ఒకనాటి యువ కథ: కెరటాలు పలకరించాయి

రామగోపాలం ఆఫీసు మేడ దిగుతున్నాడు.

హఠాత్తుగా ఏదో ఆలోచన కలిగింది. వెనుదిరిగి మెట్లు లెక్కపెట్టాడు.

ఏడు.

ఆ ఏడు మెట్లు ఎన్నోసార్లు ఎక్కాడు, తన ఆఫీసు గదిలోకి పోయి పనిచేసుకోడానికి.

ఆఫీసు పనిలో ఎంతో శ్రద్ధాభక్తులు చూపించే రామగోపాలం, తన విధ్యుక్త ధర్మాన్ని పూజిస్తున్నట్టుగా కనిపిస్తాడు. ధర్మమనేది భగవంతుని అంశ అయితే దాన్ని అంటుకుని, ఆదుకుని నిలబడడమే తన కర్తవ్యమనుకున్నాడు రామగోపాలం.

కొన్ని దర్యాప్తులు చెయ్యడానికి తిరుపతి వెళ్ళమని ఆనాడే ఒక ఆజ్ఞ అందింది. ఆ ఆలోచనల్లో మెట్లు లెక్కపెట్టాడు-ఆ ఏడు మెట్లు ఎక్కి తన విధ్యుక్త ధర్మాన్ని పూజిస్తున్నట్లు. తిరుపతి వెళ్ళే అవకాశం లభించడంతో ఏడు కొండలు ఎక్కి తిరుపతి దేవుని కూడా కొలవవచ్చుననుకున్నాడు రామగోపాలం.

ధూమశకటం కొండల మధ్యనుంచి నడిచి తాపీగా తిరుపతి చేరింది-మెల్లిగా ఆలస్యంగా, దైవసాన్నిధ్యం అంత తొందరగా లభించదన్నట్లు.

రైలు దిగి, రామగోపాలం సత్రవులోకి చేరాడు. పదిలంగా ఒక గదిలో తన సామాన్లు దింపుకున్నాడు. హోరుమనే వాన!

ఎక్కడ చూచినా స్త్రీ పురుష భేదం లేకుండా శిరోముండనాలు, రద్దీ, జనం-అందరూ తిరుపతి స్వామి భక్తులే. వారి కళ్ళల్లో ఏవో వింత కోరికలు, చింతలు మిలమిల మెరుస్తున్నాయి. ఎవరి హృదయంలో ఏముందో ఆ పరమాత్మకే తెలియాలి. సత్రవులో వరండా అంతా క్రిక్కిరిసి ఉంది. రకరకాల ఆసనాల్లో భంగిమల్లో భక్తులంతా వరండాల్లో గందరగోళపడుతున్నారు. ముసుగున్న వితంతువు ప్రక్కనే శిరోముండనం చేసుకున్న పునిస్త్రీ; బట్టతల తాత ప్రక్కనే మొక్కు చెల్లించుకున్న మనుమడు; పిల్లలకోసం కలిసి జుట్టు తీయించుకున్న దంపతులు వింత జంటల్లా కదిలారు. రామగోపాలం ఆలోచించాడు-జాతిలో ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క మూఢ నమ్మకం-అయినా కర్మకాండలో నమ్మకమున్న వ్యక్తులు.

తనకోసం వచ్చిన జీప్‌లో వూరు తిరిగి తన ఆఫీసు కార్యక్రమం పూర్తిచేసుకున్నాడు. సాయంత్రం కొండమీదకు ప్రయాణమయ్యాడు.

కొద్ది చలిగాలి. బస్సు రోకలిబండలా కొండమీద ఆయాసంగా పాకుతోంది. మొక్కలూ తుప్పలతో పచ్చగా మెరుస్తున్న కొండలు ప్రతివాణ్ణీ ఏదో ప్రశ్నిస్తున్నట్లు నిక్కి చూస్తున్నాయి పూజారుల్లా. బస్సులో ఒక ఆసామికి త్రిప్పువచ్చి కక్కుకున్నాడు. మరొక వితంతువు పటికబెల్లం, లవంగాలు నమిలేస్తోంది-తన అలవాటు తిరుపతి కొండ ఎక్కడానికే చేసుకున్నట్లు. ఎవరో పండితుడు ఏదో కొండల దర్శనం కాగానే ఏదో శ్లోకం వల్లించాడు గట్టిగా. ‘భోజనకాలే గోవిందా’ అన్నట్లు భోజనం ముందు-ఆయన శ్లోకంలో ఆనందించారు తోటి ప్రయాణికులు.

తిరుపతి మహిమలు కథలుగా చెప్పుకుంటున్నారు బస్సులోని తిరుపతి బంధువులు.

‘ఆయన మహిమ అపూర్వం. ఎవరికి ఏది కావాలంటే అది యిస్తాడు…’

కావచ్చు, అనుకున్నాడు రామగోపాలం.

‘ఏమీ కోరకపోతే? ఏమిస్తాడో!’ నవ్వుకున్నాడు రామగోపాలం. భగవద్గీతలోని నిష్కామకర్మ దృష్టికి వచ్చింది… అక్షరాలా పాటిస్తానని ఒట్టుపెట్టుకున్నాడు రామగోపాలం.

బస్సు ప్రయాణీకులను వెక్కిరిస్తున్నట్టు పాదయాత్ర చేస్తున్నారు మరికొందరు మహా భక్తులు కొండ ఎక్కడానికి.

ఏడు కొండలు ఎక్కే బస్సు, ప్రేయసిని చేరే ప్రియుడి గుండెలా కొట్టుకుంటోంది-శబ్దంతో. ప్రేయసిలో కనిపించే సౌందర్యమంతా ఏడు కొండల్లో కనిపించింది రామగోపాలానికి. ఏమిటో విచిత్రమైన ఆలోచనలు కదిలాయి.

హఠాత్తుగా చేతిలోని సంచి విసిరేసి, కట్టుబట్టలతో ఆ దట్టమైన కొండల మారుమూలల్లోకి చొచ్చుకుపోయి ప్రశాంత చిత్తంతో తపస్సు చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందీ… అనుకున్నాడు రామగోపాలం.

‘ఇక్కడ పెద్దపులులు తిరుగుతాయాండీ?’ ఒక బస్సు ప్రయాణీకుని ప్రశ్న.

‘పెద్దపులులేమిటి, సింహాలు కూడా!’ నోరావలిస్తూ చెప్పాడు మరొక బస్సు స్నేహితుడు.

ఆ కొండల్లో తపస్సు చేసుకుంటే… ఏదో పులి ఎక్కడినుంచో సింహం… మీదబడి కొరికి ముక్కలుచేసి… రక్తపాతం… ఆ ఆకుపచ్చటి కొండలు ఎర్రగా మారిపోవూ?

‘అయినా అవి ఎవరికీ హాని కలిగించవండీ!’ అంతా స్వామి మహిమ అన్నట్లు ఉద్ఘాటించాడు మరొక భక్తుడు.

ఆ భక్తుని అభయహస్తంతో రామగోపాలానికి ఆ కొండలు మరీ సౌందర్యవంతంగా కనిపించాయి. ఆ కొండల మీద ఒంటరిగా మేఘాలతో ఆడుతూ సంచరిస్తూంటే, ప్రవరాఖ్యుడికి వరూధిని కనిపించినట్టు తనకు ఎవరైనా అప్సరస కనిపిస్తే! మధుర వీణా నిక్వణాలు ప్రక్కనున్న సెలయేటి గలగలలతో గొంతుకలిపి ఆ జవ్వని బంగారు గాజుల గలగలలు… మను చరిత్ర స్మృతిపథంలో తిరిగింది-

ఆయాసంపడే బస్సు ఆస్త్మా రోగిలా చివరికి గమ్యస్థానం చేరింది.

‘దిగండి.’ అన్నాడు కండక్టరు.

రామగోపాలం ఆలోచనల్లోంచి తేరుకున్నాడు.

అయితే బస్సులో కళ్ళజోడు పెట్టుకున్న పొట్టి అమ్మాయి అద్దాల మిలమిలలు. బంగారం తొడుగులతో మెరిసిపోతున్న ఒక భక్తురాలు. తనకేసి పరీక్షగా చూస్తూ డిటెక్టివ్ నవల పఠిస్తున్న నాగరిక విద్యార్థిని-బస్సు దిగినా కళ్ళ ఎదుట సాక్షాత్కరించారు.

కొండల్లో ఎవరో వరూధిని బదులు వీరిలో ఏ ఒక్కరైనా వరూధిని అయిపోతారేమో… కావచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో… అంతా దైవలీల…

డిటెక్టివ్ నవల చదువుతున్న అమ్మాయి బస్సు దిగి సామాను ఎత్తే ఒక యవకుణ్ణి చెప్పుతో దవడమీద కొట్టింది, ‘ఇడియట్!’ అని అరుస్తూ.

బస్సు దిగిన ప్రయాణీకుల్లో సంచలనం కలిగింది ‘ఏం జరిగిందని.’

సామాను నెత్తిమీద పెట్టుకున్నప్పుడు ఆమె కొంగు పట్టుకున్నాడుట – ఆమె వాదన.

‘కాదండి. పెట్టె కొక్కానికి తగిలి ఆమె కొంగు నా చేతిలోకి వచ్చింది.’ అంటాడు ఆ నౌకరు.

పెద్దమనుషులైన ప్రయాణికులు ఆ రభస చల్లార్చి ఆమెకు మరొక నౌకర్ని నియమించి మెల్లిగా సాగనంపారు. బిగిసిపోయిన రామగోపాలం కొంచెం తెరిపిగా ఊపిరి పీల్చుకున్నాడు-ఈ అమ్మాయిలో ఇంత డేంజరు ఉందా అనుకుంటూ. తన ఆలోచనలు ఒక్కసారి ఝాడించాడు… దేవుడి సన్నిధిలో పాపపు తలపులు… పంజరంలో చిలకను బంధించినట్టు మనస్సును కళ్ళెం వేసి బిగించేయాలనుకున్నాడు.

కొండ దక్షిణ భాగాన తనకిచ్చిన బసవైపు నడిచాడు. జగత్తులో అంతర్లీనమై ఉన్న దివ్యజ్యోతి… మానవాతీతమైన శక్తి ఏదో అతని మనస్సుకు తట్టింది. రామగోపాలం భయంతో భక్తితో వణికిపోయాడు.

తన బసలో సామాను దించి, ఒక సిగరెట్టు ముట్టించాడు. లైటు వెలిగింది. సాయంత్రం ఆరున్నర దాటింది. గోడ మీద ఏవో మసకలు… మసకలు. వెల్లవేసి రెండేళ్ళు కావచ్చుననుకున్నాడు. బస సౌకర్యంగానే కనిపించింది. ఒకటి రెండు రోజులు కులాసాగా, ఒంటరిగా, ప్రశాంతంగా, హాయిగా, ఆత్మపరిశీలన చేసుకుంటూ కొండమీద తిరిగితే మనస్సుకు ఆహ్లాదం కలుగుతుందని ఆశించాడు రామగోపాలం.

స్నానం పూర్తిచేసి వెంకటేశ్వరుని ఆలయం వైపు నడిచాడు, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి. ఆలయం ఎదుట వ్యాపించిన బజారు, ‘లైట్ల కాంతుల్లో కనుల పండువుగా’ ఉంది. వెంకటేశ్వరుని బొమ్మలు, బొమ్మలున్న గవ్వలు, విసనకర్రలు, బూరలు… యాత్రికులంతా కొంటున్నారు.

ఆలయంలోని విగ్రహం గంభీరంగా ప్రశాంతంగా ఎంతో విస్తృతంగా కనిపించింది. గోపాలం ఒక్క నిమిషం చూసి, ఏదో తన్మయతలో ఆరాధనలో పడ్డాడు. ఆ తృటిలో అతని మనస్సులో కోరికలు ఏవీ ఉద్భవించలేదు. తిరుపతి కొండలు, కొండమీద దేవుడు… ఆ విచిత్ర వాతావరణం-మానవుడి మనోపరిమితి గురించి ఏవో విచిత్రమైన ఊహలు అల్లుకున్నాయి ఆలోచనల్లో. గుడి బయటకు రాగానే తిరుపతి స్వామిని చెక్కిన రెండు గవ్వలు కొన్నాడు. భోజనం చేసి, మగతతో ఆయాసంతో బసకు వచ్చి, పరుపు చుట్ట పరిచి, విలాసంగా ఒరిగాడు ఒక నిమిషం.

కందమూల ఫలాలు తిని, అరణ్యాల్లో ఆశ్రమాలు నిర్మించుకుని గడిపే పురాతన ఋషులకు, దేవాలయాల చుట్టూ భక్తి భజనలు చేసే నేటి కలియుగ యాత్రికులకు విజ్ఞాన సంపాదన మార్గాల్లో మార్పులు విభిన్నంగా వికృతంగా గోచరించాయి.

చీకటివెలుగుల నీడల్లో రోడ్లమీద బసకు దూరంగా ఒంటరిగా సంచరించాడు. మిణుగురు పురుగులు చీకట్లో ఎగురుతున్నాయి. చెట్లు గాలిలో ఊగుతూ రోజుతూ శబ్దం చేస్తున్నాయి. ఆకాశంపైన కొండమీది దీపాలకు పోటీగా తారలు తళుక్కుమంటున్నాయి. ఈ జగత్తు మహత్తు ఏమిటో అర్థంకాని అనంతం అనిపించింది గోపాలానికి.

పది గంటలు దాటింది. లైట్లు ఆర్పి నిద్రకు ఒరిగాడు గోపాలం. ఒక గంట గడిచింది. ఒళ్ళంతా ఏవో కుడుతున్నట్లు బాధపడ్డాడు. లేచాడు. లైటు వెలిగించాడు. తెల్లటి దుప్పటి మీద నల్లులు లేచి పరిగెత్తాయి. పట్టుకు నలిపేశాడు కసిగా రామగోపాలం. విచిత్రమనిపించింది, తన పరుపులోకి ఇవి ఎలా యాత్రచేసుక వచ్చాయా అని. బహుశా రైలు పెట్టెల దానం కావచ్చునని సర్దుకున్నాడు. మళ్ళీ కన్ను మూశాడు. ఒరిగాడు. మళ్ళీ శరీరం నిండా కాట్లు ఒక్క క్షణంలో. చీమలేమో అనుకున్నాడు. లైటు వెలిగిస్తే, తెల్లటి దుప్పటి మీద నల్లులు గుంపులుగా చేరాయి. చిత్రమనిపించింది. దుప్పటి బయట దులిపి మళ్ళీ మేనువాల్చాడు రామగోపాలం. మళ్ళీ శరీరం నిండా పోట్లు. లైటు వెలిగించాడు. గోడల మీదికి దృష్టిపోయింది. గోడలనిండా నల్లులు, కురుక్షేత్ర సంగ్రామానికి ఆయత్తమైన కౌరవ పాండవ సైన్యాల్లా బారులు తీర్చి, గోడ తెలుపు ఏమిటో తెలియకుండా అదంతా నల్లుల గోడలు తయారై భయంకరంగా కనిపించింది. అన్ని నల్లులు! సైన్యమా! ఒక్కసారి గోడమీద చూడడం రామగోపాలానికి చాలా చిత్రమనిపించింది. మరుక్షణంలో తిరుపతి దైవం జ్ఞప్తికి వచ్చాడు. ఇంకో క్షణంలో ‘బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ!’ పద్యం కదిలింది మనస్సులో. లైటు కాంతితో… ఆ కాంతికి మించిన ఎరుపు కళ్ళతో, పిచ్చివాడిలా పక్కమీద కూర్చున్నాడు రామగోపాలం. నల్లులు అతన్ని కూర్చోనివ్వడంలేదు; గోడలమీద యాత్రా సంరంభం మానలేదు. ఒకటా రెండా…వేలకు వేలుగా ఉద్భవిస్తున్నాయి. ఈ నల్లుల సైన్యం చూసి భయంతో వణికిపోయాడు గోపాలం.

తలపులు, పాపాల తలపులు, ఏవన్నావుంటే అవి హతమార్చుకుని నిజమైన భక్తుడు ఒకసారి ప్రార్థనచేసి ఆక్రోశించాడు. ఆ జాగరంలో ఆ ఆరాధన జాగృతిలో ఎప్పుడో మైకం కమ్మి ఉదయకాలంలో ఒక్కసారి వాలిపోయి కన్నుమూశాడు. కలవరింతల్లో లేవగానే తెల్లవారింది పూర్తిగా. కంగారుగా గోడలవైపు చూశాడు. ఒక్క నల్లి కనిపించలేదు. పరుపుపట్టి పరిశీలించాడు, నల్లి వాసన లేదు. జరిగింది కలా అని భ్రమపడ్డాడు. కాని తాను చంపిన నల్లుల రక్తపు మరకలు గోడలమీద కనిపించాయి. చిత్రమనిపించింది. ఏది వాస్తవికతో నమ్మలేకపోయాడు రామగోపాలం. రెండు రోజులు ఆ కొండమీద ఉందామనుకున్న నిశ్చయం మార్చుకున్నాడు. తక్షణం సామాను కట్టి బస్సు ఎక్కేశాడు.

నిద్రలేని ఎర్రటి చింతనిప్పుల్లాంటి కళ్ళు ఎవరికీ కనిపించకుండా నల్ల కళ్ళజోడు పెట్టుకున్నాడు. కండక్టరు ఇచ్చిన టిక్కట్టు అందుకుంటూ చుట్టూ ఉన్న వాతావరణం సాఫీగా కలయచూశాడు. నల్ల కళ్ళజోడులోంచి ఎదురుగా సన్నని నాజూకు వనిత. మధ్యవయస్కురాలు. రాత్రి యాత్ర శ్రమనుంచి తేరుకోని వదనం. రేగే జుట్టు… వంకీలు. మెడలో గొలుసు, కళ్ళకు జోడు. ఏమిటో సూటిగా చూస్తోంది తనవైపు. తన కళ్ళు ఆమెకు కనిపించడంలేదనే ధీమాతో రామగోపాలం ఒక్క నిమిషం తన్మయత చెందాడు. తరువాత కంగారుపడ్డాడు. ఆ కొండ పవిత్రత జ్ఞాపకం వచ్చి రాత్రి నల్లుల సైన్యం బాధలు మదిలో మెదిలాయి. భయంవేసింది. తిరిగి శిక్షా?! బస్సు దిగుతోంటే ఏదో లోయలో జారి కొండలమీద దొర్లి తల బ్రద్దలై ఆకస్మికమైన బలవంతపు చావు సంభవిస్తుందేమోనని గుండె దద్దరిల్లింది. ఒక క్షణం ఆమెవైపు చూడడం మానేశాడు.

బస్సు నడుస్తోంది.

అమ్మలక్కలు అనుకుంటున్నారు తిరుపతి దేవుని మహిమల గురించి. పది సంవత్సరాల శూలనొప్పి ఎలా పోయిందీ-పన్నెండేళ్ళ తరువాత పిల్లలు ఎలా పుట్టిందీ-ఒక లక్షాధికారి దేవుడి ప్రసాదం తినకపోవడంతో ఎలా భిక్షాధికారి అయిపోయిందీ, ఒక మనిషి కలలో కనిపించి నిక్షేపాల రహస్యం ఎలా చెప్పిందీ, వింత వింత మహత్తు కథలు చెవుల్లో పడుతున్నాయి.

రామగోపాలం ఎదురు సీటులో కూర్చున్న ఆమె తనవైపే చూస్తోంది. వరూధిని… ఆ తలపులో మరీ తన్మయత చెందాడు రామగోపాలం. చేతిలో అమృతాంజనం తీసుకుని తలకు రాసుకుంటోంది. అవును. అందరికీ త్రిప్పు కలుగుతుంది బస్సు నడకలో. రామగోపాలం కృత్రిమంగా ఆమెవైపు చూడదల్చుకోలేదు. నల్ల కళ్ళజోడు తీసి జేబులో ముడిచేశాడు. ఆమె నవ్వింది, నీ సంగతి నాకు తెలిసిందన్నట్లు. ఆ నవ్వు ఎవరో చిరపరిచిత వ్యక్తి నవ్వినట్లు, ఆత్మీయతతో ఏదో మనస్సు కెలికినట్లు గుండెలు జలదరించాయి రామగోపాలానికి. తనూ నవ్వేడు. ఎవరూ చూడటం లేదుకదా అని పరిశీలిస్తూ ఆమె వెక్కిరించింది పెదాలతో. మరుక్షణంలో మౌనంగా అమాయకమైన వదనంతో కొండలమీదికి దృష్టి ప్రసరించింది ఆమె.

కొండమీద లేళ్ళు పరుగెత్తుతున్నట్లు ఆమె చూపులు రామగోపాలం శరీరం మీద పరిగెత్తాయి.

కొండవాగుల్లో నీరు గలగలమన్నట్లు ఆమె కంకణధ్వనులు రామగోపాలం మనస్సంతా ప్రతిధ్వనించాయి.

కొండలమీద చెట్ల గుబురులు అల్లుకున్నట్లు ఆమె భావాలన్నీ రామగోపాలం శరీరం చుట్టుముట్టాయి. బస్సు ఒడుపుగా, జాయిగా క్రిందకు నడుస్తోంది-

ఆమె ఒడుపుగా జాయిగా వీలుబట్టి రామగోపాలాన్ని పలకరిస్తోంది, చూపుల్లో వెక్కిరింపుల్లో. తిరుపతి ఊరు ఇంక అరమైలు ఉంది. కొండలమీంచి ఆమె బస్సు దిగితే ఏమైపోతుందో.

ఇంతకీ మాట్లాడనే లేదే! గొంతుక సవరించుకున్నాడు రామగోపాలం.

మాట్లాడబోయి ఒకసారి నోరు నొక్కుకున్నాడు. పక్కనే ఉన్న పెద్ద ముత్తైదువను చూసి మరోసారి మరీ ధైర్యం తెచ్చుకుని…

‘అమృతాంజనం– ఒకసారి యిస్తారూ?’ ఆమె వినీ విననట్లు ఊరుకుని నవ్వింది.

‘ఏమండీ!’ మళ్ళీ పిలిచాడు, వినయంగా తన కంఠం అందరికీ వినిపించాలని. అమృతాంజనం అందిస్తూ కొంటెగా వెక్కిరించింది. ఆ కొంటెతనంలో తల దిమ్మెక్కి, ఆ ఉద్రేకంలో సీసా జారిపోయే ప్రమాదం తప్పింది. మెల్లిగా అందుకుని తలకు రాసుకున్నాడు అమృతాంజనం.

‘వెధవ తలనొప్పి!’ ఏమనాలో తెలియక తనలో తాను స్వగతంగా పలుక్కున్నాడు రామగోపాలం.

బస్సు ప్రయాణీకుల వదనాలు చిరునవ్వుతో వెలిగాయి రామగోపాలం స్వగతం విని.

ఆమె ముత్యాల పలువరసలు తళుక్కున మెరిశాయి. నవ్వు ఆమెలో వెల్లివిరిసింది.

అమృతాంజనం సీసా అందిచ్చేశాడు తిరిగి ఆమెకు. బస్సు కొండ దిగుతోంది.

దుష్యంతుడు-శకుంతల ఊహల్లో మెదిలేరు. మరుక్షణంలో, నలదమయంతులు కనిపించారు.

సమావేశం, వియోగం రెండూ ఒక్క క్షణంలో వచ్చినట్లు గజగజ బాధపడ్డాడు రామగోపాలం. కొండ మహిమకు దూరమైయాను కనుక సాహసం చేస్తే… రామగోపాలం సతమతమయ్యాడు. ఆమె చూపుల్లో బాధ ఆనందం తన్మయత ఆదేశం ఆత్రుత అభిమానం- ఏమిటో ఎన్నెన్నో భావాలు. అన్ని భావాలు మాటల్లేకుండా వ్యక్తపరిచే ఆ వ్యక్తి తనకు వరూధిని. నిజంగా ఆమె వీణ వాయించినట్లు అతను విన్నట్లు ఏదో కలలోకి జారి, మళ్ళీ బస్సు కుదుపుతో బస్సులోకి మారాడు.

బస్సు దేవస్థాన సత్రవు చేరింది. చేరగానే హల్లో హల్లో అంటూ జేబు రుమాలు ఆడించింది ఆమె, బయట ఎవరో కారులో కూర్చున్న మనుషులను చూసి.

‘థ్యాంక్సు.’ అన్నాడు రామగోపాలం బస్సు దిగుతున్న ఆమెను చూసి.

ఆమె కొంటెగా మూతి త్రిప్పుకొని నవ్వింది. ఒక్కమాట మాటాడకూడదా అనుకున్నాడు రామగోపాలం.

ఆమె దిగింది. ఆమె పరివారం, పెద్ద ముత్తైదువ, ఇద్దరు పిల్లలూ, దిగారు. మౌనంగా వీధిలో కాపలా కాచుకునే కారు మనుషులు సామాన్లు కారులో పెట్టారు.

ఏవో పనులు పురమాయించుకుని కారు మనుషులు నడిచి ఊరిలోకి వెళ్ళారు.

ఆమె రెండు గజాల దూరంలో కారు వద్ద నుంచుంది. రామగోపాలం సామాను పక్కన నుంచున్నాడు.

ఏం చేయాలి?

ఆమె నవ్వు అతన్ని మరీ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉత్సాహంగా గెంతింది కారువైపు. లోపలి ఆడపిల్లల్ని బయటికి లాగింది అల్లరిగా. ముంజెలు కొని యిద్దరికీ ఇచ్చింది. అవి వల్చుకు తింది ఆమె. మధ్యలో ‘కావాలా?’ అన్నట్లు అందించింది కొంటెగా, గాలిలోంచి. రామగోపాలం ద్రాక్షపళ్ళు కొన్నాడు.

‘బాధ’ అన్నట్లు ముఖం చిట్లించాడు.

‘అయ్యో’ అన్నట్లు ఆమె జాలి చూపించింది.

‘ఏం చెయ్యను?’ అన్నట్లు జాలిముఖం వేశాడు రామగోపాలం.

‘ఏడువు!’ అన్నట్లు వెక్కిరించింది ఆమె.

‘ఊ!’ అన్నాడు లోలోపల కోపంగా రామగోపాలం మౌనంగా.

‘ఆ!’ అంది ఆమె కళ్ళు పెద్దవి చేసి.

జేబులోంచి విజిటింగ్ కార్డు తీశాడు రామగోపాలం, ‘ఇది నా ఎడ్రసు!’ అన్నట్లు.

ఆమె దగ్గర ఎడ్రసు కార్డు లేదుగా, తెల్లబోయింది ఏం చేయాలో తెలియక.

ఆమె ఎడ్రసు? రామగోపాలం తల గోక్కున్నాడు. గబుక్కున కారువైపు చూశాడు.

నెంబరు… మద్రాసు కారు… మద్రాసు పోతోందా ఈ కారు, తనూ మద్రాసు వెడితే…

ఇంతలో కారు మనుషులు వచ్చారు. లోన కూర్చుని హారను కొట్టారు.

మెల్లిగా బరువుగా బాధగా కారులో కూర్చుంది వెనకగా…ఆమె.

తింటున్న ద్రాక్ష పండు రామగోపాలం పంటిమధ్య నిశ్చేష్టగా నిలుచుండిపోయింది…

ఆమె కళ్ళజోడులోంచి నయనాలు జాలి కన్నీరు కార్చాయి. ‘టాటా…’ అన్నట్లు చెయ్యి ఆడించింది.

తన విజిటింగు కార్డు కారులోకి విసిరేద్దామనుకున్నాడు రామగోపాలం.

ఒక చెయ్యి ఎత్తాడు. చేతిలో ద్రాక్ష పళ్ళ గుత్తి బూడిదలో రాలిపోయింది-

కారు పారిపోయింది-

ఆమె విలాసం? తిరుపతి? తర్వాత గుండెల్లో మంటలు, మెదడు పనిచేయనని సహాయనిరాకరణోద్యమం ప్రారంభించింది.

ఆఫీసు పని-తిరుపతి యాత్ర మరచిపోయాడు. పరుగెత్తాడు, మధ్యాహ్నం కారులో మద్రాసు.

రామగోపాలం తిరిగాడు మద్రాసులో పిచ్చిగా. ఆ కారు నెంబరు తిరుపతి దేవుని నామంలా అతని హృదయంలో హత్తుకుపోయింది. సముద్ర తీరంలో తిరిగాడు. ఆ సన్నని నాజూకు వనిత వంకీల జుట్టు పసుపుపచ్చటి చీర ఎర్రని రవిక-ప్రతి స్త్రీనీ పరిశీలించాడు. ఆమె కాదు.

కెరటాలు పలకరిచాయి రామగోపాలాన్ని. అడిగాడు-ఆమె ఎక్కడ? అని.

కెరటాలు నురుగులతో నవ్వాయి, అతని పిచ్చి చూసి.

కెరటాల మీద విష్ణువు సముద్ర మధ్యంలో శేషశయ్య మీద ఉంటాడుగా! తిరుపతి స్వామి దృష్టిలో మెదిలాడు. కారు నెంబరు ఆయన నామంలో కలిసినట్లు కనిపించింది.

‘ఆమె విలాసం?’ ప్రశ్నించుకున్నాడు లోలోపల రామగోపాలం.

‘నా విలాసం.’ అన్నట్లు నవ్వాడు తిరుపతిస్వామి అతని ఊహల్లో.

‘తిరుపతి విలాసం.’ గొణుక్కున్నాడు రామగోపాలం.

సముద్ర కెరటాలు హోరుమని గెంతాయి.

ఇసుక రేణువులు కొల్లలుగా తడిశాయి.

సముద్ర తీరమంతా జనం సందడిలో మునిగింది-రాత్రి పడింది-అంతా చీకటి ఆవరించింది ఆ సముద్ర తీరం గుంపుల్లో.

రామగోపాలం మద్రాసు విడిచి మెల్లిగా యిల్లు చేరాడు. ఏడు మెట్లు ఎక్కి ఆఫీసు గదిలో కుర్చీలో వాలాడు. విధ్యుక్త ధర్మం ఎదురుగా ఫైల్స్ కట్టలు చూపించింది-

ఆ కట్టల్లో ఆమె మెదిలింది-

ఆమెలో కారు నెంబరు. నెంబరులో తిరుపతిస్వామి నామం కదిలాయి.

ఆ ఏడు మెట్ల ఆఫీసు గది ఏడు కొండల తిరుపతిలా మారింది.

“ఇది తిరుపతి విలాసం!” బాధగా నవ్వుకున్నాడు రామగోపాలం.