విశ్వనాథ నర్తనశాల

ఇది విశ్వనాథ రాసిన మొదటి నాటకం (1924). చాలా చక్కటి రచన! కీచకవధ కథని నాటక వస్తువుగా తీసుకుని చాలా గొప్పగా నిర్వహించారు విశ్వనాథ. నాలుగుసార్లు (ఇంకా ఎక్కువ?) ముద్రణలు పొందింది. రెండవ, మూడవ ముద్రణలను ఆర్కయివ్.ఆర్గ్ సైట్‌లో చూడవచ్చు. ఈ నాటక రచనలో విశ్వనాథ చూపించిన ప్రతిభ గురించి చాలా వివరంగా విశ్లేషణలు వచ్చాయి కాబట్టి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. ఈ నాటకాన్ని ఎవరయినా స్టేజీ మీద ప్రదర్శించారా? ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వచ్చింది? అన్న విషయాల గురించి ఎవరికయినా తెలిస్తే చెప్పగలరు.

ఈ నాటకాన్ని రేడియోలో ప్రసారం కోసమై ఉషశ్రీ (పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు) కొంత కుదించారు. శంకరమంచి సత్యం పర్యవేక్షణంలో ఇది 1971-72 ప్రాంతంలో మొదటిసారి విజయవాడ కేంద్రంనుండి ప్రసారమయ్యింది. కందుకూరి చిరంజీవిరావు, సి. రామమోహనరావు, నండూరి సుబ్బారావు, శ్రీరంగం గోపాలరత్నం మొదలయిన గొప్ప కళాకారులు పాల్గొన్న నాటకమిది. పూర్తి వివరాలు కార్యక్రమం ప్రారంభంలో వచ్చే అనౌన్స్‌మెంటులో వినవచ్చు.