సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు

ఇవికాక, వాసవదత్తా కథలోని చంద్రబింబానువర్ణన భాగాన్ని శ్రీనాథుడు స్వీయేచ్ఛానుసారంగా తెలుగుచేసిన పద్యఖండాలు భీమేశ్వర పురాణంలో కమనీయంగా అమరాయి:

వాసవదత్తా కథ: ప్రాచీకుమారీ లలాటతటఘటిత కుఙ్కుమతిలకబిన్దౌ.

భీమేశ్వర పురాణం: ప్రథమసంధ్యాంగనా ఫాలభాగంబునఁ జెలువారు సిందూరతిలక మనఁగ. (2-49)

వాసవదత్తా కథ: కనకదర్పణ ఇవ ప్రాచీవిలాసిన్యాః.

భీమేశ్వర పురాణం: కైసేసి పురుహూతు గారాపు టిల్లాలు పట్టిన రత్నదర్పణ మనంగ. (2-49)

మొదలైనచోట్ల ఈ అనువాదం మూలాతిశాయికంగా ఉన్నది. ప్రాచీకుమారి అనటం కంటె ప్రథమసంధ్యాంగన అన్నందువల్ల కల్యాణాంగత్వం ప్రస్ఫుటమై సౌభాగ్యాతిశయం ధ్వనిస్తున్నది. దర్పణానికి రత్న సువర్ణాదుల ధర్మావబోధకత్వం సుప్రసిద్ధమే కాని, ప్రాచీవిలాసిని అన్నప్పటి కంటె పురుహూతు గారాపు టిల్లాలు అనటం వల్ల అనువాదంలో దంపతీ శృంగార భావానురక్తి, తెలుగు నుడికారపు సొంపు అందంగా కొలువుతీరాయి. సుబంధుని మూలంలోనే –

అనన్తరం… శ్వేతాతపత్ర మివ మకరకేతోః… స్ఫాటికలిఙ్గ మివ గగనమహాతపసస్య… పుణ్డరీక మివ గగనగామిగఙ్గాయాః… భగవా నుడుపతి రుజ్జగామ

అని ఉన్న రూపణను స్వీకరించి, అపహ్నావారోపాలతో శ్రీనాథుడు చెప్పగా (భీమ. 2-42) నలుగురి గుండెల్లో గుడికట్టుకొన్న పద్యం ఇది:

కాదుకా దుదయాద్రి కనకకూటం బిది, డంబైన పానవట్టంబు గాని
కాదు కా దిది సుధాకరపూర్ణబింబంబు, కాశ్మీర శంభులింగంబు గాని
కాదుకా దుదయరాగప్రకాశం బిది, నవకుంకుమాలేపనంబు గాని
కాదు కా దిది కళంకచ్ఛటారించోళి, పూజచేసిన కల్వపువ్వు గాని

యనఁగ సప్తార్ణవములు మి న్నందికొనఁగఁ
జంద్రకాంతోపలంబులు జాలువాఱ
నసమశరసార్వభౌము ముత్యాలగొడుగు
విధుఁడు విశ్వంబు వెన్నెల వెల్లిఁ దేల్చె.

ఇందులో శ్వేతాతపత్ర మివ మకరకేతోః – అసమశరసార్వభౌము ముత్యాల గొడుగు; పుణ్డరీక మివ – పూజచేసిన కల్వపువ్వు; స్ఫాటికలిఙ్గ మివ – కాశ్మీర శంభులింగంబు అన్నవి స్వచ్ఛానువాదాలు. తక్కినదంతా స్వేచ్ఛానువాదం. శ్రీనాథుని ఈశ్వరార్చనకళాశీలానికి పట్టిన ముత్యాల గొడుగిది. ఆయన కాదుకా దుదయాద్రి కనకకూటం బిది, డంబైన పానవట్టంబు గాని అని చంద్రునికి ఉదయపర్వతం పానవట్టమై గోచరించిన కల్పనను పురస్కరించుకొని మహాకవి ధూర్జటి పెంపుచేసి, తన కాళహస్తిమాహాత్మ్యములో అద్భుతావహమైన ఈ పద్యాన్ని వ్రాశాడు:

ఉదయగ్రావము పానవట్ట, మభిషేకోదప్రవాహంబు వా
ర్ధి, దరధ్వాంతము ధూపధూమము, జ్వలద్దీపప్రభారాజి కౌ
ముది, తారానివహంబు లర్పితసుమంబుల్ గాఁ దమోదూరసౌ
ఖ్యదమై శీతగభస్తిబింబశివలింగంబొప్పెఁ బ్రాచీదిశన్.

అని. సూక్షపరిశీలన కావిస్తే శ్రీనాథుని ఇతరకృతులలోనూ సుబంధుని వాసవదత్తా కథ నుంచి లెక్కలేనన్ని అనువాదాలు కనుపిస్తాయి:

వాసవదత్తా కథ: జరత్తరుకోటర కుటీర కుటుమ్బినికౌశికకులే.

కాశీఖండం: జరత్తరుకోటర జఠరలుఠత్. (2-148)

వాసవదత్తా కథ: శేఫాలికా శిఫావివర విస్రబ్ధవర్తమానగౌధేయరాశినా.

కాశీఖండం: శేఫాలికా కుసుమకేసరరజఃప్రసరధూసర వాసరకర కరవ్రాతంబును. (2-148)

వాసవదత్తా కథ: కులిశశిఖర ఖరనఖరప్రచయ ప్రచణ్డ చపేతపాటిత మత్తమాతఙ్గ.

కాశీఖండం: ఉగ్రతర శరభ చటుల చపేటపా[?టి]త మోహిత రోహితంబును. (2-148)

వంటివి ఆంతరతమ్యాలు అనేకం కనబడతాయి.కాశీఖండం ముద్రితప్రతులలో ‘ఉగ్రతర శరభ చపేట పాత’ అని ఉన్నచోట అర్థావగతి ప్రకారం సుబంధుని మూలాన్ని అనుసరించి, ‘ఉగ్రతర శరభ చటుల చపేట పాటిత’ అని సరిదిద్దుకోవాలి. వాసవదత్తా కథను కన్నడంలోకి అనువదించిన మహాకవి నేమిచంద్రుడు తన లీలావతీ ప్రబంధంలో ఈ వాక్యాన్ని స్వీకరింపలేకపోయిన లోపాన్ని పూరించటానికో ఏమో గాని, ఆ తర్వాత చెప్పిన అర్ధనేమి పురాణం (3-47) లో దీనిని నేమినాథుని ప్రథమజన్మవృత్తాంతవేళ కల్పనకు పురస్కరించుకొన్నాడు:

గిరి గురు చపేట పాటిత
కరియం హరికొండు కీఱి పాఱువు దరుణా
త్యరుణ తను తరుచరేంద్రం
శరధిగె కర్బిట్టవెత్తి పాఱువ తెఱదిం.

అని. కన్నడ వాఙ్మయాభిమానులు గుర్తింపవలసిన అంశం కనుక ఇక్కడ పేర్కొన్నాను. నేమిచంద్రుడు గురు చపేట పాటిత మత్తమాతఙ్గః అన్న దళాన్ని ఉన్నదున్నట్లు గురు చపేట పాటిత కరియం అని కన్నడీకరించాడు.

ఇక, శ్రీనాథానంతరయుగీనులలో సుబంధుని స్మరించిన మహాకవులలో అరుణాచల పురాణ కర్త పెదపాటి సోమనాథుడు, విక్రమార్కచరిత్ర నిర్మాత జక్కన స్మరణీయులు. ఆయన పదసంపదను, ఊహల పోహళింపును సంస్కృతంలో నుంచి సగౌరవంగా అనువదించటమే గాక, ‘సకల నిపీత నిశాతిమిరసంఘాత మతితనీయ స్తయా సోఢు మసమర్థే ష్వివ కజ్జలవ్యాజా దుద్వమత్సు’ అన్న భావానికి

బహుళ జలప్లవమాన
ద్రుహిణాండము చెమ్మ యుఱికి రూక్షార్కవిభా
రహితతఁ గాటుకపట్టెను
రహి చెడి యన నంధతమసరాసులు బెరసెన్.

అంటూ మనుచరిత్రలో (3-18) చిత్రిక పట్టిన అల్లసాని పెద్దనగారు అవతారికలో ‘వచశ్శుద్’ కోసం సుబంధుని ప్రస్తుతించారు. శ్రీనాథుడు వాసవదత్తా కథలోని ‘కున్తలీ కున్తలోల్లాసన సఙ్క్రాన్త పరిమల మిలితాలిమాలా మధురతరఝఙ్కార ముఖరితనభస్తలః’ అన్న సుబంధుని చిత్రశిల్పానికి ఆకర్షితుడై కాశీఖండంలో (1-92):

దరవికచ వకుళ కురవక
పరిమళసంభారలోల బంభరమాలా
పరిషజ్ఝంకారధ్వని
తెరువరులకు మన్మథప్రదీపన మొసఁగున్.

అని అనువదించిన పద్యాన్నే ఆదర్శంగా నిలుపుకొని పెద్దన్నగారు ప్రవరుడు హిమవన్నగోపాంతభూములపై అడుగుపెట్టిన (2-6) సన్నివేశంలో –

ఉల్లలదలకా జలకణ
పల్లవిత కదంబముకుళ పరిమళలహరీ
హల్లోహల మదబంభర
మల్లధ్వను లెసఁగ విసరె మరుదంకురముల్.

అని హృద్యంగా ఆవిష్కరించాడు. సుబంధుడు కుంతలదేశకాంతలు తమ వేణీబంధాలలో ముడిచిన పువ్వుల సువాసనకు మత్తెక్కిన తుమ్మెదలని వ్యంజింపజేయగా, శ్రీనాథుడు విరిసిన పొగడ విరులూ గోరింట పూవుల సుగంధానికి లోగిన తుమ్మెదల మదోన్మాదం బాటసారులకు కామోద్దీపకం అయిందని వింధ్యవర్ణనలో ఆ వ్యంజనను మరింత మోహకంగా తీర్చిదిద్దాడు. పెద్దన గారు అలకానదీ జలకణాల చల్లని స్పర్శతో విప్పారి ప్రియునితో సమాగమానికి ఉన్ముఖంగా ఉన్న నాయిక వలె భాసించిన కడిమిపూమొగ్గపై మరులుగొన్న గండుతుమ్మెదల మధుర ఝంకారనాదాన్ని మోసికొనివస్తున్న పిల్లగాలులను వర్ణించి వరూధినీ మనోగతానికి ఉద్దీప్తిని ప్రతిపాదించారు. అంతతితో తనివితీరనందువల్ల కాబోలు, మళ్ళీ ఆ భావాన్నే తీసికొని –

బహురత్నద్యుతిమేదురోదర దరీభాగంబులం బొల్చు ని
మ్మిహికాహార్యమునం జరింతు మెపుడుం బ్రేమన్ నభోవాహినీ
లహరీ శీతలగంధవాహపరిఖేలన్మంజరీ సౌరభ
గ్రహణేందిందిర తుందిలంబు లివి మత్కాంతారసంతానముల్.

అని ఆ మదోన్మత్తభ్రమరికలను వరూధిని వచోమణిసంహతిలో (2-45) ప్రకాశింపజేశారు. పిండిప్రోలు లక్ష్మణకవి తమ లంకావిజయ ద్వ్యర్థికావ్యంలో (పీఠిక 1-17) ‘సరసమనోహరాంచత్ప్రబంధు సుబంధు’ అని సవిశేషంగా పేర్కొనటంతో తృప్తిచెందక, కథావశాన ఒకచోట – 1) సీతాదేవిని విడిచిపెట్టమని విభీషణుడు అన్నగారికి హితోపదేశం చేసిన సందర్భంలోనూ 2) లంకాపరిత్యాగం చేయమని కవి తనకు ప్రతికూలుడైన దమ్మనకు బోధించిన సందర్భంలోనూ –

బాణుని, భారవిన్, ఘనసుబంధుని, నా భవభూతి, గీ
ర్వాణపదంబులం గొనినవారిఁ ద దన్యుల విందుమే కదా!

అని (2-115)లో శ్లేషవశాన ఏకత్రించి మరొక్కసారి ఆయన పేరును తలచుకొన్నారు. పద్యార్థం ఇది: భారవిన్ = కాంతికి సూర్యుని వంటివానిని, ఘనసుబంధుని = గొప్పవారైన మంచి చుట్టాలు కలిగినవానిని, ఆ భవభూతిన్ = ఆ పరమేశ్వరుని దయచే సర్వైశ్వర్యాలు కలిగినవానిని, గీర్వాణపదంబులన్ = సర్వదేవతాస్థానములను (వారి అధికారాలను), కొనినవారిన్ = అపహరించినవారిని, బాణునిన్ = బాణాసురుని వంటి, తత్+అన్యులన్ = ఇంకా ఇతరులను గురించి, విందుమే కదా = (తప్పులు చేసి పతనమైనవారిని గురించి) వింటున్నాము కదా – అని విభూషణుడు సీతాదేవిని శ్రీరామునికి అర్పింపమని రావణునితో అంటున్నట్లుగా రామాయణపరమైన అర్థం. గీర్వాణపదంబులన్ = సంస్కృతభాషలో వెలసిన అన్ని పదాలను, కొనినవారిన్ = స్వీకరించినవారిని (ప్రయోగించినవారిని), బాణునిన్ = కాదంబరీ హర్షచరితాది బహుళకృతులను రచించిన భట్టబాణుడనే పేరుగల మహాకవిని, భారవిన్ = కిరాతార్జునీయ కావ్యనిర్మాత అయిన భారవి మహాకవిని, ఘనసుబంధునిన్ = వాసవదత్తా కథను రచించి గొప్పవాడని పేరుగడించిన సుబంధుడనే మహాకవిని, ఆ భవభూతిన్ = ఉత్తరరామచరిత మహావీరచరిత మాలతీమాధవ మహాగ్రంథాలను వినిర్మించిన భవభూతి మహాకవిని, తత్+అన్యులన్ = ఇంకా వారికంటె ఇతరులైన మహాకవులు ఎంతమందిని గురించో, విందుమే కదా = (గొప్ప గొప్ప కవులను గురించి, వారి మహిమలను గురించి) వింటున్నాము కదా – అని పిండిప్రోలు లక్ష్మణకవి యొక్క లంకా మాన్యాన్ని దమ్మన అపహరించినప్పుడు – ఆ చేసిన తప్పును సరిదిద్దుకోమని దమ్మనతో అతని తమ్ముడు భద్రయ్య రావణునికి విభీషణుని వలె హితోపదేశం చేస్తూ – అటువంటివారితో పెట్టుకోవద్దని లక్ష్మణకవి గొప్పదనాన్ని గురించి వర్ణించే సందర్భంలో అర్థం.

ఇక్కడ కూడా వాసవదత్తా కథలోని ‘సుబన్ధు స్సుజనైకబన్ధుః’ అన్న దళమే శ్లిష్టార్థమై ‘ఘనసుబంధుని’గా (గొప్ప చుట్టాలు కలిగినవానిగా అని, లేదా – గొప్పవారందరూ ఈయన మా బంధువు అని గర్వంగా చెప్పుకొనేంత గొప్పవానిగా) అవతరించిన విషయం గమనింపదగినదే.

ఇవి గాక, సుబంధుడు ఛందశ్శాస్త్రంలోని వృత్తనామాలను కథార్థానికి అన్వయిస్తూ సందర్బానుసారం చమత్కారికగా చెప్పిన – యశ్చ కుసుమవిచిత్రాః వంశపత్త్రపతితాభిః సుకుమారలలితాభిః పుష్పితాగ్రాభిః శిఖరిణీభిః ప్రహర్షిణీభి ర్దర్శితానేకవృత్తవిలాసః – అన్నదానిని మూదలించి కట్టా వరదరాజు శ్రీరంగమాహాత్మ్యం దశమాశ్వాసంలోనూ, అహోబిలపండితుడు కాళిందీకన్యా పరిణయం (1-56) లోనూ, గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం (1-2) లోనూ; ఈషద్భేదంతో కొరవి గోపరాజు సింహాసన ద్వాంత్రిశిక (5-54) లోనూ అనుకృతులను వ్రాశారు. కావ్యకథావశాన వనవర్ణనకు, నాయికా సౌందర్యవర్ణనకు, ఇతరప్రతీకలకు ఈ వృత్తనామాలను ప్రకృతాప్రకృతంగా పరికరింపజేసిన కవులు ఇంకా ఎందరో ఉన్నారు.

ఇక, ప్రబంధకవులలో సాహిత్యరసపోషణకు, కోమలపదలీలకు సాటిలేని ‘వాణీ గురుత్వ మహత్త్వ ఖని’ అని పేరుపొందిన రామరాజభూషణుని వలె సుబంధుని రచనను స్వాయత్తీకరించుకొని, స్వతంత్రవ్యక్తిత్వాన్ని సంతరించుకొన్న తెలుగు కవి వేరొకరు లేరనే చెప్పవచ్చును. శ్లేషవిన్యాసవైదగ్ధ్యనిధిత్వంలో సుబంధునికి సాటిరాగలిగి, ఆధ్యాత్మికభావసౌగంధ్యం వల్ల సుబంధునికంటె మేటి కాగలిగిన మహాత్ముడు ఆయన. శ్లేషమూలకాలైన ఉత్ప్రేక్షా రూప కాతిశయోక్తులకు, శ్లేషానుప్రాణితములైన వివిధాలంకారాల సంసృష్టికి, అనర్ఘమైన వస్తుధ్వనికి ఆలవాలమైన ఆయన కవితావ్యక్తి బాణసుబంధుల మహాప్రభావం మూలాన అనన్యసాధ్యమైన అర్థగౌరవాన్ని సంతరించుకొన్నది. సుబంధుడు బీజమాత్రాలుగా నిలిపిన మహార్థాలను ఆయన శాఖోపశాఖలకు విస్తరింపజేసి వసుచరిత్రమనే కల్పవృక్షాన్ని రసజ్ఞుల హృదయాలలో చిరత్నంగా నిక్షేపించాడు. నాయికానాయకుల ప్రథమసమావేశం నాడు ఉపనిషద మివ సానన్దాత్మక ముద్యోతయన్తీం వాసవదత్తాం దదర్శ అని సుబంధుడు ప్రవేశపెట్టిన పవిత్రమైన ఆర్షోపమానం వసుచరిత్ర (2-14) లో భక్తాగ్రేసరుడైన రామరాజభూషణుని అమృతలేఖినిలో ప్రాణకళను దిద్దుకొన్నది:

వీనుల విందై యమృతపు
సోనల పొందై యమందసుమచలదళినీ
గానము క్రందై యా రవ
మానందబ్రహ్మమైన నధిపతి పల్కెన్.

అంటూ అమలోదాత్తంగా రూపొందింది. సుబంధుడు కందర్పకేతునికి వాసవదత్త శ్రుతిశిరస్సీమంతమైన బ్రహ్మవిద్యోపనిషత్తు వలె ఆనందపరబ్రహ్మస్వరూపిణియై కానవచ్చినట్లు వర్ణింపగా – రామరాజభూషణుడు వసురాజుకు భ్రమరీగానసమానమైన గిరికయొక్క అమృతగానం ఆనందపరబ్రహ్మస్వరూపమై వినవచ్చినట్లుగా చిత్రీకరించాడు. చిమ్మచీకటిలో మిలమిలలాడుతున్న తారకలను సుబంధుడు ‘వియదమ్బురాశిఫేనస్తబకా ఇవ’ అని ఉపమింపగా, ‘పెల్లుబ్బు నిర్లు పెన్వెల్లి నెల్ల పదార్థములు మనఁ బొడము బుద్బుదము లనఁగ’ అని రామరాజభూషణుడు ఉత్ప్రేక్షించాడు. ఆయన కవితాసరస్సులో విహరించేవారికి ఇటువంటి చిత్రౌపమ్యాలు తామరతంపరగా అగుపించటంలో ఆశ్చర్యం ఉండదు.

ఈ విధంగా ఆంధ్రదేశంలో అవిరళప్రచారానికి నోచుకొన్న సుబంధుని మహనీయకృతికి ప్రప్రథమాంధ్రానువాదాన్ని వెలయించిన గౌరవం క్రీస్తుశకం 1560 ప్రాంతాల తెనాలి రామలింగకవికి దక్కింది. ఆ తర్వాత దీనిని క్రీస్తుశకం 17వ శతాబ్ది నాటి వక్కలంక వీరభద్రకవి, 1899లో రొద్దము హనుమంతరావు తెలుగుచేశారు.