విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు

సత్యనారాయణ భావాలూ అభిప్రాయాలతో సంబంధం లేకుండా, కొన్నిసార్లు దుర్మార్గంగా కూడా ఉండే విమర్శలతో నిమిత్తం లేకుండా, ఆయన పుస్తకాలు అమ్ముడు పోయేవి. పుస్తకాల మీద వచ్చే ఆదాయం మీద చాలా భాగం ఆధారపడి జీవించిన తెలుగు రచయిత, బహుశా ఆయన ఒకరేనేమో. నిజానికి, అప్పటికి పుస్తకాల అమ్మకపు వ్యవస్థ పూర్తిస్థాయిలో నెలకొనలేదు. ప్రచురణ ఇంకా ఒక పరిశ్రమగా ఏర్పడని రోజులు అవి.

తన పుస్తకాలను తానే ముద్రించుకొనేవారు. కొందరు మధ్యతరగతి వారు కవి పండితులను సన్మానించే దాతలుగా జమిందారీ సంప్రదాయాన్ని కొనసాగించేవారు. అటువంటివారి నుంచి సత్యనారాయణకు సహాయం అందుతుండేది. పుస్తకాలను అంకితం తీసుకున్నవారు ముద్రణ ఖర్చులు భరించేవారు. ఆ దాతలనూ వారి కుటుంబాలనూ స్తుతిస్తూ పూర్వకవుల పద్ధతిలో[19] సత్యనారాయణ పద్యాలు రాసేవారు. అవి ఆ పుస్తకాల మొదటి పుటలో ముద్రించబడుతుండేవి. కాని ఆ దాతలను తాను చేయి చాచి అడుగుతున్నట్లుగా ఆ పద్యాలధోరణి ఉండేది కాదు. తాను ఎత్తున నిలబడి వారిని ఆశీర్వదిస్తున్నట్లుగానే సత్యనారాయణ భావించుకొనేవారు. కొన్ని గ్రంథాలను ప్రేమ కొద్దీ మిత్రులకు అంకితమిచ్చేవారు. అటువంటప్పుడు చెప్పిన పద్యాలు చమత్కారంగా ఉండేవి. చాలా పద్యాలు నిలిచిపోయాయి. గొప్ప చరిత్ర పరిశోధకుడైన మల్లంపల్లి సోమశేఖర శర్మ గురించి చెప్పిన పద్యాలు ప్రసిద్ధమైనవి. ‘డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకు రాని యీ పాడు కాలాన బుట్టి’ అన్న వాక్యం వాటిలో ఒక పద్యం లోది. సోమశేఖర శర్మ ఎన్నో శిలాశాసనాలనూ రాగిరేకులనూ బహుశ్రమతో పరిశీలించి వాటిలోని సమాచారాన్ని నిగ్గు తేల్చినవారు. ఎందరో ఆంధ్రరాజుల చరిత్రలను ఆయన బయటికి తెచ్చారు. ఆ రంగంలో ఎందరికో మార్గదర్శకులు కాగల కృషి చేసి ఉన్నా కూడా ఏ విశ్వవిద్యాలయమూ ఆయనను బోధకుడుగా తీసుకోలేదు. శర్మకు చరిత్రలో పట్టా లేకపోవటమే దానికి కారణం. ఆ విషయం అప్పటి ఆంధ్రులందరికీ తెలిసినదే. సత్యనారాయణ మాటలు, ఇటువంటి వాక్యాలు, ఇంకా చాలా వ్యాప్తి లోకి వచ్చి సందర్భోచితంగా ఉదాహరించబడేవి. చాటు పద్యాల సంప్రదాయం ఆ విధంగా కొనసాగినట్లయింది.

వ్యక్తిగతం

ఆయనతో 1950ల నుంచీ నాకు పరిచయం ఉంది. అప్పట్లో చదువుకు కొంత విరామం ఇచ్చి ఉన్నాను. ఏవో చిన్నా చితక ఉద్యోగాలు చేస్తూ, ఆసక్తిగా అనిపించినదాన్నల్లా చదువుతూ ఉండేవాడిని. కవులతోనూ పండితులతోనూ గోష్ఠులలో పాల్గొనేవాడిని. ఆ కాలంలో సత్యనారాయణను చాలాసార్లు కలుసుకున్నాను. ఆయన ఉండే విజయవాడ నేను ఉంటున్న ఏలూరికి నలభై మైళ్ళ దూరంలో ఉండటం ఒక కారణం. ఆయన బాగా దగ్గరకు చేరనిచ్చేవారు. అది ఇంకొక కారణం. మార్క్సిస్ట్ సాహిత్య సిద్ధాంతాలతో నేను తీవ్రంగా ప్రభావితుడినై ఉన్న కాలం అది. శ్రీశ్రీకి గొప్ప అభిమానిని. మా తరంలో చాలామందిమి శ్రీశ్రీ విప్లవ కవిత్వంతో ప్రేరేపించబడిన వారమే. నాకు స్నేహితులూ పరిచయస్తులూ అయిన చాలా మందికి తెలుగు లోని ప్రాచీన సాహిత్యంతో పరిచయమే లేదు. అందువల్ల సత్యనారాయణను చేర్చుకొనే ప్రసక్తే ఉండేది కాదు. మార్క్స్, మావోల రచనలు చదువుతూ చర్చిస్తూ కాలం గడిపేవాళ్ళం. సార్త్ర, కాఫ్కా, హైన్, పిరాండెల్లో, ఉనామునో వంటి ఫ్రెంచ్, జర్మన్ కవులనూ రచయితలనూ చదివి ముచ్చటించుకోవటం మాకు బాగుండేది. సత్యనారాయణ పట్ల నా అభిరుచి నా స్నేహితులకు వింతగా ఉండేది. నాకోసం భరించేవారు. ఆయన పద్యాలను నేను పైకి చదివినప్పుడు వారికేమీ అర్థం కాకపోయినా కొన్నిసార్లు ఆస్వాదించగలిగేవారు. ఆ కవిత్వంలో ఏదో విశేషం ఉందని ఒప్పుకునేవారు. మరొక సాహిత్య బృందమూ ఉండేది నాకు. వాళ్ళు కొంత వయసు మీరినవారు, తెలుగునూ సంస్కృతాన్నీ మాత్రమే చదువుకుని ఆంగ్ల భాషతో బొత్తిగా పరిచయం లేకుండినవారు. ఒకదానికొకటి సంబంధం లేని, ఒకదాన్ని ఇంకొకటి పట్టించుకోని రెండు ప్రపంచాలలో అలా నేను జీవిస్తుండేవాడిని. ఆధునికులైన నా మిత్రులు సత్యనారాయణను కొంచెమైనా భరించగలిగేవారు కాని, అటువంటి తిరోగమన కవిత్వాన్ని నేనెందుకు చదువుతానో నా మార్క్సిస్ట్ స్నేహితులకు అర్థమయేది కాదు. ఆ మార్క్సిస్ట్ కవుల కవిత్వాన్ని నేను మెచ్చుకోవటం పండితులైనవారు లెక్క చేసేవారు కాదు. వారి దృష్టిలో అది కవిత్వమే కాదు. నేను మాత్రం సత్యనారాయణను చదువుతూనే వచ్చాను. ఏళ్ళు గడిచే కొద్దీ ఆయన సాహిత్యం ఇంకొంత లోతుగా అర్థమవుతూ వచ్చింది. రాజకీయం గానూ సామాజికం గానూ సత్యనారాయణ అభిప్రాయాలతో నేను ఏకీభవించకపోయినా అది సాధ్యమైంది. ఒక సందర్భంలో నేనూ ఆయనా ఒకే బహిరంగ వేదిక పైన మాట్లాడటం తటస్థించింది. ఆయన యథాప్రకారంగా పూర్వ కవులనూ ఋషులనూ సమర్థించారు. నేను నా కుర్రతనపు ఉత్సుకత కొద్దీ మార్క్సిస్ట్ కవులనూ వారి విప్లవసాహిత్యాన్ని గట్టిగా సమర్థిస్తూ మాట్లాడాను. ఆయన పట్ల నా గౌరవం ఏమాత్రమూ తగ్గలేదు. తక్కినవారంతా ఆయనలోని సంప్రదాయవాదిని చూస్తే నేను మాత్రం ఒక ఆధునిక కవినే చూస్తూ వచ్చాను.

అమెరికాకు వెళ్ళాక కూడా ఆయనను చాలా సార్లు కలుసుకున్నాను. ఆయన సాహిత్యంలో కొంత భాగాన్ని ఆంగ్లం లోకి అనువదిస్తానని అడిగాను. ఆయన సంతోషంగా ప్రోత్సహించారు. 1976లో ఆయన మరణించే లోపు ఏమీ చేయలేకపోవటం నాకొక వైఫల్యం. 2002లో డేవిడ్ షూల్మన్‌తో కలిసి నేను ప్రచురించిన ఇరవైయవ శతాబ్దపు తెలుగు కవిత్వం సంపుటంలో సత్యనారాయణవి కొన్ని పద్యాలను అనువదించి చేర్చగలిగాను. ఆయన పట్ల నాకున్న అవగాహన లోనూ ఆదరం లోనూ షూల్మన్ కూడా భాగం తీసుకున్నాడు[20].

ఈ సంపుటిలో రెండు నవలికలు ఉన్నాయి: హా హా హూ హూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు. వీటి రచనా కాలం నిశ్చయంగా తెలియదు. ఆయన సాహిత్యపు పట్టికను క్రోడీకరించినవారు హా హా హూ హూ 1932లో రచించబడిందని అంటారు. సత్యనారాయణ కుమారుడు 1952లో అని చెప్తారు. విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు 1961లో పుస్తకరూపంలో వచ్చింది. కాని అంతకు చాలా ముందే కృష్ణాపత్రికలో[21] ధారావాహికంగా వచ్చింది. ఆ తేదీలు స్పష్టంగా తెలియవు. ఇది సత్యనారాయణను పరిచయం చేసే ఒక వినమ్రమైన ప్రయత్నం. బహుశా కాలాతీతం కూడా అయిందేమో. ఇది చదివినాక ఇంగ్లీష్ చదివే పాఠకులకు ఆయన రచనలను ఇంకొంత దగ్గరగా పరిశీలించాలనిపిస్తే నా ప్రయత్నం కొంత నెరవేరినట్లే.

హా హా హూ హూ

హిందూ పురాణాలలో కనిపించే మానవాతీత జాతులలో ఒకటి గంధర్వజాతి. ఇది ఒక గంధర్వుడి కథ. గంధర్వులు అర్థదివ్యులు. వాళ్ళకి గుర్రం తలా మనిషి శరీరమూ రెక్కలూ ఉంటాయి. ఆకాశంలో ఎగురుతూ ఆ గంధర్వుడు స్పృహ తప్పి లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో పడిపోతాడు. అదేదో వింత జంతువు అనుకొని చుట్టూ జనం మూగుతారు. అది ఏమిటై ఉంటుందా అని తర్కించుకుంటారు. ఆ తర్వాత రక్షక భటులు వచ్చి, గంధర్వుడు ఎవరికీ హాని చేయకుండా చుట్టూ ఒక బోను నిర్మిస్తారు. గంధర్వుడు మేలుకొని ప్రాకృతంలో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అంతు పట్టదు. దగ్గరగా వింటే మాటలు విడివిడిగా తెలియక కేవలం పెద్ద ధ్వని లాగా వినిపిస్తుంది. లండన్ విశ్వవిద్యాలయం లోని సంస్కృత పండితులు దూరం నుంచి విని ఆ భాష సంస్కృతానికి దగ్గరగా ఉన్నదని కనిపెడతారు. వాళ్ళు ఆయనని సంస్కృతంలో ‘ఏమిటి అంటున్నావు?’ అని ప్రశ్నిస్తారు. గంధర్వుడు స్వచ్ఛమైన సంస్కృతంలో ‘అత్ర సమీపే అస్తి వా కచ్చిన్నదీ — స్నాతుమిచ్ఛామి.’ (దగ్గరలో ఏదైనా నది ఉన్నదా? స్నానం చేయగోరుతున్నాను) అని సమాధానం ఇస్తాడు.

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు

ఈ రెండవ నవలలో కూడా మంచి కల్పనా చాతుర్యం ఉంటుంది. పదమూడవ శతాబ్దంలో మహాభారతాన్ని పదిహేను పర్వాలు తెలుగు చేసిన తిక్కన, రాజకుమారులకు జంతువుల కథల ద్వారా రాజనీతిని నేర్పిన విష్ణుశర్మ – కోస్తా ఆంధ్ర రాష్ట్రం లోని విజయవాడలో ఒక తెలుగు ఉపన్యాసకుడి కలలోకి వచ్చి ఇంగ్లీష్ నేర్పమని అడుగుతారు. దేవతలకు రాజూ స్వర్గానికి అధిపతీ అయిన ఇంద్రుడు వాళ్ళని పంపించినట్లు చెబుతారు. మళ్ళీ మళ్ళీ వచ్చే కలలలో కథ జరుగుతూ ఉంటుంది. బోధకుడికీ విద్యార్థులకీ మధ్యన సంభాషణలు ఉల్లాసంగా నడుస్తాయి. ముగింపు అనూహ్యంగా ఉంటుంది.

అనువాదం గురించి

సత్యనారాయణ చాలా అరుదుగా మాత్రమే చేతితో రాసేవారు. దాదాపు అన్ని నవలలనూ నోటి చెబుతూండగా లేఖకులు రాసేవారు. తరచుగా చాలా చిన్న వాక్యాలను చెప్పేవారు. హఠాత్తుగా ఆపేసినట్లు అనిపిస్తుంది. మధ్య మధ్యలో సుదీర్ఘమైన సంస్కృత సమాసాలు ఉంటాయి. కానీ ఈ రెండు నవలలో భాష సరళంగా ఉంటుంది. పెద్ద పెద్ద సంస్కృత పదాలూ తక్కువే. మొదటి నవల హా హా హూ హూలో శైలి సాఫీగా సాగుతుంది. వాక్యనిర్మాణమూ పేరాలను విడగొట్టటమూ అక్కడక్కడా సరిగ్గా లేదనిపిస్తుంది కానీ ఆ రెండు ఇబ్బందులకూ ముద్రణా దోషాలు కూడా కారణం అయి ఉండవచ్చు. విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు దగ్గరికి వచ్చేసరికి సత్యనారాయణకు కొంత అజాగ్రత్త వచ్చింది. ఒకేసారి పది పన్నెండు నవలలను, వంతులవారీగా పనిచేసే లేఖకులకు చెబుతూ వచ్చారు. తన ఇష్టానుసారం వాక్యాలు చెప్పుకుపోతుండేవారు. లేఖకులు ఏమి రాశారో గమనించి సరిచేయటం ఉండేది కాదు. ఉన్నవి ఉన్నట్లు గానే ఆ రాత ప్రతులు ముద్రణశాలలకు వెళ్ళేవి. ఎవరూ వాటిని పరిష్కరించి సవరించటం గానీ అచ్చయిన చిత్తు ప్రతిని దిద్దటం గానీ జరిగేవి కావు. ఒక్కొక్కసారి పేరాగ్రాఫులు పేజీల కొద్దీ సాగి కనబడతాయి. లేఖకుడికి కొత్త పేరా మొదలు పెట్టమని చెప్పి ఉండకపోవటం కారణమై ఉండచ్చు. విరామచిహ్నాలు ఒక క్రమపద్ధతిలో ఉండవు, వర్ణక్రమం అతి స్వతంత్రంగా ఉంటుంది. ఆ లేఖకుల గురించీ రాయటంలో వారి అలవాట్ల గురించీ సంపూర్ణమైన సమాచారం లభించటం లేదు. అందువల్ల ఆ వర్ణక్రమాన్ని రచయిత ఉద్దేశించారా లేక లేఖకులు అలా రాశారా అనే విషయం ఇదమిద్ధంగా తెలియదు.

నేను వీటిని మౌఖిక నవలలు అని అంటాను. రాసిన నవలలకూ వీటికీ ఒకే రకమైన అనుశాసన సూత్రాలు వర్తించవు. వాటిలో ఉన్న ఆ ప్రత్యేక లక్షణాన్ని నా అనువాదం లోకి తీసుకురావాలని ప్రయత్నించాను. కాకపోతే నా అనువాదాలలోకి ఎంతో కొంతగా రాత నవలల పద్ధతి వచ్చి తీరుతుంది. ఎందుకంటే నేను వీటిని స్వయంగా రాస్తున్నాను, ఎవరికీ చెప్పి రాయించటం లేదు.

ఇరవైయవ శతాబ్దపు తొలి దశాబ్దాలలో, ఏ మాండలిక భాషలో రాయాలనే సంగతి మీద వేడివేడిగా వాదోపవాదాలు జరిగేవి. అప్పటివరకూ తెలుగు సాహిత్యం ఇంచుమించు పూర్తిగా పద్యరూపం లోనే ఉండేది. వాటికి ఛందస్సు నియమాలు ఖచ్చితంగా వర్తించేవి. ఏ విధమైన మార్పులూ చేర్పులూ అంగీకరించబడేవి కావు. ఛందస్సు, ప్రాస నియమాలు, పదాల పొందిక – ఇవి ఉన్న పద్ధతులలో ఏదో ఒక విధంగా మాత్రమే ఉండి తీరాలి కనుక కావ్యభాష అమిశ్రితంగానే ఉంటూ వచ్చింది. తొమ్మిది వందల ఏళ్ళ పాటు అలాగే జరగటం ఏ భాషాచరిత్ర లోనైనా పెద్ద విశేషం. సంస్కృతాన్ని మాట్లాడటం మానివేసిన వేయి ఏళ్ళ వరకూ అది కావ్యభాష గానే నిలిచి ఉండిన తీరు కూడా తెలుగును ప్రభావితం చేసి ఉండచ్చు. రకరకాల మాండలికాలు మాట్లాడే భాషలో ఉన్నా రాసే భాష ఒకటిగానే ఉండిపోయింది.

పందొమ్మిదవ శతాబ్దంలో అచ్చు యంత్రం కనిపెట్టబడటంతో వచనానికి అవసరం ఎక్కువైంది. ఈస్టిండియా కంపెనీ కొలువులో ఉండిన తెలుగు పండితుడు పరవస్తు చిన్నయ సూరి తెలుగు భాషకు వ్యాకరణాన్ని రాశారు. సంస్కృతంలో ఉన్న గొప్ప నిర్ణాయిక వ్యాకరణాలను అనుసరిస్తూనే ఆ తెలుగు వ్యాకరణం ఏర్పడింది. తొమ్మిది వందల ఏళ్ళుగా తెలుగు కావ్యాలలో ఉపయోగించిన భాషనంతటినీ చిన్నయ సూరి తన వ్యాకరణం లోకి చేర్చారు. అదే వ్యాకరణం వచనానికి కూడా వర్తిస్తుందని ఆయన భావించారు. కానీ అన్ని వందల ఏళ్ళ నుంచీ వ్యాఖ్యానాలలోనూ వ్యాపారపు లావాదేవీల లోనూ వాడుతుండిన వచనం ఒకటి ఉంది. దాన్ని చిన్నయ సూరి విస్మరించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులే తెలుగు భాషాబోధనను పర్యవేక్షించేవారు కనుక చిన్నయసూరి వ్యాకరణాన్నే వారు పాఠశాలలలో ప్రవేశ పెట్టారు. కానీ వాక్య నిర్మాణం లోనూ వర్ణక్రమం లోనూ విద్యావంతులు మాట్లాడే భాష వ్యాకరణంలో లాగా కాక పూర్తిగా వేరేగా ఉండేది. ఆ రెండూ వేరు వేరు భాషలని అనిపించేంత అంతరం వాటి మధ్య కనిపించేది. విద్యార్థీ విద్యార్థినులు తాము అప్పటివరకూ రాస్తుండిన భాషను వ్యాకరణ విరుద్ధమైనదని వదిలిపెట్టి, చిన్నయ సూరి వ్యాకరణం లోని సూత్రాలకు లోబడి ఉండే కొత్త భాషను నేర్చుకోవలసి వచ్చింది.

ఆధునిక విద్యావేత్త గిడుగు రామమూర్తి (1863-1940) ఆ రాత భాషను మార్చి తీరాలని తీవ్రంగా ఉద్యమించారు. చిన్నయ సూరి వ్యాకరణం లోని భాషను ఆయన గ్రాంథిక భాష అన్నారు. విద్యావంతులు మాట్లాడే వ్యావహారిక భాషకే (శిష్ట వ్యావహారికం) మద్దతు ఇవ్వాలని ఆయన ప్రకటించారు.

ఆయన వాదంలో చాలా సబబు ఉంది. ఎప్పుడో రాసి ఉన్న కావ్యాల లోని భాషను ఇప్పుడు రాస్తున్న వచనానికి ఉపయోగించమనటం కృత్రిమంగా తోచింది. అయితే, చిన్నయ సూరి వ్యాకరణాన్ని గిడుగు రామమూర్తి తిరస్కరించటం, అసలు వ్యాకరణమే అవసరం లేదని అర్థం చేసుకోబడింది. ఏ నియమాలూ లేకుండా ఎలా మాట్లాడితే అలాగే రాయవచ్చుననే అభిప్రాయం ఏర్పడింది. తెలుగు సాహిత్య ప్రపంచం రెండు వర్గాలుగా చీలింది. చిన్నయ సూరి వ్యాకరణాన్ని సమర్థించే సంప్రదాయవాదులు, ఆ నియమాలు భాషా స్వేచ్ఛను హరించి వేస్తాయనే ఆధునికులు – వీరి మధ్యన ఎడ తెగని వివాదాలు భీషణంగా కొనసాగినాయి. ఆ వివాదాలలో భావస్పష్టత లేకపోవటం దురదృష్టం.

అంత గొప్ప పండితుడైన గిడుగు రామమూర్తి తాను సమర్థించే శిష్ట వ్యావహారికానికి వేరే నియమ నిబంధనలు కావాలని చెప్పలేకపోయారు. అసలు ఆ శిష్ట వ్యావహారిక భాషాస్వరూపాన్ని ఆయన సమగ్రంగా నిర్వచించనూ లేకపోయారు. ఫలితంగా ఎలా మాట్లాడితే అలాగే రాయవచ్చుననే కల్లోలపు పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలో ఎక్కడా కూడా మాట్లాడే భాషను యథాతథంగా రాయరని, రాత భాషకి ఉండే నియమాలు కాలానుగుణంగా మారుతూ వస్తాయి గాని అసలు లేకుండా పోవని, ఆ అయోమయంలో ఎవరికీ బోధపడలేదు.

సత్యనారాయణ ఈ విషయంలో సంప్రదాయవాదుల వైపే ఉన్నారు. ఆయన రాసేది ఎక్కువ భాగం కవిత్వమే కనుక ఆ దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. విచిత్రమేమిటంటే, సమకాలీన పరిస్థితులను చిత్రించే నవలలలో కూడా ఆయన అదే భాషను ఉపయోగించేవారు. అయితే, నవలను చెప్పి రాయించేవారు కనుక రాను రాను వ్యావహారిక భాష లోని ప్రయోగాలు వాటిలోకి అప్రయత్నంగా వచ్చేసేవి. ఆయన చివరి నవలలలో పాత కొత్త భాషల ప్రయోగాలు పరస్పర విరుద్ధంగా కలబోసుకొని ఉంటాయి. వర్ణక్రమం అనేక విధాలుగా – అటు సాంప్రదాయిక వ్యాకరణాన్ని గాని, ఇటు మాట్లాడే భాషను గాని అనుసరించకుండా ఉంటుంది. అయినా కూడా ఆయన వాక్యనిర్మాణం సంభాషణాశైలి లోకి అద్భుతంగా ఒదుగుతుంది. భావ వ్యక్తీకరణ లోనూ ఆయన వాక్యాలు అతి ప్రబలమైనవి. కాలదోషం పట్టిన వ్యాకరణాన్ని అనుసరించ పూనుకోవటం ఆయన సృజనశక్తిని అడ్డుకోలేకపోయింది. ఆఖరికి జరిగినదేమంటే, తనదే అయిన ఒక వినూత్న భాషతో విలక్షణమైన వాతావరణమొకటి ఆయన నవలలలో విస్తరించింది. ఆ వచనపు శైలి ఆయన ముద్రగా నిలబడిపోయింది.

నవలలను చెప్పి రాయించటం ఇంకొన్ని సమస్యలను కూడా తెచ్చి పెట్టింది. చెబుతూ ఉన్న విషయాన్ని వదిలి వేరే వైపుకి ఆయన వాగ్ధార వెళ్ళిపోయేది. అది కొన్నిసార్లు చాలాదూరమే వెళ్ళిపోయి ఆ సమయంలో తను అనుకుంటున్నవన్నీ పాత్రల మధ్య సుదీర్ఘ సంభాషణలు గానో, ఆ సందర్భానికి రచయిత చేసే విస్తృత వ్యాఖ్యానం గానో, నవల లోకి వచ్చి పడేవి. ఈ అప్రస్తుత సంభాషణలు, వ్యాఖ్యానాలు కూడా ఆయన నవలలకు ఒక ఆకర్షణని తెచ్చిపెట్టాయి. వాటిని చాలా ఇష్టంగా చదువుకొనే అభిమానులూ ఉన్నారు.

హా హా హూ హూలో అటువంటివి తక్కువ. దాన్ని అనువదించటంలో నేను దాదాపు పూర్తిగా మూలవిధేయంగానే ఉన్నాను. కాని విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు విషయంలో కొంత స్వేచ్ఛను అవలంబించాను. ఆ నవలను చెబుతూన్న కాలంలో రచయిత బుద్ధి ఏయే విధాల ప్రసరించిందో తెలుసుకొనే ఆసక్తి ఉన్న విమర్శకులకు పర్వాలేదు గానీ అదంతా తెలుగు రాని పాఠకుడికి శ్రమగా ఉంటుంది. నిజానికి తెలుగు పాఠకుడికి కూడా శ్రమే అవుతుందేమో. అంతే కాకుండా, స్థానికమైన విషయాల ప్రస్తావనను ఉన్నది ఉన్నట్లుగా అనువదిస్తే అనంతమైన సంఖ్యలో పదసూచికలను ఇవ్వవలసి వస్తుంది. ఈ నవలికను నేను కొంతవరకు క్లుప్తీకరించాను. అప్రస్తుత వ్యాఖ్యానాలను అనువదించలేదు. కొన్ని చోట్ల యథాతథంగా కాక భావానువాదాన్ని మాత్రమే చేశాను. ఇలా చేయటం వల్ల నవలకు ఉన్న మౌఖిక స్వరూపం మారిపోవచ్చునని నాకు తెలుసు. అయితే పూర్తిగా రాత నవలే అయిపోకుండా కొంతయినా మౌఖికంగా అనిపిస్తుందని ఆశిస్తున్నాను. చేసిన మార్పులను చిన్నవి గానూ నవల సమగ్రతను దెబ్బతీయనివి గానూ ఉండేలాగా జాగ్రత్త వహించాను. నవలిక లోని ప్రాథమిక శిల్పాన్ని భంగపరచలేదు. కలల క్రమాన్నీ వివరాన్ని శ్రద్ధగా భద్రపరచాను.

[ఈ వ్యాసంలో ఉదాహరించిన గ్రంథసూచి.]