గడి-నుడి 5 సమాధానాలు

ఈసారి కూడా చాలా తొందరగా చాలా పరిష్కారాలు వచ్చినా, తప్పుల్లేని పరిష్కారాలు మాత్రం అంత తొందరగా రాలేదు. అన్ని సమాధానాలూ సరిగా పంపింది ఒక్కరే:

 1. బిహెచ్ విజయాదిత్య

ఒక్క తప్పుతో సమాధానం పంపించిన వారు: పం.గో.కృ.రావు, పూల రమాదేవి గార్లు. ఈ ముగ్గురికీ అభినందనలు!

అడ్డం

 1. సామెత ప్రకారం కొడుకు పేరు (4)
  సమాధానం: సోమలింగం. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెత వినే ఉంటారు.
 2. ఊర్మిళ వధలో చూస్తే రంగుపడుద్ది (3)
  సమాధానం: ధవళ. వెనకనుండి చూస్తే కనిపిస్తుంది.
 3. అద్దం వెనకుండేది (3)
  సమాధానం: కళాయి. అద్దం వెనుక కళాయిపూత గురించి వినే ఉంటారు.
 4. అపరంజి బంగారం (3)
  సమాధానం: పుత్తడి. అపరంజి, బంగారం అన్న రెండు అర్ధాలున్నాయి.
 5. నాభికి ముందుండే గొప్పదనం ఆకర్షణశక్తా? (3)
  సమాధానం: గరిమ. ఆకర్షణ శక్తి గరిమనాభినీ, గురుత్వాకర్షణశక్తినీ సూచిస్తోంది.
 6. చూడుము పండుగరోజు (3)
  సమాధానం: కనుము. అంటే చూడుము అని కదా?
 7. తలతెగిన స్వభావంలో కొద్దికాలం (2)
  సమాధానం: క్షణం. లక్షణం తలతెగింది.
 8. తుదిలేని పండితుడు వీడు. వదులు (2)
  సమాధానం: విడు. విదితుడు అంటే పండితుడు. తుదిలేకపోతే విడు మిగిలింది.
 9. నెలతప్పిన బాలచంద్రుడు దిక్కు చూసేడు (2)
  సమాధానం: వంక. నెలవంక అంటే చంద్రుడు. నెలతప్పితే వంక (అంటే దిక్కు) మిగిలింది.
 10. రోజూ ముంచుకొచ్చే ప్రళయం కాబోలు (2)
  సమాధానం: నిద్ర. దీనికి నిత్యప్రళయము అని ఇంకో పేరు కూడా ఉంది.
 11. కవిత రసాభాసు కాకుండా వెనుతిరిగి తరచు కాపాడిన కవి (3)
  సమాధానం: భారవి. తరచు అన్నది అక్షరాల ఎంపికని చెప్తే, వెనుతిరిగి అన్నది ఆ ఎంపిక వెనకనుండి అని చెప్తోంది.
 12. అప్పుతచ్చులు కాబోలు (6)
  సమాధానం: ముద్రారాక్షసాలు. అచ్చుతప్పులు కి బదులుగా అప్పుతచ్చులు కావాలనే ఒక సూచనగా వాడేము.
 13. మతిపోయిన బుద్ధిహీనుడు పశువులగుంపుతో మిగిలాడు (2)
  సమాధానం: మంద. మందమతి అంటే బుద్ధిహీనుడు. మతిలేదు కదా?
 14. మకర సంక్రాంతిలో తాగేది (2)
  సమాధానం: రసం. అందులోనే ఉంది.
 15. మోసము చేసేముర. కాని అంతా తలకిందులైంది (4)
  సమాధానం: నికారము. అంటే మోసము. తలకిందులు వెనకనుండి వెతకమని చెప్తోంది.
 16. పాపం! పుణ్యంతో వచ్చేది (2)
  సమాధానం: అన్నెం. అంటే పాపం/అన్యాయం. అన్నెం-పున్నెం వాడుకలో ఉందికదా?
 17. ప్రతి సూర్యోదయం ఆరంభం నడుమనుంటే కానుపు (3)
  సమాధానం: ప్రసూతి. సూర్యోదయం ఆరంభం ‘సూ’ ప్రతి మధ్యన ఉండాలని చెప్తోంది.
 18. లయ మతం మారు ఆలోచనకి చల్లని గాలి వీచింది (6)
  సమాధానం: మలయమారుతం. చెల్లాచెదురైన అక్షరాల్ని పేరిస్తే సరిపోతుంది.
 19. నేల వంగని మొక్కకి పుట్టి తాంబూలానికి పరిమళాన్నిస్తుంది (3)
  సమాధానం: లవంగ. అందులోనే ఉంది. తాంబూలానికి పరిమళం ఇవ్వదూ?
 20. లెక్కలు రాసే పుస్తకం (2)
  సమాధానం: దస్త్రం. వేరేగా చెప్పక్కర లేదుకదా?
 21. జూదరి పునాది గోడ బలంగా లేకుండా కట్టిన ఇల్లు? (4)
  సమాధానం: పేకమేడ. జూదరి అనగానే పేక గుర్తొస్తుంది ముందు. అదొస్తే ఇల్లు ఉండనే ఉంది మేడ అని ఆలోచింప చెయ్యడానికి..

నిలువు

 1. సోము గయ సవ్యంగా వెళ్తేనే చక్కదనం (4)
  సమాధానం: సోయగము. సవ్యంగా చెయ్యమని సూచన.
 2. గణం రాలింపు లోదాగిన పద్దెనిమిదిలో ఒకటి (5)
  సమాధానం: లింగపురాణం. అష్టాదశపురాణాల్లో ఒకటి. దాగిన పదం లో వెతుక్కొమ్మని సూచన.
 3. ఈ వానరాయి వలన ఇల్లు గడవ కష్టంగా ఉంది (4)
  సమాధానం: వడగల్లు. వెనుకనుండి కనిపిస్తోంది.
 4. రకరకములైన తినుబండారాలు తింటుంటే తిరిగి వచ్చే ధ్వని (4)
  సమాధానం: కరకర. మళ్ళీ వెనుకనుండి.
 5. పన్నీరు ఇందులోనా వృధాగా పోసేది? (3)
  సమాధానం: బూడిద. సామెత ఉందిగా బూడిదలో పోసిన పన్నీరని?
 6. వాడు మనువాడ పొట్టివాడు కానీ గట్టివాడే (4)
  సమాధానం: వామనుడు. అక్కడే దాగున్నాడు.
 7. తిరిగి చూడము అంటే జలక్రీడ (3)
  సమాధానం: మునక. కనము తిరగబడింది.
 8. ప్రతి భావ సంవత్సరానికీ పుట్టే స్త్రీ నామధేయం (4)
  సమాధానం: ప్రభావతి. తారుమారుగా పుట్టిందిక్కడ.
 9. తలలకీ, వాహనాలకీ కావల్సింది (3)
  సమాధానం: చమురు. రెండింటికీ పనికి వచ్చేదే కదా?
 10. జనాలు లేకపోతే హారతులు కల్లుతో సమానం (2)
  సమాధానం: నీరా. నీరజనాలు అంటే హారతులు. జనాలు పొతే మిగిలేది నీరాయే కదా?
 11. ఈ దోపిడి ఇక్కడ అడ్డం కాదు (3)
  సమాధానం: నిలువు. ఇక్కడ అడ్డం కాదు నిలువు గడి అని సూచన. నిలువుదోపిడి వినే ఉంటారు.
 12. మనసు వినదు. పరమనీచాతి నీచమైన ఆలోచనలని చేస్తుంది. జాగ్రత్తగా చూస్తే ఉద్యోగపర్వం లో ఒక భాగం కనిపిస్తుంది.(5)
  సమాధానం: విదురనీతి. అక్షరాలని తప్పించి చూస్తే కనిపిస్తుంది.
 13. గట్టు ఎక్కించిన సహోదరి (2)
  సమాధానం: దరి. అక్కడే ఉంది.
 14. అన్నీ వదులుకున్నవాడు ధరించేది (5)
  సమాధానం: కాషాయవస్త్రం. అన్నీ వదులుకున్నవాడు సన్యాసి కదా. మరి వాడి యూనిఫారం అదే కదా?
 15. వర్షములు సుమారు. గాలులు సరిగ్గా వీచితే జడి వానలు అవుతాయి (4)
  సమాధానం: ముసురులు. అక్కడే సరిగ్గా చూస్తే ఉంది.
 16. అబద్ధం చెప్పనిది (2)
  సమాధానం: అద్దం. అదెప్పుడూ ఉన్నది ఉన్నట్టుగానే కదా చూపిస్తుంది.
 17. భిక్షాపాత్రతో తిరిగే తాబేలు (3)
  సమాధానం: కమఠ (లేదా కమఠం). రెండూ సరైన సమాధానాలే. దీనికి భిక్షాపాత్రము, తాబేలు అని రెండర్ధాలున్నాయి.
 18. నా బ్రతుకెలాగని తిరిగి అడగను మళ్ళీ (4)
  సమాధానం: మనుగడ. వెనుకనుండి కనిపిస్తోంది.
 19. కునికిపాటు పడ్డ మళయాళ దేశపు రాణి (3)
  సమాధానం: ప్రమీల. దీనికి మళయాళదేశపురాణి, కునికిపాటు అనే అర్ధాలున్నాయి.
 20. అన్నమాచార్య తాళ్ళతో కట్టిన శాల గుడిసె (2)
  సమాధానం: పాక. తాళ్ళపాక అన్నమాచార్య వారి ఇంటిపేరులో పాక అంటే గుడిసె కదా?