సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు

ఆంధ్ర మనీషుల భావానువృత్తి

ఈ విధంగా సంస్కృత సారస్వతోపవనమంతటా విశాలమహావటవృక్షసదృక్షంగా విస్తరిల్లిన సుబంధుని మహారచన తెలుగువారిని అమితంగా ఆకర్షించటంలో ఆశ్చర్యమేముంటుంది? ఆంధ్రకవులు నన్నయ్యగారి కాలంనుంచి సుబంధుని వాసవదత్తా కథా పరిజ్ఞాతలేనని అసంఖ్యేయంగా ప్రయోగాలను ఉదాహరింపవచ్చును. నన్నయ్యగారి శ్రీ మహాభారత భాగధేయం వాల్మీకి వ్యాస శూద్రక కాళిదాస మయూర భారవి భట్టనారాయణాది మహాకవిభావదీధితిబంధురమై, ప్రాకృత తమిళ కర్ణాటాది భాషా సాహితీ నిష్ణాతృత్వపరిచాయకమై పరిఢవిల్లింది. భట్టబాణుని కాదంబరీ కావ్యకథాదిని ‘అతిచిరకాలలగ్న మతిక్రాన్త కునృపతిసహస్రసమ్పర్కకలఙ్క మివ క్షాలయన్తీ యస్య విమలే కృపాణధారాజలే చిర మువాప రాజలక్ష్మీః’ అని ఉన్న శూద్రక రాజవర్ణనమే, ఇతరస్థలానుగత తద్విశేషణాలతో –

రాజకులైకభూషణుఁడు రాజమనోహరుఁ డన్యరాజతే
జోజయశాలి శౌర్యుఁడు విశుద్ధయశశ్శరదిందుచంద్రికా
రాజితసర్వలోకుఁ డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్. ఆది (1-3)

అని భారతాదిని తెలుగులో అవతరించింది. తెలుగు విమర్శకులు గుర్తింపలేదని ఈ విషయాన్ని ప్రాస్తావికంగా ప్రస్తావించాను. భట్టబాణుని కాదంబరీ హర్షచరిత్రల వలెనే సుబంధుని వాసవదత్తా కథ అన్నా నన్నయ్య గారికి ప్రాణం. భట్టబాణుని హర్షచరిత్రను చదువుకొన్నప్పుడు అందులో ఉన్న వాసవదత్తా కావ్యప్రశంసను చూడకుండా ఉండరు కదా. చూచిన తర్వాత దానిని చదివేందుకు ప్రయత్నం చేయకుండా ఉండరు కదా. సుబంధుని మహారచనను చదువుకొని ప్రతిభావ్యుత్పత్తులకు మెరుగులు దిద్దుకొన్నాక, అవకాశం వచ్చినప్పుడల్లా మనోహరములైన ఆయన కర్పూరపు పలుకులను నన్నయ్యగారు తమ కవితలో పరిమళింపజేశారు. వాసవదత్తా కథలో వాసవదత్త కందర్పకేతుని స్వప్నంలో దర్శించి, స్వప్నంలోనే అతని వివరాలను తెలుసుకొన్న తర్వాత (సా స్వప్నే ఏవ నామాదిక మశ్రౌషీత్), ఓహో! ఇంతటి దివ్యతేజోమయమూర్తిని బ్రహ్మదేవుడు సృజింపగలడని తెలిసివుంటే – దమయంతి ఆనాడు నలునికోసం అడవుల వెంబడి నానా అగచాట్లూ పడేదే కాదు కదా (వృథైవ దమయన్తీ నలస్య కృతే వన(వాస)వైశస మవాప) అని విరహవేదన పాలైన సన్నివేశంలో సుబంధుడు –

(సపది) పరిజనప్రయత్నా ద్గృహీతజీవా (సతీ) క్షణ మతిశిశిర ఘనసార రసానుకూలనిమ్నగా పులినే క్షణ మతితుహిన మలయజరస సరిత్పరిసరే క్షణ మతి(లోహిత కనకారవిన్ద కదమ్బ)పరివారిత సరస్తటీ చన్దనవిటపిచ్ఛాయాసు క్షణ మనిలోల్లాసిదలేషు కదలీకాననేషు క్షణం కుసుమ(ప్రవాల)శయ్యాసు క్షణం నలినీదలప్రస్తరేషు క్షణం తుషారసఙ్ఘాతశిశిరిత శిలాతలేషు పరిజనేన నీయమానా …, ముగ్ధే! మదనమఞ్జరి! సిఞ్చ చన్దనోదకేన. – వాసవదత్తా కథ (దాక్షిణాత్య పాఠం)

అనన్తరం పరిజనప్రయత్నోచ్ఛ్వసితజీవితా చ, క్షణ మతిశిశిర ఘనసార రజోనిమ్నగాకూలపులినే, క్షణ మతితుహిన జడ మలయజరసః సరిత్పరిసరే, క్షణ మరవిన్దకానన పరివారిత సరస్తటవిటపిచ్ఛాయాసు, క్షణ మనిలోల్లాసితదలేషు, కదలీ కాననేషు, క్షణం కుసుమ(ప్రవాల)శయ్యాసు, క్షణం నలినీదలప్రస్తరేషు, క్షణం తుషారసఙ్ఘాతశిశిరిత శిలాతలేషు పరిజనేన నీయమానా, ముగ్ధే! మదనమఞ్జరి! సిఞ్చ చన్దనోదకేన.- వాసవదత్తా కథ (ఔత్తరాహ పాఠం).

అని వ్రాసిన పంక్తులు మనోమయకోశంలో ముద్రితమై ఆయన –

నలదమయంతు లిద్దఱు మనఃప్రభవానలబాధ్యమానులై
సలిపిరి దీర్ఘవాసరనిశల్ విలసన్నవనందనంబులన్,
నలినదళంబులన్, మృదుమృణాళములన్, ఘనసారపాంసులం,
దలిరుల శయ్యలన్, సలిలధారలఁ, జందనచారుచర్చలన్.

అన్న హృద్యమైన పద్యాన్ని ఆంధ్రావళికి కంఠమణిహారంగా ప్రకాశింపజేశారు. సుబంధుడు వివిధసన్నివేశాలలో కుసుమపురంలో శీతవేళ ప్రవృద్ధములైన కర్పూరసురభిళరజోనిమ్నగాతోయాల చెంత మేటవేసిన ఇసుకతిన్నెలను, ప్రవాహసరిత్పరిసరాలను, అరవిందదీర్ఘికాపరివారితములైన సరస్తట తరుచ్ఛాయలను వర్ణించిన దళాలను ఒక్కచోటికి తెచ్చి, గంధమాదనపర్వతసానువుల వద్ద గంధర్వులు, సురలు, సిద్ధులు, సాధ్యులు, అప్సరసలు సంచరించే ఎంతో అందమైన నందనవనీపరిసరాలను ప్రవేశపెట్టాడు. నన్నయగారి పద్యాన్ని సుబంధుని మూలంతో సరిపోల్చినప్పుడు –

నలినీదల ప్రస్తరేషు – నలినదళంబులన్.
అరవింద కదంబ – మృదు మృణాళములన్.
ఘనసార రజః – ఘనసార పాంసులన్.
కుసుమ(ప్రవాల)శయ్యాసు – తలిరుల శయ్యలన్.
సిఞ్చ చన్దనోదకేన – చందన చారుచర్చలన్.

ఇత్యాదుల శబ్దసాదృశ్యం స్ఫుటవ్యక్తమే. నన్నయ్యగారిపై సుబంధుని ప్రభావాన్ని నిరూపించేందుకు ఇంత సుదీర్ఘంగా వివరింపవలసివచ్చింది. నన్నయ్యగారి కాలానికి వాసవదత్తా కథకు ఔత్తరాహ – దాక్షిణాత్యపాఠాలు ఇంకా ఏర్పడలేదని భావింపవలసి ఉంటుంది. లేదా, శ్రీనాథునికి వలె ఆయనకు కూడా కావ్యాల ఉత్తరదేశపు ప్రతులు కూడా అందుబాటులో ఉండినవేమో! అనుకోవాలి. అన్నిచోట్లా ఆయన అనువాదం ఔత్తరాహప్రతులకే సన్నిహితంగా ఉన్నది. వాసవదత్త తన చెలికత్తె మదనమంజరిని సిఞ్చ చన్దనోదకేన (గంధపు నీళ్ళు చల్లు!) అని శైత్యోపచారాన్ని కోరిన సంస్కృతవాక్యమే ఇందులో చందన చారుచర్చలన్ అన్న దళంగా రూపుదిద్దుకొన్నది. ఇంకా,

కేతకీ కానన నిపతిత ధూళీనికురుమ్బజాత సైకత సుఖోపవిష్ట తరుణసురమిథున నిధువనలీలా పరిమలసాక్షి కూలోపనయా.
ఆన్దోలితకుసుమకేసరే కేశరేణుముషిరణిత మధుకర రమణీనాం రమణీనామ్.
అనిలోల్లాసితదలేషు.

ఇత్యాదిగా సుబంధునికి ప్రీతిపాత్రమైన శబ్దజాలమే నన్నయ్యగారి కరకమలాలలో –

దళితనవీనకందళకదంబకదంబక కేతకీ రజో
మిళిత సుగంధబంధురసమీరణుఁ డన్ సఖుఁ డూఁచుచుండఁగా
నులియుచుఁ, బూవుగుత్తు లను నూయెల లొప్పుగ నెక్కి యాడె ను
ల్లలదళినీకులంబు మృదులధ్వనిగీతము విస్తరించుచున్. (ఆరణ్య: 3-137)

అని ప్రసన్నసరస్వతీకంగా తీర్పునొందింది. ఇదే విధంగా తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణంలోనూ, ఎర్రనగారి లక్ష్మీనరసింహ పురాణంలోనూ వాసవదత్తా కథలోని పదబంధాలు తరంగప్రతిబింబన్యాయంగా సాక్షాత్కరిస్తూనే ఉంటాయి. నలదమయంతు లిద్దఱు రచనతో తెలుగు పద్యశిల్పంలో నన్నయ్యగారు ప్రవేశపెట్టిన సప్తమ్యంతనామమాలాబంధానికి సమ్మోహితుడైన చిమ్మపూడి అమరేశ్వరుడు తన విక్రమసేనములో –

అలరుల పాన్పులం, దలిరుటాకుల సెజ్జల, హర్మ్యవేదికా
తలములఁ, దీవయిండ్ల, సికతాశయనంబుల ము న్వియుక్తిమై
నలదురి వందు కందువల నప్పటి కప్పటి కింపుఁ బెంపఁ, గో
ర్కులు తనివారి, వేడ్కపడఁ గూడిరి వేడుకతోడ దంపతుల్.

అని ప్రకారాంతరాన్ని కల్పించాడు. సుబంధుని రచనను రమణీయ శృంగారకావ్యంగా కన్నడంలోకి అనువదించిన చతుర్భాషాచక్రవర్తి నేమిచంద్రుడు కూడా నలదమయంతు లిద్దఱు పద్యశిల్పంలో నన్నయ్యగారు ప్రవేశపెట్టిన రసోద్దీప్తినిమిత్తకారణపరంపరావర్ణనకు వశంవదుడై తన లీలావతీ ప్రబంధం (1-96)లో ప్రకరణోచితంగా దానిని అనుసంధింపక తప్పలేదు. కర్ణాటాంధ్రకవుల ఈ పరస్పరాధారాధేయభావం ఆదికాలం నుంచి క్రీ.శ. 16-వ శతాబ్ది వరకు కొనసాగుతూవచ్చిన సంగతి వాఙ్మయవిద్యార్థులకు కొత్తేమీ కాదు. నేమిచంద్రుని పద్యం –

లళనె యరాతనం బయసి నోడలొడం మదనాగ్నిదాహ మ
గ్గళిసదె మాణదెందు కృపె యిం పడెదం బిది చంద్రబింబమం,
మళయజమం, మృణాళకుళమం కొళనం, లతికాగృహంగళం
తళిర్గళనెందొడందమనదేవొగళ్పిం కవితావిలాసనా.

అని. సుబంధుని అనిలోల్లాసితదలేషు అన్న దళాన్ని కేతకీకానననిపతితధూలీనికురుంబతో మేళవించి నన్నయ్యగారు కేతకీరజోమిళితసుగంధబంధురసమీరణుఁడు (అన్ సఖుఁడు) ఊఁచుచుండగా అని తెనిగించినట్లే, నేమిచంద్రుడు అనిలాందోళితపాదపాగ్రవిగళత్పుష్పోత్కరం అని లీలావతీ ప్రబంధం (5-19)లో కన్నడీకరించుకొన్నాడు. కన్నడాంధ్రసాహిత్యాల తులనాత్మక పరిశీలన చేయగోరిన విద్యార్థులకు ఉపకరించే విషయాలివి. నన్నయ్యగారు నలదమయంతుల విరహోద్దీపన క్షోభక విభావాలుగా సుందర నదీనదారామవస్తువిస్తరాన్ని పరికరింపజేసినట్లే, మహాకవి జక్కన తన విక్రమార్క చరిత్రము (4-227) లో విదర్భరాజతనయా విక్రమార్కుల సంభోగశృంగారానికి ఉద్దీప్తికారకాలుగా ప్రకృతిదృశ్యాలను ఈ సప్తమ్యంతనామమాలికతో చిత్రించి తానూ ఒక భంగ్యంతరాన్ని అందంగా అవతరింపజేశాడు:

సంపూర్ణ పూర్ణిమా సాంద్ర చంద్రాతపవిలసిత శశికాంతవేదికలను
మంజరీ సంజాత మకరందనిష్యంద మాకంద మాధవీ మండపముల
శృంగారవన మహాశృంగార మణిశృంగ హాటకశైల శృంగాటకముల
సంఫుల్ల హల్లక సహవాస వాసనోజ్జ్వల దీర్ఘ దీర్ఘికా సైకతముల

గగనగంగాతరంగిణీ గంధవాహ
బంధురోదగ్ర (?) సౌధాగ్రభాగములను
నవనవోల్లాస రతికళానైపుణములఁ
బ్రతిదినంబు రమించిరి పతియు సతియు.

అని. నన్నయ్యగారి అనువక్త లిద్దరూ విప్రయోగాన్ని సంసర్గవర్ణనగా మార్చివేసినా, నన్నయ్యగారి పద్యశిల్పాన్ని మాత్రం యథావిశేషంగా పరిగ్రహించిన విషయం స్పష్టమే. సుబంధుడు వాసవదత్తా విరహవర్ణనలో – కర్పూరికే! పాణ్డురయ కర్పూరధూలిభిః పయోధరభారమ్ – అని విరహిణీ శైత్యోపచారానికి తొలిసారి కావించిన ఈ కర్పూరధూళియొక్క ధవళిమా శీతలిమల ప్రస్తావం సంస్కృతంలో చాలామంది కవులను ప్రభావితం చేసింది. ప్రియునితో క్షణమాత్రమైనా వియోగాన్ని సహింపలేని ప్రేయసీమణుల భావాతిశయోపవర్ణనకు దోహదం కాగలిగింది. దీనిని చదువుతున్నప్పుడు విద్యార్థులకు –

కణ్ఠే మౌక్తికమాలికాః స్తనతటే కార్పూర మచ్ఛం రజః
సాన్ద్రం చన్దన మఙ్గకే వలయితాః పాణౌ మృణాలీలతాః
తన్వీం నక్త మియం చకాస్తి తనునీ చీనాంశుకే బిభ్రతీ
శీతాంశో రధిదేవతేవ గలితా వ్యోమాగ్ర మారోహతః.

కర్పూరామ్బునిషేకభాజి సరసై రమ్భోజినీనాం దలై
రాస్తీర్ణేఽపి వివర్తమానవపుషః స్రస్తస్రజి స్రస్తరే
మన్దోన్మేషదృశా కి మన్యదభవ త్సా కాప్యవస్థా తదా
యస్యా శ్చన్దన చన్ద్ర చమ్పకదలశ్రేణ్యాది వహ్నీయతే.

వంటి శ్లోకాలు గుర్తుకు రావటం సహజమే. సుబంధుని వాక్యాన్ని అనుసరించి ఎవరో ప్రాచీనుడైన చాటుకవి శిశిరఋతువేళ దిశాంగనా శీతకిరణులకు నాయికానాయకత్వాన్ని ఆరోపించి (దిగ్వనిత నాయిక, చంద్రుడు ఆమెపై మరులుగొన్న నాయకుడు అన్నమాట), కర్పూరధూలిధవలద్యుతిపూర ధౌత, దిఙ్మండలే శిశిరరోచిషి తస్య అంటూ పదార్థానుసరణకౌశలంతో వృత్తాంతనిరూపణం చేయగా, నన్నయ్యగారు ఆరణ్యపర్వం (4-142) లో ఉభయశబ్దానుసరణ కావిస్తూ శరత్కాలపు రాత్రులను వర్ణించిన అద్భుతావహమైన పద్యం ఇది:

శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధబంధురో
దార సమీరసౌరభముఁ దాల్చి సుధాంశువికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరము లంబరపూరితంబులై.

అని. ఇందులో సంస్కృతంలోని శిశిరరోచులు తెలుగులో శారదరోచులుగా, సంస్కృతంలోని కర్పూరధూలి తెలుగులో కర్పూరపరాగంగా, సంస్కృతంలోని ధవలద్యుతిపూరం తెలుగులో పాండురుచిపూరంగా, సంస్కృతంలోని కర్పూరధూలిధవలద్యుతిపూర ధౌత దిఙ్మండలే అన్నది తెలుగులో కర్తృవ్యపదేశంతో సుధాంశువికీర్యమాణ క, ర్పూర పరాగ పాండురుచిపూరము లంబరపూరితంబులై శరత్కాలపు రాత్రివేళలకు వచన ప్రక్రమాది భేదం లేకుండా సార్థకంగా అన్వయిస్తున్నది. ఏకకర్తృకాలైన అనేక క్రియలున్నప్పుడు ప్రధానక్రియ తిఙంతంలో ఉండి, మిగిలిన అప్రధానక్రియలు శతృ శానజంతాలుగా ఉండవచ్చుననే సంస్కృత వాక్యనిర్మాణపద్ధతిని తెలుగుకు అనువర్తించి నన్నయగారిందులో ఒక సూత్రనిర్దేశాన్ని కూడా చేసి ఉన్న సంగతి కూడా గమనార్హం.

ఇక, శ్రీనాథుని విషయానికి వస్తే – సంస్కృత ప్రాకృత వాఙ్మయాలలో ఆ సకలవిద్యాసనాథుడు అధ్యయనింపని కావ్యతల్లజం కాని, శాస్త్ర వ్యాఖ్యాన ప్రకరణగ్రంథం కాని, చదివినది చదురనిపించినప్పుడు ఎదలో పదిలంగా పొదివికొని అదును పదునులు చూసి ప్రయోగింపని భణితివిశేషం కాని – ఉండదనే చెప్పవచ్చును. జీవితచరమసంధ్యావేళ శివరాత్రిమాహాత్మ్యం అవతారికలోని పూర్వకవినామసంకీర్తన పద్యంలో సింహావలోకిత కృతజ్ఞతాపూర్వకంగా బంధుర గాంభీర్యబంధు సుబంధు (1-12) అని సంస్మరించడమే గాక, పదే పదే ఆయన పదబంధాలను తన కవితలో అనుసంధించుకొన్నాడు. అందునా ప్రత్యేకించి వింధ్యాచల రేవానదీ వర్ణనాపూర్ణమైనందువల్ల కాబోలు, సుబంధుని రచన కాశీఖండ రచనాకాలంలో శ్రీనాథునికి వాచోవిధేయమై జిహ్వాగ్రనర్తినిగా ఉండేదని ఊహింపవచ్చును. కొన్ని శబ్దానువాదాలు నాసికేతోపాఖ్యానం (1-18)లో దగ్గుపల్లి దుగ్గన అన్నట్లు, ఆయన పూర్వకవిముఖ్య విరచితాపూర్వ కావ్య,భావ రససుధా చర్వణప్రౌఢతకు ప్రత్యక్షర ప్రత్యక్షసాక్ష్యాలుగా నిలుస్తాయి.

వాసవదత్తా కథ:

కామకలాకలాప చారు సున్దరీసున్దర స్తనకలశ ఘుసృణధూలిపరిమలామోదవాహీ –

కాశీఖండం:

ఈ క్షోణిన్ నినుఁబోలు సత్కవులు వేరీ! నేఁటి కాలమ్మునన్
దాక్షారామ చళుక్యభీమవర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయ గంధసార ఘుసృణ ద్వైరాజ్యభారంబు న
ధ్యక్షించుం గవిసార్వభౌమ! భవదీయప్రౌఢసాహిత్యముల్. (1-14)

మూలంలోని కుసుమపురారామ యువతీస్తనకలశఘుసృణధూళిపరిమళం కృతిభర్త వీరభద్రారెడ్డి శృంగారభావనను సాంద్రతరీకరించి శ్రీనాథుని ప్రౌఢసాహిత్యానికి దాక్షారామ కామినీ వక్షోజద్వయ గంధసార (చందనం) ఘుసృణ (కుంకుమ పువ్వుల) ద్వైరాజ్యభారాన్ని అప్పగించింది. రాజు కంటె కవిరాజు భోగం ద్విగుణీభూతం అయిందే కాని, గుణీభూతం కాలేదు.

ఆ మాటకు వస్తే, కుసుమపురారామంలోని ఈ కుంకుమ పువ్వుల సువాసన అంతకు మునుపే సామర్లకోట కుమారారామంలో వీచింది, చూడండి:

భీమేశ్వర పురాణం:

శ్రీఖండ ఘుసృణ మకరీ
రేఖాలంకార సుందరీ స్తనయుగ పా
ళీ ఖచిత భుజాంతరవిభ
వాఖండల! బెండపూడి యన్నామాత్యా! (2-1)

అని. సుబంధుని కాలానికింకా దేశంలో యోషామణుల భూషణాధ్యాయంలో శరీరంపై పత్రభంగ రచనల కొత్తవెలుగులు ప్రసరింపలేదు. సుబంధుని కాలానికి తర్వాత అవతరించిన ఈ పత్రభంగ చిత్రవిలేఖనాలను భట్టబాణాదుల రచనలలో చదువుకొన్న శ్రీనాథుడు తన కాలంనాటి పద్ధతులను కూడా పరిశీలించి – మూలంలోని సున్దరీ స్తనకలశ ఘుసృణ మాత్రాన్ని శ్రీఖండ (చందనంతోనూ) ఘుసృణ (కుంకుమ పువ్వులతోనూ దిద్దిన) మకరీ, రేఖా అలంకార (మొసలి రూపుగల రేఖలతోడి చిన్నెలున్న) సుందరీ స్తనయుగపాళిగా చిత్రిక పట్టాడు.

ప్రత్యక్షర శ్లేషవిన్యాస వైదగ్ధ్యనిధి అయిన సుబంధుని శ్లేషలలోనూ కొన్నింటిని గ్రహించి శ్రీనాథుడు తన కావ్యాలలో సందర్భవిదర్భంగా మార్చుకొన్న సన్నివేశాలున్నాయి:

వాసవదత్తా కథ: హరివంశై రివ పుష్కరప్రాదుర్భావ రమణీయైః.

భీమేశ్వర పురాణం: హరివంశంబునుం బోలె బలభద్ర ప్రద్యుమ్నానిరుద్ధ పురుషోత్తమాధిష్ఠితంబును. (3-18)

వాసవదత్తా కథ: సుధర్మా మివ స్వచ్ఛన్దస్థితకౌశికామ్.

భీమేశ్వర పురాణం:సుమనోవర్గంబు వలన సుధర్మాస్థానంబును. (1-110)

మొదలైనవి. సుబంధుడు హిరణ్యకశిపు రివ శమ్బరకులాశ్రయః అని చేసిన వింధ్యాద్రివర్ణనలోని శ్లేషాంశాన్ని పరిగ్రహించి సుబంధుని అనుకర్తలలో ప్రముఖీనుడైన వామనభట్టబాణుడు తన వేమభూపాలచరితం (పు.10) లో దానిని నృసింహలీలేవ ప్రథిత హిరణ్యకశిపుక్షయా అంటూ అద్దంకి పురవర్ణనకు ప్రసక్తింపజేశాడు. వామనభట్టబాణుని మాటెలా ఉన్నా, వేమభూపాలుని పైని గౌరవాతిశయం గల శ్రీనాథుడు భీమేశ్వరపురాణంలో ఆ వర్ణననే ముందుంచుకొని, నృసింహలీలాడంబరంబునుం బోలెఁ బ్రథితహిరణ్యకశిపుక్షయంబును (1-110) అని దానినే ఉన్నదున్నట్లు తెలుగుచేశాడు. శ్రీనాథుని ఈ శ్లేషాశ్లేషం మనసుకెక్కిన తెనాలి రామలింగకవి తన ఉద్భటారాధ్యచరిత్రము (1-16) లో కృతిపతి ఊరదేచయ్యకు మంత్రిపదవి నిచ్చిన నాదిండ్ల గోపరాజుకు అనువర్తింపజేసి – వరవిక్రమప్రౌఢి నరసింహుఁ డయ్యు నెపుడు హిరణ్యకశిపు స్ఫురణఁ గాంచి – అని అందంగా గుర్తుచేసుకొన్నాడు. వక్కలంక వీరభద్రకవి ప్రధానంగా శ్రీనాథ రామలింగ కవుల రచనలను చదువుకొన్నవాడు కాబట్టి, ఆ రెండింటినే కాబోలు ఆదర్శాలుగా ముందుంచుకొని తన వాసవదత్తా పరిణయం (1-171) లో కథానాయకుడైన కందర్పకేతుని తండ్రి చింతామణిమహారాజును వర్ణించే సందర్భంలో –

నరసింహమూర్తి యగు నా
కరుణాభరణుఁడు హిరణ్యకశిపుక్షేత్రా
దర దానగరిమ సదయ
త్వరిత ప్రహ్లాద దృష్టతా విస్ఫూర్తిన్.

అని ఆ శ్లేషనే మరికొంత కొమ్మలకు రెమ్మతొడిగాడు. మొత్తానికి కవులు నలుగురూ సుబంధునికి ఋణగ్రస్తులే అన్నది మనకు ప్రకృతార్థం.

ఇటువంటిదే, అంధకారనిర్వర్ణనసమయంలో సుబంధుడు ప్రవేశపెట్టిన రవిరశ్మిభస్మితనభోవన మషీరాశి రివ అన్న ఔపమ్యాన్ని గ్రహించి సూర్య శతకంలో మయూరుడు జ్యోత్స్నాంశాకర్షపాణ్డుద్యుతి తిమిరమషీశేషకల్మాషమ్ (శ్లోకం-26) అని జగచ్చిత్రాన్ని విలేఖింపగా, చిన్నారి పొన్నారి చిఱుఁతచీఁకటి చాయ యసలుకొల్పిన మషీరసము గాఁగ అని కాశీఖండం (1-23) లో మయూరునే అనుసరించిన శ్రీనాథుని అనుకూజితం.

సుబంధుని మూలానికి శ్రీనాథుడు కావించిన ప్రకృష్టమైన శబ్దానువాదానికి ఇంతకంటె మేలైన ఉదాహరణం మరొకటున్నది. వాసవదత్తా స్వయంవరప్రకటనకు మునుపు సుబంధుడు ఆమె మనోగతానికి ఉద్దీపకంగా వీచిన మలయానిలాన్ని వర్ణిస్తూ –

కన్దర్పకేలి సమ్పల్లమ్పట లాటీలలాటతట నికట ధమ్మిల్ల మల్లికామిలిత పరిమలసమృద్ధ మధురిమగుణః, కామకలాకలాప చారు సున్దరీసున్దర స్తనకలశఘుసృణధూలి పరిమలామోదవాహీ, రణరణకరసిత కాన్త కున్తలీ కున్తలోల్లాసన సఙ్క్రాన్త పరిమలమిలితాలిమాలా మధురతార ఝఙ్కార ముఖరిత నభస్తలః … – వాసవదత్తా కథ : దాక్షిణాత్య పాఠం

కన్దర్పకేలీ సమ్పల్లమ్పట లాటీలలాటతటలులితాలకధమ్మిల్లభార కుసుమపరిమలసమృద్ధ మధురిమగుణః, కామకలాకలాపనిపుణ కర్ణాటసున్దరీసున్దర స్తనకలశయుగలఘుసృణధూలిపటల పరిమలామోదవాహీ, రణరణసితాపరాన్త కాన్త కాన్తకున్తలీ కున్తలోల్లసిత సఙ్క్రాన్త పరిమలమిలితాలిమాలా మధురఝఙ్కార రవ ముఖరిత నభస్తలః … – వాసవదత్తా కథ : ఔత్తరాహ పాఠం

అని చిత్రించిన లలిత శృంగారదృశ్యమే, కాశీఖండంలో (1-92) రేవానది ఒడ్డున నారదమహర్షి దర్శించిన వింధ్యప్రాంతీయ వర్ణనచ్ఛందమై –

దరవికచ వకుళ కురవక
పరిమళ సంభారలోల బంభరమాలా
పరిషజ్ఝంకారధ్వని
తెరువరులకు మన్మథప్రదీపన మొసఁగున్.

అంటూ రూపాంతరితమయింది. కందర్పకేళిలంపటలైన లాటీలలామలను, కర్ణాటీసుందరీమణులను, అపరాంతకాంతలను సుబంధుడు ప్రస్తావింపగా, ‘తెరువరులకు మన్మథప్రదీపన మొసఁగున్’ అని శ్రీనాథుడు దానిని వ్యంగ్యంగా మార్చివేశాడు. పరిమలమిలిత అలిమాలా మధురతర ఝఙ్కార ముఖరిత నభస్తలః అన్న శబ్దమాధురికి వశంవదుడై, తాను కూడా పరిమళ సంభారలోల బంభరమాలా, పరిషత్ ఝంకారధ్వని అని పర్యాయానువర్తన చేశాడు. శ్రీనాథునికి ఆభిమానికాలైన ఇంకా ఎన్నో ప్రయోగాలు – జాగ్రత్తగా పరిశీలిస్తే, అనేకం సుబంధునివే అని గ్రహింపగలము. ఒక విధంగా శ్రీనాథుడే సుబంధునికి అనువాద సర్వస్వామ్యానుభవికుడు (Copy Right holder) అని చెప్పవలసి ఉంటుంది. సుబంధుడు సరస్వతీదత్తవరప్రసాదః అని తనను గూర్చి తాను చెప్పుకొంటే, దానినే శ్రీనాథుడు శృంగారనైషధంలో (1-13) బ్రాహ్మీదత్తవరప్రసాదుఁడవు అని కృతిపతి మామిడి సింగనార్యుని రౌచిక ప్రశంసితంగా అనువర్తించుకొన్నాడు. ప్రతిరోజూ చేతిలో సుబంధుని వాసవదత్తా కథ పుస్తకాన్ని పట్టుకొని, పాఠక్రమాన్ని వ్యాఖ్యానాలతో సంవదించుకొంటూ, తరచు సుబంధుడు ఆ సందర్భంలో అట్లా అన్నాడు, సుబంధుడు ఈ సందర్భంలో ఇట్లా అన్నాడు అని అందులో నుంచి మంచి మంచి కల్పనలను, తనకు నచ్చిన పదభావాలను తరచుగా ఉదాహరిస్తుండే యువకవిని చూసి – మహాపండితుడైన సింగనామాత్యుడు ఆ సుబంధుని ప్రాతిభోక్తిని అతనికే అన్వయించి చెప్పాడని మనము ఊహించుకోవాలి. అంత ఉద్ధతుడైన కవీ ఆ సుబంధుడు పెద్దలముందు తలవంచి, సుబన్ధు స్సుజనైకబన్ధుః అని తన వినయాతిశయాన్ని సూచిస్తే, గౌడ డిండిమభట్టవిజేత శ్రీనాథుడు కూడా అదే ధోరణిలో తన విద్వద్విధేయతను ప్రకటీకరించాడు. వినయవిధేయ శ్రీనాథ నామధేయ అని హరవిలాసంలోనూ, సుకవిజనవిధేయ శ్రీనాథ నామధేయ అని భీమేశ్వరపురాణంలోనూ, సుకవిజనవిధేయ శ్రీనాథ నామధేయ అని కాశీఖండంలోనూ ఆశ్వాస సమాపనగద్యలలో నిలిపి సుబంధురచితం పట్ల తనకు గల శ్రద్దధానతను చెప్పకనే చెప్పాడు. సుబంధు శ్లేషాధ్వనీనులలో ప్రథమగణ్యుడైన వామన భట్టబాణుడు కూడా తన వేమభూపాల చరితంలో –

ప్రతికవిభేదనబాణః కవితా తరు గగనవిహరణమయూరః
సహృదయలోకబన్ధు ర్జయతి శ్రీ భట్టబాణకవిరాజః. (శ్లో.6)

అని సుబంధుని దళాన్ని తులసీదళం వలె కన్నులకద్దుకొన్నాడు. సుజనైకబన్ధుః – సహృదయలోకబన్ధుః అన్నవి బంధువులే కదా.

సుబంధుడు అతిమనోహరంగా ప్రత్యక్షీకరించిన వసంతకాలాగమన కాథికతకు ముగ్ధుడై శ్రీనాథుడు తన భీమేశ్వరపురాణంలో దక్షారామంలో వసంతర్తువేళాసుమనోహరదృశ్యాలను సవ్యాఖ్యంగా తెలుగుచేసిన ఉదంతం ఆయన అనువాద దక్షతకు మరొక మేలైన ఉదాహరణ. సుబంధుడు కోమల మలయమారుతోద్భూత చూతప్రసవ సరసాస్వాద కషాయకంఠ కలకంఠ కుహరిత భరిత సకలదిఙ్ముఖః అని రూపుకట్టించిన పదచిత్రాన్ని అంతకు మునుపే మూలాతిరిక్తంగా శృంగారనైషధంలో ‘దమయంతీవిరహవర్ణనావసరాన లీలోద్యానంబునందు సరస రసాలకోమలకిసలయాస్వాదన కషాయకంఠ కలకంఠ కామినీ కుహూకారకోలాహలపంచమంబు వీతెంచిన’ (2-13) అని అనువదించి ఉండటం మూలాన, భీమేశ్వర పురాణాన్ని తెలుగుచేసేటప్పుడు కిసలయరసజిగ్రహిషా, వ్యసనాకుల పిక కుహూభవత్పంచమమై, (వసన్తకాల ఆజగామ) కుసుమ సమయావతారము, త్రసమింగము జగము ముంచె రాగాంబునిధిన్ (3-102) అంటూ కొంత సూక్ష్మంగా దానిని కుదించివేశాడు. ఈ రాగాంబునిధి కూడా సుబంధుని గుండెలలో ఉబికినదే మరి. ఇక్కడే కాక, సుబంధుడు వేరొక సందర్భంలోనూ ఈ రాగసాగర ప్రయోగాన్ని మరింత అందంగా చేశాడు. వాసవదత్తా ముఖసౌందర్యాన్ని అభివర్ణిస్తూ, ఆమె అధరపల్లవాన్ని రాగసాగర విద్రుమశకలేన ఇవ అధరపల్లవేన ఉపశోభమానాం అని ఆయన ఉపమింపగా, ఆ పోలికను మెచ్చిన భట్టబాణుడు, రాగసాగరతరఙ్గాభ్యా మి వోద్గతాభ్యాం విద్రుమలతాలోహితాభ్యా మధరాభ్యాం అంటూ కాదంబరీ సౌందర్యనిరూపణకు దానిని వినియోగించుకొన్నాడు. శ్రీనాథుడు వసంతఋతుసమాగమాన్ని కన్నులకు కట్టే శోభనసమయంలో ఆ రాగాంబునిధిని తెలుగునేలకు మళ్ళించాడు. ఆ పైని, మధుమదముదిత కామిని గణ్డూషసీధుసేక పులకితవకులః ప్రతిదిశ మశ్లీలప్రాయ గీయమాన శ్రవణోత్సుక ఖిఙ్గజనప్రాయ ప్రారబ్ధ చర్చరీ గీతాకర్ణన ముహ్యదనేక పథికశతః అని సుబంధుడు చేసిన పౌరకాంతావర్ణనను ముందుంచుకొని –

జాదర! జాద! రంచు మృదుచర్చరిగీతులు వారుణీ రసా
స్వాద మదాతిరేకమునఁ జంద్రిక కాయఁగ దక్షవాటికన్
వేదుల మీఁదటం గనకవీణలు మీఁటుచుఁ బాడి రప్సరల్
మోద మెలర్పఁగా భువనమోహనవిగ్రహు భీమనాథునిన్.

అని భీమేశ్వర పురాణంలో (5-103) భాషాంతరీకరించాడు. మూలంలోని అశ్లీలప్రాయ సాహిత్యరచనతో ఉన్న చర్చరీ గీతాలు భీమేశ్వరస్వామి సన్నిధానంలో అనౌచిత్యాపాదకాలు కాగలవని గ్రహించి, వారుణీ రసా, స్వాద మదాతిరేకమున అని దానిని మదాతిరేకతలో అంతర్భవింపజేశాడు. మధుమదముదిత లైన లౌకికస్త్రీలను అప్సరోవనితలుగా మార్చి, వారుణీ రసా, స్వాద మదాతిరేకతను మాత్రం ఉన్నదున్నట్లు కన్నులకు కట్టాడు. హర్షేఽప్యామోదవ న్మదః (నామలింగానుశాసనం), మదో గర్వే హ ర్షేభ దానయోః (విశ్వప్రకాశం) ఇత్యాది ప్రమాణాల వల్ల మదమంటేనే హర్షం గతార్థమైనందువల్ల (మదీ హర్షే అని ధాతుపాఠం) ముదితలు అనే పునరుక్తిని తొలగించి, దాని అతిరిచ్యతను మాత్రం వాచ్యం చేశాడు. ఎటొచ్చీ శృంగారప్రియుడే కనుక మూలంలోని ప్రకాశ్యార్థాన్ని విడిచిపెట్టలేక, జాదర! జాద! రంచు మృదు చర్చరిగీతులు అన్న మాటతో ఆ తీక్ష్ణతను తొలగించి – అతీక్ష్ణతను (మృ ద్వతీక్ష్ణే చ కోమలే అని హైమకోశం) విశేషకంగా నిలిపి, అశ్లీలప్రాయ చర్చరీ గీతలలోని అసభ్యతను సంస్కరించివేశాడు. అసలు చర్చరీ గీత లక్షణంలోనే అతివేలమైన శృంగారప్రకాశం ఉన్నందువల్ల మద్యపానము అనే హేతూద్ధారంతో దానిని సమర్థించాడు. ఈ విధంగా మరొక్కసారి సుబంధునియెడ తనకు గల అభిమానాన్ని జ్ఞాపకం చేశాడు.