తెరచాటు-వులు: 5. కో హమ్ – నేనెవరు?

న-అసత్

ప్రేమ ఒక ఒంటరి ఉద్వేగం కాదు, అది ఒక సంయుక్త భావం. హరివిల్లులో ఎన్ని రంగులు ఉంటాయో, ముంత మసాలాలో ఎన్ని ముడి సరుకులు ఉంటాయో, అలాగే ప్రేమలో కూడా. కోపం, కనికరం, ఆనందం, ఆవేదన, కసి, అసూయ వంటి వివిధ వైరుద్ధ్య భావాల వింత సమ్మేళనమే ప్రేమ. సందర్భాన్ని బట్టి ప్రేమ అర్థం మారుతూ ఉంటుంది. ఒకరితో ప్రేమలో పడే సమయంలో దాని అర్థం ఇష్టంగానో, మోహంగానో మారుతుంది. అదే మనిషితో తెగతెంపులు చేసుకునేటప్పుడు ప్రేమ త్యాగమైపోతుంది (చేతగానితనం కూడా). ఇలాగే సమయం సరిచూసుకుని, సందర్భాన్ని బేరీజు వేసుకుని ఊసరవెల్లిలా రంగులు మార్చే సంయుక్త భావం మరొకటి ఉంది. ప్రేమ నిజజీవితానికి వర్తిస్తే, ఈ పదం ఊహాలోకానికే పరిమితం. అదే, ఎంటర్‌టైన్‌మెంట్ (Entertainment). తెలుగు తర్జుమాకి కొద్దిగా ఇబ్బంది పడాలి కానీ ‘అలరింపు’ అన్న మాట ఎంటర్‌టైన్‌మెంట్‌కి కాస్త దగ్గరగా చేరుతుంది. ఈ పదానికి సరైన నిర్వచనం, అర్థం, భావసందర్భం నిర్ధారించడం న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతానికి విరుద్ధమైన మరో ప్రతిపాదన చేయడం లాంటిది. కురుక్షేత్రంలో కృష్ణుడి విశ్వరూపానికి కళ్ళు బైర్లుకమ్మి దిమ్మతిరిగిన అర్జునుడు ‘ప్రభో కృష్ణా! ఈ విఠలాచార్య వేషాలు వద్దు. నాకు తెలిసిన రామారావుగానో, కనీసం కాంతారావుగానో అన్నా కనిపించు, కాస్త అర్థమై ఛస్తుంది’ అని కంగారుపడి బావురుమన్నట్టు, ఎంటర్‌టైన్‌మెంట్ అన్న పదపు పరిధి తెలుగు వాణిజ్య సినీవిపణికే పరిమితం చేస్తేగాని అర్థంచేసుకునే ప్రయత్నం చేయలేము. (‘ఏమిటో అమిరికా కామిడీ, అర్థం ఐతేనే గానీ నవ్వలేం!’). స్వర్ణకమలం సినిమాలో ఇలాగే ఒక పాత్ర వేష్ఠపడుతుంది- ‘కమ్మరి అంటే అర్థం అవుతుంది, కుమ్మరి అంటే అర్థం అవుతుంది, ఊరికెనే ఘనాపాఠి అంటే ఏం తెలుస్తుందండీ?’ అని. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ అంటే హాస్యమా, ఏక్షనా, తీక్షణా, ఏడుపా, ఏవగింపా, శృంగారమా, శిరోభారమా? ప్రేమ లాగానే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇదమిత్థంగా వివరించలేం. తాత్వికంగా చెప్పాలంటే, ఎంటర్‌టైన్‌మెంట్ అనేది నీరు లాంటిది. పాత్రను బట్టి దాని స్వరూపం, స్వభావం మారుతూ ఉంటుంది.

ప్రస్తుతానికి, మన తెలుగువారికి సుపరిచితమైన హాస్యం, పాటలు, సీనులే ఎంటర్‌టైన్‌మెంట్ అని అనుకుందాం. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే సినిమా విజయానికి ఢోకా ఉండదు. అంటే కడుపుబ్బ నవ్వులు, కంటికి నిండుగా కనిపించే ఆహార్యాలు, ఆకారాలు, వాళ్ళకి అలంకారాలు, వీనుల విందైన పాటలు- ఇవ్వన్నీ విజయానికి సోపానాలు అని తెలిస్తే ‘పుట్టింటికి రా చెల్లీ’, ‘పుట్టింటి పట్టుచీర’ వంటి కన్నీళ్ళతో కర్చీఫులు తడిసిపోయే మహోజ్వల మహిళా చిత్రాలు బాక్సాఫీసు దగ్గర దుమారం ఎలా లేపాయి? ఇందులో భూతద్దం వేసుకుని చూసినా పైననుకున్న ఎంటర్‌టైన్‌మెంట్ ఛాయలు పొరపాటున కూడ కనపడవు. ఈ చిత్రాలు ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధాంతానికి ఆక్షేపణలా? లేక ఎంటర్‌టైన్‌మెంట్ అన్న పదానికి ఇంకా విస్తరణ అవసరమా? నాసదీయ సూక్తంలో భగవంతుడి పుట్టుపూర్వోత్తరాల గురించి వేదకారుడు సందేహం వెలిబుచ్చినట్టు, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ అన్న పదాన్ని అసలు అర్థం చేసుకోశక్యమా?

ప్లేటు మీల్సు

తెలుగు చలనచిత్రం ఎంటర్‌టైన్‌మెంట్ దిశగా పరిణమించడానికి ఆశ్చర్యకరంగా ఆట్టే కాలం పట్టలేదు. 50వ దశకం మొదలు 90ల వరకు నిర్మాతలను ఒక కాపు కాసిన కుటుంబ కథాచిత్రాల ఆలోచనాధోరణి కొత్త శతాబ్దం తిరిగే సరికి చెంగున ఒక్క కుప్పిగంతు వేసి వినోదప్రధాన చిత్రాల వైపు దృష్టి సారించడం మొదలుపెట్టింది. సినిమా గతిని మలుపు తిప్పిన ప్రతి నిర్ణయం (కలర్, మల్టీస్టారర్, స్కోప్, 3డి) వ్యాపారాత్మకమైనదే. ఇది షో బిజినెస్. ఇందులో బిజినెస్ లేకుండా షో లేదు. ఉంటుంది, ఉండచ్చు అనుకోవడం అవివేకమే.

ఎక్కడో, కొండొకచో ఒక నిర్మాత ఉండి ఉండవచ్చు- డబ్బు పూర్తిగా పోయినా ఫర్వాలేదు, పేరు మాత్రం రావాలి, మిగిలిపోవాలి అని. (ముళ్ళపూడి గారి జోకు: “మాట నిలబడాలి అయ్యా! వెధవ డబ్బుదేముంది, చచ్చేటప్పుడు మూటకట్టుకు పోతామా! హరిశ్చంద్రుడిని చూడు? పేరు మిగిలిపోలా?”, “సర్లే చాల్లెద్దూ! హరిశ్చంద్రుడు మాత్రం మాటని మూటగట్టుకు పోయాడా?”) అలాంటి నిర్మాత కూడా ఒకటి రెండు సార్లు చేతులు కాలినాక బాక్సాఫీసుల గలగలల ఆకులను పట్టుకోవడం మానలేదు. (ఉదా: ఆదుర్తి సుబ్బారావుగారి చక్రవర్తి చిత్ర బేనర్ మీద తీసిన సుడిగుండాలు, మరో ప్రపంచం- రెండూ ఆర్థిక కళాఖండాలే!)

అందుకని, ఈ ధనమా, గుణమా వాదన పక్కకు నెట్టి, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌గారి గుణపాఠం నుంచి ‘మనిషిని అంచనా వేసే ముందు వాడి వేషానికి ప్రాధాన్యత ఇచ్చి తీరుతాం’ అన్న సారాంశం గ్రహించి ముందుకు సాగుదాం. కుటుంబ కథల నించి ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎందుకో సూక్షంలో చెప్పాలంటే- గ్లోబలైజేషన్, శాటిలైట్ డిష్. కొత్త శతాబ్ది తొలి దశల్లో తెలుగు రాష్ట్రాలలోకి పెద్ద పళ్ళెం వచ్చి అప్పటికి ఒక నాలుగైదు యేళ్ళు దాటుతోంది. సీరియళ్ళ రణగొణ ధ్వనులు అప్పుడే నెమ్మదిగా వినపడుతున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న నిత్య స్లంప్ వల్ల సినిమాల జోరు కాస్త తగ్గింది. 80-90ల్లో యేటికి 100-150 వున్న చిత్రాల జోరు, 2000 వచ్చేసరికి 80-90కి పడిపోయింది. థియేటర్లు మూతబడి కళ్యాణ మండపాలుగా, కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్పిడి కావటం ఇంకా ఊపందుకోలేదు. ఒక రకమైన స్తబ్ద వాతావరణం ఏర్పడి ఉంది.

మొదటి అడుగు- గవర్నమెంటు వారికి అర్జీలు పెట్టుకుని థియేటర్ యాజమాన్యాలు టికెట్ల ధరలు పెంచడం. సినిమాలు తక్కువై, ఆ వచ్చేవి కాస్త కూడా చిటికెలో అటకెక్కేస్తుంటే వచ్చి చూసేవాడు లేక, ఖర్మకాలి లోపలికి వచ్చిన వాడి నడ్డి మీదే మరింత భారం వేయడం తప్ప మార్గం లేకపోయిందనుకున్నారు థియేటర్ వాళ్ళు. నిజానికి ఇక్కడ వాళ్ళనీ అనేందుకు ఏమీ లేదు. సినిమా నడిచినా నడవకపోయినా బొమ్మ ఆడించక తప్పదు– కరెంటు, జీతాలు, ఇత్యాదులు. రేట్లు పెరుగుదలతో నెలకొకసారి నిత్యావసరాలలో సినిమా ఖర్చు కూడా తప్పనిసరి అనుకున్న సగటు తెలుగు ప్రేక్షకుడు సినిమాని నిత్యావసరం కేటగరీ నించి పక్కకి తప్పించి, వీలు-వెసులుబాటు ఖాతా కిందకి అమెండుమెంటు, అడ్జస్టుమెంటు చేసుకున్నాడు. ఇక మిగిలింది ఎవరు? పనీపాటా లేనివారు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాగో ఓలాగా, సినిమా హాల్లోని ఏసీ గాలి పీలిస్తే తప్ప ఆ రోజు గడవదనుకునేవారు. క్లుప్తంగా చెప్పాలంటే యూత్/ మాస్. అంటే దిగువ తరగతివారు: ఒకరు పరిపక్వత పరంగా, మరొకరు ఆర్థికంగా. ఇప్పుడు వినిపించే ఈ మాస్ భజన అందుకే. ఎప్పుడూ వచ్చేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి నచ్చినట్టే తీయడం సమంజసం, మీదు మిక్కిలి వ్యాపారాత్మకం. ఎకానమిస్టుని అడిగితే, ప్రస్తుత సినిమా పరిస్థితికి కారణం ఫ్రీ మార్కెట్ అంటాడు. సబబే కదా?

ఎందుకు సరే! అసలేమిటి?

అప్పటి వరకూ అన్నీ కప్పుకు నటించిన విద్యాబాలన్ డర్టీ పిక్చర్ సినిమాలో ఒక్కసారి విప్పుకుని చెప్పేసరికి, సినీజనాలంతా నోళ్ళు వెళ్ళబెట్టుకుని ‘మరే!’ అనుకున్నారు- సినిమా అంటే, ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్- అని. పనిలో పనిగా, ఎవరన్నా అడిగుండాల్సింది, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఏమిటో కూడా చెప్పి కాస్త పుణ్యం కట్టుకో తల్లీ/తండ్రీ అని. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మునపటి దర్శక/నిర్మాతలు గుక్క తిప్పుకోకుండా చెప్పిన వాక్యం– ఏక్షన్, సెంటిమెంటు, హాస్యంతో పాటు యువత, మహిళలకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి మా చిత్రంలో– సందేహాలకు ఏ మాత్రం తావు రానివ్వకుండా ఉండేది. ఇది విని కూడా ఏ హారర్ చిత్రమో, లేక పొలిటికల్, సై-ఫై థ్రిల్లరో అనుకుని ప్రేక్షకుడు లోపలికి వెళితే అది వారి పూర్వ కర్మ ప్రారబ్దం అని సరిపెట్టుకోవడమే. అదే దర్శక/నిర్మాతలు నేటి రోజుల్లో, ‘మా సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ సమృద్ధిగా ఉంటుంది.’ అని చెబితే, సమాధానాలు తక్కువ, సందేహాలు ఎక్కువ కలుగుతాయి. ప్రేక్షకుడిని ఏది అలరిస్తుంది? అన్న ప్రశ్న, ఇప్పటి వరకు మీరు విన్న పాటల్లో మీకే పాటంటే ఇష్టం? అని అడిగినట్టు ఉంటుంది.

ఎంటర్‌టైన్‌మెంట్ అనేది పూర్తిగా కాంటెక్స్చువల్ (contextual), అంటే సందర్భాన్ని బట్టి ఉండేది. ముసురు పట్టినప్పుడు వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినాలనిపించినట్లు, సాలోచనగా ఉన్నప్పుడు సౌమ్యమైన చిత్రం చూడాలనిపిస్తుంది. అప్పటికదే ఎంటర్‌టైన్‌మెంట్. మరికొన్ని సందర్భాల్లో విషాదం, మరోసారి హాస్యం, ఇంకోసారి ఒళ్ళు గగుర్పొడిచే పోరాటాలు, వగైరాలు. ఇప్పటి నిర్మాత/ దర్శక/ రచయితల ముందున్న శేష ప్రశ్నలు రెండు: 1. ఏ సినిమా తీయడం, 2. తీసిన సినిమాని ఎలా అమ్మడం? (మార్కెట్/ప్రచారం చేయడం.) తీయడం విషయానికి వస్తే, వచ్చే వాళ్ళు (సినిమా మరీ గొప్పగా ఉండి ఎలా అయినా చూసి తీరాలి అన్న టాక్ వస్తే తప్ప) మాస్ కాబట్టి, అంటే ఎలాగూ అవగాహనా వైకల్యం ఉన్నవాళ్ళే కాబట్టి, కాలక్షేపం బఠానీలు ఇస్తే చాలు, సంతోషపడిపోతారు- అన్నది వ్యాపారపరంగా క్షేమకరమైన ఆలోచన. కాలక్షేపంలో హాస్యం గొంతులోకి జారిపోయినంత సుళువుగా మరే రసమూ దిగదు కాబట్టి, దృష్టి అంతా హాస్యం మీదే పెట్టడం జరుగుతోంది. క్రమక్షీణలాభ సిద్ధాంతం (Law of diminishing returns) అనే ఆర్థిక సూత్రం, తిండికీ హాస్యానికీ అతికినట్టుగా మరిక దేనికీ వర్తించదు. హాస్యబ్రహ్మగా శ్లాఘించబడే జంధ్యాల సినిమాలు చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. ఆయన మొదటి హాస్య సినిమా శ్రీవారికి ప్రేమలేఖ చరిత్ర సృష్టించింది. అందులో ప్రతి పాత్రకీ ఒక పిచ్చి- మాట్లాడే తీరులో, ప్రవర్తించే పద్ధతిలో, ఇష్టాయిష్టాలలో. అటువంటి అమరిక చూడడం మొదటిసారి అవడంతో, మంచి కథ కారణాన, చక్కని సంగీత ప్రేరణ తోడై, ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక జంధ్యాలని ఆ ‘పిచ్చి’ పిచ్చి వదలలేదు. చివరి సినిమా వరకూ రకరకాల పిచ్చితనాలను తన పాత్రలకు ఆపాదిస్తూ, ఇక జంధ్యాల సినిమా అంటే, వెకిలి-వైకల్యాల సమ్మేళనాలుగా పేరు తెచ్చుకున్నాడు/చెరుచుకున్నాడు. ఉన్న అన్ని రసాల్లోకి హాస్యం అత్యంత కష్టతరం. తెలుగు సినిమాల వరకూ అదే పెద్ద పారడాక్స్. ఫలం ఎంత ఎక్కువగా ఉన్నా రిస్క్ ఎక్కువగా ఉంటే అది వ్యాపారం అవదు, జూదం అవుతుంది. మరి తనను వ్యాపారం అనుకుంటున్న సినిమారంగం హాస్యాన్ని అంత ఎక్కువ ఎందుకు నమ్ముకుంటుందో మరో బదులు చిక్కని ప్రశ్న.

మిగతా భాషల సినిమాలతో పోలిస్తే తెలుగు సినిమాలు హాస్యానికిచ్చిన ప్రాధాన్యత మరెక్కడా కనపడదు. ఆ మధ్య ఇండియా టుడే పత్రిక ప్రతి పరిశ్రమని సర్వే చేసి ‘ఇప్పటి వరకూ మీ భాషలో వచ్చిన అతి గొప్ప చిత్రం ఏమిట’ని అడిగితే, తెలుగులో మాయాబజార్ సినిమాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. (మల్లీశ్వరి, శంకరాభరణం, మేఘ సందేశం, తదితరాలు ఉండగానే!) సహజంగా గొప్ప అన్న మాట హాస్యం సందర్భంలో వాడరు. బావుంది/ అద్భుతం/ పొట్ట చెక్కలు/ హాయిగా/ అమ్మయ్య/ చాలా కాలానికి– హాస్య చిత్రాలకు సంబంధించి ఇలాంటి పదాలతో పట్టంగట్టటం ఆనవాయితీ గాని, అవసరం/ గొప్ప/ సంస్కృతి– ఇలాంటి బరువైన పదాల వినియోగం హాస్యం విషయంలో వాడడంలేదు. మరి ఆ సర్వేలో గొప్ప చిత్రం ఏది అన్న దానికి నూటికి డెబ్భై మంది టపీమని మాయబజార్ సినిమాని గుర్తు చేసుకున్నారంటే తెలుగువారికి హాస్యం పట్ల ఉన్న అనురక్తిని తెలియజేస్తుంది. అది ఇప్పటిది కాదు, 50ల నించి వచ్చిందే. సినిమా అంటే అన్నీ మర్చిపోయి తెర ముందు కాస్త కాలక్షేపం అన్న భావన తాతల కాలం నించీ వస్తున్నదే. అందుకనే, ఈ తరం చిత్రబ్రహ్మలని సినిమా అంటే హాస్యం మాత్రమే, అది హాస్య ప్రధాన మాధ్యమమే, చివరికి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే హాస్యమే అన్న నిర్ధారణకు రావడాన్ని ఏ మాత్రం తప్పు పట్టలేం. మేము అదే చూశాం, మాకు అదే చెప్పారు, అవే ఎక్కువ ఆడాయి/ ఆడుతున్నాయి, కనుక మేము అవే తీస్తాం– తిప్పికొట్టలేని తర్కం అది.

ఇప్పుడు, ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఏమిటి? అన్న ప్రశ్న పాకాన పడుతుంది. అది ముదిరి, అసలు హాస్యం అంటే ఏమిటి? అవుతుంది. వేటూరి రాసిన, ‘అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, ఏ పాట నే పాడను’ పాటల్లే, అరటి తొక్క మీద కాలేసి జారిపడినా హాస్యమే, ప్రాస డవిలాగుని ఆపకుండా దంచికొట్టినా హాస్యమే, కాని సినీ పరిభాషలో అసలు హాస్యమంటే ఏమిటి?

జవాబు: సెన్సిబిలిటీ.

(వచ్చే భాగంలో – సెన్స్ & సెన్సిబిలిటీ.)