వసంతతిలకము

పరిచయము

సంస్కృతభాష ఛందస్సులో ఎన్నో వృత్తములు ఉన్నాయి. అందులో కొన్ని రెండువేల సంవత్సరాలనుండి వాడబడుతున్నాయి. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, వీటితో ఉపజాతులు, ఇంద్రవంశ, వంశస్థ, వీటితో ఉపజాతులు, రథోద్ధత, భుజంగప్రయాతము, శార్దూలవిక్రీడితము, స్రగ్ధర, వసంతతిలకము, ఇత్యాదులు. ఇందులో పురాతనకవులు వసంతతిలకమును స్తోత్రాదులలో విరివిగా వాడినారు. వసంతతిలకమునకు ఎన్నియో నామములు గలవు. అవి – ఉద్ధర్షిణీ (పింగళ, వృత్తరత్నాకరము), కర్ణోత్పలా లేక మధుమాధవీ లేక శోభావతీ (వృత్తరత్నాకరము), వసంతతిలక (భరతుని నాట్యశాస్త్రము, హేమచంద్రుడు, జయకీర్తి, పింగళ, ప్రాకృతపైంగళము, రత్నమంజూష, వృత్తరత్నాకరము, జయదేవ, స్వయంభూ), సింహోన్నతా లేక సింహోద్ధతా (పింగళ, విరహాంక, హేమచంద్ర), ఇందుముఖీ (జానాశ్రయి), చేతోహితా (మందారమరందచంపూ), మదన (సులక్షణసారము). ఈ వృత్తము పాదమునకు 14 అక్షరములు ఉండే శక్వరి ఛందములో 2933వ వృత్తము.

లక్షణ లక్ష్యములు

ఈ వృత్తమునకు పింగళసూత్రము వసంతతిలకా త్భౌ జౌ గౌ అనగా వసంతతిలకమునకు గణములు త/భ/జ/జ/గగ (UUIUIIIUIIUIUU). పైన చెప్పిన కొన్ని పేరులు లక్ష్య పద్యములో ఉన్నాయి, ఆ పద్యము –

ఉద్ధర్షిణీ జనదృశాం స్తనభారగుర్వీ
నీలోత్పలద్యుతిమలిమ్లుచలోచనా చ
సింహోన్నతత్రికకటీ కుటిలాలకాంతా
కాంతా వసంతతిలకా నృపవల్లభా౽సౌ

(ఉత్సాహవంతులైన జనులచే చూడబడిన, గొప్ప స్తనములు గలిగిన, నల్ల కలువల కాంతిచే నిండిన కన్నులు గలిగిన, సింహమువంటి నడుము గలిగిన, కుటిల కుంతలములు గలిగిన కాంత, వసంతతిలకమైన ఆ మహారాణి.)

ఆదౌ ద్వే చతుర్థ చైవ చాఽష్టమేకాదశే గురూ
అంత్యోపాంత్యేచ శక్వర్యా వసంతతిలక యథా

అని నాట్యశాస్త్రములో ఈ వృత్తపు లక్షణములు చెప్పబడినవి. అనగా శక్వరిలోని ఈ వృత్తమునకు1,2,4,8,11,13,14 అక్షరములు గురువులు. నాట్యశాస్త్రములో త్రిక గణముల పేరులు చెప్పబడవు. ఏ అక్షరములు గురు లఘువులో అన్న విషయము మాత్రమే తెలుపబడుతుంది. నాట్యశాస్త్రమునందలి ఉదాహరణము –

చిత్రైర్వసంతకుసుమైః కృతకేశహస్తా
స్రగ్దామమాల్యరచనా సువిభూషితాంగీ
నానావతంసక విభూషిత కర్ణపాశా
సాక్షాద్వసంతతిలకేవ విభాతి నారీ

(చిత్రములైన ఆమని విరులతో తన కురులను నింపుకొన్నది. తన తనువును పూలదండలతో అలంకరించుకొన్నది. చెవులలో అందమైన కమ్మలను ధరించుకొన్నది. నిజముగా ఈ స్త్రీ వసంతతిలకములా ప్రకాశించుచున్నది.)

జానాశ్రయిలో వసంతతిలకపు సూత్రము – బాకిస్ (బ్ ఆ క్ ఇ స్; బ్ = UUI, ఆ = UII, క్ = IUI, ఇ = IUI, స్ = UU). రత్నమంజూషలో వసంతతిలకపు సూత్రము – మౌని(నీ)పే (మ ఔ న ఈ ప్ ఏ; మ = U, ఔ = UIU, న = I, ఈ = IIU, ప్ = IIU, ఏ = IUU).

యతి వివరములు

వసంతతిలకమునకు యతి ఉన్నదా లేదా? వసంతతిలకమునకు అందఱు లాక్షణికులు పాదాంతయతిని తప్ప విరామయతిని పాటించలేదు. కవులు కూడ పాటించలేదు. ఉదాహరణమునకు కవికులతిలకుని క్రింది పద్యము-

తత్ర స్వయంవరసమాహృతరాజలోకం
కన్యాలలామ కమనీయమజస్య లిప్సోః
భావావబోధకలుషా దయితేవ రాత్రౌ
నిద్రా చిరేణ నయనాభిముఖీ బభూవ – రఘువంశము 5.64

(మరునాడు జరుగబోతున్న స్వయంవరమునకు వచ్చిన రాజలోకమునకు కారణము ఉత్తమకన్యయైన ఇందుమతి అందమే. ఆమె తన్ను వరించునో వరించదో అనే తలపుతో అజమహారాజునకు రాత్రి చాల కాలము నిద్ర పట్టలేదు.)

ఇందులో అన్ని పాదములలో పదచ్ఛేదము ఒకే విధముగా లేదు. కాబట్టి ఒక ప్రత్యేకమైన విధములో యతి పాటించబడలేదు. మందారమరందచంపువులో వసంతతిలకపు లక్షణాలు ఈ విధముగా చెప్పబడినవి –

వసంతతిలకా ప్రోక్తా / తభజాజగగా యది
న వా పాదో౽పి విరతిః / సప్తసప్తాక్షరైర్మతా

ఇందులో పాదము ఏడు ఏడు అక్షరాలకు విఱుగుతుంది అని చెప్పబడినది. ఇది వికల్పమని వ్యాఖ్యానించబడినది. శ్రుతబోధలోని ఒక ప్రతిలో పాదము 8, 6 అక్షరాలుగా విఱుగుతుందని వ్రాయబడినది –

ఆద్యాం ద్వితీయమపిచేద్గురు తచ్చతుర్థం
తత్రాష్టమంచ దశమాంత్యముపాంత్యమంత్యమ్
అష్టాభిరిందువదనే విరతిశ్చ షడ్భిః
కాంతే వసంతతిలకం కిల తం వదంతి

కొన్ని ప్రతులలో మూడవపాదము కామాంకుశాం కుశితకామిమతం గజేంద్రే అని ఉన్నది. ఇక్కడ గజేంద్రే అంటే ఎనిమిదికి (దిగ్గజములు) సంకేతమా?

వసంతతిలకము ఇంద్రవజ్ర నుండి పుట్టినదా?

– నా ఉద్దేశములో వసంతతిలకమునకు యతి విఱుపు 8, 6 సరియైనదని భావన. అందులకు కారణములను ఇప్పుడు వివరిస్తాను. వసంతతిలకము ఏ విధముగా జనించినది అనే ప్రశ్నకు ముందు జవాబును వెదకుట మంచిది. ఇంద్రవజ్ర కూడ పురాతన ఛందస్సే. శ్లోకము తఱువాత ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర ఎక్కువగా వాడబడినవి. ఇంద్రవజ్రకు గురు లఘువులు – UUI UU – IIUI UU. ఇంద్రవజ్రలోని మొదటి గగమును UII గా చేసినప్పుడు మనకు దొరికే అమరిక – UUI UII – IIUI UU. దీని లయ, ఇంద్రవజ్రపు లయ ఒక్కటే. జయకీర్తి ఛందోనుశాసనములో ఈ అమరికతో ఉండే వృత్తమును శ్రుతి అని పిలిచెను. ఇప్పుడు ఈ అమరికకు భ-గణము తఱువాత ఒక లగమును (IU) కలిపితే మనకు వసంతతిలకపు అమరిక లభిస్తుంది.

UUI UU – IIUI UU ఇంద్రవజ్ర
UUI UII – IIUI UU శ్రుతి
UUI UII IU – IIUI UU వసంతతిలకము

ఇక్కడ ఒక విషయమును మనము మఱువరాదు. రెండువేల సంవత్సరాలకు ముందు శ్రుతి వృత్తము వాడుకలో లేదు. జయకీర్తి కాలము సుమారు క్రీ.శ. 1000 నాటిది. కాని క్రొత్త వృత్తముల జననమునకు కారణములు వాడుకలో ఉండే వృత్తములకు చేసే మార్పులు, కూర్పులు మాత్రమే. ఇంద్రవజ్రకు చేసిన ఒక మార్పు (UU => UII), అదనముగా ఒక కూడిక (IU) వసంతతిలకమునకు దారి తీసినది.

అమూల్యధన్ ముఖర్జీ తాను వ్రాసిన Sanskrit Prosody: Its evolution (సారస్వత్ లైబ్రరి, కలకత్తా) పుస్తకములో వసంతతిలకపు ఉత్పత్తిని గుఱించి ఇలా వివరించాడు – వసంతతిలకము త్రిష్టుప్పు ఛందములోని ఇంద్రవజ్రను internal compounding చేయడము వలన లభించినది. ఇది అందులోని నాలుగవ అక్షరము తఱువాత (అనగా UUIU తఱువాత) ఒక న-గణమును (tribrach) ఉంచుట వలన సిద్ధిస్తుంది, అనగా UUIU III UII UIUU మనకు దొఱుకుతుంది. ఇలా చేయడము ద్వారా స-గణము (anapest) పునరావృతము (IIU IIU) అవుతుంది. ఇట్టివి గ్రీకు ఛందస్సులో కనిపిస్తాయి. త్రిష్టుప్పు మూసతో ఏడవ అక్షరము పిదప ఒక భ-గణమును (dactyl) కలిపినట్లు కూడ దీనిని భావించ వీలగును. నేను చెప్పినట్లు వసంతతిలకపు జననము ఇంద్రవజ్ర వృత్తమునుండి అనియే మఱొక విధముగా ముఖర్జీ వివరించినాడు.

ఇంద్రవజ్రకు పాదమధ్యములో యతి లేదు. కాని ప్రతి పాదములో వరుసగా 5,4 – 5,4 మాత్రలు ఉన్నాయి. యతి అనే నియమము ఉంటే ఇట్టి విఱుపు సరిపోతుంది. కాబట్టి వసంతతిలకమునకు కూడ ఇట్టి విఱుపు సరియనియే నా భావన. ఏడక్షరాలకు పాదమును విఱిచినప్పుడు మాత్రాగణముల అమరిక సరిగా నుండదు. కాబట్టి నా ఉద్దేశములో వసంత తిలకమునకు అక్షరసామ్య యతి తొమ్మిదవ అక్షరముగా ఉండాలి, కాని తెలుగులో దీనిని ఎనిమిదవ అక్షరముగా నెన్నుకొన్నారు. నా ఈ ఊహను ఉదాహరణ రూపములో తెలుపుతాను-

ఇంద్రవజ్ర – త/త/జ/గగ UUI UU – IIUI UU 11 త్రిష్టుప్పు 357

దేవాధిదేవా – దినమెల్ల గొల్తున్
శ్రీవేంకటేశా – సిరియంచు దల్తున్
నావైపు చూపన్ – నగుమోము కాంతుల్
భావింతు నే నిన్ – భవసార మంచున్

ఈవేళ సొంపై – హృదయమ్ము పూచెన్
రావేల దేవా – రసగంగవోలెన్
నావైపు చూడా – నగుమోముతోడన్
జీవమ్ము నిండెన్ – జెలువమ్ము పండెన్

శ్రుతి – త/భ/స/య UUI UII – IIUI UU 12 జగతి 757

దేవాధిదేవుని – దినమెల్ల గొల్తున్
శ్రీవేంకటేశుని – సిరియంచు దల్తున్
నావైపు చూపుమ – నగుమోము కాంతుల్
భావింతు నే నిను – భవసార మంచున్

ఈవేళ సొంపుల – హృదయమ్ము పూచెన్
రావేల దేవర – రసగంగవోలెన్
నావైపు చూడవు – నగుమోముతోడన్
జీవమ్ము నిండెను – జెలువమ్ము పండెన్

వసంతతిలకము – త/భ/జ/జ/గగ UUI UII IU – IIUI UU 14 శక్వరి 2933

దేవాధిదేవుని మదిన్ – దినమెల్ల గొల్తున్
శ్రీవేంకటేశుని హృదిన్ – సిరియంచు దల్తున్
నావైపు చూపుమ హరీ – నగుమోము కాంతుల్
భావింతు నే నిను సదా – భవసార మంచున్

ఈవేళ సొంపుల వనిన్ – హృదయమ్ము పూచెన్
రావేల దేవర హరీ – రసగంగవోలెన్
నావైపు చూడవు గదా – నగుమోముతోడన్
జీవమ్ము నిండెను సదా – చెలువమ్ము పండెన్

వసంతతిలకములో కొన్ని ఉదాహరణములు

1) పతంజలి మహాభాష్యములో ఎన్నో వృత్తములకు మూసలు ఉన్నాయి. వసంతతిలకపు మూసను ఇక్కడ గమనించవచ్చును –

ఆత్మంభరిస్చరతి యూథమసేవమానః – పతంజలి మహాభాష్యము, 3-2-26

(సంఘమును గుఱించి చింతించక తన్ను గుఱించి తలచువాడు.)

2) ఋగ్వేదములోని మంత్ర తంత్ర విధానములు తెలుపబడిన ఋగ్విధానములో వసంతతిలకములు గలవు. కాని వీటిని శౌనకుడు వ్రాసినాడో లేక ఆ సారాంశములను తఱువాత మఱెవ్వరైనా వ్రాసినారో తెలియదు. వాటిలో ఒకటి –

ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తీ
నారాయణః సరసిజాసన సంనివిష్టః
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుర్ధృత శంఖచక్రః – ఋగ్విధాన, 3-224.

(సూర్యమండలపు కేంద్రములో ఉండే నారాయణుని, పద్మాసనముపై అమరినవానిని, కేయూరములను, మకరకుండలములను, కిరీటమును ధరించిన వానిని, దండను దాల్చినవానిని, బంగారువన్నెల శరీరమువానిని, శంఖచక్రములను ధరించినవానిని ధ్యానించవలయును.)

3) రామాయణములో ఉత్తరకాండలో వసంతతిలకములు గలవు. కాని ఈ ఉత్తరకాండము వాల్మీకి రచించినదా, వేఱెవ్వరైనా వ్రాసినారా అన్నది ప్రశ్నయే! ఏది యేమైనా అందులోని ఒక వసంతతిలక వృత్తము –

ఏషామయా తవ నరాధిప రాక్షసాణా
ముత్పత్తిరద్య కథితా సకలా యథావత్
భూయోనిబోధ రఘుసత్తమ రావణస్య
జన్మప్రభావమతులం ససుతస్య సర్వమ్ – ఉత్తరకాండ, 8.28

(ఓ రఘూత్తమా, రాక్షసుల జననము, ఉత్పత్తి గుఱించి చెప్పుతాను. రావణుడు వాని కుమారులు వారి అతులితమైన శక్తిని నీవు అర్థము చేసికోవాలి.)

4) మహాభారతములో కూడ అక్కడక్కడ వసంతతిలకములో 12 పద్యములు కనిపిస్తాయి. వీటిని కూడ తఱువాత మఱెవ్వరైనా చేర్చినారా అనే విషయము తెలియదు. ఒక పద్యము అనుశాసనిక పర్వములో ఉన్నదని, అదే పద్యము స్వర్గారోహణ పర్వములో ఉన్నదని అంటారు. ఆ పద్యము –

యో గోషతం కనకశృంగమయం దదాతి
విప్రాయ వేదవిదుషే సుబహుశ్రుతాయ
పుణ్యంచ భారతకథాం సతతం శ్రుణోతి
తుల్యం ఫలం భవతి తస్య చ తస్య చై౽వ – మహాభారతము, స్వర్గా. 18-5-80

(బంగారు కొమ్ములతో ఉండే ఎన్నో ఆవులను వేదవేద్యులైన బ్రాహ్మణులకు దానము చేయగా లభించిన పుణ్యము ఈ భారతకథను వింటే లభిస్తుంది.)

5) పురాతన శాసనాలలో కూడ వసంతతిలకవృత్తములో వ్రాయబడిన పద్యములు ఉన్నాయి. క్రింద మూడు ఉదాహరణములు –

శ్రీమార రాజకుల వంశవిభూషణేన
శ్రీమార లోకనృపతేః కులనందనేన
ఆజ్ఞాపితం స్వజన (UIIUI) మధ్యే
వాక్యం ప్రజాహితకరం కరిణోర్వరేణ – వో ఛాన్ గ్రామము, ఖాన్హ్-హోఆ మండలము, వియట్నాం, క్రీ.శ. 2-3శతా.

(శ్రీమారరాజకులమునకు భూషణమైనవాడు, ఆ రాజకుమారుడు స్వజనులమధ్య సింహాసనాసీనుడై ప్రజలకు హితకరమైన వాక్యములను పలికినాడు.)

ధైర్యేణ మేరుమభిజాతి గుణేన వైణ్య
మిందుం ప్రభాసముదయేన బలేన విష్ణుమ్
సర్వాంతకానలమసహ్యతమం చ దీప్త్యా
యో విక్రమేణ చ సురాధిపతిం విజిగ్యే – విశ్వవర్మ గంగాధర శాసనము, క్రీ.శ. 424

(ధైర్యములో మేరు పర్వతము, వంశపరంపరలో పృథువంశమునకు చెందినవాడు, అందములో చంద్రుడు, బలములో విష్ణువు, సహించుకొనుటకు వీలుకాని ప్రళయాగ్ని దీప్తి , శౌర్యములో ఇంద్రుని జయించగల వాడు విశ్వవర్మ.)

భూతేవ దుగ్ధలహరీభి రుదంచతీవ
దుగ్ధోదధే రమృతదీధితి నిర్మితేవ
శ్రీఖండపిండ పరిపాండురపుత్తలీవ
వక్త్రే వసత్వ నిరతంతు సరస్వతీ నః – అచింతేంద్రవరయతి, వేయిస్తంభాలగుడిశాసనము, క్రీ.శ. 1163

(పాల అలలనుండి లేచినట్లున్నది ఆమె, క్షీరసముద్రములోని అమృతకాంతులతో నిర్మించబడినది ఆమె, శ్రీచందనముతో చేయబడిన తెల్లటి శిల్పము ఆమె, అట్టి సరస్వతీదేవి మా ముఖములందు నిరంతరము పరిఫుల్లమగుగాక!)

6) భాసుడు సుమారు క్రీ.పూ. రెండవ శతాబ్దపు కాలము నాటి వాడని అంచనా. భాసుని స్వప్నవాసవదత్త నాటకము కడు రమ్యమైనది. అందులోనుండి ఒక పద్యము –

ఋజ్వయతాం చ విరలాం చ నతోన్నతాం చ
సప్తర్షివంశకుటిలాం చ నివర్తనేషు
నిర్ముచ్యమాన భుజగోదర నిర్మలస్య
సీమామివాంబరతలస్య విభజ్యమానాం – భాసుని స్వప్నవాసవదత్త నాటకము, 4.2

(ఆకాశములో ఎగిరే పక్షుల బారును చూసిన వత్సరాజు (ఉదయనుడు) వర్ణన ఇది. ఒక్కొక్కపుడు నేరుగా, ఒకప్పుడు సన్నని గీతలా, పడుచు, లేచుచు, ఆకాశములో సప్తర్షిమండలములోని వంకరలా, పాముచే విప్పబడిన కుబుసములోని తెల్లటి చర్మములా, ఆకాశములో ఒక సీమారేఖవలె ఉన్నది.)

7) కాశ్మీరకవి బిల్హణుడు పదకొండవ శతాబ్దములో చౌరపాంచశికా అనే గొప్ప లఘుకావ్యమును ప్రేమ ఇతివృత్తముతో వ్రాసినాడు. అవన్నీ వసంతతిలకములే. అందులో ఒకటి –

అద్యాప్యహం వరవధూ సుభగావియోగం
శక్నోమి నా౽న్య విధినా చ కథాపి సోఢుమ్
తద్భ్రాతరో మరణ మేవ హి దుఃఖ శాంత్యైః
విజ్ఞాపయామి భవతస్తవ్రితం లునీహి – బిల్హణుని చౌరపాంచశికా, 49.

(ఆనాడు నీ వొసగినా – వమరేంద్ర భోగం
బీనాడు నే వ్యధలతో – నిటఁ గ్రుంగుచుంటిన్
ప్రాణాలఁ బాయుటయెగా – పరమౌషధమ్మౌ
నీ నన్ను జంపు డిపుడే – యిఁక తీరు బాధల్
)

8) సుమారు పదమూడవ శతాబ్దములో నివసించిన లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతములో 50 పైగా వసంతతిలకములు ఉన్నాయి, అనగా సుమారు ఆఱు శ్లోకములలో ఒకటి ఈ ఛందస్సులో వ్రాయబడినది. క్రింద ఒక ఉదాహరణము –

వృందావనద్రుమతలేషు గవాం గణేషు
వేదావసానమయేషు చ దృశ్యతే యత్
తద్వేణువాదనపరం శిఖిపింఛచూడం
బ్రహ్మ స్మరామి కమలేక్షణమభ్రనీలమ్ – లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతము, 2-21.

(బృందావనమ్మున బసుల్ – బ్రియమార మేయన్
జిందించు వేణువు సడుల్ – శిఖిపింఛభూషుం
డిందీవరాక్షుఁడు, సదా – మృదునీలమేఘున్
వందింతు వేదపు నిధిన్ – పరమాత్ము బ్రహ్మన్
)

9) శ్రీవేంకటేశ్వర సుప్రభాతములోని నాలుగు భాగములలో 70 శ్లోకములలో 40కి పైగా వసంతతిలక వృత్తములో నున్నాయి. మచ్చునకు ఒక ఉదాహరణము-

శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్ధే
దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే
శ్రీమన్ననంత గరుడాదిభిరర్చితాంఘ్రే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ – ప్రతివాదిభయంకర అణ్ణంగరాచార్య విరచిత శ్రీవేంకటేశ్వర సుప్రభాతము, 21.

(శ్రీవిశ్వనాయక దయా-మృత వారిరాశీ
దేవాధిదేవుఁడ ధరి-త్రికి రక్షకుండా
ఆ వైనతేయ ఫణినా-యక పూజితాంఘ్రీ
శ్రీవేంకటాచలపతీ – శ్రియ మీ యుషస్సౌ
)

10) లక్ష్మీః, కృపామయి, విధీశసురేశవంద్యే,
విశ్వప్రియే, త్రిజగదంబ, హిరణ్యవర్ణే,
అర్చ్యే, వసంతతిలకైః కుసుమై ర్బుధైరి-
త్యాలాపయ ప్రతిపదం కమలాలయే, మాం – పళ్లె పూర్ణప్రజ్ఞాచార్య కృత లక్ష్మీమాలా

(ఓ లక్ష్మీ, దయామయీ, బ్రహ్మ, ఈశ్వర, ఇంద్రులచే స్తుతింపబడినదాన, విష్ణువునకు ప్రియురాలా (లోకుల కెల్ల ప్రియమైనదానా), ముల్లోకములకు తల్లీ, బంగారువన్నె దానా, దేవతలచే వసంతునకు తిలకాయమానమగు పూలచే నర్చింప దగినదానా (కవులచే వసంతతిలక మనబడు పూలచే బూజింపదగినదానా), ఓ కమలాలయా నన్ను ప్రతి పదమున పలికింపుము. వృత్తము పేరు పద్యములో వచ్చినది కావున ముద్రాలంకార శోభితము ఇది.)

11) క్షేమేంద్రుడు సువృత్తతిలకములో వసంతతిలకపు ఉపయోగమును గుఱించి ఇలా వివరిస్తాడు – వసంతతిలకం భాతి సంకరే వీరరౌద్రయోః. అనగా వీరరౌద్రముల సాంకర్యము ఉన్నప్పుడు వసంతతిలకము రాణిస్తుంది. వసంతతిలకమును వ్రాయుటలో హరవిజయకర్త రత్నాకరుడు నేర్పరి అని క్షేమేంద్రుని భావన. దానికి ఉదాహరణము –

జృంభావికాసితముఖం నఖదర్పణాంత
రావిష్కృతప్రతిముఖం గురురోషగర్భమ్
రూపం పునాతు జనితారిచమూవిమర్శ
ముద్వృత్తదైత్యవధనిర్వహణం హరేర్వః

(ఆవలించగా విరిసినట్లుండే మోము గలిగినది, అద్దమువలె ఉండే గోళ్లలో ప్రతిబింబము కలిగినది, ఎక్కువగా కడుపులో పెట్టుకొన్న రోషము కలిగినది, శత్రుసేనలకు భయము కలిగించునది, దుష్టుడైన హిరణ్యకశిపుని చంపునది యైన విష్ణుమూర్తి రూపము రక్షించుగాక!)

తెలుగులో వసంతతిలకము

క్రింద కొన్ని లక్షణగ్రంథములనుండి లక్షణ లక్ష్య పద్యములను ప్రస్తావిస్తున్నాను.

సారంబుగాఁ దభజజంబు వ-సంతరాజా-
కారా వసంతతిలకంబగు – గాయుతంబై – రేచన కవిజనాశ్రయము, వియతిచ్ఛందోఽధికారము

గౌరీనితాంతజప-కారణనామధేయున్
దూరీకృతప్రణత-దుష్కృతు నంబుజాక్షున్
ధీరోత్తము ల్గిరియ-తిన్ తభజాగగ ల్పెం
పారన్ వసంతతిల-కాఖ్య మొనర్తు రొప్పన్ – అనంతుని ఛందోదర్పణము, 2-63

కల్గున్ వసంతతిల-కన్ తభజాగగంబుల్
సింహోద్ధతంబగుఁ బ్ర-సిద్ధిగ దీనిపేరే
ఉద్ధర్షిణీ గరిమ – నొప్పు నిదే పఠింపన్
శోభావతిన్ గిరులఁ – జూపు విరామ మిట్లే – చిత్రకవి పెద్దన లక్షణసారసంగ్రహము, 1-86

శ్రీమేదినీరమణ – సింధుతరంగరంగ
ద్రామాహితల్ప విన-తాసుతవాహ రాధా
కామా వసంతతిల-కన్ దభజాగగంబుల్
సామప్రభూతయతి – సాగి ధరం జెలంగన్ – అప్పకవీయము, చతుర్థాశ్వాసము

దైతేయభంజన హరీ – తభజాగగంబుల్
మాతంగవిశ్రమమున్ – మదనాఖ్య యొప్పున్ – లింగమగుంట తిమ్మకవి సులక్షణసారము, 53

(బహుశా మాతంగవిశ్రమమునన్ అని ఉండాలి)

తెలుగులో వసంతతిలకమునకు గల వేఱువేఱు నామములను చిత్రకవి పెద్దన వివరించినాడు. తెలుగులో ఈ వృత్తమునకు మూడు విధములైన యతులు ఉన్నాయి – (1) రేచన పదకొండవ అక్షరముపైన యతి నుంచినట్లు వావిళ్ల ప్రతి కవిజనాశ్రయములో చూపబడినది. ఈ ప్రయోగము సంస్కృతములో గాని తెలుగులోగాని లేదు. కాని లక్షణపద్యములో ఎనిమిదవ అక్షరమునకు కూడ (7, 7 అక్షరాల విఱుపు) యతి సరిపోతుంది. (2) తిమ్మకవి వసంతతిలకపు గణములతో తొమ్మిదవ అక్షరముపైన యతి నుంచి ఆ వృత్తమును మదన వృత్తము అని పిలిచినాడు. (3) మిగిలిన వారందఱు ఎనిమిదవ అక్షరముతో అక్షరసామ్య యతి స్థానముగా తీసికొన్నారు.

తెలుగులో వసంతతిలకమును కవులు చాల తక్కువగా వాడినారు. భారతములో నన్నయ తిక్కనలు, కుమారసంభవములో నన్నెచోడుడు, ఇటీవల రామాయణకల్పవృక్షములో విశ్వనాథ సత్యనారాయణ ఈ వృత్తములను వాడినారు.

ఈ బాలు నెత్తుకొని – యింటికిఁ జన్న నన్నున్
నా బంధు లందఱు మ-నంబున నే మనారె
ట్లీ బాలసూర్యనిభు – నిట్టులోడించి పోవం
గా బుద్ధి పుట్టునని – కన్య మనంబులోనన్ – నన్నయ భారతము, ఆదిపర్వము, 5-29

హా పుత్రవర్గ మిటు – లాఱడిఁ బోవ దీప్త
వ్యాపార మేది మరి – వందుచు దీనవృత్తిం
బ్రాపించి యన్యు లకృ-పం బరికింప నింకే
నోపన్ భవం బెడలి – యుండఁగ జీవితోడన్ – తిక్కన భారతము, స్త్రీ, 1-10

కారుణ్యమూర్తి నవి-కారు నగేంద్రధీరున్
మారారి సర్వజన-మాన్యు సదా వదాన్యున్
నీరేజపత్రనిభ-నేత్రు జగత్పవిత్రున్
ప్రారబ్ధపుణ్యమిత-భాను గుణాభిలాషున్ – నన్నెచోడుని కుమారసంభవము, 8.199

ప్రావారభూతఫణి! – పాలితపారికాంక్షీ!
నీవారభుక్సమితి – నీరజబాలజూర్ణీ
ఆవర్తితాఘఘృణి! – యాప్లుతలోక కాంక్షీ!
శ్రీవేదవాక్ఫలని-వృత్తి మనోవితీర్ణీ! – విశ్వనాథ రామాయణ కల్పవృక్షము, అయోధ్య, అభిషేక – 474

వసంతతిలకము – సరసాంక

ఒక గురువును రెండు లఘువులుగా చేయడము, రెండు లఘువులను ఒక గురువుగా చేయడము నూతన వృత్త కల్పనలో సర్వ సామాన్యము, ఉదా. శార్దూల మత్తేభవిక్రీడితములు, చంపకోత్పలమాలలు, మానినీ కవిరాజవిరాజితములు, ఇత్యాదులు. వసంతతిలకములోని మొదటి గురువును రెండు లఘువులుగా మార్చగా జనించిన వృత్తము సులక్షణసారములో సరసాంక అని పేర్కొనబడినది. దీనిని హేమచంద్ర జయకీర్తులు వృషభ అనియు, కేదారభట్టు ఋషభ అనియు పేర్కొన్నారు. క్రింద ఉదాహరణములు –

వసంతతిలకము – త/భ/జ/జ/గగ UUI UIIIU – IIUI UU 14 శక్వరి 2933
కన్నుల్ సదా వెదకుఁగా – కమలాక్ష నిన్నే
నన్నేల సూడవు హరీ – నవమోహనాంగా
కన్నెఱ్ఱ సేయకుమురా – కరుణాలవాలా
నిన్నిందు మానసములో – నిజమందు స్వామీ

దీనిని ఇప్పుడు సరసాంక వృత్తముగా మార్చుదామా?

సరసాంక (వృషభ, ఋషభ) – స/జ/స/స/య IIUI UIIIU – IIUI UU 15 అతిశక్వరి 5868
కనులెప్పుడున్ వెదకుఁగా – కమలాక్ష నిన్నే
ననునేల సూడవు హరీ – నవమోహనాంగా
కనులెఱ్ఱ సేయకుమురా – కరుణాలవాలా
నినునిందు మానసములో – నిజమందు స్వామీ

(వసంతతిలకములోని మొదటి గురువును రెండు లఘువులుగా మార్చినప్పుడు జనించిన సరసాంక వృత్తపు యతి స్థానము సులక్షణసారములో, వసంత తిలకములోవలె కాక దాని నామాంతరమైన మదన వృత్తములోవలె చూపబడినది.)

మఱొక ఉదాహరణము –

వదనమ్ము చూడుము సకీ – వనజాక్షులన్ నా
హృదయమ్ము తేఁడుము చెలీ – ప్రియరాగ మొల్కన్
సదయాంతరంగవు గదా – సరసాంకమందున్
ముదమార శీర్షము సదా – పులకించి యుంతున్

పై వృత్తమును ఇంద్రవజ్ర లయతో ఉండే మణికూజిత వృత్తముగా మార్చ వీలగును.

మణికూజితము – స/జ/న/ర/గ – IIUI UII – IIUI UU 13 అతిజగతి 1516
వదనమ్ము చూడుము – వనజాక్షులన్ నా
హృదయమ్ము తేఁడుము – ప్రియరాగ మొల్కన్
సదయాంతరంగవు – సరసాంకమందున్
ముదమార శీర్షము – పులకించి యుంతున్

ఇతర వృత్తములు

వసంతతిలకపు లయతో సరసాంక, ధోరిత అనే వృత్తములు ఛందోగ్రంథములలో పేర్కొనబడినవి. అట్టి నాలుగు అదనపు వృత్తములను నేను కల్పించినాను. ఈ వృత్తముల వివరములను పట్టికలో చూడవచ్చును. ఆ వృత్తములకు నా ఉదాహరణములను క్రింద ఇచ్చినాను.

మాధవ – త/భ/య/ర/గ UUI UII IU – UUI UU 13 అతిజగతి 1141

మాసమ్ము మాధవముగా – మై పొంగిపోయెన్
రాసమ్ము మాధవునిదే – రాత్రుల్ తరించెన్
హాసమ్ము లా ధవునికే – యంతమ్ము లేదీ
లాసమ్ము బాంధవునికే – లాలిత్య మెందున్

మధుమాలతి – త/త/భ/ర/గ UUI UU IU – IIUI UU 13 అతిజగతి 1445

శ్రీవేంకటేశా హరీ – సిరిదేవి ఱేఁడా
దీవించ రావా ననున్ – ద్రిపురారిమిత్రా
భావమ్ములందున్ మదిన్ – వసియించు దేవా
నీవేగదా నా హృదిన్ – నిఖిలంపు టెల్లల్

విరులకారు (దివిజాత) – భ/జ/స/స/య UIII UIIIU – IIUI UU 15 అతిశక్వరి 5871

అద్దమును నే నడుగఁగా – నది జెప్పె “నీవా”
సిద్ధమని నే నుడువఁగాఁ – సెల పిల్చె “రావా”
వృద్ధ యని నే బిలువఁగా – విరి నవ్వె “నేనా”
రుద్ధమని నే దెలుపఁగా – రుతి పల్కె “నౌనా”

ధోరితము – భ/న/ర/ర/స UIII IIUIU – UIU IIU 15 అతిశక్వరి 13503

ధోరితపు సడు లెన్నియో – దూరదూరములో
వారువము వడి వచ్చెగా – పర్వులన్ ధరపై
చేరువయి ప్రియు డింక నా – చెంత వచ్చునుగా
హారముల బలు వేతు నే – నాశతో నగుచున్

సురభి – త/భ/జ/జ/స UUI UIIIU – IIUI IIU 15 అతిశక్వరి 15221

కామమ్ము నిండెను గదా – కనులందు దివెగా
నామమ్ము మ్రోఁగెను గదా – నడురాత్రి సెవిలో
నీ మానసమ్మున సదా – నృతి సేసెదవుగా
నీ మాధురీచషకమం – దెపు డాడెదవుగా

వసంతతిలకమునకు, ఇంద్రవజ్రకు ఉండే సామ్యమును ఇంతకు ముందే చెప్పినాను. ఈ రెండు వృత్తములతో కల్పవల్లి అను ఒక అర్ధసమ వృత్తమును నిర్మించినాను. క్రింద ఒక ఉదాహరణము –

కల్పవల్లి – బేసిపాదములు వసంతతిలక పాదములు, సరిపాదములు ఇంద్రవజ్ర పాదములు
ఏకాకి నైతిని ధరన్ – హృదయమ్ము వేఁగెన్
రా కల్పవల్లీ – బ్రదుకిమ్ము తల్లీ
ఈ కాళరాత్రికి వెలుం – గియ రమ్ము వేగన్
మాకోర్కె దీర్చన్ – మధువైరి చెల్లీ

(మదరాసు మైలాపురములోని కపాలీశ్వరాలయమునందలి అమ్మవారి పేరు కఱ్పగాంబాళ్, కల్పవృక్షమువంటి దేవి)

మఱి కొన్ని విశేషములు

రెండు చిత్రమైన రీతులలో వసంతతిలక వృత్తమును మనము నిర్మించ వచ్చును. అవి – (1) ఇంద్ర చంద్ర (విష్ణు రుద్ర) గణముల వాడుకతో, (2) మలయాళ ఛందస్సులోని కేక అమరికకు ఒక ప్రత్యేకతగా. ఈ రెండింటిలో పాదము 7, 7 అక్షరాలకు విఱుగుతుంది, కాబట్టి అక్షరసామ్య యతి ఎనిమిదవ అక్షరముపైన.

(1) జాతి పద్యము హరిహర – ఇం/చం – ఇం/చం, యతి మూడవ గణముతో, ప్రాస అవసరము. ఇందులోని ఒక ప్రత్యేకత వసంతతిలకము.

హరిహర జాతి పద్యపు ప్రత్యేకత వసంతతిలక – త/భ/జ/జ/గగ UUI UIII – UII UIUU 14 శక్వరి 2833

శ్రీనీలకంఠ, శివ – చిన్మయరూప, దేవా
గానస్వరూప, భవ – కాయజనాశ, శంభూ
జ్ఞానాంబురాశి, హర – శంకర, పార్వతీశా
రా నశ్వరా, హరిహ-రా, నటరాజ, స్వామీ

(2) కేకలో మొత్తము 14 అక్షరములు. పాదము ఏడు, ఏడు అక్షరములుగా విఱుగును. ప్రతి ఏడుఅక్షరములు 3,2,2 అక్షరముల గణములతో నుండును. ప్రతి గణములో కనీసము ఒక గురువైనను ఉండవలయును. కాని ముందటి కాలములో ఇది తమిళములోని ఆఱు శీరుల (గణముల) వృత్తముగా గ్రహించబడినది. అందులో II అంగీకృతము. అప్పుడు వసంతతిలకపు గణముల అమరిక దీనికి సరిపోతుంది – UUI UI II – UI I UI UU.

– ఇది యుగాది సమయము. వసంతఋతువుతో ప్రారంభమవుతుంది క్రొత్త సంవత్సరము. ఈ హేమలంబి (హేవిళంబి) నామ సంవత్సరమును కొన్ని వసంతతిలకములతో, ఆ లయ ఉండే పద్యములతో శుభాకాంక్షలతో ఆహ్వానిద్దామా?

వాసంతగానము వినన్ – వనభూమియందున్
హాసమ్ము చిందుచుఁ బ్రియా – హరుసమ్ముతో రా
లాసమ్ము లాడెనుగదా – లతలందుఁ బూవుల్
వాసమ్ము మోదములయెన్ – బరవళ్లు ద్రొక్కన్ (వసంతతిలకము)

ఆశాప్రసూనములతో – నరుదెంచె హృదిలో
నీశీతకాల రజనిన్ – హృదయంగమముగా
వాసమ్ము సేయ నవమై – వరమై సురభియే
హాసమ్ము నిండె నిరులున్ – హరుసంపు వెలుఁగై (సురభి)

ప్రేమలత పూచె హృదిలో – విరులెల్ల నీకే
కామలత జెల్వములతోఁ – గనుసైగ సేసెన్
నా మనసు నీకె గదరా – నవమోహనాంగా
సోమరస మిత్తు దరిరా – సుమశయ్య వేచెన్ (విరులకారు)

పూవిలుతుఁ డెందు మనెనో – పురికొల్పుచుండన్
దేవునికి కూడ కలుగున్ – దృష వీడకుండన్
ఈ విరులకారు వసుధన్ – హృదయంగమమ్మే
భావములు ప్రేమసుధతోఁ – బరిఫుల్ల మయ్యెన్ (విరులకారు)

వేళయ్యె రాత్రి యిది – ప్రేమయు పొంగెఁగాదా
పూలన్ని వాడె నిట – పున్నమి వెల్గులోనన్
తేలించ రమ్ము నను – దీయని మాయలోనన్
మేలమ్ము లాడగను రా (వసంతతిలకము – వెణ్బా)

వాసంత రాగము సదా – వనిలోన మ్రోఁగెన్
వాసంతి నేఁడే – వలరాజు యూఁగెన్
నే సంతసింతును గదా – నిను నాసఁ జూడన్
వాసంత మౌదున్ – బదమొండు పాడన్ (కల్పవల్లి)

(వాసంతి = మదనోత్సవము; వాసంత (1 పాదము) = వసంతఋతు సంబంధమైనది; వాసంతము (4 పాదము) = కోయిల)

చూసితివి నీ కనులతోఁ – జుఱుకైన రీతిన్
వ్రాసితివి కజ్జలముతోఁ – బ్రణయార్ద్ర లేఖన్
చేసితివి మాయ నొకటిన్ – జిరునవ్వునందున్
వేసితివి యుచ్చుఁ ద్రుటిలో – విరిమాలతోడన్ (విరులకారు)

ఇది పుష్పమాసము గదా – యిఁకనైన రావా
ఇది కామవల్లభముగా – నిఁకఁ జూడ రావా
ఇది పూల కాలము గదా – యెద నింప రావా
మది నిన్ను దల్చెను గదా – మధుమాసమందున్ (సరసాంక)

ఆ తోటలోన విరిసెన్ – హర్షమ్ము పూలై
చేతోభవుండు మురిసెన్ – చెల్వంపు వ్రాలై
నాతోడ నుండు జెలియా – నర్తించు విల్లై
ఈ తావు మారు నిఁకపై – నింద్రాణి యిల్లై (మాధవ)

మందమ్ముగా నవ్వు నో – మధుమాలతీ నీ
యందమ్ము లీ యామనిన్ – హరుసమ్ము లిచ్చెన్
గంధమ్ము నిండెన్ గదా – కడు యింపుతోడన్
విందీయ రాఁడాయెనే – విభుఁ డెందు నుండెన్ (మధుమాలతి)

సుందరత దలువన్ మదిన్ – సుందరాననమే
చందమును దలువన్ సదా – చక్కనౌ పలుకే
చందురుని దలువన్ లలిన్ – చల్ల కౌగిలులే
బంధమును దలువన్ హృదిన్ – వంద ప్రార్థనలే (ధోరితము)

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...