బుఱ్ఱకథ నాజర్‌గారి రెండు ఇంటర్‌వ్యూలు

నేను ఒకటో తరగతినుండి ఇంచుమించు పదవ తరగతి సగం వరకు చదువుకున్న వూళ్ళో రెండే పార్టీలుండేవి – రైటు, లెఫ్టు. అంటే సి.పి.ఐ., సి.పి.ఎం. పార్టీలన్నమాట. ముఖ్యంగా సి.పి.ఎం. పార్టీకి అనుబంధ సంస్థయిన ప్రజానాట్యమండలి తమ సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా చురుగ్గా ఉండేది. ఎన్నికలొస్తే వూళ్ళో నాజర్ బుర్రకథ కావాలి, సుందరయ్యని తీసుకొస్తేనే ఓటేస్తాం, అని గట్టిగా అడుగుతుండేవాళ్లు. ఇది సుమారు నలభయ్యేళ్లనాటి మాట. ఇప్పుడు అసలు నాజర్ ఎవరంటే ఎంతమందికి తెలుస్తుందో! నాజర్ జీవిత చరిత్ర గురించి తెలుగు వికీపీడియాలో చాలా వివరాలతో వ్యాసముంది – చివరివరకు తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చాలా నియమబద్ధమైన జీవితం గడిపిన ఆయనంటే నాకు చాలా గౌరవం. దొరికితే ఆయన ఆత్మకథ పింజారీ తప్పకుండా చదవండి. (ఈ వాక్యాలు రాస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే తెలిసిన విషయమేమంటే విశాలాంధ్ర వాళ్ళు ఈ పుస్తకాన్ని మరల ముద్రించారని. నా దగ్గర ఉన్నది సౌదా అరుణగారు వేసిన మొదటి ప్రతి.) ఈ పుస్తకం మీద ఒక సమీక్ష కినిగె పత్రికలో వచ్చింది. ఆయన చెప్పిన బుర్రకథలు పూర్తి నిడివిలో మనకీరోజు దొరకవు కానీ సినిమాల్లో చెప్పిన ఒకటి రెండు (ఉదా. అగ్గిరాముడు – 1954) యూట్యూబ్‌లోలో చూడవచ్చు.

ఈ సంచికలో నాజర్ విజయవాడ రేడియో కేంద్రానికిచ్చిన రెండు ఇంటర్వ్యూలను వింటారు. ఇవి 1991, 1993 సంవత్సరాలలో రికార్డయ్యాయి. మరో రెండు రేడియో కార్యక్రమాలున్నాయి. వాటిని డిజిటైజ్ చేయవలసి ఉంది. అవి మరొకసారి.

  1. చాపకట్టు సిద్ధాంతం
  2. ప్రచారసాధనంగా బుఱ్ఱకథ