ఇంటికి మళ్లు

1.

బట్టల సబ్బు రంగు
ఆకాశం కింద
అంతులేకుండా
గొణుగుతోంది
కోన

అరచేతికి కాసిన
కాయల చుట్టూ
గుయ్యిమని
చికాకు పురుగు.

గుంట కన్ను
చికిలించి
రారామ్మని
లాగే పోకిరి
లోయ

చందమామ
పొట్టలోకి
జారిపోతో
గబ్బిలాయి
నల్ల చుక్క

కసరెక్కింది
గాలి
గాల్లో ధూపంలా
తేలబోయే దేహం.

2.

అంతలోనే
ఘల్లుమన్నవి
ఎండు కాయలు
గెంతుకొచ్చాయి
లేగ కాళ్ళు

అమ్మా! చూడవూ?

చిట్టి గుప్పిట
సీతాకోకచిలక
మెదల్లేదది
ప్రాణం లేదు

ఎగర్లేదే?
అల్లల్లాడుతూ
వెల్లకిల్లా
బబ్బుందేం
నేల పైనా?

ఇదీ ఇదీ
ఎగరదూ అమ్మ?
పెద్దగా ఏడ్చింది
తన గుప్పిటంతే
పాప గుండె.

అమ్మా?
ఎగరదూ?

3.

ఊగి ఊగి
కొండపూలు
అలసిపోతే

భుజం మీదే
నిద్రపోయిన
పాప బుగ్గకి
బావుందే
రెక్క రంగు.

మబ్బులన్నీ
చెదిరిపోతే
సంచి కోసి
జల్లినారో
మినుకుమినుకు
తారలేవో

మసక వెన్నెల
మెరుస్తున్నవి
బురద దారీ
కొండవాలు

దూరాన
ఎదురుచూసే
ఇంటి గడప
బుడ్డి దీపం.