నా

నా
పాత అలవాట్లు
ఎప్పుడో నాతో కలిసి కొన్నేళ్ళు
కాపురం చేసి
నన్నొదిలేసి వెళ్ళిపోయినవి
మళ్ళీ వస్తున్నాయి

నేను
నాన్న లాగా
నా వం…కే చూస్తూ
టెలిఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోలేదు
అమ్మ లాగా
“ఏమిటీ తిరుగుళ్ళు నాయనా
తొందరగా స్నానం చేసి అన్నానికి రా!”
అనీ అనలేదు

కాగితమూ కలమూ తీసుకుని
వాటికి ఓ ఉత్తరం రాసి
నా జేబులో పెట్టుకున్నాను.


నా
కొత్త పద్యం
యీ మధ్యనే రాయటం మొదలెట్టి
ఇంకా పూర్తి చేయనిది
దీనితోనే చిక్కొచ్చిపడింది

నా
పాత పద్యాలు-
వాటి ముఖాలపై పడుతున్న
ముడతలు తెలుస్తూనే ఉన్నాయి
అవి ఎంత పెద్దవవుతున్నా
అప్పుడప్పుడొచ్చి నన్ను
పలకరిస్తూనే ఉన్నాయి.
ఈ కొత్త పద్యం తోనే-

ఈ పద్యం మొదలు పెట్టినప్పటిన్నించీ
చెప్పిన మాట వినటం లేదు
ముందుకు కదలటం లేదు
సరిగదా
కలం కాగితం మీద పెట్టబోతుండగానే
ఉన్నపళాన బిర్ర బిగిసి
ఊపిరి బిగించి పీచు గొంతుతో

“ఊఁహుఁ!
నీ మాటలు
నా నోట్లో కుక్కకు
కుక్కకు!”

గుర్తు పట్టేశాను
రేడియోలో వింటున్న క్రికెట్ కామెంటరీ
వెనకాలనుంచి వచ్చి కట్టేసి
నాన్న-
“ఇంక చదువుకో”మన్నప్పుడు
“నో” అన్నది
ఆ పీచు గొంతే.