దయ్యం

ఎవ్‌గెనీ ఇర్తెనేవ్ భవిష్యత్తు అద్భుతంగా కనిపిస్తోంది. అందుకు కావలసినవన్నీ అతనికున్నాయి: మంచి చదువు, డబ్బు, తండ్రి ద్వారా వచ్చిన పరపతి, పరిచయాలు. ఒక మంత్రిత్వ శాఖలో ఉద్యోగం మొదలయింది కూడా. ఇంతలో తండ్రి పోయాడు. తండ్రి పోయిన తర్వాత ఎవ్‌గెనీ అన్న ఆంద్రేయ్‌తో కల్సి ఆస్తి పంపకాల గురించి మంతనాలు మొదలుపెట్టాడు. ఈ వరసలో అన్నదమ్ములిద్దరికీ తండ్రికి ఉన్న అప్పుల గురించి తెలిసింది. ఎవ్‌గెనీకి తెలిసినంతలో తండ్రీ తాతా బాగా కలిగినవాళ్ళే. తాను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడూ అంతకు ముందూ ఎప్పుడూ డబ్బులకి చూసుకునే అవసరం రాలేదు. అన్న సంగతి సరే సరి. వాడు చదువు అయిపోయి శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. అన్నతో అన్నాడు ఎవ్‌గెనీ.

“అయితే ఇప్పుడేం చేద్దామంటావు?”

“చేయడానికి ఒకటే. నేను ఉద్యోగం వదిలేసి రాలేను. నువ్వు చదివిన లాయర్ చదువుకి మంచి ఉద్యోగం రావడం ఖాయం. ఈ పల్లెటూర్లో మనం చదివిన చదువులూ అన్నీ వదులుకుని ఎస్టేటూ అదీ చూడడం మనకి కుదిరే పని కాదు. అన్నీ అమ్మేసి మిగిలిన డబ్బులు అమ్మ పేరున పెట్టి మనం మన దారిలో పోవడమే మంచిది.”

“నేను లా చదివిన మాట వాస్తవమే కానీ ఈ ఎస్టేటు సంగతి చూడ్డానికి నాన్న కుదిర్చిన లాయర్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడాను. నువ్వు నమ్మలేకపోవచ్చు గానీ నాన్న ఈ ఎస్టేటు మీద చాలా అప్పులు చేశాట్ట. అవన్నీ కలిపితే ఈ ఎస్టేటు సరిపోదనీ ఏం చేయాలో తెలియటం లేదనీ అంటున్నాడు లాయరు.”

ఆంద్రేయ్ నమ్మలేనట్టు చూశాడు తమ్ముడికేసి. ఎవ్‌గెనీ చెప్పాడు.

“పైకి కనిపించని ప్రామిసరీ నోట్లు, చేబదుళ్ళూ వందలమీద ఉన్నాయి. ఆ నోట్లు పట్టుకుని మన లాయర్ చుట్టూ తిరుగుతున్నారు అప్పులిచ్చినవాళ్ళు. ఇవన్నీ తలకెత్తుకోవడం ఒక వంతు, ఆ తర్వాత ఇదంతా చూసుకోవడం మరో వంతు. అప్పులన్నీ తీరాక ఏదైనా మిగిలితే దానితో ఎలా ఏం చేయాలో ఆలోచించాలి. ప్రస్తుతానికి అంతా పైన పటారం లోన లొటారం లాగా ఉంది పరిస్థితి.”

“అలాగా? ఇంతవరకూ ఇలాంటి అప్పులున్నట్టు మనకి తెలియదే! మరి మనకెందుకు చెప్పలేదు ఇప్పటివరకూ?”

“చదువుకునే కుర్రాళ్ళకివన్నీ చెప్పడం ఎందుకు అనుకుని ఉండొచ్చు. ఇదేగాక మరో విషయం తెలిసింది.”

ఆంద్రేయ్ కుతూహలంగా చూశాడు ఎవ్‌గెనీకేసి.

“లాయర్ ఒకపక్క అలా చెప్తుంటే, వాడిమాట వినొద్దనీ కొంచెం కష్టపడితే రెండు మూడేళ్ళలో అన్నీ చక్కబెట్టుకోవచ్చనీ మన పక్కింటాయన చెప్తున్నాడు. ఆయన నాన్నకి బాగా తెలిసున్నవాడూ మన విషయాలు చిన్నప్పట్నుంచీ చూసినవాడూను. అదీగాక, ఇటువంటి విషయాల్లో లాయర్లు ఎంత తొందరగా అన్నీ మూసేసి ఎన్ని డబ్బులు ఏరుకుందామా అని చూస్తూ ఉంటారు. అందువల్ల లాయర్‌ని దూరంగా ఉంచమని చెప్తున్నాడు. పెద్ద అప్పులన్నీ ముందు తీర్చేస్తే చిన్న చిన్న ప్రామిసరీ నోట్లలాంటివి నిదానంగా తీర్చవచ్చు అన్నాడు కూడా. అదీ నిజమేగా?”

“నిజమే అనుకో. కానీ ఎవరు ఇక్కడ ఉండి ఇవన్నీ చూసేది?”

“నేనే ఓ అయిదారు సంవత్సరాలు ఉండి చూడలేనా అని ఆలోచిస్తున్నాను,” ఎవ్‌గెనీ అన్నాడు అన్నతో, వాడి మొహంలో ఏవైనా రంగులు మారతాయేమోనని చూస్తూ.

“నీ ఇష్టం. నువ్వు చూస్తానంటే అంతకంటే కావాల్సిందేముంది? కానీ మరి ఓ అయిదేళ్ళు ఇక్కడ ఉన్నాక అప్పుడు అన్నీ అమ్ముకోవాల్సి వస్తే నువ్వు లాయరువి కావడం కష్టం. చూసుకోమరి.”

“అదీ ఆలోచించాను. మొదట రెండేళ్ళు చూస్తా ఈ ఎస్టేటు సంగతి. అన్నీ దార్లో పడేటట్టు ఉంటే ఇక్కడే ఉంటాను. లేకపోతే అన్నీ అమ్మేసి లాయర్ అవడమే. ఇందులో నీకు ఏమైనా అభ్యంతరం ఉందా?”

“నాకా? అబ్బే నాదేముంది మధ్యలో! నీ ఇష్టం. నా వాటాగా నీకు ఎంత ఇవ్వాలని ఉంటే అంతే ఇవ్వు, ఎక్కడ సంతకాలు పెట్టమంటావో చెప్పు. నా ఉద్యోగం వదిలేసి మాత్రం ఇక్కడ నీకు ఏమీ సహాయం చేయలేను.”

తర్వాత విషయాలు మామూలుగా జరిగిపోయేయి. ఎవ్‌గెనీ తన అన్న వెళ్ళిపోయాక, ఎస్టేటుని దారిలో పెట్టడానికి పీకల్లోతు పనుల్లో పడ్డాడు. అయితే ఏదీ అనుకున్నంత సజావుగా జరగలేదు. పాడీ పంట, పశువులు, పంచదార ఫాక్టరీ, ఇవన్నీ చూసుకునే జనం, మేనేజర్; వీళ్ళనందర్నీ ఓ తాటి మీదకి తీసుకురావడం-ఇదంతా ఎవ్‌గెనీ నేర్చుకోవల్సివచ్చింది. అయితేనేం, ఇరవై ఆరేళ్ళ ఎవ్‌గెనీ కావాల్సినంత మనో నిబ్బరం, వంటి మీద బలం అన్నీ పెట్టి ఒక్కొక్కటీ నెగ్గుకుంటూ వచ్చాడు. అన్నీ పూర్తిగా సర్దుకోలేదు గానీ ఒక్కొక్కటీ దారిలో పడ్డం మొదలయాయి కొద్దికొద్దిగా. అన్నింటికన్నా అదృష్టం ఏమిటంటే ఎవ్‌గెనీ కుర్రాడు, మంచి యవ్వనంలో అలుపెరగకుండా పని చేసుకోగలుగుతున్నాడు. కొంచెం దగ్గరచూపు వల్ల కళ్ళజోడు తప్ప ఇంకే అనారోగ్యమూ లేదు.

ఉరకలు వేసే యవ్వనం, ఆరోగ్యం అదృష్టమేనా కాదా? దీనికి సమాధానం ప్రశ్న అడిగేవాణ్ణి బట్టీ సమాధానం చెప్పేవాణ్ణి బట్టీ మారుతూ ఉంటుందనేది జగమెరిగిన సత్యం.


యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు, ఈ ఎస్టేటు సంగతులు తలకెత్తుకోకముందు, ఎవ్‌గెనీకి అన్నిరకాల ఆడవాళ్ళతోనూ పరిచయం ఉంది. అలా అని కోరికలకు దాసుడు కాడు. శరీరారోగ్యం కోసం, ఆ ఆలోచన నుంచి విముక్తి కోసం అలా కలుస్తానని అతనే చెప్పేవాడు. స్వేచ్ఛావిహారి కాడు అలా అని సన్యాసి కూడా కాడు. మరిప్పుడో? ఇక్కడ ఊర్లో తల్లితో కల్సి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. పొద్దున్న లేచినప్పట్నుంచి సాయంత్రం దాకా ఊపిరి సలపని పని. ఎప్పుడైనా మంచి అమ్మాయి అలా రోడ్డు మీదో చర్చిలోనో కనిపిస్తే అటువేపు చూడ్డానికి తడబాటు. చిన్న ఊర్లో అందరూ ఒకరికొకరు తెలుసు కనక ఎవరేమనుకుంటారో అనే శంక ఒకటి, ఏ అమ్మాయితోనైనా మాట్లాడితే ఆవిడ చీదరించుకుంటే తన పరువు పోతుందేమోననే శంక మరొకటీను. మరి యవ్వనం వేడి తీర్చుకునేదెలా? ఇలా ఈ ఎస్టేటు పనిలో పడితే తన జీవితం ఆడవాసన లేకుండా తెల్లారడం ఖాయం. ఈ బలవంతపు బ్రహ్మచర్యం అతన్ని బాధించడం మొదలుపెట్టింది. దీని గురించి అలా పక్కనున్న పట్నానికో వేశ్య దగ్గిరకో వెళ్ళాలా? అక్కడ ఏ రోగమో రొచ్చో అంటుకోవచ్చు. ఎందుకొచ్చిన దరిద్రం! ఇదే ఊళ్ళో ఎవరో ఒక అమ్మాయిని చూసుకుంటే పోలా? తనకి తెలిసిన వాళ్ళలో అంత బాగున్న తనకి నచ్చిన వాళ్ళెవరూ లేరు. పెళ్ళయిన వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటే? అది తనకు ఇష్టం లేదు. ఏమో, అది ఎటు తిరిగి ఎటు పోతుందో. కానీ ఈ వయసులో ఎంతకాలం ఇలా బిగబట్టుకుని కూర్చునేది? ఏదో ఒకదారి చూడాలి. లేకపోతే మనస్సు నిగ్రహించుకోవడం కష్టం. ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి కానీ ఏమి చేయాలో పాలుపోలేదు ఎవ్‌గెనీకి. మనసులో ఏదో ఒకటి చేయాలనుకోవడం వేరూ నిజంగా అది అమల్లో పెట్టడం వేరూనూ.

మనసు ఇలా కొట్టుమిట్టాడుతుండగానే పొలంలో గుడిసెలో ఉంటున్న డానియల్ గుర్తుకొచ్చాడు ఎవ్‌గెనీకి. తన తండ్రి దగ్గర్నుంచీ పనిచేస్తున్నాడు. అప్పుడోసారీ ఇప్పుడోసారీ తన తండ్రికి ఇలా ఏదో ఒకటి కుదిర్చిపెట్టేవాడని తానూ విన్నాడు. వాడితో చెప్తే? అమ్మో! వాడు ఎవరి దగ్గిరైనా అంటే? తన తల్లి దగ్గిర చెప్పాడంటే ఇంక ఇంట్లో తలెత్తుకోలేడు తాను. ఇలా కాసేపు మనసులో తన్నుకున్నాక మొత్తంమీద చివరికో నిర్ణయానికొచ్చి డానియల్‌తో మాట్లాడ్డానికి బయల్దేరేడు ఎవ్‌గెనీ.

కాసేపు అవీయివీ మాట్లాడాక అసలు విషయం చెప్పాడు ఎవ్‌గెనీ, “చూడు డానియల్, నేను ఇక్కడ ఆడవాసన లేకుండా బతుకుతున్నాను. నేనేమీ సన్యాసిని కాదు కదా? మరి ఏం చేయాలో…”

“ఓస్ దానికేనా! ఆ మాత్రం నాకు తెలియదా? మీ నాన్నగారికి ఎప్పుడైనా కావలిస్తే నేనే ఎవరో ఒకరిని కుదిర్చిపెట్టేవాణ్ణి. అదేం పెద్ద పని కాదు. చెప్పండి ఎవరైనా ఉన్నారా మీ దృష్టిలో?”

తాను అడిగినది విని డానియల్ చివాట్లు పెడతాడేమో అనుకున్న ఎవ్‌గెనీ, తాను చేసేది తప్పు కాదనిపించేసరికి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.

“ఎవరూ లేరు. అయినా ఎవరైనా ఒకటే. అడిగినప్పుడు వస్తే చాలు. మరీ అంత వికారంగా ఉండకుండా ఆరోగ్యంగా ఉండే ఎవరైనా ఒకటే.”

“అలా అయితే ఒకావిడ ఉంది. అవిడకు కిందటేడే పెళ్ళయింది. కానీ మొగుడితో ఏ లాభమూ లేదు. వయసుమీద ఉంది, ఆవిడకి కూడా ఎవరితోనైనా తిరగాలని ఉందని అనుకుంటున్నారు జనం. అలాంటి వాళ్ళతో మీకే మంచిది; ఇద్దరూ మంచి కోరిక మీద ఉన్నారు కనక.”

“అబ్బే, ఒద్దు ఒద్దు. నాకు ఎవరైనా ఒకటే. కాస్త ఆరోగ్యంగా ఉంటే చాలు. పెళ్ళీ పెటాకులూ అన్నీ పెట్టవద్దు. కాస్త కోరిక తీర్చే బాపతు ఎవరైనా ఒకటే. పెళ్ళయిన వాళ్లయితే భర్త ఎక్కడో విదేశాల్లోనో సైన్యంలోనో ఉంటే మంచిది. ఒకసారి వచ్చాక, తర్వాత మరోసారి రాకపోయినా ఫర్వాలేదు.”

“అలా అయితే మీకు కావాల్సినది స్తిపనీదా. ఆవిణ్ణి నేను రేపు సాయంత్రం ఇక్కడికి తీసుకొస్తాను. ఎవరూ ఉండరు.”

ఆ రోజంతా ఎవ‌గెనీకి కాలు నిలవలేదు. ఆ పాలేరావిడ ఎలా ఉంటుందో అనే ఊహలు చుట్టుముట్టాయి. మర్నాడు సాయంత్రం ఎవ్‌గెనీ డానియల్ దగ్గిరకు బయల్దేరాడు. గుండెల్లో కంపనం. ఎవరైనా చూస్తే? ఎవ్‌గెనీని చూసి డానియల్ అంతా సిద్ధం అన్నట్టు తలాడించాడు. స్తిపనీదా ఉన్న గుడిసెలోకి వెళ్ళేముందు ఎవ్‌గెనీ ఒక మైలు దూరం చుట్టూ చూసి వచ్చాడు ఎవరైనా గమనిస్తున్నారేమోనని చూడ్డానికి. ఎవరూ లేరు. సరే, మొత్తానికి గుండె చిక్కబట్టుకుని గుడిసెలోకి వెళ్ళాడు. స్తిపనీదా ఒక్కతే ఉంది లోపల. అంత పెద్ద సౌందర్యరాశి కాదు కానీ ఓ మోస్తరు అందగత్తే. పెద్ద కళ్ళు, వంపులు, మంచి రంగుతో పుష్టిగానే ఉంది. ఆవిడ గురించి డానియల్ ముందే చెప్పాడు. కాసేపు ఏవో కబుర్లు చెప్పాక మరో అరగంటకి స్తిపనీదాని అక్కడే వదిలేసి బట్టలు సర్దుకుంటూ బయటకి వచ్చాడు ఎవ్‌గెనీ. డానియల్ కనిపించి అడిగేడు.

“అంతా సరిగా జరిగిందా? ఆవిడ మీ కోరిక తీర్చిందా? గొడవలేమీ పెట్టలేదు కదా?”

“ఏమీ గొడవల్లేవు. అద్భుతం. అంతా బాగుంది. ఎవరావిడ?” డబ్బులు డానియల్ చేతిలో పెడుతూ అడిగేడు ఎవ్‌గెనీ.

“మిఖాయిల్ పెశ్నికోవ్ భార్య.”

ఇద్దరే ఉన్నారు ఆ ఊళ్ళో మిఖాయిల్ పేరుతో. ఈవిడ ఎవరైతేనేం, తనకు అనవసరం. ఇక ఎవ్‌గెనీ తలమీద బరువు దిగిపోయినట్టయింది. ఈ పల్లెటూర్లో తన యవ్వనం వృధా పోదు. ఎప్పుడైనా కావలిస్తే డానియల్‌కో మాట చెప్తే చాలు. ఈ పద్ధతి అమల్లోకి రాగానే ఎవ్‌గెనీ మళ్ళీ మనసంతా ఎస్టేట్ పనుల్లో పెట్టేడు. మునపటిలా ఇప్పుడు అమ్మాయిల మీద, తను యవ్వనంలో ఉండీ సన్యాసిగా గడపాల్సి వచ్చిందే అనే చింత మీద ధ్యాస లేదు. ఎప్పుడైతే ఈ ఆడపొందు సులభంగా వస్తోందో అప్పట్నుంచీ మనసులో అది సూటిగా పొడవడం మానేసింది. అదో సంతోషం; లేకపోతే అదే రంధితో పనిమీద దృష్టి పెట్టలేకపోయేవాడు. అయినా ఈ స్తిపనీదా ఎవరో? తర్వాత కనుక్కుంటే తెల్సిన విషయం, ఈవిడకి పెళ్ళై ఏడాదయింది. మొగుడుకి మాస్కోలో ఉద్యోగం. ఈవిడిక్కడ ఇలా… పోనీయ్, నాకెందుకు? అనుకున్నాడు.

ఇలా రోజులు గడుస్తూంటే కలేరియా ఎసిపోవా అనే ఒక విధవావిడ ఉత్తరం రాసింది ఎవ్‌గెనీకి. ఎవ్‌గెనీ తండ్రి ఆవిడ దగ్గిర డబ్బులు తీసుకున్నాట్ట. తీర్చాల్సిందే అని గొడవ. ఏదో కాయితం మీద తండ్రి సంతకం తప్ప ప్రామిసరీ నోటు లేదు ఆవిడ దగ్గిర. అది కోర్టుకి తీసుకెళ్తే ఒక్కరోజులో తేలిపోయే పని. ఆ కాయితం చూసి బుర్ర ఉన్న వాడెవడూ డబ్బులు ఇవ్వాలని చెప్పడు. కానీ ఎవ్‌గెనీకి ఇది పరువు వ్యవహారం. తన తండ్రీ తాతా ఎంత బాగా సంపాదించారో అంత బాగానూ బతికారు. వాళ్ళ పరువు తీయడం ఎంతవరకూ సమంజసం? ఇలాంటి ఆలోచనల్తో ఆ కాయితం తల్లికి చూపించాడు.

“ఎవరమ్మా ఈ ఎసిపోవా?”

“ఎసిపోవా? ఆవిడని మీ తాత చిన్నప్పటినుంచీ పెంచాడు.”

“అవునా! అయినా ఈవిడకిప్పుడు ఈ డబ్బులు ఇవ్వాల్సిందేకదా, ఈ సంతకం ప్రకారం?”

“దానికి అడగడానికి సిగ్గులేదు కాబోలు. మీ తాత దానికి ఎంత సహాయం చేశాడు! అవన్నీ మర్చిపోయి ఎప్పుడో ఓ సారి చేబదులు తీసుకుంటే అది ఇవ్వమని అడుగుతోందా?”

“అవన్నీ అలా పెట్టి ఇది చెప్పు ముందు, ఈ డబ్బులు ఆవిడకి ఇవ్వాలా వద్దా మనం?”

తల్లి ఏమీ చెప్పలేకపోవడం చూసి ఎవ్‌గెనీ అన్నాడు, “సరే అయితే, తాత గౌరవం కాపాడ్డం కోసం అయినా ఇచ్చేద్దాం. ఎందుకొచ్చిన గొడవ.”

“ఆ ఇవ్వొచ్చులే. కాస్త ఆగమని చెప్పు.” కొడుకు నిజాయితీకి తల్లి మురిసిపోతూ చెప్పింది.

తల్లి ఇలా కొడుకు గురించి మురిసిపోతుండగానే, ఎవ్‌గెనీ పని మరీ కష్టంగా తయారైంది. రోజుకో అప్పులవాడు తగులుకోవడం, ఉన్న ఎస్టేటు, ఫాక్టరీ చూసుకోవడం ఇలా పనులతో సతమతమౌతున్నాడు. అయితే తల్లికి ఇవన్నీ పట్టలేదు. ఆవిడ పెళ్ళయినప్పట్నుండీ హాయిగా చీకూ చింతా లేకుండా బతికిన మనిషి. కొడుకు ఇప్పుడు ఎస్టేటు పనులు చూస్తున్నాడు. ఇన్ని పనులు అవుతూ ఉంటే ఇక్కడో అప్పూ అక్కడో తప్పూ జరగడం సాధారణం. ఆవిడకు ఇప్పుడు అర్జంటుగా కావాల్సింది కొడుక్కి పెళ్ళి చేయడం. ఇప్పటికే ఎవ్‌గెనీ బ్రహ్మచారి; ముదురుతోన్న బెండకాయ. ఈ ఊర్లోనే ఎవరైనా తన కొడుకుని కళ్లకద్దుకుని అల్లుడిగా చేసుకుంటారు.


తల్లి తన పెళ్ళి గురించి ఆలోచిస్తోందని ఎవ్‌గెనీకి తెలుసు. తనకీ పెళ్ళి చేసుకోవాలనే ఉంది. మరి ఎవరిని చేసుకునేది? అయినా పెళ్ళి అంటే ఇలా అనుకుంటే అలా అయిపోయేదా? దానికెంత తతంగం? ఎవ్‌గెనీ ఊహించినట్టు కాకుండా స్తిపనీదా అతనికి గుర్తుకొస్తూనే ఉంది. మొదటిసారి అయినాక సిగ్గుపడి మరోసారి చేయకూడదనుకున్నాడు కాని, కొంతకాలానికే మళ్ళీ కోరిక రాజుకుంది. ఈ కోరిక ఏ శరీరారోగ్యం కోసమో ఇక కాదు. స్తిపనీదా ఆరోగ్యవంతమైన శరీరం, ఆమె వాడే అత్తరు వాసన, మళ్ళీ కలుద్దాం అని చెప్పే ఆ గొంతు, ఆ గడ్డిలో ఆ ఎండలో తన పొందు… ఎవ‌గెనీని బలహీనుణ్ణి చేశాయి.

ఇష్టం లేకపోయినా మరోసారి డానియల్ ద్వారా స్తిపనీదాని కలవడానికి బయల్దేరేడు ఎవ్‌గెనీ. డానియెల్ మరోసారి చెట్ల మధ్యలో ఆ మధ్యాహ్నం ఏర్పాటు చేశాడు. ఎవ్‌గెనీ స్తిపనీదాను దీక్షగా పరిశీలించాడు. చూసినంత వరకూ అందంగా కనిపించింది ఆమె. తన భర్త గురించి మాట్లాడడానికి ప్రయత్నించాడు.

“నువ్విలా ..?”

ఆవిడ తక్కువ తిందా? తెలివైనదే కాబోలు. కవ్విస్తున్నట్టూ అంది, “ఎలా?”

“అదే, నీకు పెళ్లైంది కదా.”

“అదేం తప్పు? మా ఆయన మాస్కోలో మడికట్టుకుని కూర్చుంటాడా? ఆయన అలా తిరిగినప్పుడు నేనెందుకు తిరగకూడదూ?”

అరగంట గడిచాక ఎవ్‌గెనీ బట్టలేసుకుని బయటకొస్తూ ఉంటే స్తిపనీదా అంది, “నన్ను మరోసారి కలుసుకోవడానికి ఈ డానియల్ ఎందుకూ మన మధ్యన? వీడెక్కడైనా నోరు జారితే మనిద్దరికీ కష్టం.” ఎవ్‌గెనీ ఒప్పుకోలేదు.

ఎవ్‌గెనీ స్తిపనీదాని వదిలేసి వచ్చాక, తనకి త్వరలో పెళ్ళి అవుతుంది కనక, ఇంక మళ్ళీ ఆవిణ్ణి కలుసుకునే ప్రశ్న ఉండదనుకున్నాడు. అయితే అది తప్పని త్వరలోనే తెలిసివచ్చింది. ఆ వేసవిలో దాదాపు పదీ పన్నెండుసార్లు ఎవ్‌గెనీ స్తిపనీదాని కలిశాడు; ఆవిడ చెప్పినట్టు కాక ప్రతీసారీ డానియల్ ద్వారానే. ఇన్నిసార్లు రహస్యంగా ఇలా కలుసుకుంటున్నా ఒక్కసారి కూడా ఎవ్‌గెనీ ఇది ఎటుపోతోందా అని కానీ తాను చేసేది తప్పు అని కానీ ఆలోచించదల్చుకోలేదు. చేసేది తప్పే. కాని అవసరం వల్లనే కదా చేస్తున్నాడు. తనది అవసరం; ఆవిడకి కావాల్సింది డబ్బులు. తను యవ్వనం కట్టేసుకుని ఆరోగ్యం పాడుచేసుకోకుండా ఉండడానికి ఎవరో ఒకరు అవసరం. తనకి పెళ్లవ్వగానే ఆవిడెవరో తానెవరో. ఏదేమైనా ఇదేమీ కలకాలం సాగేది కాదు కదా. అయితే ఎవ్‌గెనీకి తెలియని విషయం మరోటి ఉంది ఇందులో. స్తిపనీదా ఇలా పెద్ద ఎస్టేట్ ఉన్న ఎవ్‌గెనీతో తిరిగి బాగా డబ్బులు సంపాదిస్తోందని ఆవిడ బంధువులకి ఎలాగోలా తెలిసింది. వాళ్ళకి ఈవిడెలా పోయినా, కావాల్సింది ఈవిడిచ్చే డబ్బులు కనక ఎవ్‌గెనీతో మరింత తిరగమని చెప్తూ వస్తున్నారు. అందువల్ల ఆవిడకూ తప్పు చేస్తున్నానన్న భావన కలగడం లేదు. ఇప్పుడు ఎవ్‌గెనీ పిలవకపోయినా డానియల్ ద్వారా ఆవిడే కబురుపెడుతోంది.

అయితే స్తిపనీదా భర్త గుర్తొచ్చినప్పుడల్లా ఎవ్‌గెనీకి ఇబ్బందిగా ఉంటుంది. ఈవిడ మొగుడు వికారంగా ఉంటాడేమో, అందుకే ఇలా దూరంగా ఉన్నాడు-అనుకున్నాడు ఎవ్‌గెనీ. కానీ ఓ రోజు ఊర్లో కనిపించారు స్తిపనీదా ఆవిడ మొగుడు మిఖాయిల్. ఎవ్‌గెనీ అనుకున్నట్టూ మిఖాయిల్ వికారంగా లేడు సరికదా మంచి హుందాగా ఉన్నాడు. అతనూ యవ్వనంలో ఉన్నవాడే. తనకన్నా బాగా అందగాడు కూడా. అదేమాట స్తిపనీదాతో అన్నాడు ఎవ్‌గెనీ. మిఖాయిల్ లాంటివాడు ఈ ఊర్లో ఇంకొకడు లేడని గర్వంగా చెప్పింది స్తిపనీదా.

ఇదే విషయం ఎవ్‌గెనీ డానియల్‌తో చెప్పేడు. మిఖాయిల్ వీళ్ళిద్దరి సంబంధం గురించి అడిగాడని, తనేమో తెలీదని చెప్పానని, అయినా రైతు కంటే రాజు మేలు కదా అంటే, తను తిరిగి ఊరికొచ్చేస్తున్నాను, తనను ఇక తిరగనియ్యనూ అని మిఖాయిల్ చెప్పాడనీ డానియెల్ వివరం చెప్పాడు. సరే అలాగే. అప్పుడే తనూ ఈ సంబంధం తెగగొట్టేసి ఆ విషయం ఇక పూర్తిగా మర్చిపోతాడు.

కాని, రోజులు గడుస్తూండే కొద్దీ పనిలో తలమునకలైన ఎవ్‌గెనీకి ఎప్పుడో ఓ రోజు అర్ధాంతరంగా స్తిపనీదా గుర్తు రావడం, ఇక మనసు దేనిమీదా లగ్నం కాకపోవడం, కోరిక ఆపుకోలేకపోవడం, వెంటనే మరో సారి ఆవిడకి డానియల్ ద్వారా కబురు పెట్టడం, ఆపైన ఒక వారం పదిరోజులు తన పనిలో తాను పడివుండడం-అలా కొనసాగుతూనే ఉంది ఈ వ్యవహారం.

ఇంతలో పనుల కోసం తరచుగా పట్నం వెళ్ళి వస్తున్న ఎవ్‌గెనీకి అనెస్కీలతో పరిచయం ఏర్పడింది. అలా వాళ్ల కూతురు లిజాతో ప్రేమలో పడ్డాడు ఎవ్‌గెనీ. లిజా అప్పుడే చదువు ముగించుకుని పెళ్ళికి సిద్ధంగా ఉంది. ఇలా ప్రేమలో పడి తనంతట తానే పెళ్ళి చేసుకుంటానని అడిగి ఎవ్‌గెనీ ఇంటి పరువు తక్కువ చేసుకున్నాడని తల్లి గగ్గోలు పెట్టింది. లిజాలో ఏం చూసి ఎవ్‌గెనీ ప్రేమలో పడ్డాడో చెప్పడం కష్టం. ఎవరెప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో ఎవరికి తెలుసు? లిజా నాజూగ్గా ఉంటుంది. ఆ కళ్ళల్లో ఎవ్‌గెనీ అంటే ఆరాధన కనిపిస్తుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవ్‌గెనీకీ పెళ్ళి ఈడు వచ్చే సమయానికే లిజా ఎదురు పడింది. లిజా గురించి ఆలోచించేకొద్దీ ఆమె అంటే ఎవ్‌గెనీకి ప్రేమ పెరిగిపోయింది.

అలా, ఎవ్‌గెనీకి స్తిపనీదా గుర్తురావడం మానేసింది.


కొన్ని నెలలకు ఊరొచ్చాడు ఎవ్‌గెనీ–ఎస్టేటు విషయాలు, మేనేజర్లకు ఏం చేయాలో చెప్పి వ్యవహారాలు చూసుకునేందుకు. ముఖ్యంగా పెళ్ళి కోసం బాగు చేయిస్తున్న ఇంటి పనులు చూసేందుకు.

తల్లి మేరీకి ఈ పెళ్ళి అంతగా ఇష్టం లేదు. ఈ పెళ్ళి తమ అంతస్తుకు తక్కువని, ముఖ్యంగా వియ్యపురాలు వార్వరా నోరు మంచిది కాదని, మర్యాద తక్కువ మనిషనీ ఆమె అభిప్రాయం. ఐతే లిజా ఆమెకూ చాలా నచ్చింది. అందుకని ఆమె ఆనందంగానే ఉంది. ఎవ్‌గెనీ భార్య ఇంటికి రాగానే తాను వెళ్ళిపోడానికి ఆమె ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎవ్‌గెనీ తల్లిని మరికొంత కాలం ఉండమని ఒప్పించడానికి ప్రయత్నించాడు.

పెళ్ళి మరి కొద్ది రోజులుందనగా ఓ రోజు టీ తాగుతున్నప్పుడు తల్లి మొహమాటపడుతూ, ఎలా చెప్పాలో తెలీనట్టుగా, తడబాటుతో ఎవ్‌గెనీతో చెప్పింది, “గేనీ! నీకు ఇప్పుడు పెళ్ళి అవబోతోంది. చూడబోతే నీకు లిజా బాగా నచ్చినట్టే ఉంది. నీకు నచ్చితే నాదేం లేదు మధ్యలో, వియ్యపురాలు నోరు కాస్త పెడసరం అయినానూ. అవన్నీ అటుంచి నీతో ఓ మాట చెప్పాలి. పెళ్ళి కాకముందు ఏ తిరుగుళ్ళు తిరిగినా పెళ్ళయాక అవన్నీ ఒదిలేయాలి. నీకూ నీ భార్యకూ కలతలొచ్చే పనులు చేయద్దు…”

తన తల్లి స్తిపనీదా గురించే మాట్లాడుతోందని ఎవ్‌గెనీకి అర్థమయింది. ముఖం కొంచెం ఎర్రబడింది. అది సిగ్గుతో కాదు. ఆ సంబంధం ఆగిపోయి ఏడాదయింది. ఐనా, ఆ విషయానికి అంత విలువనిచ్చి మాట్లాడ్డం అనవసరం. అమ్మ ఒంటరి కావడంతో ఇలాంటివాటి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నట్టుంది. అటువంటిదేమీ లేదనీ తనెప్పుడూ మంచీ చెడూ ఆలోచించే ప్రవర్తించాననీ చెప్పాడు.

“తెలుసనుకో. అయినా చెప్తున్నాను…” అని అర్ధాంతరంగా ఆపేసింది మేరీ. కానీ ఎవ‌గెనీకి అమ్మ ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా అనిపించింది. ఊళ్ళో అందరికీ కొడుకులే పుడుతున్నారట (యుద్ధం ఏదో రాబోతోందని సూచనలాగా). అనుకున్నట్టే పెశ్నికోవ్‌లకు కొడుకు పుట్టాడనీ తనను గాడ్‌మదర్‌గా రమ్మన్నారనీ చెప్పింది. మామూలు విషయంలాగా చెప్పబోయిన మేరీకి కొడుకు ముఖం మళ్ళీ ఎర్రబడటంతో ఇంకెలా చెప్పాలో అర్థంకాలేదు.

“మీ తాత హయాంలో లాగా…”

“అమ్మా!” అరిచినట్టే అన్నాడు ఎవ్‌గెనీ, వణికే చేతులతో కళ్ళజోడు తీసి సిగరెట్ వెలిగించుకుంటూ. “చూడూ… నా వివాహం, నా కుటుంబం నాకు చాలా ముఖ్యం. నేను అవి చెడగొట్టుకునే పనులేమీ చేయను. పెళ్ళి కాకముందు ఏమైనా ఉన్నా వాటిలో నా మెడకు చుట్టుకునేవి ఏవీ లేవు. అవన్నీ ఎప్పుడో తెగిపోయాయి. తిరిగి తీసుకోలేని తప్పులు నేనేమీ చేయలేదు. నన్నెవరూ ఆక్షేపించలేరు. సరేనా?”

ఎవ్‌గెనీ బయటకి బయల్దేరేడు. దారిలో చర్చ్ దగ్గిర జనాలని దాటుతూంటే చిన్న పిల్లాడితో స్తిపనీదా! ఆ పిల్లాడు తన కొడుకేనేమో అనే ఆలోచన ఒక్కసారి ఎవ్‌గెనీ బుర్రలో చొరబడింది. జనాలని దాటుకుంటూ వచ్చి ఎంత తప్పించుకుందామన్నా ఆ ఆలోచన తెగదే! ఏమి దరిద్రం? ఆవిడతో కొన్నిసార్లు కలిస్తే మాత్రం ఆ పిల్లాడు తన కొడుకు ఎలా అవుతాడు? ఆవిడకో మొగుడు లేడా? ఆవిడకి కావాల్సిన డబ్బులు తానిచ్చాడు. తనక్కావాల్సిన సుఖం ఆవిడిచ్చింది. అక్కడితో సరి. తనేమీ తన అంతరాత్మ గొంతు నొక్కేసుకోలేదు. అది తనను ఎప్పుడూ నిలదీయలేదు. అంతే. బుర్ర విదిల్చి ముందుకు సాగిపోయేడు ఎవ్‌గెనీ.

ఒక వారం తర్వాత లిజాతో పెళ్ళి జరిగింది. ఎవ్‌గెనీ కొత్తపెళ్ళికూతురితో కలిసి ఎస్టేటుకు వచ్చేశాడు. కొత్త దంపతుల మధ్య ఉండకుండా తల్లి వేరే చోట ఉంటానంది కానీ ఎవ్‌గెనీ ఒప్పుకోలేదు. ఇంట్లోనే ఆవిడ వేరే చోట పడుకునే ఏర్పాట్లు చేసి, తన కొత్త సంసార జీవితాన్ని మొదలుపెట్టేడు.

అలా ఎవ్‌గెనీకి ఒక కొత్త జీవితం మొదలయింది.


పెళ్ళయిన మొదటి ఏడాది ఎవ్‌గెనీకి రెండు కష్టాలొచ్చిపడ్డాయి. ఒకటి ఆర్థిక ఇబ్బంది. ఎస్టేట్ ఎంత బాగా సాగుతున్నా అన్నకు పంపాల్సిన డబ్బు, తన పెళ్ళి ఖర్చులు, ఫ్యాక్టరీ మూత పడడం బాగా ఇరుకున పెట్టాయి. లిజా తన డబ్బు వాడుకోమని ఎవ్‌గెనీకి నచ్చచెప్పింది. అత్తగారితో మాటపడకుండా ఉండడం కోసం ఎస్టేటులో సగం లిజా పేర రాయాల్సొచ్చింది. ఇది ఇలా ఉంటే, గుర్రం బండిలోంచి పడి గర్భస్రావం అయి అనారోగ్యం పాలయింది లిజా. భార్య ఆరోగ్యం, అటూయిటూగా ఉన్న ఆర్థిక పరిస్థితితో ఎవ్‌గెనీ అతలాకుతలమయిపోయేడు.

ఐతే ఏడాది తిరిగేసరికి ఎవ్‌గెనీకి మెల్లిగా అన్నీ కలిసివచ్చాయి. ఎస్టేట్ వ్యవహారం ఇప్పుడు ముందున్నంత దరిద్రంగా లేదు. అప్పులు ఒక్కొక్కటీ తీరుతున్నాయి. ఫలసాయం బాగానే ఉంది. ఒకప్పటి తాత గౌరవం నిలిపే పరిస్థితి దగ్గిరలోనే ఉంది. కాని, అతని ఆనందానికి అతని పెళ్ళి అసలు కారణం అయింది. దానినుంచి తాను ఆశించినదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా అతనికి దొరికింది.

లిజాకి ఎవ్‌గెనీ అంటే అదో ఆరాధన. తనని ఏరి కోరి చేసుకున్నాడనో మరోటో కారణం. ఇంట్లో ఎవ్‌గెనీకి ఏది కావలిస్తే అది అమర్చి పెడుతోంది. అతని ఇష్టాయిష్టాల గురించి అతనికంటే ఆమెకే బాగా తెలుసు. తన అత్తగారు వార్వరా ఏదైనా అన్నా సరే ఇప్పుడు లిజా మొగుణ్ణి వెనకేసుకొచ్చి తల్లితో వాదనకి దిగుతోంది. అలా లిజా తన పక్షమే ఎప్పుడూను. సంసారంలో దెబ్బలాటలు వస్తాయంటారు కానీ అవి నిజంగాదు కాబోలు. లిజా లాంటి భార్య ఉంటే దెబ్బలాటలెందుకొస్తాయ్? ఇంటా బయటా తనకెలా కావాలో అలా లిజా తనను తాను తీర్చిదిద్దుకుంది. అంతకన్నా ఏం కావాలి? ప్రేమంటే ఇదే కదూ? తనని అంతగా ప్రేమించే లిజా దొరకడం తన అదృష్టం.

తనను తాను హుందాగా, నాజూకుగా భర్త కోసం దిద్దుకున్న లిజాలో ఆ బంధాన్ని చెడగొట్టగలిగే ఒకే లక్షణం అసూయ. తన భర్తను తను తప్ప ఇంకెవరూ ప్రేమించడానికి అర్హులు కాదనీ (తన అర్హత ఆమె ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు) అలానే తన భర్త ఇంకెవరినీ ప్రేమించి ఉండకూడదనీ ఆమె భావన. ఎవ్‌గెనీ జీవితంలో ఇంకో స్త్రీ ఉన్నదేమో అన్న అనుమానం లిజా ఎంతగా దాచుకున్నా ఆ అసూయ ఆమెను బాధిస్తూనే ఉంటుంది అప్పుడప్పుడూ.


ఆ ఏడాది గడిచి మరో ఏడు ముగిసేసరికి లిజా మరోసారి కడుపుతో ఉంది. కొడుకు పుడితే బాగుణ్ణని ఎవ్‌గెనీ తల్లి మేరీ అనుకుంటోంది. వార్వరా అప్పుడప్పుడూ వచ్చి నోటికొచ్చినట్టు వాగి వెళ్తూనే ఉంది. పెళ్ళైపోయింది కనక ఎవ్‌గెనీకి ఇప్పుడు స్తిపనీదాతో గడిపిన రోజులు గుర్తుకు రావట్లేదు. అప్పుడప్పుడూ మేనమామ ఒకడు వచ్చి ఉండి వెళ్తున్నాడు. ఎవ్‌గెనీ పొద్దున్నే బయటకెళ్ళి పదింటికో ఎప్పుడో ఏదో తినడానికి ఓ సారి మళ్ళీ ఇంటికొస్తాడు. అప్పుడు అందరూ కూర్చుని కబుర్లు. అదయ్యాక మళ్ళీ సాయంత్రం అందరూ కల్సి భోజనం. రోజులు బాగానే గడిచిపోతున్నాయి.

లిజాకు క్రితం సారి అయినట్టు గర్భస్రావం అవకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అయిదో నెల జరుగుతూండగా రాబోతున్న ట్రినిటీ సండే పండగకు లిజా ఇల్లంతా కడిగించడానికి పూనుకుంది. ఎవ్‌గెనీని అడిగితే ఈ పనికి ఎవర్నో ఒకర్ని పిలిపించుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. అలా స్తిపనీదా మళ్ళీ ఎవ్‌గెనీ ఇంట్లో అడుగుపెట్టింది, ఇల్లు కడగడానికి.

అసలు స్తిపనీదాకి ఇలా ఇల్లు కడిగి డబ్బులు సంపాదించే అవసరం లేదు. ఆవిడ ఒంటరిగా ఉంటోంది. భర్త ఊళ్ళో ఉండట్లేదు. ఎవ్‌గెనీలానే డానియెల్ ద్వారా ఇంకో యువకుడికి దగ్గరయింది. ఆవిడ ఆలోచన్లు వేరు. ఒకప్పుడు తనతో గడిపిన ఎవ్‌గెనీ ఇప్పుడు తనవాడు కాదు. ఆయనకి పెళ్ళయిపోయింది కనక ఆయనో పెద్దమనిషి. ఇప్పుడు స్తిపనీదా ఆలోచన ఏమిటంటే, అసలు ఎవ్‌గెనీ వాళ్ళావిడ ఎలా ఉంటుందో వీళ్ళిద్దరి సంసారం ఎలా ఉందో చూడాలి. ఆ ఆలోచనతోటే డానియల్‌ని ఒప్పించి ఇలా ఇల్లు కడిగే వంకతో పనిలోకి వచ్చింది చూడ్డానికి.

పొద్దున్నే పనిలోకి వెళ్ళిన ఎవ్‌గెనీ ఆకలితో కడుపు మండుతుంటే ఇంటికొచ్చేడు. ఇల్లు కడిగే పనిలో భాగంగా ఇంట్లో సామానంతా బయట పెట్టి ఉంది. భార్య పనితనాన్ని మెచ్చుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు ఎవ్‌గెనీ. తలుపు నెట్టబోతుండగా అదే తెరుచుకుంది. అటునుంచి తెరిచిన పనిమనిషిని తలెత్తి చూసిన ఎవ్‌గెనీకి అవే కళ్ళు, నవ్వుతూ కనిపించాయి.

స్తిపనీదా! ఆవిడ తనని దాటి నడిచి వెళ్తూంటే, కళ్ళు తిప్పుకోలేక ఆవిడ కళ్లకేసీ వంటికేసీ అలా చూశాడు. ఆవిడ కూడా ఒకసారి తలతిప్పి చూసింది. ఎవ్‌గెనీకి ఒక్కసారి ఎవరో వెన్నుమీద చరిచినట్టయి బుర్ర విదిల్చాడు.

జాగ్రత్తగా బూట్లు చేత్తో పట్టుకుని తన గదిలోకి వచ్చాడు ఎవ్‌గెనీ. గచ్చు తుడుస్తున్న ఇంకొక పనిమనిషి అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది. ‘ఇప్పుడు స్తిపనీదా ఇక్కడికొస్తుంది ఒంటరిగా’ అని ఎవరో చెప్పినట్టుగా అనిపించింది అతనికి. దేవుడా! ఏం చేస్తున్నాను! ఏం ఆలోచిస్తున్నాను! అనుకుంటూ కంగారుగా గదిలోంచి బైటికి వచ్చాడు ఎవ్‌గెనీ. అదే సమయంలో లిజా నడుస్తూ వచ్చింది అక్కడికి. ఎప్పుడూ వింత వెలుగుతో కళకళ్ళాడే లిజా మొహం ఈ రోజెందుకో పాలిపోయినట్టు కనిపించింది ఎవ్‌గెనీకి.

మరుసటి రోజు పొద్దున్నే పొలం వెళ్ళి మధ్యాహ్నం ఇంటికొచ్చిన ఎవ్‌గెనీ అందరితో కలిసి భోజనం చేస్తూండగా అత్తగారు ప్రతీదీ కల్పించుకోవడం గమనించాడు. తాను లిజాని బాగా నిద్ర పట్టిందా అని అడిగితే, లిజా నోరు తెరిచేలోపల అత్తగారే సమాధానం చెప్పేస్తోంది- ‘ఈ వేడిలో ఇంట్లో నిద్ర ఎలా పడుతుందీ, పట్టకపోయినా తన కూతురు నిద్ర బాగా పట్టినట్టు అబద్ధం ఆడుతోందీ,’ అని. అన్నీ ఆవిడ చెప్పేయగలదు. ఆవిడకి తెలియని విషయాలు లేవు. ఎండ మంచిది కాదు లిజాకు అని అన్నది. పది తర్వాత ఎండ ఉండదు గదా అని మేరీ అన్నది. ఆఁ, ఆ నీడ మంచిది కాదు అన్నది వార్వరా వెంటనే. తన భర్త తనకు ఏ లోటూ లేకుండా చూసుకున్నాడని, లిజా మంచి అమ్మాయి కాబట్టీ ఏమీ అనటం లేదనీ అన్నది.

“నాకు బాగానే ఉంది కదా!” లిజా అంది సమాధానంగా.

“నిజంగానేనా లేకపోతే మీ ఆయన్ని సంతోషపరచడానికంటున్నావా?”

మాట మార్చడానికి లిజా చుట్టూ చూసి అంది, “కాఫీలోకి క్రీమ్ తెచ్చేదా?”

“వద్దు వద్దు.” వార్వరా అంది, తన సంగతి చెప్పుకుంటూ.

“సరే అయితే ఎవ్‌గెనీకి తెస్తాను,” అంటూ లేవబోయింది లిజా.

“అంత త్వరగా లేవడం అన్నీ కంగారుగా చేయడం కడుపులో బిడ్డకు మంచిదికాదు. నిదానంగా వెళ్ళమ్మా.” మేరీ అంది. ఆవిడ ఆత్రం మనవడికేమీ కాకూడదని.

ఎడ్డెం అంటే తెడ్డెం అని తీరాలనే వార్వరా అందుకుని చెప్పింది కటువుగా, “మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఎలా ఉన్నా ఫర్వాలేదు.”

ఇదంతా వింటూ కూడా ఎవ్‌గెనీ అన్యమనస్కంగా ఉండడం లిజా గమనించింది. ఈ వాదులాటలు అతనికి అలవాటే. కానీ ఈరోజు మరీ పరధ్యానంలో ఉన్నాడు. తన కాఫీ కప్పులో పడిన ఈగని కూడా చూసుకోలేదు. ఎవ్‌గెనీ ఎవరి గురించో గానీ ఆలోచిస్తున్నాడా? ఆ ఆలోచన రాగానే లిజా మనసులో అసూయ మొదలైంది.


మర్నాడూ ఆ పైరోజూ కూడా స్తిపనీదా ఆలోచనలు ఎవ్‌గెనీని వదల్లేదు. ఏవో పనులున్నా అవన్నీ చేస్తున్నా మనసునిండా ఈవిడే. పెళ్ళితో తన పాత జ్ఞాపకాలన్నీ పూర్తిగా పోయాయనే అతననుకున్నాడు. తన గతజీవితంలోని సంబంధాలన్నీ మాయం అయిపోయాయనీ అతని మనసులో ఇప్పుడు కేవలం ఆతని భార్య మాత్రమే ఉందనీ అనుకున్నాడు. కాని, అనుకోకుండా స్తిపనీదా ఎదురుపడడంతో ఇలా కందిరీగల తుట్టెలా అవన్నీ తిరిగివస్తాయని అతనూహించలేదు. స్తిపనీదా పొందు అతనిప్పుడు కోరుకోటల్లేదు కానీ ఆమె పైని వ్యామోహం ఇంకా ఉన్నందుకు అతను మథనపడ్డాడు. మెల్లిగా ఆ పనీ ఈ పనీ చూసుకుంటూ కాసేపు ఆమెను మర్చిపోయాడు. తరవాత గుర్రాల దగ్గరకి నడుస్తుండగా తనను దాటి పరుగెత్తుకుంటూ పోయిన అదే ఎర్ర గౌనూ తలకు చుట్టిన ఎర్ర రుమాలూ అదే ఆరోగ్యవంతమైన శరీరం అతనికి ఆ పొలాన్నీ ఆ గడ్డివామినీ ఆ మధ్యాహ్నాలనూ గుర్తుకు తెచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టాయి.

ఈవిణ్ణి మనసులోంచి బయటకి తోసేయడానికి ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయాలో తెలియదు. ఇలా కొట్టుమిట్టాడాక మొత్తానికి తన పాలేరు వాసిలీని కలవడానికి బయటకెళ్ళాడు.

“పెళ్ళవక ముందు ఏదో తిరిగాననుకో, ఇప్పుడు వేరు కదా? అంచేత…”

“స్తిపనీదా గురించేనా?” వాసిలీ జాలిగా నవ్వేడు.

“ఆఁ, నాకు ఆమె ఇక్కడ ఇంట్లో పనిచేయడం, ఆమెను రోజూ చూడాల్సి రావడం ఇబ్బందిగా ఉంది. ఆవిడను పనిలోకి ఇక రావద్దని చెప్పు.”

“అలాగే, వాన్యాకు చెప్తాను. అతనే ఈమెకు పని ఇచ్చింది.”

అమ్మయ్య. ఎంత కష్టంగా ఉన్నా వాసిలీతో మాట్లాడ్డమే మంచిదయింది. ఆమెకు వాన్యా రావద్దని చెప్తాడు. తనకు ఇష్టం లేదని ఆమెకు అర్థమవుతుంది. అలా ఆ విషయం ఇక మళ్ళీ తలెత్తదు. మనసులో ఈ భయంతో, సిగ్గుపడుతూ రోజూ బతకక్కర్లేదు. నిన్నటి అతని కోరిక గుర్తొచ్చి అతను ఒక్కసారిగా జలదరించేడు.

అలా స్తిపనీదా విషయం మరుగున పడిపోయింది. లిజా మళ్ళీ ఎవ్‌గెనీ మొహంలో సంతోషం గమనించింది. పాపం, అమ్మా అత్తల తగాదాలతో విసిగిపోయుంటాడు. తనలాంటి సౌజన్యం ఉన్న మనిషి ఇటువంటి సూటిపోటి మాటలు వింటూ మామూలుగా ఉండడం ఎంతకష్టం అనుకుంది లిజా.

ఆ మరుసటి రోజే ట్రినిటీ సండే. పాలేరు ఆడవాళ్ళంతా ఆచారం ప్రకారం అడవిలోకి పోతూ కామందు ఎవ్‌గెనీ ఇంటికొచ్చారు, రోడ్ల మీద డాన్స్ చేస్తూ. ఇలాంటి విషయాల్లో పెద్దగా తల దూర్చని ఎవ్‌గెనీ ఇంట్లోకి పోయి ఏదో పుస్తకం చదవడానిక్కూర్చుంటే లిజా వచ్చి చెప్పింది, వాళ్ళందరూ తనను డాన్స్ చూడ్డానికి రమ్మంటున్నారని.

ఎవ్‌గెనీకి బయటకి రాక తప్పలేదు. మేరీ, వార్వరా, లిజా అప్పటికే వాళ్ళతో కలిసి ఆడుతున్నారు. ఆ డాన్స్ చేసే ఆడవాళ్లలో పసుపు రంగు గౌనులో బాగా డాన్స్ చేసే ఒకావిడ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది అందర్లోనూ. స్తిపనీదా! చూసీ చూడనట్టు చూపు తిప్పుకున్నాడు. కానీ ఆ దొంగచూపు అతన్ని సమ్మోహితుణ్ణి చేసింది. అదే క్షణంలో స్తిపనీదా అతన్ని చూసి అతని కోరికను పసిగట్టినట్టుగా ఆతనికి అనిపించింది. మర్యాద కోసం కాసేపు అక్కడే ఉండి ఆవిణ్ణి తప్పించుకోవడానికా అన్నట్టూ ఎవ్‌గెనీ లోపలకి వెళ్ళిపోయాడు. శరీరం అయితే తప్పించాడు కానీ మనసు తప్పితేనా? లోపలకి వెళ్ళినవాడు దొంగతనంగా కిటికీలోంచి కనపడినంతవరకూ అలా చూస్తూనే ఉన్నాడు. స్తిపనీదాతో గడిపిన క్షణాలు ఒక్కసారిగా తోసుకొచ్చాయి. వరండాలోకి వచ్చి సిగరెట్ వెలిగించుకుని అటూ ఇటూ చూసి ఇంటి వెనకనుంచి పరుగెట్టుకుంటూ బైటకి వచ్చాడు. ఇంతలో చెట్లచాటుగా ఆ పసుపు గౌన్, ఎర్ర రుమాలు కనిపించాయి. వెంటనే అటుగా నడిచేడు వేగంగా. స్తిపనీదా ఇంకో ఆమెతో కలిసి దిగుడు బావి వైపుగా పోతోంది. ఇంతలోనే, “ఎవ్‌గెనీ ఇర్తెనేవ్! ఎవ్‌గెనీ ఇర్తెనేవ్! నమస్కారం!” అంటూ ఊరి రైతు సమోఖిన్ పలకరింపు వినపడి ఆగిపోయాడు. అతనితో మాట్లాడుతూ జాగ్రత్తగా పక్కకు తిరిగి నిలుచున్నాడు ఎవ్‌గెనీ. ఆ ఆడవాళ్ళిద్దరూ ఆ బావి వైపుకు వెళ్ళి కాసేపు అక్కడే ఉండి తిరిగి డాన్స్ సర్కిల్‌లోకి వెళ్ళిపోయారు.

వెనక్కొచ్చిన ఎవ్‌గెనీ తాను ఏదో తప్పు చేసినట్టుగా భావించాడు. స్తిపనీదాకు తెలిసిపోయింది తన కోరిక. ఆమెకూ ఇష్టమే. అందుకే ఆ బావి వైపు స్నేహితురాలు అన్నాతో నడిచింది. తన కోరిక ఇప్పుడు స్తిపనీదాతో పాటూ అన్నాకూ తెలిసిపోయింది. ఇదో నరకం. తన ఆలోచనల్లోంచి ఈ స్తిపనీదా పోదు. తాను ఆవిణ్ణి చూడకుండా ఉండలేడు. తనపైన తనకే పట్టు లేనట్టుగా తన ఆలోచనలను ఇంకెవరో శాసిస్తున్నట్టుగా అనిపించింది. కులీనుడైన తను, ఒక పాలేరు స్త్రీ కోసం తన భార్యను మోసగించలేడు. అది సర్వనాశనానికే దారితీస్తుంది. ఇది అన్నివిధాలా అనర్థమే. తను ఇలా బతకలేడు. ఏదో ఒకటి చేయకతప్పదు. ఎలా? ఎలా?

“తన గురించి మర్చిపో! మర్చిపో!” ఎవ్‌గెనీ తనను తాను శాసించుకున్నాడు. ఊహూ! ఇలా కాదు. ఈ కొవ్వొత్తిలో వేలు కాల్చుకుంటాను. ఆ మంట తనని మర్చిపోయేలా చేస్తుంది, అనుకున్నాడు. వెలుగుతున్న కొవ్వొత్తి మంటలో వేలు పెట్టాడు. కాలిన వేలును చూసుకుని పెద్దగా నవ్వాడు. ఇలా కాదు. ఇలా మర్చిపోలేడు స్తిపనీదాను తను. ఇది దారి కాదు. మరేది దారి? తనను నేను చూడకూడదు. ఎలా? ఆఁ, తనను ఊరినుంచి పంపేస్తాను! అదే మార్గం! అనుకున్నాడు.

అన్నీ ఆలోచించి మరోసారి వాసిలీ దగ్గిరకెళ్ళి చెప్పాడు, “మళ్ళీ ఆ విషయమే మాట్లాడ్డానికొచ్చాను.”

“ఆవిణ్ణి పనిలోకి తీసుకోవద్దని చెప్పాను. ఇంకా దాని గురించి బుర్ర పాడుచేసుకుంటారెందుకు?” వాసిలీ అడిగేడు.

“అలా కాదు; ఆవిడ ఈ ఊళ్ళో ఉన్నంత కాలం నాకు బుర్ర పనిచేయదు. ఇక్కడ్నుంచి ఆవిణ్ణి ఎలాగోలా పంపించేస్తే బాగుంటుంది.”

“ఎక్కడికని పంపిస్తారు?” ఆశ్చర్యంగా అడిగేడు వాసిలీ.

“ఎక్కడికో ఒక చోటికి. నాకు మళ్ళీ ఈవిడ కనిపించకుండా ఉంటే చాలు. వెళ్ళిపోవడానికి డబ్బులు కావాలేమో అడిగి చూడు.”

“ఉన్న ఊళ్ళోంచి వెళ్ళిపో అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అయినా ఈ విషయం మీద ఎందుకంత బుర్ర పాడుచేసుకోవడం? మనందరం ఎప్పుడో ఒకసారి తప్పు చేసినవాళ్ళం కాదా? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులనుకోకండి. దాని గురించి ఆలోచించవద్దు. ఆలోచించేకొద్దీ బుర్ర పాడౌతుంది.”

“అలాకాదు. నువ్వేదోలాగ ఆవిడతో మాట్లాడి చూడు, ఆవిడ ఇక్కడ్నుంచి వెళ్ళిపోయేలాగ.”

బుర్ర అడ్డంగా ఊపుతూ చెప్పేడు వాసిలీ, “అలాగే మాట్లాడతాను కానీ ఏమీ ఉపయోగం ఉండదు. ఐనా ఎవరున్నారని మీ గతాన్ని కెలికి తీసేవారు? అనవసరంగా ఎందుకీ పిచ్చి ఆలోచనలు?”

ఇంటికొచ్చిన ఎవ్‌గెనీ యమయాతనపడ్డాడు. వాసిలీ స్తిపనీదాతో మాట్లాడాడా? ఏమందో ఆవిడ? ఇవే ఆలోచనలు. ఆలోచనలు వదిలించుకోవడానికి బుర్ర విదిల్చి బయటకొచ్చాడు. తనమీద కక్ష తీర్చుకోవడానికా అన్నట్టూ అప్పుడే స్తిపనీదా ఎక్కడికో బయల్దేరుతూ తళుక్కున కనిపించింది. తల రెండు చేతుల్తో పట్టుకుని మళ్ళీ ఇంట్లోకి నడిచేడు ఎవ్‌గెనీ.


ఇంతలోనే మరోసారి లిజా పెరట్లో కాలు జారి కింద పడింది. కాలు బెణికి నడవలేకపోతున్న లిజాను జాగ్రత్తగా ఎత్తుకుని ఇంట్లోకి తెచ్చాడు ఎవ్‌గెనీ. అలా ఎత్తుకున్నప్పుడు లిజా అందమైన ముఖంలోని బాధ ఎవ్‌గెనీ మనసును కదిలించివేసింది. తాను లిజాని అంత జాగ్రత్తగా ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చినా అత్తగారు వార్వరా సణుగుతూనే ఉంది అలవాటు ప్రకారం. ఏదైతేనేం, డాక్టర్‌కు కబురు వెళ్ళింది. ఆయన వచ్చి చూసి అంతా బాగుందని చెప్పి ఏదో మందిచ్చి వెళ్ళాడు. గండం గడిచినట్టే. ఓ వారం మంచం దగ్గిరే ఉండి లిజాకి సేవచేస్తూ గడిపేడు ఎవ్‌గెనీ. ఆమెకు పుస్తకాలు చదువుతూ, ఆమెతో మాట్లాడుతూ, వార్వరా ఎత్తిపొడుపులు భరిస్తూ వారం అంతా గడిపేడు. ఇంట్లోంచి బయటకెళ్ళి కాస్త అలా తిరిగి రమ్మని ఎవ్‌గెనీని ప్రేమగా పోరింది లిజా. ఇక్కడే మంచం దగ్గిర రోజంతా కూర్చుంటే పిచ్చెక్కదూ? అదీగాక, పొలాల్లో పని ఉన్న రోజులవి. ఆ పనులూ చూసుకోవాలి. అలా ఎవ్‌గెనీ మళ్ళీ ఇంట్లోంచి కాలు బైటపెట్టేడు.

పొలంలో, అడవి దగ్గర, పంటనూర్పుల దగ్గర, ఎక్కడకెళ్ళినా స్తిపనీదా ఆలోచన ఎవ్‌గెనీ మనసునొదలలేదు. ఒకప్పుడు ఏ వారం పదిరోజులకో గుర్తొచ్చే స్తిపనీదా స్పష్టంగా ఇప్పుడు అతని మనసులో తిష్టవేసుక్కూచుంది. అంతకుముందు ఏ ఆరునెలలకో గాని కనిపించని స్తిపనీదా ఇప్పుడు ఇంచుమించు రోజూ కనిపిస్తోంది. అతను మళ్ళీ ఆ పాత రోజులను కోరుకుంటున్నాడని ఆమెకు తెలుసేమో, అందుకే అతని దారిలోకి రావడానికి ఆమె కూడా ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఐతే, ఇద్దరూ ఒకరినొకరు చూసీ చూడనట్టే తప్పుకుంటున్నారు. ఒకరినొకరు పలకరించుకోలేదు. ఆ గడ్డివామి దగ్గరకు నేరుగా వెళ్ళిపోలేదు. ఓ సారి ఒక్కడూ నడుస్తూంటే ఎదురుగా వస్తూ కనిపించింది కూడా. తన వళ్ళు స్వాధీనం తప్పేలోపుల తనని దాటి వెళ్ళిపోయింది. ఇంకొన్నిసార్లు తనను దొంగతనంగా గమనించేవాడు. ఆ రకంగా అతని ఊహల్లో ఆమె మరింత ఆకర్షణీయంగా కనిపించేది. ఏదైనా జరిగితే లిజాకి ఇదంతా తెలియడం ఎంతసేపు?

తను అదుపు కోల్పోతున్నట్టుగా, పిచ్చివాడైపోతున్నట్టుగా ఎవ్‌గెనీ భావించేడు. తన మీద తనకు అదుపు ఉంది అని చెప్పుకున్నాడు. తన ప్రవర్తనను, తన ఆలోచనలను అసహ్యించుకున్నాడు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడో, ఏ చీకటిలోనో ఆమె తనకు కొద్దిగా దగ్గరికి వస్తే, ఆమెను తాకితే తన నిగ్రహం పూర్తిగా ఆవిరయిపోతుందని అతనికి తెలుసు. పదిమందిలో ఉంటే తనలోని పాశవికమైన కోరికను అదుపు చేసుకుంటాడు. అందుకే చీకటినీ ఏకాంతాన్నీ కోరుకుంటున్న తనను తాను ఏహ్యతతో చూసుకున్నాడు. తను ఒక హేయమైన నేరస్తుడు.

తనను తాను నిగ్రహించుకోవడం కోసం దేవుణ్ణి ప్రార్థించాడు. ఈవిణ్ణి మర్చిపోవాలంటే ఒకటే పద్ధతి. ఏదో పనిలో నిరంతరం నిమగ్నమై ఉండాలి. అలా పనిలో పడ్డ ఎవ్‌గెనీ అయిదు రోజులు గడిపేడు. కానీ ఈ అయిదురోజుల్లోనూ మునుపు ఏ వేళలో అయితే స్తిపనీదాని కలిసేవాడో ఆ సమయం రాగానే ఇంక మనసు నిగ్రహించుకోలేక మళ్ళీ బయల్దేరడం చేసేవాడు. అలా వెళ్ళిన రెండు మూడు సార్లు స్తిపనీదా కనిపించింది కానీ దూరంనుంచే చూసి అలాగే వెనక్కి వచ్చేశాడు.


లిజా మెల్లిగా మంచం మీదనుంచి లేచి తన పనులు చూసుకోగలుగుతోంది. అంతా బానే ఉంది ఆమెకు, భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పు తప్ప. వార్వరా ఊళ్ళో లేదు. ఉన్నదల్లా ఎవ్‌గెనీ మేనమామ. ఆయనొకప్పుడో పెద్ద తిరుగుబోతు. గప్పాలరాయడు. ఉన్నట్టుండి ఆ రోజంతా వాన పడింది. అంతా మడుగులు కట్టింది. లిజా భర్తను ఎందుకలా ఉన్నావని పదేపదే అడిగింది, ఎవ్‌గెనీ విసుక్కునేదాకా. మామ తన పరపతి గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు ఆపకుండా. ఎవ్‌గెనీ ఇక తట్టుకోలేకపోయాడు. పోయి బాయిలర్ రూము ఎలా ఉందో చూసొస్తానని రెయిన్ కోట్ వేసుకుని బయల్దేరాడు. పదడుగులు వేశాడో లేదో ఆమె వస్తూ కనిపించింది. పిక్కల పైదాకా గౌను ఎత్తి దోపుకుని తల మీదుగా శాలువా కప్పుకుని వస్తోంది. ఎవ్‌గెనీ ముందు గుర్తుపట్టలేదు.

“ఎక్కడకు పోతున్నావ్?” ఆమెను గుర్తు పట్టి నాలుక కరుచుకునే లోపునే జరగాల్సింది జరిగిపోయింది. స్తిపనీదా ఆగి చిరునవ్వు నవ్వుతూ అతనికేసి దీర్ఘంగా చూసింది.

“నేను తప్పిపోయిన దూడ కోసం వెతుకుతున్నా, నువ్వెందుకు వానలో తిరుగుతున్నావ్?”

“షెడ్ దగ్గరికి రా!” అన్నది తనో కాదో కూడా తెలియలేదు ఎవ్‌గెనీకి. తనతో అలా ఎవరో అనిపించినట్టుగా అనిపించింది. ఆమె నవ్వి, శాలువా అంచుని మునిపంట పట్టుకుని కన్ను గీటి తోట వెనకగా ఉన్న షెడ్ వైపు పరుగెత్తింది. ఎవ్‌గెనీ ఆ కాలిబాటలో షెడ్ వైపు రెండడుగులు వేశాడు.

ఇంతలో వెనకనుంచి “మాస్టర్! లిజా మిమ్మల్ని రమ్మంటున్నారు,” అని పనిమనిషి మీషా అరుపు వినిపించింది. “మందు ఏదో తీసుకొని వెళ్ళాలట కదా మీరు, రమ్మంటున్నారు.”

దేవుడా! వీడు నన్ను రక్షించాడు, అనుకుంటూ ఎ‌వ్‌గెనీ ఇంట్లోకి వచ్చి మందు సీసా తీసుకున్నాడు. బైటికి నడుచుకుంటూ వచ్చి ఇల్లు మలుపు తిరగ్గానే చెట్ల చాటుగా షెడ్ వైపుకు నడిచాడు. అతని బుర్రలో ఆమె షెడ్‌లో అతని కోసం ఎదురుచూస్తోంది. కాని, అతను వెళ్ళేటప్పటికి షెడ్ ఖాళీగా కనిపించింది. ఆమె అక్కడకు వచ్చిందన్న దాఖలాలు కూడా లేవు. ఆ షెడ్‌లో కూర్చుని ఎవ్‌గెనీ ఆలోచించసాగేడు. ‘నేను చెప్పింది విన్నదో లేదో. విన్నా కూడా ఆమె ఎందుకు వస్తుంది? తనకు ఒక మంచి భర్త ఉన్నాడు. తనే ఒక తుచ్ఛుడు. చక్కటి భార్య, పుట్టబోయే బిడ్డ, ఏం తక్కువని తనకు ఇలా ఇంకో ఆడదాని వెంబడి పడుతున్నాడు. ఐనా, ఈ వానలో తను వచ్చుంటే ఎంత బాగుండేది! ఒక్కసారి గట్టిగా వాటేసుకుని, ఏం జరిగితే అదే జరగనిస్తే ఎంత బాగుండేది! వచ్చి వెళ్ళిందేమో బురదలో కాళ్ళ అచ్చులు ఉన్నాయేమో చూస్తాను.’

ఒక చిన్న ముద్ర అయినా కనిపిస్తుందేమో అని చాలాసేపు చూశాడు. ‘తప్పకుండా వచ్చింది. తనకూ ఇష్టమే అని తెలిసిపోయింది. ఇక ఈసారి కనిపిస్తే ఆగను. నేరుగా పోయి అడుగుతాను. రాత్రి తనదగ్గరకు పోతాను.’ ఆ షెడ్‌లోనే ఎవ్‌గెనీ చాలాసేపు నిస్త్రాణగా నిరాశతో అలా కూర్చుండిపోయాడు. చివరికి ఎలానో లేచి ఆ మందు సీసా ఇచ్చేసి ఇంటికి వచ్చి వాలిపోయాడు.


ఆ రాత్రి మరోసారి కాళరాత్రే అయింది ఎవ్‌గెనీకి. లిజా ప్రసవం కోసం తాను మాస్కోకు వెళ్ళడం ఇష్టం లేక అలా ఉన్నాడేమో అని అడిగింది. కాని, బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం కోసం వెళ్ళక తప్పదు కదా. అయినా అతనికి ఇష్టం లేకపోతే వెళ్ళనంది. ఆమె త్యాగం, తన మీద ప్రేమ చూసి అతను కదిలిపోయాడు. పరిశుద్ధమైన ఆమె మనసుతో తనపట్ల ప్రేమతో తనను పోల్చుకుంటే తను మరింత నీచుడిగా, మనసు నిండా మకిలి నిండినవాడిగా అనిపించి అతను మరింత కుమిలిపోయాడు. కాని, అతనికీ తెలుసు రేఫు మళ్ళీ మనసు అటూ ఇటూ లాగుతుందని. గదిలో అశాంతిగా పచార్లు చేయడం మొదలుపెట్టేడు. దేవుడా! దీనికేది మార్గం! నేనేం చేయాలి? నాకేమిటి దారి?

ఇంతలో ఎవరో తలుపు తట్టారు. మేనమామ! ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడికి కలప దుంగ దొరికినట్లయింది ఎవ్‌గెనీ పరిస్థితి. ‘నేను నీకో విషయం చెప్పాలి. నువ్వే నన్ను రక్షించాలి’ అని నోరు తెరిచి అడిగేడు మేనమామని. ఎవరికీ చెప్పనని మాట తీసుకున్నాక మేనమామకి మొత్తం కథంతా విడమర్చి చెప్పేడు-మొదట తాను యవ్వనం వేడిలో స్తిపనీదాతో గడపడం, ఇప్పుడిలా ఆవిడ మీద ఆలోచన్లు తనని ఏడిపించుకు తినడం, క్రితం రోజే ఆవిణ్ణి ఎలాగోలా అనుభవించాలనుకున్నది, ఆఖరి క్షణంలో ఎలా తప్పించుకున్నదీ-అన్నీను.

“మామా, నేనొక నీచుణ్ణి! లిజాలాంటి భార్య ఉండి కూడా పాలేరు మనిషిపై ఇంతగా కోరిక పెంచుకున్నాను. నేనేం చేయను?”

అన్నీ విన్న మేనమామ అడిగేడు, “నీకు ఆవిడంటే లిజాకన్నా ఇష్టమా?”

“అదేం లేదు. అసలు మా మధ్య ప్రేమ అనేదే లేదు. ఆవిడ అందమైనదా కాదా అనేది కూడా అనవసరం. అదో రకమైన వ్యామోహం అనవచ్చేమో. నేను తప్పించుకోలేకపోతున్నాను. ఇందులో నాకున్న శత్రువును నేనే. ఏం చేస్తే ఇందులోంచి బయటపడతానో అర్థం కాకుండా ఉంది. నువ్వే నాకు సహాయం చేయాలి. నన్ను ఈ కూపం నుంచి బయటకు లాగాలి. నువ్వు నా పక్కనే ఉండు, ప్రతీ నిమిషం. నన్ను ఒంటరిగా వొదలకు.”

మేనమామ చెప్పడం–ఎవ్‌గెనీ, లిజా వేరే ఊరికెళ్ళడం మంచిదని. కొన్నాళ్ళు అలా తిరిగొస్తే ఈ ఆలోచనలు అవే సర్దుకుంటాయి. ఈ లోపల లిజాకి పిల్లాడు పుడితే వాణ్ణి చూసుకోవడంలో ఎవ్‌గెనీ మళ్ళీ దారిలో పడతాడు.

దీనికి ఒప్పుకుని మేనమామ చెప్పినట్టు లిజాతో కలిసి క్రైమియా బయల్దేరేడు ఎవ్‌గెనీ.


రెండు నెలలు ఇట్టే గడిచిపోయి లిజాకి ప్రసవం అయింది. ఆడపిల్ల. తిరిగి ఎస్టేటుకొచ్చారు. పిల్ల పుట్టడంతో లిజా, వార్వరా, మేరీలకి పాపని చూసుకోవడంతో సరిపోతోంది. ఎవ్‌గెనీ కూడా ఇప్పుడు పూర్తిగా మారిపోయిన మనిషిలాగా ఉన్నాడు. పాత జ్ఞాపకాలు మనసుని అంతగా పాడుచేయడంలేదు. ఎప్పట్లానే హాయిగా నవ్వుతూ ఉన్నాడు. కూతురితో ఆడుకోడం, కొత్తగా స్నేహితుడైన ఆ ఊరి మార్షల్‌తో స్నేహం, రాబోయే ఎన్నికల చర్చలు–ఇలా రోజులు హడావిడిగా గడిచిపోతున్నాయి. స్తిపనీదా గురించి అడగడానికి ఒకప్పటిలా సిగ్గుపడనూ లేదు. వంటవాడిని అడిగాడు.

“మిఖాయిల్ పెశ్నికోవ్ ఊళ్ళోనే ఉన్నాడా?”

“లేడండీ.”

“అతని భార్య?”

“ఆవిడా? ఆవిడ పెద్ద తిరుగుబోతు. ఇప్పుడు జేనోవీతో కులుకుతోంది.”

అదేమీ బాధ కలిగించలేదు ఎవ్‌గెనీకి. అబ్బా, ఎంత నిరాపేక్షతో వినగల్గుతున్నానూ ఎంత మారిపోయాను కదా! అని ఆనందపడ్డాడు.

ఎవ్‌గెనీ కలలన్నీ రానురానూ నిజమయ్యేయి. మేనమామ చెప్పినట్టు చేశాక ఇప్పుడు ఆయనకి దగ్గిరయ్యేడు ఎవ్‌గెనీ. అస్తమానూ నోరు పారేసుకునే అత్తగారు తనింటికి వెళ్ళిపోయింది. ఫాక్టరీ బాగానే నడుస్తోంది. పాడీ పంటా అన్నీ బాగున్నాయి. ఊర్లో జరిగిన ఎన్నికల్లో ఎవ్‌గెనీ నెగ్గాడు. ఇప్పుడు తన విలువ మరింత పెరిగింది. ఇంతలో రోడ్డు దాటుతున్న ఒక పాలేరు, అతని భార్య ఇతని బండి పోవడం కోసం పక్కగా ఆగిపోయారు. ఇదిగో ఇలాంటివారిపై ఇప్పుడు అధికారం కూడా వచ్చింది తనకు. వారిని దాటుతుండగా చూశాడు ఎవ్‌గెనీ. ముసలి పెశ్నికోవ్, అతని కోడలు స్తిపనీదా. స్తిపనీదా ఇంకా అందంగానే ఉంది. కానీ అది ఎవ్‌గెనీని ఏమాత్రం కదిలించలేదు.

మరుసటి రోజు పొలంలోకి వెళ్తూంటే మళ్ళీ అదే తెలిసున్న స్థలం, మళ్ళీ అదే గతం, మళ్ళీ అవే ఆలోచన్లు. ఒక్కసారి ఎదురుగా తళతళ మెరుస్తూ ఎప్పటిలాగానే స్తిపనీదా! ఒక్కసారి పీకనొక్కేసి అణిచేసిన అనుభవాలు, అంతర్లీనంగా అణగదొక్కబడిన మనస్సూ బుస్సుమంటూ తాచుపాములా పడగవిప్పి ఉధృతంగా బయటకొచ్చాయి. ఏదైతే చేయకూడదనుకున్నాడో అదే పని చేయడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టున్నాయి. ఒక్కసారి గిరుక్కున తిరిగి తనని తాను సమాధానపర్చుకుంటూ ఇంటికి బయల్దేరబోయేడు. కానీ వెనకనుంచి మాటలు వినబడ్డాయి ఎవరో స్తిపనీదా కూడా ఉన్నవాళ్ళు అంటున్నారు, “వెళ్లవే, ఆయన నీకోసమే వచ్చినట్టున్నాడు. మళ్ళీ దొరుకుతాడో లేదో! వెళ్ళు వెళ్ళు!”

స్తిపనీదా గుడిసెకేసి పరుగెత్తడం ఎవ్‌గెనీ చూశాడు. ఇంతలో ఎవరో పాలేరు నిలపడంతో వెళ్ళలేక ఇంటికొచ్చేడు. ఒళ్ళు మంటలెక్కడం తెలుస్తూనే ఉంది. విపరీతమైన కోపం వస్తోంది. ఎవరి మీదో తెలియదు. ఏమీ చేయలేని తన చేతకానితనంపై ఏదో చేయబోయిన స్తిపనీదాపై, ఆవిడ కనపడగానే తన ఒళ్ళూ మనసూ స్వాధీనంలో లేకపోవడంపై- అన్నింటి మీదా కోపం! తన చేతకానితనం మీదా తనని కవ్విస్తున్నట్టున్న స్తిపనీదా మీదా కోపం. రెండు నెలల క్రితం అన్నీ వదులుకుని క్రైమియా వెళ్ళొచ్చి ఈవిణ్ణి మర్చిపోయాననుకోవడం ఎంత తప్పు! ఏవో కారణాలవల్ల మర్చిపోయినట్టనిపించింది కానీ మనసులో అలా నిగూఢంగా దాక్కునే ఉన్నాయి ఈవిడ తాలూకు జ్ఞాపకాలన్నీను. ఈ దరిద్రం తనని అసలు వదిలేనా? పెళ్ళయ్యాక ఈవిణ్ణి మర్చిపోవచ్చనుకున్నాడే!

ఏం చేయబోయినా, ఏం చేయకున్నా స్తిపనీదా జ్ఞాపకాలు వదిలిపెట్టడంలేదు. తోటలో తిరుగుతూ ఏదో ఆలోచిస్తున్నట్టు నటిస్తున్నాడనీ, ఒక ఉన్మాదిలా ఆమె కోసం ఎదురు చూస్తున్నాడనీ అర్థమవుతోంది. ఏదో ఒక ఇంద్రజాలం లాంటిది జరిగి ఆమెకు ఈ విషయం తెలిసి ఆమె వెంటనే వస్తుందనీ ఇద్దరూ కలిసి ఎవరూ లేని ఏ చోటికో వెళ్ళిపోతారనీ లేదా, ఏ చిమ్మచీకటి రాత్రో తను వస్తుందనీ ఆ శరీరాన్ని ఒక్కసారి తాకి…

ఎవ్‌గెనీ తల విదిలించేడు. ‘విడిపోదామనా నా ప్రయత్నం! ఇదంతా శరీరారోగ్యం కోసం ఒక ఆరోగ్యవంతమైన స్త్రీ కావాలి, అంతే! అని కదూ తాను అనుకుంది? కాదు. ఇటువంటివాళ్ళతో అలా కుదరదు. నేను తనను ఆక్రమించుకున్నాననుకున్నాను కాని నిజానికి తను నన్ను స్వాధీనం చేసుకుంది. నన్ను పట్టుకుని వదిలిపెట్టడంలేదు. ఈ పెళ్ళి, ఈ ప్రేమ అంతా నన్ను నేను చేసుకున్న మోసం. స్తిపనీదాతో కలిసినప్పుడే భర్త భావన కలిగింది. తనతోనే కలిసి బతకాల్సింది నేను.

రెండు జీవితాలు ఎలా సాగించడం? రెండు పడవల మీద చెరో కాలూ వేసి నడపడం కుదిరేదేనా ఎవరికైనా? పెళ్ళి అయ్యేక లిజా, పుట్టిన పిల్ల, ఎస్టేట్, అధికారం, పరువుప్రతిష్టలు కాపాడుకుంటూ బతకడం ఒక దారి. ఆ దారిలో స్తిపనీదా తన జీవితంలోకి రావడానికి ఆస్కారం ఇవ్వకూడదు. అంటే ఆవిడ ఈ ఊళ్ళోంచి బయటకిపోయినా సరే, కుదరకపోతే చచ్చినా సరే తనకి అనవసరం. వాసిలీకి చెప్పి ఆవిణ్ణి ఊర్లోంచి బయటకి పంపించాలనేది కుదరదు కాబోలు. తాను అడిగినదానికి ఇప్పటిదాకా ఏమీ చెప్పలేదు వాడు. ఇంక మిగిలింది, దాన్ని ఎలాగో ఒకలాగ చంపేసి వదుల్చుకోవడమే. రెండో దారి మిఖాయిల్‌కి ఎంతో కొంత ముట్టచెప్పి వాణ్ణి పంపించేసి, అవమానాల పాలైనా సరే ఆ తర్వాత స్తిపనీదాతో జీవించడం. లిజాని బిడ్డని మట్టుపెట్టడం. ఒద్దు ఒద్దు. బిడ్డ పర్లేదు, లిజా ఉండకూడదు. లిజాని చంపితే? పిల్లని ఎవరో ఒకరు చూస్తారు–తన తల్లి మేరీయో లేకపోతే అత్తగారో. లిజాని చంపడం కన్నా అస్తమానూ మంచం ఎక్కుతోంది కనుక ఆవిడే ఏదో రోగం వచ్చి పోతే ఎవరికీ అనుమానం రాదు. ఈ దారిలో అయినా సరే వీళ్ళిద్దరిలో ఒకరు చావవల్సిందే. ఏ విధంగా చూసినా ఓ చావు తప్పదు. అది ఎవరిదైతేనేం?’

పక్కనుంచి అంతరాత్మ హెచ్చరించినట్టై ఎవ్‌గెనీ అన్నాడు గొణుగుతున్నట్టూ-‘ఇదిగో ఇలాగే మనుషుల మనసుల్లో విషం నిండుతుంది. ఇందుకే తమ భార్యలను, ప్రియురాళ్ళను మగవాళ్ళు చంపేసేది. ఓ స్కౌండ్రల్! ఎవరో ఒకరు చావాలంటే అది స్తిపనీదా అయి తీరవల్సిందే. లిజా తప్పు ఏమీ లేదు ఇందులో. పోయి తనను పిలు. కౌగిలించుకో. గుండెల్లోకి తూటా దింపు. పీడ విరగడవుతుంది. ‘పక్కనే టేబిల్ సొరుగు లాగి చూశాడు. రివాల్వర్ మెరుస్తోంది. ఎన్ని గుళ్ళు ఉన్నాయో చూస్తే సరిగ్గా ఆరింటిలో ఒక గుండు వాడాడు ఇంతకుముందు. మిగిలినవి ఐదు. బయటకెళ్ళినప్పుడు స్తిపనీదా కనిపిస్తే–కనిపిస్తే ఏమిటి? కనిపించి తీరుతుంది–వెనకనుంచి ఎలా కాల్చినా ఐదు గుళ్ళలో ఒకటి తలకి తగిల్తే చాలు. రెండు గుళ్ళు తగిలాయా, అదృష్టమే. వెంఠనే చచ్చి ఊరుకుంటుంది. దానితో తన దరిద్రం వదుల్తుంది కూడా. అవును, ఈ దయ్యం, తనని పట్టి ఏడిపిస్తున్న ఈ దయ్యం చావవల్సిందే. ఏదో నిశ్చయించుకున్నవాడిలా రివాల్వర్ జేబులో పెట్టుకోబోతూంటే లిజా గదిలోకి రావడం కనిపించింది ఎవ్‌గెనీకి. లిజాకి కనిపించకుండా రివాల్వర్ మీద అక్కడే ఉన్న పత్రిక కప్పేడు.

లోపలకి వచ్చిన లిజా అడిగింది, “మళ్ళీ అలాగే ఉన్నట్టున్నావే?”

“అలాగే అంటే?”

“నాకు తెలియదనుకున్నావా? నిన్ను దాదాపు ఆరునెలల నుంచి గమనిస్తున్నాను. మనసులో ఏదో ఉంది. బయటకి నాతో చెప్పవు. మొహం చూస్తే శ్మశానంలో ఎవర్నో పాతిపెట్టి వచ్చినవాడిలా ఉంటావు. ఈ సారి ఇంక నిన్ను వదిలేది లేదు. నాతో చెప్పి తీరవల్సిందే. ఏమిటి నీ మనసులో ఉన్నది? నా గురించా? అమ్మ గురించా? పుట్టిన పాప మిమీని ఎలా పెంచాలో అనే బెంగా? చెప్పేదాకా నేను ఊరుకునేది లేదు…”

“చెప్పమంటావా? ఇలా చెప్పేస్తే పోయేది కాదేమో, అయినా నిజంగా చెప్పడానికేమీ లేదు…” విరక్తిగా నవ్వాడు ఎవ్‌గెనీ.

సరిగ్గా అదే సమయంలో పాపని చూసుకునే ఆయా గది లోపలకి వచ్చి లిజాతో, “బయట మంచి ఎండ కాస్తోంది! అలా పాపని బయటకి తీసుకుని వెళ్ళి నడిచి వద్దాం వస్తారా?” అంది.

లిజా ఆయాతో బయటకి నడవబోయిందల్లా వెనక్కి వచ్చి చెప్పింది ఎవ్‌గెనీతో, “ఇప్పుడే అరగంటలో వచ్చేస్తా, ఎక్కడికీ వెళ్ళిపోకు సుమా. ఈ రోజు పూర్తిగా చెప్పితీరవల్సిందే.”

“సరే, చూద్దాం.”

బయటకెళ్ళబోయే లిజా మరోసారి ఎవ్‌గెనీకేసి తిరిగి నవ్వుతూ చూసింది. ఎందుకో ఎవ్‌గెనీ మొహంలో జీవం ఉన్నట్టు కనబడలేదు. మరీ అంత బుర్ర తినేసే విషయం ఏమై ఉంటుంది?

లిజా ఆయా, మిమీలతో ఇంటి మెట్లు దిగుతూంటే అప్పుడు వినిపించింది ఢామ్మంటూ రివాల్వర్ చేసిన శబ్దం. వెనక్కి పరుగెట్టుకు వెళ్ళేసరికి రివాల్వర్ గుండు తగిలిన తలలోంచి ధారాపాతంగా కారుతున్న రక్తం మడుగులో ఎవ్‌గెనీ! నెప్పితో అటూ ఇటూ కదులుతూ నిశ్చేతనం అవుతున్న అతని శరీరం!


ఎవ్‌గెనీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఎవరికీ అంతుబట్టలేదు. పోలీసులొచ్చి తెలిసున్న వాళ్లతోనూ బంధువులతోనూ విచారించారు. లిజాకి కానీ తల్లి మేరీకి కానీ ఏమీ అంతు చిక్కలేదు. రెండు నెలల క్రితం తనకు చెప్పిన వ్యవహారం వల్ల ఇలా జరగవచ్చని ఎవ్‌గెనీ మేనమామకి కలలో కూడా తట్టలేదు. వాసిలీ, డానియల్, మిగతా నౌకర్లకీ ఎవరికీ కూడా ఇదంతా స్తిపనీదా మూలాన వచ్చిన చిక్కేమో అని లేశ మాత్రంగా అనుమానం రానేలేదు. చివరికి డాక్టర్లు అందరూ కలిసి చెప్పినదేమిటంటే ఎవ్‌గెనీ ఎవరికీ అంతుబట్టని, వికలమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అది పైకి ఎవరికీ చెప్పుకోలేకో మరోటో ఇలా చావడానికి కారణం. అత్తగారు వార్వరా మాత్రం ఇదంతా తనకి ముందే తెల్సునని, చాలా కాలం నుంచీ ఎవ్‌గెనీ తనతో మాట్లాడేటప్పుడు అడ్డంగా వాదిస్తూ ఉండడం గమనిస్తున్నాననీ, చెప్తే కూతురు జీవితం పాడౌతుందని ఎవరికీ చెప్పలేదనీ నోరు పారేసుకుంది, ఎవ్‌గెనీ పోయాక చాలాకాలం పాటు.

నిజంగా ఎవ్‌గెనీ మనోవ్యాధితో ఆత్మహత్య చేసుకున్నట్టయితే, ప్రపంచంలో అందరూ మనోవ్యాధి ఉన్నవాళ్ళే అవుతారు. జీవితంలో అతి దారుణమైన మనోవ్యాధితో బాధపడేది ఎవరంటే, అవతలివాళ్ళలో మనోవ్యాధి లక్షణాలు చూసేవాళ్ళూ అదే వ్యాధి తమలో ఉన్నట్టు తెలుసుకోలేని వాళ్ళూనూ.

[ఈ కథకు టాల్‌స్టాయ్ తరవాత ఇచ్చిన ముగింపు:

పక్కనుంచి అంతరాత్మ హెచ్చరించినట్టై ఎవ్‌గెనీ అన్నాడు గొణుగుతున్నట్టూ- ‘ఇదిగో ఇలాగే మనుషుల మనసుల్లో విషం నిండుతుంది. ఇందుకే తమ భార్యలను, ప్రియురాళ్ళను మగవాళ్ళు చంపేసేది. ఓ స్కౌండ్రల్! ఎవరో ఒకరు చావాలంటే అది స్తిపనీదా అయి తీరవల్సిందే. లిజా తప్పు ఏమీ లేదు ఇందులో. పోయి తనను పిలు. కౌగిలించుకో. గుండెల్లోకి తూటా దింపు. పీడ విరగడవుతుంది.’ పక్కనే టేబిల్ సొరుగు లాగి చూశాడు. రివాల్వర్ మెరుస్తోంది. ఎన్ని గుళ్ళు ఉన్నాయో చూస్తే సరిగ్గా ఆరింటిలో ఒక గుండు వాడాడు ఇంతకుముందు. మిగిలినవి ఐదు. బయటకెళ్ళినప్పుడు స్తిపనీదా కనిపిస్తే–కనిపిస్తే ఏమిటి? కనిపించి తీరుతుంది–వెనకనుంచి ఎలా కాల్చినా ఐదు గుళ్ళలో ఒకటి తలకి తగిల్తే చాలు. రెండు గుళ్ళు తగిలాయా, అదృష్టమే. వెంఠనే చచ్చి ఊరుకుంటుంది. దానితో తన దరిద్రం వదుల్తుంది కూడా. అవును, ఈ దయ్యం, తనని పట్టి ఏడిపిస్తున్న ఈ దయ్యం చావవల్సిందే. ఏదో నిశ్చయించుకున్నవాడిలా రివాల్వర్ జేబులో పెట్టుకోబోతూంటే లిజా గదిలోకి రావడం కనిపించింది ఎవ్‌గెనీకి. లిజాకి కనిపించకుండా రివాల్వర్ మీద అక్కడే ఉన్న పత్రిక కప్పేడు.

లోపలకి వచ్చిన లిజా అడిగింది, “మళ్ళీ అలాగే ఉన్నట్టున్నావే?”

“అలాగే అంటే?”

“నాకు తెలియదనుకున్నావా? నిన్ను దాదాపు ఆరునెలల నుంచి గమనిస్తున్నాను. మనసులో ఏదో ఉంది. బయటకి నాతో చెప్పవు. మొహం చూస్తే శ్మశానంలో ఎవర్నో పాతిపెట్టి వచ్చినవాడిలా ఉంటావు. ఈ సారి ఇంక నిన్ను వదిలేది లేదు. నాతో చెప్పి తీరవల్సిందే. ఏమిటి నీ మనసులో ఉన్నది? నా గురించా? అమ్మ గురించా? పుట్టిన పాప మిమిని ఎలా పెంచాలో అనే బెంగా? చెప్పేదాకా నేను ఊరుకునేది లేదు…”

“చెప్పమంటావా? ఇలా చెప్పేస్తే పోయేది కాదేమో, అయినా నిజంగా చెప్పడానికేమీ లేదు…” విరక్తిగా నవ్వాడు ఎవ్‌గెనీ.

సరిగ్గా అదే సమయంలో పాపని చూసుకునే ఆయా గది లోపలకి వచ్చి లిజాతో, “బయట మంచి ఎండ కాస్తోంది! అలా పాపని బయటకి తీసుకు వెళ్ళి నడిచి వద్దాం వస్తారా?” అంది.

లిజా ఆయాతో బయటకి నడవబోయిందల్లా వెనక్కి వచ్చి చెప్పింది ఎవ్‌గెనీతో, “ఇప్పుడే అరగంటలో వచ్చేస్తా, ఎక్కడికీ వెళ్ళిపోకు సుమా. ఈ రోజు పూర్తిగా చెప్పితీరవల్సిందే.”

“సరే, చూద్దాం.”

బయటకెళ్ళబోయే లిజా మరోసారి ఎవ్‌గెనీకేసి తిరిగి నవ్వుతూ చూసింది. ఎందుకో ఎవ్‌గెనీ మొహంలో జీవం ఉన్నట్టు కనబడలేదు. మరీ అంత బుర్ర తినేసే విషయం ఏమై ఉంటుంది?

వాళ్ళటు వెళ్ళగానే ఎవ్‌గెనీ మోకాళ్ళ మీద కూలబడి దేవుణ్ణి ప్రార్థించేడు. ఆపైన రివాల్వర్ జేబులో పెట్టుకుని అడవి దగ్గరకు పోయేడు. అక్కడ గడ్డిచుట్టలు చుడుతూ ఆడవాళ్ళంతా పనిచేస్తున్నారు. ఒక పక్క జొన్నకంకులు మెషిన్‌లో నలుగుతున్నాయి. జొన్నలను కుప్పపోస్తున్న స్తిపనీదా ఎవ్‌గెనీని చూసి అదే నవ్వు నవ్వింది. తమ మధ్య ఉన్నది ఒక నిర్లక్ష్యమైన ప్రేమ అని, ఇప్పటికిప్పుడు షెడ్ లోకి వెళ్దామనే అతని కోరిక ఆమెకు తెలుసని, ఆమెకూ ఇష్టమని, అతనితో ఎన్ని అవమానాలైనా సహించి కలిసి బతకడానికి ఆమె సిద్ధంగా ఉందని చెప్పే నవ్వు అది. ఆమెను ఎవరూ చూడకుండా ఆక్రమించుకుందామనే ఒకే ఆలోచన ఎవ్‌గెనీ మనసంతా నిండిపోయింది. ఎవ్‌గెనీ ఆమెను కంకులు కుప్పలుగా పోసే చోటికి అనుసరించాడు. ‘ఓ దేవుడా! నేను నిజంగానే పతనమయానా? నాకు విముక్తి లేదా? లేదు లేదు. నా ముందున్నది దయ్యం. నన్ను పూర్తిగా ఆవహించుకున్న దయ్యం ఇది. ఈ దయ్యం ఉండకూడదు.’

ఎవ్‌గెనీ రివాల్వర్ తీసి స్తిపనీదాను కాల్చేడు వరుసగా. ఆడవాళ్ళంతా పెద్దగా అరిచారు భయంతో. ‘నేను ఇది కావాలని చేసింది. ఇది అనుకోకుండా జరిగింది కాదు.’ అని అరిచేడు ఎవ్‌గెనీ. ఇంటికి వచ్చి గదిలోకి వెళ్ళి తలుపు గొళ్ళెం పెట్టుకున్నాడు. లిజా వచ్చి ఎంత బ్రతిమాలినా తలుపు తీయలేదు. మెజిస్ట్రేట్, పోలీస్ రాగానే చెప్పమని మాత్రం చెప్పాడు. కొన్ని గంటల తర్వాత వాళ్ళు వచ్చి ఎవ్‌గెనీని తీసుకుని వెళ్ళారు. కోర్ట్‌లో ఎవ్‌గెనీకి మానసికస్థితి సరిగా లేదని, తాత్కాలికోన్మాదంలో అలా చేశాడని జ్యూరీ తీర్పునిచ్చింది. తొమ్మిది నెలలు జైలు, చర్చ్ సర్వీస్ చేయడం శిక్షగా విధించారు. ఆ తొమ్మిది నెలలలో ఎవ్‌గెనీ తాగుడుకు బానిసయేడు. చివరికి ఒక ఎందుకూ పనికిరాని తాగుబోతుగా ఇంటికి తిరిగివచ్చేడు.

అత్తగారు వార్వరా మాత్రం ఇదంతా తనకి ముందే తెల్సునని, చాలా కాలం నుంచీ ఎవ్‌గెనీ తనతో మాట్లాడేటప్పుడు అడ్డంగా వాదిస్తూ ఉండడం గమనిస్తున్నాననీ, చెప్తే కూతురు జీవితం పాడౌతుందని ఎవరికీ చెప్పలేదనీ నోరు పారేసుకుంది చాలాకాలం పాటు. వాసిలీ, డానియల్, మిగతా నౌకర్లకీ ఎవరికీ కూడా ఇదంతా స్తిపనీదా మూలాన వచ్చిన చిక్కేమో అని లేశ మాత్రంగా అనుమానం రానేలేదు. లిజాకి కానీ తల్లి మేరీకి కానీ ఏమీ అంతు చిక్కలేదు. అప్పుడు తనకు చెప్పిన వ్యవహారం వల్ల ఇలా జరగవచ్చని ఎవ్‌గెనీ మేనమామకి కలలో కూడా తట్టలేదు. ఎవ్‌గెనీ ఎవరికీ అంతుబట్టని, వికలమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని డాక్టర్లు అందరూ కలిసి చెప్పిన విషయం వాళ్ళు అసలు నమ్మలేదు. వాళ్ళకు తెలిసిన ఎందరికంటేనో ఎవ్‌గెనీ చాలా స్థిమితమైన మనిషి.

నిజంగా ఎవ్‌గెనీ మనోవ్యాధి వల్లే ఈ నేరం చేసివుంటే ప్రపంచంలో అందరూ మనోవ్యాధి ఉన్నవాళ్ళే అవుతారు. జీవితంలో అతి దారుణమైన మనోవ్యాధితో బాధపడేది ఎవరంటే, అవతలివాళ్ళలో మనోవ్యాధి లక్షణాలు చూసేవాళ్ళూ అదే వ్యాధి తమలో ఉన్నట్టు తెలుసుకోలేని వాళ్ళూనూ.

(మూలం: The Devil, 1886.)