గడి-నుడి 6 సమాధానాలు

ఈసారి చాలా తొందరగా తప్పుల్లేని పరిష్కారాలు వచ్చాయి. అన్ని సమాధానాలూ సరిగా పంపిన ఈ నలుగురు విజేతలకు అభినందనలు:

 1. పం.గో.కృ.రావు
 2. పి. సి. రాములు
 3. వేదుల సుభద్ర
 4. టి. ఎస్. రాధిక

అడ్డం

 1. ఎటు చూసినా ప్రచలాయితమే
  సమాధానం: కునుకు. ప్రచలాయితం అంటే కునుకు. అయత నియతుల కథలో, వాళ్ళు ‘ఆసీన ప్రచలాయిత’మైన లేకుండా చదువుకుంటారని రామకృష్ణ కవి అంటాడు. అంటే కూర్చొని కునుకుపాటు లేకుండా పాఠాలను చదువుతారని.
 2. “మభసమ” వృత్తంగా అల్లుకుంటే మబ్భుల దండా?
  సమాధానం: జలధారమాలా. జలధారమాలా అనేది ఛందస్సులో వచ్చే ఒక వృత్తం పేరు. దాని గణాలు మ-భ-స-మ
 3. పొలంగట్టు చుట్టూతా ఊక పడుంది చూడు
  సమాధానం: పొట్టు
 4. ఇది ఆడవాళ్ల కేశపాశానికి ఉరి కాదు, ఆభరణం
  సమాధానం: జడకుచ్చు. ‘జడకు + ఉచ్చు’ కాదు, ‘జడ కుచ్చు’ అని.
 5. పోగొట్టుకొనే వ్రతం దేనికి, ముందే వద్దంటే సరి!
  సమాధానం: నోము. దీనికి ‘పోగొట్టు’ అనే అర్థం కూడా ఉంది.
 6. వారితో సహా వస్తే ప్రయాణానికి బండికట్టవచ్చు
  సమాధానం: సవారి. ‘స-వారి’ అంటే వారితో సహా అని కదా.
 7. తల్లీ భార్యా పెనవేసుకుపోవడం ఏమాత్రం ఒప్పుకోము అధ్యక్షా!
  సమాధానం: అసమ్మతి. అమ్మ + సతి పెనవేసుకు పోయాయి.
 8. … ? నిజమా?
  సమాధానం: కలా
 9. అన్న, ఇది కాళింగుని పడగలపై కప్పిన రత్నమయ్య!
  సమాధానం: పుష్యరాగము. ‘కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము’ అని అన్నమయ్య కీర్తనలో వస్తుంది.
 10. ఒకపరి మే నెల సర్దుకుంటే రాహుదర్శనమే!
  సమాధానం: నెలమేపరి. నెల అంటే చంద్రుడు. అతన్ని తినేవాడు కనుక నెలమేపరి అంటే రాహువు.
 11. సగం చిమ్మిన విషం అపసవ్యంగా కట్టిన చీరా?
  సమాధానం: కాకో. కాకోలము అంటే విషం.
 12. విశేషంగా గురుడు తిరిగితే విషం ఏమీ చెయ్యలేదు
  సమాధానం: విరుగుడు
 13. ఒక విధంగా చేయి తడబడింది
  సమాధానం: రకము
 14. ఒకానొక సిద్ధి పొందడం
  సమాధానం: ప్రాప్తి. అష్టసిద్ధులలో ప్రాప్తి ఒకటి.
 15. అమ్మ మావూళ్ళో ఉంటే ఎంత ఆరామమో!
  సమాధానం: భీమవరం. పంచారామాలలో భీమవరం ఒకటి. ఆ ఊరి దేవత పేరు మావూళ్ళమ్మ.
 16. రెడ్డిగారి ఆస్పత్రిలో ఆడే ఆట
  సమాధానం: పోలో. రెడ్డిగారి ఆసుపత్రి అపోలో.
 17. Change కావాలంటే దాశరథి భగవంతులని అడగాల్సిందే
  సమాధానం: చిల్లర దేవుళ్ళు. దాశరథి రంగాచార్యులు గారి ప్రసిద్ధ రచన చిల్లర దేవుళ్ళు
 18. మీ విధేయుడు ఇట్లు వచ్చి వెళ్లమంటున్నాడు
  సమాధానం: భరాగో. పూర్తి పేరు భమిడిపాటి రామగోపాలం, ఆయన ప్రసిద్ధ రచన ‘ఇట్లు మీ విధేయుడు’

నిలువు

 1. దర్జీ చీమ చేసే పని
  సమాధానం: కుట్టు
 2. ఆగ్రహం తన మహత్తుని కోల్పోయి చెట్టయి పుట్టింది.
  సమాధానం: కుజము. అంటే చెట్టు. ‘ఆగ్రహం’ అంటే ‘ఆ గ్రహం’. ఆ గ్రహం ‘కుజుడు’. కుజుడు మహత్ వాచకం. వ్యాకరణంలో పురుషులను సూచించే పదాన్ని మహత్ వాచకం అనీ, స్త్రీలను సూచించే పదాన్ని మహతీ వాచకం అనీ, ఇతర ప్రాణులనూ వస్తువులనూ సూచించే పదాన్ని ఆమహత్ వాచకం అనీ అంటారు. ఇక్కడ ‘కుజుడు’ తన మహత్తును కోల్పోవడం అంటే, మహత్ వాచకం ఆమహత్ వాచకంగా మారడం. అలా మారితే వచ్చే పదం ‘కుజము’.
 3. తోక తెగిన కుక్క, 2 నిలువులో కనిపిస్తుంది
  సమాధానం: జకు. జకుటము అంటే కుక్క అనే అర్థం ఉంది.
 4. సిరిమల్లె చెట్టుకింద తెలంగాణ లక్ష్మి
  సమాధానం: లచ్చుమమ్మ. ‘సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో’ అనేది గద్దర్ పాట.
 5. నందమూరి గోల చేస్తే అది టూకీగా రక్తభరితసమరమే
  సమాధానం: రభస. ‘ర’క్త ‘భ’రిత ‘స’మరం లో మొదటి అక్షరాలు కలిపితే వచ్చేది ‘రభస’. ఇది జూనియర్ ఎన్. టి. ఆర్. నటించిన ఒక సినిమా పేరు.
 6. మూడు జంటలు, మూడు మత్తులు, మంచి పాట
  సమాధానం: లాహిరి లాహిరి లాహిరిలో. లాహిరి అంటే మత్తు.
 7. ముంబాయి తారలని మనం దిగుమతి చేసుకోడం దీని వల్లనా!
  సమాధానం: పొరుగింటి పుల్ల కూర రుచి.
 8. మాకెవరూ వద్దని ముద్దుగా ముద్దరేసే మాటా?
  సమాధానం: నోటా. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే, ఓటు వేసేటప్పుడు ‘NOTA’ (అంటే None Of The Above) గుర్తుపై ముద్ర వెయ్యవచ్చు.
 9. 10 అడ్డం నడుం విరగ్గొట్టడమే కరెక్టు
  సమాధానం: సరి
 10. మధ్య చెదిరిన బొట్టు
  సమాధానం: తికలము
 11. దీనికి ఎంగిలి ఉండదంటావా తాతాచార్లూ?!
  సమాధానం: పొగకోవి. ‘పొగకోవికి సతిమోవికి అగణితముగ ఊరబావి కమృతమునకున్ తగ నుచ్చిష్టము లేదని ఖగవాహనుతోడ కాలకంఠుడు పలికెన్’ అనే పద్యం ‘తాతాచారి కథలు’ అనే పుస్తకంలోది. దీనినే కాస్త మార్చి ‘పొగచుట్టకు సతిమోవికి’ అని వెంకటేశం చేత గురజాడ వారు అనిపించారు.
 12. గణితజ్ఞుడు గేబ్రియల్ తిరగబడితే మంచిదా?
  సమాధానం: లామే. లామే గేబ్రియల్ అనే అతను ఒక గణిత శాస్త్రవేత్త.
 13. పున్నమి చంద్రుని ఆగమనమా?
  సమాధానం: రాకా. పున్నమి చంద్రుని కళ పేరు ‘రాకా’.
 14. కాలు విరిగిన కుంటివాని భయం
  సమాధానం: పంగువు అంటే కుంటివాడు. పంగు అంటే భయం.
 15. భయం లేనివాడు కదా, ఎందుకలా తల్లడిల్లి చెల్లాచెదరయ్యాడు?
  సమాధానం: రుఅభీవు. అభీరువు అంటే భయం లేనివాడు.
 16. విన్నపం మొదలు మరిచిపోతే గుర్తుకొస్తుంది
  సమాధానం: జ్ఞప్తి. విజ్ఞప్తి అంటే విన్నపం.
 17. ఒక ప్రబంధంలోని అక్కగారు దీనికోసం ఏడ్చారు
  సమాధానం: ముక్కెర. ఆ ప్రబంధం తెనాలి రామకృష్ణకవి రచించిన పాండురంగమాహాత్మ్యం. ఆ అక్కగారు నిగమశర్మ అక్కగారు.
 18. తుదిలేని మొదలు
  సమాధానం: ప్రారంభ.
 19. పొలాల వైపుకు తిరుగు
  సమాధానం: మళ్ళు.
 20. వెళ్ళమని రెండు భాషల్లో చెప్పినా పిల్లలు కదలకుండా చూస్తారు
  సమాధానం: పోగో