ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు

గిట్టలతో ఎండు దుమ్మును ఎగజిమ్ముకుంటూ కోడెలు పరుగెడుతున్నాయి.

అది గ్రామం నుంచీ స్టేషనుదాకా ప్రత్యేకంగా వేయబడ్డ మట్టిబాట. ఇంచుమించు రైలు దారికి సమాంతరంగా వుంటుంది. మధ్యలో వంద గజాల మేరకు ఎర్రమట్టి చేలు వ్యాపించి వున్నాయి.

బండి నారిగాడి గుట్ట దాటింది. బైరాగుల సత్రం దాటింది. ఇంకెంత దూరం? వో అరమైలుంటుందేమో…

కాలచక్రంతో పోటీ పడ్డట్టుగా బండి చక్రం గిర్రుగిర్రున తిరిగేస్తోంది.

రెండింటిలో ఏది గెలుస్తుంది?

కాలమా? వేగమా?

కన్ను మూసి కన్ను తెరిచేటంతసేపట్లో పందెం ఒక ముగింపుకు రావచ్చునని మాత్రం మాలో ఎవ్వరూ అనుకోలేదు.

పందెం ముగిసేటప్పటికి–

మోరలు పైకెత్తి రోజుకుంటున్న కోడెలు, పగ్గాలు బిగబట్టి రైలు దారివైపు తెల్లబోయి చూస్తున్న రైతు, పుల్‌స్టాపు పెట్టినట్లుగా నిశ్చల వృత్తిని అవలంబించిన బండి, లేచి బండిపైన నిల్చుని ‘వచ్చేస్తూవున్నది నిజంగా రైలు బండేనా!’ అన్నట్లు దిగ్భ్రాంతికి లోనైవున్న వెంకట్రావుగారు–

ఏది ఏమైనా తనకేమీ కాబట్టనట్టు ధీమాగా, ఎవరేమైనా తనకేమీ చింతలేనట్లు గంభీరంగా తన పాటున తాను పొగలు చిమ్ముకుంటూ రైలుబండి జెర్రిపోతులా ముందుకు దూసుకుని వచ్చేస్తోంది.

ఒకటి… రెండు… మూడు… కాలపురుషుని కర్కశపాదాల చప్పుడులా క్షణాలు దొర్లిపోతున్నాయి.

గడచిపోయిన క్షణంలో ఏం జరిగిందో మనకు తెలుసు. గడుస్తున్న క్షణంలో ఏం జరుగుతున్నదీ తెలుసు. కానీ రానున్న క్షణంలో ఏర్పడబోయే పరిణామానికి సంబంధించినంతవరకూ మనిషి వూహ విల్లును లాగి వదిలిపెట్టిన బాణం. గురికి తగిలినా తగలొచ్చు. తప్పిపోయినా పోవచ్చు.

ఉన్నట్టుండి చేతిని పైకెత్తి వెంకట్రావుగారు “ఆపండి, ఆపండి!” అంటూ ఎలుగెత్తి కేకవెయ్యడం వినిపించింది. మరుక్షణంలో బండిపైన్నుంచి అలాగ్గా క్రిందికి దూకి “ఆపండాపండి…” అని చెయ్యి వూపుతూ ఆయన చేనుకడ్డంపడి రైలుకభిముఖంగా పరిగెత్తడం కనిపించింది.

నొగపైన కూర్చున్న రైతు పూర్తిగా అయోమయావస్థలోనైనా పడిపోయి వుండాలి. లేదా కాడిక్రింద గిత్తలు బెదిరిపోవడమైనా జరిగివుండాలి. తనంతట తానే స్వాతంత్ర్యం ప్రకటించుకున్నట్టు బండి రోడ్డుకడ్డం తిరిగి పొలాలవెంట పరుగెడుతూ వెంకట్రావుగారిని వెంబడిస్తోంది.

తన స్పృహలో తానున్న మానవుడెవడైనప్పటికీ యిలాంటి అవకతవక పనికి పూనుకోరేమో! బుద్ధి అదుపుతప్పి మనసు గూడా స్వాధీనంలో లేనప్పుడు మానవుణ్ణి ఆవహించుకునే విపరీత స్థితిని ఉన్మాదమంటారు. అలాంటి ఉన్మాదంలో తలమునకలైవున్న మానవుడు రైలుబండిని ఆపుచెయ్యడం మట్టుకే గాదు, గ్రహ గతుల్ని స్థంభింపజెయ్యడం గూడా తన కనుసన్నలలో జరిగిపోయే పనిగా భావించగలడు!

వెంకట్రావుగారి ఆక్రోశాన్ని చెవిలో వేసుకోకుండా యింజను ఆయన్ను దాటిపోయింది. ఏడెనిమిది గూడ్సుపెట్టెలు గూడా ఇంజన్ను అనుసరించాయి.

మన్నించాలి. అంతవరకే నాకు తెలిసింది. అప్పటినుంచీ మళ్ళీ రెండుమూడు నిమిషాలవరకూ నా కళ్ళ ఎదుట నెలకొన్న దృశ్యాలు గానివ్వండి, ఎదురైన అనుభవాలు గానివ్వండి, సినిమా ప్రొజక్టరులో బొమ్మల్లా ఒకదాన్ని తరుముకుంటూ ఒకటిగా పరుగులు తీశాయి. క్రమంగా వేగం తగ్గి రైలుబండి నిలకడలోకి రావడం, వెంకట్రావుగారొక్క గంతులో మెట్లపైకి దూకి తలుపు లోపలికి తొయ్యడం, బండివాడి తోడ్పాటుతో విద్యార్థులు మురహరిని కంపార్టుమెంటులోకి చేరవెయ్యడం, జీవచైతన్యానికి అతీతంగా బిర్రబిగుసుకుపోయిన నన్నెవరో కదిపి, ముందుకు తోసి పెట్టెలోకి ఎక్కించడం, ఇంతపనీ జరిగిన తర్వాత బుద్ధిగా చెప్పిన మాట వినే మంచిపిల్లవాడిలా బండి మెల్లగా ముందుకు సాగబారడం– ఈ సంఘటనల సముదాయమంతా నా పాలిటికొక స్వప్న వృత్తాంతంగానే తోచింది.

నా తెలివి నాకు వచ్చి జరిగింది కలగాదన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత నాకింక మిగిలిన సందేహం ఒక్కటే! ఎలా నిలిచిపోయి వుంటుంది బండి? ఏ శక్తి దాన్ని ఆపుచేయగలిగి వుంటుంది?

వెంకట్రావుగారొక వేళ పిచ్చివాడు గాకపోతే, గొప్ప మంత్రగాడయినా కావాలి. నా చిన్నతనంలో మా తాతగారు చెబుతుండేవారు, మంత్రతంత్రాలతో బలితర్పణాలతో శక్తిని పూజించి ప్రసన్నం చేసుకున్నవాళ్ళకు అసాధ్యం అంటూ ఉండదట. చీకటి విచ్చిపోకముందే నిద్రలేచి వూరికి దూరంగా వున్న చెరువు దగ్గరికి వెళ్ళి ఈయన చేసుకొచ్చేది శక్తి పూజే అయివుండొచ్చు…

నా బుద్ధి పోతున్న పోకడను గమనించేసరికి నేను సిగ్గుతో కుంచించుకుపోయాను. ఆకాశావకాశంలో చంద్రగ్రహానికే రహదారి వెయ్యగలిగిన ఆధునిక విజ్ఞానం దేవుళ్ళ అస్తిత్త్వాన్నిగానీ దయ్యాల ఉనికినిగానీ లెక్కలోకి తీసుకోదు. ప్రపంచం పైన ఎక్కడ, ఎంతటి మహత్కార్యం జరిగినా అందుకు సజావైన కారణం ఒకటి ఉండి తీరాలంటుంది. ఒక పట్టాన స్ఫురించకపోవచ్చు, ఆలోచించి అన్వేషించి తెలుసుకోమంటుంది.

త్రుళ్ళిపడినట్టుగా నేను తలపైకెత్తి వెంకట్రావుగారివైపు చూచాను. ఆయన మురహరి తలను తొడపై పెట్టుకుని అంగవస్త్రం అంచుల్ని విసనకర్రలా విప్పి ముఖానికి చల్లగా గాలిసోకేటట్టు మెల్లగా విసురుతున్నారు.

రైలెలా ఆగిపోయిందన్న ప్రశ్నను గాలికి వదిలిపెట్టి, జబ్బు మనిషికి తగు సపర్యలు చేయడమే తక్షణ కర్తవ్యంగా ఆయన తలపోస్తున్నట్టుంది.

ముందు జాగ్రత్తలన్నీ తీసుకుని తిరుపతి కొండకు ‘యిలుతీర్థం’ వెళుతున్న కుటుంబం ఒకటి మాకా పెట్టెలో తారసిల్లింది. ముఖ్యంగా ఆ కుటుంబంలోని వృద్ధ దంపతులకు ఓ వ్యాసంగం సమకూరినట్టయింది. తాము ఫ్లాస్కులో తెచ్చుకున్న కాఫీని వాళ్ళు ఒక్కొక్క బొట్టుగా రోగిచేత తాగించారు. అమృతాంజనం డబ్బీ పైకి తీసి గుండెలపైన వెచ్చగా రుద్దమన్నారు. “మీరిక భయపడకండి. మరేం ఫరవాలేదు, మంచి సూది ఒకటి పడితే మనిషి కోలుకుంటాడు…” అంటూ దారిపొడుగునా ధైర్యవచనాలు చెప్పసాగారు.

దిగవలసిన స్టేషన్లో బండి ఆగింది.

త్రోపుడు బండి తీసుకురావలసిందని పోర్టరు ద్వారా కబురుపెట్టారు వెంకట్రావుగారు. త్వరగా లాక్కొచ్చేటట్టు చూడమని నన్నుగూడా పోర్టరు వెంట పరుగెత్తమన్నారు. ప్లాటుఫారంపైన జనాల రద్దీ విపరీతంగా వుంది. ఏ సందులో నుంచి ఎలా మాయమయ్యాడో మరి, కొద్ది నిముషాలవరకూ పోర్టరు పొలకువ నాకు తెలియకుండా వుండిపోయింది.

ఇప్పుడు నేను ఇంజనుకు పదిబారల దూరంగా నిలబడి వున్నాను.

“చూచావా అర్థంపర్థం లేని పొరపాట్లు ఎలా జరిగిపోతాయో! ఎందుకిలా జరిగిందని నాకూ అంతుబట్టలేదనుకో! దిగి వద్దామనుకుంటుండగా జరిగిన పొరబాటేమిటో తెలిసొచ్చింది…” గార్డు మందలిస్తున్నాడు.

“వెరీ సారీ! మన్నించండి సార్! కార్నరులో పెట్టబోతుండగా ‘పిక్కార్’ చేతిలోంచి జారి క్రిందపడిపోయింది. దిగివెళ్ళి తెచ్చుకోకపోతే తప్పేది కాదు…” డ్రయివరు చెబుతున్నాడు.

“పోనీలే ఏం చేద్దాం! ఇకమీదట యెప్పుడూ యిలా జరగకుండా జాగ్రత్తపడాలి. నువ్వు డ్యూటీలో వుండగా యిలా జరగడం యిదే మొదటిసారి!”

దొరికింది. నా సహేతుకమైన కారణం నాకు దొరికింది. రైలాగిపోవటానికి కారణం డ్రయివరు చేతిలోనుంచి ఒకానొక సాధనం క్రిందికి జారిపోవడం.

వెనువెంటనే ఇంకోక ప్రశ్న!

ఎన్నడూ జరగని పొరబాటు సరిగ్గా ఆ నిమిషంలోనే ఎలా జరిగింది? మళ్ళీ ఇందులో గూడా ఏ మానవాతీతమైన శక్తికైనా ప్రమేయం వుండవచ్చునా?


మరునాటి సాయంకాలం ఏడుగంటలప్పుడు గవర్మెంటు ఆసుపత్రిలో నేనొక సిమెంటు బెంచీపైన కూర్చుని కాలహరణం చేస్తుండగా ‘హెడ్మాస్టరు వెంకట్రావుగారు అడ్మిట్ చేసిన పేషంటు ఏ గదిలో వున్నాడండీ?’ అని వాకబు చేస్తూ ఒక వ్యక్తి వసారా వెంట నడచిరావడం కనిపించింది.

లేచి ఎదురుగా వెళ్ళి “ఆ పేషంటు వుండడం ఈ గదిలోనేనండీ! మీరు మురహరికి బంధువులా?” అని ప్రశ్నించాను.

నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా అతడు, “ఇప్పుడెలా వుందండీ? ఇంతకూ జబ్బేమిటీ?” అంటూ గదిలో ప్రవేశించాడు.

మంచంపైన ఒక వారగా కూర్చున్న మురహరి భార్య మమ్మల్ని చూడగానే లేచి నిల్చుంది.

ఆగంతకుడు రోగి పరిస్థితిని గమనిస్తుండగా నాకతడివైపు పరిశీలనగా చూచే అవకాశం కలిగింది. ఈ ముఖాన్ని ఎక్కడో చూచిన గుర్తు. ఎక్కడ చూచానో మరి. చప్పున జ్ఞాపకం రావడంలేదు.

బంధువైవుంటే యితణ్ణి మురహరి భార్య పలకరించి వుండేది. పోనీ స్నేహితుడైవుంటే తనకు తానే ఆమెకు పరచయం చేసుకుని వుండేవాడు. రెండింటిలో ఏ ఒక్కటీ జరగకపోవడంగూడా కాస్త విస్మయాన్నే కలిగించింది.

‘గాఢంగా నిద్రపట్టినట్టుంది కదూ! ఫరవాలేదు, జబ్బు తగ్గుముఖం పట్టినట్టే!’ స్వగతంలా పలుక్కుంటూ వసారాదాకా వచ్చి అతడక్కడ ఆగిపోతూ నన్నడిగాడు, “అన్నట్టు హెడ్మాస్టరుగారెక్కడండీ? ఎంతో కాలమయింది ఆయన్ని కలుసుకొని! ఒకసారి వారితో మాటాడిపోదామనే వచ్చాను.”

ఆయన ఉదయం ఫస్టు బస్సుకే వెళ్ళిపోయారని చెప్పాను.

“అలాగా! నేనొచ్చి వెళ్ళినట్టుగా చెబుతారు గదూ?”

“చెబుతాలెండి. మీ పేరు?”

అప్పటికి మేము మాట్లాడుకుంటూ సిమెంటు బెంచి దగ్గరకి వచ్చాము.

“సత్యనారాయణ! నరసింగాపురం సత్యనారాయణ అనండి, తెలుస్తుంది. ఎందుకంటారేమో! నాకేమో ఆయనొక్కరే హెడ్మాస్టరుగారు. ఆయనకెందరో నాలాంటి శిష్యులు!”

అప్పటికది వట్టి ఉపోద్ఘాతం మాత్రమే అయినట్టు, చెప్పవలసిందింకా యికముందే వున్నట్లు అతడు చేతిగుడ్డను బెంచీపైన పరచి, నింపాదిగా దానిపైన కూచున్నాడు.

“ఈ పుణ్యభూమిలో ఆఖరుకొక్క కుక్క పస్తు పడుకున్నాసరే, తనకు వూర్థ్వగతులు వద్దు పొమ్మన్నాడు వివేకానందుడు. దరిద్ర నారాయణుడి సేవ కోసం అవసరమైతే మళ్ళీ మళ్ళీ యిలాంటి వెయ్యి జన్మలెత్తడానికైనా తాను సిద్ధమేనన్నారు. కర్తవ్య సాధన కోసం జీవితాన్ని మీదుకట్టేవాళ్ళ పద్ధతి అది. లోకం దృష్టిలో అలాంటివాళ్ళు పిచ్చివాళ్ళుగానే కనిపించవచ్చుననుకోండీ! ఆ మాటకొస్తే వాళ్ళు కూడా లోకాన్ని ఖాతరు చెయ్యరు. అడగటం మరిచాను, మీరేం చేస్తుంటారండీ?”

ప్రస్తుత నివాసం బాణావరమేననీ మురహరికి సహోద్యోగిననీ చెప్పుకున్నాను.

“చూడండి మేష్టరుగారూ! లోకాన్ని ఖాతరు చేయకపోవడమంటే ఏమిటి అంటారు? లోకం ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని మన్నించకపోవడమన్నమాట! ప్రతి అల్లాటప్పావాడూ చేయగలడంటారా అంతటి పని! వేమన్నగారట, గుడి ముంగిట చింకి పాతలతో గజగజ వణికిపోతున్న బిచ్చగత్తెను చూచాడట. వెంటనే గుడి లోపలికి వెళ్ళి అమ్మవారికి చుట్టబెట్టిన పట్టుచీరను లాక్కొచ్చి ఆ దీనురాలికి కప్పేశాడట! ‘అయ్యో, ఇంకేమైనా ఉందా! తప్పుగదూ! అమ్మవారు కళ్ళు పొడిచెయ్యదూ!’ అనుకోడం మానవ స్వభావం. రాళ్ళు దేవుళ్ళయితే రాసుల్ని మ్రింగునా అనగలిగే చేవ కోటికొక్కడికి మాత్రమే వుంటుంది.”

సత్యనారాయణ అనే ఆ అపరిచితుడు ఎదుటి మనిషి తాను చెపుతున్నదాన్ని ఏ మాత్రం అవగాహన చేసుకుంటున్నాడో తెలుసుకునే నిమిత్తం కొద్ది క్షణాలు విరామం యిచ్చి, “ఎందుకు చెబుతున్నానంటే…” అంటూ పునరారంభం చేయబోయాడు.

“చెప్పండి. మీరు విషయం చెప్పండి చాలు. కారణాన్ని నేనూహించుకుంటాను,” అన్నాను.

“ఒకసారి హైస్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఒక పరీక్షకు నేను అరగంట లేటుగా గానీ వెళ్ళలేకపోయాను. నూటరెండు డిగ్రీల జ్వరం తీవ్రతలో వాడిపోయిన తోటకూరకాడలా డస్కుపైన సోలిపోతున్నాను. ప్రక్కన్నే కూర్చున్న హెడ్మాస్టరుగారు కాఫీ త్రాగించారు. ‘ఏం భయపడొద్దు బాబూ! నీ చేతనైనంతవరకే వ్రాయి. వీలుగాకపోతే మానెయ్యి…’ అంటూ బుజ్జగించారు. వింటున్నారా మేష్టారుగారు! పరీక్షలో నాకు పాసయ్యేటందుకు రావలసిన మినిమమ్ మార్కులకన్నా అయిదు మార్కులు తక్కువగా వచ్చాయి…”

“…”

“మిగిలిన సబ్జక్టులలో ఎన్ని మార్కులొచ్చాయని అడగలేదే మీరు? వాటిలో బాగానే వచ్చాయి. కానీ ఏం లాభం! ఆ రోజుల్లో రూల్సు చాలా స్ట్రిక్టుగా వుండేవి. ఈ విద్యార్థి తప్పనిసరిగా యింకొక సంవత్సరం అదే క్లాసులో వుండవలసిందేనని హెడ్మాస్టరు మినహాగా మిగిలిన హైస్కూలు పరీక్షల కమిటీ నిర్ణయించింది. ఐతే కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా, పరీక్షల నిబంధనలను త్రోసిరాజంటూ నాపేరు ప్రమోషను లిస్టులో కనిపించింది. ఇక చూసుకోండి, తమపై గిట్టనివాళ్ళు పై అధికారులకు ఆకాశరామన్న ఉత్తరాలు వ్రాసిపడేశారు. డి.ఇ.ఒ.గారు ఎంక్వయిరీ కోసం రెక్కలుగట్టుకుని వచ్చి వాలిపోయారు. ఎన్ని విధాలుగా తర్కించి అడిగినా హెడ్మాస్టరుగారు చెక్కుచెదరకుండా ఒక్కటేమాటపైన కూచున్నారు. ‘వాడు నా స్టూడెంటు. వాడెలాంటి స్టూడెంటయింది నాకు తెలుసు. వెధవ ముదనష్టం అయిదు మార్కులకోసం వాడ్ని ఫెయిల్ చెయ్యమంటారటండీ! మిగిలిన వాటిల్లో అరవైలూ డెబ్బయిలూ రాగా, ఒక సబ్జక్టులో అయిదు మార్కులు తక్కువ కాగానే యిక వాడు పై తరగతికి పనికిరాడంటారా? ఆ మాత్రం యోగ్యతను గుర్తించి ఒక స్టూడెంటును పాసు చేసే అధికారమైనా లేకపోతే యిక నాకీ హెడ్మాస్టరుగిరీ ఏం చేసుకోడానికండీ? మీకొక నమస్కారం! దీన్ని నేను తప్పనుకోలేదు, కర్తవ్యమనుకున్నాను. తర్వాత మీ ఇష్టం.’ అనేశారు. పాపం, డి.ఇ.ఒ.గారు మాత్రం ఏం చేస్తారు? ఈ మొండివాడితో గొడవెందుకనుకుని విషయ వివరణ చేస్తూ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ ఒక్క కేసును మాత్రం మన్నించవలసిందిగా డైరెక్టరుగారికి సిఫార్సుచేసి తమ పాట్లేవో తాము పడ్డారు…”

సత్యనారాయణ కథనం వల్ల నాకొక విషయం తెలిసింది. వెంకట్రావుగారు ఉండుండి ఒక అవకతవక పని చెయ్యడమనేది అర్ధాంతరంగా వచ్చిందిగాదు. ఇదాయనకు ఆదినుంచీ వున్న జబ్బేనన్నమాట!

మరికొంతసేపటివరకూ అలాగే లోకాభిరామాయణంతో కాలం వేగించి, “ఇక వెళ్ళొస్తానండీ” అంటూ లేచి నిల్చున్నాడు సత్యనారాయణ.

“రేపాదివారం గదా! హెడ్మాస్టరుగారొస్తే రావచ్చు. రేపు సాయంకాలం వచ్చివెళ్ళండి,” అన్నాను.

“అబ్బే, వీల్లేదండీ! రేపు నాకు నైట్ డ్యూటీ వుంటుంది.” అన్నాడు సత్యనారాయణ.

“నైట్ డ్యూటీయా! ఏ డిపార్టుమెంటులో ఉన్నారు?”

“రైల్వేలో పనిచేస్తున్నానండీ, డ్రయివరుగా!”

చివరి మాట చెవిలో పడేసరికి నా సందేహం పొగమంచులా విచ్చిపోయింది. రెండు పర్యాయాల్లోనూ మొదటిసారి యూనిఫారంలో చూచాను గనుక రెండోసారి మామూలు దుస్తుల్లో యితణ్ణి గుర్తుపట్టలేకపోయివుంటాను!

కథకంతా కీలకప్రాయమైన సంఘటనకు నాకిప్పుడొక సంజాయిషీ దొరికినట్టయింది. ఇతడి చేతిలోనుంచి ‘పిక్కర్’ జారి క్రింద పడిపోవడం కేవలం ఒక ఫార్సులాంటి సంఘటనే కావచ్చు. బండిని కాసేపు నిలబెట్టడం కోసం ఒక సాకుగా ప్రయత్నపూర్వకంగానే యితడా పనిముట్టును జారవిడచి వుండవచ్చుననుకోవడానికి ఎంతైనా అవకాశం వుంది.

ఎలాగైతేనేం, కొండను త్రవ్వడమంత పెద్ద ప్రయత్నం చేయకుండానే నేను ఎలుకను పట్టేయగలిగాను.


బాణావరం వచ్చేసరికి వెంకట్రావుగారి వ్యక్తిత్వం చుట్టూ అద్భుతమైన ‘యిమేజి’ ఒకటి నెలకొని వుండటం గమనించాను. వూరి ప్రక్కన రైలుదారి ఏర్పడి నూరేళ్ళు దాటింది. నాటికీ నేటికీ రైలొకసారి స్టేషను నుంచి కదిలిన తర్వాత మార్గమధ్యంలో దాన్ని ఆపివెయ్యగలిగిన మానవమాత్రుడెవడూ లేడు, ఒక వెంకట్రావుగారు తప్ప.

అది వట్టి అపోహ అని నాకు తెలుసు. అవసరమైతే నిరూపణ చెయ్యగలను కూడా! కానీ తీరా నా వాదం విన్న తర్వాత ఈ మూఢజనులు నాపైనే తిరగబడి, ‘అలాగైతే ఆరోజు బండిలో సత్యనారాయణ అనే అదే డ్రయివరు రావడం ఎలా సంభవించింది? అందుకైనా కారణం వెంకట్రావుగారి ఆత్మబలం కాదా?’ అంటూ ప్రశ్నించి, నన్ను నిరుత్తరుణ్ణి చేస్తారేమోనన్న భయం నాకుండనే వుంది.

ఐతే ఒకటి. తన చుట్టూ చోటుచేసుకున్న ‘యిమేజి’నే వెంకట్రావుగారు తన చేజేతులా దులిపివెయ్యజూడటం గూడా పిచ్చితనంలో ఒక అంశమేనేమో! “అబ్బే, యిందులో నేను చేసిన యింద్రజాలమేముందయ్యా! ఒక మనిషి చావుబ్రతుకులో వున్నాడని తెలియగానే డ్రయివరు బండిని ఆపేసి వుంటాడు. ‘రూలు’కన్నా మనిషి ముఖ్యంగదా!” అంటుంటారాయన.

(ఫిబ్రవరి 1984.)