ఒకనాటి యువ కథ: అమ్మ

మబ్బురంగు సిల్కు షర్టూ పూనా చీరా పేక్ చేయించుకొని, ఆ రోజు చాలా ఆనందంగా బయల్దేరాడు రావు, ఇంటికి. యమున బాబునెత్తుకువచ్చి వారం రోజులైంది. బాబు చాలా ముద్దుగా బొద్దుగా గుండ్రటి కళ్ళతో తల్లిలాగే వుంటాడు. వాడి కళ్ళలోకి చూస్తే కిలారుమంటూ బోసినవ్వు నవ్వుతాడు. వాణ్ణి గుండెలకు హత్తుకుంటే, “ఓహో! పితృప్రేమ!” అంటూ హాస్యం చేస్తుంది యమున. మొదట మొదట తనకు సిగ్గువేసినా ఆ వారం రోజులలోనూ వాణ్ణి తనివితీరా ముద్దులు పెట్టుకోవడం, ఎత్తుకు తిప్పడం అలవాటయ్యాయి.

యమునతో ఒకసారి తను “నిజం చెప్దూ! చందమామ వీడికన్నా అందంగా వుంటుందా?” అన్నాడు.

“ఉండదు. వాడి బాబుకన్నా కూడా అందంగా వుండదు.” అంది.

“మరి నీకేం కావాలో అడగరాదూ ఇస్తాను,” గర్వంగా చూశాడు తను.

“సిగ్గులేకపోతేసరి. కట్టుడు చీరలు కావాలని ఎన్నిసార్లు చెప్పాను! పైగా వరాలడగాలా?” అంది చివాట్లు పెడుతూ.

ఆ రోజు, యమునకే ఆ చీర కొన్నాడు. బాబుకి స్వెట్టర్ కూడా కొన్నాడు. పిల్లాడు పుట్టాక తను చాలా మారాడు. తను తండ్రి అయ్యాడు! బిడ్డలూ… సంసారం బాధ్యతలూ! తల్చుకొంటోంటే అవన్నీ మధురంగానే వున్నాయి. ఎంతటెంతట వాటిని నిర్వహించే రోజు వస్తుందా అని ఆతృత కలుగుతోంది. అబ్బాయిని చదివించాలి! తనలా కాదు, బాగా చదివించాలి! కొడుకు పుట్టినప్పట్నించీ రావుకి వాణ్ణి ఎలా పెంచాలీ అన్న ఆలోచనే!

యమున ఎలాంటి విషయాన్నయినా తేలిగ్గానే తీసుకుంటుంది. “చీర చాలా బాగుంది.” అంది సంతోషంగా. రావు తేలికపడ్డాడు.

యమున కాఫీ అందిస్తూ నవ్వింది. “స్వెట్టర్ కూడా చాలా బాగుంది.” అంది.

“బాగుండటం కాదు! అది వేసి వాణ్ణి వేరే పడుకోబెడితే చలేం వెయ్యదుగా?”

“మీరు కూడా స్వెట్టర్ కొనుక్కుంటే మీకూ చలి వెయ్యదుగా?”

“అలా పెంకితనం చేస్తే వూరుకోను.”

“మూడు నెలలయినా నిండని ఆ పసివాడి మీద ఎందుకో మీకంత అసూయ? వాడు వాళ్ళమ్మ దగ్గరే పడుకుంటాడు. స్వెట్టరూ గిట్టరూ అక్కర్లేకుండా అమ్మ గుండెల్లో వెచ్చగా నిద్రపోతాడు. ఏం, పాతికేళ్ళు నిండిన మిమ్మల్ని మీ అమ్మ ఈ నాటికీ పసిబిడ్డలా చూసుకొంటూంటే, నేను అప్పుడే నా బిడ్డని గాలికి విడిచిపెట్టనా? ఊహు! నా వల్ల కాదు!” రావు నవ్వాడు. వేడి వేడి కాఫీ తాగుతూ కూర్చున్నాడు. యమున స్వెట్టర్ విప్పి బాబుకి తొడిగింది.

“అయితే యమునా! మా అమ్మ మంచిదా, బాబు అమ్మ మంచిదా?”

“మీ అమ్మే మంచిది.”

“ఎందుకూ?”

“ఈ నాటివరకూ మిమ్మల్ని పెంచుతూనే వున్నారుగా? నా మాట అప్పుడే ఏం చెప్పగలం?” యమున కళ్ళనిండా మాతృత్వపు మమత చూడగలిగాడు రావు. యమున బాబుని హృదయానికి హత్తుకొని నిలబడింది. రావు తదేకంగా చూశాడు. ఆ దృశ్యం రావు హృదయం నిండా అలుముకొంది. అప్రయత్నంగా లేచి దగ్గరికి నడిచాడు, “నేనూ ఆడపిల్లనై పుట్టి అమ్మని కాగలిగితే? ఈ సంతోషం అమ్మలకే తెలుస్తుందేమో!” అన్నాడు.

నవ్వింది యమున. బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి జోకొడుతూ అంది, “మీకో కబురు చెప్తాను. భలే ఆశ్చర్యపోతారు.”

“ఆహాఁ!” అన్నట్టు చూశాడు రావు.

“నా మాట నమ్మరేమో అసలు!”

“చెప్పు చూద్దాం! చిత్రమా, విచిత్రమా? విచారమా, సంతోషమా?”

“విచిత్రమేం కాదు కానీ చిత్రమే! విచారం దేనికీ? సంతోషమే!”

“ఓహో! ఏమిటబ్బా అది?”

“ఆలోచించండి చూద్దాం!”

చిరాగ్గా నుదురు చిట్లించాడు రావు. “నువ్వేం చెప్పక్కర్లేదు గానీ సినిమాకి వెళ్దాం, తొందరగా బైల్దేరు. కొత్తచీర కట్టుకో!”

“అమ్మో! పిల్లాడితోనా సినిమాకి? ఇంకా వంటా గింటా మొదలెట్టలేదు. చాలా పని వుందే.”

“ఏం? అమ్మ ఏమైంది? అన్నీ చూసుకుంటుందిలే.”

యమున కళ్ళలో నవ్వు చిందించింది. “పడుకున్నారు.”

“వంట్లో బాగాలేదా?” ఆతృతగా అడిగాడు.

“ఒంట్లో కాదు, మనసు బాగాలేదేమో!”

“ఏమిటి యమునా! ఆ చెప్పేదేదో సరిగ్గా చెప్పరాదూ?”

“అయితే చెప్పేస్తాను. ఆరు నెలల్లో… వింటున్నారా? చెప్పేస్తున్నాను… మీకు చిన్ని తమ్ముడో చెల్లెలో పుడతారు. వినేశారా?” ఫక్కుమంది యమున.

“చాల్లే! ఏమిటా మోటు హాస్యం?” రావు చురుగ్గా చూశాడు.

“బాగుంది. మధ్య నాదా మోటు హాస్యం? రేపట్నించీ తమ్ముణ్ణెత్తుకుని వూరేగేది మీరేగా?” యమునకు కాస్త కోపం వచ్చింది. విసురుగానే అంది, “ఉన్న సంగతి చెప్పాను. నమ్మితే నమ్మాలి, మానితే మానాలిగానీ, నా మీద దేనికి మీకంత చిరాకు?”

“అసలేమిటి అమ్మకి?”

“ఏమో, ఏమిటో? మీరే అడగరాదూ వెళ్ళి?”

“ఎవరు చెప్పారు నీకు?” ఆతృతగా అడిగాడు.

ఒక్క క్షణం చూసి మామూలుగా అంది యమున, “నా మాట కొట్టిపారేస్తోంటే నేనేంచేసేది?” అంటూ చెప్పుకొచ్చింది. “అసలావిడికి రెండు మూడు నెలలనుంచీ అనుమానంగానే వుందట,” కాస్త గొంతు తగ్గించింది. “బహిష్టులు పోతాయేమో అనుకున్నారట. మరీ సరిపెట్టుకోబుద్ధిగాక ఇవ్వాళ పొద్దున్న సీతమ్మ పిన్నిగార్ని తీసుకుని ఆస్పత్రికి వెళ్ళారు. అసలు వెళ్ళే ముందు నాకు చెప్పనేలేదు. వచ్చాకమాత్రం చెప్పారేమిటి? పిన్నిగారే చెప్పింది. డాక్టరమ్మ పరీక్షచేసి మూడో నెలని చెప్పిందట. పెద్ద వయస్సు కాబట్టి జాగ్రత్తగా వుండాలనీ, మంచి ఆహారం తీసుకోవాలనీ, నెలనెలా వచ్చి చూపించుకోవాలనీ చెప్పిందట.”

మాటా పలుకూ లేకుండా నిలువుగుడ్లతో చూస్తూ వుండిపోయాడు రావు. యమున ఇంకా ఇంకా చెప్పింది. “అత్తయ్య కళ్ళ నీళ్ళు పెట్టుకుంటోంటే డాక్టరమ్మ భుజంమీద చెయ్యి వేసి ధైర్యం చెప్పి బుజ్జగించిందట. ‘పెద్ద వయస్సయినా మీరేమీ భయపడకండి. నేను మీకే ఆపదా రాకుండా పురుడుపోసి పంపుతానుగా!’ అందట. ఏదో మందులు రాసికూడా ఇచ్చిందట! ఆ చీటీ మీ అమ్మ ఆస్పత్రి దాటగానే చించిపారేశారట. మొహం అదోలా పెట్టుకుని ఇంటికి వస్తే ఏమో అనుకున్నాను. రాగానే గదిలో నేలమీద కొంగు పర్చుకొని పడుకున్నారు. ఎంత పలకరించినా మాట్లాడారు కాదు. ఒంట్లో బాగాలేదో ఏవిటో అని వూరుకున్నాను. సీతమ్మ పిన్ని అంతా చెప్పింది. మొదట మీలాగే నేనూ ఆశ్చర్యపోయాను. ఆవిడ మొహం చూడాలంటే భలే సిగ్గేసింది. ఏమీ ఎరగనిదానిలా ‘అన్నానికి రండి అత్తయ్యా!’ అని పిల్చాను.

‘నేను తిననమ్మాయీ! నువ్వు భోంచెయ్యి.’ అన్నారు.

అప్పుడే చూశాను. కళ్ళు ఉబ్బిపోయి వున్నాయి. ఏడుస్తూ కూర్చున్నారు. లేచి రానేలేదు. నాకూ ఒక్కదాన్నీ తినటానికి సహించక వూరుకున్నాను. పిన్నిని పిలిచి ఆవిడ అన్నం తినడంలేదని చెప్పాను. పిన్ని అత్తయ్యని మందలించింది, ‘పిచ్చా, వెర్రా? ఎందుకలా బెంబేలుపడతావు? దేవుడిస్తే దెయ్యం కంటుందిట. వాడి ఇష్టం గానీ మన చేతుల్లో ఏముంది? నీకన్నా పెద్దవాళ్ళయి పురుళ్ళు పోసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? నువ్వేం తప్పుడు పని చేశావు గనకా? చాలు గాని లేచి అన్నం తిను. నీకోసం యమున కూడా అలా వుండిపోయింది. చంటిబిడ్డ తల్లి. లేచిరా వదినా, లేచిరా!’ అంటూ బలవంతంగా లేవదీసి అన్నం కలిపి తినిపించినంత చేసింది. ఇక తప్పదని ఆవిడే తిని మళ్ళీ ముణగదీసుకుని పడుకున్నారు.” యమున నోటికి కొంగు అడ్డం పెట్టుకుని రావుకేసి చూసింది.

రావు ఏమీ వినని వాడిలాగ ఎటో చూస్తూ నిలబడ్డాడు.

యమున మళ్ళీ అంది, “పాపం, అత్తయ్యకి భయమో యేమిటో కుమిలి కుమిలి యేడుస్తున్నారు. అన్నట్టు మావయ్యకి కూడా తెలిసిపోయింది. పిన్ని నవ్వుతూ నవ్వుతూ చెప్పేసింది. అందరిలాగే ఆయనా విస్తుపోయినట్టు చూసి మళ్ళీ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.”

చటుక్కున తలతిప్పి చూశాడు.

“అదేవిటి? మీరెందుకలా చూస్తారూ? నేను చెప్తోంది అబద్ధమనుకుంటున్నారా? కావాలంటే పిన్నిని పిలుస్తాను, అడగండి. అయ్యో! మర్చిపోయాను. ఎసరు మరిగిపోతోందో యేమో!” లోపలికి పరిగెత్తింది యమున.

రావు హఠాత్తుగా స్టాండుమీది బట్టలు వేసుకుని వరండాలోంచి వెళ్తూ జోళ్ళు తగిలించుకుని మెట్లుదిగి రోడ్డుమీదపడ్డాడు.

గబగబా గాలి పీల్చుకుంటూ నడిచాడు. ఆ రోజు కూడా పార్క్ చివరికంటా పోయి ఒంటరిగా కూర్చున్నాడు. అమ్మ కబురు తల్చుకుంటూంటే ఎప్పటికప్పుడే విభ్రాంతి కలుగుతోంది. యమున చెప్పింది నిజమా కాదా అన్న ఆలోచన అక్కర్లేదు. యమునే కాదు, ఎవరూ ఇలాంటి అబద్ధాలు కల్పించరు. తనకి తమ్ముడో చెల్లెలో! ఇప్పుడు! ఛీ! ఎంత సిగ్గుచేటు! తను పెరిగి పెద్దవాడై తండ్రి కూడా అయితే, ఇంకా తన తల్లితండ్రులు పిల్లల్ని కనటమా! ఆ సంగతి విని తన తండ్రి నవ్వుకున్నాడా!

రావునేదో అర్థం కాని అసహ్యభావం ముంచేసింది. శరీరం యావత్తూ ఏవగింపుతో జలదరించింది. తననీ, తన సంతానాన్నీ చూసుకుంటూ కాలం గడిపేయాల్సిన తల్లిదండ్రులు! అమ్మకి నలభై ఐదేళ్ళు దాటాయి. నాన్నకి యాభై ఏడో ఎనిమిదో ఉంటాయి. ఇద్దరూ వృద్ధాప్యంలో అడుగుపెట్టారు. కొడుకూ కోడలూ, కూతురూ అల్లుడూ, రెండు వేపులా మనవలూ! అమ్మమ్మకీ తాతకీ ఇప్పుడు పిల్లలా? ఇప్పుడు పసిబిడ్డ! ఒక్కసారిగా ఆ ఇద్దరి మీదా రావుకి చీదర ముంచుకొచ్చింది. అసలు ఈ వయస్సులో బిడ్డల్ని కనవచ్చునా? అలాంటి బిడ్డలు ఎన్ని అవకరాలతో పుడతారో! తల్లికి మాత్రం ఎంత ప్రమాదం! అబ్బా, ఎంత బుద్ధిలేదో! వాళ్ళ బాధ్యతలేమిటో వాళ్ళకు తెలియకుండా పోయాయి.

చీకటిపడ్డా లేచి ఇంటికి వెళ్ళటానికి మనస్కరించలేదు. అమ్మ కన్పిస్తే… చెట్టంత కొడుకు మొహం చూడటానికి సిగ్గుపడిపోదూ? నాన్నమాత్రం? ఏ మొహం పెట్టుకుని వీధిలో తిరుగుతాడు? బిడ్డల మొహం ఎలా చూస్తాడు?

రావు చాలాసేపు అక్కడే కూర్చున్నాడు. లేవక తప్పలేదు. ఇంటికి వెళ్ళకా తప్పలేదు. గుమ్మంలో అడుగు పెడుతోంటే గుండెలు గబగబా కొట్టుకుంటున్నట్టనిపించింది. తండ్రి కంఠస్వరం చెవుల్లో పడేసరికి కడుపులో ఎక్కడో వికారం పుట్టింది. రోజూలాగే తండ్రి ప్రయివేటు కుర్రాళ్ళకు పాఠాలు చెప్తున్నాడు ఉత్సాహంగా. ఏమీ సిగ్గుపడుతున్నట్టు లేదు! మొహం చిట్లించుకుంటూ రావు గబగబా లోపలికి వెళ్ళాడు.

ఉయ్యాల వూపుతోన్న యమున ఎదురు వచ్చింది. ఒక్క క్షణం చూశాడు. సాయంత్రం తెచ్చిన కొత్తచీర కట్టుకుంది. చటుక్కున తల తిప్పుకుని చొక్కా విప్పుతూ స్టాండు దగ్గరికి పోయాడు. కొంచెం ఆశ్చర్యపడుతూనే అంది యమున, “మీరు సరిగా చూడలేదా? సాయంత్రం తెచ్చిన కొత్త చీర కట్టుకున్నాను.”

“కనబడుతోందిగా? చూడకపోవటం ఏమిటి?” ముక్తసరిగా అన్నాడు.

ఆశ్చర్యంగా చూసింది యమున. “అలా వున్నారేం? ఇందాక కూడా చెప్పకుండానే వెళ్ళిపోయారే!”

“అబ్బ! నువ్వు కబుర్లకి దిగితే ఇంతే! వచ్చీరాగానే ఏమిటి నీ ప్రశ్నలు?” బట్టలు తీసుకుని రెండంగల్లో బాత్ రూమ్‌కేసి నడిచాడు.

యమున పలకరించకుండానే అన్నం వడ్డించింది. రావు దించిన తల ఎత్తకుండా గబగబా రెండు ముద్దలు తిని ఎవరో తరుముకొస్తున్నట్టే గదిలోకొచ్చిపడ్డాడు. అమ్మ కనిపించలేదు. ఏ క్షణంలో బయటకొస్తుందోనని కంగారుపడ్డాడు.

తండ్రి కంఠం విన్పించటంలేదు. ప్రయివేటు పిల్లలు వెళ్ళిపోయినట్టున్నారు. తనకు గుర్తున్నంత వరకూ తన తండ్రిని ఇంతగా అసహ్యించుకున్న రోజు ఎన్నడూ లేదు. అమ్మంటేనే తనకు బాగా ఇష్టమైనా, నాన్నంటే కూడా ఇష్టమే. తను చదువుకునే రోజుల్లో డబ్బు కోసం ఇబ్బందిపడే నాన్నని చూస్తూ తను కన్నీళ్ళు తెచ్చుకున్న సమయాలు కూడా వున్నాయి. తనకి ఉద్యోగం వచ్చాక నాన్నతో ఎన్నోసార్లు చెప్పాడు, “నీకీయాతనెందుకు నాన్నా? నువ్వు ప్రయివేటు చెప్పకపోతే మాత్రం మనం బతకలేకపోతామా? హాయిగా విశ్రాంతి తీసుకో, చాలు.” అన్నాడు.

“రోజంతా విశ్రాంతేగా! నలుగురు మనుషులం బతకడం మాటలా?” అంటాడు నాన్న “అరవయ్యేళ్ళన్నా రానప్పుడు పెద్దతనం యేమిటి, విశ్రాంతి యేమిటి?” అంటాడు చాలాసార్లు. మొదటినించీ ఒళ్ళు దాచుకునే తత్వం కాదు.

“అమ్మా, యమునా! కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా!” తండ్రి కంఠస్వరం చెవుల్లో పడేసరికి మళ్ళీ ఏదో అర్థంలేని ఏహ్యభావం రేగినట్టయింది.

యమున గదిలోకి వస్తున్నదల్లా, “ఆఁ, వస్తున్నా మామయ్యా!” అంటూ వెనక్కి వెళ్ళింది. రాత్రుళ్ళు అమ్మ రోజూ నాన్న మంచం దగ్గిర మంచినీళ్ళ చెంబుపెట్టి పక్క వేస్తుంది. అమ్మ రోజులా లేదు ఇవ్వాళ.

‘అమ్మా!’ అనుకుంటేనే ఏదో హాయి కలుగుతుంది మనస్సుకి. ఇంట్లో వంటా వార్పూ అంతా అమ్మే చేస్తుంది. యమున చేసిన రోజు యమున కూడా నసుగుళ్ళు పోతూనే తింటుంది.

“యమునకి వంటలన్నీ నేర్పమ్మా! నువ్వు ఎక్కడికన్నా వెళ్తే ఈ నలభీమ పాకంతో మా ప్రాణాలు తీస్తుంది,” అంటాడు రావు.

అమ్మ నవ్వుతుంది. “నీ పెళ్ళానికి వంటలన్నీ నేర్పేసి నన్నెక్కడికైనా వెళ్ళిపొమ్మనా అర్థం?” అంటుంది కోపం నటిస్తూ.

యమునకి ఇంటి పనుల్లో ఏ చీకూ చింతా లేదు. రావు ఏ క్షణంలో బుద్ధిపుడితే ఆ క్షణంలోనే యమునని తీసుకుని సినిమాలకో షికార్లకో పోతాడు. అమ్మ అన్నింటికీ నవ్వుతుందే కానీ చిరాకు పడదు, విసుక్కోదు. అమ్మకి కన్నకూతురు ఒకటీ, యమున ఒకటీ కాదు. ఆ సంగతి రావుకన్నా యమునకే బాగా తెలుసు.

యమున లోపలికి వస్తూ తలుపులు మూసింది. ఉయ్యాల్లో బాబుని తీసి మంచం మీద పడుకోబెట్టింది. “లైటు తీసెయ్యనా? మీరేమైనా చదువుకుంటారా?” అంది. రావు మాట్లాడలేదు. యమున దగ్గరికి వచ్చింది, “ఒంట్లో బాగాలేదా? దేనికీ మాట్లాడరేం? బాగుంది, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది?” అంది నిష్టూరంగా.

రావు కొంచెం నవ్వాడు. “తెలీకపోడం ఏమిటి? అన్నీ నువ్వే తెలుసుకోగలవు.”

“నాకేం దివ్యదృష్టి లేదు.”

రావు నెమ్మదిగా అడిగాడు, “అమ్మ భోంచేసిందా?”

“లేదు, కొంచెం మజ్జిగ తాగి పడుకున్నారు.”

కాస్సేపయ్యాక అన్నాడు, “అన్నం తినమని చెప్పకపోయావా?”

“చెప్పకుండానే వూరుకున్నానా? ఆవిడ ధోరణి ఆవిడదే. అస్తమానూ కళ్ళనీళ్ళు పెట్టుకోవడమే. ఏమిటో నాకు భయంగా వుంది బాబూ! చివరికి అన్నాను కూడానూ, డాక్టరమ్మ జాగ్రత్తగా చూస్తానని చెప్పింది కదా అత్తయ్యా, మీ కెందుకూ భయం? అన్నా. ‘నా ప్రాణం పోతుందని భయపడుతున్నానా అమ్మా?’ అన్నారు.”

“మరెందుకూ?” అప్రయత్నంగా అన్నాడు రావు.

“బాగుందండీ! పాపం ఆవిడికి మాత్రం సిగ్గు కాదూ, ఈ వయసులో…”

“అమ్మ గురించి నేనిలా అనడం తప్పుగా వుంటుంది గానీ… చెప్పాలంటే… ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? ఆవిడ బాధ్యతేం లేదా?”

“ఇది మరీ బాగుంది. ఆవిణ్ణి తప్పు పడుతున్నారేమిటి?” ఆశ్చర్యంగా చూసింది యమున. రావు మాట్లాడలేదు.

యమున మళ్ళీ చెప్పింది, “ఇందాక మళ్ళీ పిన్ని వచ్చింది, అత్తయ్యని చూసి ఏమందో తెలుసా? ‘అలా ఏడుస్తూ కూర్చోకపోతే ఏ మందో మాకో మింగరాదూ, వెధవ బాదరబందీ పోతుందిగా?’ అంది.”

“ఏమందీ అమ్మ?” కంగారుగా అడిగాడు రావు.

“పాపం ఏమీ అనలా, అలా పిచ్చి దానిలా చూస్తూ కూర్చున్నారు. అంతలోనే పిన్ని నవ్వేస్తూ, ‘నమ్మేశావా ఏమిటి వదినా? హాస్యానికన్నానులే. నువ్వెందుకమ్మా అంత బాధ పడతావూ?’ అంటూ ఏవోవో నచ్చజెప్తూ కూర్చుంది.”

“ఛ! అలాంటి పని మాత్రం చెయ్యొద్దని చెప్పు. పెద్ద ప్రాణానికే మోసం వస్తుందంటారు.”

“ఏం? చిన్న ప్రాణం అక్కర్లేదు కాబోలు! నాకు మాత్రం చిన్న ఆడబిడ్డో చిట్టి మరిదో పుడతారంటే బలే సరదాగా వుంది. నిజం చెప్పండి. మీకో చెల్లెలు పుడుతుందంటే సంతోషంగా లేదూ?”

రావు కళ్ళకి అడ్డంగా చెయ్యి వేసుకున్నాడు. ఈ వయసులో అమ్మ తొమ్మిది నెలలు మొయ్యాలా! పసిబిడ్డని కని పాలిచ్చి పెంచాలా! ఈ గదిలో తను! పక్క గదిలో తన తండ్రి!


అత్తారింటినించి సుశీల వచ్చింది, అమ్మని చూడ్డానికి, సుశీల యమునతో అంటోంటే రావు కూడా విన్నాడు.

“నీ ఉత్తరం చదివి నేనసలు నమ్మలేకపోయాను వదినా! ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలా అని భలే తికమకపడ్డాను! చదువుకోమని మా ఆడబిడ్డకి ఉత్తరం ఇచ్చేశాను. ఆవిడ నన్ను ఒకటే హాస్యాలు పట్టించింది. చెప్పొద్దూ! భలే సిగ్గేసిందిలే. పాపం మా అత్తగారు మాత్రం కూతుర్ని మందలించింది. ‘దేవుడిస్తే దెయ్యాలైనా కంటాయి. ఈ వయసులో సంతానప్రాప్తి వుందేమో ఆవిడ గీతలో’ అన్నారు…” అంటూ సుశీల ఆ కబుర్లే చాలాసేపు మాట్లాడింది. పైగా, నవ్వుతూ!

తనకిలాగ సుశీలకెందుకు అనిపించడం లేదో! కూతురులాగే తల్లి కూడా పిల్లల్ని కంటోంటే, అబ్బా… అసహ్యం కాదూ? సుశీలకి ఆ నవ్వేమిటి! రావుకి చిరాకేసింది. ఏమిటో ఈ ఆడవాళ్ళంతా ఒకటే. బొత్తిగా ప్రపంచ జ్ఞానం వుండదు.

నాలుగు రోజులు వుంది సుశీల. ఎక్కడ అమ్మ విషయం ఎత్తుతుందో అని రావు ఏవేవో పనులు కల్పించుకుని చాలా ముభావంగా ప్రవర్తించాడు. “అన్నయ్యా!” అంటూ సుశీల ఏం మాట్లాడబోయినా అర్జంటు పనులు పెట్టుకుని దాన్ని పెరగనివ్వకండా చేశాడు.

వెళ్ళే రోజు యమునతో నవ్వుతూ చెప్పింది సుశీల, “వదినా! నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మని. చిన్నపిల్లలా బెంగపెట్టుకుంది అమ్మ. పురిటి నాటికి మళ్ళీ వస్తాను. నేను అత్తారింటికి పోయినా మళ్ళీ ఒక ఆడబిడ్డ వుంటుంది సుమా నీ మీద పెత్తనం చెయ్యటానికి! మర్చిపోకేం?” అంటూ గలగలా నవ్వింది.

“ఎందరెన్ని చెప్పినా అత్తయ్యకి ధైర్యం రావటంలేదు. ఆ దిగులేమిటో అర్థంకాదు.” అంది యమున గదిలోకి రాగానే.

“మతిలేకపోతే సరి.” అన్నాడు రావు.

తనేమంటున్నాడో రావుకే అర్థంకాలేదు. ఆఫీసు మెట్లు దిగిన తర్వాత తొందరగా ఇంటికి వెళ్ళబుద్ధి వెయ్యదు. అడక్కపోయినా అమ్మ గురించి యమున ఏదో ఒకటి చెప్తుంది. ఆ మాటలు వినడం రావుకి ఇష్టం వుండదు.

యమున అప్పుడప్పుడూ “మీరు పూర్వంలా ఉండడంలేదు.” అంటూనే వుంది.

“ఏం, ఎందుకు లేనూ?” అని రావు మాట మారుస్తూనే వుంటాడు.

ఆ సంగతి విన్న రోజునించీ రావు అమ్మతో మాట్లాడడం లేదు. అమ్మని కన్నెత్తి చూడడం లేదు. అమ్మ పరిసరాలలో మసలడం లేదు. అమ్మ గురించి యమున చెప్పిన రోజు ఎంత రోత పుట్టినా, పోనీ రోజులు గడుస్తోన్నా సరిపెట్టుకోలేక పోతున్నాడు.

తనేదో తప్పు చేస్తున్నాననే బాధ కూడా రావుని దిగదీస్తోంది. “అమ్మా! ఒంట్లో బాగుంటోందా?” అని అమ్మని పలకరిద్దామా… అనిపిస్తుంది ఒక్కోసారి. మళ్ళీ ఎందుకో, “ఏం, బాగుండకేం? ఆయన వున్నాడుగా! చూసుకోడా?” అనిపిస్తుంది వెంటనే.

అమ్మ కూడా కొడుకు కంటపడకుండానే కాలం గడుపుతోంది.


ఆ రోజు మధ్యాన్నంవేళ తలనొప్పి ఎక్కువగా వుందని ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేశాడు రావు.

గడపలో కూర్చుని బియ్యం ఏరుతోంది అమ్మ. ఒక్కసారి కళ్ళెత్తి చూసి చటుక్కున తల దించేసుకుంది. కుడిభుజం మీదుగా పైటకొంగు కప్పుకుని బియ్యంలో వేళ్ళు కదుపుతూ కూర్చుండిపోయింది.

అనుకోకుండా అమ్మని చూశాడు రావు చాన్నాళ్ళ తర్వాత. అన్నాళ్ళ తర్వాత అమ్మని చూస్తోంటే ఏదో ఆనందంగా అనిపించింది. తడబడుతూనే అమ్మ ముందునించి గదిలోకి వెళ్ళిపోయాడు.

యమున పుస్తకం చదువుకుంటూ తీరిగ్గా పడుకుని వుంది. “ఇదేమిటి, వేళగాని వేళ…” అంటూ లేచింది.

“తలనొప్పిగా వుందని వచ్చేశాలే.” బట్టలు మార్చుకుని పక్క మీద కూర్చున్నాడు. “కొంచెం టీ పెట్టి తీసుకురా యమునా!”

“అలాగే” అంటూ వెళ్ళింది.

అమ్మ కంఠం విన్పించింది చాలా కాలానికి… “జ్వరం ఏమైనా తగిలిందేమో చూడకపోయావూ? తలనెప్పి బిళ్ళ ఇయ్యమ్మా! నువ్వు వెళ్ళి దగ్గర కూర్చో.” యమున లోపలకు వచ్చేసింది, “టీ అత్తయ్య పెడతానన్నారు.” అంది.

“అమ్మాయీ!” అని పిలిస్తే యమున వెళ్ళి టీ గ్లాసు తీసుకువచ్చింది.

రావు చాలా ఇష్టంగా గ్లాసు పట్టుకుని తాగాడు. యమున మాట్లాడుతూనే వున్నా రావుకి నిద్ర ముంచుకువచ్చింది. లేచేసరికి జ్వరం కూడా తగిలింది.

యమున ఏం చెప్పిందో, అమ్మ చాలా కంగారుగా మాట్లాడడం వినపడింది… “జ్వరం వొచ్చిందా? అయ్యో, ఎందుకొచ్చిందీ? నువ్వు దగ్గిరే కూర్చోమ్మా!” అంటోంది.

“జ్వరానికే అంత కంగారా?” అనుకున్నాడు రావు, దుప్పటి కప్పుకుంటూ.

మళ్ళీ మెలుకువ వచ్చేసరికి అంతా చీకటిగా వుంది. ఒళ్ళంతా చెమటలు పట్టి ఉక్క పోస్తోంటే దుప్పటి తీసేసి లేచి కూర్చున్నాడు. దాహంతో నోరు పిడచకట్టుకు పోతోన్నట్టనిపించింది.

“యమునా!” అన్నాడు నెమ్మదిగా.

కంటిచూపు చీకటికి అలవాటుపడింది. యమున బాబుని దగ్గరకి జరుపుకుని గాఢంగా నిద్రపోతోంది. నెమ్మదిగా లేచి నాలుగువేపులా చూశాడు. గది తలుపులు తీసుకుని వరండాలోకి అడుగుపెట్టాడు.

“ఎవరదీ?” అమ్మ కంఠం పీలగా విన్పించింది.

చటుక్కున లోపలకు వచ్చేశాడు. “యమునా! యమునా!” అంటూ తట్టి లేపాడు.

నిద్రలో విసుక్కుంటూ పక్కకు తిరిగి పడుకుంది యమున.

“ఒక్కసారి లేచి కొంచెం మంచినీళ్ళు తీసుకురద్దూ!” అన్నాడు బతిమాలుతోన్నట్టు.

యమున బద్ధకంగా కళ్ళు నలుపుకొంటూ లేచి కూర్చుంది.

“కొంచెం మంచినీళ్ళు తీసుకురా యమునా! దాహం వేస్తోంది.”

“చెంబులో లేవూ?”

“చెంబే లేదు.”

“మర్చిపోయాను కాబోలు,” అనుకొంటూ లేచి వెళ్ళింది. వెంటనే గ్లాసునిండా వేన్నీళ్ళు తెచ్చి గ్లూకోజు కలిపి ఇచ్చింది. ఇస్తూ, “లేవటానికి నేనేమైనా విసుక్కున్నానా?” అంది.

“నిద్రలో లేపితే ఎవరైనా విసుక్కుంటారు… ఇవేవిఁటి! వేణ్ణీళ్ళెక్కడివీ?” అన్నాడు గ్లాసు అందుకుని.

“నే వెళ్ళేసరికి అత్తయ్య కాచారు. మీరు నన్ను లేపటం విన్నారట. సాయంత్రం కాసిన్ని వేడినీళ్ళు ఫ్లాస్కులో పోసి వుంచమని అత్తయ్య చెప్పనే చెప్పారు. నేనే మర్చిపోయాను.” యమున మళ్ళీ పక్కమీద ఒరిగింది.

రావు ఆశ్చర్యపడుతూనే నీళ్ళు తాగాడు. ఎంతో ఓపిక కూడదీసుకున్నట్టయింది. ఈ అర్ధరాత్రి అమ్మ తనకోసం వేడి నీళ్ళు కాచి ఇచ్చింది… బద్ధకం లేకుండా! ఉత్త మనిషి కూడా కాదు! … ఈ వయసులో ఇదంతా ఏవిటీ! ఎంత కష్టం!


అమ్మ అప్పుడప్పుడూ కొడుకు కళ్ళబడుతూనే వుంది. ఎప్పటికప్పుడు కొడుకే తప్పించుకుంటున్నాడు. పొద్దున్న అప్రయత్నంగా అమ్మని చూశాడు.

అయిష్టంగానే కళ్ళారా చూశాడు.

మనస్సు ద్రవించినట్టయింది. చీకటితోనే తలస్నానం చేసిన అమ్మ నిండుగా బట్ట కప్పుకుని ఇంట్లోకి వస్తోంది. వాకిట్లోకి వెళుతున్న రావు అమ్మని కళ్ళారా చూసి పక్కకి తప్పుకుని దారి ఇచ్చాడు. అమ్మ భారంగా నడుస్తూ నడకలో తడబడుతూ ఇంట్లోకి వెళ్ళింది. అసలే అల్పంగా వుండే అమ్మ మరీ బలహీనంగా ఒత్తిలా అయిపోయింది. ఎత్తుగా వున్న కడుపు తప్పితే అమ్మ శరీరంలో ఏ పుష్టీ లేదు.

తన ఎదురుగా నడిచి రావటానికి అమ్మ సిగ్గుపడుతోందని తెలిసినా రావు వెనక్కి వెళ్ళలేకపోయాడు.

నిండు నెలలతో వున్న అమ్మని చూస్తోంటే తననెవరో మంత్రించినట్టయింది. చూడడానికి రెండు కళ్ళూ చాలవనిపించింది. అమ్మ కడుపులో తను వున్నప్పుడు కూడా అమ్మ ఇలాగే వుండేదా? ఆ క్షణంలో అమ్మ పాదాలను కళ్ళకద్దుకోవాలన్నంత ఆవేశం కల్గింది.

గదిలోకి వెళ్ళి యమునని పిల్చాడు. “అమ్మ ఏమైనా మందులవీ తీసుకుంటోందా?” అన్నాడు అనాసక్తంగా.

“ఇప్పుడా జ్ఞాపకం వచ్చింది మీకు? రేపో మాపో ప్రసవించటానికి సిద్ధంగా వుంటే, ఇప్పుడా అమ్మ ఆరోగ్యం కావల్సి వచ్చింది?”

“సరేలే, చెప్పూ! అప్పుడప్పుడూ ఆస్పత్రికి వెళ్తోందా?”

“ఏదీ లేదు. నేను చెపుతూనే వున్నాను. ఏమీ అక్కర్లేదన్నారు. మీతో చెప్దామా అంటే మీరేవిటో ఎడమొహం పెడమొహం. ఏమో బాబూ! అంత బలహీనంగా… ఆవిడెలా ప్రసవిస్తారో… నాకు భయంగానే వుంది.”

రావు మాట్లాడలేదు.

పోనీ నాన్న… నాన్నయినా పట్టించుకున్నాడా? తన నిర్వాకానికి తనుకూడా పట్టించుకోకపోతే, ఆ మనిషి ఏమైపోతుందనుకున్నాడు? ఏం పట్టించుకుంటాడు? ఎలా పట్టించుకుంటాడు? ఫస్టు తారీఖు వచ్చేసరికి ఆయన సంపాదిస్తోన్న ఇరవై రూపాయలూ తన చేతికే అందుతున్నాయి. ఇంకేం పట్టించుకుంటాడు? అయితే, ఇంత కాలం అమ్మని ఎవ్వరూ పట్టించుకోలేదా? తను ఏం చెయ్యాలిప్పుడు?

మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి ఇల్లంతా హడావుడిగా వుంది. లోపలనించి ఆడవాళ్ళ కంఠాలు విన్పిస్తున్నాయి. సుశీల కూడా వచ్చినట్టుంది. రావుకేదో అనుమానం వచ్చింది. వెనక్కి పోదామా… అని ఆలోచిస్తోంటే యమున కన్పించింది. “వీధి గదిలో కూర్చోండి, అన్నం తీసుకొస్తాను.” అంది కంగారుగా.

“ఏమిటి, ఏమైంది అమ్మకి?”

“ఏమీ కాలా… ఇదిగో వచ్చేస్తున్నాను.”

“యమునా, ఇలా చూడు! హాస్పిటల్కి తీసికెళ్ళరాదూ?”

“ఎవరూ, నేనా?” తీవ్రంగా చూసింది యమున.

“అదే, అదే! నాన్న…”

“ఆయన మంత్రసాని కోసం వెళ్ళారు. అసలు ఆవిడ ఆస్పత్రికెళ్ళరట! ఏమైనాసరే… ఎలా వున్నా సరే, ప్రాణాలు పోయినాసరే, ఆస్పత్రికి వెళ్ళరట!” యమున కంగారుగా లోపలికెళ్ళింది.

రావు ఒక్క నిమిషం కూడా నిలబడకుండా బయటపడ్డాడు. కడుపులో ఆకలి దహిస్తోన్నా, హోటళ్ళని దాటుకుని తిన్నగా ఆఫీసుకు పోయి సీటులో కూర్చున్నాడు.

అసలు అమ్మకి తేలిగ్గా వుందా? అమ్మకి ఏమైనా అయితే? బాధ్యులెవరు? అమ్మ లేకుండా నాన్న ఎలా కాలం గడుపుతాడు? ఇంత చిన్న విషయం నాన్న ఎందుకు ఆలోచించలేక పోయాడు? తను మాత్రం? అమ్మకేమైనా జరిగితే తను మాత్రం బాధ్యుడు కాడా? ఇన్నాళ్ళూ అమ్మ ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచించలేదు? అమ్మకి మందులవీ ఎందుకు కొనలేదు? కనీసం… ఆఖరి క్షణంలో… పురుడు వస్తోందని తెలిసినా అమ్మని హాస్పిటల్‌కి పంపే ఏర్పాటు ఎందుకు చెయ్యలేదు? అమ్మ సుఖంగా బైటపడడం, తనకు మాత్రం ఆనందం కాదా? రావు మనస్సు అల్లకల్లోలమైంది. అమ్మ ఈ వయసులో బిడ్డని కనడమా! వయసు మళ్ళిన అమ్మకి ఇప్పుడు పురుడా! రావుకి మొహమంతా జేవురించింది. స్త్రీ పురుష సంబంధం ఎంత అసహ్యంగా వుంది! అమ్మ విలువనే ధ్వంసం చేసేసింది!

ఆఫీసు అయ్యాక అందరికన్నా ఆఖర్న లేచి బయటికి వచ్చాడు. ఇంటికేసి నడవటానికి కాళ్ళు మొరాయించాయి. మనస్సు తిరస్కరించింది. అమ్మ సంగతి… ఊహూ! ఏం వింటాడు?
వినక చేసేదేముంది? ఎంతకాలం తప్పించుకుంటాడు?

పార్క్ దాదాపు నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా వుంది. విద్యుద్దీపాల వెలుగుకి భయపడి చెట్ల చాటున దాక్కుంది చీకటి.

ఎప్పటికో లేచాడు రావు, ఇంటికి! వీధి తలుపులు దగ్గరికి వేసి వున్నాయి. నాన్న నిద్రపోతున్నాడో లేదో గానీ అరుగుపైన మంచం మీద పడుకుని వున్నాడు. అమ్మ గదిలో లైటు వెలుగుతోంది. సుశీల ఏదో మాట్లాడుతోంది. యమున ఏదో రాస్తూ కూర్చుంది. రావు తనకేమీ పట్టనట్టు బట్టలు మార్చుకుంటూ నిలబడ్డాడు. ఏదో చప్పుడు కోసం రావు చెవులు నిరీక్షించాయి.

“భలే పెద్దమనిషి! మిమ్మల్ని నమ్ముకుంటే ఎలాంటి పనులైనా జరిగిపోతాయి.” అంది యమున పుస్తకం మూస్తూ. “దేవుడి దయవల్ల అంతా సవ్యంగా జరిగింది గానీ…”

ఆతృతగా చూశాడు. అంతలోనే “మీరందరూ వున్నారుగా? మంత్రసాని వచ్చే వుంటుందిగా? ఇక నేనేం చెయ్యాలి?” అన్నాడు. తన కంఠం తనకే కర్కశంగా విన్పించింది. ఇంత మృగంలాగ తనెప్పుడూ మాట్లాడలేదనిపించింది.

“ఎవ్వరూ ఏమీ చెయ్యొద్దు లెండి… అంతా సుఖంగా జరిగింది. పోనీ తమ్ముడో చెల్లెలో అడగరేం?”

“అడక్కపోయినా నువ్వే చెపుతావు. ఎవరైనా ఒకటే నాకు.”

“ఒకటే ఎలా అవుతుంది? మీతో పోటీ పడటానికి తమ్ముడే పుట్టాడు.”

“నిజం… గా… నా?”

“బాగుంది, ఎప్పుడూ హాస్యాలేనా? నిజంగా నేను మరిదే కావాలనుకున్నాను. ఇప్పుడే మా అమ్మకి ఉత్తరం రాసి ఇలా కూర్చున్నాను.”

“నిజంగా మీ తమ్ముడు మీలాగే వున్నాడు. ఆ కళ్ళూ… ఆ ముక్కూ… ఆ కోపం…”

“చాల్లే, ఊరుకో.”

“నా మాట నమ్మకపోతే మీరే వెళ్ళి చూడండి… అబ్బో! అబ్బాయిగారికెంత గర్వం! అన్నదమ్ములిద్దరూ కలిసి ఒక్కమాట మీద నడుస్తారా?”

రావు పెదవులమీద నవ్వు చిందింది. తమ్ముడు, తమ్ముడు… అవును. ఒకప్పుడు… తను చాలా చిన్నవాడిగా వున్నప్పుడు… తనకా కోరిక వుండేది!

“అమ్మా! మనకో తమ్ముడుంటే బాగుంటుందే!” అన్నాడు అమాయకంగా ఒకసారి.

సుశీల కూడా తనని బలపరిచింది. “నిజమేనే అమ్మా! తమ్ముడుంటే ఆడుకోటానికి బాగుంటుందే!” అంది పేచీ పెడుతున్నట్టు.

అమ్మ నవ్వింది. సుశీల బుగ్గలు ముద్దుపెట్టుకుంది. తన జుట్టు నిమిరింది.”తమ్ముడుంటే మళ్ళీ వాడు ఇంకో తమ్ముడు కావాలని అడగడూ? ఆడుకోటానికి మీరిద్దరూ వున్నారుగా?” అంది.

తనకిప్పుడు తమ్ముడున్నాడు! వాణ్ణి చూస్తే ఒక్కసారి?… “సుశీలా! మనకి తమ్ముడున్నాడే!” అని సుశీలతో అంటే?

“అవేం పోలికలో బాబూ, మరీ విచిత్రం! అచ్చు మీలాగే వున్నాడు!”

“నా తమ్ముడు నాలాగ కాకపోతే నీలాగ వుంటాడా?” అని రుసరుసలాడాడు అన్న. తమ్ముడు ఎలా వున్నాడసలు? తనలాగాక ఇంకెలా వుంటాడు?

కేరుమన్నాడు తమ్ముడు అవతల గదిలో, ఝల్లుమన్నాయి అన్న గుండెలు. కంగారుగా గుమ్మంకేసి చూశాడు.

“మౌనవ్రతం చాలుగాని, లేచి స్నానానికి వెళ్ళండి.” అంటూ వెళ్ళిపోయింది యమున.

రాత్రంతా మగత మగతగానే నిద్రపట్టింది. తమ్ముడి ఏడుపు విన్పిస్తూనే వుంది. యమున, అమ్మ గదిలోకి తిరుగుతూనే వుంది.

తెల్లారి చీకట్నే సుశీల గదిలోకొచ్చింది. “ఒరేయ్ అన్నయ్యా, లేచావా? తమ్ముణ్ణి చూశావా?”

అన్నయ్య దుప్పటి మొహం మీదకి లాక్కుని పక్కకి తిరిగిపోయాడు.

సుశీల దుప్పటి లాగేసింది. “ఇంకా నిద్రేవిటి! అచ్చం నాలాగే ఉన్నాడ్రా!”

“ఏంటీ!” అన్నట్టు కళ్ళు తెరిచాడు అన్న. “నీలాగ వున్నాడా? ఎవరన్నారు? నాలాగ వున్నాడంటగా?”

“నీలాగానా? ఎవరన్నారు?”

“యమున బోల్డుసార్లంది. నాలాగే వున్నాడంది.”

“నీ మొహంలే! కావాలంటే ఇంకెవర్నన్నా అడుగు. అన్నీ నా పోలికలే. అసలు ఆడపిల్లలాగే వున్నాడు. రా, చూడూ!”

“అబ్బా, నిద్రొస్తోంది. చూ… స్తా… లే!” అంటూ మళ్ళీ దుప్పటి లాక్కున్నాడు మొహం మీదకి.

సుశీల వెళ్ళిపోయింది. తర్వాత సుశీల మళ్ళీ అడిగితే, “చూశాలే… ఇందాక గుమ్మంలోంచి చూశా… నిద్రపోతున్నాడు…” అన్నాడు రెండు మూడుసార్లు.

మూడోనాడు… సుశీల వాళ్ళత్తగారు కూడా వచ్చింది. అమ్మకి పత్యాలూ పానాలూ ఆవిడ చేతి మీదుగానే జరిగాయి. ఆవిడ ధనియాల పొడులూ, మిరియాల పొడులూ ఇవీ అవీ అన్నీ తయారుచేసింది.

ఐదో రోజు… అన్నగారి ఆఫీసుకు శెలవు. మధ్యాన్నం అన్నం తిని చదువుకుంటూ నిద్రపోయాడు రావు.

యమున గబగబా తట్టి లేపుతోంటే ఉలిక్కిపడి లేచాడు. అమ్మ గదిలో అందరూ ఏమిటో కంగారుపడుతోన్నట్టు విన్పించింది.

“తొందరగా వెళ్ళి ఎవరైనా డాక్టర్ని తీసుకురండి! మీ తమ్ముడు అదేమిటో… కర్రలా బిగుసుకుపోయాడు… చిన్నపిల్ల గుణం అంటున్నారు…”

యమున చెప్పిందేవిటో రావుకి అర్థంకానే లేదు.

“మామయ్య ఎక్కడికో బైటికి వెళ్ళారు. మీరు వెళ్ళకపోతే ఎలాగా?” అంది భయంగా చూస్తూ.

“ఏమైంది?” అని కంగారుగా లేచాడు. “ఆయనకి ఊళ్ళో ఏం వ్యవహారాలు మిగిలిపోయాయి?” అన్నాడు వెటకారంగా.

“ఇలా అవుతుందని ఆయనేం కలగన్నారా? అయ్యో, తొందరగా వెళ్ళరా? మీ అమ్మ యేడుస్తున్నారు…” కాలు నిలవనిదానిలా ఆ గదిలోకి పరిగెత్తింది యమున.

“అమ్మ ఏడుస్తోందా? ఏమైంది తమ్ముడికి?”

గబగబా బట్టలు మార్చుకోవడం మొదలెట్టాడు.

“భయంలేదు వదినా! ఉల్లిపాయ వాసన చూపిస్తే తేరుకుంటాడు. సుశీలా! ఉల్లిపాయ కోసి తీసుకురా!” అంటోంది సుశీల అత్తగారు. ఆవిడికి చిట్టిపొట్టి వైద్యాలు తెలుసు.

అమ్మ వెక్కిళ్ళు స్పష్టంగా విన్పిస్తున్నాయి… “భగవంతుడా! నువ్వేది ఒడిగడితే అది ప్రసాదమని భరించుకున్నాను. ఇంటా బయటా నవ్వులపాలైనా ఈ పసి బిడ్డకోసం గుండె రాయి చేసుకున్నాను. ఈ వయసులో నాకీ అవమానాలతో పాటు గర్భశోకం కూడానా తండ్రి!” అమ్మ గొంతు పూడిపోతోంది దుఃఖంతో!

రావుకి గుండె కోసినట్టయింది.

అమ్మ నవ్వులపాలైంది… బిడ్డ కోసం!

అమ్మ అవమానం సహించింది… బిడ్డ కోసం!

అమ్మ ఏడుస్తోంది… బిడ్డ కోసం!

అమ్మా! నిన్నెవరు అవమానం చేశారు? ఎందుకూ? నువ్వేం తప్పుచేశావనీ?

కెవ్వుమన్నాడు పసికందు. కేరు కేరుమంటూ గుక్కపట్టి ఏడవడం మొదలెట్టాడు.

మనసు ఉప్పొంగింది అన్నకి.

“కాసిన్ని వేడినీళ్ళు తీసుకురామ్మా! ఆవదం కూడా తీసుకురా! ఒళ్ళు కాస్తాను.” అంటోంది సుశీల అత్తగారు.

రావు మొదలు నరికిన తరువులా కూలబడిపోయాడు. తను ఎంత రాక్షసుడయ్యాడు! తమ్ముడు చచ్చిపోవాలని తను కోరుకున్నాడా? లేకపోతే ఎందుకు డాక్టర్ దగ్గరికి తొందరగా పరుగెత్తలేదు? నవమాసాలు మోసి అమ్మ తమ్ముణ్ణి కంటే తను నిష్కారణంగా చంపేస్తాడా? ఏమిటీ క్రూరత్వం? రావుకి తనమీద తనకే అసహ్యం వేసింది.

“ఎవరెన్ని అనుకున్నా నా బిడ్డని నేను పెంచుకుంటాను.” అంటోంది అమ్మ ఏడుస్తూనే. రావుకి చెంపమీద కొట్టినట్టయింది.

ఎవరెన్ని అనుకున్నానా! ఎవరు అన్నారసలు అమ్మని?


తెల్లవారుఝామునించే ఇంట్లో సందడి మొదలైంది. అమ్మ స్నానానికి సన్నాహాలు చేస్తున్నారు.

పడుకోబుద్ది వెయ్యక రావు కూడా చీకటితోనే లేచి మొహం కడుక్కుని వేడివేడి నీళ్ళతో స్నానం చేశాడు. రాగానే యమున కాఫీ అందించింది. నవ్వుతూ యమునకేసి చూశాడు.

“యమునా! చిన్నప్పుడు పండుగలు వస్తే ఇలాగే చీకట్నే లేచిపోయి…”

“మీ చెల్లెల్ని పిలుస్తాను. ఆవిడితో ముచ్చటించుకోండి. అవతల నాకు బోలెడు పని వుంది,” అని యమున వెళ్ళబోయింది.

కొంగు పట్టుకుని ఆపాడు, “నీకు చిన్నతనం లేదా?”

“నేను చిన్నతనంలో ఇంత చీకటితో ఒక్కసారి కూడా లేవలా. హాయిగా ఎనిమిది గంటలవరకూ పడుకునేదాన్ని.”

“అందుకే అలా నిద్రపోతూ వుంటావు. నిద్ర మొహం నువ్వూనూ.”

యమున ఆశ్చర్యపోతూ చూసింది. “ఎందుకూ ఇవ్వాళ ఇంత ఖుషీగా వున్నారు?”

“ఉన్నాం అంతే. వెన్నెలెందుకు కాస్తుంది? కోయిలెందుకు కూస్తుంది?” అంటూ కొడుకు బుగ్గలమీద ముద్దుల వర్షం కురిపించాడు.

“ఓహో! కవిత్వం కూడానా? నాకు పని వుంది బాబూ,” అంటూ యమున వెళ్ళిపోయింది.

తమ్ముడు ఏడుస్తున్నాడు కేరు కేరుమంటూ. సుశీల నవ్వుతోంది, వాణ్ణేమిటో అంటూ.

“ఎందుకమ్మా వాణ్ణి ఏడిపిస్తున్నావు?” అంది అమ్మ.

“లేదమ్మా, నేనేమీ చెయ్యలా. కాటుక పెడుతోంటే ఏడుస్తున్నాడు. ఉత్త అల్లరి వెధవ!” సుశీల తమ్ముణ్ణి ముద్దులు పెట్టుకోవటం కూడా విన్నాడు రావు. రావు మనసు దేనికో ఆతృత పడుతోంది, ఎప్పటినించో!

లేచి నిలబడ్డాడు. తమ్ముణ్ణి చూస్తే? ఎలా? అమ్మ మొహం ఎలా చూస్తాడు?

తొమ్మిది నెలలనించీ అమ్మతో ఒక్క మాట కూడా మనస్ఫూర్తిగా మాట్లాడలేదు. “అమ్మా, నీ ఒంట్లో ఎలా వుంది?” అని ఒక్కసారి కూడా కనుక్కోలేదు. ఈ వయసులో, ఇంత బలహీనంగా బిడ్డని కన్నదంటే… అది ప్రకృతి మహిమే గానీ… తనేమీ సహాయం చెయ్యలేదు.

తను ఎందుకింత అమానుషంగా తయారయ్యాడు? గుండెని ఇంత బండగా ఎలా చేసుకోగలిగాడు?

తెల్లవారుతోంది. సూర్యకిరణాలు సూటిగా గదిలోకొచ్చి పడుతున్నాయి. ఆ వెలుగు పొడుగునా ఎగురుతోన్న ధూళిని చూస్తూ నిలబడ్డాడు.

అప్రయత్నంగా గదిలోంచి బయటికి వచ్చాడు. అప్రయత్నంగానే అమ్మ గది ముందుకు వెళ్ళాడు.

అమ్మ తమ్ముణ్ణి ఒడిలో పెట్టుకుని కూర్చుంది. వారగా వేసివున్న తలుపుల మధ్య నుంచి కన్పిస్తోన్న ఆ దృశ్యం… ముగ్ధుడ్ని చేసింది రావుని. తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. తలారా స్నానం చేసిన అమ్మ జుట్టు విరబోసుకుంది. చెంపలు తెల్లగా నెరసి వున్నాయి. బుగ్గలలో గుంటలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. నీరసంతో తెలతెలబోతున్న అమ్మ కళ్ళల్లో చిత్రమైన తృప్తి, పల్చగా పసుపు రాసుకున్న అమ్మ మొహంలో ఏమిటో ఆనందం! అమ్మలో ఎన్నడూ చూడని అందం కన్పిస్తోంది.

పసిగుడ్డుని గుండెలకు హత్తుకుని తల నిమురుతూ అమ్మ ఆనందంతో తన్మయమౌతోంది.

పాతిక సంవత్సరాల కిందట అమ్మవడిలో తనూ ఇలాగే… తమ్ముడిలాగే, పడుకుని వుంటాడా? ఆత్రంగా ఆకలిగా… పాలు తాగి వుంటాడా?

అమ్మ ఇలాగే తనని గుండెలకు హత్తుకుంటూ… మాటిమాటికీ ఒళ్ళు నిమురుతూ పాలు ఇచ్చి వుంటుందా?

అప్పుడు తన అమ్మ! ఇప్పుడు తమ్ముడి అమ్మ!

ఒకసారి అమ్మ కాగలిగిన అమ్మకి వయసేమిటి?

ఒక బిడ్డని కనిపెంచిన అమ్మకి హద్దేమిటి?

ప్రకృతి ధర్మాన్ని పరిహసించటం ఎంత అవివేకం!

ఇంత కాలం ఎందుకు తను అమ్మని తన మనసులో ఆక్షేపించుకున్నాడు? ఈ వయసులో అమ్మ ఎంత బాధ్యత వహించాలి! ఎంత ఓపిక తెచ్చుకోవాలి!

ఎంత కష్టపడి ఈ పసిగుడ్డుని పెంచాలి!

తమ్ముణ్ణి వేయి కళ్ళతో కాపాడుకుంటోంది అమ్మ.

తలుపులు బార్లా తీసుకుని అమ్మ గదిలోకి దూసుకెళ్ళాడు రావు.

నిర్ఘాంతపోయింది అమ్మ! సిగ్గుపడిపోయింది అమ్మ! కొంగు ఒంటినిండా కప్పుకుని తలదించేసుకుంది అమ్మ.

“అమ్మా!” పెద్దకొడుకు కంఠం వణికింది. “ఒకసారి తమ్ముణ్ణి ఇయ్యమ్మా! చూస్తాను.”

తనే ఒంగి పసివాణ్ణి అందుకున్నాడు. తహతహతో వాడి మొహంలోకి చూశాడు. మృదువుగా వాడి చెక్కిళ్ళు ముద్దుపెట్టుకున్నాడు.

అన్న హృదయం దూదిపింజెకన్నా తేలికైంది. కళ్ళలో నీటిపొర కమ్మింది. “అమ్మా! నీ ఒంట్లో బాగుందా?”

విస్మయంగా చూసింది అమ్మ! అమ్మ కళ్ళనిండా నీళ్ళు సుళ్ళు తిరిగి చెంపల మీదుగా జారాయి.

దోషిలా నిలబడ్డాడు కొడుకు. అమ్మ చటుక్కున చెంపలు ఒత్తుకుంది. “కూర్చో” అంది ప్రేమగా.

కొడుకు అమ్మ దగ్గర కూర్చున్నాడు. తమ్ముణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు.

“అమ్మా! వీడు నా పోలికే కదూ?”

నవ్వింది అమ్మ.

సుశీల కంగారుగా వచ్చింది. “అన్నయ్యా! వాణ్ణి జాగ్రత్తగా పట్టుకోవాలి! అయినా నువ్వు ఇక్కడికెందుకొచ్చావూ?”

అదేం విన్పించుకోలేదు అన్నయ్య. “సుశీలా! తమ్ముడు నా పోలికే కదే?”

“నీ పోలికేం కాదు. నాలా వున్నాడు.”

“పో! నీ పొట్టిముక్కూ నువ్వూనూ, అచ్చం నాలా వున్నాడు. కావాలంటే అమ్మనడుగుదాం. ఏమ్మా? తమ్ముడు ఎవరిలా వున్నాడు?”

“నిజం చెప్పమ్మా! నాలా లేడూ?” అమ్మ మళ్ళీ నవ్వింది. కళ్ళల్లో మిగిలి వున్న రెండు కన్నీటి బొట్లు రాలిపడ్డాయి.

యమున, కొడుకుని చంకనేసుకుని వచ్చింది. భర్త ఒడిలో మరిదిని చూసి ఆశ్చర్యపోతూ నిలబడింది. పిల్లాణ్ణి తండ్రి దగ్గిర దించింది.

“నాన్నా! నీ బాబాయిరా! చిన్నాన్నరా! బాబాయిని ఎత్తుకో! బాబాయిని నువ్వే ఆడించాలి.” అంటూ బాబాయిని కొడుకు ఒడిలో పడుకోబెట్టాడు బాబాయి అన్నగారు. అందరూ నవ్వుతూ నిలబడ్డారు.

అమ్మ కూడా!

బాబాయి, కొడుకు కాళ్ళమీద కుదురుగానే పడుకున్నాడు!

(1965 జనవరి.)

[ఈ కథ పునర్ముద్రణకు అనుమతించిన రంగనాయకమ్మగారికి కృతజ్ఞతలు – సం.]