బెనిఫిట్ ఆఫ్ డౌట్

నా భుజాలపైన తల ఆన్చి ఒక కవర్‌లో నుండి ఏదో ఉత్తరాన్ని తీసి నా చేతిలో పెట్టి చదువ్ అన్నట్టు చూసింది. నాలో క్యూరియాసిటీ అణుచుకుంటూ దానివైపు చూశాను.

“ప్రేమలేఖా?”

అవునన్నట్టు తలూపింది. దాని ఎక్స్‌ప్రెషన్ సందర్భంతో మేచ్ అవ్వట్లేదు.

“ఓహ్!”

హెయిర్ బేండ్ తీసి పోనీటెయిల్ సరిచేసుకున్నాను. ఏదో ఎక్సైటింగ్‌ గానో, డిస్టర్బింగ్‌ గానో ఉంటే తప్ప నన్ను అంత హడావుడిగా పిలవదు. దాని మొహంలో ఉదాసీనత నాలో కలవరాన్ని రేపింది. ఎటూ తేల్చుకోలేక ఉత్తరం తీసి చదవడం మొదలుపెట్టాను.

ఓయ్!

ఏంటి? అలా చూస్తున్నావ్? ఏమి రాశాడా అనా? నిన్ను సతాయించేసి సతాయించేసి ఎలా కౌగిట్లోకి లాక్కోవాలో రాస్తున్నా! అబ్ బతావ్…

సరే మొదటిగా నీకో ముద్దు పెడుతూ (ఎక్కడ… అని ప్రశ్నతో అడ్డేయకు) నీకు కొన్ని మాటలు చెప్పాలి.

నీకో విషయం తెలుసా?

వర్షం హోరు తగ్గాక చూరు నుండి వాన చినుకులు ఒక్కటొక్కటిగా ‘టప్ టప్’మని పడుతుంటాయి. ఆకాశం ముసురు పట్టి బద్దకంగా ఇంకా మేఘాల దుప్పటిని కప్పుకునే ఉంటుంది. స్నానం చేసిన ఆకులు ఒళ్ళు తుడుచుకోకుండా చిన్నపిల్లల్లా మారాం చేస్తున్నట్టు ఉంటాయి. ఆ చివరి జల్లుల నిశ్శబ్దంలో నీ ఆలోచనలు వేడి వేడి కాఫీలా వెచ్చగా నా మనసును కప్పేస్తాయి.

నిన్ను మొదటిసారి చూస్తూనే నాకు నీవు నా నుండి వేరుపడిన నా ఇంకో శరీరమే అనిపించింది. ఈ విషయాన్ని అలవోకగా ఒంపు తిరిగిన నీ పొడవాటి కనురెప్పలే నాకు చెప్తున్నట్టు అనిపిస్తాయి. అందుకే, నిన్ను తాకే పర్మిషన్ నాకు వచ్చాక మొదటగా కనురెప్పల స్పర్శనే నేను కోరుకుంది. నా పెదాల మధ్య కనురెప్పలు సుతారంగా ఉంచేసుకున్నంతసేపు నేను ఏదో ధ్యాన ముద్రలో ఉన్నట్టే! ఎంత మెత్తగా, చిన్నగా కదులుతూ నా పెదాల మధ్య ఇమిడిపోయాయో… అమ్మ పొత్తిళ్లలో ఒదిగిపోయిన పాపాయిలా!

నేను మామూలుగా ఈ ప్రేమ లేఖ రాసి ఉండొచ్చు. కానీ నీకు ఇలా రాయడం నాకు బాగుంటుంది. నీకు అర్థమైన నీకిష్టమైన భాషలో రాయాలని ఉంటుంది. నిన్ను ఇంకా ఇంప్రెస్ చేయాలని ఉంటుంది. ఎందుకంటే నాకు మీడియోక్రిటీ ఇష్టంలేదు. నీ దగ్గర ఉన్నదంతా నాకు కావాలి. అందుకే, నిన్ను ముందు పెట్టుకుని మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ రాయడం బాగుంటుంది. నువ్వు నా మాటలు శ్రద్ధగా వింటున్నట్టు- నీ గడ్డం కింద చేయి పెట్టి ఆ వేలికొసలతో చెంప తడుముకుంటూ నా మాటలకు ఒక పాట కట్టాలన్నంత ముచ్చటగా వింటున్నట్టు… ఔను, బాగుంటుంది. నీ కళ్ళు నన్నే చూస్తూ… తోకచుక్కలా మెరిసి మాయమైన కోరిక నీ పెదాల మీద తారాడి మాయమవ్వడం… అది నే గమనించీ గమనించనట్టు నా ధోరణిలో నేను నీతో మాట్లాడుతూండడం… నీవు ఏ కొంచెం దగ్గరకు రమ్మని సంకేతాలు ఇచ్చినా, అవకాశం దొరికితే నిన్ను నాలో వాటేసుకోవాలని నేను నా మనసులోనే ఆరాటపడుతూ… మనసులో మనసు లేకుండా, గుండె దడ ఆపుకోడానికి ఇబ్బందిపడుతూ… అలాగే ఉంది నాకు. అది తల్చుకుని ఇలా గడపడం బాగుంది నాకు.

మొన్న మనిద్దరం ఎటన్నా వెళ్ళిపోదాం అన్నప్పుడు, ఇక నువ్వే నా హీరోవి. చెప్పు, నేను రెడీ! అన్నప్పుడు వచ్చి నా గుండె మీద నీ చెవి ఆన్చి ఉండవలసింది. ఉరుములు మెరుపులతో వాన మొదలయేముందు ఆకాశానికి కూడా గుండె దడ పుడుతుందని తెలిసేది. అది అచ్చు నా గుండెకు మల్లే కొట్టుకుంటుందని అర్థమయేది. మొన్న రెస్టారెంట్‌లో ‘బిర్యాని వద్దు. నాకు అన్నం, టమాటా పప్పు తినాలని ఉంది.’ అని ఆంధ్రా రెస్టారెంట్‌కు తీసుకెళ్ళి, ‘ఇప్పుడు నాకు కలిపి ముద్దలు తినిపించు,‘ అన్నప్పుడు నేను లోపలే ఒక జలపాతాన్ని సృష్టించుకున్నానేమో అనుకున్నా!

నీకు ఫోన్ చేసినప్పుడల్లా నన్ను ఆపకుండా తిడుతూ కోప్పడుతూ కొంచెం ఆయాసపడుతున్నప్పుడు, నా చెంపలపైన నీ ఊపిరి తగిలినట్టు ఉంటుంది. వణికే నీ పెదవుల్లో ఏదన్నా మకరందం ఉండేమో చూడాలనిపిస్తుంటుంది. నీ ఒడిలోనో, నీ ఎదపైనో నా మొహం వాల్చి, నిన్ను ఆటపట్టిస్తూ నీతో గడిపే రోజు నాకు రాకపోవచ్చు. అది నీ ఉద్దేశం వల్లనో, నా ఉద్దేశం వల్లనో జరగదు. నువ్వు ఇంతవరకూ లోకాన్ని చూసి భ్రమించిన సాధారణ అంచనా వలన జరగొచ్చు. లేదా ఈ లోకం మనిద్దరినీ దగ్గర చేరకుండా ఎక్కడికక్కడ గట్లు కట్టవచ్చు. నాకు తెలుసు, పారే ఏటిలో ఒక చిన్న ఈత మట్ట కొట్టుకుపోతూ ఉన్నప్పుడు, దాని మీద ఏదోలా అతుక్కున్న నాచు పూలలాంటి వాళ్ళం మనం. ఆచరణ రూపంలో లోకాన్ని బలవంతంగా లెక్కిస్తూ, పయనించాల్సిన వాళ్ళం మనం. మన ఆకాంక్షలకు అనుగుణంగా నీటి ప్రవాహం ఉండదు. కానీ నీకు నేనూ నాకు నీవూ అయితే ఉంటాముగా?! చూడు, ఆ ఆలోచనే నాకు తెలిసిన గొప్ప కవిత!

మా నాన్న పోయాక మా అమ్మ అంది నాతో, ‘ప్రేమించే మీ నాన్న నాతో లేడు ఇక. అది నా దురదృష్టం. అలా నేను నమ్మాక, నాకేదో అదృష్టం ఉంది కాబట్టి నేనింకా ఇలా జీవిస్తున్నానని నమ్మాలి… అది నువ్వు!’ అని. ఐతే ఈ రెండూ నీ విషయంలో నేను నమ్మను. అదృష్టం, దురదృష్టం కాకతాళీయతకు కల్పించిన పదాలు. కాని నీ ప్రేమ నాకు కాకతాళీయం కాదు. నీవు నాకు దొరకడం అదృష్టం అనను గాని-ఎందుకంటే నీవు దొరకుతావు అని ఎవరో నాకు ముందే చెప్పినట్టు అనిపిస్తుంది-నాకు నిన్ను చూసినప్పుడల్లా ఎప్పుడో ఎవరో నా కలలో నీ గురించి చెప్పినట్టు అనిపిస్తుంది. అదృష్టం అంటే ఒక మనిషి నాకు దొరకడం కాదు; ఆ మనిషితో పెనవేసుకున్న ఎన్నో ఏళ్ళ బంధం నాకు తట్టడం.

హబ్బబ్బా… ఉండు, ఈ అమ్మ ఒక్కతి! కింద హాల్‌లో అరగంట నుండి నన్ను కేకేస్తోంది రమ్మని. ఏమయ్యిందో ఏమిటో? మొన్నట్నుండి మా తాతగారితో ఒకటే నస. ‘నాన్నగారూ! ఇరవై ఐదు దాటాయి. ఇంకెన్నాళ్ళు? వీడికి పెళ్ళి చేద్దాం’ అని. ఇక నా వల్ల కాదు. ఈ మధ్యనే అమ్మ కంగారు ఇలా పెరిగిపోయింది. నా వల్ల కాదు ఇక. నేను నిన్ను విడిచి ఉండలేను. అది వాస్తవం. అది కచ్చితం కూడా! వెళ్ళి చెప్పేస్తా మన గురించి. ఒక్క నిముషం ఆగు… ఈ ప్రేమలేఖ మన పెళ్ళి పత్రిక అవ్వాలి. సరేనా?


నేనెలా బిగిన్ చేయాలో నాకర్థం అవ్వట్లేదు.

మా అమ్మ బాగా ఉన్న వాళ్ళ కుటుంబం నుండి వచ్చింది. మా నాన్న తక్కువ కులంవాడైనా, పేదవాడైనా నచ్చి పెళ్ళి చేసుకుంది. ఒదులుకోడానికి ఏమీ లేని వాడు త్యాగం ఏం చేస్తాడు! నా దృష్టిలో త్యాగం చేసి పెళ్ళి చేసుకుంది, అమ్మే. ఆమె జీవితంలో సంతోషాన్ని వదులుకుంది. మా నాన్న సంతోషాన్ని మెరుగుపరుచుకున్నాడు. నాకు తెలిసి నాన్న నుండి నా పేరుకు ఇష్టమున్నా లేకున్నా ఒక ఐడెంటిటీ వచ్చింది కాని, మా అమ్మనుండి నాకు ఇష్టమైన జీవితం వచ్చింది. నాకు రెండేళ్ళ వయసున్నప్పుడే మా నాన్న చనిపోయాడు. నాకు గుర్తుండి మా నాన్న పోయాక మా తాతగారి ఇంటిలోనే మా అమ్మ నన్ను పెంచింది. నన్ను ఎంత గారాబంగా ప్రేమగా పెంచిందీ అమ్మ ఒక్కచేత్తో! మా తాతగారూ అంతే, సనాతన ధర్మాన్ని మా అమ్మ తోసిపుచ్చిందని కోపమున్నా ఒక్క రోజు కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు. మా నాన్న పోయాక మా అమ్మ దేవున్ని నమ్మడం ఎక్కువయ్యిందని తనే చెప్తుంది. తాను తిరిగిన దేవుళ్ళ దగ్గర తనకు మనశ్శాంతి రాకపోయిందనీ, దానికి కారణం అందులో ఏ దేవుడూ తనను హర్షిస్తున్నట్టు, తనను దీవిస్తున్నట్టు భావన కలిగేది కాదనీ నాకు మా అమ్మ ఒక రోజు చెప్పింది. ఈ రోజు తన వివాహం ధర్మబద్ధం కాదనీ అందుకు నేను శిక్ష అనుభవిస్తున్నానీ కంటతడి పెడుతుంది. అమ్మకు తోడు మా మాదేవి పెద్దమ్మ. తను ఇక్కడే ఉంది.

ఇప్పుడు కింద మా అమ్మతో పెద్ద వాగ్వివాదం అయ్యింది. నేను కిందికి వెళ్ళి నీ గురించి చెప్తూండగానే పెద్దమ్మ నా మీద అరిచింది, ‘ఒరేయ్! నీకు తెలుసా? మీ అమ్మ జీవితంలో పెద్ద శిక్ష అనుభవిస్తోంది. ఒక విధవగా తాను పెళ్ళిచేసుకుని, ఇంకోసారి ధర్మాన్ని అధిగమించి జీవితంలో పెద్ద రిస్కు తీసుకోడానికి తను సిద్ధంగా లేదు కాబట్టే మళ్ళీ పెళ్ళి ఆలోచనలను పొరపాటున కూడా దగ్గరికి రానీలేదు.’ అని. నాకు తెలుసు, మా అమ్మకు తనకు తోడు లేకపోవడం గురించి బాధ లేదు. నాకు నాన్న లేకపోవడం ఆమె గుండెను కోసేసేది. తన పశ్చాత్తాపం తనకు మనిషి తోడు లేకపోయినా దేవుడి తోడు ఇచ్చింది ఇన్నాళ్ళు!!

నీకు అర్థమౌతుందా, నేనేం చెప్తున్నానో?! తాతగారు కళ్ళజోడు తుడుచుకుంటూ ఏమీ మాట్లాడలేదు ఎప్పట్లాగే. మా మాదేవి పెద్దమ్మ కోపాన్ని దిగమింగుకుంటుంటే మా అమ్మ నాతో పోరు పెట్టుకుంది. ప్రతి సోమవారం, బుధవారం, శనివారం ఒక్కో గుడి తిరిగి తాను నింపుకున్న ప్రశాంతతను ఈ రోజు మా అమ్మ మొత్తంగా వదిలేసుకున్నట్టు అనిపించింది నాకు.

మా అమ్మ ఏమందో వర్బాటిమ్ చెప్పలేను కాని, ఆమె కళ్ళ నిండా అన్ని నీళ్ళు నేనెప్పుడూ చూల్లేదు. పర్హాప్స్ మా నాన్న పోయాక కూడానేమో?!

‘ఒరేయ్! నేను కూడా ఒక విధవనేరా! భర్త పోయిన ఒక అమ్మాయి కోరికలూ అవసరాలూ తెలీని పాషాణాన్ని కాదు. భర్త లేకుండా జీవితాంతం ఆ అమ్మాయి అలానే బతకాలని కోరుకునే శాడిస్టునూ కాను. నేను మళ్ళీ పెళ్ళిచేసుకుని ఎవర్ని సుఖపెట్టేదాన్ని, చెప్పు? నిన్నా? నీ గురించి త్యాగం చేశాననే గొప్ప భావన నాకొద్దుగానీ… పోనీ నన్ను నేను ఉద్దరించుకునేదాన్నా? పోనీ నన్ను చేసుకున్న వాడిని ఉద్దరిస్తున్నానని అనుకుంటానా? అదీ లేదే?! మీ నాన్న నా పక్కన నన్ను తాకినట్టు ఎప్పుడోసారి అనిపించినప్పుడు, నేను పెళ్ళి చేసుకున్నవాడి కళ్ళల్లోకి అదే ఆత్మవంచనతో చూడనా? ఒక ధర్మం మనం ఏర్పరచుకున్నామంటే- అది జీవితంలో ఉన్న ఇటువంటి భ్రష్టతనూ అసహజతనూ దూరం చేయాలనే కదా? నన్ను దరికి తీసుకుని నాకిన్నాళ్ళు సాంత్వన ఇచ్చిన ఈ ధర్మాన్ని ఇంకోసారి కాలితో తన్నేసి, నా కొడుకు జీవితం రూపంలో అశాంతిని స్వాగతించాలా?’ అంటూ అరిచింది.

ఓయ్! నీవు విధవవి కాబట్టి నేను ప్రేమించినదానివీ నన్ను ప్రేమించినదానివీ కాకుండా పోతావా? నేను ఎప్పుడయినా నీ గతం గురించి పల్లెత్తు మాటడిగానా? మా అమ్మ అభిప్రాయాలతో నాకు ఏకీభావం లేదు కాని, నేను నిన్ను కాదనుకోకుంటే మా అమ్మనూ ఆమె ఇన్నాళ్ళూ నింపుకున్న మనో నిబ్బరాన్నీ వదులుకోవాల్సిందే అని అర్థం అయ్యింది. ఆమెలో చూసిన ప్రశాంతత, ఆమె కళ్ల నుండి ధారలా వెళ్ళిపోతుంటే-ధర్మానికీ ప్రేమకూ వ్యతిరేకత లేదుగాని, సమన్వయం కూడా లేదేమో అనిపిస్తుంది. ఇందుకు మా అమ్మ నాకు ప్రత్యక్ష సాక్ష్యం. ఏదో ఒక ధర్మాన్ని మనం విస్మరించకపోతే నీకైనా ఎందుకు ఈ కష్టం రావాలి? నాకైనా? మా అమ్మకైనా? మా తాతగారికైనా?

చిన్నప్పుడు ఇంట్లో సత్యనారాయణ వ్రతం లాంటివి చేస్తుంటే, మా అమ్మ జడ కుచ్చులతో ఆడుకుంటూన్న నన్ను మా అమ్మ ముందుకు లాక్కుని నా నుదుటి మీద ముద్దులు పెట్టడం ఇప్పటికీ గుర్తు. నాకనిపిస్తుంది అమ్మకు నన్ను చేరదీయడంలో, నేను ఆమెకు చేరువలో ఉండడంలో వచ్చే ఆనందం ఆమెకెంత ముఖ్యమో కదా అని.

అందుకే ఇంకేం మాట్లాడకుండా పైకి వచ్చేశాను. నా పెళ్ళి మా అమ్మను, తిరిగి దేవుడి దగ్గర కూడా ప్రశాంతత లేని స్థితికి తీసుకెళ్తుంది. ఆమె జీవితాన్ని ఇరవై ఏళ్ళు వెనక్కు తీసుకెళ్ళి మొదలుపెట్టమని అడగాలి, నాకోసం! నిన్ను చూసిన ప్రతిసారి ఆమెలో తెలీని భీతి నా కళ్ళ ముందు ఎప్పుడు పడుతుందో తెలీని అనిశ్చితిలో బతకాలి. ఆమె ఒక్కర్ని పల్లెత్తు మాట అనదు. తనను తాను కష్టపెట్టుకోవడంలో తాను ఎంతో ప్రావీణ్యం సాధించింది. ఇది వ్యంగ్యం కాదు. నా నిర్ణయం ఆమెను ఎంత బాధిస్తుందో అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాను.

తాతయ్య కూడా అంతే. మా తాతయ్యకు చచ్చేంత ఇష్టమైన హీరో హీరోయిన్లు ఎన్‌టీఆర్, జయసుధ. వాళ్ళిద్దరు చివరగా నటించిన సినిమా ‘నా దేశం’ వస్తే తన చిన్నప్పుడు స్కూలు ఎగ్గొట్టి ఆ సినిమా చూడ్డానికి వెళ్ళాట్ట. బేనర్ పడేటప్పుడు శివుడి బొమ్మ స్క్రీన్ మీద కనిపిస్తే కుర్చీ దిగి అప్పటికప్పుడు లెంపలేసుకుని దండం పెట్టుకున్నాట్ట. ఆయన తప్పులో కూడా తన ధర్మాన్ని వదులుకోలేదు. ఇంత కఠినమైన వేల్యూ సిస్టం నా చుట్టూ ఉంది. అది నీకు అర్థమయేలా అలవాటయేలా చేయాలని నా తపన.

నువ్వు ఇది చాదస్తం అని కొట్టి వేయవచ్చు. ఆ ప్రయత్నం నేనూ చేస్తున్నా. భౌతిక కారణాలు నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక కారణాలలో తప్పులు వెతకలేం. అందుకిప్పుడు సమయం కాదు కూడా. దేనినైనా మనమెందుకు ప్రశ్నించాలి అని అనుకోడానికి భూమిక ఒకటుండాలిగా? మనకు కలిగే బాధకు ఎదుటి వాళ్ళు కారణం అనుకుంటే ప్రశ్నిస్తాం. ఇప్పుడు నా బాధకు కారణం నా ముందున్న ఏ ఎదుటి వాళ్ళు? మా అమ్మనా? మా తాతగారా? మా మాదేవి పెద్దమ్మా? ఇది నమ్మకాల వాగ్వివాదం కాదు. మన తృప్తికి భౌతిక కారణాలు దొరకనప్పుడు జరుగుతున్న సంఘర్షణ. నాకే ఇంత గాభరాగా అనిపిస్తే, నీకైనా ఏదో ఒక క్షణం ఏ దేవుడి ముందో నమస్కరిస్తున్నప్పుడు ఇలా ఎప్పుడూ అనిపించలేదా?

మై గాడ్! కిందనుంచి పిలుస్తున్నారు పెద్దపెద్దగా. ఉండు… ఉండు… ఒక్క నిమిషం, వస్తా మళ్ళీ…


అయ్యో దేవుడా! అయ్యో! నేను నీకు ఇక్కడ ఏమీ రాయలేను. నా జీవితంలో ఇలా ఊహించని సంక్షోభం వచ్చి నన్ను ఇంతగా ముంచేస్తుందని అనుకోలేదు. నిన్ను క్షమించమని నేను అడగలేను. ఈ పెళ్ళి నీకు కూడా మంచిది కాదు. ఇది పెళ్ళిపత్రికగా మారుతుంది అనుకున్నా గాని, ఇలా వీడుకోలు లేఖలా ముగుస్తుందనుకోలేదు…


లెటర్ మూసి దాని మొహంలోకి చూశాను. అది మంచం మీద పడుకునుంది నుదుటి మీద మోచేయి ఆన్చి ఎటో చూస్తూ. దాని కళ్ళల్లోంచి నీళ్ళు ధారగా.

“ఏంటే…” అన్నాను భయంగా. నా గొంతు నాకే కొత్తగా వినిపించింది. నాకు కడుపులో ఏదో ముడుచుకుపోతున్నట్టు అనిపించింది. “చెప్పవే, ఎందుకిలా?”

గభాల్న లేచి అరచేతులతో ముఖం తుడుచుకుంది. “నాకు చేతులు రావట్లేదే. నా కోసం రిప్లయ్ రాసిపెడతావా?” దాని కళ్ళల్లో ఎర్రజీరలు.

మౌనంగా పేపర్ ప్యాడ్ అందుకున్నాను.


ఓయ్ నా ఫేక్ హీరో!

నేరుగా ఇంకొదిలేస్తున్నా అని చెప్పి చావు. మగాడు తన ఎత్తుగడలు తన తెలివి వలన కాకపోయినా అమ్మాయి అమాయకత్వం వల్ల పారుతాయిలే అనుకుంటాడు. ఆ అమాయకత్వాన్ని ఎక్కువగా ఊహించుకున్నప్పుడూ, లేదా తాను మరీ తెలివిమంతుడనని భావించుకున్నప్పుడూ ఇలా నగ్నంగా ఎక్స్‌పోజ్ అవుతాడు.

ఏంటి నీ సనాతన ధర్మంలో ఉండే మనశ్శాంతి మీ అమ్మకు? నన్ను తిరస్కరించడానికీ నన్ను ఆ విషయంలో కన్విన్స్ చేయడానికీ ఒక విధవను సృష్టించి ఆమె ద్వారా చెప్పిద్దామని చూశావ్. ఎంత దొంగ ఎత్తులేసింది కదా నీ ప్రేమ? నేను సనాతన ధర్మంలోనే కాదు; ఏ ధర్మంలోనూ పెరగలేదు. దేన్నీ నమ్మలేదు. కానీ ఆ ధర్మాలు ఎలా ఉంటాయో తెలీని దద్దమ్మను కాను నేను. ఏమన్నావు? నిన్ను విధవగా ఎప్పుడన్నా చూశానా అని అడుగుతావా? ఎంత అందంగా నా వైవాహిక హోదాను గుర్తు చేశావ్! నన్ను భర్త లేనిదానిగా చూడకుండా కరుణించే నీ విశాల హృదయం నా కాలిగోటికి సమానం. మాటల అందాన్ని అద్ది నన్ను ఏమార్చుదామనుకున్నావ్ కదూ? అదే ఇంతవరకూ చేశావ్ కూడా.

ముత్తయిదువులా ముస్తాబై వ్రతాలు చేసుకునే విధవలా నువ్వు మలిచిన మీ అమ్మకు ఒక దండం! ప్రపంచంలో అతి చిన్న వయసులోనే వృద్ధుడైన తాతగా మలచిన పాత్రలోని మీ నాన్నకు ఇంకో దండం! ఇంక చివరగా మిగిలిపోయిన మీ పెద్దమ్మలో పరకాయ ప్రవేశం చేసిన నీకు ఒక పెద్ద దండం!

నీకు ఆర్టిక్యులేషన్ ఉంది గానీ ఇమాజినేషన్ లేదు. కనీసం గూగుల్ చేసే కామన్ సెన్స్ కూడా లేదు.

వైధవ్యం! అది నీలాంటి మొగాడు ఎవడో ఒకడు నా పంచన చేరితే పోతుంది. నీకుండే వెధవతనం ఎన్నిసార్లు చచ్చి బతికినా పోదు!

బై


వాడెవడో తెలీకుండా వాడి ఉత్తరం చదివి నిజమని నేను నమ్మాను గాని, ఇది వాడి అబద్ధాలను మొక్కలోనే తుంచేసింది.

“అందంగా మాట్లాడే అబ్బాయిలు అసలు అంతు చిక్కని రహస్యాలు. నిజంగా లైఫ్‌లో చూపించడం చాతకాక మాటల్లో వీళ్ళు ఎన్ని ఆదర్శాలు వల్లిస్తారో కదా! ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది చూశావూ, ఇది ఎవరికెంత ఇవ్వాలో ఒక సైంటిఫిక్ కేల్‌క్యులేషన్ లాంటిది ఉంటే ఎంత బాగుండేది కదూ?”

వెళ్ళి దాని చెంప మీద చేయి వేసి అనునయంగా దాని కళ్ళల్లోకి చూశాను. దాని మొహం ఇప్పుడే వెన్నెలతో నలుగు పెట్టినట్టు ఉంది. దాని కళ్ళల్లోకి చూస్తూ అడిగాను.

“మనసులో ఇంత ప్రేమ కలుగుతున్నా, ఏదో మూల ఎక్కడో చోట నువ్వు ఈ విషయంలో అతనికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నావని నీకు తెలుస్తూనే ఉంది కదూ? ఈ మాత్రం ఆసరా తీసుకోదగ్గ ముందు చూపు నీకు లేకపోతే, ఎక్కడి దాకా వెళ్ళేది ఈ ప్రేమ కాని ప్రేమ? నువ్వేమయిపోయేదానివే?”

అదేం మాట్లాడలేదు. అలా నిస్త్రాణగా చూస్తూ ఉండిపోయింది. నా హ్యాండ్‌బ్యాగ్‌ లోంచి ఫౌండేషన్ తీసి దాని చేతిలో పెట్టాను.

“వెళ్ళు. వెళ్ళి మొహం కడుక్కుని కొద్దిగా తయారయి రా. కాసేపు హాయిగా తిరిగొద్దాం. చిన్న బొట్టు కూడా పెట్టుకో. ఇకనుంచీ నువ్వు బొట్టు తీయకు. ఆ అవసరం లేదు!”