కోడ్ కూలీ

తన దగ్గిరకొచ్చిన రెస్యూమె కాయితాల్లో కొత్తగా జేర్చుకోవడానికి పనికొచ్చేవాళ్ళు ఎవరా అని వర్షా జైన్ చూడబోయేంతలో ఏదో కాయితంతో లోపలకి వచ్చిన ప్రాజెక్ట్ మేనేజరు రామరాజు ఏమీ ఉపోద్ఘాతం లేకుండా అన్నాడు, “ఈ కుర్రాణ్ణి చూడు వర్షా, మనకి బాగా పనికొస్తాడు. నీలాగే మద్రాస్ ఐ.ఐ.టి. మెటీరియల్.”

“నేను ఖరగ్‌పూర్!” ఠక్కున ఖండించింది వర్ష.

వర్ష మేనేజర్ ఇచ్చిన కాయితంలో పేరు చూసింది. దుబ్బుల వెంకన్న అని కనిపించగానే ఫకాల్న ఒక్క నవ్వు వచ్చింది నోట్లోంచి అనుకోకుండా.

“ఎందుకలా నవ్వుతున్నావ్?”

“పేరు చూస్తే గొడ్లు కాసుకునేవాడిలా ఉంటేనూ…”

రామరాజు మొహం ఎర్రబడ్డం చూసి నవ్వు మానేసి అంది, “చెప్పండి.”

“ఈ కుర్రాడు చూడబోతే మంచి బ్రిలియంట్‌లా కనిపిస్తున్నాడు. ఇంటర్‌వ్యూకి పిలుద్దాం.”

“మీకేం, ఎవర్ని పడితే వార్ని పిలుస్తారు. ఆ తర్వాత నేను పడాలి తంటాలు. క్రితంసారి ప్రాజక్టులో కొత్తగా తీసుకున్నవాళ్ళు ఎలా తగలబెట్టారో తెల్సిందే కదా? నా ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకోమంటారా లేకపోతే మీరు చెప్పిన వాళ్ళనా?”

“ఈ కుర్రాణ్ణి రమ్మని చూద్దాం అసలు. నచ్చకపోతే ఎలాగా వెళ్ళమనొచ్చు కదా?” లేచి చెప్పేడు రామరాజు. బయటకి వస్తూంటే, ‘ఏమైనా ఈ వర్ష తన తరహా మార్చుకోకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగంలో తట్టుకోలేని దెబ్బ తగుల్తుంది,’ అనుకుంటూ తన రూములోకి వచ్చి కూర్చున్నాడు.

తెలుగమ్మాయిగా పుట్టి గుజరాతీ వాడిని వరించి పేరుతో పాటూ పద్ధతులూ మార్చుకున్న వర్షా జైన్, మేనేజర్ అటు వెళ్ళగానే వెంకన్న కాయితాలు చూసింది. మద్రాస్ ఐ.ఐ.టి.లో బి. టెక్. ర్యాంకర్, అక్కడ్నుంచి ఇప్పటివరకూ నాలుగేళ్ళు భీమవరం ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్సు డిపార్ట్‌మెంట్‌లో లెక్చరర్. ఇప్పుడు బోరు కొట్టింది కాబోలు ఇలా ప్రోగ్రామర్‌గా ఉద్యోగానికి అప్లికేషన్ పంపించాడు. జావా, సి షార్ప్ లాంటి కొన్ని భాషల్లో సర్టిఫికేషన్ ఉంది. ఇటువంటి జనాలు ఎలా ఉంటారో తనకి తెలియదా? అంత ఐ.ఐ.టి. పోటుగాడయితే భీమవరం కాలేజీలో లెక్చరర్‌గా చేరాల్సిన ఆగత్యం ఏవిటి? వీడెవడో రికమండేషన్ బాపతు. లేకపోతే ఈ మేనేజర్ వచ్చి తనతో చెప్పడం ఎందుకో? ఈ రామరాజు ఇలా నా నెత్తి మీద కూర్చుని నన్ను సతాయించడమే తప్ప చేసే పనేమీ లేదు. ఈయనకు సరైన గుణపాఠం నేర్పడానికి ఒకే ఒక పధ్ధతి. ఆ కుర్రాణ్ణి ఇంటర్‌వ్యూకి పిలిచి దులిపేయడమే.

రెండు రోజుల్లో ఉన్న జనాలని ఫిల్టర్ చేసి ఓ ఇరవై మందిని ఇంటర్‌వ్యూకి పిలిచేలా చేసి ఆ లిస్టు రామరాజుకి అందించింది, నాలుగేళ్ళనుండి అదే కంపెనీలో పనిచేస్తున్న వర్ష. తనకిచ్చిన లిస్టులో వెంకన్న పేరు ఉండడం చూసి రామరాజు సంతోషపడ్డాడు.


మొదటి కేండిడేటు అమ్మాయి. మామూలు ప్రశ్నలయ్యాక వర్ష అడిగింది. “జావా ప్రోగ్రామింగ్‌లో మల్టిపుల్ ఇన్‌హెరిటన్స్ ఎలా?”

“జావాలో మల్టిపుల్ ఇన్‌హెరిటన్స్ కుదరదు. అది కావాలంటే ఇంటర్‌ఫేస్‌ల ద్వారా చేసుకోవాలి.”

సరైన సమాధానం చెప్పినందుకు రామరాజు అమ్మాయికేసి కొంచెం మెచ్చుకోలుగా చూసేసరికి వర్ష విజృంభించింది, “జావాలో మెమరీ లీక్ కనిపెట్టడం ఎలా?”

రామరాజు విస్తుపోయి చూసాడు వర్ష కేసి. కాసేపు ఆలోచించిన అమ్మాయి చెప్పింది, “తెలియదండి.”

“ఇదిగో. ఇటువంటి వాళ్ళే తగుల్తారు మనకి. ఓ అంటే నా రాని ప్రతీవాడూ జావా ప్రోగ్రామర్ అయిపోదామనీ అమెరికా పోదామనీ. ఇవన్నీ తెలియకుండా ఎందుకొస్తారో ఇంటర్వ్యూలకి!” పైకే అంది వర్ష కసిగా.

“ఇలాంటివి మాకు ఎలా తెలుస్తాయండి ఎక్స్‌పీరియన్స్ లేకుండా?” అమ్మాయి అడుగుతోంది అమాయకంగా.

“ఐతే ఎక్స్‌పీరియన్స్ వచ్చినాక రా!”

తనమీద కోపం వాళ్లమీద చూపిస్తోందని రామరాజుకు అర్థమయింది. మరో ఇద్దర్ని ఇలాగే ఏడిపించాక అప్పుడొచ్చింది దుబ్బుల వెంకన్న వంతు. వెంకన్న లోపలకి వచ్చాక రామరాజు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు.

“ఐ.ఐ.టి.లో చదువుకునీ ఇలా భీమవరం కాలేజీలో లెక్చరర్‌గా ఎందుకు చేరారు? మీలో చాలా మంది పైచదువులకి, ఉద్యోగాలకి అమెరికా వెళ్తారు కదా అటునుంచి అటే?”

“నాకు కూడా రైస్‌లో, ఓఎస్‌యూలో సీటు వచ్చింది కానీ కొన్ని కుటుంబ విషయాలవల్ల అలా భీమవరంలో జేరాల్సి వచ్చిందండి.”

“మరి మీకు ఇక్కడ ఉద్యోగం ఇస్తే వదిలేసి అమెరికా వెళ్ళిపోరని గ్యారంటీ ఏమిటి?”

“ఇక నేను అమెరికా వెళ్ళాలనుకోవడం లేదు. అయినా…”

వర్ష రామరాజుతో అంది. “ఇలాంటి అబధ్దాలు ఎన్నని విన్నాం?” వెంఠనే అటు తిరిగి అంది వెంకన్నతో, “ఎందుకు అబద్దాలు చెప్తున్నావ్? అమెరికాలో సీట్ వచ్చీ భీమవరంలో కాలేజ్ లెక్చరర్‌గా చేరావా? నమ్మమంటావా?”

వెంకన్న కోపంగా చూశాడు. “మీరు కాస్త మర్యాదగా మాట్లాడండి. కుటుంబ విషయాలు బయటకి చెప్పడం ఎందుకని చెప్పలేదు. అది అబద్ధం అని మీరు ఎలా అనుకుంటున్నారో నాకు తెలియదు. మా నాన్నగారు లేరు. మా అమ్మగారికి ఆరోగ్యం బాగోలేక నేను ఒక్కడినే కొడుకునవ్వడం వల్ల ఆవిణ్ణి చూసుకోవడానికి ఇంటిదగ్గిరే ఉండడం కోసం ఆ ఉద్యోగంలో చేరాను.”

“ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగుందా?” రామరాజు అడిగేడు వెంకన్న సమాధానానికి వర్ష మాడిపోయిన మొహంలో కనిపించే భావాలు పట్టించుకోకుండా.

“లేదండి, ఒవేరియన్ కేన్సర్ వల్ల రెండు నెలల క్రితం ఆవిడ చనిపోయారు.”

అసలేమీ జరగనట్టూ ఇంటర్‌వ్యూ కొనసాగించింది వర్ష. “ఇంటిజెర్ అనేది పదీ నుంచి ఇరవై బైట్‌ల కంటే ఎక్కువగా ఉండాలి. అలాంటి నెంబర్ జావాలో ఎలా డిజైన్ చేస్తారు?”

“మనకి కావాల్సిన డెఫినిషన్స్ లేనప్పుడు, ఉన్నవి సరిపోనప్పుడు, ఉదాహరణకి, హ్యూజ్ ఇంటిజెర్ పేరుతో ఓ క్లాస్ తయారు చేసుకోచ్చు ఆ క్లాసులోనే అనేక మామూలు ఇంటిజెర్‌లని ఒక ఆరేగా వాడుకుని ఇటువంటి పెద్ద ఇంటిజెర్‌లని తయారు చేసుకోవడం ఒక పద్ధతి. అందులోనే భాగంగా అవి కలుపుకోవడానికి, తీసివేయడానికి, ఇంకా అనేకానేక మార్పులకీ చేర్పులకీ మెథడ్స్ రాసుకోవచ్చు కూడా.” వెంకన్న చెప్పాడు సరైన సమాధానం.

అన్నింటికీ సరిగ్గా సమాధానాలు చెప్పాక రామరాజు చెప్పాడు వెంకన్నతో, “మేము ఓ వారంలో మీకు జాబ్ ఇచ్చేదీ లేనిదీ చెప్తాం. మీకేమైనా ప్రశ్నలుంటే అడగండి.”

వెంకన్న ఓ సారి వర్ష కేసి, రామరాజుకేసీ చూశాడు. ఏమనుకున్నాడో ఏమో వెళ్లబోతూ చెప్పేడు, “నాకేమీ ప్రశ్నలు లేవండి. కాని, మా అమ్మ పోయాక ఆ ఊళ్ళో పాత జ్ఞాపకాలు తప్పించుకోవడానికి ఇలా నేను ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాను తప్ప నాకేదో అవసరం అయికాదు. నన్ను ఇంటర్‌వ్యూకి పిలిచినందుకు థేంక్స్.”

ఇక వర్ష, రామరాజులు ఏదైనా చెప్పదల్చుకున్నా తనకు మాత్రం వినడానికేమీ లేదన్నట్టు వెంకన్న నడుచుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు.

రెండురోజులు పోయాక తాను సెలెక్ట్ చేసిన వాళ్ళ లిస్టు రామరాజుకిచ్చింది వర్ష. అందులో వెంకన్న పేరు లేదు. ఓ అరగంట ఇద్దరికీ ధాటీగా వాగ్యుద్ధం జరిగింది. మొత్తం మీద రామరాజు పట్టుబట్టి మేనేజర్‌తో చెప్పి వెంకన్న పేరు చేర్చాడు ఉద్యోగం ఇవ్వడానికి; ఇది తెలిసి వర్ష మొహం మాడ్చుకుంది.

అయితే ఉద్యోగంలో చేరడానికి రమ్మన్న తారీఖుకి వెంకన్న రాలేదు సరిగదా వెంకన్న దగ్గిర్నుంచి చిన్న ఉత్తరం చేరింది రామరాజుకి. తనని ఇంటర్‌వ్యూ చేసినప్పుడు మనిషిగా కనీస మర్యాద ఇవ్వని వాళ్ళతో తాను పనిచేయలేనని, అలాంటి వాళ్ళ దగ్గిర ఉద్యోగం చేయడం కంటే ఉన్న ఊళ్ళో కాలేజీలో పాఠాలు చెప్పుకోవడం మంచిదని, ఏది ఏమైనా ఉద్యోగం ఇచ్చినందుకు మాత్రం థేంక్స్ అని చెప్తూ రాశాడు. ఒళ్ళు మండి అది పట్టుకెళ్ళి వర్ష మొహంమీద పారేసి, ఆవిణ్ణి అక్కడే మరోసారి అనాలనుకున్నవన్నీ అని చేతులు దులుపుకున్నాడు రామరాజు. ఆ తర్వాత ఇదే తరహా కక్షలన్నీ మనసులో పెట్టుకుని ఎప్పుడైనా వర్షకి రావాల్సిన అమెరికా ఛాన్సులు, బోనస్సులూ అవీ నొక్కేస్తూ వచ్చాడు ఆయన. ఇలా నొక్కేస్తున్నాడని తెల్సినా వర్షది ఈ ఉద్యోగంలో ఉండే వెసులుబాటు వదులుకోలేక, అలా మింగలేక కక్కలేక అక్కడే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. దీనికి అన్నింటికన్నా పెద్ద కారణం తాను, తన మొగుడూ ఇదే కంపెనీలో పనిచేస్తూ ఉండడం. మొగుడు చేసే పని వేరే మేనేజర్ దగ్గిర అయినా సరే, ఒకే ఆఫీసులో ఇద్దరూ పనిచేస్తూ ఉంటే ఆ వెసులుబాటు మరో చోట దొరకదు కదా?


మరో ఐదేళ్లకి రామరాజు ఉద్యోగంలోంచి మరోచోటికి మారగానే వర్ష రోజులు బాగుపడ్డట్టయింది. కొత్త మేనేజర్ వస్తూనే ఒక పెద్ద ప్రాజక్ట్ వచ్చింది. దానితోపాటు అమెరికా పంపడానికి తలుపులూ తెరుచుకున్నాయి. భార్యతో పాటు జైన్ కూడా ఉద్యోగం వదిలేసి వర్ష కూడా బయల్దేరేడు హెచ్4 వీసా మీద. ప్లేన్ ఎక్కటానికి రెండు మూడు రోజుల ముందు వర్ష నోటి దురుసు తెలిసిన మేనేజర్ ఓరియెంటేషన్ అటెండ్ కమ్మని చెప్పేడు వర్షతో. చిరాగ్గా అడిగింది వర్ష, “ఇవన్నీ నాకు తెలియవా? నేను వెళ్ళి రిపోర్ట్ చేసే చోట ఎవరిని కలిసేది మందుగా? ఎవరు నా మేనేజర్ అక్కడా?”

“వెంకీ.”

“తెలుగువాడేనా?”

“దక్షిణాది వాడే గానీ తెలుగో కాదో తెలియదు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త!”

వర్ష అమెరికా వచ్చి ఉద్యోగంలో చేరిన మూడోనాడు వెంకీ టీమ్ మీటింగులో అందరికీ పరిచయం చేశాక చెప్పాడు ఎవరితో పనిచేయాలో, ఐ.డి. కార్డు ఎక్కడెక్కడ పనిచేస్తుందో, మిగిలిన అన్ని రూల్స్ ఉన్న పుస్తకం చేతికిస్తూ. తర్వాత వారంలో వర్షకి న్యూ ఎంప్లాయీ ట్రైనింగ్ ఇచ్చారు– సెక్సువల్ హరాస్‌మెంట్, వర్క్ కాన్ఫిడెన్షియాలిటీ లాంటి విషయాలన్నిటి మీద. అలా మొదలయింది వర్ష అమెరికా ఉద్యోగం. జైన్ తనకూ హెచ్-1 ఎవరైనా స్ఫాన్సర్ చేస్తారా అని దేశీ కన్సల్టన్సీలను వెతుక్కుంటున్నాడు రోజూ.

ఆ పైనెలలో రెండు రోజులు పోయాక ఓ రోజు వెంకీ ఆఫీసులోకి జాన్ తలుపు కొట్టి లోపలకి వచ్చి చెప్పేడు, “వెంకీ, నీతో పర్సనల్‌గా మాట్లాడాలి.” వెంట టీమ్ లీడ్ కూడా ఉన్నాడు.

“ఏమిటి సంగతి?”

టీమ్ లీడ్ జాన్ కేసి తలూపేడు. జాన్ చెప్పేడు క్లుప్తంగా, “మీరు కొత్తగా తీసుకొచ్చిన వర్ష నా గురించి రేషియల్ ప్రొఫైలింగ్ చేస్తూ మాట్లాడింది. ఇలా నాతోనే కాక నా రేస్ గురించి మిగతా వాళ్ళ దగ్గిర కూడా అన్నట్టు నా దగ్గిర సాక్ష్యం ఉంది. మీ ఇండియన్స్‌కు సాధారణంగా ఉండే కలర్ కాంప్లెక్స్ గురించి, ఏషియన్స్ ఆఫ్రికన్స్‌ని తక్కువగా చూడ్డం గురించీ తెలుసు నాకు. కాని అందరూ అలా ఉండరనీ తెలుసు. ఎంతో మంది ఇండియన్స్‌తో పనిచేశాను కానీ ఇలా ఎవరూ అనలేదు. వారందరూ చాలా మర్యాదస్తులు, మంచివారూనూ. కాని, ఈమె ప్రవర్తన ఏమీ బాగాలేదు. ముందు మీకు రిపోర్ట్ చేసి, ఆ తర్వాత హెచ్చార్‌కు కంప్లయింట్ ఇవ్వాలనుకుంటున్నాను…”

జాన్‌ని మధ్యలోనే ఆపి వెంకీ చెప్పాడు, “దీని సంగతి ఇప్పుడే తేలుస్తాను. గివ్ మి వన్ ఛాన్స్. మీరు నిశ్చింతగా ఉండండి.”

“వర్షా, కెన్ యు కమ్ హియర్ వన్స్!” ఫోన్ చేసి చెప్పాడు వెంకీ. లోపలికొచ్చిన వర్ష బైటికి వెళుతున్న జాన్‌ను, టీమ్‌లీడ్‌నూ చూసి ముఖం చిట్లించింది.

“వర్షా మీ మీద కంప్లయింట్ వచ్చింది. మీకు ఇక్కడ…”

చెప్పబోయిన వెంకీతో అంది వర్షా చిరాగ్గా, “ఎందుకింత చిన్న విషయానికి ఇంత గొడవ. అయినా నేనేమన్నాను? వాళ్ళంతా ఉండేది స్లమ్స్‌లోనే కదా. అంతా డ్రగ్స్, వయొలెన్స్. మరి నువ్వెలా ఈ ఉద్యోగంలోకి వచ్చావ్? అని అడిగాను అంతే. నేను తప్పు ఏమన్నాను? అయినా ఆ జాన్ ఆఫ్టరాల్ ఒక టెస్టర్. అతని గురించి నన్ను డిసిప్లిన్ చేయడమేమిటి?”

“మీరు ఎలా అడిగుంటారో ఊహించగలను. ఆఖరుసారి చెప్తున్నాను. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరూ ఊరుకోరు. మీరు జాన్‌కి అపాలజీ చెప్పాలి.”

పాకం ముదురుతోందని తెలుస్తూంటే వర్ష, కేర్‌లెస్‌గా అంది. “ఒకే, ఒకే. చెప్తాను సారీ.”

మరుసటిరోజు టీమ్ మీటింగ్‌లో వర్షచేత పబ్లిక్‌గా జాన్‌కి సారీ చెప్పించాడు వెంకీ. దానితోపాటు కాయితం మీద అపాలజీ రాసి ఇచ్చింది కూడా. ఇంకోసారి ఇలా జరగదని, జరిగితే హ్యూమన్ రిసోర్సెస్‌కి కంప్లయింట్ చేయమని, తాను సపోర్ట్ చేస్తానని జాన్‌కి చెప్పేడు వెంకీ. ఆ క్రితం రోజు రాత్రే వర్ష ఫోనులో స్నేహితులతోనూ మిగతా తెలుసున్నవాళ్లతోనూ మాట్లాడిందనీ; తప్పు తనదేనని తెలుసుకున్నాక కోర్టు దాకా వెళ్తే ఏమవుతుందో తెలుసు కనక ఇలా పబ్లిగ్గా అపాలజీ చెప్పుకుని కాయితం రాసి ఇచ్చిందనేది పైకి చెప్పని మాట. మొత్తానికి ఆ సంగతి అక్కడే ఆగిపోయింది. వర్షకి తెలియనిది మరోటి జరిగింది. వెంకీ ఇండియాలో, అమెరికాలో ఆయా కంపెనీల హ్యూమన్ రిసోర్సెస్‌కు వివరంగా వర్ష గురించి రిపోర్ట్ ఇచ్చాడు జరిగిన సంగతి చెప్తూ.

అయితే ఎప్పుడైతే తనని వెంకీ అపాలజీ ఇమ్మన్నాడో అప్పట్నుంచీ వర్షా వెంకీ గురించి తన స్నేహితుల దగ్గిర ఛండాలంగా మాట్లాడ్డం మొదలుపెట్టింది; అలాగే సాటి ఉద్యోగుల మీద కూడానూ. వాటర్ కూలర్ టాక్‌గా పిలవబడే ఈ కబుర్లు అన్నీ ఒక్కొక్కటిగా వెంకీ దగ్గిరకి కంప్లయింట్లుగా వరుసగా చేరిపోయాయి.

వెంకీ మరోసారి ఓ శుక్రవారం నాడు వర్షని మాట్లాడ్డానికి పిలిచేడు; రూములో హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ కూడా ఉన్నాడు.

“మీ గురించి ఓ సారి కంప్లయింట్ వచ్చిందని మీకు తెలుసు. ఆ తర్వాత…” హెచ్చారెమ్ మొదలుపెట్టాడు.

“దానికి అపాలజీ చెప్పాను కదా పబ్లిగ్గా. ఇంకా దాన్ని తవ్వి తీస్తున్నారెందుకు? దానిమీద…”

“దానిమీద కాదు కానీ మీరు వాటర్ కూలర్ దగ్గిర, అప్పుడప్పుడూ మాట్లాడే మాటలన్నీ మాకు చేరాయి. ఇతర దేశీయుల గురించి, మీ కొలీగ్స్ గురించి, మీరన్న మాటలన్నీ మాకు కంప్లయింట్లుగా వచ్చాయి. మీకు చెప్పుకోడానికి ఏమైనా ఉందా?”

“నేను అలా అన్నానని మీ దగ్గిర ప్రూఫ్ ఉందా?” వర్ష అంది దబాయింపుగా.

“ప్రూఫ్ ఉంది కనకే. లేకపోతే నాకు పనిలేక మిమ్మల్ని పిలిచి ఇలా మాట్లాడే అవసరం ఏవుంది?”

“నేనలా అన్నట్టు నాకు గుర్తు లేదు.”

“ఒకర్ని ఎన్నోసార్లు, అందర్నీ ఒకసారి మోసం చేయవచ్చు కానీ అన్నిసార్లూ అందర్నీ మోసం చేయడం కుదరదు- అనే సామెత వినే ఉంటారు. ఇంక దబాయించకండి. పరిస్థితి ఇంతవరకూ వచ్చాక ఇప్పుడు మిమ్మల్ని ఉద్యోగంలోంచి ఎందుకు తొలగించకూడదో కారణాలు చెప్పగలరా?” హెచ్చారెమ్ నోట్లోంచి కరుగ్గా వచ్చిన మాటలు విని వర్ష కంగారు పడింది.

కాళ్ళూ, చేతులూ వణుకుతూండగా అంది, “అయాం సో సారీ, ఇటువంటిది మళ్ళీ ఎప్పుడూ జరగదని ప్రామిస్ చేస్తున్నాను.”

“ఇది మీకు ఆఖరి అవకాశం.” హెచ్చారెమ్ బయటకు నడిచేడు వెంకీకి బై చెప్పి.

“మీ పద్ధతి ఏమీ మారినట్టు లేదు వర్షగారూ!” తెలుగులో అన్నాడు వెంకీ.

ఒక్కసారి విస్తుబోయింది వర్ష. “మళ్ళీ చెప్తున్నాను కదా, అయామ్ సారీ.”

“నో యూ ఆర్ నాట్. అది సరే, కొన్నేళ్ళ క్రితం నేను హైద్రాబాదులో ఉన్నప్పుడు మిమ్మల్ని మొదటిసారి ఇంటర్‌వ్యూకి వచ్చి కలిశాను. గుర్తుందా?”

వర్ష తలెత్తి ఈసారి వెంకీ కేసి చూసింది. తాను హైద్రాబాదులో వందలమందిని ఇంటర్‌వ్యూ చేసింది. ఈయన ఎక్కడి వాడో? గుర్తు రావట్లేదు. లేదన్నట్టు మౌనంగా తలూపింది.

“మా అమ్మగారికి కేన్సర్ వస్తే చూడ్డానికి ఎవరూ లేరని, అమెరికాలో ఎమ్.ఎస్.లో సీటు వచ్చినా చేరకుండా భీమవరం ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా చేరాను. ఆవిడ పోయాక నేను ఆ లెక్చరర్ ఉద్యోగం మానేసి హైద్రాబాద్ రావడానికి ప్రయత్నం చేస్తూ మీ దగ్గిరకి వచ్చాను ఇంటర్‌వ్యూకి. గుర్తుందా?”

మరోసారి నిశ్శబ్దం.

“ఇప్పటికి ఈ మీటింగ్ ముగిద్దాం. మీ ప్రాజక్ట్ డెలివరీ డేట్ ఈ వారంలోనే కదా, అది కానివ్వండి ముందు. జాగ్రత్తగా ఉండండి.” లేచి నిలబడి చెప్పేడు వెంకీ.


ఆ వీకెండ్ వర్షకి ఏదో విధంగా గడిచింది.

ఆఫీసుకెళ్ళడానికీ వెంకీకి మొహం చూపించడానికీ చెల్లక సోమవారం వర్ష వంట్లో బాగోలేదని శెలవు తీసుకుని ఇంట్లోనే కూర్చుంది, ప్రాజక్ట్ డెలివరీకి అది ఆఖరి వారం అని తెలిసినా. ఆఫీసునుంచి ఎవరైనా ఫోన్ చేస్తారేమో అని చూసింది కానీ ఎవరూ చేయలేదు. మంగళవారం నుంచి ఆఫీసులో పేరుకుపోయిన పనిలో పడి ప్రాజక్ట్ సరిగ్గా అయ్యేసరికి పదమూడో తారీఖు శుక్రవారం మధ్యాహ్నం దాటింది. శుక్రవారం దాకా వెంకీ తన గురించి మరోమాట ఎత్తనందుకు వర్ష ఆ విషయం అక్కడితో మర్చిపోయాడు గాబోలు, ‘హమ్మయ్య! దరిద్రం వదిలిందిరా బాబూ!’ అనుకుంటూ సాయంత్రం ఇంటికొచ్చేసరికి కంపెనీ ఉత్తరం ఎదురుచూస్తోంది.

ఉత్తరం చూసిన వర్షకి, ఆవిడ మొగుడికి నోట మాటరాలేదు, అలా ఎందుకైందో అర్థం కాక. అయితే ప్రాజక్ట్ అయ్యేదాకా తనని ఉంచుకుని అది అయ్యాక సరిగ్గా తనని ఉద్యోగంలోంచి ఎలాంటి ప్లాన్‌తో తీసేసారో తెలిసివచ్చింది. మొగుడు ఏదో అడుగుతూంటే, ఆఫీసులో జరిగిన భాగోతం జైన్‌తో చెప్పని వర్ష మాత్రం, “ఈ తెల్లవాళ్ళింతే, పని ఉన్నంత కాలం మనని ఇక్కడ కూలీల లాగా చూస్తారు. పని అయిపోగానే ఇలాగే ఉద్యోగంలోంచి తీసేస్తారు. అంతా డిస్క్రిమినేషన్!” అంది అక్కసుగా.

కంపెనీ రూల్స్ ప్రకారం మరో నాలుగు వారాలు జీతం వస్తుంది, మెడికల్ ఇన్‌స్యూరెన్స్ కూడా సర్దుతారు. ఈ నాలుగు వారాల్లో వర్ష వందలకొద్దీ అప్లికేషన్లు పంపించింది వేరే ఉద్యోగం కోసం. చివరికి ఉద్యోగం రాలేదు కానీ అది ఇవ్వడానికి ఒక కన్సల్టన్సీ నుంచి ఆఫర్ మాత్రం వచ్చింది నాలుగో వారంలో. అయితే వర్షకి ఉన్న హెచ్-1 వీసా ఆ కంపెనీకి మార్చడానికి మరో మూడు వారాలు పడుతుంది. అలా వర్షాజైనులు ఉద్యోగం పోయిన ఎనిమిదో వారంలో శాన్ రమోన్‌లో దిగేరు.

అలా కాలిఫోర్నియాకు పోవడం బాగా కలిసొచ్చింది ఇద్దరికీ. ఇద్దరికీ ఉద్యోగాలు వెంటవెంటనే దొరికేయి. జీతం ఆరెంకెల్లోకి, హెచ్-1 వీసా గ్రీన్ కార్డులోకి, గ్రీన్ కార్డు సిటిజన్‌షిప్‌గానూ మారితే; రెండు కార్లు, అయిదు బెడ్రూముల ఇల్లు, ఇద్దరు పిల్లలూ ఒకదాని మీద ఒకటి వచ్చి చేరేయి. రెండేళ్ళకోసారి వర్ష మొగుడితోటీ పిల్లల్తోటీ ఇండియా వచ్చి వెళ్తోంది. డబ్బులు చేతుల్లో గలగల్లాడుతూంటే, మేక్ ఇన్ ఇండియా అని విన్నప్పుడల్లా ఒకటే ఆలోచన– ఏదో ఒక పెట్టుబడి పెట్టాలి దేశంలో ఎలాగో ఒకలాగ. రేప్పొద్దున్న అమెరికాలో ఏదైనా అయి ఇండియా వెళ్ళిపోవాల్సొస్తే దేశంలో ఏదైనా ఆధారం ఉండొద్దూ? రియల్ ఎస్టేట్ అంతా మోసం. ఏదైనా అటూ ఇటూ అయితే స్థానబలం కండబలం రెండూ లేవు, కొన్న చోటు కాపాడుకోవడానికి.

తరువాతి ఇండియా ట్రిప్పులో తెలిసొచ్చింది, పెట్టుబడికి ఒక కొత్త అవకాశం. ఆంధ్రప్రదేశ్‌లో పాల వ్యాపారం, పశువుల వ్యాపారం– అందుకు కొన్ని గ్రామాలు దత్తత తీసుకోవడం, ఆ గ్రామాల అభివృద్ధికి తోడ్పడడం, మంచినీళ్ళకి ఒక రివర్స్ ఆస్మాసిస్ పద్ధతిలోనో, ఓజోనైజేషన్ పద్ధతిలోనో ఒక పెద్ద టాంక్, ఇంటింటికీ టాయ్‌లెట్, సోలార్ పానెల్స్– లీన్ సిక్స్ సిగ్మాతో వేస్ట్ అనేది లేకుండా చేస్తున్నారు ఒక చిన్న గ్రూప్. ఇప్పటికప్పుడు పెట్టిన డబ్బులు వెనక్కి రావు కానీ పరో పదేళ్ళలో బాతులు బంగారు గుడ్లు పెట్టడం ఖాయం.

అలా ఇండియాలో దిగినవారంతా ఆ వీకెండ్ ఒక మోడల్ పల్లెటూరికి విజిట్‌కు వచ్చేరు. లీన్ సిక్స్ సిగ్మా అనేది విని ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక ఎన్నారై, సౌదీ అరేబియా నుంచి వచ్చిన మరో డాక్టరూ నోరు వెళ్ళబెట్టారు. వీళ్లని చూసి మిగతా ఎన్నారైలు ఆటోమేటిగ్గా నోరు వెళ్ళబెట్టేసరికి మరోసారి చెప్పబడింది, ‘లీన్ సిక్స్ సిగ్మా’ గురించి. దానికి ఉదాహరణగా అమెరికాలో ఉండే టయోటా లాంటి కొన్ని కంపెనీలు ఈ లీన్ సిక్స్ సిగ్మా అనేది ఎలా అమలు చేస్తున్నారో అన్నీ చెప్పారు. వెళ్ళబెట్టిన నోళ్ళు మరింత పెద్దవయ్యాయి.

ఇదంతా చూస్తే జైన్‌కి గుజరాత్‌లో అమూల్ వారి ప్లాంట్ గుర్తుకొచ్చింది. అదే ఆయన అడిగేలోపుల అక్కడున్నాయన చెప్పేడు, “ఇది గుజరాత్‌లో అమూల్ తరహాలోనే మొదలు పెట్టాం.”

ఉత్సాహంగా అడిగేడు జైన్, “ఇందులో పెట్టుబడులు తీసుకుంటున్నారా ఇప్పుడు?”

“తప్పకుండా. మీటింగులో మాట్లాడే ఆయన అవన్నీ మీకు చెప్తారు.”

మరో గంట అయ్యేక మాట్లాడ్డానికి ఒకాయన వేదిక మీదకొచ్చేడు. ఆయన్ని చూసి వర్ష నోరు వెళ్ళబెట్టింది. వచ్చినవాడు ఒకప్పటి తన పాత మేనేజర్ రామరాజు! ఈయన ఉద్యోగం మానేసి చేసే నిర్వాకం ఈ గొడ్ల చాకిరీనా!

రామరాజు ఒకప్పుడు తాను ఎలా హైద్రాబాదులో ఐ.టీ. మేనేజర్ ఉద్యోగం చేసింది, అందులోని ఒత్తిళ్ళను ఎలా భరించిందీ చెప్పి తను ఇందులోకి ఎందుకొచ్చేడో చెప్పేడు– తన వల్ల పదిమంది బాగుపడుతున్నారు, ఇక్కడ తన పీకమీద కత్తి అనే ప్రశ్నేలేదు. డబ్బుకన్నా ముఖ్యంగా మనసుకి నచ్చిన మంచి పని చేస్తున్నందుకు ఆనందం, మనసుకు తృప్తి.

రామరాజు మాట్లాడ్డం అయిన తర్వాత అసలు ఇదంతా మొదలుపెట్టి రామరాజుని చేరదీసిన పెద్దమనిషి ఆందర్నీ కలుసుకోవడానికొచ్చాడు. తెల్లటి పంచె కట్టుకుని, ఒక ఖద్దరు చొక్కా, ఆకుచెప్పులతో సాదాగా ఉన్నాడు ఆ మనిషి. చూసిన వర్ష మరోసారి కళ్ళు పెద్దవి చేసుకుని నోరు వెళ్ళబెట్టింది. ఈ బైతు తనని ఉద్యోగంలోంచి తీసేసిన వెంకీ అనబడే దుబ్బుల వెంకన్న! ఈ రామరాజు, ఈ వెంకీ మళ్ళీ ఒకరికొకరు ఎలా తారసబడ్డారో? వార్టన్ బిజినెస్ స్కూల్‌లో ఎం.బి.ఏ. చేశానని చెప్పాడు కదూ వెంకీ తనతో? అంతా చేసి మళ్ళీ పేరుకు తగ్గట్టే గొడ్లు కాసుకునే పనికొచ్చాడు చివరికి!

ఆలోచనలని తెగ్గొడుతూ ఇంతలో రామరాజు పలకరించేడు, “హల్లో, వర్షా! నైస్ సర్‌ప్రైజ్! ఇప్పుడెక్కడ ఉంటున్నారు?” ఆ పక్కనే నుంచున్న వెంకీ వర్షాని చూడగానే గుర్తు పట్టినట్టున్నాడు, పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు. కడుపులో దేవినట్టయింది వర్షకి ఇద్దర్నీ చూసి.

“అమెరికాలోనే ఉంటున్నాను. బే ఏరియాలో. ఇల్లు కొనుక్కుని అక్కడే సెటిల్ అయ్యాం హేపీగా,” గర్వంగా చెప్పింది వర్ష. “అవునూ, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు ఈ పల్లెటూళ్ళో ఈ గొడ్లు, ఈ పేడా పిడకల మధ్య?”

“నేను ఉద్యోగం మారేక మరోచోట కొన్నేళ్ళు ఉద్యోగం చేశాను. ఇంతలో వెంకన్న గురించి తెలిసింది, ఆయన వెనక్కి వచ్చేసి ఈ పని మొదలెట్టాడని. నాకు కూడా అది నచ్చడంతో ఆయనతో మాట్లాడి ఉద్యోగం మానేసి ఇక్కడకి వచ్చేశాను. ఎంతకాలం కోడ్ కూలీలుగా బతుకుతాం? ఇప్పుడే హాయిగా ఉన్నాను. గుర్తుందా, నేను ఈయనకి ఉద్యోగం ఇద్దామన్నాను ఓ రోజు? కానీ ఈ కుర్రాడు నాకే ఉద్యోగం ఇచ్చాడు. ఇక్కడ ఉద్యోగం పోతుందనే బెంగ లేదు. అన్నింటికన్నా చేసేపని మంచిది, మనసుకి నచ్చినది, నలుగురూ బాగుపడేది, టెన్షనూ, టార్చరూ లేనిది.”

వర్షకి పదునైన బాకు గుండెల్లో దింపినట్టయింది తనని కోడ్ కూలీ అన్నందుకు. అది మొహం మీద చూపిస్తూ, “కోడ్ కూలీ అని వెక్కిరించడం దేనికీ? మీరు చేసే పని మాత్రం బాగుందా? మీరిద్దరూ అసలు ఆ చదువులు చదవకుండా కూడా ఈ పనులు చేయవచ్చు. ఉద్యోగం పోతే వేరే ఉద్యోగం వెతుక్కోలేక, ఆ ఎన్వైరాన్‌మెంట్‌లో సక్సెస్ కాలేక, ఖర్మ కాలి పల్లెటూళ్ళల్లో ఇలాంటి పనులు చేయడం. అది పైకి కనిపించకుండా మా లాంటి వాళ్ళని కోడ్ కూలీలని వెక్కిరిస్తూనే మా దగ్గిరనుంచి డాలర్లు లాగుదామని చూడ్డం! బాగుంది మీ దేశసేవ!” అక్కసుగా అంది వర్ష.

ఒకళ్ళ ముఖాలొకరు చూసుకొని పెద్దగా నవ్వి సరే అలాగేనంటూ వెళ్ళిపోయేరు వెంకీ, రామరాజూ.

“హనీ, ఇన్వెస్ట్ కరియే? బధా సారుమ్ లగే చే!” అన్నాడు జైన్ ఫార్మ్ అంతా తిరిగి అప్పుడే అటుగా వచ్చి.

“ఈ రామరాజు, వెంకీ ఇద్దరూ నమ్మదగ్గవారు కాదు. మనకొద్దు ఈ పెట్టుబడి.” మొగుడితో చెప్తూ కారువైపు నడిచింది వర్షా జైన్.