సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు

అ త్యలఘుక్రియానిపుణుఁడై, ధరణీతలమేలు విక్రమా
దిత్యు సభాస్థలంబునఁ బ్రతిష్ఠితుఁడై, ఘన ధీ సమగ్రతన్
సత్యవతీతనూభవుని జాడఁ బ్రసిద్ధికి నెక్కి నవ్య సా
హిత్యమునన్ సుబంధు సుకవీంద్రుఁడు బ్రస్తుతి గన్నవాఁ డిలన్.

ఘనతరమనీష న మ్మహాకవివరుండు
ప్రతిపదశ్లేష గద్యప్రబంధ మ త్యు
దారగతిఁ జెప్పె ‘వాసవదత్త’ యనఁగ;
నార్యు లా కథఁ గడు చోద్య మనిరి సభల.

అని వక్కలంక వీరభద్రకవి తన వాసవదత్తా పరిణయంలో (1-28,29) నోరారా కొనియాడిన అపురూపమైన గద్యప్రబంధం సుబంధుని వాసవదత్తా కథ. సంస్కృతసాహిత్యంలో సాటిలేని మేటి రచన. తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రమైన అద్భుతావహ మహాకృతి. ఈ పద్యాలలో సుబంధుని వ్యక్తిత్వమహత్త్వాన్ని, ఆయన మహనీయకవితాగుణాలను ఆవిష్కరిస్తున్న మాటలలో (i) అ త్యలఘుక్రియానిపుణుఁడై – అన్న ప్రకర్షోక్తి మూలాన వీరభద్రకవికి లక్షణగ్రంథాలలో ప్రసక్తింపబడిన సుబంధుని సాహసకథలతో పరిచయం ఉన్నదని, (ii) ధరణీతలమేలు విక్రమాదిత్యు సభాస్థలంబునఁ బ్రతిష్ఠితుఁడై – అన్న ఉగ్గడింపు వల్ల కొంత చరిత్రపరిశీలన చేసినవాడని, (iii) సత్యవతీతనూభవుని జాడఁ బ్రసిద్ధికి నెక్కి – అనటం వల్ల వేదవ్యాసమహర్షి వలె (వ్యాసోచ్చిష్టం జగత్సర్వమ్) కవి-పండిత-విద్యార్థి-విద్యాధికలోకంలో సుబంధుని ప్రభావ పరిధి సువ్యాప్తమని, (iv) ఇలన్ ప్రస్తుతి గన్నవాఁడు – అనటం మూలాన సుబంధుని ప్రస్తుతించిన సంస్కృతాంధ్రకవుల రచనలను ఆయన చూసి ఉంటాడని, (v) నవ్యసాహిత్యమునన్ – అన్న నిర్దేశిక వల్ల సుబంధుని వాసవదత్తా కథకు అనువాదంగా తెనాలి రామకృష్ణకవి రచించిన కందర్పకేతు విలాసం సంగతి ఆయనకు తెలిసి ఉండవచ్చునని – వ్యక్తవిశేషపరంపరను మనము దర్శింపవచ్చును. ఆ విధంగా ఆదికాలం నుంచి సంస్కృతాంధ్రకవులందరికీ గురుస్థానీయుడై, కావ్యకథాకథనంలో అమోఘమైన శిల్పకల్పనకు ఆదర్శప్రాయుడైన ఆ మహాత్ముడు సుబంధుని ప్రశస్తిని గురించి, ఆయన కృతిరత్నాన్ని గురించి, తెలుగు కవులపై ఆయన ప్రభావాన్ని గురించి సాహిత్యవిమర్శకుల దృష్టికి రాని కొన్ని కొత్త వెలుగులను పరిచయం చేయాలని ఈ వ్యాసోద్దేశం.

నైపథ్యావతరణిక

సంస్కృతంలో గద్యప్రబంధనిర్మాణానికి ప్రాతిపదికమైన కృషిచేసిన మహాత్ములలో సుబంధుడొక స్వప్రకాశచైతన్యోపలక్షణుడు. కాళిదాసానంతరయుగీనులలో ఆయన వాక్పరిస్పందనైపుణ్యానికి వశంవదులు కాని మహాకవులు లేరంటే అతిశయోక్తి కాదు. క్రీస్తుశకం 150 నాటి రుద్రదాముడు గుజరాతు రాష్ట్రంలోని జునాఘడ్ పర్వతశ్రేణిలోని తనగిర్నార్ (పురాణాలలో పేర్కొనబడిన రైవతక పర్వతం) శాసనంలో ఉదాత్తమైన కవిత్వరచనకు లక్షణాదర్శప్రాయంగా నిర్వర్ణించిన …స్ఫుట లఘు మధుర చిత్ర కాన్త శబ్దసమ యోదా రాలఙ్కృత గద్య శైలికి సాహిత్యశాస్త్రంలో మనఃస్ఫూర్తిగా పేర్కొనదగినవాడు ఆయనే. స్ఫుట = సువ్యక్తమైన, లఘు = బిందువులో సింధువు వలె అల్పాక్షరాలలో అనల్పమైన అర్థాన్ని ఇమిడ్చికొన్న, మధుర = నిసర్గ రమణీయమైన, చిత్ర = అద్భుతావహమైన, కాన్త = సౌందర్యగుణయుక్తమైన, శబ్దసమయ = సందర్భోచిత శబ్దసంపదను కలిగిన, ఉదార = గంభీరమైన, అలఙ్కృత = కావ్యాలంకరణశీలితమైన, గద్య = పాదరహిత కవితాబంధమైన గద్యము అను పేరిటి రచనకు ఉదాహరణీయమైన కూర్పు – అని ఆ వాక్యార్థం.

దీనికి సమస్కంధంగా క్రీస్తుశకం 1150 నాటి పృథ్వీధరాచార్యుడు తన వస్తువిజ్ఞానరత్నకోశం 73వ సూత్రంలో నిర్వచించిన ‘పరిభావితం సత్యం మధురం సార్థకం పరిస్ఫుటం పరిమితం సుమనోహరం విచిత్రం ప్రసన్నం భావానుగతమ్’ అన్న వాక్యలక్షణానికీ మేలైన నిదర్శనం ఆయన రచనమే. పరిభావితమ్ = బహుముఖీన భంగీభణితి కలిగిన, సత్యమ్ = యథార్థజ్ఞానవిషయకమైన, మధురమ్ = రసానుభవికులకు చర్వితచర్వణ మూలాన ఉదయించే ఒకానొక తీయదనంతో కూడిన, సార్థకమ్ = అర్థవంతమైన, పరిస్ఫుటమ్ = విశదమైన శబ్దవృత్తిని కలిగిన, పరిమితమ్ = వర్ణ్యాంశమునకు తగినంత వర్ణనను కలిగిన, సుమనోహరమ్ = హృద్యమైన, విచిత్రమ్ = నిర్మాణరీతుల యొక్క వైవిధ్యము వల్ల మెచ్చుగొలిపేది అయిన, ప్రసన్నమ్ = విస్పష్టమైన అర్థవత్తచే ప్రసాదగుణము కలిగినదైన, భావానుగతమ్ = అవ్యాప్తి, అతివ్యాప్తి మొదలైన దోషములు లేక కవి మనోగతాన్ని, పాత్ర మనోధర్మాన్ని అనుసరించే శబ్దరచన కలది – అని భావం.

రుద్రదాముడు, పృథ్వీధరాచార్యుడు కలలు గన్నట్లు శైలీగతమైన ఆరభటీవృత్తికి యోగరూఢిపరంపరాగర్భంగా ఒక కొత్తదనాన్ని సంతరించి, ఓజోగుణప్రధానమైన గౌడీరీతిలో శ్లేషయమకానుప్రాసలను నల్లేరు మీది బండినడక లాగా నిరాఘాటంగా నడుపుకొనిపోగల సుబంధుని వంటి కవులు సంస్కృతంలోనే కాదు, ఏ భాషలోనైనా నూటికీ కోటికీ ఒక్కరయినా ఉండరు. సూదిమొనకంటె కొంచెం విపులమైన ఇతివృత్తాన్ని స్వీకరించి, కేవలం కథాకథనంలోని సత్త్వసంపద మూలాన రసభావనైరంతర్యాన్ని సాధించి, కావ్యమంతటినీ సర్వాకర్షణీయంగా తీర్చిదిద్దటం సాహిత్యంలో నిజంగా ఆయనకే చెల్లింది. దానికితోడు లోతైన బహుశాస్త్రవిషయపరిజ్ఞానం, నాలుగంచుల లోకజ్ఞత – ఆ మహాత్ముని అంతఃప్రజ్ఞకు మెరుగులుదిద్దాయి. వీనుమిగిలిన ఆత్మవిశ్వాసంతో –

సరస్వతీదత్తవరప్రసాద శ్చక్రే సుబన్ధు స్సుజనైకబన్ధుః
ప్రత్యక్షరశ్లేషమయప్రబన్ధం విన్యాసవైదగ్ధ్యనిధి ర్నిబన్ధమ్.

(సహృదయులందరికీ ఏకాశ్రయుడు, చదువులతల్లిచే ప్రసాదింపబడిన అభీష్టసిద్ధి కలవాడు, శబ్దార్థముల కూర్పునేర్పుచే మహాపాండిత్యనిధిగా పేరెన్నిక గన్నవాడు అయిన సుబంధుడు ప్రత్యక్షరశ్లేషమయమైన వాసవదత్త అను పేరిటి ఈ ప్రబంధాన్ని నిబంధించాడు.)

అని తన కథాముఖంలో (శ్లో.13) ప్రకటించుకొన్నాడు. ఆ అపూర్వ భణితివిశేషానికి ముగ్ధులైన కవులు ఆ రోజుల్లో –

జీయా ద్గద్యసుధాధున్యాః సుబన్ధుః ప్రభవాచలః
య ద్భఙ్గాశ్లేష మాసాద్య భఙ్గః కవిభి రాశ్రితః.

(భంగాశ్లేషమనే వైశిష్ట్యవశాన గొప్ప గొప్ప కవులకు కూడా భంగపాటు నొదవించే గద్యము అనే అమృతప్రవాహానికి ఉదయపర్వతమైన సుబంధు మహాకవి కలకాలం జీవించాలి గాక!)

అంటూ నిండుమనస్సుతో మెచ్చుకొన్నారు[1]. క్రీస్తుశకం 12వ శతాబ్ది నాటి ఉదీచ్య హంస లక్ష్మణుని సూక్తిసంగ్రహం లోని 35వ శ్లోకం ఇది. అట్లాగే,

కవీనా మగలద్దర్పో నూనం వాసవదత్తయా
శక్త్యేవ పాణ్డుపుత్త్రాణాం గతయా కర్ణగోచరమ్.

(కర్ణునికి వాసవదత్తమైన (ఇంద్రుడిచ్చిన) శక్తి అనే అస్త్రవిశేషం లభించిన వార్త చెవిసోకినంతనే కౌరవుల ముందు తమ శక్తి ఇకపై పనికిరాదని పాండుకుమారులకు దర్పభంగమైనట్లుగా – సుబంధుని ‘వాసవదత్త’లోని శబ్దార్థశక్తివిషయం శ్రవణగోచరమైనంతనే మహాకవులమనుకొనేవారి ప్రావీణ్యదర్పమంతా వదలిపోయింది.)

అని ఉన్న మహాకవి భట్టబాణుని హర్షచరిత (1-11) లోని ప్రసిద్ధమైన ప్రశంసావాక్యాన్ని క్రీస్తుశకం 1258 నాటి జల్హణుడు తన సూక్తిముక్తావళిలో (54-వ శ్లోకం) ఉదాహరించాడు. జల్హణునికి నాలుగైదు పుష్కరాల మునుపే, కవిరాజసూరి బిరుదాంకితుడైన మాధవ భట్టు తన రాఘవపాండవీయ ద్వ్యర్థికావ్యం అవతారికలో (1-4):

సుబన్ధు ర్భట్టబాణశ్చ కవిరాజ ఇతి త్రయః
వక్రోక్తిమార్గనిపుణా శ్చతుర్థో విద్యతే న వా.

(వక్రోక్తిమార్గంలో నేర్పరులం సుబంధుడు, బాణభట్టు, నేనున్నూ; మా ముగ్గురి తర్వాత మరొకడంటూ ఉంటాడో! ఉండడో!)

అని – వక్రోక్తిమార్గనిపుణులలో సుబంధుణ్ణి ముమ్మొదటిగా పేర్కొని చెప్పిన ప్రాతిభోక్తి నలుగురికీ తెలిసినదే. దీనినే మరికాస్త పొడిగించి చాళుక్య సోమదేవుని ఆస్థానకవి విద్యామాధవుడు తన పార్వతీరుక్మిణీయ ద్వ్యర్థిలో (చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని 11606 సంఖ్య గల వ్రాతప్రతి) పైముగ్గురితోపాటు తన పేరును కూడా కలుపుకొని,

బాణః సుబన్ధుః కవిరాజసంజ్ఞః విద్యామహామాధవపణ్డితశ్చ
వక్రోక్తిదక్షా కవయః పృథివ్యాం చత్వార ఏతే న హి పఞ్చమోఽస్తి.

(ఈ భూమండలంలో వక్రోక్తిమార్గంలో సర్వసమర్థులైనవారు బాణభట్టు, సుబంధుడు, కవిరాజు అన్న పేరుగలిగిన మాధవభట్టు, ఆ తర్వాత విద్యామహామాధవుడున్నూ. వీళ్ళు నలుగురే తప్ప అయిదోవాడు మరొకడు లేడు.)

అని ప్రగల్భించాడంటే, సుబంధుని కీర్తి ఆ రోజులలో ఎటువంటి విద్వత్కవులను, మహాపండితులను సైతం ఆకర్షించిందో అర్థమవుతుంది.

వాసవదత్తా కథాసంక్షేపం

సుబంధుని వాసవదత్తా కథా కథిత కథంత ఇది: చింతామణి మహారాజు కొడుకు కందర్పకేతుడు. ఒకనాటి తెల్లవారుజామున కలలో ఒక లోకోత్తరసౌందర్యరాశి సాక్షాత్కరించి అతని మనసు దోచుకొంటుంది. తెల్లవారగానే అతను మకరందుడనే తన ప్రియసఖుణ్ణి వెంటబెట్టుకొని ఊరుపేరులు తెలియని ఆమె కోసం గాలిస్తూ, రోజంతా ప్రయాణించి వింధ్యాద్రిని చేరి అక్కడొక చెట్టు క్రింద నడుము వాల్చేసరికి – కొమ్మల మీద వాలిన శుకశారికలు మాట్లాడుకోవటం వినిపిస్తుంది.

కుసుమపురాధిపతి శృంగారశేఖరుని కుమార్తె వాసవదత్త వంటి అందగత్తె మూడు లోకాలలోనూ లేదట. యుక్తవయసు వచ్చిన తర్వాత తండ్రి ఆమెకు వివాహం చేయదలిచి, స్వయంవరణాన్ని ప్రకటించాడట. దేశదేశాల నుంచి వచ్చిన రాకుమారులలో ఏ ఒక్కరూ ఆమెకు నచ్చలేదట. ఆ మునుపటి రోజే ఆమెకు రాత్రి కలలో కందర్పకేతుడనే అందగాడు కనిపించాడట. ఆమె అతనికి తన ప్రేమను వెల్లడిస్తూ ఉత్తరం వ్రాసి, తమాలిక అనే ప్రియశారిక ద్వారా అతనికి పంపించిందట.

అదృష్టవశాన అదే చెట్టుమీద వాలిన తమాలిక – ఆ మాటలను శ్రద్ధగా వింటున్న నవయౌవనుడే కందర్పకేతుడని గుర్తించి, అతనికి లేఖను అందించి, కుసుమపురానికి తీసుకొనివెళ్తుంది. అక్కడొక దివ్యసౌధంలో నాయికా నాయకులు కలుసుకొంటారు. కాని, అదే రోజున శృంగారశేఖరుడు వాసవదత్తను విద్యాధర రాజకుమారుడు పుష్పకేతునికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకొంటాడు. ప్రేమికులిద్దరూ మకరందుని ఎప్పటికప్పుడు వర్తమానాలు కనుక్కొంటుండమని రాజధానిలోనే ఉంచి, మనోజవమనే మాయాశ్వాన్నెక్కి వింధ్యాద్రికి వెళ్తారు. రాత్రంతా వారికి ఏకాంత ప్రణయలీలలతో గడిచిపోతుంది.

తెల్లవారేసరికి వాసవదత్త నిద్రలేచి, ప్రియునికి ఫలాదులను తేవటానికి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఘోరయుద్ధం చేస్తున్న ఆటవికసైన్యాల మధ్య చిక్కుకొంటుంది. ఆమె అందానికి ముగ్ధులై వారు తమ కలహం మాట మరిచి ఆమె వెంటపడతారు. వాసవదత్త ఒక యోగసిద్ధుని ఆశ్రమంలో తలదాచుకోబోతుంది. ఆటవికులు ఆశ్రమంలోకి జొరబడి కనబడినదల్లా చిందరవందర చేస్తారు. ఆ దురాగతానికి కారణం ఆమేనని మండిపడి ముని ఆమెను శిలామూర్తివి కమ్మని శపిస్తాడు. ఆ తర్వాత ఆమె దీనోక్తులకు మనస్సు కరిగి, ప్రియుని స్పర్శ సోకితే శాపమోక్షం కలుగుతుందని అనుగ్రహిస్తాడు.

కందర్పకేతుడు మేలుకొన్నాక వాసవదత్త కనబడకపోయేసరికి దరిదాపుల వెతికి వెతికి నిరాశచెంది ఆత్మహత్య చేసుకోబోతాడు. ఆకాశవాణి అతనిని వారించి, ప్రేయసీ పునస్సమాగమం సిద్ధిస్తుందని చెబుతుంది. కొంతకాలానికి వింధ్యాటవులలో తిరుగుతూ అతను ప్రియురాలి శిలామూర్తి ఉన్నచోటికి వచ్చి, ఆ మూర్తిని కౌగిలించుకొని, తన స్పర్శతో ప్రాణం వచ్చేట్లు చేస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు జరిగిన కథనంతా చెప్పుకొంటారు. అంతలో మకరందుడు కూడా అక్కడికి చేరుకొంటాడు. ముగ్గురూ కుసుమపురానికి తిరిగివస్తారు. కథ సుఖాంతమవుతుంది.

సుబంధుని వాసవదత్త ఆఖ్యాయికా? కథా?

సుబంధుని రచనను వాసవదత్తా కథ అని ఇప్పుడందరూ వ్యవహరిస్తున్నారు కాని, నిజంగా ఆ కావ్యానికి సుబంధుడు పెట్టిన పేరేమిటో మనకు స్పష్టంగా తెలియదు. నాయికా నామధేయాన్ని పురస్కరించికొని వాసవదత్త అని మాత్రమే పెట్టాడేమో! సంస్కృతంలోని ఆలంకారిక గ్రంథాలలో ఆఖ్యాయిక, కథ అన్న ప్రక్రియలకు ఒక సర్వసమ్మతమైన వ్యవస్థ అంటూ ఏర్పడిన కాలాని కంటె ఈ రచన పురాతనమైనది కావటం మూలాన, ఆ ఆఖ్యాయికా–కథారూపాల లక్షణవిషయమై లాక్షణికులలో ఏకాభిప్రాయం లేనందువల్ల – ఒకప్పుడు దేశంలో దానికి వాసవదత్తా ఆఖ్యాయిక, వాసవదత్తా కథ, వాసవదత్తా చంపువు, అని రకరకాల ప్రక్రియల పేరిట వ్యవహారం ఉండినట్లు కనబడుతుంది. లేక మూడూ మూడు వేర్వేరు కాలాల నాటి రచనలో. ఎవరికి నచ్చినట్లు వారు నిర్దేశించటమే గాని, సమగ్రమైన అవగాహన ఇంకా ఏర్పడని రోజులవి. వ్రాతప్రతుల లేఖకులు కూడా ఈ సందిగ్ధావస్థకు లోనుగాక తప్పలేదు. కొందరు దీనిని ఆఖ్యాయిక అనీ, మరికొందరు కథ అనీ పేర్కొన్నారు. పుణేలో ఉన్న భండార్కర్ ప్రాచ్య పరిశోధనాలయంలోని 463/1987-91 సంఖ్య గల ఒకానొక తాళపత్రప్రతి విలేఖకుడు గ్రంథాంతంలో ‘ఇతి మహాకవి సుబన్ధువిరచితా వాసవదత్తాఖ్యాయికా’ అన్నాడు. ఆయన దృష్టిలో వాసవదత్త ఆఖ్యాయిక అన్నమాట. గుజరాతు భావనగర్ ప్రజాగ్రంథాలయం వారి వర్ణనాత్మక సూచికలను బట్టి అక్కడున్న కాగితపు ప్రతులలో, వాసవదత్తాభిధానాఖ్యాయికా, వాసవదత్తాభిధానా ఆఖ్యాయికా అన్న నిర్దేశాలున్నాయి. పాటణ (అహమ్మదాబాదు) జైన గ్రంథభాండాగారంలోని 10698 సంఖ్య గల వ్రాతప్రతి తుదను మహాకవి ‘సుబన్ధుకృతా వాసవదత్తా కథా’ అనీ; 13045 సంఖ్య గల మరొక వ్రాతప్రతి అంతంలో ‘సుబన్ధుకవి విరచితా వాసవదత్తా కథా’ అనీ; 13020 సంఖ్య గల వ్రాతప్రతి లోని నారాయణ దీక్షితుని వాసవదత్తాఖ్యాయికా టీక చివర మహాకవి ‘సుబన్ధురచితా వాసవదత్తాఖ్యాయికా సమాప్తా’ అనీ సమాపక వాక్యాలున్నాయి. తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయంలో ఉన్న 4012 సంఖ్య గల వ్రాతప్రతి చివర సుకవి సుబన్ధువిరచితా వాసవదత్తాఖ్యాయికా హృద్యగద్యమయీ అని ఆఖ్యాయిక పేరున్నది. భువనేశ్వర్‌లో ఉన్న ఒరిస్సా రాష్ట్ర పురావస్తుసంగ్రహాలయంలోని L/94 (b) – 169 సంఖ్య గల ప్రతి అంతంలో ‘ఇతి మహాకవి సుబన్ధుకృతా వాసవదత్తా నామాఖ్యాయికా’ అని ఆఖ్యాయిక పేరున్నది. జైసల్మేరు జినభద్రసూరి జైన జ్ఞానభండార లిఖితగ్రంథ సంచయంలోని 348 సంఖ్య గల ప్రతి చివర ‘ఇతి మహాకవి సుబన్ధువిరచితా వాసవదత్తా నామ కథా సమర్థితా’ అని ముగించారు. దేశంలో ఇప్పటి వరకు లభించిన సుబంధుని వాసవదత్తా కావ్యం వ్రాతప్రతులలో మనకు తెలిసి అన్నిటికంటె ఇదే అత్యంత ప్రాచీనమైన ప్రతి. విక్రమ సంవత్సరం 1207లో (అంటే, క్రీస్తు శకం 1151) వంగరాజు గోవిందచంద్రుని కోసం తత్కోశాధికారి కాయస్థ యశోధరుడు వ్రాయించిన ఆస్థానీ ప్రతి దీనికి ఆధారమని అందులో ఉన్నది. గోవిందచంద్రుడంటే మనదేశంలో నాథ సంప్రదాయానికి మూలపురుషుడైన గోరక్షనాథుని వద్ద మహాజ్ఞానదీక్షను స్వీకరించి ప్రసిద్ధురాలైన రాణీ మయనామతి గారి కొడుకన్నమాట. వంగదేశం లోని సంస్కృత విద్యావ్యాప్తికి, గ్రంథసంపాదనాభిలాషకు నిదర్శనగా ఈ గోవిందచంద్రుని కాలంలో యశోధరుని సేకరణలోని గ్రంథాలకు ప్రత్యంతరాలు మనకు క్రీస్తుశకం 15వ శతాబ్ది దాకా లిఖితమైనవి అక్కడక్కడ ఇప్పటికీ కనబడుతుంటాయి. ప్రకృతానికి మాత్రం, వ్రాతప్రతులలో ప్రచురమైన ఆఖ్యాయిక అన్న పేరుతోపాటు క్రీస్తుశకం 12వ శతాబ్ది నాటికే దేశంలో సుబంధుని వాసవదత్తకు కథ అన్న వ్యవహారం కూడా ఉండేదన్న చారిత్రికసత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి.

వ్యాఖ్యాతృ పరంపర

ఇంతవరకు వ్రాతప్రతులలోని వ్యవహారభేదాన్ని వివరించాను. సుబంధుని వాసవదత్తకు ఏర్పడిన ప్రచారం వల్ల తద్భావోద్దీపకంగా వ్యాఖ్యానాలను వెలయించిన విద్వద్రచయితల మతంలోనూ ఈ కథ–ఆఖ్యాయికా ప్రక్రియల ద్వైధీభావం సందేహాస్పదంగానే కనబడుతున్నది. ఎవరికి తోచినది వారు చెప్పటమే గాని, ఒక నిర్దిష్టలక్షణాన్ని పాటించినట్లు కనబడదు. ఈ వ్యాఖ్యాతలలో కొందరు ప్రముఖుల నిశ్చయాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ వ్యాఖ్యలన్నీ అచ్చై వెలుగులోకి వచ్చిన విశేషాలు కావు గనుక – కొంత వివరంగా చెప్పవలసివస్తున్నది:

1. వాసవదత్తా వ్యాఖ్యాయిక: క్రీస్తుశకం 11వ శతాబ్దికి అనంతరీయుడైన త్రివిక్రముని రచన ఇది. ఆయన ‘ఇయం వాసవదత్తాఖ్యాయికా వ్యాక్రియా స్ఫుటమ్, త్రివిక్రమేణ క్రియతే మేధావికులజన్మనా’ (శ్లో.2) అని తన వాసవదత్తాఖ్యాయికలో దీనిని ఆఖ్యాయిక అన్నాడు. అయితే, 1880లో ఎ.సి. బర్నెల్ లండన్‌లో ముద్రించిన తన A Classified Index to the Sanskrit MSS in the Palace at Tanjore లోని 162-a సంఖ్య వద్ద దీనిని విక్రమర్ధి కవి రచించిన వ్యాఖ్య అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయంలో ఇదే లిఖితప్రతి 4020 అన్న సంఖ్యతో ఉన్నది. అందులో ఇది త్రివిక్రముని రచనమనే ఉన్నది. బర్నెల్ చూచిన ప్రతి ఇప్పుడు తంజావూరులో లేదో, లేక ఆయన పొరపాటున త్రివిక్రమునికి బదులు విక్రమర్ధి అని వ్రాశారో చెప్పలేము. బరోడా ప్రాచ్యవిద్యాసంస్థలోని 700-2/6900-b, 9990-b, 9996-a అన్న సంఖ్యలు గల ప్రతులు మూడింటిలోనూ ఈ వాసవదత్తా వ్యాఖ్యాయిక పేరు త్రివిక్రముడనే ఉన్నది. ఒకవేళ బర్నెల్ పేర్కొన్న విక్రమర్ధి కృతమైన వాసవదత్తా వ్యాఖ్యాయిక బయటపడినా, వ్యాఖ్యాయిక అన్న శీర్షికను బట్టి అందులోనూ ఆఖ్యాయిక అన్న నిర్దేశమే ఉండి ఉంటుంది.

2. వాసవదత్తా సర్వంకష: క్రీస్తుశకం 1250 ప్రాంతాల నారాయణ దీక్షితుడు వ్రాసిన విషమపద టీక ఇది. ఆయన తన వ్యాఖ్య ప్రారంభంలో ‘సుబన్ధురచితస్యాస్య శ్లిష్టార్థస్య విశిష్టతా, శిష్టావృతస్య పుష్టస్య బన్ధువ త్క్రియతే మయా’ అనీ; వ్యాఖ్య చివరను ‘ఇతి శ్రీ నారాయణదీక్షిత విరచితాయాం వాసవదత్తా టీకాయాం చతుర్థః ప్రఘట్టకః సమాప్తః’ అనీ అన్నాడే కాని, తన ఉద్దేశంలో వాసవదత్త ఆఖ్యాయికా ప్రక్రియో, లేక కథా ప్రక్రియో స్పష్టంగా ఏ సంగతీ చెప్పలేదు. అయితే, భండార్కర్ సంస్థలోని 567/1891-96 సంఖ్య గల వ్రాతప్రతి అట్టమీద, ఆ గ్రంథాలయం వారు అచ్చువేసిన వర్ణనాత్మక సూచిలోనూ ఈ వాసవదత్తా సర్వంకష వాసవదత్తా కథకు వ్యాఖ్య అని పేర్కొనబడి ఉన్నది. పీటర్ పీటర్సన్ 1892 నాటి తన Catalogue of the Sanskrit MSS in the Library of his Highness the MaharŒja of Ulwar లో ఉదాహరించిన నారాయణ దీక్షితుని వాసవదత్తా సర్వంకషను వాసవదత్తా ఆఖ్యాయికకు వ్యాఖ్య అని పేర్కొన్నాడు. వ్యాఖ్యాత స్వయంగా చెప్పకపోయినప్పటికీ ఏర్పడిన వైరుద్ధ్యాలివి.

3. వాసవదత్తా విదగ్ధవల్లభ: భండార్కర్ ప్రాచ్య పరిశోధనాలయంలో 464/1887-91 అన్న సంఖ్యతో క్రీస్తుశకం 1350కి మునుపటి ఒకానొక పేరు తెలియని వ్యాఖ్యానకర్త కూర్చిన విదగ్ధవల్లభ అనే వ్యాఖ్య ఉన్నది. దాని ముగింపు వాక్యంలో ఇతి శ్రీ విదగ్ధవల్లభా నామ వాసవదత్తాఖ్యాయికా పఞ్జికా అని ఆఖ్యాయిక పేరున్నది.

4. వాసవదత్తా కథార్థం: ఇది క్రీస్తుశకం 1300 ప్రాంతాల రచింపబడిన మహావిద్వాంసుడైన సర్వరక్షితుని వ్యాఖ్యానం. శీర్షికను బట్టే ఈయన దృష్టిలో వాసవదత్త కథ అని చెప్పవచ్చును. 1894లో ఎం. ఎం. స్టెయిన్ తన Catalogue of the Sanskrit Manuscripts in the Raghunatha Temple Library of His Highness the Maharaja of Jammu and Kashmir గ్రంథం 81వ పుటలో దీనిని ఉదాహరించారు.

5. వాసవదత్తా వ్యాఖ్య: క్రీస్తుశకం 1550 నాటి సర్వచంద్రుని వాసవదత్తా వ్యాఖ్యలో (చూ. లండను ఇండియా ఆఫీసు వారి సంచయంలోని 543.996 సంఖ్య గల సంస్కృత లిఖిత ప్రతి) ప్రత్యేకించి కథాఖ్యాయికల ప్రస్తావన లేకపోయినా, పైని పేర్కొన్న సర్వరక్షితుని వాసవదత్తా కథార్థం ఇందులో ఉదాహరింపబడి ఉన్నందువల్ల ఆయన ఉద్దేశంలోనూ వాసవదత్త కథ అనే అనుకోవాలి.

6. వాసవదత్తా తత్త్వదీపిని: ఇది 14-15 శతాబ్దుల నడిమి కాలం నాటి వ్యాఖ్యాతృశిరోమణి జగద్ధరుడు నిర్మించిన విశిష్టమైన వ్యాఖ్య. పరిమాణంలో చిన్నదైనా ప్రమాణదృష్ట్యా చాలా గొప్ప రచన. ఈ జగద్ధరుని గురించిన వివరాలేవీ ఎక్కువగా అచ్చులో లేనందువల్ల, ఈ వాసవదత్తా తత్త్వదీపిని ఇంకా అచ్చు కానందువల్ల – ఈయనను గురించి కొన్నైనా విశేషాలను చెప్పుకోక తప్పదు. ఈయన మహావ్యాఖ్యాతగా పేరెన్నిక గన్న నరపతి మిశ్రునికి సన్నిహిత బంధువు. నరపతి మిశ్రుడంటే, కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలానికి అభిజ్ఞానశాకుంతల టిప్పణిని రచించిన సుప్రసిద్ధుడు. స్వరోదయము అన్న వేదాంతశాస్త్ర ప్రకరణగ్రంథానికి జగజ్జ్యోతిర్మల్లుడు సమకూర్చిన సుప్రసిద్ధమైన దీపికా వ్యాఖ్యకు మునుపే నరపతి జయచర్య అన్న వ్యాఖ్యను సంతరించిన మహావిద్వాంసుడు. ఇందులోని విషయం, తెలుగులో క్రీస్తుశకం 1340 నాటి గణపనారాధ్యుడు రచించిన స్వరశాస్త్రము లోని విషయం ఒకటే. తెలుగు సాహిత్యచరిత్రకారులు గుర్తింపలేదు. నరహరి మిశ్రుని పెదతండ్రి శ్రీదత్త మిశ్రుడు. గొప్ప ధర్మశాస్త్రవేత్త. ఆయనకు ఆవసథిక మహామహోపాధ్యాయుడని ప్రసిద్ధి. వీరంతా మైథిల బ్రాహ్మణులు. శ్రీదత్త మిశ్రుని రచనలలో ఆచార చంద్రిక (దీనికే ఆచారాదర్శం అని మరొక పేరు) ప్రసిద్ధికి వచ్చింది. క్రీస్తుశకం 1640లో దామోదర గౌరీపతి దీనిపై ఆచారాదర్శబోధినీ వ్యాఖ్యను వ్రాశాడు. శ్రీదత్త మిశ్రుని సమయ ప్రదీపం, ఆవసథ్యాధాన పద్ధతి, వ్రతసారం, శ్రాద్ధకల్పం, సామవేదచ్ఛందోగాహ్నికం, మొదలైనవి నేటికీ నిలిచి ఉన్నాయి. సామవేదచ్ఛందోగాహ్నికాన్ని అధికరించి శ్రీదత్త మిశ్రునికి బంధువో కాదో తెలియదు కాని, సమకాలికుడే అయిన భావనాథ శంకర మిశ్రుడు ఛందోగాహ్నికోద్ధారం అనే వ్యాఖ్యానాత్మకమైన అనుబంధాన్ని కూర్చాడు. శ్రీదత్త మిశ్రుని రచనలలోపితృభక్తి చాలా పేరెన్నిక గన్నది. దీనిని ముందుంచుకొని తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు తెలుగులో పితృయజ్ఞము అనే గంభీరమైన శాంతరసకావ్యాన్ని రచించారు. దశరథుని మరణవార్తను విన్న శ్రీరామచంద్రుడు సరయూ నదీతీరాన పితృతర్పణకృత్యాన్ని నిర్వహించటం ఇందులోని ప్రధానేతివృత్తం. ద్వైతపరిశిష్టంలో కేశవుడు శ్రీదత్త మిశ్రుని ఛందోగాహ్నికం లక్షణసూత్రాలను ప్రమాణీకరించాడు. నరహరి మిశ్రుని మాతామహుడు సిద్ధరసార్ణవమనే రసతత్త్వాన్ని ఆవిష్కరించే ఆయుర్వేదగ్రంథానికి వ్యాఖ్యాత అయిన సురగణ రసధరుడు. రసధరుని అన్నగారు స్మృతిమంజరీ కర్త రత్నధరుడు. ఈ రత్నధరుని కొడుకే ధర్మాధికరణిక మహామహోపాధ్యాయుడని పేరుగన్న వ్యాఖ్యాతృసార్వభౌముడు శ్రీ జగద్ధర మిశ్రుడు. ఈయన రచనలలో దేవీ మాహాత్మ్య టీక, సుప్రసిద్ధమైన భగవద్గీతా ప్రదీపం, ఇంకా మాలతీమాధవ టీక, మేఘసందేశ రసదీపిక, వేణీసంహార టీక, సరస్వతీకంఠాభరణ టీక మొదలైనవి మాత్రమే వెలుగులోకి వచ్చాయి. సంగీత సర్వస్వము కూడా తనదేనని (మదుక్తం సఙ్గీతసర్వస్వమ్) సరస్వతీకంఠాభరణ టీకలో పేర్కొన్నాడు కాని ఆ గ్రంథం లభింపలేదు. సుబంధుని వాసవదత్తకు ఆయన రచించిన తత్త్వదీపినీ వ్యాఖ్య వ్రాతప్రతి బరోడా ప్రాచ్యవిద్యా సంస్థలో 698/10783 అన్న సంఖ్యతో ఉన్నది. ఏకాగ్నిదాన పద్ధతిని నిర్మించిన నాగేశ్వర శ్రీదత్త మిశ్రుడు కూడా మైథిల బ్రాహ్మణుడే, వీరికి సమకాలికుడే కాని, ఆయనకు జగద్ధరుని కుటుంబంతో సంబంధం ఉన్నట్లు లేదు. లోకోత్తరమైన జగద్ధరుని వ్యాఖ్యానకళావైభవం మాలతీమాధవ సరస్వతీకంఠాభరణ టీకాదులలో వలె అతిసంక్షిప్తమైన ఈ వాసవదత్తా తత్త్వదీపినిలో ప్రస్ఫుటింపకపోయినా – ఆయన సహృదయతకు, వైదుష్యానికి నిదర్శకమైన మేలి రచనమిది. బరోడా ప్రతిలో వాసవదత్తాఖ్యాయికా టీకా అని ఉన్నదానిని బట్టి ఈయన దృష్టిలో వాసవదత్త ఆఖ్యాయిక అన్నమాట. సుప్రసిద్ధుడైన శివరామ త్రిపాఠి తన వాసవదత్తా కాంచనదర్పణంలో జగద్ధరుని ఈ తత్త్వదీపినీ వ్యాఖ్యను ఉదాహరించాడు.

7. వాసవదత్తా తత్త్వకౌముది: క్రీస్తుశకం 1470కి పూర్వుడైన పండిత రామదేవ మిశ్రుని వ్యాఖ్య ఇది. ఈయన కథా? ఆఖ్యాయికా? అన్న పరిశీలనను చేయలేదు. ‘కృత్యాదిని సజల జలదశ్యామం పీతవాసస మచ్యుతమ్, నన్దసూనుం నమస్కృత్య తన్యతే తత్త్వకౌముదీ’ అని మాత్రం చెప్పి వదిలివేశాడు. కాని, వ్యాఖ్యలో ఒకచోట ఈ కథలో అని ప్రయోగించిన సందర్భాన్ని బట్టి వాసవదత్త కథ అన్న దృష్టి కలవాడేమో అనిపిస్తుంది. థియొదొర్ ఔఫ్రెట్ 1864లో ప్రకటించిన Catalogus Codicum Sanscriticorum Bibliothecae Boleinaeలో 2434 సంఖ్య గల ఆరోపం వద్ద ఈ వ్యాఖ్య ఉనికిని గురించి పేర్కొన్నాడు. పెక్కు గ్రంథాలయాలలో ఇప్పటికీ దీని ప్రతులు లభిస్తున్నాయి.

8. వాసవదత్తా టీక: క్రీస్తుశకం 15వ శతాబ్ది ఉత్తరార్ధంలో వైద్య నరసింహ సేనుడు (శ్రీ గురుచరణామ్భోజం ప్రణమ్య పిత్రోః పదం వైద్యః, వాసవదత్తా టీకాం కరోతి నరసింహః) వాసవదత్తను ఆఖ్యాయిక అన్నాడు. ఈ టీక అచ్చయినట్లు తెలుస్తున్నది కాని, నాకింతవరకు దొరకలేదు.

9. వాసవదత్తా టిప్పణకం: విఖ్యాత విద్వన్మణి భానుచంద్ర గణి రచించిన ఈ వాసవదత్తా టిప్పణకంలో ‘పూర్వామ్నాయా త్స్వబుద్ధేశ్చ భానుచంద్రేణ ధీమతా, వ్యాఖ్యా వాసవదత్తాయాః కథాయాః క్రియతే స్ఫుటా’ (శ్లో.2) అని కథానిర్దేశం స్ఫుటంగా కనబడుతుంది. భానుచంద్రుడంటే – చరిత్ర విద్యార్థులకు సుపరిచితుడే – మొగలు పాదుషా అక్బరుకు (క్రీ.శ.1542-1605) జైనధర్మరహస్యాలను, కల్పోక్త శ్రీ సూర్య సహస్ర నామావళిని బోధించిన మహోపాధ్యాయుడు. ‘ఇతి పాతసాహ శ్రీ అకబర సూర్యసహస్రనామాధ్యాపక శ్రీ శత్రుఞ్జయ తీర్థకర మోచనాద్యనేక సుకృతవిధాయక మహోపాధ్యాయ శ్రీ భానుచన్ద్రగణి విరచితం వాసవదత్తా టిప్పనకం’ అని గ్రంథాంతగద్యలో సగర్వంగా చెప్పుకొన్నాడు. అబ్-ఉల్ ఫౙల్ తన ఆయినీ అక్బరీలో చక్రవర్తికి రాజధర్మాన్ని నేర్పి శాంతిపథంలో నడిపించిన గురుత్రయంలో ప్రముఖునిగా ఈయనను ప్రశంసించాడు. ఇందులో కథ అన్న నిర్దేశంతోపాటు ఈ కథాప్రక్రియకు లక్షణం కూడా చెప్పబడి ఉండటం విశేషం.

10. వాసవదత్తా వివరణం: అద్భుతావహమైన ఈ వ్యాఖ్యను రచించినది భానుచంద్ర గణి శిష్యుడు సిద్ధిచంద్ర గణి. జహంగీరు పాదుషా (క్రీ.శ. 1569-1627) చేతుల మీదుగా ఖుష్ ఫహమ్ (కుశాగ్రబుద్ధి) అన్న బిరుదాన్ని అందుకొన్న విన్నాణి. ఆచార్యోపజ్ఞకమైన కథానిర్దేశాన్నే ఈయన కూడా చేశాడు. ఈ గురుశిష్యుల వ్యాఖ్యల లిఖితప్రతులు దేశమంతటా దొరుకుతున్నాయి.

11. వాసవదత్తా పంచిక: పాట్నాలో ఉన్న ప్రభుత్వ ప్రాచ్య పరిశోధనా సంస్థ వారు 1993లో ప్రకటించిన Catalogue of Mithila Manuscripts (ద్వితీయ సంపుటం) లోని 141వ పుటలో శృంగార గుప్తుని వాసవదత్తా పంచిక పేర్కొనబడి ఉన్నది. దీని ప్రత్యంతరం భండార్కర్ ప్రాచ్య పరిశోధనాలయంలో ఉన్నది (వ్రాతప్రతి సంఖ్య 186/1875-76). ఇందులో శృంగార గుప్తుడు ‘కథాం వాసవదత్తాఖ్యాం సుబన్ధు ర్యాం మహాకవిః, వ్యధాత్ శృఙ్గారగుప్తోఽస్యాః కరోతి లఘుపఞ్చికామ్’ అని వాసవదత్తను కథగా పేర్కొన్నాడు.

12. వాసవదత్తా చూర్ణిక: జైపూరు లోని మహారాజా సవై (రెండవ) మాన్ సింగ్ పురావస్తుసంగ్రహాలయంలో ఉన్న వాసవదత్తా చూర్ణిక ప్రత్యాదిని ‘నిన్దాస్తుతిపరత్వేన వీరశృఙ్గారయో ర్ద్వయోః, వ్యాఖ్యాసే చూర్ణికా కాశ్చి త్సుబన్ధో ర్ద్యూతవర్ణికా’ అనీ; గ్రంథాంతగద్యలో ‘ఇతి శ్రీ మీమాంసకవర్య భట్ట మాధవసుత ప్రభాకర కృతం వాసవదత్తాయాం దూతీసంవాద ఆఖ్యాయికా వివరణమ్’ అనీ ఉల్లేఖాలున్నాయి. వాసవదత్తా టిప్పణసార కర్త రంగనాథుడు ఉదాహరించినందువల్ల ఈ ప్రభాకరభట్టు క్రీ.శ. 1685 కంటె పూర్వుడని ఊహించటమే తప్ప కాలనిర్ణయానికి పనికివచ్చే వ్యాహృతులేవీ ఆయన వ్యాఖ్యలో లేవు. దీనికొక మంచి ప్రతి 709/12508 సంఖ్యతో బరోడా ప్రాచ్యవిద్యా సంస్థలో ఉన్నది. ఈయనది ఆఖ్యాయికా మతమే అని స్పష్టం.

13. వాసవదత్తా టిప్పణసారం: పూనా లోని భండార్కర్ ప్రాచ్య పరిశోధనాలయంలో దీని వ్రాతప్రతి 566/1891-1895 అన్న వరుస సంఖ్యతో ఉన్నది. వ్యాఖ్యాత పేరు రంగనాథుడు. ఈయన ఆఖ్యాయికా కథాది సంజ్ఞలను పేర్కొనక, ‘య త్సన్దిగ్ధ మతిశ్లిష్టం క్లిష్టం చామూలభాషితం, తద్బోధార్థ మసౌ యత్న స్తేన ప్రీణాతు మే హరిః’ అనీ; ‘ఇతి రఙ్గనాథోద్ధృతో వాసవదత్తా టిప్పణసారః’ అని మాత్రమే వ్రాసి ఊరుకొన్నా, ఈ వ్యాఖ్యలో ఉదాహరింపబడిన ప్రభాకర భట్టు వాసవదత్తా చూర్ణికను బట్టి ఈయన మనోగతమూ ఆఖ్యాయికేనని ఊహింపవచ్చును.

14. భువనార్థచంద్రిక: క్రీస్తుశకం 16-18 శతాబ్దుల మధ్య దేవనాథ వాసుదేవుడు రచించిన ఈ భువనార్థచంద్రికా వ్యాఖ్యలో ‘విఖ్యాతాఖ్యాయికా వ్యాఖ్యా మాఖ్యాతు ర్మమ కో గుణః, నాధికార్థప్రవేశ శ్చే న్నాసదర్థస్య చ క్షయః’ (అవతారిక: శ్లో. 13) అని ఆఖ్యాయికా నామాంకనం కనుపిస్తుంది. ఈ వ్రాతప్రతి బరోడా కేంద్రీయ సంస్థాన ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో కొస ఊపిరితో కొట్టుమిట్టుకలాడుతున్నది.

15. వాసవదత్తా వివరణం: తంజావూరు మహారాజా సర్ఫోజీ సరస్వతీ మహల్ గ్రంథాలయంలో కర్తృనామవిరహితంగా ఉన్న ఒక వాసవదత్తా వివరణం కృత్యాదిని –

శ్రీమత్త్రైపురపాదపఙ్కజరజఃపాణ్డూకృతాఙ్గాకృతి
శ్చక్రే గూఢపదార్థమోహనభృతేః ప్రీత్యై సతా మాదరాత్
కావ్యే వాసవదత్తకే వివరణం సంక్షేపతః శ్రీమతాం
లోకఖ్యాతవినోదనైకరసికః సౌభాగ్యలీలాశ్రయః. (వ్రాతప్రతి సం. 4021; శ్లో. 1)

అనీ, గ్రంథాంతంలో ‘ఇతి మహాకవి సుబన్ధువిరచితా ఆఖ్యాయికా’ అని, ఆఖ్యాయికా సంజ్ఞే కనబడుతుంది.

16. వాసవదత్తా దర్పణం: మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలోని (డి.12419), (డి.12419) సంఖ్యలు గల వ్రాతప్రతులలోనూ, బరోడా ప్రాచ్యవిద్యా సంస్థలోని (699/6909b) సంఖ్య గల వ్రాతప్రతిలోనూ ఉన్న తిమ్మయసూరి వాసవదత్తా దర్పణ వ్యాఖ్యలో సుబంధుని రచన ఆఖ్యాయిక అని ఉన్నది.

ఇవిగాక,

17. రామనాథుని వాసవదత్తా వ్యాఖ్య (చూ. బరోడా ప్రాచ్యవిద్యా సంస్థ వారి గ్రంథాలయం వారి సంస్కృత ప్రతుల వర్ణనాత్మక సూచిక),

18. కాశీరామ వాచస్పతి రచించిన వాసవదత్తా టీక (చూ. 1904 లో అచ్చయిన లండను ఇండియా ఆఫీసు లైబ్రెరీ వారి సంస్కృత లిఖిత గ్రంథ వర్ణనాత్మక సూచిక, సంపుటి VII: పుట 1556),

19. కర్త పేరు తెలియని వాసవదత్తా స్థూలతాత్పర్య వ్యాఖ్య (చూ. లండను ఇండియా ఆఫీసు లైబ్రెరీ వారి సంస్కృత లిఖిత గ్రంథ వర్ణనాత్మక సూచిక, సంపుటి VII: పుట 1558),

20. కర్త పేరు తెలియని వాసవదత్తా సూక్ష్మదర్శన (చూ. 1918లో అచ్చయిన మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం వారి సంస్కృత వ్రాతప్రతుల వర్ణనాత్మక సూచి – సం. XXI, పుట 8331) మొదలైన వ్యాఖ్యలలో ఈ భేదప్రభేదాలు చర్చకు రాలేదు.

21. తెలుగులో ప్రామాణిక వ్యాకరణచ్ఛందోలాక్షణికగ్రంథమైన అప్పకవీయానికి వ్యాఖ్యగా కూచిమంచి వేంకటరాయకవి రచించిన సుకవిమనోరంజనము అవతారికలో (1-53) ఆయనకు పూర్వుడైన కూచిమంచి (ఐదవ) తిమ్మకవిని గురించి ఒక పద్యం ఉన్నది:

త్రైదశ భాషాకావ్యము
మోద మలర సరసహృత్కుముదచంద్రిక నా
నాదిగ వాసవదత్తా
కాదంబరు లెసఁగఁ దిమ్మకవి రచించెన్.

అని. ఈ పద్యార్థం స్పష్టంగా బోధపడనందువల్ల, ఈ కూచిమంచి (ఐదవ) తిమ్మకవి సరసహృత్కుముదచంద్రిక అన్న పేరుతో సుబంధుని వాసవదత్తకు, భట్టబాణుని కాదంబరికి సంస్కృతంలో వ్యాఖ్యలను నిర్మించాడో; లేక, సరసహృత్కుముదచంద్రికనే వాసవదత్తా కాదంబరీ కావ్యాల శైలిలో చెప్పాడని అంటున్నాడో; కాక, సంస్కృతంలో సరసహృత్కుముదచంద్రిక అన్న పేరుతో ఒక మొదట కావ్యాన్ని, ఆ తర్వాత వాసవదత్తా కాదంబరీ సంక్షేపాలనూ వ్రాశాడో తెలుసుకోవాలని కుతూహలం కలిగి ఆ వివరాలకోసం ప్రయత్నం చేశాను. పైని ఉదాహరించిన మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో కనుపించిన వాసవదత్తా దర్పణము వ్యాఖ్యానకర్త తిమ్మయ సూరి ఈ తిమ్మకవి కావచ్చునేమో చూద్దామని వాసవదత్తా దర్పణము యొక్క వ్రాతప్రతిని (డి.12419) చూడగా వాసవదత్తా దర్పణమే సరసహృత్కుముదచంద్రిక కావచ్చునని నిర్ణయించటానికి ఆధారాలేవీ కనబడలేదు. పైగా తిమ్మయ సూరి కుటుంబం వారు తమిళదేశంలో స్థిరపడిన వైదికులు కావచ్చునని, పిఠాపురంలో నెలకొన్న ఆరువేల నియోగులైన కూచిమంచి వారితో ఆయనకు సంబంధం ఉండివుండదని మాత్రం అనిపించింది. ఒకవేళ ఈ కూచిమంచి (ఐదవ) తిమ్మకవి వాసవదత్తకు వ్యాఖ్యానమో, లేక ఆ పేరుగల ఒక కావ్యమో వ్రాసివుంటే, తిమ్మయ సూరి వలె వాసవదత్తను ఆఖ్యాయిక అన్నాడో, లేదా కథ అని నిర్ణయించాడో గ్రంథం దొరికితే గాని చెప్పలేము.

22. వాసవదత్తాస్థ పదనిర్వచనమ్: మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలోని 18894/డి.14363 సంఖ్య గల తెలుగు లిపిలోని ఈ అసంపూర్ణ లిఖితప్రతిని గురించిన విశేషాలు అనేకం ఉన్నప్పటికీ స్థలాభావం వల్ల ఇక్కడ ఇవ్వలేకపోతున్నాను. మొత్తం మీద ఈ పదసంగ్రహం చేసినవారి దృష్టిలో ఇది కథ అన్నది మాత్రమే ఇక్కడ ప్రకరణప్రాప్తార్థం.

ఇదంతా వాసవదత్త వ్యాఖ్యానాలలో ప్రస్తుతీకరింపబడిన సంజ్ఞానక్రమం. ఇరవైరెండు వ్యాఖ్యలలో పదిమంది వ్యాఖ్యాతలు వాసవదత్తను ఆఖ్యాయిక అని, ఏడుగురు కథ అని పేర్కొన్నారన్నమాట.