విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు

సత్యనారాయణను వైదిక సంస్కృతీ సంరక్షకుడిగా, మార్పుకు వ్యతిరేకిగా, వెనకకు చూసేవాడిగా మూసపోశారు. సమకాలికుడైన మార్క్సిస్ట్ విప్లవకవి శ్రీశ్రీ ‘విశ్వనాథ వారు వెనక్కి వెనక్కి నడవగా వేదకాలం ఇంకా వెనక్కి వెళ్ళింది’ అని వ్యంగ్యంగా రాశాడు. సమకాలికుడు, కవి రచయిత, అయిన తెన్నేటి సూరి ఒక అపహాస్యనాటికను రచించాడు. అందులో సత్యనాయణను ఉద్దేశించిన పాత్ర చేతిలో కలానికి బదులుగా కత్తి పట్టుకొని ఝళిపిస్తూ సత్యనారాయణ రాసిన పద్యాన్నే వల్లిస్తూ రంగం మీదికి వస్తుంది. ఆ పద్యం వేనరాజు అన్న పౌరాణిక నాటకం లోది. కథానాయకుడైన పృథు మహారాజు, వేనరాజు చేస్తున్న వేదధర్మ విరుద్ధమైన పరిపాలనను ఖండిస్తూ ఆ పద్యాన్ని పాడుతూ రంగప్రవేశం చేస్తాడు. సూరి రాసిన నాటికలో అది సత్యనారాయణ పెట్టే పెడబొబ్బ అయింది. నోరు తిరగని సంస్కృత పదాలతో నిండి, చదువుతుంటే ఊపిరందనీయని ఆ పద్యం ఇది –

అతి మనోబుద్ధ్యహంకృతుల్ ఔపనిషదు
లాత్త గండూషితత్రయు లౌర్వ వహ్ని
గర్భితాంతః తపస్కులు ఘనులు ఋషుల
కెవ్వడు విరోధి తద్వధ కెత్తినయది[10]

మనస్సుకూ బుద్ధికీ అహంకారానికీ అతీతులు, సముద్రజ్వాలా భీకరమైన తమ అంతరాత్మల నుంచి ఎగసే ఉచ్ఛస్వరాలతో ఉపనిషత్తులకూ వేదాలకూ ఆకృతి ఇచ్చిన వారు –వారు ద్రష్టలు, జ్ఞానులు, ఘనులు. వారినెవరు విరోధిస్తారో వారి పైకి ఎత్తిన కత్తి ఇది.

అతి గంభీరమైన సంస్కృత సమాసాలు, అమిత శక్తివంతంగా కూర్చిన పదబంధాలూ ఆ పద్యంలో ఆగ్రహాన్నీ తీవ్రతనూ స్ఫురింపజేస్తాయి. మొదటి మూడు పదబంధాల మొదటి అచ్చులు – అ, ఔ, ఆ; తర్వాత వచ్చే సంధిస్వరం; ఆ తర్వాత వచ్చే గహనమైన హల్లుల సమాసాలలో ఒకటి విసర్గతో అంతమవటం; చదువుతుంటే ఊపిరి తిప్పుకోనివ్వవు. ఒకవేళ ఆగి తిప్పుకుందామనుకున్నా, తప్పనిసరిగా పలికి తీరవలసిన మహా ప్రాణాక్షరం ఘ వెంటపడి ఎవ్వడు విరోధి వరకూ తరుముతుంది, ఆ పైన రెండు పదబంధాలతో పద్యం పూర్తయేవరకూ. ఆధునిక విలువలతో సత్యనారాయణ చేసిన పోరాటానికి ఈ ఏకవాక్యపద్యం చిహ్నంగా నిలిచింది.

సత్యనారాయణలో మహత్తరమైన విద్వత్తు, దానికి సాటి వచ్చే బ్రహ్మాండమైన ఊహ, సృజనశక్తి ఉన్నాయి. పురాణ ఇతివృత్తాలతో, సాంప్రదాయికమైన శైలితో, కట్టిపడేసే నవీన రసోత్పత్తితో ఆయన తెలుగు కవిత్వాన్ని మున్నెన్నడూ అందుకోని ఎత్తులకి చేర్చారు. ప్రాచీన సాహిత్యాన్నీ పద్ధతులనూ వ్యతిరేకించే విమర్శకులకు ఆయన నిర్భయంగా ఎదురు నిలిచారు. ఆంగ్ల విద్య వల్లనే తెలుగు కవులూ మేధావులూ వారి వారసత్వాన్నీ పారంపర్యమైన ప్రావీణ్యాన్నీ కోల్పోతున్నారని ఆయన నొక్కి చెప్పారు. ఎక్కువ ప్రజాదరణ లేని ఆ పక్షాన్నే ఆయన స్వచ్ఛందంగా ఎంచుకున్నారు. రామాయణం వంటి ప్రాచీన కావ్యాలు అభివృద్ధి నిరోధకాలనే రాజకీయ దృక్పథం నాగరికమైనదిగా భావించబడే కాలంలో, తాను రచిస్తున్న ఆరు కాండల రామాయణ కల్పవృక్ష కావ్యపు అవతారికలో ఇలా అంటారు.

మరల నిదేల రామాయణం బన్నచో,
        నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు,
        తన రుచి బ్రదుకులు తనివి గాన
చేసిన సంసారమే సేయు చున్నది,
        తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెద నేనును,
        నా భక్తి రచనలు నావి గాన

కవి ప్రతిభలోన నుండును గావ్యగత శ
తాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి.[11]

అయితే ఇటువంటి ఆత్మరక్షణ ఆయనను విమర్శకుల దాడుల నుంచి కాపాడలేదు. కొత్త కాలపు కవులు రామాయణ కల్పవృక్షం లోని శయ్యను పాతబడిపోయిందని, భావాలను కాలదోషం పట్టినవనీ ఆక్షేపించారు. వారికీ, కల్పవృక్షాన్ని సమర్థించే వారికీ మధ్య పోరాటం జరుగుతూనే ఉండేది. సాహిత్య పత్రికలే కాకుండా దినపత్రికలు సైతం ఈ రెండు వర్గాల మధ్యన వివాదాలను ప్రోత్సహించేవి[12]. ఆ కారణంగా స్పర్థ ఇంకా ఎక్కువైంది.

సామాజికం గానూ రాజకీయం గానూ జరిగే ప్రతి ఒక్క మార్పునూ తప్పు పట్టేవాడుగా, వెనుచూపు మాత్రమే ఉన్నవాడుగా, సత్యనారాయణను హేళన చేశారు. ఆయన సాహితీ వ్యక్తిత్వాన్ని ఒక వ్యంగ్యచిత్రంగా వ్యతిరేకులు రూపొందించారు. ఆయన జీవన విధానం, వేషధారణ కూడా ఆ చిత్రణకు తోడ్పడుతుండేది. నున్నగా గొరిగించుకొని సంప్రదాయ బ్రాహ్మణులు పెట్టుకొనేలాగా పిలక పెట్టుకొనేవారు. పాత పండితుల లాగా ధోవతి కట్టుకొని పైన కండువా వేసుకొనేవారు. నుదుట స్మార్త పద్ధతిలో బొట్టు పెట్టుకునేవారు. ఇందుకు విరుద్ధంగా భావకవులు, టాగూర్ వలన ప్రభావితులైన వారి పద్ధతిలో బెంగాలీ పంచె, లాల్చీ తొడిగేవారు. జుట్టును గిరజాలుగా భుజాల వరకూ పెంచుకొని బంగారపు చట్రం కళ్ళజోళ్ళు పెట్టుకొనేవారు. మార్క్సిస్ట్ కవులు పంట్లాం, చొక్కా వేసుకొని జుట్టును పొట్టిగా కత్తిరించుకొనేవారు. వేషధారణ లోనే ఆయా కవులు వేరు వేరు ప్రపంచాలకు చెందినవారుగా కనిపించాలనుకునేవారు. జటిలమైన పదాలనూ వాడుకలో లేనివాటినీ ఎంచుకుంటాడని ప్రత్యర్థులు ఎగతాళి చేసేవారు. ప్రాచుర్యంలో ఉన్న పత్రికలు ఆయనను అధిక్షేపించే వ్యంగ్య చిత్రాలనూ పరిహాసాలనూ ప్రచురించేవి[13].

శ్రీశ్రీ వ్యంగ్యంగా ఇలా రాశారు, ఏకవీరడు అనే పేరన.

శ్రీమాన్ విశ్వనాథ సత్యనారాయణ
గారి శ్రీమద్రామాయణ
కావ్యం రోజూ పారాయణ
చేసేవాళ్ళెవరూ లేరా యన
ఉన్నానని ఒకడేనా అంటే సంతోషిస్తారాయన [14]

సత్యనారాయణను మెచ్చుకొనేవారిలో ఒకడైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి కూడా ఆయనను సరదాగా వేళాకోళం చేస్తూ అనుకరించారు.

కించిత్ తిక్త కషాయ బాడబ రస క్షేపాతిరేకాతి వాక్
సంచార ప్రచయావకాశములలో కవ్యుద్ఘ! గండాశ్మముల్
చంచల్లీల నుదాత్త వాగ్గరిమతో సాధించి వేధించుమా!
పంచారించి ప్రవహ్లికావృతి కృతిన్ పాషాణ పాక ప్రభూ!

పద్యం చివరన రుక్మిణీనాథ శాస్త్రి చేసిన సంబోధన ‘పాషాణ పాక ప్రభూ’ అన్నది సత్యనారాయణకు మారు పేరుగా మిత్రులూ శత్రువులూ కూడా వాడేవారు[16].

ఆయన దగ్గర సమాధానాలు లేకపోలేదు. ప్రతిస్పందిస్తూ ఇలా అన్నారు:

తొలినాళుల పద్యార్థము
తెలియనిచో పాఠకునిది తెలియమి, యీ నా
ళుల వ్రాసిన కవి దోషము
కలి ముదిరిన కొలది చిత్రగతులన్ నడచెన్!

భారతదేశపు కాల గమనం సర్పిలంగా ఉంటుంది. కలియుగంలో అన్ని విలువలూ క్రమక్రమంగా క్షీణించి ఆఖరికి నశించిపోతాయి. సరళరేఖాత్మకంగా ఉండే క్రైస్తవ కాలమానాన్ని సత్యనారాయణ ఒప్పుకొనేవారు కాదు.

బిగ్గరగా ఖండించే విమర్శకులకు ప్రతిగా అభిమానులు ఆయనను అంత గట్టిగానూ సమర్థించేవారు. తెలుగు భాష లోని అతి గొప్ప కవులలో ఒకడుగా, సరస్వతీ అవతారంగా ఆయనను చెప్పుకొనేవారు. ఆ అభిమానులలో చాలా మంది సంస్కృతమూ తెలుగూ చదువుకున్న సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల లోంచి వచ్చినవారు. కొత్త తరంలో ఆ రెంటికీ కాలం చెల్లిపోతోంది. ఇరవైయవ శతాబ్దపు తొలి దశాబ్దాలలో ఈ సాహిత్య యుద్ధం వెనుక కులాల సంఘర్షణ కనిపించేది. పాత పద్ధతులు పాటించే బ్రాహ్మణులు సత్యనారాయణను స్తుతించేవారు. ఆ కాలంలో చాలా చురుకుగా పైకి వస్తున్న బ్రాహ్మణేతరులు ఆయనను కాలదోషం పట్టినవాడిగా తిరస్కరించేవారు. ఆంగ్ల విద్య అభ్యసించి ఆధునికులై, తమ కుటుంబ సంప్రదాయాలతో విభేదించే బ్రాహ్మణులు కూడా ఈ పోరాటంలో బ్రాహ్మణేతరుల తోనే చేతులు కలిపేవారు.

ఈ భీషణమైన సాంస్కృతిక సంఘర్షణలో, విచక్షణా రహితంగా గీయబడిన హద్దులలో, దాడులలో ప్రతి యుద్ధాలలో – సత్యనారాయణ లోని వలసవాద వ్యతిరేకత మరుగున పడిపోయింది. సత్యనారాయణ వలసవాదాన్ని వ్యతిరేకించటం కేవలం బ్రాహ్మణాధిక్యాన్ని నిలబెట్టటం కోసమేనని ఆధునికులు అభిప్రాయపడ్డారు. గడిచిన కాలమంతా అజ్ఞానంతో మూఢత్వంతో నిండి ఉందని అనుకున్నారు. రామ మోహన రాయ్ నుంచి వీరేశలింగం వరకూ సంఘ సంస్కర్తలైన వారు వ్యతిరేకంగా పోరాడినది వాటికే.

తన సామాజిక ప్రణాళికను విమర్శకులు ఖండించినా, సాహిత్య పరంగా ఆయన ఎవరూ కాదనలేనంత శక్తిమంతుడు. కేవలం ఒక పాత కాలపు పండితుడిగా ఆయనను తీసిపారేయటం ఎవరికీ వీలు కాలేదు. ఆయన ప్రాచీనుడు కాలేనంత నవ్యుడు, నవ్యుడు కాలేనంత ప్రాచీనుడు. రచయితగా, కవిగా, విమర్శకుడుగా, ప్రతిస్పర్థులకు ప్రబలమైన సమాధానంగా ఆయన ఎల్లెడలా కనిపించేవాడు. అర్ధశతాబ్దం పాటు ఆయనది సాహిత్య రంగంలో విస్మరించలేని అస్తిత్వం.

1930లలో ఆయన తన మహాసృష్టిగా భావించబడే వేయి పడగలు నవలను వెయ్యి పుటలతో రచించారు. వలసవాద ప్రభావం లేని భారతదేశాన్ని తాను దర్శించి, పట్టు వదలని జీవశక్తితో దాన్ని వేయిపడగలులో సమర్థించారు. ఆ తర్వాత ఆయన చాలా నవలలు రాశారు. వాటిలో పాత్రలు ఆధునికత అనబడే కలికాలంతో పోరాడుతుంటాయి, ఓడిపోతూ కూడా ఉంటాయి. 1940లలో రాసిన చెలియలికట్ట, సమకాలికుడైన చలం రాసిన నవలకు సమాధానం. స్త్రీలకు లైంగిక స్వేఛ్చనూ సామాజిక స్వాతంత్ర్యాన్నీ ప్రతిపాదించిన తీవ్ర రచయిత చలం. ఆయన రాసిన మైదానంనవలలో రాజేశ్వరి అనే బ్రాహ్మణ స్త్రీ తన భర్తను వదిలేసి ఒక ముస్లిమ్‌ యువకుడితో వెళ్ళిపోతుంది. ఆరుబయలు మైదానంలో, జన సంచారం లేని చోట – వారిద్దరూ అక్కడ సంఘపు కట్టుబాట్లకు అతీతంగా ప్రేమా సంతోషమూ శృంగారమూ నిండిన జీవితం గడుపుతారు. సంఘాన్ని తిరస్కరించటంలో ఉన్న సమస్యను సత్యనారాయణ చెలియలికట్టలో చెబుతారు. సముద్రం తన హద్దును దాటదనీ చెలియలి కట్ట సముద్రానికి సోదరి అనీ దాన్ని దాటితే అది వావి తప్పటమనీ జనంలో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీదనే చెలియలికట్ట నవల పేరు ఆధారపడింది. ప్రజలు నివసించే భూమి మీదకి సముద్రం రాదు. ఘోరపాతకాలు సంభవించినప్పుడే సముద్రం పొంగి ఊళ్ళను ముంచెత్తుతుంది. నవలలో అందుకే, అలాగే జరిగినట్లుగా చిత్రిస్తారు.

తన అరవైయవ పడిలో ఒక ప్రచురణ సంస్థతో పన్నెండు నవలలు రాసే ఒప్పందాన్ని సత్యనారాయణ చేసుకున్నారు. ఆ నవలలు అన్నింటికీ మంచి-చెడుల మధ్యన జరిగే పోరాటమే ఇతివృత్తం. దైవిక శక్తులకూ తద్విరుద్ధమైన వాటికీ నిరంతరంగా జరుగుతున్న యుద్ధంగా ఆ పురాణ వైర గ్రంథమాలను సంకల్పించారు. ఓడిపోయిన తర్వాత కూడా తిరిగి తిరిగి తలెత్తే దైవవిరోధ శక్తులు చివరకు అంతరించిపోవటాన్ని ఆ నవలలలో చెప్పదలచుకున్నారు.

సాహిత్యం లోనూ సామాజికం గానూ వేషధారణ లోనూ పూర్తి సంప్రదాయవాదిగా కనిపించే సత్యనారాయణలో చాలా ఆధునికత కూడా ఉండేదని స్నేహితులు అనేవారు. ఆయన జీవిత చరిత్ర ఇంకా రావలసి ఉంది. ఆంగ్ల నవలలు ఎక్కువగా చదివేవారు, ఆంగ్ల చలన చిత్రాలను విపరీతంగా చూసేవారు. సాధారణ వైదిక బ్రాహ్మణుడి లాగా కాక జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించేవారని సన్నిహితులు చెబుతారు.

చాలా ప్రేమ గల మనిషి అని కూడా దగ్గరివారు అంటారు. బాగా ఆప్యాయంగా ఉండేవారు, కాని మాటలో కరకుదనం వల్ల సులభంగా అపార్థం చేసుకోబడేవారు. తనను పొగడేవాళ్ళను కూడా కొన్ని సార్లు శత్రువులుగా చేసుకొనేవారు. ఆయన అభిరుచులు రాజీ పడనివి. లోతు లేని చదువునూ పైపై మాటలనూ సహించలేకపోయేవారు. సరైన అంశాలకు కాకపోయినప్పుడు ప్రశంసించేవారి మీద కూడా కోప్పడేవారు. తన సామర్థ్యం పట్లా ప్రతిభ పట్లా సంపూర్ణమైన విశ్వాసం ఉండటం ఒక్కొక్కసారి గర్వపడటంగా కనిపించేది. బీదరికంలో ఉన్నప్పుడు కూడా పోషకులు కాగల వారిని అతిగా స్తుతించటం ఆయనకు రుచించేది కాదు. అందుకు నిదర్శనంగా ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తారు.

జయపురం మహారాజా అయిన విక్రమదేవవర్మకు మంచి సాహిత్యాభిరుచి ఉండేది. ఆయన స్వయంగా కవి కూడా. ఏలూరులో జరిగిన ఒక సభలో ఆయన కవులను సత్కరిస్తున్నారు. చిన్నా పెద్దా కవులు వెళ్ళి రాజా వారిని పొగుడుతూ పద్యాలు చెప్పి నూట పదహారు రూపాయల బహుమానాలు పట్టుకువెళుతున్నారు. గురువు గారైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి సత్యనారాయణను కూడా వెళ్ళి పద్యాలు చదవమన్నారు. సత్యనారాయణకి అప్పుడు డబ్బు చాలా అవసరం. ఆ రోజుల్లో నూట పదహారు రూపాయలంటే పెద్ద మొత్తమే. ఆయన నిలబడి ఈ పద్యం చదివారు.

వ్రేగగు హైమ సౌధమణి వీధికఁ బుట్టెను రాచబిడ్డ క
ల్పాగము వోలె నేల విరియంబడి బంగరు ముద్ద లే దెసన్
ద్యాగమువొందె వారసతు లాడిరి మంగళతూర్యరావముల్
మ్రోగెను లోకపుంజనులు బోరన సన్నుతి వెట్టి రెంతయున్.

ఒక్క చిఱుపేద గుడిసెలో నుద్భవిల్లి
నాడు కవికూన, పదియవనాడు, మంత్ర
సాని దెప్పిన దన్నము చాలదంచు
మంత్రమో సణ్గినాడొ బ్రాహ్మణుఁడు వచ్చి.

ఆ రాచబిడ్డ కళ్యాణ పల్యాణ సజ్జిత పంచకళ్యాణిఁ జెలువు గులికె
ఈ కవికూన, పేరాకట మాడి కన్నులలోనఁ బ్రాణముల్ నిలుపుకొనియె
ఆ రాచకూన, మార్గాయాసఖిన్ను, క్ష్మాజములు వంగి పథశ్రమములు వాపె
ఈ కవిబిడ్డ దుఃఖైకజన్ముని దీక్ష్ణకిరణుండు శుచి నుడుకించి వైచె.

రాజునిరంత భోగమధురంబగు జీవితమై, గతించెడున్
రోజునఁ దూర్యముల్ మరల మ్రోసెను, శ్రీ కలకంఠకంఠ గీ
తీ జగతీ ఘలంఘల గతి ప్రమదంబొలసెన్ మనోజ్ఞ వ
ర్షా జయనాద నీరద భరంబయి మ్రోగెఁ ద్రయీనినాదముల్.

నాటి సంజవేళ నభమున ధగధగా
యిత విలాసదీప్తి జతనుపఱచి
సానయిడిన మణివిధాన దీపిల్లు తా
రక యొకండు నేల రాలిపడియె.

కవికి క్షుధాగ్ని పీడితము కాయము త్రెళ్లెను; కాష్ఠవహ్నిలో
శవ మిడునంతలో నపరసాగరమందున గర్మసాక్షి క్రుం
కువడె, నొకింతలోన మెఱుగుల్ దెసలందున గ్రమ్ముకొంచు నూ
త్నవిలసనంబు చిమ్ము నొక తారక మింటికి నెక్కె వెంబడిన్.[18]