అదీ నేనే…

నీ చిరునవ్వులన్నీ
నాకు నేను నచ్చిన క్షణాలేననీ
నీ పెదవుల మీద చూసుకుంటుంటాననీ,
నీ చిరాకు
నా మీద నాకు ముంచుకొస్తున్న అయిష్టమనీ
నీ మాటల్లో వెతుకుతుంటానంతేననీ…

ఎప్పటికప్పుడు సరికొత్తగా అనిపిస్తుండే
మార్పెరుగని ఓ పసితనమే ప్రేమ అని
నా మీద నాకున్న ఇష్టమే చెప్పింది
మనసుని మందహాసమై పలకరిస్తూ!

నీలో ప్రతిబింబించేది తనేననీ
నన్నో
ప్రశ్నార్థకంగా మారుస్తూ అంతలోనే
జవాబుల్నీ నానుండే విడదీస్తుందనీ
ఆలోచనల పదునుపెట్టడం
అసహనాలని కత్తిరించడానికేననీ…

అడుగు ముందుకేయలేని ఓ అంధకారాన
వెనక్కి తిరిగిపోతుంటే
ఇలా ఓ వెలుగుకిరణాన్నిచ్చి
నీవైపుకు మళ్లమని
వెన్నుతట్టింది
మళ్ళీ నా మీదున్న ఇష్టమే!