సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు

ముద్రితప్రతుల సంగతి

ఇక ముద్రితప్రతుల విషయానికి వస్తే – బిబ్లియోథికా ఇండికా ప్రచురణగా ఫిట్జెడ్వర్డ్ హాల్ 1859లో అచ్చువేసిన వాసవదత్తా కాంచనదర్పణంలో ఉపర్యుక్త వ్యాఖ్యాత శివరామ త్రిపాఠి (సుబన్ధువర్గబోధాయ సుబన్ధుకవిసత్కృతేః, రమ్యా వ్యాఖ్యా దర్పణాఖ్యా శివరామేణ తన్యతే) దీనిని ఆఖ్యాయికగానే నిర్వచించి వివరించాడు. 1870లో వావిళ్ల రామస్వామిశాస్త్రులు, సరస్వతీ తిరువేంకటాచార్యులు కలిసి పరిష్కరించిన హాల్ ప్రత్యాధారితమైన ఆంధ్రలిపి ముద్రణలో –

శ్రీమతా సుబన్ధునామ్నా మహాకవినా
విరచితేయం
వాసవదత్తాఖ్యా మహాఖ్యాయికా

అని ముఖపత్రం పైని ప్రకటించారు. వాసవదత్త దాక్షిణాత్యపాఠాన్ని వ్రాతప్రతుల మూలాన పునఃపరిష్కరించి, వ్యాఖ్యానాలను రచించిన టి.వి. శ్రీనివాసాచారియార్ 1906 లోనూ; ఆర్.వి. కృష్ణమాచార్యులు 1906 లోనూ తమ పీఠికలలో దీనిని ఆఖ్యాయిక అనే అన్నారు. 1912లో కొలంబియా విశ్వవిద్యాలయం పక్షాన సుబంధుని వాసవదత్తను కృష్ణమాచార్యుల వారి పాఠంతో సరిపోలుస్తూ ప్రధానంగా మధుర సుబ్బాశాస్త్రి పాఠానుసారం సంస్కృతమూలాన్ని ఆంగ్లానువాదసమేతంగా అచ్చువేసిన లూయీ హెర్బర్ట్ గ్రే తమ పీఠికలో లాక్షణికోదితాలను బట్టి ఈ కథ – ఆఖ్యాయిక అన్న ఉభయపక్షాల సారవిచారం చేసి, చివరికి దీనిని కథగా (చూ. పుట 16) నిర్ధారించారు. అప్పటి నుంచి నాగరి లిపి, రోమక లిపి, వంగ లిపి, కన్నడ లిపి ముద్రణ సంపాదకులందరూ గ్రే ప్రతిని అనుసరించి వాసవదత్తా కథ అనే అచ్చువేస్తున్నారు.

ప్రతివిలేఖకులు, వ్యాఖ్యాతలు, ప్రచురణకర్తల సంగతి ఇలా ఉండగా, 1862లో దీనిని తొలిసారి తెలుగు లిపిలో అచ్చువేసిన మధుర సుబ్బాశాస్త్రి మాత్రం –

శ్రీమన్నిఖిలసురేంద్రాదివందితపాదకమల
శ్రీ వాగ్దేవీదత్తవరప్రసాదేన
సుబంధునామ్నా కవికులసార్వభౌమేన
విరచితః వాసవదత్తాఖ్యః చంపూప్రబంధోయం
ధీమతా మర్థపరిజ్ఞానాయ
మధుర సుబ్బాశాస్త్రిణా సంశోధ్య పరిష్కృతః

అంటూ, వాసవదత్త చంపూ ప్రబంధము అనే విలక్షణమైన ఒక సరికొత్త ప్రతిపాదనను చేశారు. ఇది – వాసవదత్త మొదట కథాముఖంలో పదమూడు శ్లోకాలు, కథామధ్యంలోని తత్తదుచితస్థానాలలో ఆరు – మొత్తం మీద ప్రధానమైన గద్యబంధంతోపాటు పంధొమ్మిది శ్లోకాలు కూడా ఉన్నందువల్ల – గద్యపద్యమయం కావ్యం చమ్పూ రి త్యభిధీయతే (విశ్వనాథుని సాహిత్యదర్పణం: 7-336) వంటి లాక్షణికోక్తులను అనుసరించిన సామాన్యాభిప్రాయమే తప్ప కథా-ఆఖ్యాయికల వాదవివాదాలను సూక్ష్మంగా పరిశీలించి చేసిన నిశ్చాయకసిద్ధాంతం కాదని మనము తోసిపుచ్చటం సులభమే కాని – ప్రతిపాదన చేసినది ఆలంకారికశిరోమణీ, చుళుకితసమస్తశాస్త్రజలధీ అయిన సుబ్బాశాస్త్రిగారు కాబట్టి – ఇందులోని యుక్తాయుక్తాలను గురించి నాలుగు మాటలు:

వాసవదత్తా చంపూ విషయ విమర్శ

నిజానికి శాస్త్రిగారి దృష్టిలో ఉండినదో లేదో తెలియదు కాని, వారికంటె శతాబ్దాలకు పూర్వమే – వాసవదత్త అన్న పేరుతో వెలసిన ఒకానొక కృతి చంపూ కావ్యము అన్న ప్రతిపాదనను తొలిసారి చేసినవాడు భోజరాజు. ఆయన తన శృంగారప్రకాశం లోని రసావియోగప్రకాశనప్రకాశమనే (సంపుటి 2: అధ్యా-11, పుట 429) అధ్యాయంలో –

ఆఖ్యాయికైవ సాఙ్కా సోచ్ఛ్వాసా దివ్యపద్యగద్యమయీ
సా దమయన్తీ, వాసవదత్తాది రి హోచ్యతే చమ్పూః

అని ఈ ప్రక్రియానిర్వర్ణనను చేశాడు. అయితే భోజరాజు ఉద్దేశించిన ఈ వాసవదత్త అన్న కావ్యం సుబంధుడు రచించిన ప్రకృతరచనమో – లేక ఆ రోజులలో వాసవదత్తా చంపువు అనేది వేరొకటుండినదో మనమిప్పుడు చెప్పలేము. ఎందుకంటే – నల చంపువు అనే నామాంతరం కలిగిన త్రివిక్రమభట్టు రచన దమయన్తీ కథ ఒకటున్నది. అది చంపూకావ్యమే. నలదమయంతుల పరిణయకథాకావ్యమే. భోజునికి పూర్వరచితం కాబట్టి, పై శ్లోకంలో సా దమయన్తీ, అని ఉదాహరింపదగినదే. ఆ దమయంతీ కథ చంపువుగా పరిగణింపబడినట్లే, సంయోగపృథక్త్వంగా వాసవదత్తా కథ కూడా భోజుని దృష్టిలో చంపువే అని వాదింపవచ్చును కాని – ఏవంవిధ దమయంతీ కథలు, దమయంతీ కథాకావ్యాలు సంస్కృతంలో ఇంకా అనేకం ఉన్నాయి. వీటిలో భోజుడు ఉద్దేశించిన దమయంతీ చంపువు ఏదై ఉంటుందో ఊహించటం చాలా కష్టం. ఒకవేళ ఊహించినా, భోజుడు స్వయంగా ఇది అని చెప్పలేదు కాబట్టి – మనమేదైనా నిర్ణయిస్తే, అది పొగమబ్బుతో నిచ్చెన కట్టినట్లే అవుతుంది. శృంగారప్రకాశంలోని దూతకర్మాధ్యాయంలో కూడా భోజుడు పూర్వానురాగ విషయాన్ని వివరిస్తూ – నాయికానాయకులు ప్రేమసందేశాలకు దూతలుగా పంపతగినవారి జాతులలో దేవ మనుష్య కిన్నర వానర శుక శారికా పారావతాదులతోపాటు హంసలను కూడా చేర్చి, ఈ దమయంతీ కావ్యాన్ని అక్కడ మరొక్కసారి పేర్కొన్నాడు. హైమంతకము, వసంతకము అనే రెండు హంసలు ఆ కథలో నలదమయంతుల మధ్య రాయబారం నడిపినట్లు చెప్పాడు. శృంగారప్రకాశం ప్రతులలో అసంపూర్ణంగా లభిస్తున్న ఆ లక్షణభాగం ఇది:

హంసః –

హైమన్తక వసన్తక దమయన్త్యాం నలోపగమనే యథా –
ప్రసార్య హస్తం నిపుణేన తేన
ధృత స్త … … ధృతవిక్రమేణ
క్రమేణ హంసో దమయన్తికాయాః
సన్దేశకం దివ్యగిరాచచక్ష. (సంపుటి-4: పుట 480)

ఈ సందర్భంలో భోజుడు ప్రత్యేకించి దీనిని చంపూకావ్యమని పేర్కొనకపోయినా, ఉదాహరణను బట్టి వెనుక శృంగారప్రకాశంలోని రసావియోగప్రకాశనప్రకాశాధ్యాయంలో సా దమయన్తీ అని ఉద్దేశించిన దమయంతీ చంపువు ఇదేనని నిశ్చయించటానికి ఆక్షేపం ఉండకూడదు. ఈ హైమంతక వసంతకాలనే హంసల ప్రస్తావమూ ఈ శ్లోకమూ త్రివిక్రమభట్టు రచించిన నల చంపువు అనే నామాంతరం ఉన్న దమయంతీ కథలో లేవు. హైమంతకం దమయంతి ఇంటినుంచి నలుని ఇంటికి, వసంతకం నలుని వద్ద నుంచి దమయంతి వద్దకు ప్రేమరాయబారాలు నడిపాయో, లేక హంసదంపతులుగా రెండూ కలిసివెళ్ళే కథ నడిపాయో మనకు తెలియదు. అందువల్ల, ఇది త్రివిక్రమభట్టు రచనమైన దమయంతీ కథ కంటె అన్యమై, ఈనాడు మనకు తెలియని వేరొక దమయంతీ చంపువు అయినట్లే, భోజుని శ్లోకంలో పేర్కొనబడిన వాసవదత్తా చంపువు కూడా సుబంధుని వాసవదత్త కంటె అన్యమై, ఈనాడు మనకు తెలియని వేరొక వాసవదత్తా చంపువు కావటానికి అవకాశం ఉంది. సుప్రసిద్ధమైన శ్రీహర్షుని నైషధీయ చరితంలోనూ ఈ హంసద్వయోదంతం లేదు. ఈ తీరు దమయంతీ కథాకావ్యాలు సంస్కృతంలో ఇంకా అనేకానేకం ఉన్నాయి. వీటిలో భోజుడు ఉదాహరించిన దమయంతీ కథ ఏదైనదీ కనుక్కోవటం సులభమేమీ కాదు. సంస్కృతంలో ఔఫ్రెట్ తన Catalogus Codicum Sanscriticorum Bibliothecae Boleinaeలో (సంపుటం. 1, ఆరోప సంఖ్య 6595) పేర్కొన్న ఒక దమయంతీ పరిణయం, ఒక దమయంతీ కథ ప్రాక్తనాలన్న ఊహే తప్ప వాటి కర్తృకాలాదులు మనకిప్పుడు తెలియవు. సంకలన గ్రంథకర్తలు, వాఙ్మయచరిత్రకారులు పేర్కొన్న దమయంతీ కావ్యాలు లిఖితగ్రంథసంచయాలలో సూర్యాలోక (సూర్య+ఆలోక) భాగ్యం లేనివి కొన్నీ, అచ్చైనప్పటికీ సూర్యాలోకానికి (సూరి+ఆలోకానికి) నోచుకోక మరుగునపడినవి కొన్నీ ఉన్నాయి. అవిగాక, సోమప్రభాచార్యుని కుమారపాలప్రతిబోధంలో ఉదాహృతమైన ఒక దమయంతీ చరితం, దేవప్రభసూరి పాండవచరిత అవతారికలో ప్రసక్తమైన దమయంత్యుపాఖ్యానం, వినయచంద్రసూరి రచించిన మల్లినాథ మహాకావ్యంలో ప్రస్తావింపబడిన దవదన్తీ చరితం, ఇంకా సోమతిలకసూరి శీలోపదేశమాలా వృత్తిలో ఉదాహరించిన దమయంతీ కథ, జినసాగరసూరి కర్పూరప్రకర టీకలో పేర్కొన్న వేరొక దమయంతీ కథ, శుభశీలగణి రచించిన భరతేశ్వర బాహుబలి వృత్తిలో ఉదాహృతమైన దమయంతీ కథ మొదలైనవి కాలనిర్ణయజిజ్ఞాసువులు పరిశీలింపదగ్గవి. ఇవిగాక – కవీంద్రాచార్యుని దమయంతీ చంపువు, రంగనాథుని దమయంతీ కల్యాణం, అనూహ్యకర్తృకమైన దమయంతీ పరిణయ కావ్యం, జైనగ్రంథాలయాలలో అవిదితకర్తృకమై లభిస్తున్న దమయంతీ ప్రబంధం; ఇంకా నలకథానకం, ఉదయరుచిసూరి శిష్యుడు హితరుచి రచించిన నలచరిత్ర ప్రబంధం, మాణిక్యదేవకవి రచించిన సుప్రసిద్ధమైన నలాయన మహాకావ్యం, నయసుందరకవి రచించిన దమయంతీ కథ అనే నామాంతరంతోడి నలాయనోద్ధారం మొదలైనవి అనేకం ఉన్నాయి.

వీలైనంతలో భోజునికి మునుపటి కృతులను మాత్రమే పరిశీలించాము. వీటిలో కొన్ని భోజునికి అనంతరకాలంలో వెలసినవి అయితే, వాటికి మూలమైన ఏదైనా ఒకానొక దమయంతీ కథ (లేదా చంపువు) భోజునికి ప్రాక్తనకాలపుది ఉండినదేమో, చెప్పలేము. జైనకవులు రచించిన సంస్కృత ప్రాకృతకావ్యాలలో అనేకం పూర్వుల రచనలపై ఆధారపడినవేనని తత్పరిచయం కలిగినవారందరికీ తెలిసిన విషయమే. పైగా, ఈనాడు దొరకనిదో లేక దొరుకుతున్నదో లేక దొరకనున్నదో తెలియని ఒకానొక దమయంతీ కావ్యప్రస్తావం పృథగ్వివక్షగా సుబంధుని రచనను వాసవదత్తా చంపువుగా నిర్ణయించటానికి తోడ్పడదు. దమయంతీ కథ అనబడే నల చంపువును దమయన్తీ అని సంకేతించినట్లే వాసవదత్తా (ఆఖ్యాయిక లేదా కథ) అనబడే సుబంధుని రచనను భోజుడు చంపూ కావ్యంగా సంకేతించినట్లు భావించటానికి వీలులేదని ఇంతకుముందే అనుకొన్నాము. పైగా ఆ దమయన్తీ అన్నది త్రివిక్రమభట్టు రచనమని గాని, ఈ వాసవదత్తా అన్నది సుబంధుని రచనమని గాని భోజుడు సూచింపలేదు. ఇంతవరకు పేర్కొన్న దమయంతీ కథలే గాక హేమచంద్రసూరి నలచరిత్ర ప్రబంధం, ఋషివర్ధనాచార్యుని నలదమయంతీ చరిత్ర, వినయచంద్రసూరి రచించిన మరొక నలదమయంతీ చరిత్ర, హేమచంద్రసూరి అంతేవాసి రామచంద్రుని నలవిలాస నాటకం వంటివి భోజునికి ఒకపాటి ముందువెనుకలలో వెలసినవే ఇంకా ఉన్నాయి. చిత్రరత్నాకర కర్త చక్రకవి రచించిన దమయంతీ పరిణయం చంపువే కాని – అది భోజునికి తర్వాతి కాలపుది. అంతేకాక, భోజుడు పద్యగద్యమయీ అన్నందువల్ల బహుశః అది గద్యప్రధానమైన చంపువు కాదని, పద్యప్రధానమైన చంపువని అనుకోవాలి.

సుబ్బాశాస్త్రిగారు వాసవదత్తా కథను చంపువుగా నిర్ణయించటానికి భోజుని నిర్వచనం ఉపకరింపదని చెప్పటానికి ఇంతదూరం వచ్చాము. ఇదిగాక వారికి వేరేమి ఆధారం ఉండినదీ వివరాలింకా తెలియవలసి ఉన్నది.

ఆఖ్యాయిక-కథ

నిజానికిదంతా లక్షణావగతికోసం మనము వివేకించటమే కాని, స్థూలదృష్టికి మాత్రం ఈ ఆఖ్యాయిక, కథ అన్నవి రెండూ గద్యకావ్యాలే. అక్కడక్కడ కొన్ని శ్లోకాలున్నంత మాత్రాన వీటిని చంపూ కావ్యాలుగా పరిగణించేందుకు తగిన లక్షణవ్యవస్థ లేదు. భోజుడు పద్యగద్యమయీ అన్నందువల్ల పద్యప్రధానమైన కృతి వేరొకటున్నదేమో అని ఇప్పుడే అనుకొన్నాము. పద్య (శ్లోక) ప్రధాన రచనలో వచనం చోటుచేసుకొంటేనే చంపువు అన్నారు కాని, ఎందుచేతనో లాక్షణికులు గద్యప్రధానరచనలో పద్యం (శ్లోకం) ప్రవేశించినా దానిని గద్యకావ్యమనే నిర్దేశించారు. పద్యకావ్యమే అయినా మధ్యమధ్య గతివైవిధ్యంకోసం గద్యాన్ని (వచనాన్ని) చొప్పించాలనీ, గద్యకావ్యంలోనైనా ఒక్కింత పద్యనివేశం అభిలషణీయమనీ, గద్యపద్యాత్మకమైన కావ్యమే తేనెతో కూడిన ద్రాక్షారసం వలె మాధుర్యమయమనీ విశ్వగుణాదర్శంలో (5వ శ్లోకం) వేంకటాధ్వరి –

పద్యం య ద్యపి విద్యతే బహుసతాం హృద్యం విగద్యం న తత్
గద్యం చ ప్రతిపద్యతే న విజహ త్పద్యం బుధాస్వాద్యతామ్
ఆధత్తే హి తయోః ప్రయోగ ఉభయో రామోదభూమోదయం
సఙ్గః కస్య హి న స్వదేత మనసో మాధ్వీకమృద్వీకయోః.

అన్నాడు. పద్యప్రచురమైన రచనలో గద్యం ఉన్నప్పటికీ అది పద్యకావ్యమేనని, గద్యప్రధానమైన రచనలో పద్యం ప్రవేశించినా అది గద్యకావ్యమేనని ఆయన చేసిన ప్రతిపాదనకు వ్యాఖ్యాతలు – ఆ విధమైన విమర్శదృష్టి లేనందువల్ల – ఎటూ వ్యాఖ్యానింపలేదు. గద్యపద్యాత్మికమైన రచనలో పద్యసంఖ్యాతిశాయిత చంపువు – అని ఏ లాక్షణికుడైనా స్పష్టీకరించి ఉంటే బాగుండేది. లాక్షణికులు పేర్కొనకపోయినా కవులు మాత్రం ఈ మాటను గుర్తించి తమ కావ్యాలలో చెప్పనే చెప్పారు. మహాకవి సోడ్ఢలుడు ఉదయసుందరీ కథలో ‘అన్యదేవ కర్పూరమిలితస్య శైత్యం మలయజద్రవ్యస్యాన్యైవ చ హృద్యతా పద్యానుషఙ్గిణో గద్యస్య,’ అని; ధనపాలుడు తన తిలకమంజరిలో ‘అశ్రాన్తగద్యసన్తానా శ్రోతౄణాం నిర్విదే కథా, జహాతి పద్యప్రచురా చమ్పూ రపి కథారసమ్’ (శ్లో.17) అని; సమరపుంగవ దీక్షితుడు తన తీర్థయాత్రాప్రబంధంలో ‘పద్యేషు బాహుల్య మిహ ప్రబన్ధే, మితాని గద్యాని తు’ (శ్లో.1-11) అనీ చంపూ ప్రబంధరచనలో గద్యాల కంటె పద్యసంఖ్యాధిక్యం ఆవశ్యకమని నిర్దేశించారు. లక్షణకర్తలే గాక లక్షణగ్రంథాలకు వ్యాఖ్యానాలను వ్రాసినవారు కూడా ఈ సంగతిని విస్మరించటం ఆశ్చర్యంగా ఉంటుంది. లక్ష్యాలను బట్టి చూస్తే పద్యసంఖ్యాతిశాయితకు తోడు చంపువులో నానావిధచ్ఛందస్సుల నివేశమూ ఒక లక్షణమని భావించాలి.

ఈ విధంగా మనము సుబ్బాశాస్త్రిగారు ప్రతిపాదించిన చంపూత్వాన్ని తిరస్కరించి ఈ కథాఖ్యాయికలను కేవలం గద్యకావ్యప్రభేదాలుగా మాత్రమే పరిగణించినా – ఈ ప్రభేదాల లక్షణ లక్ష్యాల నిరూపణలో మాత్రం ప్రాచీనులైన భామహ దండి రుద్రటాదులు, వారి అనంతరీయులలో ఎవరికీ ఏకాభిప్రాయం కుదరలేదన్న సత్యాన్ని కూడా గుర్తుంచుకోవాలి. లక్ష్యానుసారం వారి వారి నిర్వచనాలను సమన్వయిస్తూ మనము గ్రహింపదగిన లక్షణాలలో ముఖ్యమైనవి ఇవి:

ఆఖ్యాయిక గద్యకావ్యప్రభేదం. ఇందులోని ఇతివృత్తం వాస్తవంగా జరిగిన ఘటనలపై ఆధారపడి ఉండాలి. ఈ సంగతినే ఆఖ్యాయి కోపలబ్ధార్థా అంటూ అమరకోశం (1-6-5) జ్ఞాతకథాపూర్వకమని పేర్కొన్నది. కావ్యాలంకారంలో (1:25-29) భామహుని మతానుసారం కవి స్వతంత్రించి అక్కడక్కడ కొన్ని ఉదంతాలను వర్ణ్యవిషయోద్దీపనకోసం ప్రకల్పించినా, ప్రధానేతివృత్తం మాత్రం యథార్థఘటనలను పురస్కరించుకొని నిర్మింపబడాలి. అవాంతరకథాసన్నివేశాలను ఉచ్ఛ్వాసాలుగా విభాగించాలి. ఇందులో నాయకుడే ప్రధాన వక్త. ఇతివృత్తంలోని ముఖ్యపరిణామాలన్నీ అతడు చెప్పినవే. శృంగార వీరాలు ప్రధానరసాలు. ఇతివృత్తాదిని నాయికానాయకుల వంశవర్ణనం; ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జరిగిన నాయికానాయకుల పరస్పరపరిచయాల తర్వాత వారిమధ్య రాగోదయం వర్ణింపబడాలి. ఆ తర్వాత ప్రతినాయకుడు అపహరించినందువల్లనో, లేకపోతే ఏదైనా శాపవశాననో నాయికా నాయకులకు వియోగం సంభవిస్తుంది. అప్పుడు నాయికానాయకుల విరహం, ఆ తర్వాత నాయకునికి ప్రతినాయకునితో యుద్ధం, అతనిపై నాయకుని విజయం, ఆ పిమ్మట నాయికానాయకుల పునస్సమావేశం చిత్రింపబడాలి. తన ప్రేయసిని విరహకాతరుడైన నాయకుడు ఏ విధంగా దక్కించుకొన్నాడో – ఆ ప్రయత్నక్లేశమంతటినీ స్వయంగా ఆతడేనో, ఆతని ఆత్మీయులో నాయికకు సాకల్యాన వివరించి చెప్పాలి. అవతారికలోనూ, ఎక్కడైనా సూచ్యార్థసూచన చేయవలసి వచ్చినపుడు ఆఖ్యాయికలో వక్త్ర – అపరవక్త్ర అనే ఛందస్సులను ప్రయోగించాలి. ఈ నియమాలన్నీ సంస్కృతంలో రచింపబడే ఆఖ్యాయికలకు మాత్రమే వర్తిస్తాయట.

కథ కూడా గద్యప్రధానమైన రచనమే. అయితే ఇది పూర్తిగా కల్పితేతివృత్తాత్మకం. కథావక్త నాయకునికంటె ఇతరుడై ఉండాలి. ఇతివృత్తవిషయం ఆఖ్యాయికలో వంటిదే. మొదట నాయికానాయకుల వంశానువర్ణనం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జరిగిన నాయికానాయకుల పరస్పరపరిచయాలు, తర్వాత వారిమధ్య రాగోదయం. ఆ తర్వాత ప్రతినాయకుడు అపహరించినందువల్లనో, లేకపోతే ఏదైనా శాపవశాననో నాయికా నాయకులకు వియోగం, విరహవర్ణన. ఆ తర్వాత నాయక – ప్రతినాయకుల యుద్ధం, నాయకుని విజయం, నాయికానాయకుల పునస్సమావేశం. తన ప్రేయసిని విరహకాతరుడైన నాయకుడు ఏ విధంగా దక్కించుకొన్నాడో – ఆ ప్రయత్నక్లేశమంతటినీ స్వయంగా ఆతడేనో, ఆతని ఆత్మీయులో నాయికకు సాకల్యాన వివరించి చెప్పాలన్న నియమం కూడా ఆఖ్యాయికలో ఉన్నదే. శృంగార వీరాలు ప్రధానరసాలు. కథా హి ఖలు వాక్యవిన్యాసరూపా రమణీయా రసమన్దాకినీ – అంటూ హితోపదేశం (1-9) కథాప్రక్రియను రసోచితవాక్యనిక్షేపం వల్ల రమణీయమని, ప్రసన్నగమనంతో సాగిపోతుంది కనుక రసమందాకిని అని అందంగా నిర్వచించింది.

కథలో ఆఖ్యాయికలో లాగా ఉచ్ఛ్వాసవిభాగం చేసితీరాలన్న పట్టింపు లేదు. ఖండమనో, భాగమనో, అంశమనో, మరొకటనో పేరుపెట్టి పాఠకులకు కథాక్రమపరిగతిలో ఊపిరి పీల్చుకొనే అవకాశాన్ని కల్పింపవచ్చును. భండార్కర్ ప్రాచ్యవిద్యా పరిశోధన సంస్థలో (567/1891-96) సంఖ్య గల ప్రతిలో ఉన్న వాసవదత్తా సర్వంకషా వ్యాఖ్యలో తద్వ్యాఖ్యాత నారాయణ దీక్షితుడు సుబంధుని రచనను మొత్తం నాలుగు ప్రఘట్టకములుగా విభజించాడు. ఈ విభజనను ఆయన స్వయంగా తానై చేశాడో, ఆ విధంగా తన ముందుండిన ఒకానొక వ్రాతప్రతిని చూసి చేశాడో మనకిప్పుడు తెలియదు. తక్కినవారి వ్యాఖ్యలలో గాని, వ్రాతప్రతులలో గాని ఈ విభాగం కనబడదు.

మహాకవులలో సుబంధుడు, దండి, భట్టబాణుడు మొదలైనవారు స్వతంత్రించి ఈ కథా – ఆఖ్యాయికా రచనలో చేసిన ప్రయోగాలను పరిశీలించి, తమ కాలం నాటికి క్రొత్తగా ఏర్పడుతున్న పరిణామాలను గుర్తించి, రుద్రటుడు మొదలైన లాక్షణికులు ఈ నియమాలలో కొన్ని మార్పులను చేశారు. వీరి అభిప్రాయానుసారం ఆఖ్యాయిక కేవలం నాయకుని ఆత్మకథనం వంటిదే కాని, కథలో మాత్రం నాయకుడు గాని, కొంత వేరొకరు గాని సన్నివేశపరిణామాలను వివరింపవచ్చును. వీరి మతానుసారం ఆఖ్యాయికలో ఉచ్ఛ్వాసవిభాగనియమానికి తోడు గ్రంథారంభంలో వస్తునిర్దేశాత్మకమైన ఒక ఆర్యాశ్లోకం, లేదా మంగళాచరణ వస్తునిర్దేశాత్మకములైన రెండు ఆర్యాశ్లోకాలు తప్పనిసరిగా ఉండాలి. గద్యభాగాన్ని మొదలుపెట్టే ముందు కథాసంగ్రహాన్ని పద్యరూపంలో సంక్షేపించాలి. కథలో ఈ నియమజాతం లేదు.

ఆనందవర్ధనుడు కావ్యప్రబేధాలను ప్రస్తావించే సందర్భం వచ్చినపుడు, ‘విషయాశ్రయ మ ప్యన్య దౌచిత్యం తాం నియచ్ఛతి, కావ్యప్రబేధాశ్రయతః స్థితా భేదవతీ సా’ అని ధ్వన్యాలోకంలో (3-7)పరికథ, సకలకథ, ఖండకథ, ఆఖ్యాయిక, కథ మొదలైనవాటిని సరిక్రొత్తగా నిర్వచించాడు. ధర్మార్థకామమోక్షములనే పురుషార్థాలను ప్రకారవైచిత్రితో వర్ణనాత్మకంగా రచించినప్పటిది పరికథ అని, పూర్వోత్తరసంహితను విడిచి కథైకదేశాన్ని వర్ణిస్తే ఖండకథ అని, ఉచ్ఛ్వాసనియమంతో వక్త్రాదిచ్ఛందోయుక్తంగా కూర్చినది ఆఖ్యాయిక అని, అటువంటి నియమజాతం లేనిది కథ అని తన అభిప్రాయాన్ని వివరించాడు. విషయాశ్రయభేదం వల్ల ఇందులో మళ్ళీ ఉపభేదాలున్నాయి. పురాణాలలో విశ్వామిత్ర-త్రిశంక్వాఖ్యానాల వంటివి జ్యౌతిష విషయాలు. భాగవతంలోని పురంజనోపాఖ్యానం వంటివి ప్రతీకాత్మకాలు. విష్ణుపురాణంలోని ఊర్వశీపురూరవుల వృత్తాంతం వంటివి వైదికాలు. ఇక, హరిశ్చంద్ర శ్రీరామ కృష్ణకథాదికాలు ఐతిహాసికాలు. విష్ణు శివ దేవీ దేవతాత్మకములైనవి ఇష్టదేవతా కథలు. మదాలసా రంతిదేవాదికోదంతాలు ఉపదేశాత్మకాలు. విషయాశ్రయభేదం వల్ల ధర్మ కథ, అర్థ కథ, కామ కథ, మోక్ష కథ అని ఏర్పడుతాయని కొందరంటారు. ధర్మ కథలో ఆక్షేపిణి, విక్షేపిణి, సంవేదిని, నిర్వేదిని అని ప్రబేధాలున్నాయి. పాత్రభేదాన్ని ఉపాశ్రయించి దివ్య కథ, మనుష్య కథ, మిశ్ర కథ అని భేదాలున్నాయి. ఇవన్నీ లాక్షణికులకు క్రీడాక్షేత్రాలు.

ఈ లక్షణాలను బట్టి తేలినదేమంటే మొత్తం మీద కథలో స్వతంత్రమైన వాక్యప్రబంధం ముఖ్యమన్నమాట. దీనినే అమరకోశం ప్రబన్ధకల్పనా కథా అని (1-6-6) నిర్వచించింది. ఈ కథాభేదాలు అనేకం ఉన్నాయని లింగాభట్టీయ టీకాసర్వస్వాదివ్యాఖ్యలను అనుసరించి సరస్వతి తిరువేంగడాచార్యులవారి గురుబాలప్రబోధిక అంటున్నది. అవి ఉపరికథ, ఖండకథ, ఉపకథ మొదలైనవి:

౧) పర్యాయేణ బహూనాం యత్ర ప్రతియోగినాం కథాకుశలైః సంస్క్రియతే శూద్రకవ జ్జిగీషుభి రుపరికథా సా తు – సమర్థులచే అనేకమంది నాయకుల కథ ఎక్కడ చెప్పబడుతుందో, అది శూద్రక కథాదుల వలె ఉపరికథ అన్న ప్రభేదం.

౨) గ్రన్థాన్తరప్రసిద్ధం యస్యా మితివృత్త ముచ్యతే విబుధై ర్మధ్యా దుపాన్తతో వా ఖణ్డకథా భానుమత్యాది – అన్యకావ్యాలలో చిత్రితమైనందువల్ల అప్పటికే ప్రసిద్ధమైన కథలోని ఒకానొక భాగాన్ని మాత్రం స్వీకరించి భానుమతీ పరిణయాదులలో వలె ఏకదేశంగా వర్ణించటం ఖండకథ.

౩) య త్రాశ్రిత్య కథాన్తర మతిప్రసిద్ధం నిబద్ధ్యతే కవిభిః చరితం విచిత్ర మన్య త్సోపకథా చిత్రలేఖాది – సుప్రసిద్ధమైన కథాంతరాన్ని గ్రహించి వైచిత్రీపూర్వకంగా నిబంధించిన చిత్రలేఖాదుల వంటిది ఉపకథ.

౪) అ ఙ్కాఙ్కి తాద్భుతార్థా పిశాచభాషామయీ మహావిషయా నరవాహనదత్తాదే శ్చరితం బృహత్కథా భవతి – అంకములు మొదలైన విభాగాలతో చిహ్నితమై, పైశాచ్యాదిభాషలలో అద్భుతావహంగా రచింపబడిన నరవాహనదత్త కథాదుల వంటిది బృహత్కథ అనబడే ప్రభేదం.

ఈ నాలుగవ నియమాన్ని బట్టి కథను సంస్కృతంలోనే గాక ప్రాకృతాపభ్రంశాదికములైన దేశభాషలలోనూ వ్రాయవచ్చునని గ్రహించాలి. అప్పుడు సూచ్యార్థసూచనకు ఆఖ్యాయికలో వలె వక్త్రాపరవక్త్రచ్ఛందస్సులను మాత్రమే ప్రయోగించాలన్న నియమం ఉండదట.

ఏ భాషలో చెప్పినప్పటికీ కథలో యథేచ్ఛగా ఆర్యాచ్ఛందస్సును, తదితరచ్ఛందస్సులను ప్రయోగించే వెసులుబాటొకటి అదనంగా ఉన్నది. దండి కావ్యాదర్శంలో (1:23-28) కథాప్రక్రియలో ఆఖ్యానోపాఖ్యానాదులు కూడా ఉండవచ్చునని అన్నాడు.

కథాప్రక్రియ కేవలకల్పితమన్న పూర్వుల లక్షణాన్ని అంగీకరిస్తూనే, మహనీయులైన రుద్రటాదులు ఇందులోని ఇతివృత్తం శృంగారరసైకప్రధానమని నిర్వచించారు. అంటే, శృంగారేతరములైన రసాల ప్రాధాన్యాన్ని అంగీకరింపలేదన్నమాట. రచయిత లేదా నాయకేతరుడైన ఒక ముఖ్యపాత్ర కథావక్త కావాలన్నది వీరి కాలానికి వచ్చిన మరొక మార్పు. కథలో ఉచ్ఛ్వాసాదివిభాగవిషయమై వీరేమీ ప్రత్యేకించి చెప్పలేదు.

భోజుడు కథలో దివ్యుల యొక్క, దివ్యేతరుల యొక్క ఇతివృత్తం ఉండవచ్చునన్నాడు. విశ్వనాథుడు సాహిత్యదర్పణంలో (6:311-12) భట్టబాణుని హర్షచరితం కథ అని, కాదంబరి ఆఖ్యాయిక అని మళ్ళీ ప్రాచీనుల మతాన్ని అందుకొన్నాడు.

కథాప్రక్రియను గురించి విమర్శకులెవరూ గుర్తింపని మరొక ముఖ్యమైన విశేషాన్ని మహాకవి వామన భట్టబాణుడు తన శబ్దరత్నాకరకోశంలో పేర్కొన్నాడు. ‘కథా నానావిధై ర్గద్యై ర్వస్తువైచిత్ర్యకల్పనా, ఆఖ్యాయి కోపలబ్ధార్థా సోచ్ఛ్వాసా దృఢబన్ధనా’ అన్న (శబ్దరత్నాకరంలోని 1849-1850 సంఖ్యలు గల పంక్తులలోని) ఆయన నిర్వచనానుసారం కథలో నానావిధాలైన గద్యప్రభేదాల ప్రయోగం తప్పనిసరి అన్నమాట. ఇది మునుపటివారెవరూ చెప్పని సరికొత్త సూత్రం. నానావిధప్రభేదాల గతివైవిధ్యం వల్ల గద్యం హృద్యతరంగా భాసిస్తుందన్న ఈ నిర్ణాయకసూత్రం రచయితలకు మార్గదర్శకం. కల్పితకథ అనటానికి మారుగా వస్తువైచిత్ర్యకల్పన అన్నాడు. ఈ వైచిత్రి కావ్యకళకు ప్రాణశక్తులలో ఒకటి. భోజరాజు శృంగారప్రకాశం 27వ అధ్యాయంలో, ‘యా నియమితగతిభాషా దివ్యాదివ్యోభయోపేతా వృత్తవతీ, కాదమ్బరీ లీలావతీవ సా కథా కథితా’ అని గద్యం కావటం వల్ల కథలో గతివైవిధ్యం అంతగా ఉండదని చెప్పిన లక్షణాన్ని ఇది సవరిస్తున్నది.

హేమచంద్రుడు వీరికంటె భిన్నంగా వేరొక దారి తీసి, తన కావ్యానుశాసనంలో (అధ్యా.8; సూ.8) కథ కేవలం గద్యకావ్యమే కానక్కరలేదని, పద్యరూపమైన కథ (పద్యమయీ కథా) కూడా ఉండవచ్చునని అన్నాడు. అందులోని అంతర్భేదాలను వివరించాడు. కథ, కథానకము, కథానిక, అన్న రూపాలను గురించి చెప్పాడు. అంతటితో ఆగక, ఆ తర్వాతి రోజులలో కూర్చిన తన హైమలింగానుశాసనంలో (పు.144) ‘కథానికా కథానకమ్ – ఆఖ్యానం స్త్రియా రూఢః’ అని మరొక్కసారి వీటిని ఆఖ్యానభేదాలుగా నిరూపించాడు.

లాక్షణికులు కల్పించిన ఈ నియమజాతమంతా వట్టి పేరుకే గాని, కవులు మాత్రం రెండు ప్రక్రియలలోని నియమాలనూ యథేచ్ఛగా మలుచుకొన్నారు. ప్రాచీనుల మాటెలా ఉన్నా – 1) ఆర్యాచ్ఛందఃప్రయోగం, 2) ఉచ్ఛ్వాసవిభాగం లేకపోవటం అన్న ముఖ్యమైన కారణాల వల్ల సుబంధుని కృతికి ఆధునికకాలంలో వాసవదత్తా కథ అన్న పేరు ప్రచారంలోకి వచ్చింది.

సుబంధుని వాసవదత్తా కథ గాక సంస్కృతంలో వాసవదత్తా ప్రబంధం అనే వేరొక రచన ఉన్నదా? అని అడగవచ్చును. పిండిప్రోలు లక్ష్మణకవి తన లంకావిజయములో (పీఠిక-17) ‘సరసమనోహరాంచత్ప్రబంధు సుబంధు’ అన్నాడు కదా? అంటే, ఆ ప్రబంధ శబ్దం గ్రంథసామాన్యవాచకమే గాని, ప్రబంధము అనే ప్రక్రియానిరూపకం కాదు. సరసుల మనస్సులకు హత్తుకొనే ఒప్పిదమైన రచన చేసినవాడు అని మాత్రమే అక్కడి అన్వయం. అట్లాగే, సుబంధుని వాసవదత్తా కథ గాక సంస్కృతంలో వాసవదత్తా రూపకము అనే వేరొక రచన ఉన్నదా? అంటే, తూమాటి దోణప్పగారు తమ ఆంధ్ర సంస్థానములు – సాహిత్యపోషణము గ్రంథంలో (246-వ పుట) వక్కలంక వీరభద్రకవి వాసవదత్తా పరిణయం గురించి వ్రాస్తూ, సుబంధుని వాసవదత్త రూపకమునకిది తెలుఁగుసేఁత అని వ్రాసినది పొరపాటే గాని, సంస్కృతంలో సుబంధుని వాసవదత్త అనే పేరుగల రూపకం లేదు.

వాదవివాదాలు

చరిత్రలో అనేకమంది సుబంధులు, దేశమంతటా అనేక వాసవదత్తా కావ్యాలు కానరావటం పెక్కు వాదవివాదాలకు కారణమైంది. క్రీ.పూ. 150 నాటి భగవత్పతంజలి వ్యాకరణ మహాభాష్యంలో అధికృత్య కృతే గ్రంథే అన్న పాణినీయ మూలానికి (4.3.87) వార్తికను వివరిస్తూ సుమనోత్తరా, భైమరథీ కావ్యాలతోపాటు లక్ష్యంగా పేర్కొన్న వాసవదత్తా కావ్యం సుబంధుని రచనేనని సుప్రతిష్ఠిత విమర్శకులు మానవల్లి రామకృష్ణకవి గారు ఊహించారు. KalŒ అన్న ఆంగ్ల పత్రికలో (సం. 1, పుట 70) అచ్చైన ఈ వ్యాసం తెలుగు విశ్వవిద్యాలయం 1986లో ప్రచురించిన Collected Papers of Manavalli Ramakrishna Kavi గ్రంథంలోని కెక్కనందువల్ల దీనికి తగినంత గుర్తింపు రాలేదు. సుబంధుడు క్రీస్తుకు పూర్వంనాటి వాడన్నది వీరి మతం.

మహాభాష్య వివరణను బట్టి సుమనోత్తరా కావ్యాన్ని చదువుకొన్నవారు సౌమనోత్తరికులు, భైమరథీ కావ్యాన్ని చదువుకొన్నవారు భైమరథికులు, వాసవదత్తా కావ్యాన్ని చదువుకొన్నవారు వాసవదత్తికులు అవుతారన్నమాట. ఒకానొక కావ్యాన్ని చదువుకొన్న పాఠకులకు కూడా ప్రత్యేకమైన ఒక పేరుండటం ఆ రోజులలో ఆ కావ్యాలకేర్పడిన ప్రసిద్ధిని సూచిస్తుంది.

భరతుని నాట్యశాస్త్రానికి రామకృష్ణకవిగారే సంపాదించి, పరిష్కరించిన అభినవభారతీ వ్యాఖ్యలో – చంద్రగుప్తుని కొడుకు బిందుసారుని ఆస్థానంలో ఉన్న సుబంధుని నాట్యపార ప్రస్తావం మొత్తం రెండు చోట్ల (చూ. అధ్యాయం 22: శ్లో.45-47లు; అధ్యాయం 27: శ్లో.21) కనబడుతుంది. ఈ నాట్యపార అన్నది రంగస్థలంపైని ప్రదర్శించే ఒక ప్రయోగవిశేషం. చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడంటే అది క్రీస్తుకు పూర్వం 320-273 సంవత్సరాల నాటి వృత్తాంతం అన్నమాట.

మహాభాష్యంలో ప్రస్తావింపబడినది ఈనాడు మనము చదువుకొంటున్న వాసవదత్త అని, అది సుబంధుని రచనే అని రామకృష్ణకవిగారి ఊహ. అంతే గాక, కాత్యాయనుని ఆఖ్యానాఖ్యాయికేతిహాసపురాణేభ్యశ్చ అన్న వార్తికకు సమన్వయంగా వాసవదత్తా మధికృత్య కృ తాఽఖ్యాయికా వాసవదత్తా అని ఉన్న పంక్తిని బట్టి ఆనాటి వాసవదత్తికులు చదువుకొన్న ఆ రచన ఆఖ్యాయిక అని కూడా వీరు నిశ్చయించారు.

అయితే, ఆ విధంగా మహాభాష్య రచనాకాలానికి పూర్వమే అంతటి ప్రజాదరణకు నోచుకొన్న ఆ వాసవదత్తాఖ్యాయిక ఇప్పుడేమైనదీ మనకు తెలియదు. అది సౌబంధవం (సుబంధుని కృతి) అవునో, కాదో నిర్ధారించటానికి ఇప్పుడే ఆధారమూ లేదు. ఇప్పుడు దొరుకుతున్న సుబంధుని వాసవదత్తా కథలో మహాభాష్యంలో ప్రసక్తమైన వాసవదత్తాఖ్యాయిక విషయం ప్రస్తావనకు రాలేదు. రెండూ ఒకటే అయితే, ఆ ప్రస్తావన ఉండవలసిన అవసరమూ లేదు. మహాభాష్యానికి పూర్వం వెలసిన ఆ వాసవదత్తాఖ్యాయిక కొంతకాలానికి మార్పుచెంది, ఈనాటి కథారూపంలో లభిస్తున్నదేమో నిర్ధారించి చెప్పటానికి సైతం సాధనాలు లేవు.

భట్టోజీ దీక్షితుని సిద్ధాంతకౌముదికి జ్ఞానేంద్ర సరస్వతి కూర్చిన తత్త్వబోధినీ వ్యాఖ్యలో ‘ఆఖ్యాయికేతి గద్యపద్యరూపో గ్రన్థవిశేషః’ (సూ.1270) అని ఒకచోట, ‘ఆఖ్యాయికా నామ గద్యరూపో గ్రన్థవిశేషః’ (సూ.1467) అని వేరొక చోట – భిన్నభిన్నంగా వ్యాఖ్యాతమై ఉన్నది. పరిష్కరణలోపం వల్ల జ్ఞానేంద్ర సరస్వతి ఉద్దేశమేమిటో స్పష్టంగా తెలుసుకొనే అవకాశం లేకపోయింది. సుబంధుని ఆఖ్యాయికను గూర్చిన ప్రస్తావన అందులో లేదు.

శౌనకీయ బృహద్దేవత సప్తమాధ్యాయంలో సరణ్యూ కథానంతరం ప్రసక్తమైన సుబంధుని కథ (చూ. బృహద్దేవత, 7.83 నుంచి 100 వరకు ఉన్న శ్లోకాలు; ఋగ్వే. 10.58-59) లోని సుబంధుడు – కాత్యాయనుని సర్వానుక్రమణికలో ప్రసక్తుడైన గోపాయనుని కొడుకు సుబంధుడే అయితే, ఆయన మన సుబంధుని వలె రాజాశ్రితుడే కాని, కవి అనటానికి ఆధారాలు లేవు.

మన సుబంధుని కథలోనూ నాయకునికి వాసవదత్త స్వప్నంలో కానరావటమే ఉపక్రమణిక అయినప్పటికీ – ఈ కథకు మహాకవి భాసుడు రచించిన స్వప్నవాసవదత్తం, ప్రతిజ్ఞాయౌగంధరాయణం అన్న రెండు ప్రసిద్ధరూపకాలలోని వాసవదత్త జీవితకథతో ఎటువంటి పోలికా లేదు. సోమదేవుని కథాసరిత్సాగరం; బుధస్వామి బృహత్కథాశ్లోకసంగ్రహం; శూద్రకునిదని చెప్పబడుతున్న అద్భుతావహమైన వీణా వాసవదత్తం; విశాఖదత్తుని అభిసారికా వంచితకం; మాతృరాజ అనంగ హర్షుని తాపస వత్సరాజం; భీమటుని మనోరమా వంచితకం; క్షేమేంద్రుని కావ్యములైన బృహత్కథామంజరి, లలితరత్నమాల; శ్రీహర్షుని రత్నావళి, ప్రియదర్శిక; బౌద్ధవాఙ్మయంలోని సంయుత్తనికాయం, జైనవాఙ్మయంలో మాలాధారి దేవప్రభాచార్యుని మృగావతీ చరిత్ర; హేమచంద్రాచార్యుని త్రిషష్టి శలాకా పురుషచరిత వంటి రచనలలోని కథాప్రణాళికలతో దీనికి సంబంధం లేదు. వీణా వాసవదత్తంలో ఇంద్రుడిచ్చిన వరం వల్ల మగధదేశపు రాజు ప్రద్యోతునికి ఒక కుమార్తె జన్మించినదని, అందువల్ల ఆమెకు వాసవదత్త అని పేరుపెట్టారని ఉన్నది. భట్టబాణుని హర్షచరిత్రలో నుంచి పైని ఉదాహరించిన ‘కవీనా మగల ద్దర్పో నూనం వాసవదత్తయా’ అన్న శ్లేషకు మూలం అదేనని మనము ఊహింపవచ్చును. అయితే సుబంధుడు ఆ విధమైన ప్రస్తావనను చేయనందువల్ల ఆయన రచనతో వాటికి బదరీ బాదరాయణ సంబంధమేదో ఉండి ఉంటుందనుకోవటం కష్టం. భాసుని రచనలో వాసవదత్తకు వీణాగురువుగా కుదురుకొన్న ఉదయనుడు, వాసవదత్త పరస్పరం ప్రేమించుకొని, ఒకరోజు భద్రావతి అనే ఏనుగునెక్కి మగధనుంచి కౌశాంబికి పారిపోతారు. సుబంధుని కథలో వాసవదత్తా కందర్పకేతులు పరస్పరం ప్రేమించుకొని, మనోజవము అనే గుర్రాన్నెక్కి కుసుమపురం నుంచి వింధ్యాద్రికి పారిపోతారు. కుసుమపురమంటే మగధదేశంలోని పాటలీపుత్రం అన్నమాట నిజమే. అంతకంటె ఆ రెండు కథలకు బదరీ బాదరాయణ సంబంధమేదో ఉన్నదనుకోవటం సాధ్యం కాదు. మాతృరాజ ఆనంగ హర్షుని తాపస వత్సరాజములో వాసవదత్త తండ్రి పేరు మహాసేనుడని ఉన్నది. భాసుని రచనలలో (చండ) ప్రద్యోతుడని కనుపిస్తుంది. సుబంధుని కథలో వాసవదత్త తండ్రి పేరు శృంగారశేఖరుడు. సుబంధుని కథలో పద్మావతీదేవి పాత్ర అసలు లేనే లేదు. మహాభారతంలో చంద్రవంశంలో బుధుడు మొదలుకొని జన్మించిన రాజుల నలభైరెండవ తరంలో పాండురాజుకు అర్జునుడు, అర్జునునికి అభిమన్యుడు, అభిమన్యునికి పరీక్షిత్తు, పరీక్షిత్తుకు జనమేజయుడు, జనమేజయునికి శతానీకుడు, శతానీకునికి సహస్రానీకుడు, సహస్రానీకునికి మృగావతియందు ఉదయనుడు అని వంశక్రమం. ఈ ఉదయనుని కథకు, కథాసరిత్సాగర బృహత్కథాశ్లోకసంగ్రహాదులలోని ఉదయనుని కథకు పూర్వాపరాలను నిర్ద్వంద్వంగా నిరూపింపలేము. మహాభారత కథతో శక్తిభద్రుని తాపస వత్సరాజము కొద్దిగా సరిపోలుతుందని చెప్పవచ్చును. సుబంధుని వాసవదత్తా కథలోని వాసవదత్తకు ఈ వృత్తాంతాలతో ఏ మాత్రమూ సంబంధం లేదు. ఇప్పటి వరకు మనకు దొరుకుతున్న ఇటువంటి రచనలలోని ఇతివృత్తకల్పనోదంతం గాని, తత్తత్ప్రభావపరిశీలన గాని సుబంధుని చరిత్రకు, కాలనిర్ణయానికి, ఏతత్కావ్యావగాహనకు పనికిరావన్నమాట.