ఒకనాటి యువ కథ: భంగపాటు

రాగిణి ఒంటరిగా కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తోంది. ఆమె వేడి నిట్టూర్పులకు ఎదురుగా ఉన్న దీపం అటూ ఇటూ ఊగిసలాడుతోంది. ఒక్కొక్క సమయంలో దీపం చాలా చిన్నదయి చీకట్లో కలిసిపోతానని బెదిరిస్తోంది. దీనికి తోడు బైటనుంచి గాలి అలలు అలలుగా వచ్చి కలవరపెట్టేస్తోంది. కళ్ళార్పకుండా ఆమె దీపంవైపే ఆవేశంగా క్షణంపాటు చూసింది. మరుక్షణంలో దీపం పెద్దదయి నిలకడగా నిలబడుతోంది. తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి గాలితో పెనుగులాడుతోంది.

రాగిణి గజగజ వణికిపోతోంది. గుయ్‌మని మోత వినిపిస్తోంది. కీచురాళ్ళ ధ్వని మరీ వింతగా వినిపిస్తోంది. తన యింటిచుట్టూ కాపలాదారుల్లాగా ఎత్తుగా నిలబడ్డ తాటితోపును తలచుకుంటే ఒళ్ళు గలతరించిపోతుంది. భయమేసి ఏడుపు మానేసింది. ఓ క్షణం తాటాకులు గలగలమని మోగుతున్నాయి. గుటకలు వేస్తూ బెదురుగా అటూ ఇటూ చూస్తోంది. ఎవరో వస్తున్నట్లు అలికిడి అయింది. శ్వాస గబగబ పీలుస్తూ కళ్ళు నిలిపేసి భయంగా ప్రాణాలు బిగపెట్టుకుని కూర్చుంది.

“అంబికా!” అంటూ మెల్లిగా స్వరం వినిపించింది.

రాగిణికి ప్రాణం లేచివచ్చినట్లనిపించింది.

“తాతా!” అంటూ గభాలున లేచి ముందుకు అడుగు వేసింది. బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది.

“మళ్ళీ ఏమయింది? అమ్మేదీ? మళ్ళీ కొట్టిందా?” దాసు ఆదుర్దాగా అడుగుతున్నాడు.

“ఊఁ ఊఁ” అంటూ ఏడుస్తూనే ఉంది.

“లేదులే అమ్మా! లేదులే,” అంటూ ఓదారుస్తున్నాడు.

ఇద్దరూ బైటకువచ్చి నిలబడ్డారు. ఆకాశమంతా చుక్కలతో నిండివుంది. చుట్టూ చీకటి ఆవరించుకుని వుంది. గాలి రయ్‌మని వీస్తూ తాటిచెట్లను కూడా ఊపేస్తోంది. చెట్లమధ్యగా మిణుకుమిణుకుమంటూ దీపాలు కనిపిస్తున్నాయి. వాటిని చూస్తూ, “అమ్మో!” అంటూ ఆయన్ను చుట్టేసింది.

“ఏమిటి?”

“అవిగో కొరివిదయ్యాలు!” బెదిరి అనేసింది. పగలల్లా అక్కడా ఇక్కడా తిరిగి, వాళ్ళు చెప్పిన కబుర్లూ వీళ్ళు చెప్పిన మాటలూ మెదడులోకి తెచ్చుకుంటూ హడలిపోతోంది.

“అవి దయ్యాలు కావు, దీపాలు. అక్కడ ఎవరో అన్నం వండుకుంటున్నారు,” దాసు నవ్వుతూ అన్నాడు.

“అవి దయ్యాలే!” బిక్కమొహం వేసుకుని బెరుకుగా అంటోంది.

“నువ్వు ఒట్టి పిరికి పిల్లవు!”

ఆ చిక్కటి చీకట్లోంచి ఓ దీపం ఊగిసలాడుతూ ముందుకు వస్తున్నట్లు కదులుతోంది.

“తాతా! తాతా!” అంటూ ఆయన చాటుకు చేరి ఆయాసపడిపోతోంది. దాసు తలెత్తి తీక్షణంగా చూసి, కొంచం దూరంలో వుండగానే పోల్చుకున్నాడు.

“అదుగో, మీ అమ్మ వస్తోంది లాంతరు పట్టుకుని…” రాగిణిని రెక్క పట్టుకుని ముందుకు లాగాడు.

“ఊ ఊ ఊ,” అంటూ మళ్ళీ సన్నగా ఏడవటం మొదలుపెట్టింది.

“ఎక్కడికెళ్ళావు?” దాసు ప్రశ్నించాడు.

“ఎక్కడికైనా వెళ్ళాలసివస్తుంది! దీనితో ఎంత చావుందనుకున్నావేమిటీ? నాయనతోపాటు ఇది కూడా పోయినా పీడ విరగడయిపోయేది! నా మాట దక్కించేటట్లు కనబడటంలేదు. అసలు అప్పుడే ఆ ఆసుపత్రిలోనే వదిలేసి వచ్చినా ఏ పీడ వుండేది కాదు.” అంబిక అక్కసుగా అన్నది.

దాసు తనలో తాను నవ్వుకున్నాడు.

అంబిక గభాలున లోపలికి వెళ్ళిపోయింది.

“ఏంచేశావమ్మా? చెప్పు నాతో. ఏడవక!” దాసు రాగిణిని బ్రతిమాలుతున్నాడు. రాగిణి ఏమీ సమాధానం చెప్పటంలేదు.

“చెప్పుమరి! అమ్మెందుకు కొట్టింది?”

“ఎప్పుడూ నేను దొంగతనం చెయ్యను తాతా!” హడలిపోతూ అన్నది.

“ఇట్లా ఎన్నిసార్లు చెప్పిందీ మళ్ళీ ఎన్నిసార్లు చేసిందీ!” లోపల్నుంచి చివాలున అంబిక వచ్చేసింది.

“నిన్ను చూసి భయపడిపోతోంది.”

“ఇప్పుడెందుకు భయం! తప్పుడు పని చేసేటప్పుడు భయం ఉండాలిగానీ… రావే లోపలికి,” కసురుకుంది.

“పో! వెళ్ళు. అన్నం తిను. నిజం చెప్పటం నేర్చుకోవాలి. దొంగతనం ఎంత తప్పో అబద్ధాలు చెప్పటం కూడా అంతే తప్పు. ఏదో కారణంగా దెబ్బలు తింటూనే ఉన్నావు! పద… లోపలికి పద. అమ్మ కొట్టదులే ఇంక.”

“అదంతా భయమే! నేనంటే భయమున్నదయితే మళ్ళీ ఎత్తుకొస్తుందీ?”

“దాన్నేమనక యింక. అసలే భయపడిపోతోంది.” దాసు మెల్లిగా చీకట్లను చీల్చుకుంటూ సాగిపోయాడు.

ఉలిక్కిపడుతూ, బెరుకు బెరుకుగా ఒక్కొక్క అడుగువేస్తూ లోపలికి వెళ్ళి కూర్చుంది.

అంబిక చివాలున లేచి ముందుకు వచ్చింది.

“అమ్మా! ఆకలయిందే… అందుకని ఏమన్నా కొనుక్కుని తిందామని…” తత్తరబిత్తరగా మాటలు గుటకలు వేస్తూ అన్నది రాగిణి.

“ఆకలయిందని పరాయివాళ్ళింట్లో డబ్బులెత్తుకొస్తారా! కాస్త ఆగుతే నేను రాకపోయానా…” ఓ కంచం ముందర పడేసింది, యింత అన్నంపెట్టి.

రాగిణి శరీరం వణుకుతోంది. ఉక్కిరిబిక్కిరయి కూర్చుంది.

“తినవేఁ? అల్లా చూస్తావు!” కళ్ళురిమింది అంబిక.

రాగిణి బిత్తరపోయి తల్లి మొహంలోకి చూస్తోంది.

“నిన్నే! అన్నం తిను. ఆకలి కావటం లేదా ఏమిటి?” కూతురు చెయ్యి పట్టుకుంది. చప్పున తలెత్తి, రాగిణి మొహంలోకి చూసింది. నుదురుమీద చెయ్యిపెట్టింది. వెచ్చగా తగిలింది. గుండె గుభేలుమంది. గభాల్న ఒళ్ళోకి తీసుకుంది. కాగిపోతోంది శరీరం.

“అమ్మా! దాహం, దాహం…” అంటూ పడుకుంది. తెగ ఆయాసపడిపోతోంది. అంబిక తత్తరలాడిపోతోంది. అంతా నిర్మానుష్యంగా ఉంది. పిలుస్తే ఎవ్వరూ పలికేటట్టులేరు.

“అమ్మాయీ, అమ్మాయీ!” అంటూ రెండుసార్లు పిలిచింది.

“ఊ… ఊ…” అంటూ మూలుగుతోంది.

ఆ రాత్రిపూట ఎక్కడికీ వెళ్ళేటట్లు కనబడటంలేదు. అంతా దైవంమీద భారంవేసి గృహవైద్యం ఏదో చేసింది.

తనకు నిజంగా కోపం వస్తే ఒళ్ళూపై తెలీదు. చిన్నపిల్ల తెలిసో తెలీకో చేసిన పనికి తాను అంత పట్టుదల పట్టి చావబాదింది. అసలు ఆ దెబ్బతోనే దడుచుకుని పోయింది. గుండెల్లో అధైర్యం ఏర్పడిపోయింది. జ్వరం వచ్చేసింది.

అంబికకు కంటిమీద కునుకు లేదు. ఏమిట్రా భగవంతుడా అని ప్రార్థిస్తూ కూర్చుంది.

తెల్లారిన తర్వాత కూడా రాగిణి అట్లాగే మూలుగుతూ ఉంది. దాసు దగ్గరకు వెళదామంటే మనస్సొప్పటంలేదు. తనను ఏమన్నా అంటాడేమోనని అభిమానంతోనే ఉండిపోయింది. డాక్టరు వచ్చి చూసిపోయాడు. ఫీజు క్రింద మూడు రూపాయలు చెల్లించుకుంది. నోటు మారిస్తే ఇంకా రెండు రూపాయలే మిగిలినాయి. మందు వ్రాసి ఇచ్చాడు కొనుక్కుని రమ్మనమని. ఆదుర్దాగా బజారు వెళ్ళి కనుక్కుంటే, నాలుగున్నర చెప్పాడు. అలాంటివి మూడు ఇవ్వాలిట కూడాను. అంబిక కంగారుపడిపోయింది. ‘ఎట్లాగు?’ అని గాభరా పడిపోతోంది.

‘మామూలు మందులకయితే ఈ జ్వరం లొంగదు. ఆ క్యాప్సుల్స్ వాడాల్సిందే.’ అని డాక్టరు ఖచ్చితంగా చెప్పి మరీ వెళ్ళాడు.

పిచ్చి ఎత్తినదానిలాగా అటూ ఇటూ తిరుగుతోంది. మూడు మూన్నాళ్ళకు వచ్చి యోగక్షేమాలు కనుక్కుని వెళ్ళే దాసు కూడా యీ మధ్య యీ ఛాయలకే రావటం లేదు. అంతా అయోమయంగా ఉంది.

దీపాలు పెట్టేశారు. రాగిణిని మెల్లిగా లేవదీసి కూర్చోపెట్టింది. వెర్రిగా ఆలోచిస్తోంది. ఆసుపత్రికే తీసుకువెళ్ళి, డాక్టరుకే అప్పచెప్పేసి ఆయన కాళ్ళమీద పడి ప్రార్థిద్దామనుకుంది. వాకిట్లో రిక్షాను ఆపి, తాను కూర్చుని కూతుర్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుంది. గబగబ ఆసుపత్రి వైపుకు వెళ్లుతున్నారు.

తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి డాక్టరుగారు లేడు. కూతుర్ని బల్ల మీద పడుకోబెట్టింది. చైతన్యరహితంగా క్షణకాలం నిలబడిపోయింది.

“ఆయనిప్పుడు రాడు. అయినా ఆయన రావటం ఎందుకు? మొన్న రాసి ఇచ్చిన మందు వాడావా?” అని నర్సు అడుగుతూనే ఇంకో గదిలోకి వెళ్ళిపోయింది.

అంబిక మొద్దుబారిపోయింది. కూతురు వైపుకు ఆవేదనగా చూసింది. రొప్పుతోంది. తెగ బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. తన కడుపు తరుక్కుపోతోంది. కూతురు ఏమవుతుందో అని హడలిపోతోంది.

అటూ యిటూ చూసింది. వింత ఆలోచన క్షణంలో బుర్రలోకి వచ్చి దూరింది. బాగా ఆయాసపడిపోతోంది. గుటకలు వేస్తూ నిశ్శబ్దంగా డ్రాయరు దగ్గరకు వచ్చి, తలుపు మెల్లిగా తెరిచింది. చిల్లర అక్కడా అక్కడా విరజిమ్మి వుంది. కాస్త మూలగా కొత్త నోట్లు కళ్ళు జిగేలుమన్నట్లు కనపడ్డాయి.

గుండె ఝల్లుమంది. మళ్ళీ అటూ యిటూ బిత్తరపోయి చూసింది. చప్పున చేతిని డ్రాయరులోకి పోనిచ్చి, గుప్పెటితో చిక్కిన నోట్లను తీసుకుని, గభాలున చీరె కొంగులో చుట్టేసుకుంది.

ఒళ్ళు జలజలలాడిపోతోంది. ముచ్చెమట్లు పోసినాయి. కళ్ళు గిర్రున తిరిగినాయి. చేతులూ కాళ్ళూ వణికిపోతున్నాయి. ఒక్క క్షణం కూడా నిటారుగా నిలబడలేకపోతోంది. టేబుల్ ఆసరాతో మెల్లిగా వచ్చి కూతురు దగ్గర నిలబడింది.

రాగిణి రెండు కళ్ళూ నిలిపేసి తల్లి మొహంలోకి వింతగా చూసింది. అంబిక గుండె గుభేలుమంది. హృదయ చలనం ఆగిపోయినట్లనిపించింది. కొయ్యబారిపోయి నిలబడిపోయింది.

రాగిణి పెదిమలు కదిలిస్తూ ఏదో చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది. తల్లిని చూసి పేలవంగా పళ్ళు బైటపెట్టింది.

“అమ్మా! నా మందుకేనా? తీసుకురా, తాతతో చెప్పన్లే.” రాగిణి అమాంతం తల్లిని చుట్టేసుకుంది.