ఉదాహరణములు -2: శారదోదాహరణ తారావళి

షష్ఠీ విభక్తి

(షట్పద) కందము –
సురుచిర బంభర వేణికి
సరసిజభవుఁ గూర్మి సతికి
స్వర భేదినికిన్
సరసోక్తుల కవయిత్రికిఁ
గరుణాలయ కనుదినమ్ము
గరములు మోడ్తున్

ఉత్పలమాల –

హారము లిత్తు నా హృది వి-హారము సల్పెడు దేవికిన్ నమ-
స్కారము సల్పుదున్ జదువు – సారము దెల్పెడు వాణికిన్ మనో-
ద్వారము దీసెదన్ వెలుఁగు – దారులు సూపెడు తల్లికిన్ సదా
స్మారము సేసెదన్ గళల – మర్మము విప్పెడు శారదాంబకున్

కళిక – ద్విరదగతిరగడ –

మఱియు స్వరభూషణికి – మలహరికి శ్రీమణికి
వరదకు సుపోషిణికి – భైరవికి తారిణికి
భూపాల నాయకికి – పూర్ణచంద్రిక ప్రతికి
శ్రీ పావనికి ప్రణవ-శీలి ఛాయావతికి
నారాయణికి సామ – నాదనామక్రియకు
కీరవాణికి జయకు – కృష్ణవేణికి సితకు
రాగచూడామణికి – రత్నాంగి రంజనికి
రాగమాలికలు ఘన – రాగ రసమంజరికి

ఉత్కళిక – పం/పం
స్వరరూపవతి లలిత
కిరణావళీకలిత
కనకాంగి చారుమతి
వనజాక్షి భానుమతి
రాగవర్ధని వాణి
వేగవాహినివేణి
స్వామిని కళావతికి
ప్రేమల శరావతికి

వివరణలు

 1. కందము షట్పద కందము, అనగా రెండవ, నాల్గవ పాదములలో యతితోబాటు ప్రాస యతి కూడ నున్నది.
 2. షష్ఠీ విభక్తికి పేరు లలిత, అధిదేవత కాంతిమతి. ఇందులో లలిత అను పేరు ఉత్కళికలో నున్నది.
 3. కళికోత్కళికలలో రాగముల పేరులను సూచించినాను. అవి- స్వరభూషణి, మలహరి, శ్రీమణి, సుపోషిణి, భైరవి, భూపాల, నాయకి, పూర్ణచంద్రిక, శ్రీ, పావని, ఛాయావతి, నారాయణి, సామ, నాదనామక్రియ, కీరవాణి, కృష్ణవేణి, రాగచూడామణి, రత్నాంగి, రంజని, రసమంజరి, రూపవతి, లలిత, కిరణావళి, కనకాంగి, చారుమతి, భానుమతి, రాగవర్ధని, వేగవాహిని, కళావతి, శరావతి (30 రాగములు)

క్రొత్త ప్రయోగము – షష్ఠీ విభక్తి ఉత్కళికలో విభక్త్యాభాసము

ఉత్కళిక – పం/పం
చారుమతి భగవతి కి
శోరులకు సృత్వరి కి
నుక లేని వాఙ్మణి కి
టుకు సూపు బ్రాహ్మణి కి
ణకిణల గాయని కి
లకిలల హాసిని కి
రీటములు భారతికి
మేటియగు కీరితికి

సప్తమీ విభక్తి

చంపకమాల –
ఉదయమునందు ధ్యానమున – నోజము లొప్పుగ బోధ సేసె నా
హృదయమునందు చిందులిడు – మృష్ట సువిగ్రహ మామెదే గదా
వదనమునందు నుచ్చరణ – స్వచ్ఛము సేసెను గంగవోలె నీ
సుదినమునందు సుందర వ-చోఽమృత మిచ్చిన దామెయే గదా

కళిక – హంసగతిరగడ –
మఱియు ఛవి యుదయించ – మనసు నందు
విరియ హృత్కమల మా – వెలుఁగు నందు
దీవె లవ భావములు – దినము నందు
రావ మవ భావములు – రాత్రి యందు
మెలిక లవ రాగములు – మెలకు వందు
నిలువ లయ యోగములు – నిదుర యందు
బాట నీవవ చావు – బ్రదుకు నందు
ఆట నీవవఁగ నా-ద్యంత మందు

ఉత్కళిక – పం/త్రి
చింతన మవంగ
మంతన మవంగ
చిత్రము లవంగ
సూత్రము లవంగ
సూచన మవంగ
మోచన మవంగ
గద్యముల యందుఁ
బద్యముల యందు

వివరణలు

 1. కళిక అరుదుగా వాడబడే హంసగతిరగడలో వ్రాసినాను.
 2. సప్తమీ విభక్తికి పేరు ఘోణి లేక ఘోటిక, అధిదేవత కమల. కమల అను పదము కళికలో వచ్చినది.
 3. సంబోధనా ప్రథమా విభక్తి

  మాలిని –
  జయతి జయతి వాణీ – శ్రావ్య సంగీత వాణీ
  జయతి సుజన పక్షా – సత్య సంకల్ప దక్షా
  జయతి జయతి మాయీ – జన్మసాఫల్య దాయీ
  జయతి విమల వేషా – సంస్కృతారామ పోషా

  చంపకమాల –
  జయము సరస్వతీ జయము – శారద చంద్ర సమాన హాసినీ
  జయము ప్రియంవదా జయము – సత్య వచోఽమృత సింధు వాఙ్మయీ
  జయము సుమాలినీ జయము – చందన కుంకుమ పుష్ప భూషిణీ
  జయము విశారదా జయము – ఛందపు టందముఁ జూపు శారదా

  కళిక – హయప్రచారరగడ –
  మఱియు దేవి – మంగళాంగి
  స్థిర సుమేరు – శ్రీ శుభాంగి
  ముక్తి దాయి – మోద దాయి
  భక్తి దాయి – భావ దాయి
  యుక్తి దాయి – యోగ దాయి
  శక్తి దాయి – శమన దాయి
  అహము రాత్రి – అమరవల్లి
  ఇహము పరము – నిచ్చు తల్లి

  ఉత్కళిక – త్రి/త్రి

  అజయ మతిగ
  విజయవతిగ
  వళుల వడిగ
  కళల గుడిగ
  ముదపు విరిగ
  హృదికి సిరిగ
  అక్ష రాంబ
  అక్ష యాంబ

  వివరణలు

 1. ఈ విభక్తికి సరసావళి అని పేరు. దీనికి అధిదేవత జయవతి. జయవతి అను పదము ఉత్కళికలో వ్రాసినాను.
 2. మాలినీ వృత్తమును సంస్కృతములో కూడ సంబోధనకై ఉపయోగింతురు. ఇట్టి పద్యములు జయతి అను పదముతో ప్రారంభమగును. నేను కూడ ఇట్లే ఈ పద్యమును వ్రాసినాను.

సార్వవిభక్తికము

ద్విపద-
ఆరని పృథు దీప – మమర భూజమ్ము
తీరని యాశలన్ – దీర్చు దైవమ్ము
భారతిచే విద్య – వఱలు వేగమ్ము
కారుణ్య దృష్టికై – కైమోడ్తు నమ్ము
నీ రాగము వలన – నేర్తు గానమ్ము
గారాల తల్లికి – కవి తామృతమ్ము
చేర నీ పదమందు – చిన్ని జీవమ్ము
కోరితిన్ శారదా – గురుదేవి రమ్ము

మత్తేభవిక్రీడితము –

వరవీణామృదుపాణి నీవు, నిను నేఁ – బ్రార్థింతు, నీచేత సుం-
దరకావ్యమ్ముల సృష్టి యౌను, సుమనో-దామమ్ము నీకై కదా,
సరసోక్తుల్ జనియించు నీవలన, భా-షాదేవి నీకంజలుల్,
జరణాబ్జమ్ములయందు నుంతుఁ గవితల్, – సర్వేశ్వరీ శారదా

పాల్కుఱికి సోమనాథుడు పండితారాధ్యచరిత్రలో ఏడు విభక్తులు వచ్చునట్లు ద్విపదలలో వ్రాసెను. ద్విపదను ఎన్నుకొనుటకు అది ఒక ప్రోత్సాహమైనది.

మంగళము

మంగళమహాశ్రీ –
మంగళము వర్తనలు – మంగళము నర్తనలు – మంగళము కీర్తనల స్ఫూర్తీ
మంగళము వేదములు – మంగళము నాదములు – మంగళము మోదన వినోదీ
మంగళము నీ స్వరము – మంగళము నీ కరము – మంగళము నీ వరము దేవీ
మంగళము నీ గృహము – మంగళము నీ మహిమ – మంగళము మంగళమహాశ్రీ

వివరణ

ఉదాహరణ కావ్యములలో ఎల్లప్పుడు ఇరువదియాఱు పద్యములు ఉండవలయును. ఎనిమిది విభక్తులకు ఇరువది నాల్గు, సార్వవిభక్తికమున కొకటి, అంకితాంకితమున కొకటి. తారావళికి ఇరువది ఏడు పద్యములు ఉండవలయును. అదనపు పద్యము ప్రథమా విభక్తికి ముందు కొందఱు వ్రాసినారు. నేను సార్వవిభక్తికమునకు పిదప మంగళవాక్యముగా వ్రాయ దలచితిని. ఈ విధముగా మొదట శ్రీకారముతో చివర శ్రీకారముతో ఈ లఘు కావ్యము శోభిల్లును. మంగళాంతమునకు మంగళమహాశ్రీ ఉండగా వేఱు వృత్తము ఎందులకు ఎన్నుకొన వలయును.

అంకితాంకము

కందము-
జెజ్జాల వంశ సూనుఁడ
సజ్జనని యుదాహరణము – చందమ్ములతో
సజ్జన ప్రియముగ వ్రాసితి
ముజ్జగముల పతికి కృష్ణ – మోహనునకు నేన్


(నా చిత్తు ప్రతిని ఒక మారు చదివిన శ్రీమతి పావులూరి సుప్రభగారికి నా కృతజ్ఞతాంజలులు.)

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...