పెంపకపు మమకారం: కాళీపట్నం రామారావు కథ గురించి

(పెంపకపు మమకారం – పిడిఎఫ్)

సుమారు అరవై ఏళ్ల క్రితం కథ. కూటికీ గూడుకూ లోపం లేని ఒక అగ్ర వర్ణపు మధ్యతరగతి సంసారపు కథ. దీనిని ఈనాటి పాఠకులు చదివి తెలుసుకోగలిగేది ఏదైనా ఉందా అనేది ప్రశ్న. ఆ మాట కొస్తే ఏ పాత కథలనైనా అసలు మనం ఎందుకు చదవడం? ఉత్తమ సాహిత్యం ప్రసాదించే రసానందం కోసం అనేది నిర్వివాదంగా అందరం అంగీకరించే విషయం. అది కాక ఆనాటి సమాజ స్థితిగతుల్ని తెలుసుకోవడం అన్నది ఒక ముఖ్య ప్రయోజనం. ఏయే దారుల్లో పయనించి ఈనాడు ఇక్కడికి చేరామో వాటి చిహ్నాలు మనకు ఆ పాత రచనల్లో లభిస్తాయి. కేవలం గతాన్ని తెలుసుకోవడమే కాక ఆ రచనలని చదవడం వల్ల కలిగే అదనపు ప్రయోజనాలేమిటన్న ప్రశ్నకు, పెంపకపు మమకారం కథను చదివి అర్థంచేసుకునే క్రమంలో సమాధానం దొరికినట్టయింది.

ఉదాహరణకి– ఈతరం వారికి పరిచయం లేకపోవచ్చు కాని, అర్ధ శతాబ్దం పూర్వం, వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో, ఉమ్మడి సంసారాల్లో పెళ్ళైన కొడుకులూ కూతుళ్ళూ ఇళ్ళలోనే ఉండడం; వారి స్వంత జీవితాలు వారికేర్పాటు కాకపోవడం; అది అనేక కుటుంబ సమస్యలకు దారి తియ్యడం సర్వసాధారణంగా ఉండేది. ఆ చిక్కులన్నిటినీ ఒక చిన్న వాక్యంలో పొందుపరిచి ఈ కథలో ఒక పాత్ర ద్వారా చెప్పిస్తారు రచయిత- (పెళ్ళైన) పిల్లను ఇంట్లో పెట్టుకోకూడదన్న జ్ఞానం మీ అమ్మకుండాలి- అంటూ. సమాజశాస్త్రాలను మించి సజీవ పాత్రల ముఖతా మనం తెలుసుకున్నది సూటిగా మన మనస్సును తాకుతుంది.

వెల్చేరు నారాయణరావుగారన్నట్టు– రామారావుగారి కథల్ని క్లుప్తంగా మన సొంత మాటల్లో చెప్పడానికి వీలవదు. అయినా టూకీగా కథ చెప్పుకోవాల్సి వస్తే: పార్వతమ్మగారికి ఒక కొడుకూ ఒక కూతురూ. వీళ్లిద్దరూ కాక చనిపోయిన తన చెల్లెలి కూతురు సరస్వతిని పురిటికందుగా ఉండగా తెచ్చి పెంచింది పార్వతమ్మ. కథాకాలానికి, సరస్వతికి పెళ్లవుతుంది, ఆమె కొడుకు శ్రీపతి మూడేళ్లవాడవుతాడు. కథ ప్రారంభంలోనే సరస్వతికీ పార్వతమ్మకూ మధ్య ఘర్షణ నడుస్తోందని తెలుస్తుంది. పార్వతమ్మ నిష్టూరాలు, సాధింపులు శాపనార్థాలుగా మారి వారిద్దరికీ తెగతెంపులైపోడం, సరస్వతి వేరింటి కాపరం కూడా వెంటవెంటనే జరిగిపోతుంది. పుట్టింటిమీది బెంగతో సరస్వతి అలమటిస్తూ ఉంటే, ఆమె భర్త వారితో సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆవేశం, క్రోధం, ఆందోళన, ఆవేదన, అసహాయత– ఈ పొగలన్నిటి మధ్యా ఉక్కిరిబిక్కిరౌతున్న పాఠకుడికి మమకారం అన్న జ్యోతి మసకమసగ్గా దర్శనమవ్వడం ఒక గొప్ప అనుభవం.

సంఘటనల సమాహారంలో కథాసారం, రంగు రంగుల ఉల్లిపొర కాగితాల మధ్య దాగి ఉన్న మణిలా బయటపడుతుంది. అన్నిటికన్నా పైపొరలో కథ ఒక కుటుంబ కలహంగా మాత్రమే కనిపిస్తుంది. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకున్న కలతల గురించీ; పంతాలూ, పట్టింపులూ వంటి సున్నితమైన అంశాలకు సంబంధించీ కథ నడుస్తోందనిపిస్తుంది.

తల్లి పార్వతమ్మ ‘వ్యాఖ్యానాల వెలుగు’లో సరస్వతి వేరింటి కాపురాన్ని చూసే సుదర్శనం ఇలా అంటాడు: ‘వాళ్లు వేరే ఉండాలంటే ఉండవచ్చు. కానీ మాటా మాటా అనుకోకముందే, అంతా సవ్యంగా ఉన్నప్పుడే వెళ్లిపోయి ఉంటే యే బాధా లేకపోను. ఇప్పుడు నలుగురూ ఏమనుకుంటారు? కాట్లాడుకుని విడిపోయారంటారు. అభిప్రాయ భేదాలు రాకముందే విడిపోతే ఇప్పట్లా ముఖాలు చూసుకోని స్థితి రాకపోను.’ సమస్యలను పైపైన చూసి కారణాల వైపు దృష్టి ప్రసరించని వ్యక్తుల అభిప్రాయాలు అలాగే ఉంటాయేమో. అందుకే, ‘సుదర్శనం ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు.’ అని వ్యాఖ్యానిస్తాడు కథకుడు. ‘అభిప్రాయ భేదాలు లేకపోతే అంతా సవ్యంగా ఉంటే అసలు విడిపోవలసిన అవసరం ఏముంటుంది?’ అనే ప్రశ్న కూడా వేసి, కేవలం ‘విడిపోవడమే’ కథలోని అసలు సమస్య కాదేమోనన్న ఆలోచనకు పాఠకుడిలో బీజం వేస్తారు.

ఈ మనస్తాపాలకు కారణం ఏమిటని తర్కించుకుని, పరిస్థితులను కాస్త ఆకళింపు చేసుకునేసరికి, కింద పొరలో, ఒకే కుటుంబానికి చెందిన మనుషులే అయినప్పటికీ వేర్వేరు మానసిక స్థాయిలతో రకరకాల వైఖరులతో పాత్రలన్నీ విడివిడిగా నిలబడతాయి. మనసులో మాటను బయటికి చెప్పుకోలేని సరస్వతి, నలుగురికీ సమ్మతమైనా కాకున్నా తాననుకున్నది మొండిగా మాట్లాడి తీరే పార్వతమ్మ, నిజమేమిటన్నది తెలుసుకోడానికి ప్రయత్నించని సుదర్శనం, తెలిసిన నిజాన్ని నోటితో బయటపెట్టడానికి ఇష్టపడని పెదతల్లి, ఏం చెయ్యాలో ఇదమిత్థంగా తేలక సతమతమయ్యే సుబ్బులు, భార్యతో సహా కుటుంబసభ్యులెవరికీ ఏమాటకూ అందని ఇంటి పెద్ద– ఆనాటి కాలమాన పరిస్థితులకు అద్దంపడుతూ కథను ఆవిష్కరిస్తారు కథకుడు. వీరందరి రంగులూ సుస్పష్టంగా కనిపించడానికే ఉన్నాడా అనిపించే అమాయకత్వంతో పసివాడు శ్రీపతి కథను ముందుకు నడిపిస్తాడు. ‘ఏది చూస్తే దాని గురించి ఎలా కనిపిస్తే అలా వాగేస్తుంటాడ’ని మామ సుదర్శనం శ్రీపతి గురించి విసుక్కుంటాడు. అదే శ్రీపతి పాత్ర స్వభావం; అదే ఆ యింటి పెద్దవారందరిలోనూ ఉమ్మడిగా లోపించిన అంశమూనూ.

కథనం విషయానికొస్తే, ప్రధాన పాత్రలైన పార్వతమ్మ, సరస్వతులను గమనించి చూసినప్పుడు ఒక చిత్రమైన విషయం కనిపిస్తుంది. ఇంట్లో సమస్య ఏమిటన్నదీ దానికి కారణాలు ఏవన్నదీ పార్వతమ్మ ముఖతా పదేపదే వింటామే తప్ప, సరస్వతి అంతరంగం ఒక్కసారి కూడా మనకు ఆమె నోటి వెంట వెల్లడవదు. కానీ రచయిత సానుభూతి ఎవరి వైపన్నది నిస్సందేహంగా గుర్తు పట్టొచ్చు.

ఇంట్లో పేరుకు పోయిన ఉద్రిక్తత ఉండుండి భగ్గున మండితే, దాని సెగ ఇంటందరినీ బాధిస్తుందన్న మాట నిజమే కాని, ఆ మంటలోనే నిత్యం కూర్చుని ఉంటున్న సరస్వతి వైపు ప్రత్యేకంగా మన చూపు తిప్పే ‘నిరాడంబర సంఘటన’ ఒకటి జరుగుతుంది. ఒక పక్క మొగుడి పని పూర్తయితే తప్ప మరొక పనికి కదిలి రాదని సరస్వతి మీద పార్వతమ్మ మండిపడుతూ ఉండగా, ‘అప్పుడే తీరికయ్యిందా, ఇంకా అంత వేగిరం తెమిలి రాలేవనుకున్నా’ అని వ్యంగ్యంగా, తన చేతి కందించిన తువ్వాలునందుకోకుండా ఆమె భర్త అసంతృప్తిని ప్రకటిస్తుంటాడు.

ఆ సంభాషణకు ప్రత్యక్షసాక్షి అయిన సుదర్శనానికి మాత్రం సరస్వతి పడుతున్న ఇక్కట్లు అర్థంకావు. పైగా ఈ గొడవకి మూలకారణమేమిటి? తప్పు ఎవరిది? అన్న ‘అనవసర ప్రశ్న’లకు జవాబులు ఆలోచిస్తుంటాడనీ ఎంత ఆలోచించినా వెతుకులాటగానే ఉంటుందనీ కథకుడు సుదర్శనం మీద ఒక విసురు వేస్తాడు. కళ్ళ ముందు జరిగేదాన్ని గ్రహించేందుకు కూడా కొంత స్వంత ‘యత్నం’ అవసరమనిపిస్తుంది సుదర్శనం పాత్రను గమనిస్తే.

సరస్వతి పట్ల తన ప్రవర్తనకు సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టు మాట్లాడుతూ పార్వతమ్మ తన తోటికోడలికి యథాలాపంగా చెప్పిన మాటలు కథకు ఆయువుపట్టులాంటివి. ఎనిమిదేళ్ల వయసప్పుడు సరస్వతికి తాను పెంపుడు బిడ్డనని తెలిసిన నాటినుంచీ పూర్తిగా మారిపోయిందన్న మాట మనకు విద్యుద్ఘాతం లాగా తగుల్తుంది. అంత చిన్న వయసు నుండీ ఎంత వంగి ఉంటుందో ఊహించుకుంటే సరస్వతి మౌనానికి కారణం తెలుస్తుంది. పెళ్ళయ్యాక సరస్వతికి భర్తతో ఉన్న అనురాగానికీ పెంచి పెద్ద చేసిన కుటుంబం పట్ల ఆమెకున్న కృతజ్ఞతకూ మధ్య పోటీ పెట్టడం పార్వతమ్మ మనోదౌర్బల్యాన్ని సూచిస్తుంది.

పెంపకపు మమకారం నిజానికి పార్వతమ్మదా లేక సరస్వతిదా అన్న సందేహం మనసులో లేస్తుంది. పార్వతమ్మ జబ్బు పడ్డప్పుడు సరస్వతి చేసిన సేవల గురించి చెప్పే సందర్భంలో ‘సాకడం’ అన్న మాట వాడి, రచయిత ఆ దిశగా మనను నడిపిస్తారు. మాట్లాడకపోయినా సరే, కనీసం అమ్మ ముఖమన్నా కనిపిస్తే చాలని సినిమా హాలులో దూరంగా కూర్చునే సరస్వతి మమకారం మన మనసును కదిలిస్తుంది. మరో సందర్భంలో తండ్రి సుబ్బులుతో, ‘మాటలటమ్మా! కన్న మమకారం కన్నా కూడా పెంచిన మమకారమే గట్టిదంటారు పెద్దలు.’ అన్న మాటలు సరస్వతికా తపన ఎందుకో విప్పిచెప్తాయి.

మమకారపు ఆటుపోట్లను చిత్రించింది కేవలం రసపోషణకి మాత్రమే కాదని రుజువు చేస్తూ, దానికి జీవితంలో ఎదురయ్యే ఆటంకాల వైపు కథను నడిపి, ‘ప్రధాన బిందువు’ వద్దకు చేరుస్తారు. మనుషులు దూరమవడం, మళ్లీ దగ్గరవడం- ఈ సంరంభంలో వీటన్నిటికీ మూలకందమనదగ్గ విషయం కథాంతంలో బయటపడుతుంది. చిమ్మచీకటిలో అస్పష్టమైన శబ్దాలు వినవస్తూంటే, ఏమిటా అని మనం తడుముకుంటూ ఉండగా, రచయిత చడీ చప్పుడూ లేకుండా వచ్చి మన వీపు తట్టి, కొద్దిగా దీపపు కాంతిని హెచ్చించి మౌనంగా తన చేతితో ఇదీ అని చూపిస్తున్న అనుభూతి కలుగుతుంది.

పార్వతమ్మ ఏం ప్రశ్నించిందో తెలియదు కాని, రాత్రప్పుడు అమ్మ తన దగ్గరుండదని, పిలిస్తే వస్తుందని శ్రీపతి చెప్పడంతో కథ ముగింపుకు రావడం కథను వేరే తలంలోకి తీసుకుపోతుంది. మానవ జీవితానికి అత్యంత సహజమైన విషయం, సహజీవనపు ప్రాథమిక అవసరం– స్త్రీ పురుషులు కోరుకునే ఏకాంతం– సమాజం వేసే ఎన్నెన్ని చిక్కుముడుల మధ్య ఇరుక్కుని పెనుగులాడుతోందో అర్థమవుతుంది.

శ్రీపతి మాటలకు పార్వతమ్మ జవాబివ్వకపోయినా, గోడకభిముఖంగా ఉండడం చేత ఆమె ముఖం కనబడలేదని చెప్పడంలో ఈ అంశం ఆమెక్కూడా సంబంధించిందే అన్న ధ్వని వినిపిస్తుంది. పార్వతమ్మ పాత్రను అర్థంచేసుకోడానికి ఆమె మాటలు మనకు ప్రధాన సాధనాలు. ఈ విషయం గురించి కా.రా. ఒక చోట ఇలా చెప్తారు: పాత్రలు పలికిన పలుకులు కూడా కొన్ని పాత్రల మనోగత భావాల్ని మాత్రమే ధ్వనిస్తాయి. మరికొన్ని ఆ భావాలతో పాటూ ఆ పాత్రల అప్పటి మనఃస్థితినీ లేదా ఆవేశాలనూ తెలియజేస్తాయి. కొన్నైతే వాటి స్వభావాన్నీ వాటి సంస్కారాన్నీ తెలియజేస్తాయి. ఇంకొన్ని పలుకులు పాత్రలకూ సంఘటనలకూ సంబంధించిన వర్తమానంతో పాటు వాటి గతాన్నీ వర్తమానాన్నీ అర్థంచేసుకోడానికి సాయపడతాయి.

పార్వతమ్మకు తన జీవితం పట్ల ఉన్న అసహనం, అసంతృప్తీ ఆమె మాటల్లో బయటపడుతూనే ఉంటాయి. అందరూ కలిసిపోయి తననొంటరిని చేసారని వాపోతుంది. ఇంటా బయటా ఆమె మాటే చెల్లుబడి అవుతుందన్నట్టు మనకనిపించినా, జాగ్రత్తగా గమనిస్తే, అది నిజం కాదని తెలుస్తుంది. సుదర్శనం పెదతల్లితో స్టేషన్లో ఓ మాట అంటాడు: ‘అమ్మకు ఎవ్వరం చెప్పలేం. నాన్నగారూ ఎదురుచెప్పరు. కాప్పోతే తన పని తాను చేసుకుపోతారు.’ ఒక్క మాట చెప్పకుండా సరస్వతిని వేరింటి కాపరం పెట్టించడమే దానికి తార్కాణం.

‘పెళ్ళైనది లగాయతూ నాటి వరకూ ఆయన ఎప్పుడెప్పుడు యేయే సందర్భాల్లో ఎన్నెన్ని విధాల తన మనసు కష్టపెట్టారో ఆ భోగట్టాలన్నీ’ ఆమె మనసులో పాతుకుని ఉన్నాయని కథలో తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య కనిపించే ఆ దూరం ఆనాటి సాంఘిక స్థితి దృష్ట్యా అసహజం కాదు గానీ, సరస్వతి పట్ల పార్వతమ్మ కక్షసాధింపు ధోరణికి అది కూడా ఒక కారణం కాకపోదు. సరస్వతి మీద తనకున్న అభ్యంతరాన్ని ఇలా బయటపెడుతుంది: ‘ఇంక ఆ మొగుడంటే… అదెక్కడి మొగుడో! అదెక్కడి లోకమో! లోకంలో ఏ ఆడదీ మొగుడంటే అలా పడిచావదు.’ ఈమాటలకు వేర్వేరు అర్థాలు స్ఫురించడం కాకతాళీయం కాదనిపిస్తుంది. సరస్వతికీ ఆమె భర్తకూ మధ్య ఉన్న ఒద్దిక గురించి పార్వతమ్మ ప్రస్తావించడంతోనే ఆమె మనసులోని నీలినీడలు రెపరెపలాడి కనిపిస్తాయి.

స్త్రీ పురుషుల మధ్య ఏకాంతం అనేది ఒక సమస్యగా మారడం అనే అంశం వైపు చూపు మరలడంతో తేనెతుట్టెను కదిపినట్టయింది. ఒక కుటుంబంలోని ఒకానొక ప్రత్యేక పరిస్థితికి సంబంధించిన కథను చదివాక ఏర్పడ్డ అవగాహన ఒక కొత్త స్పృహను కలిగించి, సమాజం లోని వేరే జాగాల కేసి దృష్టిని తిప్పుతుంది. వేర్వేరు ఆర్థిక స్థితుల్లో, వేర్వేరు కులాల్లో విభజించబడ్డ మనుషుల్ని ఈ సమస్య ఎలా పీడిస్తుందోనన్న వివేచన మొదలవుతుంది.

కా.రా.గారి నో రూమ్ కథ గుర్తురావడానికెంతో సేపు పట్టదు. ఒంటి మీద గుడ్డ కానకుండా, సగం నిద్రమత్తులో, మళ్లా నిద్రలేచి, జాగరణాలు చేసీ చేసీ, దీపాలు గప్‌చుప్‌గా ఆర్పేసి, తప్పనప్పుడు బాగా తగ్గించేసి, చీకటి తెరలూ గోనెపరదాలూ తడికలూ మంచాలూ చాటున భయంభయంగా బితుకు బితుగ్గా, ఎవరో చెయ్యరాని వారితో ఏదో చెయ్యరాని పని చేస్తున్నట్టు అసహ్యాలు దిగమింగుకుని, చల్లారీ చల్లారని నరాల తీపులతో, కుట్టే నల్లుల్నీ ముసిరే దోమల్నీ జుమ్ముమనే ఈగల్నీ నలిపి, కొట్టి, తోలుకుంటూ పిల్లల రొచ్చుల్లో, పెద్దల రోతల్లో, చుట్టూరా కంపులే ఇంపులుగా… జీవన వ్యాపారం సాగిస్తున్న అప్పాయమ్మలకు కూడా మనసుంటుందనీ, ‘ఒక రాత్రల్లా ఇడవకుండా ఒకే పక్క మీద నీతో పడుకోవాలని ఉందిరా’, అని కోరుతుందనీ గుర్తుకొస్తుంది. కుటుంబరావుగారు చెప్పినట్టు ఆ కథల విశేషమే అది. అట్టడుగు జీవితాల్లోని అంతస్సంఘర్షణ దాని వెనక ఉన్న భౌతిక కారణాలతో సహా స్పష్టంగా కనిపిస్తుంది.

అందుకే ఆడా మగలను జంటలుగా కాక కూలి చేసే చేతులుగా మార్చి, వారి జీవితపు సమస్త అంశాలనీనూ- శారీరక, మానసిక వాంఛలను సైతం శాసించే శక్తుల సంగతి వివరించిన కా.రా.గారి ఆర్తి కథ కూడా ఇక్కడ గుర్తుకురావడం సహజమే.

మాలపేటలో పైడయ్య, సన్నిల జంట. సారా తాగిన పైడయ్య మాటలు: ‘సుకాలన్నిట్లోకి సుకం ఆడామగా ఒక్కాడ అనుబగించిందే–సుకం! ఇప్పుడిదీ (సారా తాగడం) సుకఁవే. కానీ దీనికి కరుసున్నాది. ఇదయ్యాక రేపు కొంత దండుగున్నాది. ఆ సుకానికైతే కానీ కరుసు నేదు–రేపు దండుగ నేదు. పేదోడికి బగమంతుడు మిగిలించిన సుకఁవది. అయితే నాలాటి అదురుస్టవంతుడు కడుపు కాసిస్తే ఆ సుకఁవూ అందడంనేదు సూడు–అదెంత పసందుగుందో…’

స్త్రీపురుషుల సాంగత్యం అన్న ఒక్క అంశానికి సంబంధించిన అనేక సమస్యలు వేర్వేరు రూపాలతో, తీవ్రతలతో చుట్టుముడతాయి. ఇల్లూ వాకిలీ లేని వారి సమస్యలు చర్చల్లోంచి కూడా జారిపోయిన ఆధునిక యుగంలో కదా ఉన్నాం. పట్టపగలు, కనీసం పబ్లిక్ స్థలాల్లోనైనా స్త్రీ పురుషులు- సామాన్యులు- ఏకాంతంగా, స్వేచ్ఛగా, సన్నిహితంగా మసలడానికి సైతం వీలుకాని పరిస్థితుల వైపు, వారి మీద పెడుతున్న ఆంక్షల వైపు ఆలోచనలు మళ్ళుతాయి.

అరవై ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే సామాజికశాస్త్ర పరంగానూ మానసికశాస్త్ర పరంగానూ కూడా ఈనాడు మనకు మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఆ కారణం చేత, స్త్రీవాద దళితవాదాల వంటి సాధనాల చేత, జీవితపు సంక్లిష్టతలను అర్థంచేసుకోడంలో ఈ కథను ఆనాడు చదివిన వారి కంటే ఈతరం వారు మరింత సమర్థులవగలరు.

కనక వ్యాసం మొదట్లో వేసుకున్న ప్రశ్న మరొక్కసారి: పాత కథలను ఈనాడు చదవడం ద్వారా సిద్ధించే సాహిత్య పరమార్థం?

ఉత్తమ రచయితలు తాము చూసిన జీవిత శకలాన్ని అతి సూక్ష్మంగా పరిశీలించి, నిజాయితీతో విశ్లేషించి, సారాన్ని వడకట్టి, దానికి తగిన శిల్పంతో తమ రచనల్లో నిక్షిప్తం చేసిన జీవిత సత్యాలకు నానాటికీ ప్రాసంగికత పెరుగుతుంది. అందువల్ల ఆయా రచనల్లోని ఔచిత్యాలను గుర్తించడానికి, జీవితంలోని యితర కోణాలతో అన్వయించుకోడానికి, సమాజంలోని వేర్వేరు సమూహాల జీవనాలతో సమన్వయ పరుచుకోడానికి, రాబోయే తరాలవారికి అలాంటి సాహిత్యం తోడ్పడుతుంది. సారమున్న రచనలకు- వాటిలో రికార్డయిన జీవితం సత్యానికి దగ్గరగా ఉన్న కారణం చేత– అంతకంతకూ స్వారస్యం పెరుగుతుంది; పాఠకుల అవగాహనాశక్తి పెరిగిన కొద్దీ, అంత వరకూ లేని కొత్త చూపును ఆ రచనలు అవ్యాజంగా వారికి ప్రసాదించగలవు. నూతన పరిజ్ఞానపు వెలుగులో ఉత్తమ సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు పునర్వ్యాఖ్యానం చేసుకోడం మన విధి.

(కాళీపట్నం రామారావు గారి కథల మీద పత్రికల్లో వచ్చిన వ్యాసాలను ‘మళ్లొక్కసారి కారా కథల్లోకి’ అనే పేరుతో సంపుటంగా రమాసుందరి సంపాదకత్వంలో కథానిలయం ప్రచురించబోతున్న సందర్భంలో, ఆ సంపుటినుంచి ఈ వ్యాసం.)