తెరచాటు-వులు: 3. శ్రుతి చూసుకో, శ్రుతి చేసుకో!

ప్రయాస పడి భారం మోసే ఉపోద్ఘాతం

చిలకా గోరింకల్లాంటి ముచ్చటైన ఆలుమగలు. అన్యోన్య దాంపత్యం. పండంటి కాపురం. రెండు రోజుల క్రితం ఆఫీస్ నించి వచ్చి – ఇంకో రెండు రోజుల్లో పెద్ద బాసుగారు హెడాఫీస్ నించి వస్తున్నారు, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి, మర్చిపోకుండా పొద్దున ఆరింటికి నిద్ర లేపు – అని చెప్పాడు మొగుడుగారు. ఈ రెండు రోజుల్లోనే ముచ్చటైన ఆ మొగుడు పెళ్ళాలు ఏదో చిన్న విషయం మీద మొహాలు మాడేట్టుగా తిట్టుకున్నారు, పోట్లాడుకున్నారు. ఇక నాతో మాట్లాడకు, నీ మొహం నాకు చూపించకన్న పాశుపతాస్త్రాన్ని నాతిచరామి మంత్రం చెప్పినంత శ్రద్ధతో సంధించి యుద్ధానికి తాత్కాలికంగా తెరవేశాడు మొగుడు. ఆరింటికి లేపమన్న రోజు రానే వచ్చింది. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు మొగుడు. పక్క టేబుల్ మీద పెట్టిన వాచీ 7:30 చూపిస్తోంది. అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. వంటింట్లో పనిలో తిరుగుతున్న పెళ్ళాం మీద ఒంటికాలి మీద లేచాడు. ‘ఏమన్నా బుద్ధుందా నీకు, ఆరింటికి లేపమని చెప్పానా?! ఈ పాటికి బాసు వచ్చి, వెయిట్ చేసి చేసి, వెళ్ళిపోయుంటాడు,’ అన్న సందేశాన్ని తనకు తెలిసిన గ్రాంథిక, గ్రామ్య, వ్యావహారిక పదజాలాల మధ్య ఇమిడ్చి కోపం వెళ్ళగక్కాడు. రెండు రోజుల క్రితం పట్టిన మౌనవ్రతం ఇంకా విరమించని ఆ ఉత్తమ ఇల్లాలు మాట్లాడకుండానే తాపీగా బెడ్‌రూంలోకి వెళ్ళి, వాచీ కింద పెట్టిన తెల్ల కాగితాన్ని తెచ్చి మొగుడి చేతిలో పెట్టింది. దిగమింగుకున్న కోపం ఎక్కడా కనపడనీయకుండా ముత్యాల్లాంటి అక్షరాలతో రాసిన మహావాక్యాన్ని చూసి మూగబోవడం ఈ సారి మొగుడి వంతు అయ్యింది. అందులో – ఆరు గంటలయ్యింది! లేవండి! ఎక్కడికో వెళ్ళాలన్నారు – అని రాసుంది.

టోన్ అన్న మాటకి ఇంతకు మించిన ఉదాహరణ ఉండబోదేమో. టోన్ కథ కాదు, మాటలు కావు, నటన కాదు, నర్తన కాదు. దృశ్య-శబ్ద మాధ్యమమైన సినిమాలో అది కనిపించేది కాదు, వినిపించేది కాదు. అదొక అంతర్వాహిని. సూక్ష్మదృష్టి వున్న దర్శకుడికి మాత్రమే కనిపించేది. ఈ టోన్ సీరియస్ సినిమాలకే కాదు; కామెడీ, మాస్ సినిమాల వంటి వాటికి కూడా ప్రాణవాయువులాంటిది. కథే సినిమాకి ప్రాణం అన్నది ఒక దురభిప్రాయం. అసలు చిలక ప్రాణం కథలో కాదు ఉన్నది- టోన్‌లో. ఎంత చెత్త కథయినా టోన్ సరిచూసుకుంటే అది ఒక వాఙ్మయం అవుతుంది. ఉడీ ఆలెన్ (Woody Allen) సినిమా What’s up, Tiger Lily? ఇందుకు ఒక గొప్ప సమాధానం.

టోనల్ షిఫ్ట్ అనగానేమి?

ఇప్పుడు కాస్త ఆ ‘పుటుక్కు జర జర డుబుక్కు మే’ ధోరణి తగ్గింది కాని, ఒక్క పదేళ్ళ క్రితం వరకు సినిమా ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు దర్శక నిర్మాతల నుండి ఒకే రకమైన జవాబు ఉండేది: కథ, సెంటిమెంట్, హాస్యం, ఏక్షన్‌తో పాటు యువతకు, మహిళలకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉండబోతున్నాయి మా చిత్రంలో అని. ఈమధ్య కాలంలో ఆ మొత్తం చెబితే ఎగతాళి చేస్తారనో ఏమిటో, ఆ పైని పడికట్టు పదాలు అన్ని కలిపి ఎంటర్‌టైన్‌మెంట్ అన్న గంప గుత్త మాటతో సరిపుచ్చేస్తున్నారు. కాస్త జాగ్రత్తగా చూస్తే- కథ, సెంటిమెంట్, హాస్యం, ఏక్షన్‌తో పాటు యువత, మహిళలకు నచ్చే అంశాలు అన్న వాక్యంలో పరస్పర వైరుధ్యం కల జాఁన్రాలు ఒక పది అయినా కనపడతాయి. పోనీ అలాంటి కథ తయారు చేశారనే అనుకుందాం. (నిజం చెప్పాలంటే, 70వ దశకం నించి 90ల చివరి వరకు హిట్టయిన కమర్షియల్ సినిమా కథలన్నీ ఆ బాపతువే. అలాంటి కత్తి మొనల మీద కథాకళి చేసిన, చేసి మెప్పించగలిగిన ఏ మోళీ బృందాన్నయినా అభినందించి తీరాల్సిందే.) సెంటిమెంట్ (సినిమా భాషలో కర్చీఫులు తడిసిపోయే కన్నీళ్ళని అర్థం) సీను అయిన తరువాత వంతుల ప్రకారం వెంటనే ఒక (వెకిలి)హాస్యమో, (ఎబ్బెట్టు)శృంగారం సీనో పడినప్పుడు కలిగే ఇబ్బందికరమైన భావనే ఈ టోనల్ షిఫ్ట్. కథ జాఁన్రాలతో కోతికొమ్మచ్చి ఆడుతున్నప్పుడు ఇలాంటి పంటికిందరాళ్ళు సర్వ సాధారణం. ’20 నిముషాలయ్యింది సార్! ఒక్క డ్యూయెట్ అయినా పడలేదు ఇంకా’ అని చిరాకు పడిపోతున్న నిర్మాతను శాంతపరచడానికి కథ నేల విడిచే చేసే సామే ఈ టోనల్ షిఫ్ట్. సాంకేతికమైన అంశంగా తెలియకపోవచ్చు గాని, కాస్త ఊహ తెలిసిన ఎవరైనా కూడా ఇలాంటి యూ-టర్న్ చూసి ఫక్కున నవ్వక మానరు. ఆ పై భార్యాభర్తల ఉదాహరణలో భార్య చేసిన పనిలో ఒక ఔచిత్యం ఉంది. జోకు మాట పక్కనుంచి, ఇంకే విధంగా భర్తని నిద్ర లేపినా ఆ ముందు జరిగిన మౌన పోరాటాలకి, మూతి బిగింపులకి అర్థం ఉండేది కాదు. పైగా ఆ పోట్లాట పలచబడిపోయేది. రాబోయే సీను ముందటి సీను నుండి అందుకున్న మూడ్‌ని స్థాయి దించకుండా లేదూ మార్చకుండా చేసే కొనసాగింపే టోన్.

ఒక ఉదాహరణ: ఒకే దర్శకుడి నుండి ఈ మధ్య కాలంలో వచ్చిన రెండు చిత్రాలు – అతడు, ఖలేజా – టోన్‌కి బొమ్మా బొరుసులుగా నిలుస్తాయి. అతడు సినిమాలో హీరో డబ్బుకి గొంతులు కోసే రకం. బావుంది. పుట్టి పెరిగింది అనాథగా. మరీ బావుంది. అతని మాటలలో పొదుపు, భావాలలో గుంభనత్వం అతనికి వృత్తి వల్ల అలవడ్డాయి. సినిమా చివరి వరకూ (మధ్యలో వచ్చే ఊహా గీతాల్లో తప్పితే) అతని ధోరణి మారదు. చుట్టుపక్కల వస పిట్టల మూక చెవులు కొరికేస్తున్నా ఒక చిన్న చిరునవ్వో, లేక మౌనముద్రో అతని సమాధానం. ఎక్కడా మార్చకుండా ఆ కేరెక్టర్‌ని అలా మలచడం, చివరి వరకూ అలానే ఉంచడం ఆ పాత్ర ఔచిత్యాన్ని ఎన్నో రెట్లు పెంచింది. ఫైట్ల దగ్గిరనుంచి హాస్య సన్నివేశాల వరకూ హీరో ముసురు మూడ్ సన్నివేశాలని రక్తి కట్టించడంలో ఎంతో ఉపకరించింది. మళ్ళీ అదే నట-దర్శక ద్వయం అందించిన చిత్రం ఖలేజా. సినిమాలో సవాలక్ష లొకేషన్లు, అవి మారినంత సులువుగా టోన్ కూడా మారిపోతూ ఉంటుంది. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం మాత్రమే చూసుకుంటూ తరువాత రాబోయే సీను గురించి ఈషణ్మాత్రం పట్టించుకోకుండా టోన్ కుప్పిగంతులు వేస్తూ ఉంటుంది. ఎంచుకున్న ఇతివృత్తం కడు ఉదాత్తం – సందర్భం వచ్చినప్పుడు మనిషిలో దైవత్వం తనంతట తానే బయటపడుతుంది – అని. దానిని చెప్పిన పోకడ మాత్రం హాస్యాస్పదంగా ఉంటుంది. రక్తం కుతకుతలాడిపోయే ఏక్షన్ సీను నుంచి ఒక్క సారి ఆ అనుకున్న దైవత్వాన్ని తనే పలచన చేసేసుకునే ఒక జోకు వస్తుంది. ఆ వెంటనే మళ్ళీ ఉన్నత భావాలు, పలికించే మాటలు. చిన్నప్పటి నేల-బండ ఆటని తలపించేట్టు ఒక సారి నేలబారుగా మరోసారి ఉదాత్తంగా కుంటిగుర్రం తీరులో సాగిపోతుంది ఈ సినిమా నడక. విడిగా చూసుకుంటే ప్రతి సన్నివేశం తన పరిధిలో తను మెప్పించుకునిపోతుంది. కాని కలగలిపితే మాత్రం కలగాపులగం అవుతుంది. దానికి ముఖ్య కారణం టోన్ సరిచూసుకోకపోవడమే. సన్నివేశానికి ఉండే మూడ్ చూసుకోకుండా కథాగమనానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పావుల్ని ఇష్టం వచ్చినట్టు కదుల్చుకుంటూ పోతుంటే వచ్చే చిక్కులు ఇవి. కథకి గతి, గమనం రెండూ ముఖ్యమే. ఈ జోడుగుర్రాలను నియంత్రించే పగ్గం ఖచ్చితంగా టోనే. ఎక్కడ నిలువరించాలో ఎక్కడ పరిగెత్తించాలో అంతా టోన్ చేతిలో ఉంది. ఈ మధ్య కాలంలో దీని మీద పట్టు సాధించిన దర్శకుడు ఖచ్చితంగా గౌతమ్ మెనన్ అని చెప్పవచ్చు.

తెలుగు సినిమా గతిని ఒక ముఖ్యమైన మలుపు తిప్పిన శివ చిత్రం కంటే ఆ తరువాతి సంవత్సరంలో విడుదలైన అంకుశం చిత్రం టోన్‌కి గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది.

భారతీయ సినిమా మూస చూసుకుంటే పాటలు – అవి ఎంత మధురమైనవి అయినా సరే – ఒక తప్పని తగులాటకం. టోన్ సగం చచ్చేది ఈ పాటల బలిపీఠం మీదే. నాటకీయంగా సాగిపోతున్న సన్నివేశాలకి పడే ముందుకాళ్ళ బంధమే ఈ పాటల ప్రహసనం. అప్పటి వరకు కొనసాగుతున్న బిగువు ఒక్కసారిగా సడలి, ‘ఆగవోయ్, ఒక్క సారి దమ్ము బిగించి సంచీ దులుపుకుని వస్తాను’ అని అనుకునే ప్రేక్షకులకి ఆ అవకాశం కల్పించి, రగులుతున్న అగ్ని మీద ఆజ్యం పోయవలసిన క్షణంలో చల్లనీటిని చిలకరించి, ఎక్కిన కొమ్మను తెగనరికేసే గతి నిరోధకం ఈ పాటల ప్రక్రియ. ఈ సూక్ష్మం తెలుసుకున్నవాడు ధన్య దర్శకుడు అవుతాడు. ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకునే శివ సినిమా కూడా ఈ పంటికిందిరాళ్ళ వల్ల అనుకున్న తీక్షణత, ఉండవలసిన తీవ్రత కంటే ఒక వాసి తక్కువగా మిగిలిపోయిందనే చెప్పుకోవచ్చు. కాని కోడి రామకృష్ణ తీసిన అంకుశం సినిమా అలా కాదు. నలిగిన కథయినా నడిపిన తీరు అసాధారణం. మూడ్‌ని ఎక్కడా దింపకుండా, టెంపోని ఎక్కడా బ్రేక్ చేయకుండా, ఒక కరకు పోలీస్ ఆఫీసర్ కథని అంతే నిబద్ధతతో తెరకెక్కించాడు దర్శకుడు. ఉన్న పాట ఒకటీ అరా కూడా ‘కట్ చేస్తే కాశ్మీరూ, ఊహల్లో ఊటీ’ వరసలో కాకుండా పాత్ర ఔచిత్యాన్ని ఎక్కడా భంగపరచకుండా ఉండడం చేత, అసలు సినీ గమనానికే ప్రతిబంధకాలుగా నిలిచే ఈ పాటలు, చిత్రంగా కథని ముందుకు తీసుకుపోయే వాహనాలయినాయి. ‘మా సినిమాలో పాటలు కథని ముందుకు తీసుకు వెళ్తాయండీ’ అన్న బాగా నానిన సినీ నానుడికి సిసలైన జస్టిఫికేషన్ నూటికో కోటికో ఒక్క సినిమాలో జరుగుతుంది, అంకుశంలో లాగా. ఐతే టోన్ అన్నది కనుబొమ్మలు గట్టిగా ముడేసుకుని చూసుకునే సీరియస్ సినిమాలకే కాదు, నానా జాతి సమితికి కూడా వర్తిస్తుంది.

A movie is not what it is about, but how it is about it.

ఈ సందర్భంలో ఓ ఉర్దూ జోకుని ఉదహరించుకోవడం తప్పనిసరి.

ఔత్సాహికుడు ఒకడు ఒక ముషాయిరాకి (ఉర్దూ కవితా గోష్టి) వచ్చి కూర్చుని, వేదిక మీద ఉన్న పెద్దలందరినీ చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఇంతలో పేరున్న ఒక కవిరాజు లేచి, ముక్కు పొడుం బిగించి, మైకులోకి సాలోచనగా చూసి, డిబ్బా (పెట్టె) అన్న పదాన్ని వదిలి సభని తేరిపార చూశాడు. ఆ పదం అనడమే తడవుగా సభ ఒక్కసారి దద్దరిల్లిపోయింది. మన ఔత్సాహికుడు కించిత్తు ఖిన్నుడై ఏమిటి తనకు తక్క మిగతా అందరికీ అర్థమైపోయిందే అనుకుని సర్దుకుని తదుపరి పంక్తి కోసం చకోరమయ్యాడు. కవిరాజు తిరిగి, డిబ్బా పే డిబ్బా (పెట్టె మీద పెట్టె) అనడం, తేరిపార చూడడం, సభ మార్మ్రోగడం, ఔత్సాహికుడు మళ్ళీ తికమక పడడం జరిగిపోయినాయి. పోనీ పక్కవాడిని అడుగుదామనే లోపల, కవిరాజు డిబ్బే పే డిబ్బా పే డిబ్బా (పెట్టెల మీద పెట్టె మీద పెట్టె) అనటం, కరతాళాలు అంబరాన్నంటడం, ఔత్సాహికుడి మొహం మరింత మాడిపోవడం… ఇక మిగిలిన మొత్తం కవి సమయం అంతా ఇదే తంతు. కవిరాజుగారు పెట్టెలతో ఒంటి స్తంభం మేడ కట్టడం, శ్రోతలు పెట్టే ప్రతి పెట్టెకి వెర్రెత్తిపోవడం! ఇంక తట్టుకోలేక ఔత్సాహికుడు పక్కన తోటి రసజ్ఞుడిని కాళ్ళు పట్టుకున్నంత పనిచేసి, ‘అయ్యా! భాషలో కొద్దో గొప్పో పట్టున్నవాడిని, ఈ కవిత్వం ఏమిటో అంతుపట్టకుండా ఉంది. కవిత్వం మాట సరే, అసలు మీరు ఎందుకు ఇంత గంగవెర్రులెత్తిపోతున్నారో చెప్పి పుణ్యం కట్టుకోవల్సినది’ అని ప్రాధేయపడ్డాడు. దానికి తోటి పిపాసి పక్కకు తిరిగి, ‘ఓరి పిచ్చివాడా! అర్థం ఎవరికి అవుతోందయ్యా? ఆ పెట్టెలని ఒక దాని మీద ఒక దాన్ని పేర్చి ఎలా బేలన్స్ చేస్తున్నాడో చూడవయ్యా!’ అని తాపీగా శలవిచ్చాడు.

టోన్ కూడా అంతే…

(ముందు: టోన్ – 2 (ఉరఫ్) అయ్‌బాబోయ్! ఆఫీసరు గారి పెళ్ళాం డేన్స్ చేయకూడదేమిటండీ?)