అవ్యయ: ల్యాండ్‌స్కేప్

మైళ్ళకు మైళ్ళు ఆకుపచ్చని వరిపొలాలు
చేలగట్లు కనపడవు గలగల పంటకాలువ నీళ్ళు
అక్కడక్కడ ముళ్ళకంపలు ఇరుకు దారి తాటిపుంతలు
ఒక చిన్న నీలిరంగు పిట్ట ఎగిరిఎగిరి తప్పింది దారి
రెండో ఝాము ఎండ నదిమీద ఆవిరి, దూరపు కొండల్లో నిప్పు
నక్కల బొరియల మూతుల్లో గుప్పెడుగుప్పెడు రాళ్ళ ముక్కలు.

అక్కడ పల్లెలో కాబోలు రాతిరి నిశ్శబ్దం. ఒక్క చిన్నపిట్ట,
క్రొత్త గుడిసె కప్పుమీద పాకిన బీర తీగె
సగం తెరిచిన తలుపు ఇంటిలో రోలు రోకలి చప్పుడు
బార్లగా తెరిచిపడి ఉంది ఆలోచనలు లేని పిల్లమనసు,
గుమ్మడి పూలలో అటూ ఇటూ తిరుగుతూ సీతాకోకచిలుక
దారిప్రక్కన క్రింద ఎండిపడి ఉంది బురద జీవితం

రెండవ ఝాము స్థబ్ధత. మేఘాలు లేని పసుపు రంగు ఆకాశం
ఇక్కడ నా చుట్టూ నది వణుకుతూ పోసిన ఇసుక గుట్టలు
అలసిన దేహం, నిశ్చల చింతనకి బలహీనం
రెండవ ఝాము ఎండ తుక్కునంతా కడుగుతుంది
నది ఒడ్డున ఉల్లాసంగా వినపడుతుంది వంశీరవం
పూలై వికసిస్తుంది ల్యాండ్‌స్కేప్‌, నామనశ్శాఖలో.