సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు

వాసవదత్తలోని కథాంశం చిన్నదయినా, కావ్యమంతా అడుగడుగున అచ్చెరువు గొలిపే విద్వత్కర్ణరసాయనవర్ణనాపూర్ణంగా రూపుదిద్దుకొంది. ఊపిరి సలుపనీయని కథనవేగంతో సుబంధుడు రౌచికులకు మెచ్చుగొలిపే వినూత్నమైన శైలిని కదనుతొక్కించాడు. అది పూర్తిగా కవి స్వీయకపోలకల్పితమే కాని అన్యాధారితం కాదని విమర్శకులు నిశ్చయించారు. అత్యంత ప్రామాణికమైన The Sanskrit Drama in its Origin, Development, Theory and Practice గ్రంథంలో ఎ.బి. కీథ్ దీనిని స్వతంత్రకృతి అనే నిర్ధారించారు. వస్తువిస్తారం అంతగా లేకపోయినా అరమరిక లేని దృశ్యీకరణకౌశలం, తనకు బోధ్యమానమైన సమస్తాన్నీ పాఠకులకు అందజేయాలనే అహమహమిక మనకు సమ్మోహకంగా ఉంటాయి. రాజాస్థానాలను అద్ధావాగ్విబుధం కావించే ఆ మహారచన మనోమందిరంలో సుప్రతిష్ఠితమైనాక, కావ్యసుఖసంగమలీలకు ఉత్సహించే తెనాలి రామలింగకవి వంటివారు ఆంధ్రీకరణకు ఉత్సవించటం సహజమే. సుబంధుని రచన అత్యంత సంక్షేపరూపం కాబట్టి రామలింగకవి దానిని సమకాలిక ప్రబంధోచితమైన ప్రణాళికతో తన ఇతరకావ్యాలలో వలె హృద్యమైన సంవాదకల్పనతో నానాపాత్రప్రవేశనిష్క్రామకంగా విస్తరింపజేసి ఉంటాడు. మూలంలో గృహీతోన్ముక్తంగా పొడమిన భావసంపుటికి రసవదర్థవిస్తారంతో సౌభాగ్యాన్ని అలవరించి ప్రబంధానికి ఇంపుసొంపులను కూర్చివుంటాడని ఊహింపవచ్చును. కథానాయకుడైన కందర్పకేతుడు వాసవదత్తను కలలో చూసి, ఆమెకోసం చింతామగ్నుడైనప్పుడు అతని ఇష్టసఖుడు మకరందుడు అక్కడికి వచ్చి అతని పరధ్యానానికి కారణమేమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు కందర్పకేతుడు మకరందునికి తన చిత్తస్థితిని వివరించిన సన్నివేశంలోని మాటలివి:

…(కథ మపి స్మరప్రహారపరవశః పరిమితాక్షర మువాచ). వయస్య! దితి రివ శతమన్యుసమాకులా భవతి సజ్జనచిత్తవృత్తిః. నా య ముపదేశకాలః పచ్యన్త ఇ వాఙ్గాని. క్వథ్యన్త ఇ వేన్ద్రియాణి. భిద్యన్త ఇవ మర్మాణి. నిస్సర న్తీవ ప్రాణాః. ఉన్మూల్యన్త ఇవ వివేకాః. న ష్టేవ స్మృతిః. త దధునా యది త్వం సహపాంసుక్రీడిత సమదుఃఖసుఖోఽపి తదా మా మనుగచ్ఛ…

ఈ భాగానికి రామలింగకవి అనువాదం ప్రసన్నపదబంధంతో గంభీరార్థనిగుంఫితంగా అలరారింది. పూర్వాపరాలను ఎంతో జాగ్రత్తగా గమనిస్తే గాని ఇది అనువాదమని గుర్తించటం కష్టం. ఆ పద్యాన్ని చూడండి:

అ క్కమలాక్షిఁ గన్గొనినయప్పటి నుండియు నేమి చెప్ప! నా
కెక్కడఁ జూచినన్ మదనుఁ, డెక్కడఁ జూచిన రోహిణీవిభుం,
డెక్కడఁ జూచినం జిలుక, లెక్కడఁ జూచినఁ గమ్మగాడ్పు, లిం
కెక్కడ వెట్ట యోర్వఁగల నీ విరహానల తాపవేదనన్.

ఇది పెదపాటి జగన్నాథకవి సంకలనించిన ప్రబంధరత్నాకరము ద్వితీయాశ్వాసంలో 95వదిగా ఉదాహరింపబడి ఉన్నది. మూలంలో నిస్సర న్తీవ ప్రాణాః (ప్రాణాలు పోతున్నట్లుగా ఉన్నది), క్వథ్యన్త ఇవ ఇన్ద్రియాణి (ఇంద్రియాలు ఆర్చుకుపోతున్నట్లుగా ఉన్నాయి), భిద్యన్త ఇవ మర్మాణి (లోలోపల చీల్చివేస్తున్నట్లుగా ఉన్నది) – ఇత్యాదిగా వివక్షిత అన్యపరవాచ్యమైన అభిధామూలధ్వని తెలుగులో ఎక్కడఁ జూచినఁ గమ్మగాడ్పులు, ఎక్కడఁ జూచిన రోహిణీవిభుండు, ఎక్కడఁ జూచినం జిలుకలు అని కవినిబద్ధమైన వక్తృప్రౌఢోక్తిసిద్ధ – అర్థమూల – అలంకారధ్వనిగా సుసంస్కృతమై వన్నెమీరుతున్నది. ఎంతో జాగ్రత్తగా పరిశీలించితే గాని –

నిస్సర న్తీవ ప్రాణాః – ఎక్కడఁ జూచినఁ గమ్మగాడ్పులు
క్వథ్యన్త ఇవ ఇన్ద్రియాణి – ఎక్కడఁ జూచిన రోహిణీవిభుండు
భిద్యన్త ఇవ మర్మాణి – ఎక్కడఁ జూచినం జిలుకలు

వంటివి సమసంస్కృతాలుగా తెలుగుచేయబడినవని ప్రథమదృష్టికి స్ఫురించటం కష్టమే కాని, విరహోద్వేజనం వల్ల గాడ్పులకు ప్రాణభంజకత్వం, చల్లదనాన్ని ప్రసాదించే రోహిణీవల్లభునికి క్వథనగుణం, శ్రుతిసుభగాలైన చిలుక పలుకులకు కఠోరత అన్నవి ఉపాలంభనవిషయాలై ఆక్షేపతిరస్కృతాలు కావటం ప్రసిద్ధమే కదా. రోహిణీవల్లభాది స్మరణం విరుద్ధకార్యోద్భావమైన ఇంద్రియక్వథనంగా పరిణమించటం ఇక్కడ అనువాదంలోని విశేషం. మూలంలో కేవలానుభవనీయమై నిర్విశేషంగా ఉన్న కథనాన్ని అననురూపసంసర్గాత్మకం చేసి విరోధాన్ని గర్భీకరించటం మూలాన ప్రబంధార్థం వ్యంగ్యవ్యంజకతను సంతరించుకొన్నది. పద్యాంతంలో ఇం, కెక్కడ వెట్ట యోర్వఁగల నీ విరహానల తాపవేదనన్ అన్న వినిర్దేశం వల్ల అంతవరకు గమ్యమానంగా ఉన్న విరూపకార్యోత్పత్తి వాచ్యమై, మూలానికి వ్యాఖ్యానప్రాయంగా అమరింది. విరహావస్థాలోలుడైన నాయకునికి సత్త్వత్యాగాన్ని చిత్రించి ధీరోదాత్తతకు భంగాన్ని కలిగించటానికి మారుగా ప్రియావియోగజనితమైన దైన్యాన్ని అన్యాపదేశవచోరూపాన వ్యజ్యమానం చేయటమే సముచితంగా ఉన్నది.

ఈ పద్యరచనావేళ రామలింగకవి మనస్సులో అనంతామాత్యుని భోజరాజీయంలో సంపాతి నరేంద్రుని కుమార్తె పుష్పగంధి వసంతకాలం రాగానే చెలికత్తెలతో ఉద్యానవనంలోకి అడుగుపెట్టిన సన్నివేశం మనస్సులో ఉన్నది కాబోలు. వర్ణ్యవిషయం వేరయినా, పద్యాల ఎత్తుగడ ఒకటే.

అనంతుని పద్యం –

ఎక్కడఁ జూచినం జిలుక, లెక్కడఁ జూచినఁ గోకిలమ్ము, లే
చక్కటిఁ జూచినన్ సమదషట్పదసంఘము, లెందుఁ జూచినం
జొక్కపు శారికల్ ఋతువు సొంపు నుతింప వశంబె! పువ్వుఁదే
రెక్కిన పంచసాయకుఁడు యెద్దెసఁ జూచిన న వ్వనంబునన్.

అని. తంజావూరులో ఉన్న ప్రబంధసారశిరోమణిలోనూ (అక్కడి పద్యసంఖ్య 236), మానవల్లి రామకృష్ణకవి ప్రకటించిన ప్రబంధమణిభూషణములోనూ (అందులోని పద్యసంఖ్య 251) ఎవరు రచించినదో, ఏ కావ్యంలోనిదో తెలియని ఇటువంటిదే, పద్యం ఒకటున్నది:

ఎక్కడఁ జూచినం జిలుక, లెక్కడఁ జూచినఁ గోకిలంబులు,
న్నెక్కడ నైనఁ బుష్పముల నేఁచి సుడిన్ భ్రమియించు తుమ్మెదల్,
వెక్కసమయ్యె నామని సవిస్తరసంపద నేమి చెప్పుదున్!
ఱెక్కలతేజి పుప్పొడులు రేఁగి వసంతము లాడె నయ్యెడన్.

ఈ రెండు పద్యాలలోనూ వసంతఋతువు సౌభాగ్యమే వర్ణ్యవిషయం. అంతేకాక రెండింటిలోనూ మొదటి పాదం ఏకరూపంగానే ఉన్నది. విషయవిభేదంతోపాటు రామలింగకవి రచనలోని ధ్వన్యధ్వన్యతను కూడా చూడవచ్చును. ఈ ముగ్గురు కవుల పద్యశిల్పానికి ఆద్యప్రకృతి శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో (3-23) కనబడుతుంది:

ఎక్కడఁ జూచినన్ సరసి, యెక్కడఁ జూచిన దేవమందిరం,
బెక్కడఁ జూచినం దటిని, యెక్కడఁ జూచినఁ బుష్పవాటికం,
బెక్కడఁ జూచినన్ నది – మహీవలయంబున భీమమండలం
బెక్కడ? నన్యమండలము లెక్కడ? భావన చేసి చూచినన్.

అగస్త్యుడు వేదవ్యాసుని మనఃఖేదాన్ని అనునయింపగోరి గోదావరీతీరాన నెలకొన్న భీమమండలం మహిమను అభివర్ణించిన ఈ పద్యశిల్పాన్ని మనస్సులో ప్రతీకగా నిలుపుకొన్న రామలింగకవి కందర్పకేతు విలాసానికి మునుపే చెప్పిన తన ఉద్భటారాధ్య చరిత్రలో సైతం ప్రమథేశ్వరుడు వారాణసీ పుణ్యక్షేత్రంలోని విశ్వేశ్వరాలయాన్ని సందర్శించిన ఘట్టంలో దీనినే అనుసరించాడు:

ఎక్కడఁ జూచినం బ్రమథు, లెక్కడఁ జూచిన యోగిమండలం,
బెక్కడఁ జూచినన్ ఖచరు, లెక్కడఁ జూచిన సిద్ధయౌవతం,
బెక్కడఁ జూచినన్ సుకృతు, లెక్కడఁ జూచిన మూర్తితోడఁ బెం
పెక్కిన వేదముల్ గలిగి యెల్ల సమృద్ధులఁ దేజరిల్లుచున్.

ఈ విధంగా సుబంధుని వాసవదత్తా కథకు యథావదనువాదం కావటం వల్ల, పద్యపు పోకడను బట్టి పైని ఉదాహరించిన అ క్కమలాక్షిఁ గన్గొనినయప్పటి నుండియు నేమి చెప్ప! అన్న పద్యం తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసంలోనిదే అని నిశ్చయింపబడుతున్నది.

ఇదే సన్నివేశంలో తెనాలి రామలింగకవికి తర్వాత సుబంధుని రచనను ఆంధ్రీకరించిన వక్కలంక వీరభద్రకవి తన వాసవదత్తా పరిణయము (1-231) లో కొంచెం ఇంచుమించుగా చేసిన అనువాదం కూడా పరిశీలింపదగినదే:

కన్నులఁ గట్టినట్ల పొడకట్టెడుఁ గన్నియ చిన్నెలెల్ల నా
కన్నియు; నేమనం దగు హృదంతరతాపము దీఱఁ గూర్మితో
న న్నలినాయతాక్షి మధురాధరబింబసుధారసంబు నా
కెన్నటికైనఁ గల్గు నొకొ? యీ జననంబునకున్ ఫలంబుగన్.

ఈయనకు రామలింగకవి వలె శబ్దచిత్రాలపై అంతగా అభిమానమూ, ఆ విధమైన సౌందర్యదృష్టీ లేనందువల్ల కథాకథనాన్ని ప్రధానంగా పెట్టుకొని కావ్యాన్ని త్వరితగతిని లాగివేశాడు. ప్రత్యేకించి చదివినప్పుడు బాగున్నట్లే ఉంటుంది కాని, మహాకవి రచనతో పోల్చిచూసినప్పుడు మాత్రం సాటిరాదనిపిస్తుంది.

(ఇంకా ఉంది)


జ్ఞాపికలు

1. జీయా ద్గద్యసుధాధున్యాః సుబన్ధుః ప్రభవాచలః
య ద్భఙ్గాశ్లేష మాసాద్య భఙ్గః కవిభి రాశ్రితః.

భంగాశ్లేషమనే వైశిష్ట్యవశాన గొప్పగొప్ప కవులకు కూడా భంగపాటు నొదవించే గద్యము అనే అమృతప్రవాహానికి పుట్టుగొండ అయిన సుబంధు మహాకవి కలకాలం జీవించాలి గాక! అని స్థూలార్థం.

భఙ్గాశ్లేషం వల్ల – అంటే మూడర్థాలు:

౧) భఙ్గ+ఆశ్లేషం = భంగు అనే మత్తుమందును సేవిస్తే కలిగేటటువంటి (తత్సంబంధయుక్తి వలని), భఙ్గః = స్వస్థతా భంగరూపమైన పారవశ్య సిద్ధి. భఙ్గో వీచిషు విఖ్యాతో భఙ్గో జయవిపర్యయః, భఙ్గో భేదే రుజాయాం చ భఙ్గా శస్యం శణాహ్వయమ్ అని ధరణిదాసుని ధరణికోశం.

౨) భఙ్గమంటే జలనిర్గమం, ఆశ్లేషమంటే తత్సంబద్ధత. భఙ్గాశ్లేషం = మహాప్రవాహం ముంచెత్తివేస్తున్న భావం మూలాన, భఙ్గః = జలదరింపు. భఙ్గ ఉత్కలికావలిః అని హర్షకీర్తి శారదీయ నామమాల. భే దోర్మి భక్తి కౌటిల్య భీషు భఙ్గః స్త్రియాం శణే, వేగః ప్రవాహ జయయోః అని మంఖ కవి మంఖకోశం.

౩) భఙ్గ+ఆశ్లేషం ఆసాద్య = సభంగ అభంగాది శ్లేషల పొందిక వల్ల కావ్యార్థం పూర్ణానుభవానికి రానందువల్ల కలిగే (వాచః కాఠిన్య మాయాన్తి భఙ్గాశ్లేషవిశేషతః అని త్రివిక్రమ భట్టు నల చంపువు (1-16) లో వ్రాసిన శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి), భఙ్గః = భంగపాటు. భఙ్గ స్తరఙ్గే భేదే చ రుగ్విశేషే పరాజయే, కౌటిల్యే భయ విచ్ఛిత్త్యోః అని హేమచంద్రుని అనేకార్థసంగ్రహం.

గద్యము అనే పాదనియమరహితమైన కావ్యబంధముతోడి మెచ్చితీరవలసిన రసప్రవాహానికి (అసలు గద్యము అంటేనే మెచ్చవలసినది అని అర్థం) పుట్టుగొండ అయిన సుబంధుని కవితలో రసమాధురిని గ్రోలిన కవులకు భంగు అనే మత్తుమందును సేవిస్తే కలిగే పారవశ్యసిద్ధి; సమాసభూయిష్ఠమైన సుబంధుని గద్యస్రవంతి ఉరవడికి మహాప్రవాహం ముంచెత్తివేస్తున్న భావం మూలాన కవులకు (= జలపక్షులకు అని మరొక అర్థం) మేనంతా గగుర్పాటు; ఒక పట్టాన లొంగని కఠినమైన శ్లేషల వల్ల మాటిమాటికి అర్థాలు వెతుక్కోవలసివచ్చి సభలలో సాటివారి ముందు భంగపాటు అని – మొత్తం మీద ప్రకృతాప్రకృతంగా మూడర్థాలు స్ఫురిస్తున్నాయి.

పీటర్ పీటర్సన్ 1887లో ప్రకటించిన Third Report of Operations in search of Manuscripts in the Bombay Circle (పుట-35; అనుబంధం పుట-55) ఆధారంగా – 1912 లో మహావిద్వాంసులు లూయీ హెచ్ గ్రే మూలసమేతమైన తమ అనువాదం Vasavadatta, A Sanskrit Romance of Subandhu పీఠిక (పు.42) లో ఈ శ్లోకాన్ని లక్ష్మణుని సూక్తావళి లోనిదిగా ఉదాహరించారు.

2. సా రసవత్తా విహతా నవకా విలసన్తి చరతి నో కఙ్కః
సరసీవ కీర్తిశేషం గతవతి భువి విక్రమాదిత్యే.

విక్రమాదిత్యుడు భూమిని విడనాడినందువల్ల లోకంలో అసలు రసవత్త అనేదే లేదని (రసవత్త అంటే రసమును = నీటిని కలిగిఉండటమనీ, శృంగార వీరాది రసవంతమై ఉండటమనీ రెండర్థాలు. విక్రమాదిత్యుడు (విక్రముడు అనే సూర్యుడు) అస్తమించినందువల్ల లోకం నీరస (రసము లేక) నిర్జీవమైనదనీ, లోకంలో వీరరససిద్ధులు లేకపోయారనీ భావం); చరతి నో కఙ్కః = నీరు లేనందువల్ల తదర్థమై కొంగలు రావటం లేదనీ, కం = ఒకానొక బలవంతుని, కః = ఒకానొక బలవంతుడు, నో చరతి = భక్షించటం లేదనీ (శత్రురాజ్యాలను మట్టుపెట్టగల శక్తిమంతులైన రాజులు లేరనీ); సరసుల విషయం కీర్తిశేషం అయిందనీ – అంటే ఇప్పుడు సరసులైనవారు లేరని, కీర్తి అంటే బురద అనే అర్థం కూడా ఉన్నది కనుక – ఒకప్పుడు తీర్థ జలాశయాలుండిన చోట ఇప్పుడు బురదగుంటలు మిగిలాయనీ (సమస్తం క్షీణోన్ముఖం అయిందని) ఇందులో శ్లేషార్థాలు కనబడుతున్నాయి. ఇవిగాక కఙ్క శబ్దం వృష్ణివంశ మహారథులను సూచిస్తున్నదని, విరాటరాజు కొలువులో ధర్మరాజు గైకొన్న ప్రచ్ఛన్ననామానికి జ్ఞాపకమని చమత్కారపరంపరను వ్యాఖ్యాతలు ఊహించారు.

ఏల్చూరి మురళీధరరావు

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి: ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి "తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. ...