ఉదాహరణములు -2: శారదోదాహరణ తారావళి

తృతీయా విభక్తి

శార్దూలవిక్రీడితము –
నీచే విశ్వము లెల్ల జ్ఞానమయమౌ – నిస్తంద్ర తేజోమయీ
నీచే మానస మెల్ల కాంతిమయమై – నిత్యమ్ము నిండున్ గదా
నీచే బోధన శోధనల్ జరుగు న-న్వేషార్థ మీవే సదా
నీచే సృష్టియు గల్గు హృష్టి గలుగున్ – నీచేత శ్వేతాంబరీ

కళిక – ద్విరదగతిరగడ –
మఱియు నవ శబ్దముల – మధురిమల శ్రేణిచే
వర సుభగ వాక్సుధా – భరిత గీర్వాణిచే
చిత్రలేఖన నాట్య – సృజన బ్రహ్మాణిచే
చిత్ర కవితల గూర్చు – చెలువముల రాణిచే
వీణియను మ్రోగించు – వేదాంత వేదిచే
వాణి కొక మెఱుఁ గిచ్చు – వచన సంవాదిచే
శిల్పము లనల్పముగ – చెక్కు ఘన శిల్పిచే
కల్పనల కల్ప మగు – కడు దయల వేల్పుచే

ఉత్కళిక – పం/పం
రాగముల యోగములు
యోగముల రాగములు
విద్యల వినోదములు
పద్యముల చోద్యములు
కాంతిమయ దీపములు
శాంతిమయ రూపములు
శరదిందు వదనచే
స్వరచిత్ర సదనచే

వివరణలు

ఇందులో పలు లలితకళలను విశదీకరించినాను. తృతీయా విభక్తికి కీర్తి అని పేరు. అధిదేవత సుభగ. సుభగ అను పేరు కళికలో వాడబడినది.

క్రొత్త ప్రయోగము – తృతీయా విభక్తి ఉత్కళికలో విభక్త్యాభాసము

ఉత్కళిక – పం/పం
అంతటను నెన్నొ చే-
మంతుల సరములు చే-
లమ్ముల సితమ్ము చే-
తమ్ముల ముదమ్ము చే-
దోడుగను నామె చే-
కూడుఁగద మేలు చే-
తనమెల్ల బ్రాహ్మిచే
స్వనమెల్ల వాణిచే

చతుర్థీ విభక్తి

తరలము –
నలువ దేవుని రాణికై రచ-నావిధాన ప్రమాణికై
కలువ కన్నుల జ్ఞానికై నవ-కాంతిదాయిని ధ్యానికై
లలిత విద్యల రాశికై సువి-లాస నాట్య కలాపికై
తెలుగు కైతల భావికై యిది – దేవలాభిని దేవికై

చంపకమాల –
అమల దుకూల ధారిణికి-నై, యసమాన కళావధూటికై
యమిత రసార్ణవాంబుజకు-నై, యపరాజిత వేదవాణికై
యమృతసమాన భాషిణికి-నై, యనురాగమయార్ద్ర చిత్తకై
యమర మునీంద్ర సేవితకు-నై, యమరాక్షరఁ గొల్తు నెప్పుడున్

కళిక – మధురగతిరగడ –
మఱియును జీఁకటి – మదిఁ దొలఁగుటకై
వఱలెడు కాంతులు – వఱద లగుటకై
జిజ్ఞాసల విరి – జీవించుటకై
సుజ్ఞానపు ప్రియ – సుధ లూరుటకై
నవ జీవన లత – నన బూయుటకై
నవ రాగపు ఛవి – నడయాడుటకై
హృదయస్పందన – లిలఁ బాడుటకై
బ్రదు కిది జయభ-ద్రను వేడుటకై

ఉత్కళిక – చ/చ
మీఱగ నీ కై-
వారము నీ కై-
రవములు నీ కై-
రవియును నీ కై-
సేతలు నీ కై-
వ్రాతలు నీ కై-
దివియలు నీకై
స్తవములు నీకై

వివరణలు

  1. చతుర్థీ విభక్తికి దేవలాభిని యని పేరు, దీని అధిదేవత పేరు భోగమాలిని. దేవలాభిని అను పేరు మొదటి పద్యములో నున్నది.
  2. ఉత్కళికలో విభక్తి ఆభాసము తోచునట్లు వ్రాసినాను. కైవారము (నమస్కారము), కైరవము (కలువపూవు), కైరవి (వెన్నెల), కైసేత (పని), కైవ్రాత (చేతివ్రాత), కైదివియ (చేతగల దీపము)- ఈ ఆఱు పదములు విభక్త్యాభాస పదములు. నీ అను పదము సంధివలన వచ్చినది. (మీఱగన్ + ఈ = మీఱగ నీ, ఇట్లే మిగిలినవి). కై అను అక్షరముతో ప్రారంభమగు పదములు చాల తక్కువ. నేను ఈ పదములనే ఎందుకు ఎన్నుకొన్నాను అనగా- ఈ పదములు విభక్తియొక్క ఆభాసమును తెలుపుటయే గాక, కై లేకున్నను, తదుపరి పాదములోని పదములు స్వతంత్రముగా నిలువగలవు. వారము, రవము, రవి, సేత, వ్రాత, దివియ పదములు తమంతట తామే అర్థవంతములు.

పంచమీ విభక్తి

మత్తేభవిక్రీడితము –
వరదాయీ జగ మెల్ల నీవలననే – భాసించు సందీప్తమై
వర వీణా మృదు పాణి నీవలన స-ద్భావమ్ము గల్గున్ సదా
నరనారీకుల మెల్ల నీవలన జ్ఞా-నమ్మొంద యత్నించు సుం-
దరమౌ సద్‌హృదయమ్ము నీవలన మా-తా వేదవిద్యానిధీ

కళిక – వృషభగతిరగడ –
మఱల నుల్లము పూర్ణ మందఁగ – మధుర విద్యల దీప్తి వలనన్
సిరుల నిండఁగ జీవన మ్మిటఁ – జిత్ర మగు నీ కళల వలనన్
గణిత శాస్త్రపు గాన శాస్త్రపు – గంధ మబ్బఁగ ఘనత వలనన్
గనుల శాస్త్రపు మణుల శాస్త్రపు – గరిమ తెలియఁగ మహిమ వలనన్
వివిధ భాషల విమల శోభలు – వెలుఁగ నిల నీ కలము వలనన్
వివిధ స్వరముల ప్రణవ రవములు – వెల్లువవ నీ గళము వలనన్
ఫుల్ల కుంద సుహాసినీ మది – పొంగ నీ గురు కృతుల వలనన్
పల్లవించఁగ జ్ఞానవల్లి య – పారమగు నీ కృపల వలనన్

ఉత్కళిక – త్రి/చ/త్రి/చ
మఱియు మంగళ మధురగీతులు
సురుచిరమ్మగు శుభ విభూతులు
విలసితమ్మగు వృత్త రీతులు
లలిత పదముల లయవిభాతులు
చంద్రభాను సుచారు కాంతులు
నింద్రచాపము లిచ్చు భ్రాంతులు
నవరసోజ్జ్వల నటన వలనన్
భువన మోహిని భ్రూవు వలనన్

వివరణలు

  1. పంచమీ విభక్తికి పేరు పాణి, అధిదేవత కళావతి. పాణి అను పదము వృత్తములో వచ్చినది.
  2. కళికలో ఎన్నియో కళల పేరులు, విజ్ఞాన విభాగములు చెప్పబడినవి. (గణితము, సంగీతము, భూగర్భశాస్త్రము, స్ఫటికశాస్త్రము ఇత్యాదివి.)
  3. ఉత్కళికలో ఛందస్సులోని గణములైన సూర్య, ఇంద్ర, చంద్ర గణముల పేరులు సూచించబడినవి.
  4. ప్రణవ, మంగళ, మధురగీతి, సురుచిర, శుభ, విభూతి, వృత్త, లలిత, లయవిభాతి, చంద్రభాను, కాంతి, ఉజ్జ్వల అను పద్యముల పేరులు కళికోత్కళికలలో తెలుపబడినవి.