అవ్యయ: కృష్ణచూడా

నిజంగా ఎంత గర్వం? కృష్ణచూడాకి, అమ్మో! ఎంత ఉబ్బిపోతున్నదో!
కాస్త ఎర్రగా బుర్రగా రంగున్నదని ఎవ్వరినీ లెక్కచెయ్యటల్లేదు, తను
గాలిలో విలాసంగా అటూ ఇటూ ఊగుతూ పందెం కాస్తున్నట్టు
చేతులూపి పిలుస్తుంది; ఎవరికి తెలుసు, సిగ్గన్నా లేకుండా.

ఈ దారిలో వెళ్ళేటప్పుడు తనకి ఎంతో హాయిగా ఉంటుంది
కొంచెం నిలబడగలిగితే ఈ మాత్రం గర్వం మంచిదే అనిపిస్తుంది,
కొంచెం పక్కకు వెడితే తన శరీరానికి తాకుతుంది కొద్దిగా,
కాలం హఠాత్తుగా వచ్చి ప్రశ్న వేస్తుంది; సమాధానం కోరుతుంది-

‘ఈ రంగు కలకాలం ఉంటుందా ఏమిటి?’
రేపీపాటికి కారిపోగలదు
తిరిగి వచ్చే ఏడు కృష్ణచూడా ఇలాగని నవ్వుతుంది.
ఒకవేళ నీ యవ్వనంగాని ఒకసారి జారిపోతే, హాహా!
అది మళ్ళీ తిరిగి వస్తుందా? నీ లిప్‌స్టిక్ ఏం చెయ్యగలదు?

స్త్రీ సమగ్ర అస్తిత్వాన్ని మరిచి నెరజాణడిలా ఇవాళ
పదేపదే ఎందుకు నిన్ను, నీ యవ్వనాన్నీ కోరుకుంటాను?
నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వూ ఒకేఒక కృష్ణచూడాలాంటి స్త్రీ అవు,
నీ చేతిలో అమ్ముడుపోతాను, ఇదే దేహం, ఇదే మనస్సు, ఇదే ప్రాణం!

(కృష్ణచూడా: ఎరుపు రంగు రేకులున్న ఒక అందమైన పువ్వు. #Peacock Flower# అని, రత్నగంధి అని కూడా అంటారు.)