గడి-నుడి 3 సమాధానాలు

అడ్డం

 1. తారుమారై విరహ సలాముగా మారిన శ్రీనాధుని పుస్తకం (6)
  సమాధానం: హరవిలాసము. అక్షరాలు సరిగ్గా పేర్చమని సూచన “తారుమారైన” పదంలో ఉంది.

 2. హా! మతభారము… ఎంత చెడ్డా, మన పవిత్ర గ్రంధమే (6)
  సమాధానం: మహాభారతము. ఎంతచెడ్డా అన్నమాట అక్షరాలు చిందరవందరయ్యాయని సూచిస్తోంది.

 3. గుర్తు తప్పుకి ముందుండేది (2)
  సమాధానం: అచ్చు. అచ్చుతప్పు వాడుకపదం పత్రికాలోకంలో. అందుకే తప్పుకి ముందుండేది.

 4. మనం బిగించుకుని కూర్చుంటే విష్ణు పూజ ఎవరు చేస్తారు? (2)
  సమాధానం: నంబి. “మనం బిగించుకుని” లో కూర్చున్నవైష్ణవ దేవాలయ పూజారి

 5. అక్కడక్కడ వేలుమధ్యన చిక్కుకున్న శతకకారుడు (3)
  సమాధానం: వేమన. అక్కడక్కడ అన్న పదం అక్షరం విడిచి అక్షరం ఎంచుకొమ్మని సూచిస్తోంది.

 6. గుండెలోకి పాతుకున్న గుండు ఇటునుండే ఇక్కడినుంచే వచ్చింది (3)
  సమాధానం: తుపాకి. ఈ క్లూలో “ఇటునుండే ఇక్కడినుంచే” అన్న పదాలు రెండు సూచనల్ని అందిస్తాయి. ఇటునుండే అన్నది అక్షరాల గమనాన్ని తెలియచేస్తే ఇక్కడినుంచే అన్నది గుండు సాధారణంగా ఎక్కడినుండి వస్తుంది అన్న ప్రశ్నకి జవాబు వెతకమని తెలుపుతుంది.

 7. నీడకు ముందుంటుంది. ఒట్టు. (2)
  సమాధానం: తోడు. వాడుకలో తోడు-నీడ వింటూంటాం. తోడు అంటే ఒట్టు, ప్రమాణం లాంటి అర్ధాలుకూడా ఉన్నాయి కదా?

 8. అరటిచెట్టులాంటి అప్సరస (2)
  సమాధానం: రంభ. రంభ అంటే అప్సరస మరియు అరటిచెట్టు అనే అర్ధం కూడా ఉంది. రంభా అన్నా కూడా తప్పుకాదు కాబట్టి రెండూ సరైన జవాబులుగానే పరిగణిస్తాం.

 9. ప్రకృతిని ఎదుర్కొన్న గృహము (2)
  సమాధానం: గీము. ప్రకృతిని ఎదుర్కొన్న అంటే దాని వికృతిని గుర్తుంచుకోమని సూచిస్తోంది. గృహము ప్రకృతి అయితే గీము వికృతి కదా?

 10. అమ్మలక్కల పరిశ్రమతో పిడత (2)
  సమాధానం: లక్క. అమ్మలక్కల మధ్యనే దాక్కుంది జవాబు. పిడతల పరిశ్రమకి కావల్సింది లక్కే కదా?

 11. ఈ పరిమళం వద్దని వారిస్తూ కళ్ళు మూసుకోకు. తిరిగి చూడు (3)
  సమాధానం: కస్తూరి. తిరిగి చూడు అన్న సూచన వెనకనుండి పరిమళాన్ని వెతకమన్న సలహా ఇస్తోంది.

 12. స్వర్గానికీ దీనికీ ఎగరలేనమ్మ (2)
  సమాధానం: ఉట్టి. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరినట్టు అన్నది సామెత.

 13. కలువల్లో అక్కడక్కడ కనపడే జత (2)
  సమాధానం: కవ. అక్కడక్కడ సూచన మీకు గుర్తుండే ఉంటుంది.

 14. గ్రహాలు అనుకూలిస్తే పట్టేది కాబోలు (5)
  సమాధానం: రాజయోగము. సాధారణంగా గ్రహాలు అందరికీ అనుకూలిస్తూనే ఉంటాయి వారి జీవితకాలంలో. శుభయోగం అందరికీ ఉంటుంది. కానీ గ్రహాలు బాగా అనుకూలిస్తేగానీ రాజయోగాలు లాంటివి పట్టవు కదా? పైగా అందరికీ రాజయోగం పడితే పల్లకీ మోసేవారెవరు?

 15. ముక్కున్నంతసేపూ ఇది ఉంటుందిట, సామెత ప్రకారం (3)
  సమాధానం: పడిసెం. ముక్కున్నంతసేపు పడిసెం ఉంటుందన్నది ఒక సామెత. అయితే ప్రాంతీయ మాండలికాల్లొ పడిశెం అనికూడా కనపడుతుంది. రెండు సమాధానాలూ స్వీకరించేము.

 16. వడ్డీని సంపాదించే మూలధనం బురదా? (3)
  సమాధానం: అసలు. దీనికి బురద, మూలధనం అని అర్ధాలున్నాయి.

 17. పస మధ్యన ఉంటే పండవుతుంది (3)
  సమాధానం: పనస. పస మధ్యలో న వస్తేనే కదా పండయ్యేది.

 18. విన్నపాలు లో సగం భాగం (2)
  సమాధానం: పాలు. విన్నపాలు లో రెండో సగం పాలు అంటే భాగం.

 19. కారు, తాడు, సుర ఇవన్నీ ఒక క్రమంలో పేరిస్తే రాక్షసుడౌతాడు (6)
  సమాధానం: తారకాసురుడు. తారుమారైన అక్షరాలు పేరిస్తే సరిపోతుంది.

 20. రామ! రామ! రామ! రామ! రామ!… అవి తోటల్లా కనిపిస్తాయికానీ దేవాలయాలు (6)
  సమాధానం: పంచారామములు. ఐదుసార్లు రామ శబ్దం పంచ అన్న ఊహని కలిగిస్తుంది. ఇక తోటలు అంటే ఆరామములు. వెరసి పంచారామములు అయింది.

 21. అసలే చిరాకు. మధ్యలో గురక మొదలుపెడితే పుట్టే దళం (4)
  సమాధానం: చిగురాకు. గురక మొదలుపెడితే అంటే గురకలొని మొదటి అక్షరాన్ని చిరాకులో చేర్చి పెట్టమని సూచన.

 22. జింక మధ్యలొ వాగడం ఆరంభిస్తే పళ్ళెం (4)
  సమాధానం: హరివాణం. అలాగే మధ్యలో వాగడం ఆరంభిస్తే అంటే వా అక్షరాన్ని హరిణం [అంటే జింక] మధ్యలో చేర్చమని సూచన.

 23. తునాతునకలు అయినా కనపడే ప్రతిరూపం (3)
  సమాధానం: నకలు. తునాతునకలు మధ్యలోనే ఉన్నాది జవాబు కనబడే మాటలో.

నిలువు

 1. అణువు లాంటి సన్నని నూక (2)
  సమాధానం: రవ్వ. అంటే అణువు, నూక అనే అర్ధాలను వాడడం జరిగింది.

 2. డబ్బుతోవ్యవహారం! కావాలా దేవి? తలకొట్టి బెడిసికొట్టింది (4)
  సమాధానం: లావాదేవి. కావాలా దేవి లో మొదటి అక్షరం తీసేసి తారుమారు చేస్తే డబ్బుతో వ్యవహారం అవుతుంది.

 3. ఎట్నుంచి చూసినా సంతోషము (3)
  సమాధానం: ముదము. వికటకవిలాంటి పదం. ఎటునుండి చూసినా భావం ఒక్కటే.

 4. చంద్రభానుచరిత్రలో తలకిందులైన మాసం (2)
  సమాధానం: భాద్ర. తేలికైన సూచన. భాద్రపదమాసానికి హ్రస్వరూపం.

 5. లేతదనం తరంగిణిలా కనిపిస్తుంది అటుపిమ్మట (5)
  సమాధానం: తదనంతరం. కనిపిస్తూనే ఉందిగా.

 6. మగటిమి పస అక్కడక్కడ తిరిగి పుంజుకుంటే నేర్పు అదే వస్తుంది (3)
  సమాధానం: పటిమ. రెండు సూచనలు. అక్షరాలని ఒకటి తప్పించి ఒకటి ఎన్నుకొమ్మని. వెనకనిండి చూడాలని.

 7. గతికి ముందు వచ్చే ఎక్కువ మాట (2)
  సమాధానం: అతి. అతి-గతి అనేవి జంట పదాలు. అతి అంటే ఎక్కువని మీకెలాగూ తెలుసు.

 8. మనమున మగడితో తిరుగు ప్రయాణం (4)
  సమాధానం: గమనము. తిరుగు ప్రయాణం మళ్ళీ యధాస్థానానికి రమ్మని కాదు. వెనకనిండి గమనించమని.

 9. పూలరంగడు సరిగ్గా చూస్తే అసాధ్యుడే (4)
  సమాధానం: గడుసరి. ఒకసారి చూస్తే మీరే పట్టేస్తారు. నెను చెప్పాలా మళ్ళీ మీలాంటి అసాధ్యులకి?

 10. కష్టం పొరకప్పిన తప్పు (2)
  సమాధానం: పాటు. తప్పు అంటే పొరపాటు. పొరని కప్పేస్తే మిగిలేది కష్టమే కదా?

 11. సంతోషాలతోట ఆడవారికేనా? మాలతీచందూర్ ను అడిగితే సరి. (5)
  సమాధానం: ప్రమదావనం. అంటే ఆడవారికి మాత్రమే ప్రవేశమున్న తోట. మాలతీచందూర్ గారి ఆంధ్రప్రభ శీర్షిక తెలియనివారుండరు. ఎంతోమంది స్త్రీలు తమ భావాల్ని ఆత్మీయంగా వ్యక్తపరిచేవారు ఆ రోజుల్లో. అంత పేరుపడ్డదీ శీర్షిక.

 12. పట్టుకో గలనా బామ్మ ఈ పాతచిత్రాన్ని (5)
  సమాధానం: బాలనాగమ్మ. వెతికి పట్టుకొమ్మని సూచన కనిపిస్తోందిగా.

 13. ఇది చేస్తే అదుపులో ఉంటారు (3)
  సమాధానం: కట్టడి. ఎవర్నేనా హద్దుల్లో ఉంచాలంటే ఇదే కదా చెయ్యాలి?

 14. ఇది చెప్పేరంటే పన్లోంచి తీసేసేరన్నమాటే! (4)
  సమాధానం: ఉద్వాసన. ఎవర్నేనా పన్లోంచి తొలగించినప్పుడు ఇలా అనడం మీకు తెలిసిందే కదా?

 15. అడవికుక్క మధ్యలేకుంటే చర్మం (2)
  సమాధానం: తోలు. అడవికుక్క అంటే తోడేలు. మధ్య డే లోపిస్తే తోలు అవుతుంది.

 16. దేశవాళీ పద్ధతిలో తయారుచేసిన సరకు (4)
  సమాధానం: నాటుసారా. దేశవాళీ అంటే నాటు అని అర్ధం. సరకు అంటే వస్తువు. మద్యం ప్రియులు వాడుకలో సారాని సరకు అనడం వినే ఉంటారు.

 17. అహోబలపండితీయంలో రాసేది (3)
  సమాధానం: బలపం. లోపలే ఉందిగా.

 18. తీవ్రమైన కదలికలు మధ్య కంప భూములు (5)
  సమాధానం: భూకంపములు. అవి వచ్చినప్పుడే కదా తీవ్రమైన కదలికలు కలిగేది? అందుకే కంపభూములు తారుమారయ్యేయి.

 19. ఎంతకోసుకున్నా తరగని దూరం (2)
  సమాధానం: కోసు. అందులోనే ఉంది. పిల్లల క్రీడలలో “ఎంతెంత దూరం? కోసుడు కోసుడు దూరం” అన్న మాటలు వినే ఉంటారు.

 20. జంజాటములో సరిగా దాగున్న కాలం (2)
  సమాధానం: జాము. ఇక్కడ సరి అంటే బేసి కానిది. అందుకే 2,4 అక్షరాలని ఎన్నుకొమ్మని సూచన.

 21. పనంతా శుభ్రంగా చేస్తే వెలుతురు కనిపిస్తుంది (3)
  సమాధానం: తాపనం. శుభ్రంగా చేస్తే అన్నది తారుమారుని సరిచెయ్యమన్న సూచన.

 22. ఉండడానికి ఠికాణా, చిల్లుగవ్వలేకుండానే చిరకాల నివాసస్థలం (3)
  సమాధానం: కాణాచి. అందులోనే నివాసం.

 23. చారికి దొరికిన నీచమైన కొలువు (3)
  సమాధానం: చాకిరి. దొరికిన పదం తారుమారుని వెతకమని సూచిస్తుంది.