అవ్యయ: అపరాహ్ణము

అపరాహ్ణంలో నిజంగా అనిపిస్తుంది, అంతా ఏదో ఖాళీ ఖాళీ అని,
చెట్లమీద ఎలాంటి పక్షులూ లేవు, బజారులో కొనటం అమ్మకంలాంటి బేరాల్లేవు
ప్రియురాలినుంచి ఫిర్యాదులూ లేవు, నేను ఎవరితో గడపాలి
ఈ తీయని వేళ? ఆకాశంలో రెండో నాలుగో డేగలు
ఎగురుతుంటే చాలు, ఎండు ఎముకలలో మ్రోగి ఎత్తిరిల్లుతుంది బేహల రాగం.

కలలో చూడడమేననుకో, గోడమీద వ్రేలాడుతూ ఇలాంటి ఒక చిత్రం;
ఒక మనిషి కూర్చొని ఉన్నాడు, నది ఒడ్డున రాతిమీద,
పిల్లనగ్రోవి వాయిస్తున్నాడు, అతని ముందు నాట్యం చేస్తూ యువతుల గుంపు,
నాట్యం చెయ్యటం ఎవరికి నచ్చదు? నువ్వు కూడా నాట్యం చెయ్యటం నేర్చుకో.
నాట్యంచేసి చేసి గుడి ప్రహరీగోడ వైపు నుంచి రా నా దగ్గిరకి.

ఎన్నో కోరికలు, వలపులలో ముణిగినదీ నేల, ఈ సమయం భద్రం,
ఒకవేళ అపరాహ్ణం నీ వరండాలోకి వ్యాపించిపోతే,
రూపసీ! నీవు తనని క్షమిస్తావు, క్షమించడం నీ సహజ లక్షణం
ఏదో ఒక పచ్చని చెట్టుపై పగలూ రాత్రీ ఎన్నెన్నో పక్షులు
పాటలు పాడుతూ ఉంటే, నా మనసు కూడా
ఆ పక్షుల పాటల కోసం ఎన్నడూ ఆలసించదు.