తెరచాటు-వులు: 4. మీరు సమర్ధులు గాన…

మీరు సమర్థులు గాన…

మీరు సమర్థులు గాన నీలాపనిందలు బాపుకొంటిరి… మా గతి ఏమి?

మొహం ముడుచుకుని చూసే సినిమాలంటే సాధారణంగానే ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది- ఇందులో కనుబొమల బంధాన్ని శుభం సీను (అసలలాంటిదేమన్నా ఉంటే) దాకా విడదీయడం వీలు పడదని. అర్ధ్‌సత్య సినిమాకి వెళ్ళి ఎవరూ వినోదం ఆశించరు. ఫస్ట్ హాఫ్‌లో కావిఁడీ తగ్గింది, సెకండ్ హాఫ్‌లో పాటలు బాగోలేవన్న దృక్కోణం నుంచి చూసే సినిమాలు కావు ఇవి. మనసార నవ్వుకుని, కంటికి కడివెడు కన్నీరు కార్చి, గుండెబరువు దించుకునే ఉద్దేశ్యాలతో ఈ ‘సీరియస్’ సినిమాలకి వెళ్ళరు. వీటి లక్ష్యం ఆలోచింపచేయడం. అంత వరకే. ప్రేక్షకులను ఎంతవరకూ కదిలించగలిగిందన్న ప్రాతిపదికన వీటి విజయవిహారం నిర్ణయింపబడి ఉంటుంది. 90వ దశకం నుంచి బాగా తగ్గిపోయినాయి కాని, 70లలో ఈరంకి శర్మ, 80లలో వేజెళ్ళ సత్యనారాయణ, ఆ తరువాత కొంత కాలానికి టి. కృష్ణ, మోహన గాంధి, క్రాంతి కుమార్ లాంటివాళ్ళు అధిక వాణిజ్య మోతాదుతో బీడుపడిపోయిన తెలుగు సినీసీమలో పని కట్టుకుని మరీ ఆలోచనాత్మకాంకురాలు మొలకెత్తింపచేసే ప్రయత్నాలు చేశారు. ఇక మధ్యతరగతి సినిమాల మధ్యందిన మార్తాండుడు బాలచందర్ గురించి చెప్పనవసరం లేదు.

చెప్పొచ్చేదేమిటంటే, ఈ సినిమాలను కొలిచే తూనిక రాళ్ళు వేరు. వ్యాపారాత్మక కొలమానాలు కొలబద్దలు వీటికి పనిచేయవు. అలా అని సీరియస్ సినిమా కాబట్టి, ఎవరూ నవ్వనంత వరకూ అందరూ సమస్యలతో సతమతమవుతున్నంత వరకూ సినిమా ఆటో-పైలట్లో వెళ్ళిపోతుందనుకోవడం కూడా పొరపాటే. కానీ టోన్‌కి సంబంధించి సీరియస్ సినిమాలకు ఉండే వెసులుబాటు ఫక్తు కమర్షియల్ సినిమాలకి లేదనే చెప్పవచ్చు. విషయం ఎలాంటిదైనా (నర్సింగ రావు ‘మట్టి మనుషులు’, బాలచందర్ ‘తన్నీర్ తన్నీర్’, గౌతమ్ ఘోష్ ‘మా భూమి’ వగైరా) సమస్యని మనసు కదిలించే విధంగా చెప్పగలిగితే చాలు, అదే పది వేలు (లక్షలు, కోట్లు కూడా). అదే సమస్యని కదలించేలా మాత్రమే కాకుండా జనరంజకంగానూ చెప్పగలగడంలో బాలచందర్ చేసిన ప్రయోగాలూ సాహసాలూ మరెవరూ చేయలేదు, చేసి (అంత) కృతార్థులు కాలేదనే చెప్పవచ్చు. ఇక్కడ టోన్‌ని కదం తొక్కించే రౌతు ఆ సమస్యే. కళ్ళకు గంతలు కట్టేసి మరెటూ చూడకుండా/ పోకుండా పరుగు పెట్టించగలిగితే టోన్ రథిగా, సమస్య సారథిగా సినిమా అనుకున్న గమ్యానికి చక్కగా వచ్చి చేరుతుంది. ముసురు సినిమాలకి ఉండే సౌలభ్యమే ఇది. ప్రతి పావు గంటకూ ప్రేక్షకుల్ని బలవంతంగానైనా గిలిగింతలు పెట్టి, ఇబ్బందికరంగానైనా నవ్వించాల్సిన అవసరం లేదు. టైమ్‌టేబుల్ పెట్టుకుని పనిగట్టుకుని పాటలు పాడుకోవాల్సిన అగత్యం అంతకంటే లేదు. అందుకే బాలచందర్ ఇటు కళాపిపాసులకీ అటు వాణిజ్య నిర్మాతలకీ ప్రీతిపాత్రుడయ్యాడు. ఇతని సినిమాలలో వెండితెర వ్యాపారవేత్తలు వేసే లెక్కలన్నిటికీ తగ్గ సమాధానాలున్నాయి. పాటలు- ఓకే, ఫైట్లు- డబలోకే, హాస్యం- ట్రిపులోకే. అయినా వీటినన్నింటినీ కలుపుకుపోయే మౌలికమైన సమస్య తెర వెనకనించి తోలుబొమ్మలాట ఆడిస్తూనే ఉంటుంది. బాలచందర్ తరువాత అదే బాటను పట్టి, వాసి తక్కువైనా రాశిలో తులతూగగల ప్రయత్నం చేసింది టి. కృష్ణ. తను తీసిన ‘ప్రతిఘటన’ రౌడీరాజ్యం గూండాయిజం సమస్యలని బాలచందర్ తరహాలోనే డ్యూయెట్లతోను, పోరాటాలతోను, ఆలోచన రేకెత్తించి ఆవేశాన్ని రగిలించే మాటలతోనూ పాటలతోనూ కళా-వాణిజ్యపు జోడు గుర్రాల మీద స్వారీ చేసి వీరవీహారం చేసింది. అందుకు ముఖ్య కారణం, సడలించని పట్టు, సడలని బిగి… అనగా… టోన్. సరే, సమస్యలతో తలగోక్కుంటే సక్సెస్ సిద్ధిస్తుంది (దాని పరిధి, పనితనం మేరకు). మరి సమస్యలు లేని ఊహాప్రపంచం మాటో? అదేనండీ! మన సర్వ సాధారణ సినీ ప్రపంచపు పరిస్థితో? వీటికి అసలు టోన్ అక్కర్లేదా? వీటి అక్కరకు టోన్ రాదా? రాగలదా? రాలేదా?

ఫేమా? పైకమా?

సక్సెస్ కోసం సాధనాసంపత్తిని సమకూర్చుకునే ముందు సరిచూసుకోవలసిన ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. అది సినిమా తీసే ఉద్దేశ్యం. పేరు వచ్చే సినిమా చేయడమా? లేకపోతే వసూళ్ళు తెచ్చే సినిమా తీయడమా? (నేపాళ మాంత్రికుడు డింగరికి చెప్పినట్టు- జనం కోరేది మనం సేయడమా, మనం సేసేది జనం చూడడమా?) అనేది ముందు తేల్చుకుంటే ముందు ముందు మనస్తాపాలకు, అపార్థాలకు, ఆనక ఏ కారణం చేతనైనా రోడ్డు మీద పడితే, బయటికి చూపే చూపుడు వేలును కాకుండా లోనకి చూపే మూడు వేళ్ళని చూసుకుని మూసుకునే వీలు ఉంటుంది. ఉద్దేశ్యం మొదటిది అయితే… పై పేరా చూడుము. సరే, ఉద్దేశ్యం డబ్బులు రాబడే. డబ్బులు సంపాదించే అన్ని వ్యాపారాల్లో అత్యంత చపలమైనది, చంచలమైనది, అస్థిరమైనది, (హారతి కర్పూరం చేసి) ఆవిరి చేయునది సినిమాలో పెట్టుబడి అని తెలిసి కూడా తమాయించుకోలేక డబ్బు మూటలు పట్టుకుని దిగిపోయే నిర్మాతలకి సినీ రచయిత అందించే హిట్ కథ, తదుపరి దర్శకుడు తీసి చూపించే సూపర్ హిట్ బొమ్మ- ఈ రెంటికీ మూలాధారం మళ్ళీ మన టోనే.

కథకూ ఒక టోన్

తీసే వరకూ ఓకే, ఒప్పుకున్నాం! మరి చెప్పే కథకూ టోన్ ఏమిటండీ?

కల్తీ లేని మాస్ మసాలాతో తీసిన ఫక్తు కమర్షియల్ చిత్రానికి నిలువెత్తు అద్దం ‘హలో బ్రదర్’ అనే చిత్రం. కథాపరంగా విడకొట్టాలంటే, చిన్నప్పుడే విడదీయబడిన కవలలు, ఒకడు ఆకు రౌడీస్, రెండో వాడు ఫారిన్ రిటర్న్‌డ్. ఏ కారణానైనా వాళ్ళు దగ్గరయినప్పుడు ఒకళ్ళకు కలిగే అనుభూతి మరొకళ్ళకి కూడా కలుగుతుంది (ఇది 60ల్లో వచ్చిన ఎన్టీయార్ ‘అగ్గి పిడుగు’ని పోలినా సరే). వాళ్ళకు కలిగే విచిత్రమైన అనుభవాలే సినిమా. చెప్పుకోవడానికి ఇంతకు మించిన కథ ఏమీ లేదు. కాని ఈ చిన్న లైన్‌ని రెండున్నర గంటలపాటు నవ్వుకోగలిగే విధంగా మలిచిన రచయితకీ దర్శకుడికీ పాదాభివందనం చేయాల్సిందే. ఎందుకంటే కమర్షియల్ సినిమా తీయడం (రాయడం) విమర్శించినంత తేలిక కాదు. రాసేటప్పుడు, తీసేటప్పుడు, తీసేవాళ్ళకి నచ్చేది చూసేవాళ్ళకి నచ్చుతుందా అన్న సంశయం సదా వెన్నాడుతూనే ఉంటుంది. ఇక్కడ హీరోని ఒక రౌడీ కొడితే తగిలిన దెబ్బ, ఆ పక్కకు వచ్చిన రెండో కవల హీరోకి కూడ తగిలి హీరోయిన్ దగ్గర ఉక్కిరిబిక్కిరి అవుతాడు అన్న వాక్యం విని, ఫక్కున నవ్వే వాళ్ళు ఎంతమంది ఉంటారో, నవ్వు రాకపోగా ఈ రచయితకేమన్నా మెదడువాపువ్యాధి సోకిందా అని అనుకునే వాళ్ళు కూడ కచ్చితంగా అంతే మంది ఉంటారు. కామిడీ విషయంలో టోన్ అంతు చిక్కని పాదరసం అయిపోతుంది. Dying is easy, comedy is hard అన్నది ఇక్కడ అక్షరాలా వర్తిస్తుంది. సునిశితమైన హాస్యం పక్కన పెడితే, ఈ కాలపు తెలుగు సినిమా కామెడీ వ్యంగ్యం, వెకిలితనం, వెటకారాల సమ్మిళితం. ఇక్కడ టోన్ అంటే మోతాదు అనే. ఏ మోతాదులో వ్యంగ్యం పండుతుంది, ఏ పాళ్ళలో వెకిలితనం కూడా గిలిగింతలు పెడుతుంది, ఎంత మాత్రంలో వెటకారం అవసరం పడుతుంది, ఈ చిక్కుని ఛేదించిన వాడు ఇంకా భూప్రపంచం మీద పుట్టలేదు. ఇవి సరైన పాళ్ళలో కుదిరినాయా బొమ్మకి ఢోకా లేదు. కానీ ఎలా అన్న దానికి ఫార్ములా లేదు. హలో బ్రదర్ ఉదాహరణలోనే మల్లికార్జునరావు పాత్ర పూర్తి స్థాయి వెటకారం మీద (మీ చేతిలో ఉండేది లాఠీ కర్ర, మా చేతిలో ఉండేది గోటీ బిళ్ళ), రమ్యకృష్ణ పాత్ర నిఖార్సయిన వెకిలితనం మీద (నీ కొడుక్కి తల్లిని చేసి పెట్టవయ్యా), ఇక మిగతావన్నీ వ్యంగ్యం మీదా నడిపాడు రచయిత (నీ అధరామృతాన్ని గ్రోలనా? గ్రోలడానికి అదేమన్న గోల్డ్ స్పాటా?). సైన్సుకీ ఆర్టుకీ ఇక్కడే పేచీ. ఒక (సక్సెస్) సూత్రాన్ని అవే పరిస్థితులలో ఎన్ని సార్లు వాడినా అదే ఫలితం వస్తుంది అని బల్ల గుద్ది వాదిస్తుంది సైన్సు. ఆమాట తెలుగు సినిమాని చూసి చెప్పు అంటుంది ఆర్టు.

ఉప్పు కప్పురంబు

తెలుగులో నవలాప్రాభవం పూర్తిగా అంతరించి పోయిన తరువాత పూర్వరంగంలో పేరెన్నిక గల రచయితలు రెండు బాటలు పట్టేరు. 1. తెర వెనక రచనలు (ఫలానా పాప్యులర్ రచన పేజీ వెనక బాగోతం.) 2. సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు (నేనే కాదు, మీరు కూడా నా అంత/నాకన్నా గొప్పవారు కావడం ఎలా?). ఒకటి నెమరువేత, రెండు నూరిపోత. ఇందులో భాగంగానే యండమూరి కొన్నేళ్ళ క్రితం, పాప్యులర్ రచనలు చేయడం ఎలా? అన్న పుస్తకం వెలువరించారు. ఏ మోతాదులో నత్రజని, భాస్వరం, పొటాషియమ్ కలిపి పైరు మీద పిచికారీ చేస్తే చీడ చెడి అధిక దిగుబడి పొందచ్చో చెప్పే రచనలు ఇవి. వీటితో పాటే సూపర్ హిట్ స్క్రీన్‌ప్లేలు ఎలా రాయాలి? (ఇంగ్లీషులో) వంటివి- మార్కెట్లో గేలం వేసుకుని కూర్చునే అసంఖ్యాకమైన రచనలు కోకొల్లలు. మొదటి పేజీలో రంగం సిద్ధం చేయి, పదమూడో పేజీ వచ్చేసరికి మొదటి వైరుద్ధ్య విషయాన్ని (conflict point) ప్రవేశ పెట్టు, యాభైయవ పేజీలో కథని కీలకమైన మలుపు తిప్పు, రెండొందలవ పేజీకి మంగళం పాడు వంటి గింజలేని ఊకతో, సక్సెస్ ఫార్ములాని బిరడా గట్టిగా కట్టిన రంగు నీళ్ళ సీసాగా అమ్మి, కొనుక్కున వాళ్ళు గొంతులో పోసుకుని గుటుక్కున మింగితే సక్సెస్ తప్పక సిద్ధిస్తుంది అని నమ్మజూపే సర్వరోగ నివారిణులు. ఈ సందర్భంలో Dead Poets Society సినిమాలో కవిత్వం అంటే ఏమిటి అన్న సీనుని గుర్తు చేసుకోవడం తప్పనిసరి.

సన్నివేశాన్ని రూళ్ళ కర్రలతో కొలిచి, ఏ రసం ఎంత మోతాదులో ఉండాలో తూకం వేసి, ఎంత సేపు ఉండాలో స్టాప్‌వాచ్‌తో సరిచూసుకుంటే అర్థవంతమైన సినిమా రావచ్చు కాని, భావస్ఫోరకమైనది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. హలో బ్రదర్ లాంటి సినిమా స్క్రిప్టుని సూత్రాల ఆధారంగా రాయడం, ఫార్ములాల ఆధారంగా తయారు చేయడం జరగని పని. విచిత్రమైన విషయం ఏమిటంటే, అదే దర్శకుడి నుండి ఆ తరువాత వచ్చిన ‘అలీబాబా అరడజను దొంగలు’ అన్న మరో హాస్యచిత్రం మోతాదు మరీ శ్రుతి (అశ్లీలం, అసభ్యం కావు. టోన్ లెవెల్) మించడంతో కామెడీ శ్రమగా మిగిలి వెగటు పుట్టించి సినిమా కొట్టుకుపోయింది. Too much of a good thing అన్న వాడుకకు ఈవీవీ సత్యనారాయణ సినిమాలు చక్కని ఉదాహరణలు. కామెడీ ఒక ఎత్తైతే, మన తెలుగు సినిమా ప్రధాన జాన్రా- కుటుంబ కథా చిత్రం- టోన్‌కి సవాలు విసిరే అత్యంత సంక్లిష్టమైన ప్రహేళిక. ‘విజయ’ బాపినీడు తన సినీ జీవితం మొత్తం ఒకే రకమైన సినిమాలు తీశారు- ఉమ్మడి కుంటుంబం, అన్నదమ్ములు, పెద్దన్నయ్య-వదిన కుటుంబం మొత్తానికి తల్లి తండ్రి అయ్యి భారం మోయడం, తమ్ముళ్ళల్లో తలో రకం, మంచి తమ్ముడు, చెడ్డ తమ్ముడు, ఇంటెర్వెల్‌కి కుటుంబం విడిపోవడం, శుభం సీనుకి తప్పందరూ తెలుసుకుని ఒకటవడం. తను తీసిన ‘బొమ్మరిల్లు’ నుండి ‘గ్యాంగ్ లీడర్’ వరకు ఇదే తంతు. వీటన్నిటిలోకి పరుచూరి బ్రదర్స్ రాసిన ‘గ్యాంగ్ లీడర్’ని తెలుగు కమర్షియల్ సినిమా కుటుంబ కథ జాన్రాలో పాఠ్యాంశంగా చెప్పుకోవచ్చు. అంత చక్కగా కుదిరిన/ వండిన సినేరియో అది. కథ కొత్తది కాదు, అప్పటికే బాగా నలిగినది కూడా. అందులో బాపినీడు బేనర్ నుంచి అంటే ఎలాంటి కథో కూడా ముందే తెలిసిపోయిన పరిస్థితి. అయినా ప్రతి సీనుని (హాస్యం, సెంటిమెంట్, రొమేన్స్, ఏక్షన్) మోతాదు పరిమితులు ఎక్కడి వరకూ ఉన్నవో అంతకు ఒక్క మిల్లీమీటరు కూడా గీత దాటకుండా రక్తి కట్టించారు. ముందు చెప్పినట్టు ఇది సైన్సు కాదు. మళ్ళీ ఆ రచయితలే ఇదే జాన్రాని మట్టి కరిపించిన సందర్భాలూ ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? ముందుకు ఒక అడుగు, వెనక్కి రెండడుగులు వేసుకుంటూ ఉంటే, ఎప్పటికి మన సినిమాలు ఆ పరమపదసోపానం ఎక్కేది, చేరేది? దీనికి సమాధానం టోన్‌లో లేదు, దానికన్నా కీలకమైన, ఇప్పుడు బహుధా వ్యాప్తమైన మరో పదంలో ఉంది.

(వచ్చే భాగం- యే ఎంటర్టయిన్మెంట్ క్యా హై? యే ఎంటర్టయిన్మెంట్?)