విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు

[విశ్వనాథ రెండు నవలికలు (Two Novellas by Visvanatha Satyanarayana) అన్న పేర, హా హా హూ హూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు–నవలికలను 2018లో పుస్తకంగా పెంగ్విన్ ఇండియా వారు ప్రచురించబోతున్నారు. నారాయణరావు అనువదించిన అన్ని కావ్యాలు, రచనలు లాగానే ఈ అనువాదానికి కూడా ఆయన రాసిన తొలి, మలి పలుకులు మన సాహిత్య చరిత్ర గురించి, కవులు రచయితల గురించి ఒక విభిన్నమైన విశిష్టమైన దృక్పథాన్ని మనకు అందిస్తాయి. ఈమాట వెల్చేరు నారాయణరావు ప్రత్యేక సంచికలో ఇటువంటి అనువాదాలు కొన్ని అందించాం. ఇక్కడ విశ్వనాథ రెండు నవలికలు పుస్తకానికి నారాయణరావు రాసిన ముందుమాటను తెలుగులో ప్రచురిస్తున్నాం. ఆయన రాసిన మలిపలుకు తర్వాతి సంచికలలో ప్రచురిస్తాం. – సం.]


బ్రిటిష్‌వారి రాజకీయ ఆధిపత్యం, పాశ్చాత్య ఆధునికతాభావాలు — ఈ రెండూ పెనవేసుకున్న నేపథ్యంలో భారతదేశంలోకి వలసవాదం ప్రవేశించింది. హేతువాదం, మనుషులందరూ సమానమే అన్న ఊహ, చరిత్ర సరళరేఖ లాగా నడుస్తుందనే విశ్వాసం, మనుషుల సౌఖ్యం కోసం ప్రకృతిని జయించే విజ్ఞానశాస్త్రాల గొప్పదనం — ఇవన్నీ పాశ్చాత్య నాగరికత వల్ల వచ్చి, భారతీయులకి ఒక గొప్ప వరం లాగా కనిపించాయి. ఈ ఊహలు పాశ్చాత్యదేశాల లోంచి వచ్చాయి కాబట్టి పాశ్చాత్యులు భారతీయులకన్నా అధికులుగా, భారతదేశానికి యజమానులుగా భావించుకొని వ్యవహరించగల అవకాశాన్ని వారికి తెచ్చిపెట్టాయి. ఒకవైపు భారత జాతీయవాదులు బ్రిటిష్‌వారి రాజకీయ ఆధిపత్యాన్ని తిరస్కరించారు గాని వాళ్ళు తెచ్చిపెట్టిన ఆధునికతను వదులుకోలేక పోయారు. ఆ విషయాన్ని దీపేశ్ చక్రవర్తి ఇలా వివరించారు:

పౌరసత్వం, రాజ్యం, పౌరసమాజం, సాంఘికరంగం, పౌరహక్కులు, చట్టం ముందు అందరూ సమానులనే ఊహ, వ్యక్తిభావన, వ్యక్తికి చెందిన రంగానికి, సమాజానికి చెందిన రంగానికి మధ్యన ఉన్న తేడా, ప్రజాస్వామ్యం, ఆత్యంతికంగా ప్రజలే దేశానికి హక్కుదారులు, సామాజిక న్యాయం, శాస్త్రబద్ధమైన హేతువాదం, వగైరా వగైరా అన్నిటి మీద యూరప్ నుంచి వచ్చిన భావాల, యూరప్ చరిత్ర వల్ల వచ్చిన ఆలోచనల ముద్ర ఉంది. చరిత్ర అక్కడి చాలా విషయాలను ప్రభావితం చేస్తూ వచ్చింది. ఈ ఊహలకి యూరప్‌లో వైజ్ఞానిక విప్లవం (Enlightenment period) రూపొందుతున్న కాలంలో స్థిరమైన రూపం ఏర్పడింది.

వలసకాలంలో రచయితలు దాదాపుగా అందరూ జాతీయవాదులు. ఆ కారణంగా బ్రిటిష్ ప్రభుత్వ ఆధిపత్యానికి వాళ్ళు వ్యతిరేకులు. అయినా, వాళ్ళెవరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆధునిక సంస్కృతిని మాత్రం వదులుకోడానికి ఇష్టపడలేదు. భారతదేశపు సాహిత్యాల చరిత్రలో వలసయుగంలో ఒక ప్రత్యేకమైన వేర్పాటు కనిపిస్తుంది. వలసయుగంలో నుంచి ప్రారంభమైన సాహిత్య చరిత్రకు ఆధునికయుగం, నవ్యయుగం వంటి పేర్లు పెట్టడం భారతదేశ సాహిత్యాల చరిత్రలు అన్నింటిలోనూ కనిపిస్తాయి. ఈ యుగంలో ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే అంతకు పూర్వం ఉన్న సాహిత్యాలను తిరస్కరించడం. భారతీయ సాహిత్యాల్లో ఆధునిక కవులు, రచయితలు సమకాలీన సామాజిక విషయాలను గురించి రాశారు. స్థానిక ఉద్యమాల కార్యక్రమాన్ని ఆమోదించారు. కులభేదాలను, అగ్రకులాల ఆధిపత్యాన్ని, క్రతువులను, మతాలను, బ్రాహ్మణ ఆధిక్యతను తిరస్కరించారు. అందులో కొందరు వర్గపోరాటాన్ని, విప్లవాన్ని ఆహ్వానించారు కూడా. అందరూ సామాజిక సంఘ సంస్కరణల అవసరాన్ని అంగీకరించారు. అలా ఆంగీకరించకపోతే వాళ్ళు ఆధునికులు కారు. బంకించంద్ర నుంచి గోపీచంద్ వరకూ రవీంద్రనాథ టాగూర్ నుంచి సుమిత్రానందన్ పంత్ వరకూ సుబ్రహ్మణ్య భారతి నుంచి శ్రీశ్రీ వరకూ దాదాపు అందరు భారతీయ సాహిత్యకారులు, అందరూ ఒక్కలాగే, అదే సరళిలోకి నడిచి వెళ్ళారు — ఒక్క విశ్వనాథ సత్యనారాయణ తప్ప. ఈయన గురించి భారతదేశానికి బయట ఎవరికీ ఏమీ తెలీదు. ఈయన లాంటి వాళ్ళు చాలా కొద్దిమంది ఇతర భారతీయభాషల్లో కనిపిస్తారు.

విశ్వనాథ: నేపథ్యం

విశ్వనాథ సత్యనారాయణ 1895లో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య పల్లెటూరి వీధిబడులలో జరిగింది. ఆ పల్లెటూరి వాతావారణం ఆయనకు చాలా నేర్పించింది. వీధిగాయకులు, వీధినర్తకులు, పురాణ ప్రవచనాలు చేసేవారు, పుక్కిటి కథలు చెప్పేవారు, నోటితో పాటలు కట్టి పాడేవారూ — వీరందరినీ ఆయన అతి దగ్గరగా అర్థం చేసుకున్నారు. వారిలో ఇప్పుడు దళితులని పిలవబడుతున్న కులాలవారు కూడా ఉండేవారు. ఆయన పెద్దక్కగారు ఆ పాటలన్నిటినీ తమ్ముడికి తిరిగి పాడి వినిపించేవారు. జానపద గాథలనూ రామాయణ మహాభారతాలలోని ఉదంతాలనూ ఆమె చెప్పేవారు. అక్కడి దేవాలయంలో ప్రతియేటా తిరణాలు జరిగేవి. ఎక్కడెక్కడి నుంచో ఈ ప్రదర్శకులంతా వచ్చి వాటిలో పాల్గొంటుండేవారు. వారిలో నటులు, వాద్యకారులు, విదూషకులు, మల్లయోధులు, ఐంద్రజాలికులు, పగటి వేషాలు కట్టి ఒప్పించగల బహురూపి విద్య నేర్చినవారూ — అందరూ ఉండేవారు. ఊళ్ళో అందరు ఒకరినొకరు ఏ కులం వాళ్ళయినా, అక్క అన్నయ్య బాబాయి అత్తయ్య — ఇలా కులంతో ప్రసక్తి లేకుండా వరసలు కలుపుకొని పిలుచుకొనేవారు. పెద్ద ఉమ్మడికుటుంబంలో ప్రేమా ఆప్యాయతల మధ్యన కథలతోటీ పాటలతోటీ ఆహ్లాదకరంగా గడిచిపోయిన తన బాల్యాన్ని సత్యనారాయణ తరచుగా జ్ఞాపకం చేసుకునేవారు. కల్లా కపటం కనిపించని ఆ గ్రామీణ వాతావరణంలోని అనురాగం పసివాడుగా ఉన్నప్పుడే ఆయన ప్రపంచంలో భాగమైపోయింది. ఆ ఊళ్ళో పెద్దవాళ్ళకి మాత్రమే అర్థమయే కొట్లాటలు, పెనుగులాటలు, విరోధాలు, కల్మషాలు — ఇవేవీ ఆయనకు కనిపించలేదు.

సత్యనారాయణకు పదకొండేళ్ళు వచ్చేసరికి పెద్దలు ఇచ్చిన ఆస్తి ఇంచుమించు పూర్తిగా హరించుకుపోయింది. ఆయన తండ్రి గొప్ప దాత. ఆ దాతృత్వంలో తన కుటుంబ సంక్షేమం ఆయనకు పట్టలేదు. కుమారుడికి ఆంగ్లవిద్య నేర్పిస్తే తన పొట్ట తాను పోసుకోగలడని నిర్ణయించుకుని, తండ్రి తమ కుటుంబాన్ని దగ్గరలో ఉన్న మచిలీపట్నానికి తరలించారు. కొడుకు తెలుగులో పద్యాలు రాస్తుండటాన్ని గమనించిన తండ్రి తీవ్రంగా మందలించారు. అలాంటి పిచ్చి పిచ్చి పనులతో కాలాన్ని వృథా చేయద్దని హెచ్చరించారు. కాని సత్యనారాయణ పద్యాలు రాస్తూనే ఉండేవారు. తనకే తృప్తిగా అనిపించక ఆ తొలి పద్యాలలో కొన్ని వేల పద్యాలను చింపేశారు. పుస్తకాలు కొని చదువుకోవటానికి డబ్బుండేది కాదు గనుక ఒక పుస్తకాల అంగడిలో కూర్చుని చదువుతుండేవారు. ఆ అంగడి యజమాని దయగలవాడు, ఎంత సేపు కూర్చుని చదువుకున్నా అడ్డు పెట్టేవాడు కాదు. కొన్నిసార్లు చదువుతూన్న పుస్తకం పూర్తి కాకపోతే, ఆ రాత్రికి ఇంటికి తీసుకుపోనిచ్చేవాడు కూడా. ఆంగ్ల విద్యను కొనసాగిస్తూనే సత్యనారాయణ తర్క వ్యాకరణ వేదాంత శాస్త్రాలన్నిటినీ చదువుకున్నారు. ఆ కాలంలో గొప్ప పండితులైన కంభంపాటి రామమూర్తి శాస్త్రి, పరిమి రామనరసింహ శాస్త్రి, కానుకొలను త్రివిక్రమరావు వంటి వారి గ్రంథాల ద్వారా తర్క వ్యాకరణ వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేశారు. తెలుగు కవిత్వానికి సంబంధించి, అప్పటి గొప్ప కవి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రికి (1870-1950) శిష్యులైనారు[2].

1920 ప్రాంతాలకి తెలుగు సాహిత్యంలోని ముఖ్యులలో ఒకరుగా సత్యనారాయణ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వాక్యాలలో విరుపు, సంస్కృత సమాసాలను ప్రత్యేక పద్ధతిలో వాడే ఉపజ్ఞ, ఎంతోమంది చదువరులను బలంగా ఆకర్షించేవి. తెలుగులో చెప్పుకోదగిన సాహిత్యకారుల వరసలో ఆయన సులువుగానే చేరిపోయారు. అయన ప్రారంభ కవిత్వం జాతీయవాదంతోనూ దేశభక్తితోనూ నిండిపోయి ఉండేది. గతకాలపు తెలుగు రాజుల, సామ్రాజ్య నిర్మాతల గొప్పదనాన్ని కీర్తించేవారు. వస్తువు కొత్తది కాకపోయినా ఆయన శిల్పం కొట్టొచ్చినట్లుండేది. ఎందరో కవులు జాతిని కీర్తించే కవిత్వం చెప్పినా వారెవరితోనూ పోల్చలేని ప్రత్యేకత ఆయనది. 1940లలో రామాయణాన్ని కేవలం వృద్ధులు చదువుకునే మతగ్రంథంగా పక్కకు పెట్టేసి ఉన్న పరిస్థితిలో, ఆయన మొత్తం ఆరుకాండలతో సమగ్రంగా తెలుగులో రచించాలని సంకల్పించారు.

ఆధునిక సాహిత్యకారులలో అందరూ కాల్పనిక ప్రేమ గురించి మాట్లాడుతుండేవారు. షెల్లీ, కీట్స్, ఇలియట్‌ల కవిత్వాన్ని ఉటంకించేవారు. స్త్రీ స్థానాన్ని ప్రత్యేకంగా పైకి ఎత్తేవారు. సత్యనారాయణ మాత్రం బ్రాహ్మణ ధర్మం గురించే మాట్లాడేవారు. ఆ ధర్మాన్ని రసం, ఔచిత్యం, వక్రోక్తి, ధ్వనులతో ముడిపెట్టి సాహిత్యంలోకి అన్వయించేవారు. అభినవగుప్తుడు, మమ్మటుడు వంటి ప్రాచీన ఆలంకారికులను ఉదాహరిస్తుండేవారు. ఆ దృక్పథాన్ని ఆధునికులు అప్పటికి నలభై యేళ్ళ కిందటే తిరస్కరించారు. ఆ దృష్టికి సంబంధించిన సంప్రదాయమంతా దాదాపు నశించిపోయింది. తన సంఘ సంస్కరణలో భాగంగా వీరేశలింగం (1848-1919) సవర్ణుల ఆచారవ్యవహారాల పైన దాడిచేశారు. ప్రాచీన వాఙ్మయంలో శృంగార రసపోషణ హద్దు మీరి ఉందని అభిప్రాయపడిన సి. ఆర్. రెడ్డి (1880-1951) ఆ సాహిత్య సంప్రదాయాన్ని నిందించారు. కొన్ని శతాబ్దాల నుంచీ నిలచి ఉన్న సాహిత్య ప్రమాణాలు కూలిపోసాగాయి. ఆధునికత జగన్నాథ రథచక్రాలలాగా సాహిత్యరంగంలోకి విరుచుకుపడింది. దానితో విభేదించిన ప్రతీ ధోరణి తిరోగమనమనిపించుకుంది. నవీనం కాని ప్రతీదానికి కాలదోషం పట్టిందనే భావించబడింది. భావకవులుగా తమను చెప్పుకున్నవారు, పండితులనూ సంప్రదాయ కవిత్వ ప్రమాణాలనూ బహిరంగంగా ధిక్కరించారు. త్వరలోనే మార్క్సిస్టులు రంగప్రవేశం చేసి అప్పటివరకూ వచ్చిన తెలుగు కవిత్వమంతా భూస్వామ్య వ్యవస్థకి చెందినదనీ తిరోగామి కవిత్వమనీ తీర్మానించి తిరస్కరించారు. సామాన్యులకోసం ఉద్దేశించబడే వారి విప్లవ కవిత్వం మాత్రమే కవిత్వమని వారి విశ్వాసం.

ఇరవైయవ శతాబ్దపు తొలి దశకాలలో సంప్రదాయ విద్యాబోధన క్షీణించటం మొదలైంది. ఆ పద్ధతిలో ఒకే పండితుడు తనకు తెలిసిన దాన్నంతటినీ శిష్యులకు బోధించటం ఉండేది. శిష్యులకు ఆశ్రయమూ చాలాసార్లు భోజనమూ కూడా గురువుగారి ఇంట్లోనే జరుగుతూ ఉండేవి. అలా కాని పక్షంలో, ఆ ఊర్లో ఉన్న బ్రాహ్మణ గృహస్థులు రోజుకు ఒక విద్యార్థికి భోజనం పెట్టే బాధ్యతను తీసుకునేవారు. ఆ విధంగా వారంలో ఏడు రోజులూ భోజనం అమరుతుండేది. విద్యార్థులు అందరూ బ్రాహ్మణులే అయి ఉండేవారు. విద్యాదానం చేస్తుండిన పండితుడి పోషణను జమీందారులు చూసుకునేవారు. ఇక్కడ ఎక్కువగా రాణించిన విద్యార్థులు కాశీలోగాని, బెంగాల్‌ లోని నవద్వీపంలోగానీ తమ అధ్యయనాన్ని కొనసాగించి తాము కూడా బోధించే స్థాయి గల పండితులయే దశకి చేరేవారు. తర్క మీమాంస వ్యాకరణాది ప్రాచీన శాస్త్రాల అధ్యయనం ఎంతో కాలంగా ఇలాగే సాగుతూ వచ్చింది. ఆదరణ కరవై ఆ వ్యవస్థ క్రమక్రమంగా నశించిపోయింది.

ఆధునిక విద్యలో భాగాలుగా ఆంగ్లభాషతో పాటుగా చరిత్ర, గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటి పాశ్చాత్య శాస్త్రాలను బ్రిటిష్ ప్రభుత్వం నడిపే విద్యాసంస్థలలో బోధించటం ప్రారంభమైంది. ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ఉత్తీర్ణులైన వారికి బి. ఏ, ఎం. ఏ వంటి పట్టాలు ప్రదానం చేయబడేవి. ఆ పట్టాలను పొందగలిగినవారికి అప్పటి ఉద్యోగ వ్యవస్థలో లాభసాటి ఉద్యోగాలు లభిస్తుండేవి. ఆయా విద్యాసంస్థలలో తెలుగునూ సంస్కృతాన్నీ కూడా బోధించేవారు గాని, ఆంగ్లమాధ్యమంలో చెప్పబడే తక్కిన అంశాల మీద పెట్టే శ్రద్ధను దేశభాషల మీద పెట్టేవారు కాదు. ఈ కొత్త విద్యాసంస్థలలో బోధనా సిబ్బంది రెండు శ్రేణులుగా ఉండేది. కళాశాలలలోనూ విశ్వవిద్యాలయాలలోనూ పట్టాలు తెచ్చుకున్న వారిని ఉపన్యాసకులనీ ఆచార్యులనీ పిలిచేవారు, వారిది ఒక వర్గం. తెలుగునూ సంస్కృతాన్నీ బోధించేందుకు ఏర్పాటైన విద్యాశాలలను ప్రాచ్య కళాశాలలు అనేవారు. వాటికి డిప్లొమాలను మాత్రమే ప్రదానం చేసే అధికారం ఉండేది. ఆ డిప్లొమాలు తెచ్చుకుని వచ్చినవారికి ఆంగ్లవిద్యా పరిచయం చాలా కొద్దిగానో, అసలు లేకుండానో ఉంటూ ఉండేది. వారిని పండితులు అని పిలిచేవారు[3]. ఇది రెండవ వర్గం. ఉపన్యాసకులకూ ఆచార్యులకూ సమృద్ధిగా వేతనాలు ఇచ్చేవారు. పండితుల వేతనాలు చాలీ చాలకుండా ఉండేవి. వేషధారణలో సైతం రెండువర్గాలకూ చాలా భేదం ఉండేది. పండితులు సాధారణంగా దేశీయమైన ధోవతి కట్టుకొని పైన కోటు తొడుక్కునేవారు. బ్రాహ్మణ పద్ధతిలో శిరోముండనం చేయించుకొని పిలక పెట్టుకునేవారు. నుదుట మతచిహ్నంగా బొట్టు పెట్టుకునేవారు. ఉపన్యాసకులూ ఆచార్యులూ పాశ్చాత్య పద్ధతిలో పంట్లాం, చొక్కా, జాకెట్, టై ధరించేవారు. జుట్టును పొట్టిగా కత్తిరించి ఉంచుకునేవారు. ఒకవేళ వారూ ఎప్పుడైనా ధోవతిని ధరించినా, తలను గొరిగించుకోవటం గానీ పిలక పెట్టుకోవటం గానీ ఎన్నడూ జరిగేదే కాదు. పాఠ్యాంశాలన్నీ ఆంగ్లం లోనే బోధించబడేవి. తెలుగు కేవలం ద్వితీయభాష. ఐచ్ఛికం. ఆంగ్లమూ దాని సంబంధిత శాస్త్రాలూ మాత్రమే తమ అభివృద్ధికి ఉపయోగిస్తాయని ఆ విద్యార్థులకు చాలా బాగా తెలుసు. తెలుగును బోధించే తరగతులకు సక్రమంగా వెళ్ళేవారు కూడా కాదు. వెళ్ళిన సందర్భాలలో తెలుగు పండితుడి వేషభాషలను ఎగతాళి చేయటమూ జరుగుతుండేది. వెటకారపు నవ్వులూ దగ్గులూ పిల్లికూతలూ తెలుగు తరగతి గదిలో వినబడుతుండేవి. స్త్రీ శరీరానికీ శృంగారానికీ సంబంధించిన వర్ణనల గురించి పండితులను విద్యార్థులు ప్రశ్నలు వేసి ముప్పతిప్పలు పెట్టేవారు. పాత తెలుగు కావ్యాలలో అటువంటి వర్ణనలు పుష్కలంగా ఉండేవి. వాటిని పరిహరించిన తర్వాతనే పాఠ్యాంశాలను నిర్ణయించాలనే ఉద్దేశం అధికారులకి ఉండినా కూడా చాలాసార్లు అలా వీలయేది కాదు. చాలా సామాన్యమైన సాహిత్య భాగాలలో కూడా ఊరువుల, వక్షోజాల, చూచుకాల, జఘన భాగాల, సంభోగకార్యాల వివరణలు ఉండేవి. సంస్కృత పదాలలోనో, పాతకాలపు తెలుగులోనో ఉండే ఆ మాటలను వాడుక తెలుగులో వివరించమని పురుష విద్యార్థులు పండితులను వేధించుకు తినేవారు. అదే తరగతి గదిలో ఉన్న విద్యార్థినులను ఇటువంటి అల్లరి బాగా ఇబ్బంది పెట్టేది. వాళ్ళు విడిగా వేరే బల్లల పైన కూర్చుంటేనేం!

అటువంటి విద్యాసంస్థలలో తెలుగు పండితుల స్థితి దయనీయంగా ఉండేది. ఏమాత్రమూ ఊహశక్తి లేని ఒక శిలాజంగా అతను చూడబడేవాడు. కంఠస్థం చేసిన విద్యనంతా అప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోగలిగే అతని శక్తి, గతకాలంలోనే ఇరుక్కుపోయి ఉండటానికి చిహ్నంగా మాత్రమే గ్రహించబడేది. ఆధునికమైన ఏ శాస్త్రాన్నీ అభ్యసించగల మేధ అతనికి లేకుండినట్లే తీర్మానించబడేది. అయితే, ప్రతిభాశీలురూ ప్రబలంగా కనిపించేవారూ అయిన కొందరు పండితుల వలన ప్రభావితులై సంస్కృతాంధ్రాలలో మంచి అభిరుచిని పెంచుకున్న విద్యార్థులూ లేకపోలేదు. అటువంటి కొద్ది మినహాయింపులని వదిలేస్తే యాజమాన్యం దృష్టిలోనూ విద్యార్థుల దృష్టిలోనూ ఆ పండితుల స్థానం ఏమంత గొప్పది కాదు. వారూ ఏ ప్రతిఘటనా లేకుండా ఆ పరిస్థితిని అంగీకరించి ఉండిపోయేవారు.

తెలుగు చదువటన్న తేలికగా జూచు
టాంగ్ల పాఠశాలలందు గలదు
-అని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి అతి యథాలాపంగా వ్రాశారు.

ఆంగ్ల పాఠశాలలు అంటే అప్పటి పాఠశాలలు అన్నీ. తెలుగు తప్పించి మొత్తమంతా ఆంగ్లంలోనే బోధించబడేవి. నిజానికి తెలుగులో సమాధానాలు వ్రాయవలసిన ప్రశ్నలను కూడా ఆంగ్లం లోనే ఇచ్చేవారు. ఆ స్థితి ఇరవైయవ శతాబ్దంలో చాలా కాలమే కొనసాగింది.

తెలుగు భాషతో ఏ మాత్రమూ పరిచయం లేని బ్రిటిష్ అధికారులు ఆ భాషను బోధించే పద్ధతిని పర్యవేక్షిస్తుండేవారు. ఒకసారి ఒక తెలుగు పండితుడు తరగతి గదిలో ఒక పద్యాన్ని పూర్వపద్ధతిలో వివరించటం బ్రిటిష్ అధికారి కంటపడింది. గంట కొట్టే వరకూ పండితుడు ఆ ఒక్క పద్యాన్నే వివరిస్తుండిపోయాడు. అందులోని సమాసాలనూ వాటి విగ్రహవాక్యాలను, సంధులనూ వాటి పరిచ్ఛేదాలను, అలంకారాలనూ వివరంగా బోధించినాక విద్యార్థుల చేత ఆ పద్యాన్ని గొంతెత్తి వల్లె వేయించాడు. దీన్నంతా గమనించిన బ్రిటిష్ పర్యవేక్షకుడు — చాలా సమయం వృథా అయిపోతోందని, బోధనను వేగవంతం చేయవలసిన అవసరం ఉందని, వ్యాఖ్య రాసి పై అధికారులకు పంపాడు. ఇలాంటి అనుభవాలు ఎదురు పడినాకనే, తమ పాపఫలితంగా అటువంటి పాఠశాలలలో తెలుగును బోధించవలసి వస్తోందని వేంకటశాస్త్రి ఆక్రోశించారు. భమిడిపాటి కామేశ్వర రావనే హాస్య రచయిత ఆ తెలుగు ఉపాధ్యాయుల కడగండ్ల గురించి 1940ల ప్రారంభంలో ఒక వ్యాసం రాశారు[5]. గౌరవ వాచకమైన పండితుడనే పదానికి అర్థం మారిపోయింది. బతకలేని బడిపంతులు అని ఆ మాటకు అర్థం చెబుతుండేవారు[6]. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయేందుకు మధ్య తరగతి తెలుగు వారు ఉద్యమిస్తుండిన ఆ కాలంలోనే, తెలుగు భాష ఘనతను వారు నొక్కి చెప్పుకుంటుండిన అప్పుడే-తెలుగు పండితుల స్థితి దిగజారటం[7] ఒక గమనించవలసిన వైరుధ్యం.

గతించిన శతాబ్దాలలో తెలుగు పండితులు గొప్ప దశను అనుభవించారు. వారికి అమితమైన ఆదరణ ఉండేది. తమ కావ్యాలను అంకితం తీసుకున్న రాజుల నుంచి భూమినీ ధనాన్నీ పొంది సన్మానించబడేవారు. రాజులే కాకుండా మంత్రులూ సేనాధిపతులూ, చివరకు గ్రామాధికారులు కూడా పండితులను పోషించేవారు. పదకొండవ శతాబ్దానికి చెందిన నన్నయ భట్టు మొదలుకొని ఆయా కవుల గ్రంథాల అవతారికలను పరిశీలిస్తే ఆ పోషణ ఎంత వైభవంగా ఉండేదో మనకు కనబడుతుంది. పదహారవ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు, పదిహేడవ శతాబ్దం వాడైన విజయరాఘవ నాయకుడు వంటి మహారాజుల ఔదార్యాన్నీ ఔన్నత్యాన్నీ కథలు కథలుగా పద్యాలలోనూ గేయాలలోనూ కవులు స్మరించుకుంటూ వచ్చారు.

బ్రిటిష్ పాలకులు ఆ పూర్వరాజుల చర్యలను అనుకరించలేదు కాని జమీందారులు మాత్రం శాయశక్తులా ఆ సంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. జమీందారులు నిజానికి రాజులకు కప్పం కడుతుండిన భూస్వాములు, రాజులు అంతరించాక తమ స్వతంత్ర ప్రతిపత్తి కోసం పెనుగులాడినవారు. ఇరవైయవ శతాబ్దం మొదలయేసరికి అదీ తగ్గిపోయింది. ఆ శతాబ్దపు తొలి దశాబ్దాలలో సాంప్రదాయిక పండితుల దుస్థితి గురించి, సత్యనారాయణకు గురువైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి ఇలా రాశారు:

అచ్చాఫీసులటంచు హూణుల కుపాధ్యాయత్వమంచున్ మఱిన్
వెచ్చంబిచ్చెడి బచ్చుటిండులకడన్ వేదాంతమంచున్ మహో
ద్యచ్చారిత్రులు పండితుల్ మెలఁగఁగా నయ్యెంగదా! పొట్టకై
చచ్చున్ గాలమువచ్చె గౌరవము నాశంబయ్యెఁ గామేశ్వరీ – కా. శ. 10-22 [8] [9]

తమ సంప్రదాయ విద్యలో విశ్వాసం నశించిన కొందరు పండితులు పూర్వగ్రంథాలను ఆధునిక విమర్శనా దృష్టితో చూడటం మొదలు పెట్టారు. వారి దృక్పథం అయోమయమయింది. పాత కవుల కాలాన్ని కొత్త చరిత్ర ప్రకారం లెక్కపెట్టబోయారు. పాశ్చాత్యుల భాషోత్పత్తి శాస్త్రము, వారి ప్రత్యక్షైక వాదపు సాహిత్య చరిత్ర, నిర్దేశించిన ప్రమాణాలను ఈ తెలుగు పండితులు అంగీకరించటం మొదలైంది. భారతీయ కావ్యదృష్టితో ఆ రెండూ బొత్తిగా పొసగని విషయాలు. అంతే కాకుండా ఆ కాలపు విక్టోరియన్ నైతిక సూత్రాలకు సమ్మతినిస్తూ వలసలకు పూర్వం వచ్చిన సాహిత్యం లోని శృంగారాన్ని నీతి బాహ్యమైనదానిగా పరిగణించారు. అనంతర కాలంలో ఆధునిక మేధావులు అవలంబించిన మార్క్సిస్ట్ సూత్రాలు, ఆ శృంగారరసాన్ని భూస్వామ్య సంబంధిగా ప్రకటించాయి. పాలకుల విషయవాంఛాతృప్తి కోసం రచించబడినదనీ సామాన్యులకు ఉద్దేశించినది కాదనీ తీర్మానించాయి.

ఆ విధంగా – ఆధునిక కవుల నుంచి మార్క్సిస్ట్‌ల వరకూ ఏర్పడుతూ వచ్చిన ఒక బలవత్తరమైన సమూహం సత్యనారాయణనూ ఆయన సాహిత్యకృషినీ తీవ్రంగా వ్యతిరేకించింది.

సంస్కృతాన్నీ పాత తెలుగునూ చిన్న చూపు చూడటం పరిషత్తులలో నూతన మేధావులను తయారు చేసింది. పూర్వకావ్యాలన్నీ ఒక అజ్ఞానయుగానికి చెందినవని వారు నిస్సందేహంగా నమ్మారు. వాటిని పఠించే పండితులూ ఉదాహరించేవారూ మూఢులుగా చూడబడేవారు. అవే కావ్యాలకు పాశ్చాత్యులు చేసిన అనువాదాల లోంచి ఆంగ్లవాక్యాలను ఉదాహరించటాన్ని మాత్రం సహించేవారు. ఆధునిక మేధావులు ఆంగ్ల కవులనూ పాశ్చాత్య తత్త్వవేత్తలనూ అధ్యయనం చేసేవారు. వారి ఆలోచన ఆంగ్లంలో సాగేది. వ్యక్తిగతమైన ఉత్తరాలకూ, దినచర్యనూ గమనికలనూ రాసుకునేందుకూ ఆంగ్లాన్నే ఉపయోగించేవారు. సంప్రదాయ సాహిత్యంలో వారికేమైనా ఆసక్తి ఉంటే అది రసావిష్కారానికీ దాన్ని గ్రహించటానికీ సంబంధించినది అయి ఉండేది కాదు. అది కేవలం వారి రాజకీయ, సామాజిక సిద్ధాంతాలకు, విశ్వాసాలకు బయటినుంచి ఊతమిచ్చేది మాత్రమే అయేది. ఆధునిక రచయిత కులాన్ని తిరస్కరించాలి. శృంగార వర్ణనలను పరిహరించాలి. మతపరమైన మూఢ విశ్వాసాలను ఖండించాలి. స్త్రీల గురించి ప్రగతిశీల భావాలను ప్రకటించాలి. సవర్ణ బ్రాహ్మణుల వలన తక్కువ కులాల వారు పడిన బాధలను ఖండించాలి. సత్యనారాయణ ఇవేవీ చేయదలచుకోలేదు కనుక ఆయనను తిరోగామిగా భూస్వామ్య వాదానికి ప్రతినిధిగా తీర్మానించి భద్రంగా పక్కకి పెట్టారు.