త్వమ్ తత్ అసి

నీవలా చూస్తూనే వుంటావు
నేలను చేరబోతూ
చూసే వాన చినుకులా

నేనూ
అదే ఆతృతతో
అలానే మనసు పరచి
తపిస్తూనే వుంటాను

నేను కారుమొయిలునై
విషాదాన్ని కమ్ముకున్న ప్రతిసారీ
నీవు మెరుపువై హృదయాన్ని
వెలిగిస్తూనే వుంటావు

నీవు నా భుజాన వాలబోతూ
పలకరించే పాలపిట్టవైన
ప్రతిసారీ
నేనూ గుండె నిండా చివుళ్ళు తొడిగి
నిలుస్తూనే వుంటాను

నీ వునికి నాలో
నిరంతరం ప్రవహించినా
కనుచూపుమేరా అదృశ్యంగా
నన్ను స్పృశిస్తూనే వున్నా
నేను నీ అగుపించని రూపుకై
తపిస్తూనే వుంటాను

నీ అస్తిత్వాన్ని
శోధిస్తూ నేను ప్రశ్నించిన ప్రతిసారీ
నీవు అదే సంభ్రమానివై
కవ్విస్తూ వుంటావు

నదిపై తేలే నావవో
నావను నిలిపే నదివో
నాలో నీవో
నీకై నేనో
ఆదివో అనాదివో
త్వం తత్ అసి!

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం అనేక దిన,వార,మాసపత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవిత కు నవ్య-నాటా బహుమతి తెలుగు, ఇంగ్లీషు లో కవిత, కధా రచనతో పాటు అనువాదాలు సాహిత్య బోధన,రచన ప్రధాన వ్యాసంగాలు. ...