సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు

పూర్వకావ్య ప్రశంసలు

కాగా, సుబంధుడు వాసవదత్తా కథలోని వర్ణనలలో పెక్కుచోట్ల ఉపమాన మూలకం గానూ, శ్లేషవశం గానూ ప్రసక్తించిన కొన్ని గ్రంథనామాలు ఆయన కాలనిర్ణయానికి దోహదం కాగలవని భావించటానికి అవకాశం ఉన్నది. వాటిలో –

1) ఉపనిషత్తు (ఉపనిషద మివ సానన్దాత్మక ముద్ద్యోతయన్తీం),

2) శ్రీమద్రామాయణం (రామాయణేవ సున్దరకాణ్డచారుణా),

3) మహాభారతం (సదా పార్థోఽపి న మహాభారతరణయోగ్యః),

4) పింగళుని ఛందోవిచితి (ఛన్దోవిచితి రేవ భ్రాజమానతనుమధ్యాం),

5) మల్లనాగుని (వాత్స్యాయనుని) కామసూత్రం (కామసూత్ర ఇవ మల్లనాగఘటిత కాన్తారసామోదః),

6) ఉద్యోతకరుని న్యాయవార్తికం (న్యాయస్థితి మి వోద్యోతకరస్వరూపాం),

7) జైమిని సూత్రాలు (జైమిని మతానుసారిణ ఇవ తథాగతధ్వంసినః),

8) అలఙ్కారమ్ అనే సంజ్ఞతో వ్యవహరింపబడిన (బౌద్ధసఙ్గీతి మి వాలఙ్కారప్రసాధితాం) అశ్వఘోషుని సూత్రాలంకారం (లేదా) అసంగాచార్యుని మహాయాన సూత్రాలంకారం – మొదలైనవాటి కాలనిర్ణయాలను బట్టి ఆయన క్రీస్తుశకం నాలుగవ శతాబ్దికి తరువాతివాడని;

9) అభిజ్ఞానశాకుంతలంలో కాళిదాసు ప్రవేశపెట్టిన దుర్వాసుని శాపవృత్తాంతాన్ని (అఫల మివ దుష్యన్తస్య కృతే శకున్తలాపి దుర్వాససః శాప మనుబభూవ అని వాసవదత్తా కథ ముద్రితప్రతులలోని పాఠం; విఫల మేవ దుష్యన్తస్య కృతే దుర్వాసస శ్శాప మనుబభూవ శకున్తలా అని తెలుగుదేశంలోని వ్రాతప్రతులు) పేర్కొన్నందువల్ల కాళిదాసుకు అనంతరీయుడని –

10) సా రసవత్తా విహతా నవకా విలసన్తి చరతి నో కఙ్కః, సరసీవ కీర్తిశేషం గతవతి భువి విక్రమాదిత్యే అని ఉన్న అవతారికా శ్లోకంలోని విక్రమాదిత్యుని మృతిప్రస్తావం వల్ల[2] – రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని (క్రీ.శ. 374-413) అనంతరం – మొదటి కుమారగుప్తుని కాలంలో (క్రీ.శ. 374-413) ఈ కథారచనను చేసి ఉండవచ్చునని –

ఒకపాటిగా విమర్శకులు సుబంధుని కాలాన్ని ఊహించటానికి వీలవుతున్నది.

క్రీస్తుశకం 800(±) నాటి వామనాచార్యుడు తన కావ్యాలంకారసూత్ర వృత్తిలోని అర్థగుణాధికరణంలో అభిధేయ (అంటే అర్థము యొక్క) ప్రౌఢత్వాన్ని (= ఓజస్సు అనే గుణాన్ని) వివరించేటప్పుడు సాభిప్రాయతకు నిదర్శకంగా ఈ శ్లోకాన్ని ఉదాహరించాడు:

సోఽయం సమ్ప్రతి చన్ద్రగుప్తతనయ శ్చన్ద్రప్రకాశో యువా
జాతో భూపతి రాశ్రయః కృతధియాం దిష్ట్యా కృతార్థశ్రమః.

దీనిని బట్టి వామనుని దృష్టిలో మగధదేశాన్ని పరిపాలించిన చంద్రగుప్తమౌర్యుని కొడుకు బిందుసారుని వద్ద (క్రీ.పూ. 320-273) సుబంధుడనే మంత్రి ఉండినట్లు, ఆయన మంత్రిత్వనైపుణి వల్ల, విద్యాధికారిత్వం వల్ల బిందుసారునికి విద్వాంసులందరికీ ఆశ్రయం ఇచ్చేవాడన్న మంచి ప్రసిద్ధి కలిగినట్లు (ఆశ్రయః కృతధియా మి త్యస్య చ సుబన్ధుసాచివ్యోపక్షేపపరత్వాత్ సాభిప్రాయత్వమ్) స్పష్టం.

మహాకవి దండి రచించిన అవంతీసుందరీ కథలోనూ ఈ సుబంధుని ఉదంతం ఉన్నది కాని, ముగింపు శ్లోకం చివరి భాగంలోని పాఠం పూర్తిగా లభింపలేదు.

సుబన్ధుః కిల నిష్క్రాన్తో
బిన్దుసారస్య బన్ధనాత్
తస్యైవ హృదయం బద్ధ్వా
వత్సరాజ …

అంటూ – ఎంతో ఆసక్తికరమైన చోట ఆగిపోయింది. బిందుసారుని కొలువులో ఎన్నో సత్కారాలను అందుకొన్న సుబంధునిపై బిందుసారుడు ఒకరోజు ఏదో కారణం వల్ల ఆగ్రహించి, ఆయనను చెరలో పెట్టాడట. ఎట్లాగో సుబంధుడు చెరనుంచి తప్పించుకొని, మగధదేశం నుంచి పారిపోయి వత్సదేశపు రాజు ఆస్థానానికి వెళ్ళాడట. అక్కడ వత్సరాజు హృదయాన్ని ఆయన ఏ విధంగా ఆకట్టుకొన్నదీ అంతుపట్టకుండా ఈ కథ నిలిచి ఉన్నది.

అవంతీసుందరీ కథలోని ఈ వత్సరాజు వత్సదేశపు రాజైన ఉదయనుడని, ఉదయన బిందుసారులకు వైరం ఏర్పడి, ఇద్దరిలో ఎవరో ఒకరు మరొకరిని చెరపట్టారని, ఈ ఘటన జరిగిన కొంతకాలానికి సుబంధుడు మరణించి ఉండవచ్చునని – లేదా, ఈ ప్రస్తావనతోనే దండి ఈ కథను ఆపివేసి ఉంటాడని ఊహిస్తూ మానవల్లి రామకృష్ణకవిగారు Nṛttapāra అనే వ్యాసంలో –

Dandins fragmentary verse in praise of Subandhu suggests that Bindusāra and Udayana acted together and one imprisoned the other and Subandhu either died leaving the story there or the story really ends with that incident.

– Collected Papers of Manavalli Ramakrishna Kavi, పుటలు 198-9)

అని వ్రాశారు. ఇదికాక, మరొక ఐతిహ్యం కూడా ఉన్నది. సుబంధుడు బిందుసారుని కొలువులో మహాకవిగా గుర్తింపును పొంది హాయిగా ఉన్నాడట. కొంతకాలానికి సాటి కవుల ముందు తనకు జరగవలసిన సన్మానం విషయమై ఏదో పట్టింపు వచ్చి, పంతాలు పెరిగి, రాజు తనవైపు మొగ్గుచూపకపోయేసరికి విఫలమనోరథుడైనాడట. ధీరోద్ధతులకు సహజమైన కీర్తికాంక్షను కలిగి ఉన్నప్పటికీ – ఎవరికీ తలవంచే స్వభావం లేని స్వతంత్రుడు కాబట్టి, నానాటికీ పెరుగుతున్న రాజు ఐశ్వర్యమదాన్ని, అతనికి తనయెడ పొడచూపిన ఉపేక్షాభావాన్ని సహింపలేక – మగధదేశాన్ని విడిచి వత్సరాజు ఆస్థానానికి వెళ్ళాడట. అక్కడ వత్సరాజును తన వైదుష్యంతో మెప్పించి, అయిదు అగ్రహారాలను బహుమతిగా పొంది, అక్కడే స్థిరపడి, కొంతకాలానికి వత్సరాజు చెల్లెలిని పెళ్ళిచేసుకొన్నాడట.

ఈ కథను వింటుంటే మనకు భాస మహాకవి రచించిన స్వప్నవాసవదత్తంలో వత్సదేశానికి రాజైన ఉదయనుడు శత్రురాజు చేతిలో ఓడిపోయి, లావాణకంలో భార్య వాసవదత్త అగ్నిదగ్ధ అయిన మిథ్యావార్తను విన్న కొంతకాలానికి యౌగంధరాయణుని సాచివ్యనైపుణి వల్ల మగధ రాజు దర్శకుని చెల్లెలు పద్మావతీదేవిని పెండ్లాడిన కథ జ్ఞాపకానికి వస్తుంది. ఈ రెండు కథలకూ గల వింత పోలిక గమనింపదగినదే. సుబంధుడు మగధరాజు వద్ద సాచివ్యనైపుణికి పేరుపొందినవాడు. రాజుతో వైరం ఏర్పడి – మగధదేశాన్ని విడిచి, వత్సదేశానికి వెళ్ళి రాజు చెల్లెలిని వివాహం చేసుకొన్నాడు. ఉదయనుడు వత్సదేశపు రాజుగా ఉంటూ, పరిస్థితులు తారుమారైనాక యౌగంధరాయణుని మంత్రిత్వం వల్ల మగధదేశానికి వెళ్ళి రాజు చెల్లెలిని వివాహం చేసుకొన్నాడు.

మగధలో ఉండగా సుబంధుడు వత్సరాజ చరిత్రను నాటకంగా మలిచి, తన్మూలంగానో మరేదో కారణాననో బిందుసారునితో వైరం ఏర్పడి, ఆ చోటు విడిచి వత్సదేశానికి వెళ్ళాడని ఇంకొక ఐతిహ్యం.

సంస్కృతంలో సముద్రగుప్త చక్రవర్తి రచించిన కృష్ణచరిత కావ్యంలో ఇటువంటిదే, మరొక ఐతిహ్యం కనబడుతుంది. అందులోని రాజకవయః అన్న విభాగంలో (రాజకవులు – అంటే రాజులైన కవులు అని కాదు; రాజాశ్రయాన్ని పొందిన కవులు అని అక్కడి ప్రాకరణికార్థం) ప్రసక్తమైన సుబంధుని చరిత్రాధికరణం ఈ ఐతిహ్యానికి ఉపబలకం. అందులోని శ్లోకాలివి:

జయ త్యయం పూర్ణకలః కవికీర్తిసుధాకరః
అకలఙ్కో రసామ్భోధి ముద్వర్తయతి య స్సదా.

వ్యాహారసౌష్ఠవ ముదారరసం మహార్థం
య న్నాటకం సురభిగర్భితనాటకం చ.

త ద్వత్సరాజచరితం మృదుభావహారి
కృత్వా సుబన్ధు రభవ త్కృతినాం వరేణ్యః.

బిన్దుసారస్య నృపతేః స బభూవ సభాకవిః
కిం తు సేహే న తద్గర్వం తిరశ్చక్రే చ తాం సభామ్.

ఉరగాభే నృపే తస్మిన్ క్రుద్ధే బన్ధమితం(?) కవిమ్.
సరస్వతీ ముమో చాథ తం దేశం సోఽత్యజ త్తథా.

విద్వాన్ జయీ వత్సరాజో దృష్ట్వా వైదుష్య ముత్తమమ్
పఞ్చగ్రామాన్ దదౌ తస్మై నిజాం భగినికాం తథా.

ఇందులో పేర్కొనబడిన సుబంధుని వత్సరాజ చరితమే అభినవగుప్తుడు తన నాట్యశాస్త్ర వ్యాఖ్యలో ఉద్ధరించిన వాసవదత్తా నాట్యపార కావచ్చునని ఒక ఊహ. ఆ పక్షాన వామనుడు కావ్యాలంకార సూత్రవృత్తిలో ఉదాహరించిన ‘సోఽయం సమ్ప్రతి చన్ద్రగుప్తతనయః’ అన్న శ్లోకం దీని అవతారిక లోనిదే అయివుంటుంది. ఇది కూడా ఊహే.

Poona Orientalia పత్రికలో (సంపుటి X, పు.88) సి.ఆర్. దేవధర్ ఈ శ్లోకగాథ శూద్రకుడు రచించిన వత్సరాజ చరితం లోనిదని ఊహించారు. అయితే శూద్రకుని పేర ఈ వత్సరాజ చరితమనే రచన ఉన్నదనటానికి గాని, ఈ శ్లోకం అందులోనిదని ఊహించటానికి గాని ఆధారాలను చూపలేదు. నాకున్న పరిమితపరిధిలో ఎంత ప్రయత్నించినా శూద్రకుని ఆ వత్సరాజ చరితం గాని, దానినుంచి ఉదాహరణలు గాని నాకేవీ దొరకలేదు. శూద్రకుని వీణా వాసవదత్తంలోనూ వత్సరాజ చరితను గురించిన సమాచారం లేదు. శూద్రకుని మృచ్ఛకటిక రూపకం (4-26) లో ‘ఉత్తేజయామి సుహృద్భ్యః పరిమోక్షణాయ యౌగన్ధరాయణ ఇ వోదయనాయ రాజ్ఞః’ అని ఆర్యకోదంతంలో ఉన్న వాక్యాన్ని బట్టి శూద్రకుని దృష్టిలో ఉన్నది సుబంధుని వాసవదత్తా కథకు సంబంధించిన వృత్తాంతం కాదని చెప్పవచ్చును. దేవధర్ వ్యాసాన్ని బట్టి ఆ అభిప్రాయంపై ఎటు వ్యాఖ్యానించడానికీ వీలులేకుండా ఉన్నది.

శ్రీహర్షుని రత్నావళి (2-3) లోని ‘లోకే హారి చ వత్సరాజచరితమ్’ అన్న వాక్యం కూడా శూద్రకుని రచనకు వర్తిస్తుందో, భాసుని రచనను సూచిస్తున్నదో స్పష్టంగా తెలియటం లేదు. వ్యాఖ్యాతలు చెప్పలేదు. కౌటల్యుని అర్థశాస్త్రం (9-7) లోని ‘దృష్టా హి జీవతః పునరావృత్తి ర్యథా సుయాత్రోదయనాభ్యామ్’ అన్న ప్రస్తావన విషయమూ అంతే. భాస సుబంధుల కంటె మునుపే ఉదయనుని కథ, వాసవదత్త కథ ఏదో ఒక రూపంలో దేశమంతటా ప్రచారంలో ఉండినవని మాత్రం దీనిని బట్టి ఊహించటానికి వీలవుతున్నది. దామోదర గుప్తుని కుట్టనీ మతంలో ప్రస్తావింపబడిన వాసవదత్త ఉదయనుని ప్రేయసి కాబట్టి ఆయన దృష్టిలో ఉండినది కూడా సుబంధుని రచన కాదన్నమాట.

1926లో శ్రీ బాలమనోరమా సీరీస్ పక్షాన మద్రాసులో అచ్చైన శక్తిభద్రుని ఆశ్చర్యచూడామణి నాటకం పీఠికలో ఆచార్య కుప్పుస్వామిశాస్త్రి శక్తిభద్రుని మరొక రచన అయిన ఉన్మాద వాసవదత్త నిజానికి భాసుని పేరిట లభిస్తున్న ప్రతిజ్ఞా యౌగంధరాయణము అని వ్రాశారు. వారే మరొక వ్యాసంలో శక్తిభద్రుని ఉన్మాద వాసవదత్తమే సుబంధుడు రచించినదిగా పేర్కొనబడుతున్న వత్సరాజ చరితము అనికూడా వ్రాశారు. శక్తిభద్రుని ఆశ్చర్యచూడామణిలో ఆయన ఉన్మాద వాసవదత్తమును రచించిన ప్రస్తావాన్ని తప్పించి వేరేమీ వివరాలు లేవు. కుప్పుస్వామిశాస్త్రి ఆ రోజులలో భాసుని పేరిట వెలసిన రచనలన్నీ భాసునివి కావని, అవన్నీ వేర్వేరు రచయితల కృతులని నమ్మినవారు. అందువల్ల వారి అభిప్రాయంపై ఎటు వ్యాఖ్యానించడానికీ వీలులేకుండా ఉన్నది.

బిందుసారునిచే అవమానింపబడి కారాగృహం పాలైన కవికి సరస్వతి ప్రత్యక్షమై ఆయనను చెర విడిపించినదని, ఆ తర్వాత ఆయన మగధ రాజ్యాన్ని వదిలిపెట్టి కౌశాంబిలో వత్సరాజును ఆశ్రయించి రాజభగినిని పెళ్ళిచేసుకొన్నాడని పైన సముద్రగుప్తుడు కృష్ణచరితంలో చెప్పిన విషయాలన్నీ నేటి మన వాసవదత్తా కథా రచయిత అయిన సుబంధునికంటె పూర్వుడైన మరొక సుబంధునికి అనువర్తిస్తే, భగవత్పతంజలి వ్యాకరణ మహాభాష్యంలో పేర్కొన్న వాసవదత్తాఖ్యాయికా రచయిత అయిన సుబంధునితో ఆ ఇద్దరికీ గల అన్వయం ఏమిటన్నది ఇంతవరకు చిక్కుముడి వీడలేదు.

ఇతర కృతిప్రస్తావనలు

దీనికితోడు వాసవదత్తా కథలో సుబంధుడు ప్రవేశపెట్టిన అనేక పాత్రల పేర్లు, కథావశాన సందర్భింపబడిన వివిధ పౌరాణికవృత్తాలు నిర్నిమిత్తాలు కావని; ఆనాడు ప్రసిద్ధికి నోచుకొన్న పెక్కు గ్రంథాల పేర్లను ఇందులో సాభిప్రాయంగా నెలకొల్పడం జరిగిందని చాలా రోజులుగా విమర్శకలోకంలో ఒక అభిప్రాయం ఉన్నది. ఇదికూడా వాదవివాదాలకు లోనయింది కాని, కవి కాలనిర్ణయానికి దోహదం కాగల బలీయఃప్రమాణం ఇది. కలలో కందర్పకేతునితో సమావేశం సిద్ధించిన తర్వాత వాసవదత్త ఆయన పొందుకోసం విరహవేదనను పొందే సన్నివేశం ఒకటున్నది. నాయకుని యెడబాటు వల్ల కలిగిన శరీరతాపాన్ని భరింపలేక ఆమె తన చెలికత్తెలను పేరుపేరునా పిలిచి శైత్యోపచారాలు చేయమని కోరుతుంది. ఆ విధంగా ఆమె చెలికత్తెలను పేరుపేరున పిలిచినప్పుడు – సంబుద్ధ్యంతాలుగా వచ్చిన ఆ పేర్లన్నీ ఆనాటికే కాలగర్భంలో అంతరించిపోయిన ఎన్నో మహాకృతుల నామధేయాలు కావచ్చునన్న విశ్వాసం సమంజసమే అనిపిస్తుంది. అందుకు రెండు ఉదాహరణలు:

౧) ‘విలాసవతి! విలాసయ మయూరకిశోరకమ్’ అన్నప్పడు విలాసవతి ఒక చెలికత్తె పేరు. ఈ విలాసవతి ఒక కావ్యం పేరట. విశ్వనాథ కవిరాజు సాహిత్యదర్పణంలో నాట్యరాసకానికి ఉదాహరణగా – ‘సన్ధిచతుష్టయవతీ యథా విలాసవతీ’ (6-285a) అని ఉదాహరించాడు. ఆ విలాసవతీ నాట్యరాసకంలో పంచసంధులలో నాలుగు సంధులు మాత్రమే ఉన్నాయట. అంతటి మహాలాక్షణికుడు ఉదాహరించిన ఈ విలాసవతి కావ్యం ఇప్పుడు దొరకటం లేదు. సుబంధుని కాలంలో ఉండివుంటుంది.

౨) ‘వహతీవ హతీ రనఙ్గలేఖే! స్మరసాయకానాం తవ వపు రలసమ్’ అన్నప్పటి అనంగలేఖ ఇంకొక చెలికత్తె పేరు. ఇదికూడా ఒక కావ్యమే. రుయ్యకుని అలంకారసర్వస్వానికి కూర్చిన తన విమర్శినీ వ్యాఖ్యలో జయరథుడు వాక్యార్థగతమైన అసమస్తపదాశ్రిత పునరుక్తవదాభాసాన్ని వివరిస్తూ, అందుకు నిదర్శనగా ‘ఇ త్యనఙ్గలేఖాయాం హస్తివర్ణనే’ అని ఈ అనంగలేఖలోని ఒక ఏనుగు వర్ణనను ఉదాహరించాడు. ఆ వర్ణనను బట్టి అనంగలేఖ ఒక అద్భుతావహమైన గద్యకావ్యమని ఊహింపదగి ఉన్నది. ఇప్పుడు దొరకటం లేదు.

౩) ‘చపలే, చిత్రలేఖే! లిఖ చిత్రే చిత్తచోరం జనమ్’ అన్నప్పటి చిత్రలేఖ కూడా వాసవదత్తా శైత్యోపచార సన్నివేశంలో వచ్చిన ఒక చెలికత్తె పేరు. ఈ చిత్రలేఖ ఒక నాటికా విశేషమని భోజుడు శృంగారప్రకాశంలో పేర్కొన్నాడు. ఉషానిరుద్ధుల పరిణయగాథలో ఉషకు ప్రాణసఖి అయిన చిత్రలేఖను ప్రధానీకరించి చెప్పిన కథావిశేషమని ఊహించాలి. ఆ పేరుతో ఉన్న ఒక అప్సరోవనితను గూర్చి నాటకీకరించి చెప్పేందుకు అనువైన గాథలేవీ పురాణాలలో అగపడవు. అందువల్ల ఆ చిత్రలేఖను అధికరించిన రచన కాకపోవచ్చును. ఏది యేమైనప్పటికీ భోజరాజు పేర్కొన్న ఆ నాటిక ఇప్పుడు దొరకటం లేదు. సుబంధుని కాలంలో ఉండివుంటుంది.

ఇటువంటివే – కాంతిమతి, లవంగవతి, రాగలేఖ, వసంతసేన, మదనమాలిని, మదనమంజరి, తరంగవతి మొదలైన పేర్లన్నీ ఆ శైత్యోపచార సన్నివేశంలోని సుబంధుని సాభిప్రాయకథనంలో చెలికత్తెల పేర్లుగా చక్కగా ఒదిగిపోయాయి. ఇవన్నీ ఒకనాడుండి, ఇప్పుడు లుప్తమైపోయిన కావ్యాల పేర్లే. వీటిలో చివరిది తరంగవతి క్రీస్తుశకం 72 నాటి హాలమహారాజు ఆస్థానానికి వన్నెతెచ్చిన మహాకవి శ్రీపాలితుని రచన. ‘ప్రసన్నగమ్భీరపథా కథాఙ్గమిథునాశ్రయా, పుణ్యా పునాతి గఙ్గేవ గాం తరఙ్గవతీ కథా’ అని ధనపాలుడు దీనిని తన తిలకమంజరిలో ప్రశంసించాడు. ఇందులోని మదనమంజరి గుణాఢ్యుని బృహత్కథలో ప్రసక్తింపబడిన నరవాహనదత్తుని భార్య మదనకంచుకకు సంస్కృతరూపమని, అది ఒకనాటి కావ్యవిశేషం కావచ్చునని Indian Kavya Literature (సంపుటం-2, పుట 243) లో ప్రఖ్యాత వాఙ్మయైతిహాసికులు వార్డెర్ అభిప్రాయపడ్డారు. ఆ రచనలేవీ ఇప్పుడు దొరకటం లేదు.

అందువల్ల – సుబంధుని కావ్యరచనాసామగ్రిలో ఒక్క వాక్యమైనా సార్థకం కానిదంటూ ఉండదని, కథలోని ప్రతి ఒక్క సన్నివేశాన్ని, ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి ఒక్క పదాన్ని, ప్రతి ఒక్క అక్షరాన్ని పట్టి పట్టి చదివితేనే గాని అంతరార్థం బోధపడదని గ్రహించాలి.

ఈ విధంగానే ఇందులో అక్కడక్కడ కేవలం ప్రస్తావవశాన స్మరింపబడిన –

1) ఉషా పరిణయం (ఉషా మి వానిరుద్ధదర్శనసుఖామ్),

2) కార్తవీర్యార్జునుని కథ (కార్తవీర్యో గోబ్రాహ్మణపీడయా పఞ్చత్వ మాసీత్),

3) కువలయాశ్వ చరిత్ర (లేదా, మదాలసా చరిత్ర) (కువలయాశ్వో నాశ్వతరకన్యా మపి పరిజహార, అశ్వతరకన్యా మివ మదాలసామ్),

4) తపతీసంవరణోపాఖ్యానం (సంవరణో మిత్రదుహితరి విక్లబతా మగాత్),

5) తారాశశాంకం (తారా మివ గురుకలత్రోపశోభితామ్),

6) ధూమోర్ణా వృత్తాంతం (విఫల మేవ ధూమోర్ణాస్వయంవరార్థాగతదేవగ్రహగన్ధర్వసహస్రేషు ధర్మరాజ మకాంక్షత),

7) నలదమయంతీ కథ (నలం కలి రభిభూతవాన్),

8) నహుష చరిత్రం (నహుషః పరకలత్రదోహదీ మహాభుజఙ్గ ఆసీత్),

9) మేనకాఖ్యానం (మేనకానఖమార్జనశిలాశకల ఇవ మధుచ్ఛత్రచ్ఛాయామణ్డలోదరే),

10) సుభద్రార్జునుల కథ (పార్థ ఇవ సుభద్రాన్వితః),

మొదలైన ఇంకా అనేకసంఘటితాలన్నీ ప్రాస్తావికములైన పురాణప్రసిద్ధకల్పనలు కావని, పూర్వం ఒకప్పుడు రచింపబడిన కావ్యపరంపర నుంచి ఉద్ధృతములై ఉండవచ్చునని చిరకాలంగా విమర్శకలోకంలో ఏర్పడి ఉన్న అభిప్రాయాన్ని కూడా కాదనలేము. ఈ విధంగా ఇదొక అపూర్వమైన వేద పురాణ కావ్య వ్యాకరణ న్యాయ మీమాంసాది విజ్ఞానసర్వస్వమని చెప్పదగి ఉన్నది.

సుబంధుడు కూడా దండి – మాఘ – భవభూతి – భారవి మహాకవుల వలె దాక్షిణాత్యుడు. వాసవదత్తా కథలో ‘రశనాబన్ధో రతికలహేషు’ అని ఒకచోట శ్లేషలో శ-స లకు అభేదం పాటింపబడి ఉండటం వల్ల, అటువంటివే ఇంకా మరికొన్ని ప్రయోగాల మూలాన, ఆయన వంగదేశీయుడని హాల్, మన్మోహన్ ఘోష్ వంటి పండితులు ఊహించారు. 1941లో ప్రఖ్యాతవిద్వాంసులు ఆచార్య ఆర్.జి. హర్షే Subandhus Home అన్న తమ వ్యాసంలో ఈ ఊహలను తిరస్కరించారు. రతివేళ నాయికానాయకులు రసనా బంధమును (సంపుటక చుంబనంలో ప్రేయసీప్రియుల నాల్కలు రెండూ కలిసినప్పటి జిహ్వాబంధవిశేషమని వాత్స్యాయన కామసూత్రం), రశనా బంధమును (నాయిక తన ప్రియుని చేతులను పర్యంకానికి రజ్జువుతో బంధించినప్పటి పురుషాయిత కేళివిశేషం) పాటిస్తారన్నది శ్లేషమూలకమైన వర్ణ్యాంశం. అయితే శబ్దకోశాలలో రసన, రశన అన్న రెండు పదాలకూ నాలుక, రజ్జువు అన్న రెండర్థాలూ పేర్కొనబడి ఉన్నాయి. అందువల్ల ఇది శ-స ల అభేదపరిపాటికి గాని, కవియొక్క వంగదేశీయతకు గాని నిదర్శకం కాదని చెప్పవచ్చును.

శఫరము అన్న మీనవిశేషద్యోతమైన శబ్దాన్ని శఫరీ అన్న స్త్రీలింగానికి మారుగా సుబంధుడు పుంలింగంలో ప్రయోగించటం కూడా ప్రాంతసూచకమని కొందరు విమర్శకు లూహించారు. అదీ సరికాదు. శఫరీ-శఫరాలు రెండూ రూపాంతరాలు. ‘శఫరీ శఫరోఽపి చ’ అని ఆ రెండింటినీ పర్యాయాలుగా వంగదేశీయుడే అయిన మథురేశుని శబ్దరత్నావళి పేర్కొంటున్నది. ‘ప్రోష్ఠీ తు శఫరీ ద్వయోః’ అని అమరకోశంలోనూ ఉన్నది. జాలరులు వల విసిరి దీనిని లోతుగలిగిన నదీసముద్రాలలోనూ, అంతగా లోతులేని గుంటలలోనూ కూడా పట్టుకొంటారని వర్ణనలున్నాయి. ‘అగాధజలసఞ్చారీ వికారీ న చ రోహితః, గణ్డూషజలమాత్రే తు శఫరీ ఫర్ఫరాయతే’ అని వరరుచి నీతిరత్నం (శ్లో.10). శఫరము నల్లరంగులో అందంగా కొనలుదేరి ఉండటం వల్ల దానిని నాయికల కాటుక కన్నులతో పోలుస్తారు. నేత్రశఫరం అని శృంగారతిలకం (శ్లో.1). ‘గతదీప్తిగభస్తిమాలినో, విలుఠద్వీచిషు బిమ్బ మమ్బుధేః, శఫరాః పలఖణ్డశఙ్కయా, రసనాభి ర్లిలిహు ర్ముహు ర్ముహుః’ అని గంగాదేవి మధురావిజయం (7-13). కాంతానయనాలకు శృంగారతిలక మధురావిజయాలలో వలె ఉపమానకల్పనలో శఫరికి ఙీష్ ప్రత్యయాన్ని లోపింపజేయటం కవిసమయసిద్ధమే. ఈ ‘శఫరము అనే చేప పరిమాణంలో చాలా చిన్నదనే గాక, పెద్దదని కూడా కవిప్రయోగాలున్నాయి. పెద్దది కనుకనే నాయిక కన్నులతో పోల్చటం జరిగింది. ‘నేత్రశఫరం’ అన్న దళానికి “చపలస్వభావ లోచన మహామీనంబు” అని పాండురంగ మాహాత్మ్యంలో (5-270) రామకృష్ణకవి అనువాదం. అందువల్ల శఫరము అనే చేపతోడి ఔపమ్యం ఒక్క వంగదేశానికి మాత్రమే సీమితమైన ఉక్తివిశేషమని నిరూపించటం సాధ్యం కాదు.

సుబంధుడు మాళవ దేశీయుడని ఆధునిక పరిశోధకుల విశ్వాసం. సుబంధుడన్న పేరు ఇప్పటికీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వాడుకలో ఉన్నది. ఆకాశమనే పైరుపొలంలో తారకలు తెల్లగోధుమ గింజలలా ఉన్నాయని (తారకా శ్వేతగోధూమశాలినో నభఃక్షేత్రస్య) ఒకచోట వర్ణించాడు. రేవా నది ఒడ్డున కాటుకపిట్టలు జతకట్టి ఉండటాన్ని చూసి ఆ చోట స్వర్ణనిధికోసం త్రవ్వకాలు సాగించే ఆటవికులను (కణాటీరమిథున మైథునదర్శనోపజాత నిధిగ్రహణకౌతుక కిరాతశత ఖన్యమానతీరయా రేవయా) ఒకచోట వర్ణించాడు. కథాస్థగితమైన ఒకానొక వర్ణనను బట్టి కవి నివాసస్థలాన్ని నిర్ధారించటం అసమంజసమైనప్పటికీ – ఆయన అవంతీ రాజ్యంలో క్షిప్రానది ఒడ్డున జీవించినవాడని నేటికీ అక్కడ ప్రచారంలో ఉన్న ఐతిహ్యాన్ని కాదనలేము. కావ్యమంతటా మనకు విశదప్రకాశంతో కానవచ్చే వింధ్యపర్వత వర్ణనలను, నర్మదా నదీ వర్ణనలను, లాట దేశ కుంతల దేశ కర్ణాట దేశ కేరళ దేశ ప్రస్తావికలను, ఇంద్రియానుభవనీయమైన మాళవకాంతల సౌందర్యచిత్రణను, ఆంధ్రదేశంలోని శ్రీశైల మల్లికార్జునస్వామి ప్రశంసను (శ్రీపర్వత ఇవ సన్నిహిత మల్లికార్జునః) చదువుతున్నప్పుడు కవి దాక్షిణాత్యపరిచయం కలిగిన మాళవ దేశీయుడని అనిపిస్తుంది.

మాఘుడు, బాణభట్టు, దండి మొదలుగా గల మహాకవుల రచనలలో సుబంధుని సన్నుతులతోపాటు స్పష్టమైన భావానువాదాలు, శబ్దానుసరణలు ఎన్నో ఉన్నాయి. అవి ఆనాటి సుబంధుని మహాప్రభావాన్ని కన్నులకు కట్టే దీపస్తంభాల వంటివి. అతిసంక్షిప్తమైన ఈ ప్రథమపరిచయంలో సుబంధుడు బాణునికి తర్వాతివాడని కొంతమంది సాహిత్యచరిత్రకారులలో ఉన్న అభిప్రాయం సరికాదని మాత్రం చెప్పుకొని, ఆ విషయాన్ని గురించి కావ్యవిమర్శకు ఉపక్రమించినప్పుడు మరింత విపులంగా మరొకప్పుడు చర్చించుకొందాము. సంధానగ్రంథాలలో వాక్పతిరాజు, మంఖకవి, రాజశేఖరుడు, భోజప్రబంధ రచయిత బల్లాలసేనుడు సుబంధుని స్మరించిన శ్లోకాలు విద్యార్థులకు ప్రాతరనుసంధేయాలు. విశ్వగుణాదర్శంలో వేంకటాధ్వరి సుబంధుని స్మరించిన పంక్తి (ఖ్యాతా శ్చాన్యే సుబన్ధ్వాదయ ఇహ కృతిభి ర్విశ్వ మాహ్లాదయన్తి) నలుగురికీ తెలిసినదే. ఇక, ఆంధ్రుడైన రామచంద్రభట్టు తన రోమావలీ శతకంలో (ఇది ఇంకా అముద్రితం; కాంకరోలీ (రాజస్థాన్) లోని సరస్వతీ భండార లిఖితపుస్తక సంగ్రహాలయంలోని వ్రాతప్రతి (66/12) నుంచి ఈ శ్లోకాన్ని ఉదాహరిస్తున్నాను. పండిత దుర్గాప్రసాద – కాశీనాథ పరబ్ మహాశయులు 1891లో కావ్యమాలా సంగ్రహంలో అష్టమగుచ్ఛంగా 135-155 పుటలలో అచ్చువేసిన కవీంద్రకర్ణాభరణ కావ్యకర్త విశ్వేశ్వరపండితుని రోమావలీ శతకం వేరొకటున్నది; అది దీనికంటె ఆధునికం) మహాకవి సుబంధుని ప్రాచీనునిగా గుర్తించి, సాక్షాత్తూ వ్యాసభగవానుని సరసను నిలిపి సంకీర్తించిన శ్లోకం:

వ్యాస స్యాదికవేః సుబన్ధువిదుషో బాణస్య చాన్యస్య వా
వాచా మాశ్రితపూర్వ పూర్వవచసా మాసాద్య కావ్యక్రమమ్
అర్వాఞ్చో భవభూతి భారవిముఖాః శ్రీ కాలిదాసాదయః
సఞ్జాతాః కవయో వయం తు కవితాం కే నామ కుర్వీమహి.

ఆదికవులు వాల్మీకి వ్యాసమహర్షులు. ఆ తర్వాత లౌకికులలో మహావిద్వాంసుడు సుబంధుడున్నాడు. ఆ తర్వాత బాణుడు. కవులంటే నిజంగా ఆశ్రయింపతగిన కవులు వీళ్ళు. అర్వాచీనులలో కాళిదాసు, భవభూతి, భారవి మొదలైనవాళ్ళు. వీళ్ళందరూ ఉండగా చెప్పుకోవటానికి కవులమంటూ మాలాంటివాళ్ళం కూడా ఉన్నాం. వీళ్ళ కావ్యక్రమాన్ని చూసిన తర్వాత మా కవితా ఒక కవితే? అని, అందంగా అన్నాడు. (వివిధకవుల పేర్లను తత్తత్కాలానుసారం పేర్కొనటంలో పొరబడ్డాడు కాని, ఎంతైనా మన తెలుగువాడు, వ్యాసుని తర్వాత సుబంధుని తలచుకొన్నాడు కదా! మీరు చదువుతారు కదా అని ఈయన శ్లోకాన్ని ఉదాహరించాను.)