పుస్తక పరిచయం: చిట్టి చిట్టి మిరియాలు

మిఠాయి పొట్లం

‘ముస్తాబవుతోన్న నా కొత్త పుస్తకం ఒక మారు చూడండి’ అని ఇంద్రాణిగారు అంటూ ఈ పుస్తకాన్ని పంపితే, ఆనందంగా అందుకొన్నాను. అందరికన్నా ముందు చదివేయొచ్చు కదా అని.

శీర్షిక చూస్తే చిట్టి చిట్టి మిరియాలు. వారి చిన్ననాటి మంచి జ్ఞాపకాల మూటలోంచి కొన్ని చిట్టి పాటలను ఒక్క చోట చేర్చి, అందంగా కూర్చి ఉంటారని అనుకొన్నాను.

వారు చిన్నప్పుడు విన్నవో నేర్చినవో, చిట్టి పాటల పుస్తకమేమో అని యథాలాపంగా పుస్తకం తెరిచి పేజీలు తిరగేశాను.

నిజమే, ఇది మంచి జ్ఞాపకాల మూట. ఒక అమ్మ, మరొక అమ్మాయి. వారిద్దరి నడుమ అందంగా అల్లుకుపోయిన రోజువారీ మాటల కమ్మదనపు సన్నజాజి తీగలు.

ఇవి పాటలు కావు. కేవలం మాటలే. అమ్మ, అమ్మాయి మాట్లాడుకొన్నవి. ఆ పసితనం ఒలికించిన చెణుకులన్నీ ఇంద్రాణిగారు ఒడుపుగా ఒడి నిండా ఒడిసిపట్టుకొని చక్కటి క్రమంలో కూర్చారు.

నిత్య జీవితంపై పసి దృష్టిని అవగాన చేసుకోవడం, ఆ వైపుగా తమలోకి తాము తరిచి చూసుకోవడం అందరు పెద్దలూ చేస్తే ఎంత బావుంటుంది!

‘రేపటి కల చెప్తావా?’ అన్న చిన్న ప్రశ్నలో ఎంత లోతున్నది! ఎంతటి కవితాత్మ ఉన్నది! అలాగే, ‘సెల్ఫ్ అంటే ఏమిటి?’ అన్న ప్రశ్నలో అస్తిత్వ సంబంధ మౌలిక ప్రశ్నలు ముడిపడి ఉన్నాయి కదా?
ఇక్కడి పాప ముద్దుగా ముచ్చటగా మురిపాలు సాగిస్తుంది. ప్రశ్నలు వేస్తుంది. సమాధానాలు చెపుతుంది. సలహాలు గుమ్మరిస్తుంది. అన్నం తిననని మారాం చేస్తుంది. పాలు తాగనని హఠం వేస్తుంది. నాన్న కోసం దిగులుపడుతుంది. అమ్మను ఆట పట్టిస్తుంది. అమ్మను వాళ్ళ అమ్మే దారిలో పెడుతుందని పాపకు తెలుసు. అప్పుడప్పుడు ‘బెద్ద విసుగు’ విసుగు వచ్చేస్తుంది. మాటల చమత్కారం చూపుతుంది. అమ్మ ‘ఏకాంత వేళ’ అని కూని రాగం తీస్తే, B కాంత వేళ, C కాంత వేళ, D కాంత వేళ అని తన అక్షర పరిజ్ఞానాన్ని ప్రకటించుకొంటూ పాప పాటను కొనసాగిస్తుంది.

అమ్మానాన్నల దృష్టి అంతా తనే నిండి ఉండాలనుకొంటుంది. నాన్న అయిదు రోజుల పని తరువాత పొరుగూరి నుంచి ఇంటికి వస్తారన్న ఎదురుచూపుల్లోనూ, పనిలో పడి తనను ఏమారిన అమ్మ పని పాజ్‌లో పెట్టించడంలోనూ పాప దిగులు, ఓదార్పు, తెలివిడి మనలను హృద్యంగా తాకకుండా పోతుందా?

‘పాపని ఎప్పుడూ కోప్పడకూడదు. చాలా చాలా చాలా చాలా చాలా చాలా లడ్డూలు పెట్టాలి.’ అని ఉత్తుత్తి ఉత్తరంలో అమ్మమ్మ మాటగా తన మాటను చెప్పే గడుసుతనం ముచ్చట వేస్తుంది. అలాగే, బేబీ కార్న్‌తో పాటుగా మమ్మీ కార్న్, డాడీ కార్న్ ఉంటే ఫిజ్జు ఇల్లులో హాయిగా ఉంటారన్న ఆలోచన పిల్లలకు కాక ఎవరికి వస్తుంది?

‘నీ వల్ల అమ్మా నాన్న నిద్రపోలేదు తెలుసా?’ అని అమ్మ దగ్గుమందు వేసుకోకుండా రాత్రంతా నిద్రలేమితో ఉన్న పాపకు తెలియజెప్పబోతే, పాప నింపాదిగా అంటుంది కదా, ‘నా వల్ల నేను కూడా నిద్దాయిలు పోలేదు తెలుసా?’ అని. అమ్మ ఇకనేం బదులివ్వగలదు?

పసితనాన్ని అక్షరాల్లో ఒడిసిపట్టుకొని, ఒక చిన్ని రచనలో మనకు అందించినందుకు ఇంద్రాణిగారికి ధన్యవాదాలు. పిల్లలు చాలా సున్నిత దృష్టి, సునిశిత సృష్టి కలిగినవాళ్ళు. వాళ్ళ మనసు నచ్చేలా తమ చుట్టూ ఉన్న లోకాన్ని మలుచుకోగలరు. పాప మాటలతోబాటు గీతలను భద్రంగా జతపరిచారు.

అమ్మ పాపల కమ్మటి కబుర్లు మరెన్నో రావాలని కోరుకొంటున్నాను.

ఆ చిన్న పుస్తకం పసితనాన్ని పదిలంగా చుట్టిన మిఠాయి పొట్లం.

చిటారు కొమ్మన చిగురుల మాటున నా మిఠాయిని నేను ఆస్వాదించాను; అప్పుడప్పుడు పంటి కింద పడే మిరియం గింజ చురుకుతో పాటు.

ఇక, మీ వంతు!

అమ్మకు, అమ్మాయికి, ఇంద్రాణిగారికి శుభాకాంక్షలు.