి చెయ్యగలను? ఆమెను ముందుగానే హెచ్చరిస్తే? అలా ఆలోచించగానే నాలో అలజడి ఎక్కువైంది. ఆ హెచ్చరికే ఆమెలో ఏదైనా ఆసక్తిని రేపుతుందా? అతనిని ఆమె గమనించడానికి హేతువవుతుందా? మామూలుగా అయితే అతణ్ణి ఆమె గమనించే అవకాశమైనా ఉండదు.

ఆ రోజు రిక్షాలో ఇంటికి వస్తుంటే నాకు పిచ్చిపట్టినట్టు అనిపించింది. చాలాసార్లు నా తలమీద నేనే కొట్టుకుంటూ, ‘ఛీ ఛీ’ అనుకున్నాను. రిక్షా వడివేలు “ఏంటయ్యా! తలనొప్పా?” అనడిగాడు. ‘అవును.’ అన్నాను. ‘ఇంటికెళ్ళి బాగా వేడి నీళ్ళతో స్నానం చెయ్యండి, తగ్గిపోతుంది’ అన్నాడు.

ఇంటికెళ్ళి కోటు, షర్టు తీస్తుండగా ‘ఒంట్లో బాలేదా?’ అని నా భార్య అడిగింది. పోవే! అని ఆగ్రహంగా అరిచాను. తరమబడ్డ వీధి కుక్కలా చిన్నబుచ్చుకుని ముడుచుకుపోతూ, ‘అన్నం పెట్టనా?’ అనడిగింది. ఒద్దని చెప్పి పడుకున్నాను.

నేను ఇంకేమైనా చెప్తానేమో అని చూస్తూ గది తలుపు దగ్గర నిల్చోవడం చిరాకు పుట్టించింది. వెళ్ళవేఁ! అని లోలోపలే అరిచాను. లేచెళ్ళి జుట్టు పట్టుకుని పడేసి తన్నాలనిపించింది. ఎందుకలా అనిపిస్తుందో అని ఆలోచించినప్పుడు నామీద నాకే అసహ్యమేసింది. నిజానికి ఆడవాళ్ళ గురించి నేను ఏమనుకుంటున్నానో నాకే తెలియలేదు. ఆడవాళ్ళ గురించిన నమ్మకం మగవాళ్ళలో సృష్టించబడింది. దాని ఆధారంగానే కుటుంబ వ్యవస్థ నడుస్తుంది. ఆ నమ్మకమే లేనట్టయితే మగవాడికి కుటుంబం, ఇల్లు అన్నవే ఉండవు. కాబట్టే మగవాళ్ళు అంత గుడ్డిగా ఆడవాళ్ళను నమ్ముతున్నారు. కష్టాలు వినడానికి దేవుడు ఒకడు ఉండి తీరుతాడని మనిషి నమ్మేలాంటిదే ఇది కూడా. నిజానికి దేవుడు ఉండచ్చు ఉండకనూ పోవచ్చు. శీలం కూడా అంతే; ఉండచ్చు ఉండకపోవచ్చు.

ఇలా ఆలోచించకూడదు, నిద్రపోవాలి. అయితే ఆ రాత్రి నేనసలు నిద్రపోలేదు. చాలాసేపు ఆమె తలుపుదగ్గరే నిల్చుని చూసి చూసి వెళ్ళి పడుకుంది. పడుకోగానే సన్నగా గురక పెట్టడం మొదలు పెట్టింది. చిన్నవాడు మాత్రం అప్పుడప్పుడూ ఛాతీనొప్పితో దగ్గుతున్నాడు. నిద్రలోనే వాడిని తట్టి పడుకోబెడుతోంది.

నేను బయటికొచ్చి చీకటిలో వీధికేసి చూస్తూ నిలబడ్డాను. ఎక్కడికైనా పారిపోవాలనిపించింది. ఒక్క రూపాయితో కాస్మోపొలిటన్ క్లబ్బులో ఆ ధనవంతుల ముందు నిల్చోవడంకంటే ఉరేసుకోవడం ఉత్తమం. అవును, నేను ఉరేసుకుని చావబోతున్నాను. ఓడిపోతే ఆ పైన జీవించలేను. నేను రకరకాలుగా ఉరేసుకోవడాన్ని ఊహించుకుంటూ రాత్రంతా గడిపేశాను.

మరుసటి రోజు తెల్లవారాక అంతా స్పష్టంగా అనిపించింది. ఏం పిచ్చితనం ఇది! మనుషులందర్నీ ఇలా ఒకేగాటన కట్టేయడమంత మూర్ఖత్వం మరొకటుండదు. ఒక్కో మనిషీ ఒక్కో రకం అన్నదే కదా నేను రోజూ చూస్తున్నది! అదే కదా నా వృత్తిలోనున్న సవాలు కూడా? ఒత్తిడి పెడితే అందరూ కారు కొనేస్తారు అని నేను అంటే ఎంత మూర్ఖంగా ఉంటుందో, అలాంటి మూర్ఖత్వమే ఇది కూడా.

ఆ సభలో రంగప్ప అలా చెప్పాలననుకున్నది, అది నిజంకాబట్టి కాదు. అతనికి అప్పుడలా అనిపించింది, చెప్పాడు. తనుకూడా మత్తులోనే ఉన్నాడు కదా. మాటలు బయటికొచ్చేశాక వెనకాడలేడు కాబట్టి ఇంకా ఇంకా రెచ్చిపోయాడు. అంతే. అది నిన్ననే ముగిసిపోయింది.

అయితే అదింకా ముగిసిపోలేదని నాకనిపించింది. ఐదు లక్షలు! అన్న ఆలోచన రాగానే కలిగే అలజడిని ఏం చెయ్యాలి? ఐదు లక్షలుంటే ఈ సిటీలో ఒక పెద్ద కారు షోరూం పెట్టొచ్చు. ఒక బంగళా కొనుక్కోవచ్చు. నా సొంతానికి కూడా ఒక కారు పెట్టుకోవచ్చు. ఇదిగో ఇలాంటొక నల్ల స్టాండర్డ్ కారు! తెల్లటి టర్కీ టవల్ పరచిన సీట్లు. దాన్ని నేనే నడుపుకుంటూ వెళ్తాను. వెనక సీట్లో నా భార్యాబిడ్డలు ఉంటారు. ఒక డ్రైవర్‌ని కూడా పెట్టుకోవచ్చు. వాడు తలుపు తీస్తే జమ్మని దిగి వాడు తీసి వేసిన చెప్పులేసుకుని తల పైకెత్తుకుని నడుచుకుంటూ ఆఫీసులోపలికెళ్ళే దృశ్యం కళ్ళ ముందుకు వచ్చింది. ఈ ముండ మంచిగా ఉంటే నాకు డబ్బొస్తుంది. ఉంటుందా? లేదంటే దీన్ని నరికి పారేసి చచ్చిపోవాలి… అలా చూస్తే ఇదొక గొప్ప బిజినెస్ డీల్. ఈమె శీలానికి పెట్టిన వెల ఐదు లక్షలు!

వెంటనే, ఏంటి? ఇంత అసహ్యంగా ఆలోచిస్తున్నాను, అని తల కొట్టుకున్నాను. ఎందుకు- ఎలాగూ గెలుస్తాను. డబ్బులొస్తాయి; లేదు, ఇలా ఆశపడటమే తప్పు. ఇది డబ్బాశ కాదు. ఇది మౌలికమైన నమ్మకం. ఓడిపోతానన్న భయమా, ఐదు లక్షలా? ఏది నన్ను కుదిపివేస్తున్నది అని నన్ను నేనే ప్రశ్నించుకుని అలజడికి లోనయ్యాను.

ఓడిపోతానన్న భయమూ అలజడీ రోజు రోజుకూ తగ్గడం మొదలైంది. నా భార్య ఓడిపోతే కూడా ఆమెని ఆకర్షించడానికి రంగప్ప బోలెడంత డబ్బు ఇస్తాడు కదా అనుకున్నాను ఒక్క క్షణం. నేనింత నీచమైనవాణ్ణా అని నన్ను నేనే చీదరించుకున్నాను. ఆ చిరాకునంతా ఆమె మీద చూపించాను. ఆమె ముందు నిల్చుని మాట్లాడటమే మానేశాను. నా మనసులోని వ్యాకులత ఏంటన్నది ఆమెకి తెలియలేదు.

నేను ప్రతి రోజూ రంగప్పకోసం ఎదురుచూస్తూ ఉండేవాణ్ణి. నాలుగో రోజు ఉదయం అతని కారు మా ఇంటి ముందు ఆగింది. పళ్ళూ తినుబండారాలూ పట్టుకుని అతని సిబ్బంది లోపలికొచ్చి నన్ను చూడటానికి జమీందారు వచ్చినట్టు చెప్పారు. నేను కంగారుగా కూర్చున్నాను. లేచి వెళ్ళి ఆహ్వానించలేదు. అతను లోపలికొచ్చి నమస్కారం చేయగానే లేచి ప్రతినమస్కారం చేసినప్పుడు నా చేతులు చెమటతో తడిచున్నాయి. గొంతు పెగలడంలేదు.

అతణ్ణి కూర్చోబెట్టడానికి సౌకర్యమైన కుర్చీకూడా లేదు మా ఇంట్లో. పాతకుర్చీలో అతను కూర్చుంటున్నప్పుడు ఊగుతున్న కుర్చీ కోడు చప్పుడు చేసింది. విరిగిపోతుందేమోన్న భయం కలిగింది నాకు. వంట గదికేసి తిరిగి, ‘ఏఁవోయ్, ఇటు రా. ఎవరొచ్చారో చూడు!’ అన్నాను. నా భార్య తొంగి చూసి, గబగబా వెళ్ళి ముఖం కడుక్కుని తల దువ్వి చీర మార్చుకుని బొట్టుపెట్టుకుని తలుపు దగ్గర సగం మనిషి కనిపిస్తూ నిల్చుని, చిన్నస్వరంతో, ‘నమస్కారమండీ!’ అంది.

ఆయన లేచి చేతులు జోడించి, ‘నమస్కారవండీ!’ అన్నాడు. ‘సార్ చాలా చెప్పారు మీ గురించి.’ ఆమె ఏమీ అర్థం కానట్టు, ‘ఊఁ?’ అంది. ‘అన్నీ మీరేనని చెప్పారు. చదువుకున్నారని కూడా చెప్పారు. ఎనిమిదో క్లాస్ దాక చదివారట కదూ?’ ‘అవునండీ, శారదాస్‌లో చదివాను. పదేళ్ళకి పైగా అయింది!’ ఆమె ముఖం వికసించింది. ఆమె చదువుకున్న మనిషి అని రంగప్పతో నేనెప్పుడూ చెప్పలేదు.

‘ఇంకా చదివుండచ్చు కదా?’ అడిగాడు రంగప్ప. ‘అప్పటి మా పరిస్థితులు అంతంత మాత్రమే!’ ఉన్నట్టుండి గుర్తొచ్చి ‘టీ తాగుతారా?’ గాభరాగా అడిగింది. ‘ఇవ్వండి,’ అన్నాడు. ఆమె లోపలికెళ్ళాక మేము ఒకరినొకరం చూసుకున్నాము. అతను చిరునవ్వొకటి చిందించాడు. ఆ చిరునవ్వులోని ఆత్మవిశ్వాసం నా ఒంట్లో మంటపెట్టినట్టు అనిపించింది.

‘మీరు కావాలంటే ఆమెతో చెప్పండి, నేనిలా ప్రయత్నం చేస్తానని…’ అన్నాడు రంగప్ప. చెప్పాల్సిన అవసరం లేదన్నాను నేను. సరేనంటూ నవ్వాడు. నా ఒంట్లో ప్రవహించే రక్తపు చప్పుడు వినబడింది నాకు.

నా భార్య టీ తీసుకుని వచ్చింది. బీరువాలో చీరలో చుట్టి దాచిన పింగాణీ కప్పులు తీసి కడిగి అందులో టీ నింపుకొచ్చింది. ఆమె మేనమామ మిలిటరీనుండి తెచ్చిన కప్పులవి. ఇన్నేళ్ళలో వాటిని ఎన్నడూ బయటికి తియ్యలేదు. టీని ఆస్వాదించి తాగుతూ, ‘బాగుంది టీ… చిక్కటి పాలతో!’ అన్నాడు రంగప్ప. ‘సార్ ఒక కారు గురించి చెప్పారు. అది ఆర్డర్ ఇచ్చి వెళ్దామని వచ్చాను.’

‘ఇప్పుడు నా దగ్గర స్టాక్ లేదు. ఒక సంవత్సరం పట్టచ్చు…’ అన్నాను.

‘ఫరవాలేదు. నా దగ్గర ఎనిమిది స్టాండర్డ్ కార్లున్నాయి. ఇప్పుడొక బెంజ్ కావాలి.’

‘బెంజా?’ నాకే తెలియకుండా నోరెళ్ళబెట్టాను. ‘

‘అవును. ఇంపోర్ట్ చేసివ్వండి. ఒక సంవత్సరంలో దొరికితే చాలు. అడ్వాన్స్ ఇప్పుడే ఇచ్చేస్తాను.’

నా చేతులు వణకసాగాయి. ఒక బెంజ్ ఎంత ఉంటుంది? నా కమిషనే కనీసం ఐదువేలకంటే ఎక్కువ వస్తుంది అన్నది మాత్రమే నా మనసులో మెదిలింది. ఆ క్షణాన అతని మీదున్న చిరాకంతా ఫట్టున ఎగిరిపోయింది. ఆత్మీయంగా అనిపించాడు. ఊరకే అంటున్నాడా అనుకున్నాను. ‘ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చేస్తాను. చెక్ తెచ్చాను,’ అంటూ తిరిగి చూశాడు. అసిస్టెంట్ ఒక చెక్కు తీసి అతని చేతికిచ్చాడు. రంగప్ప లేచి దాన్ని నాకందించాడు. లేచి నిల్చుని దాన్ని తీసుకుని కళ్ళకద్దుకున్నాను. వెంటనే తీసుకెళ్ళి మా నాన్న ఫోటో కింద పెట్టాను.

నాకు కాళ్ళు నిలవలేదు. ఈ డబ్బుంటే చిన్నవాణ్ణి పెద్ద హాస్పిటల్లో చూపించవచ్చు. అనుకుంటూనే కాలందాటిపోతుంది. ఇంతలో రంగప్ప నా భార్యతో ‘ఎంత మంది పిల్లలు?’ అన్నాడు. ఆమె ముగ్గురు అంది. ఆమె వయసుని పొగుడుతూ ఏమైనా చెప్తాడేమో అనుకున్నాను. అలా ఏం చెప్పలేదు. అలా మాట్లాడేవాళ్ళు మామూలు కాముకులని తర్వాత అనుకున్నాను.

ఇంతలో ఈడ్చుకుంటూ వచ్చిన చిన్నవాడు నసుగుతూ అమ్మ చెంగుపట్టుకుని పెద్దకళ్ళతో రంగప్పకేసి చూశాడు. చెంగును పట్టుకుని నిల్చున్న వాడి వాలకం చూసి ‘ఎందుకిలా ఉన్నాడు? ఒంట్లో బాలేదా?’ అనడిగాడు రంగప్ప. ‘వాడికి ఛాతీ నిండా కఫం ఉంది…’ ‘లేదు, బాగా బక్కగా కూడా కనిపిస్తున్నాడు.’ ‘అవును. చాలా రోజులుగా కఫం చేరిపోవడంవల్ల అలా ఉన్నాడు.’

‘టీబీ ఏమో చూశారా?’ అనడిగాడు రంగప్ప. ‘తెలియడంలేదండీ,’ అని కొంచం బాధగా చెప్పింది. ‘చూపించుండచ్చు కదా?’ ‘చూపించాలి…’ అని కళ్ళనీళ్ళు నింపుకుంది. ‘ఏం భయపడకండి. చూపించుదాం. మనకు తెలిసిన డాక్టర్ ఒకరున్నారు. బాగా చూస్తారు. కఫం తీసి లేబ్‌లో ఇస్తే టెస్ట్ చేసి చూసే సౌకర్యాలున్నాయి,’ అన్నాడు.

‘దానికి…’ అని ఆమె చెప్పేలోపే, ‘డబ్బు గురించి ఆలోచించకండి. నమశ్శివాయం సార్ నాకు ఎంతో చేశారు. నేను ఆయనకు తమ్ముడులాంటివాడిని,’ అన్నాడు. సంభాషణ అంతా నేను అక్కడ లేనట్టే జరిగింది. ఆమె ముఖం ఆనందంతో వికసించింది. ఆమె కళ్ళలో కనిపించిన కాంతి నాకు అలజడి కలిగించింది. ఆమె అంతటి అందగత్తె అన్నది అప్పుడే గమనించాను. బుగ్గలూ, మెడా మెరుస్తున్నాయి. ఆమెకు అంత మంచి రంగు ఉందన్న విషయం కూడా ఆరోజే గుర్తించాను. ఆమెకు ఇరవై ఎనిమిదేళ్ళున్నట్టు కూడా అనిపించటంలేదు.

‘వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానండీ,’ అని నమస్కరిస్తూ అతను లేచాడు. నేను అతణ్ణి వీధివరకూ వెళ్ళి సాగనంపాను. బండి వెళ్ళిపోయాక తిరిగి చూస్తే మా కాంపౌండ్‌లోని అన్ని ఇళ్ళల్లోని కిటికీల్లోంచి నన్ను చూస్తూన్న ముఖాలు కనిపించాయి. ఒకే రోజులో నా పరపతి ఆకాశానికెదిగిపోయింది.

తిరిగి ఇంటి లోపలికొచ్చేప్పుడు నా కాళ్ళు నడవట్లేదు, ఎగురుతున్నాయి. ఆ అడ్వాన్స్ డబ్బులో సగం పంపిస్తే చాలు. మిగిలింది నేను వాడుకోవచ్చు. వెంటనే కోటు వేసుకున్నాను. ‘ఏవండీ, ఈయన మన బిడ్డను డాక్టర్ దగ్గర చూపిస్తాను అన్నారే!’ అడిగింది నా భార్య. ‘వెళ్ళవతలికి. ఇంటికెవరొచ్చినా వారిముందు లంజలా కులుకుతూ నిల్చో. మంచీచెడూ తెలియని జన్మం!’ అని ఆమెను తిట్టేసి చెక్కు, గొడుగూ పట్టుకుని బయల్దేరాను.

నేరుగా బ్యాంకుకెళ్ళి చెక్కు ఇచ్చాను. బౌన్స్ అవుతుందా? అనడిగితే, సందేహాలేం పెట్టుకోకుండా వెళ్ళండి. అలా జరిగితే శివశైలం చెక్కు బౌన్స్ అయిందని పత్రికల్లో హెడ్‌లైన్ అవుతుంది! అనన్నారు. నా ఆఫీసుకెళ్ళి బెంజ్‌కు కావలసిన అన్ని ఆర్డర్లూ తయారు చేసి పంపించేశాను. ఇదివరకే శివశైలం జమీందార్లు నా దగ్గర రెండు కార్లు కొన్నారు కాబట్టి అన్ని వివరాలూ ఉన్నాయి. మదరాస్‌నుండి సేల్స్ ఆఫీస్ ఎండీనే ఫోన్ చేసి మరీ మూడుసార్లు అడిగాడు ‘బెంజా?’ అని. శివశైలం జమీందార్లకు అనగానే, ఓహో! అని కొంచం నిరాశ పడ్డాడు. వాళ్ళే నాకు డైరెక్ట్‌గా ఆర్డర్ ఇచ్చుండచ్చుకదా? అని ఆలోచిస్తున్నాడనిపించింది. నాకు చాలా దగ్గరవాళ్ళన్నాను. అప్పుడు ఇంకాస్త వినయంగా మాట్లాడాడు.

చేతిలో ఉన్న చిల్లరతో విజయ కఫేలో ఒక మసాలా దోసె, ఒక అడై తిని కాఫీ తాగాను. కాస్మోపొలిటన్ క్లబ్‌కి వెళ్ళాలనిపించింది. అయితే వెళ్ళలేదు; వెళ్ళేందుకు ధైర్యం చాల్లేదు. దక్షిణ కాళి అమ్మవారి గుడికెళ్ళాను. పదహారు చేతులతో ఉగ్రరూపం ధరించివున్న అమ్మవారి రూపం చూసి దణ్ణం పెట్టుకున్నాను. ఏం వేడుకోవాలో తెలియలేదు. ‘అన్నీ మంచిగా జరగాలి‌. అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి’ అని మాత్రం వేడుకున్నాను. ఎలాగైనా డబ్బులొస్తాయి కదా? అని ఒక క్షణం అనిపించినపుడు తలమీద కొట్టుకున్నాను. బలవంతంగా వేరేవైపు ఆలోచనలు మళ్ళించుకుని నూనె మరకలంటిన రాతి అరుగుమీద కూర్చున్నాను. ఇంటికి వెళ్దాం అనిపించింది. అయితే నాకు నడిజాముకు ముందు ఎప్పుడూ ఇంటికెళ్ళిన అలవాటే లేదు.

చాలా సమయం గడిచాక ఒక ఆలోచనొచ్చింది. మా అన్నయ్య ఇంటికి వెళ్ళాను. ఆయన నన్ను మామూలుగానే కొంచం అగౌరవంగా చూస్తాడు. ఆయనది ప్రభుత్వ ఉద్యోగం. వదినకి అది గర్వకారణం. నేను బి.ఎ. పూర్తి చెయ్యలేదు. మూడు పరీక్షలు రాయకుండ వదిలేశాను. అది రాసి పూర్తి చేసుంటే నాకూ ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చుండేది, నేను కూడ ఈ సమాజంలో ఒక గౌరవించదగినవాడిగా జీవించివుండేవాడినని ఆయన భావన. అలా చెయ్యలేదుకాబట్టి నేను ఆయనకంటే ఒక మెట్టు తక్కువ అని చెప్పడానికి నా పూర్తిచెయ్యని బి.ఎ. చదువుని వాడుకుంటుంటాడు. ‘ఆ మిగిలిన మూడు పేపర్లు రాసుంటే ఇప్పుడు వీడుండాల్సిన స్థానం ఇది కాదు. పెద్దవాళ్ల మాటలు వింటే కదా!’ అని మొదలుపెడతాడు. అతని అన్ని వ్యక్తిగత ఓటముల్నీ నా గురించి మాట్లాడి సరికట్టుకుంటాడు. అందుకే అతణ్ణి కలవకుండా తప్పించుకుంటుంటాను.

గుమ్మంలో పడక్కుర్చీలో కూర్చుని ఆఫీసునుండి తెచ్చుకున్న హిందూ పేపర్ చదువుతూ ఉన్నాడు మా అన్నయ్య. నన్ను చూడగానే కళ్ళజోడేసుకున్న ముఖాన్ని కాస్త ముడుచుకుని, ‘రా… తిన్నావా?’ అన్నాడు. వదిన నేనొచ్చానని చూసి, ‘రా… రా. లత ఎలా ఉంది?’ అనడిగింది. ‘ఉంది…’ అన్నాను. ఆ పైన ఏం మాట్లాడాలో ఎవరికీ తెలీలేదు. అన్నయ్య కొడుకు కాలేజీ పిల్లాడు. టేబుల్ లేంప్ ఆఫ్‌చేసి ఆడుకుంటూ ఉన్నాడు. అమ్మాయి బోర్లాపడుకుని వార పత్రిక చదువుతూ ఉంది. వాళ్ళు నా రాకను పట్టించుకోనేలేదు. వదిన ఒక కప్పు కాఫీ ఇచ్చింది. పలచగా, మిగిలిపోయిన డికాషన్, ఎక్కువ పంచదారతో.

‘సరే నేను బైల్దేరతాను,’ అని లేచాను. ‘ఏం, వచ్చీరాగానే వెళ్ళిపోతున్నావు?’ అడిగాడు అన్నయ్య. ‘ఏం లేదు. శివశైలం జమీందారు ఒక బెంజ్ ఆర్డర్ చేశాడు. ఆయన్ని కలవాలి, క్లబ్బుకెళ్తున్నాను,’ అన్నాను. ‘బెంజా?’ అని, ఆసక్తి లేనట్టు తలతిప్పి హిందూ చదువుతూ ఓరకంట చూసి, ‘ఇప్పుడు బెంజులవీ బాగా చవకైపోయాయని చెప్తున్నారు…’ అన్నాడు. ఆయన్ని కాస్త ఉడికించాలనిపించింది. ‘ఎక్కడ తగ్గాయి? ప్రతి సంవత్సరం రెండు రెట్లు పెరిగిపోతుంటే! ఇప్పుడు ఒకటిన్నర లక్షకి తక్కువలేదు.’

‘కారు ఒకటిన్నర లక్షలా?!’ అని ఆశ్చర్యపోయాడు. ‘అవును. దానిపైన పన్ను, నా కమిషన్…’. ఆయన కళ్ళలో అసూయ మెరుపు. ‘నీకెంత కమిషన్ వస్తుంది?’ అడిగేశాడు. ‘ఇరవై వేలదాకా వస్తుంది. చెక్ ఇచ్చేశారు.’ ‘చెక్కా?’ దీనంగా అడిగాడు. నా మనసు గంతులేసింది. ‘అవును. ఇప్పుడే బేంకుకు వెళ్ళొస్తున్నాను. ఒక మోటర్ సైకిల్ కొనుక్కుందాం అని చూస్తున్నాను.’

ఇప్పుడు ఇంటిల్లిపాదీ నాకేసి చూశారు. పిల్లాడి కళ్ళల్లో మెరుపు. ‘మోటర్ సైకిల్ నడపాలంటే…’ ఆయన ఏదో చెప్పబోయాడు. ‘నేను క్లబ్బుకు వెళ్ళిరావడం రాత్రుల్లో లేట్ అవుతోంది. మోటర్ సైకిల్ కొనుక్కుందాం అనుకుని చాలా రోజులైంది. ఇప్పుడున్న ఇల్లు కూడా చిన్నది కదా? పిల్లలు పెద్దోళ్ళవుతున్నారు. కొంచం పెద్ద ఇల్లు చూద్దాం అనుకుంటున్నాను.’ అన్నాను. అన్నయ్య కొంచం కంగారుగా చూపు మళ్ళించుకున్నాడు. నా మనసు ఆనందంతో గంతులేసింది. ‘ఈ సంవత్సరం నాలుగైదు బెంజ్ ఆర్డర్‌లున్నాయి. మిగిలిన ఆర్డర్లవీ కలిపి రెండుమూడు లక్షలు వస్తాయి. వీలైతే నేనే ఒక ఏజెన్సీ తీసుకుందాం అనుకుంటున్నాను.’

ఇల్లు నిశబ్దంగా అయింది. అన్నయ్యకు గాలాడుతున్నట్టులేదు. ‘సరే, వెళ్ళొస్తాను,’ అని చెప్పి వీధిలోకి వచ్చాను. నాకు ఆనందంతో నాట్యం చేస్తూ నవ్వాలనిపించింది. దీనికే ఇలా అయిపోయారు; ఐదులక్షలు వస్తే వీళ్ళేమైపోతారో! పిల్లలతో కలిసి వదిన మా ఇంటికొచ్చి వినయంగా నిల్చున్న దృశ్యాన్ని ఊహించుకున్నాను. కొడుకు ఉద్యోగం కోసం అన్నయ్య అడగడం కూడా. ఐదు లక్షలు! ఐదు లక్షలుంటే వీళ్ళందరూ ఏ మాత్రం? పాలవాడు నన్ను చూసి తల ఊపి వెళ్ళడు. వాడికి ఏడు రూపాయలు బాకీ. ఐదు లక్షలుంటే వాడు సైకిల్ దిగి నాకొక నమస్కారం పెట్టి సైకిల్ తోసుకుంటూ వెళ్తాడు. ఐదు లక్షలుంటే ఇదిగో ఈ అయ్యవారు ఆగి దణ్ణంపెట్టి గుడిలో జరగబోయే విశేష పూజల జాబితా గురించి కనీసం ఐదు నిముషాలైనా చెప్పకుండా వెళ్ళడు. ఐదు లక్షలుంటే నా వీధిలో ఉన్న ఆడవాళ్ళందర్నీ లోబరుచుకోగలను. ఐదు లక్షలకు లోబడని ఆడది ఇక్కడ ఎవరైనా ఉంటారా ఏంటి?

ఏం ఆలోచిస్తున్నాను? ఏంటీ ఈ పాడు ఆలోచనలు! తలమీద మళ్ళీ కొట్టుకున్నాను. తల నెప్పనిపించింది. సరస్వతి కఫేకి వెళ్ళి ఒక కాఫీ తాగాను. తర్వాత ఇంటికెళ్ళాను. నా భార్య లత నన్ను చూడగానే వికసించిన ముఖంతో, ‘రేపు తెల్లవారగానే మనిషిని పంపిస్తాను, పిల్లాణ్ణి పెద్ద డాక్టర్ దగ్గర చూపించుదామని జమీందారన్నారు!’ అంది. ‘మరికనేం, వెళ్ళి ఎదురుగా నవ్వుతూ నిల్చో!’ అన్నాను. ఆమె ముఖం వాడిపోయింది. ‘తనతో పడుకో, ఐదులక్షలిస్తారు. తీసుకొస్తావా?’ అన్నాను.

ఏం చెప్తున్నానన్నది అర్థంగాక కొయ్యబారిపోయింది తను. ఆమె కళ్ళనిండా నీళ్ళు. ‘ఫో, అవతలకి!’ కసిరి తిట్టేసి నా గదిలోకి వెళ్లాను. మంచం మీద తలపట్టుకుని అలా కూర్చుని ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాను. ఆమె తలుపు దగ్గరకొచ్చి వణుకుతున్న స్వరంతో, ‘తిని పడుకుందురు…’ అంది. ‘వెళ్ళవే. నరికేస్తా చెప్తున్నా ఇంకోసారి విసిగించావంటే!” అని అరిచాను. భోరుమని ఏడుస్తూ వెళ్ళిపోయింది.

వేళకాని వేళలో తాగిన కాఫీవల్ల నాకు నిద్రపట్టలేదు. మంచంపై పొర్లుతూ ఉన్నాను. ఇదంతా ఏంటనేది నాకర్థం కావడంలేదు. ఇలాంటొక సంఘటనని ఎవరికైనా చెప్తే పగలబడి నవ్వుతారు. అయితే కొన్ని రోజులుగా నేనీ నరకంలో ఉంటున్నాను, ఉండబోతున్నాను. ఎంత పెద్ద నరకం ఇది! దీన్నెలా వివరించాలి. తెల్లారాక ఎలాగైనా ఆమెతో చెప్పేయాలి. జమీందారు పన్నాగం గురించి హెచ్చరించాలి. వచ్చీరాగానే ఆమె బలహీనతని పట్టేశాడు. పిల్లవాడిని అడ్డుపెట్టుకుని లోబరచుకోబోతున్నాడు. కొంత ఎక్కువ రొక్కం ఉంటే ఆమె బిడ్డకి నయమైపోతుంది. అది చెప్పే ఆమెను పొందవచ్చు.

అయితే వెంటనే అనిపించింది. అలాగైతే అతనెందుకు నాకు డబ్బు ఇవ్వాలి? ఈ డబ్బుతో నేనే పిల్లాడికి వైద్యం చేయించి కాపాడుకోవచ్చు కదా? తన అవకాశాలు తనే సృష్టించుకుంటున్నాడు. ఏ అడ్డదారులూ వెతుక్కోవడంలేదు. అంత ఆత్మవిశ్వాసమా రంగప్పకి? అంత నమ్మకంగా ఉన్నాడంటే… కచ్చితంగా గెలుస్తామని తెలిస్తే మాత్రమే అలా ఉండగలరు. అయితే అతను గెలుస్తాడన్నమాట. నా చేతులు వణికాయి. నేను చచ్చిపోవాలి. అతనోడిపోతే నేను లక్షాధికారిని.

ఆమె అతని వలలో పడితే వచ్చే డబ్బుకంటే తిరస్కరిస్తే పది రెట్లు ఎక్కువ డబ్బులొస్తాయని ఆమెతో ఎలా చెప్పాలి? ఇప్పుడే చెప్పేయాలి. లేచి వెళ్ళి చూస్తే ఆమె నిద్రపోతోంది. ఆమెను లేపి ఏమని చెప్పేది? అసలు విషయమే నీచమైనది. దాన్ని చెప్పడమన్నది ఇంకా నీచంగా ఉంటుంది. నువ్వతణ్ణి తిరస్కరించు, దూరం పెట్టు, నీకు ఐదు లక్షలు వస్తాయని చెప్పాలా? ఎంత మూర్ఖత్వం! శీలం కాపాడుకోడానికి కూలీనా? ఆమె చిన్న బుర్రకి ఇదంతా అర్థం కాదనిపించింది. చెప్తే తనని అవహేళన చేస్తున్నట్టు అనుకోవచ్చు.

నిజానికి అది అనుమానించడమే. ఆమెపై నమ్మకం ఉంటే నేను ఏదీ పట్టించుకోకుండా మామూలుగా ఉండాలి. ఆమెను హెచ్చరిస్తున్నాను అంటేనే ఆమెను అనుమానిస్తున్నానని అర్థం. నిద్రపోతున్న భార్యని నడిజామున లేపి నీ శీలం మీద నాకు పూర్తి నమ్మకం లేదు, కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పడం మగవాడి వంకరబుద్ధినే చాటుతుంది.

ఇదంతా ఆలోచిస్తే చిరాకొచ్చింది. గమ్మున వెళ్ళి కత్తి తెచ్చి ఈమెను పొడిచి చంపేస్తే ఏ సమస్యా ఉండదనిపించింది. దానికంటే నేను ఉరేసుకుని చచ్చిపోవచ్చు. ఉరేసుకోవడం అనుకుంటే ఇప్పుడే ఎందుకేసుకోవాలి? ఇంకా కొన్ని రోజులే కదా? ఓడిపోతే చప్పుడు లేకుండా ఉరేసుకోవాలి. నెగ్గితే ఈ నగరమే నా పాదాల దగ్గర. లేదు, ఓడిపోతే కూడా నాకు బోలెడు డబ్బులొస్తాయిగా? ఏం బుర్ర నాది!

మరుసటి రోజు జమీందారూ అతని సిబ్బందీ వచ్చి నన్నూ నా భార్యనీ పిల్లాణ్ణీ తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళారు. డాక్టర్ అతని ఎదుర్రొమ్ముల్లోని కఫం చివరిదశలో ఉందని, వెంటనే చికిత్స ప్రారంభించాలనీ చెప్పాడు. నేను రాత్రి ఇంటికొచ్చినప్పుడు నా భార్య చాలా కంగారుగా ఉంది. నేను చొక్కా విప్పకముందే ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. ‘ఏవండీ, ఇంకో ఆరునెలలు ఇలానే పెట్టుకునుంటే పిల్లాణ్ణి కాపాడుకోలేమని చెప్పారు. టీబీ ఎముకల్లోకి పాకేస్తుందట.’ నేను, ‘అవునా?’ అని మామూలుగా అన్నాను.

నేనంత మామూలుగా అవునా అని అనడం ఆమెలో భయంతోకూడిన బాధను కలిగించింది. నీళ్ళు నిండిన కళ్లతో, ఏడుపు కలిసిన స్వరంతో ‘తప్పంతా మనదేనండీ. ఏదైనా అమ్మో లేదంటే అప్పుచేసో హాస్పిటల్‌కు తీసుకెళ్ళుండాల్సింది. ఇన్నాళ్ళూ ఈ నాటు వైద్యుణ్ణే నమ్ముకున్నాము. ఇప్పుడు ముదిరిపోయింది…’ అంది. కాసేపలా చల్లారాక, ఆమె ముఖానికేసి చూడకుండా, ‘బాగైపోతుందిలేవే,’ అన్నాను. ‘మంచి సమయాన ఇతను దేవుళ్ళా వచ్చాడు!’ ‘అవునే, అతన్తో పడుకో. ఇంకా ఎంతైనా ఇస్తాడు!’ నోటిదాకా వచ్చేసింది. నన్ను నేను ఆపుకున్నాను.

ఎంత సులువుగా మా మధ్యలోకి చొరబడిపోయాడు! అతని ఎత్తుగడలో మనుషుల మనస్తత్వాలనెంత క్షుణ్ణంగా ఆపోశన పట్టాడోనని ఆలోచిస్తే ఆశ్చర్యమేసింది. ఆడవాళ్ళని అతనిలాంటివాళ్ళు వదిలిపెట్టడమే వాళ్ళ గొప్పతనం. నిజానికి ఇలాంటివాళ్ళు తలచుకుంటే ఎవరినైనా లోబరుచుకోగలరు. దీన్ని నేను అడ్డుకోకూడదు. ఏం జరుగుతుందో చూడాలి, దీన్ని అడ్డుకుని నేను నెగ్గితే నా మనసులో ఎప్పుడూ ఒక అనుమానం ఉంటూనే ఉంటుంది. ఈమంతట ఈమె తిరస్కరించి నెగ్గితే నా మనసులో తరతరాలుగా ఈ సమాజం ఉంచిన నమ్మకం గట్టిపడుతుంది. కాబట్టి ఏమీ చెప్పకూడదు.

‘అతనికి అందరూ తెలుసు. అతను మనస్పూర్తిగా పూనుకుంటే తప్పక మన బిడ్డను కాపాడేస్తాడు. ఏం కావాలన్నా నువ్వు అతణ్ణి అడుగు. నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని పెద్ద ఆర్డర్‌లు వస్తున్నాయి. హాస్పిటల్‌కి నేను రావడం వలన పెద్ద ఒరిగేదేం లేదు. నువ్వే చూసుకో,’ అని చెప్పాను. ఆమె తికమకగా తలూపింది. గజ్జిని గోక్కుంటే ఒక సుఖమైన దురద పుడుతుంది కదా? అలాంటి అనుభవం కలిగింది మనసుకి. ఎందుకనో ఆ రోజు చల్లని మంచినీళ్ళతో చాలాసేపు స్నానం చేశాను.

రోజూ రంగప్ప డ్రైవర్ వచ్చి నా భార్యనీ బిడ్డనీ హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. చాలాసార్లు రంగప్ప కూడా హాస్పిటల్‌కు వచ్చాడని చెప్పింది. రోజువారీ సంగతులన్నిట్నీ రాత్రి నేను ఇంటికి రాగానే పూసగుచ్చినట్టు చెప్పేది. అన్నిట్నీ ఇలా తనంతట తనే చెప్పి నా నమ్మకానికి పాత్రురాలు కావాలనుకుంటోందంటే తన మనసులో మరో రకమైన ఆలోచేనేదో ఉందని అర్థమా? లేదు, ఇలా చెప్పుకోవడం ద్వారా తన చుట్టూ ఒక కవచం ఏర్పరుచుకుంటుందా? అయితే అది కూడా తన చంచలత్వాన్నేకదా వ్యక్తపరుస్తుంది?

రోజులు గడిచే కొద్దీ రోజువారీ సంగతులు చెప్పడం తగ్గించేసింది. కొన్ని రోజులకి తన పనులు చేసుకుంటూ చెప్పడం మొదలుపెట్టింది. నేను చెవిన పెట్టలేదు. ఎప్పుడు ఆమె రంగప్ప గురించి చెప్పినా అద్దం మీద మేకుతో గీసినట్టు ఒక శబ్దం నా మెదడులో వినిపిస్తుంది. ఒళ్ళంతా కుదిపేస్తుంది. లేచెళ్ళి అమెను బాదాలనో, కత్తితీసి నా గొంతు కోసుకోవాలనో అనిపిస్తుంది.

అయితే చేతికొచ్చిన డబ్బు నాకొక ఉత్సాహానిచ్చింది. కొత్తగా అల్పాకా కోటు, కేలికో షర్టూ కొనుక్కున్నాను. చాలా రోజులుగా మదిలో మెదులుతున్న స్విస్ గడియారం ఒకటి సెకండ్‌హేండ్‌లో కొనుక్కున్నాను. ఆఫీసుకు ఒక ఆలివెట్టి టైప్‌రైటరు కొన్నాను. ఇంచుమించు రోజూ ఈస్టెర్న్ మిలినీర్స్ క్లబ్బుకెళ్ళి మందు కొట్టాను. ‘ఏంటి, గాలి ఈ వైపుకి మళ్ళింది?’ అని అక్కడివాళ్ళు అడిగారు. ‘మీరు కాస్మోపొలిటన్‌కి వెళ్ళేవాళ్ళు కదా?’ అని మేనేజర్ అడిగాడు. ‘ఇక్కడొక పార్టీ ఉన్నాడు. బెంజ్‌కు ఆర్డర్ ఇచ్చాడు!’ అన్నాను. అందరి ముఖాల్లో కలవరమూ ఆశ్చర్యమూ. నేను లోలోపల నవ్వుకున్నాను.

డబ్బు రాగానే అన్ని క్లబ్బుల్లోనూ మెంబర్ అయిపోవాలని నిర్ణయించుకున్నాను. ఏమీ తోచని స్థితి. ఎక్కడున్నాననే తెలీని పిచ్చితనం. ఏదేదో చేసుకుంటూ రోజులు గడిపాను. మూడు నెలల గడువు. ఇంక ఒక నెలే ఉంది. రోజు రోజుకీ నా భార్య మారిపోతూ ఉండటం గమనించాను. చక్కగా అలంకరించుకుంటోంది. సాదా చీరలైనప్పటికీ నేర్పుగా, అందంగా కట్టుకుంటోంది. ఎప్పుడూ తనలో తానే పాడుకుంటూ ఉంటోంది. అప్పుడప్పుడు సిగ్గుపడుతోందా? కళ్ళలో కాంతొచ్చిందా? నడకలో నాజూకొచ్చిందా? లేక ఇదంతా నా భ్రమా?

అయితే కచ్చితంగా తనని ఇన్నాళ్ళూ క్రుంగతీస్తున్న ఒక భారమైతే తగ్గిపోయినట్టు స్పష్టంగా కనబడుతోంది. ఆమె ప్రతిరోజూ అంత ఆత్రంగా ఇంటిపనులు చేసింది ఆ బాధనుండి తప్పించుకోడానికేనేమో. పిల్లాడు దక్కడేమోనన్న భయంతో రోజూ లోలోపల ఏడుస్తూ ఉండేది. రాత్రుల్లో చాలా సార్లు నిద్రలేచి వాడిని తడిమి చూసేది. వీలున్నంతసేపూ వాడిని చంకనేసుకునుండేది. నాకు నీళ్ళు ముంచుకొచ్చేప్పుడు కూడా వాడు అమె చంకనే ఉండేవాడు. వాడుకూడా ఆమెని విడిచి ఉండేవాడు కాడు. ఇదిగో! ఇప్పుడు వాడి ఆరోగ్యం గూర్చిన బాధనుండి విముక్తి కలిగింది. ఈ విముక్తికి ఆమె దేన్నైనా ఇచ్చుకోగలదు. అయితే నేను ఓడిపోయినట్టేనా?