సాహిత్యం పట్టని క్షణం

అది ఎంత మంచి ఆఫీసైనా సరే, మన షిఫ్టు ముగిసి, ఇక ఇంటికి వెళ్తున్నామనుకోవడంలోనే ఒక విడుదల భావం లాంటిదేదో కలిగి ఆనందం కలుగుతుంది. అట్లా అదే ఆనందంలో నేను ఇల్లు చేరేప్పటికి, నా భార్య, ఆరోజు ఏ టీవీ ప్రోగ్రాంలో పట్టుకుందో, చూసా చూసా చూసా ఒక హృదయాన్నే అని ఉత్సాహంగా పాడుకుంటూ తలుపు తీసింది. నేను చిన్నగా నవ్వుకుంటూ వేడినీటి స్నానానికి వెళ్లిపోయాను.

వచ్చేసరికి కాలీఫ్లవర్ కూర, గోధుమరొట్టెల ముందు పిల్లలిద్దరూ ముఖాలు అదోలా పెట్టి కూర్చున్నారు. పెద్దోడికి ఆ కూర ఇష్టముండదు; చిన్నోడికి ఈ రొట్టెలు నచ్చవు. నచ్చజెప్పి, బలవంతపెట్టి, బెదిరించి, ఒప్పించి… అవన్నీ నాకు నేను కూడా చేసుకుని… కాలీఫ్లవర్ కూర కూడా తింటారా ఎవరైనా? ఆ లేతపువ్వులు చిన్నోడు ఇష్టపడుతున్నాడని గానీ లేదంటే దానికి మా వంటింట్లో ఏం పని?

ఎలాగోలా తిండి కార్యక్రమం ముగించి, వాళ్ల డైరీలేవో చూసి, వాళ్లు అడిగినవాటికి జవాబులిచ్చి, నేను అడిగినవాటికి వాళ్ల నుంచి జవాబులు తెప్పించి, అటూ యిటూ చేసేసరికే పెద్దోడు ఆవలింతలు తీస్తున్నాడు. తను మిషన్ ఏదో కుట్టుకుంటోందని, నేనే పెద్దోడితోపాటు చిన్నోడిని కూడా మంచం ఎక్కించి వచ్చి…

ఈమధ్యే కొత్తగా ఉదయం తాగడం అలవాటు చేసుకున్న సజ్జకొట్ర కోసం ఎసరు పెట్టాను. ఇలా కొత్త ఆరోగ్య సూత్రాలు ఇంట్లో ప్రవేశపెట్టదలచినప్పుడల్లా అవి గృహవిధానంలో భాగం అయ్యేంతవరకూ నేనే వంట చేయాల్సి వుంటుంది. షెల్ఫులోంచి మిక్సీ తీసి, అరగ్లాసెడు సజ్జల్ని జార్‌లో పోసి, వాటిని కిర్ర్‌ర్ర్‌ర్ర్ మనిపించేసరికి, ఎసరు వచ్చింది. రవ్వను అందులో వేస్తూ కట్టెచెంచాతో కలుపుతూ వుండగా, మిషన్ ఆపాక కొంచెం తీరిక దొరికినట్టయిందేమో, ఆ రోజు చెవులకు తగిలిన ఆ ఒక్క వాక్యాన్నే మళ్లీ మళ్లీ ఉచ్చరించే అలవాటున్న మనుషుల తరహాలో నా భార్య మళ్లీ అదే పాట, చూసా చూసా చూసా…, పాడుకుంటూ వంటింట్లోకి వచ్చి, “చూడు, పొద్దున స్టవ్ తుడుస్తుంటే రొట్టెపెంక ఎట్ల కాలిందో,” అని కుడిచేతి బొటనవేలు, చూపుడువేలు మధ్య కమిలిన భాగాన్ని ఇట్లా చూపించి, నా స్పందన కోసం కూడా ఎదురు చూడకుండా, ఒక హృదయాన్నే, అనుకుంటూ అట్లా హాల్లోకి వెళ్లిపోయింది. అంటే, ఆ నల్లబడిన భాగాన్ని చూసి, నేను కనీసం అయ్యో! అనేపాటి టైమివ్వలేదు. అలాగని నాకు చెప్పకుండా ఉండనూ లేదు. కేవలం సంసార సమాచార బదిలీలో భాగంగా నాకు చెప్పిందా? లేదా, తను ఉన్న మూడ్‌లో ఈ మాటలు ఒక అవరోధం అనుకుందా?

ఇప్పుడే ఇదే దృశ్యాన్ని– భార్య తన కమిలిన చేతిని సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు చూపించే సన్నివేశాన్ని– యథాతథంగా సాహిత్యంలోకి తేవడం ఎట్లా? దీన్ని డ్రమటైజ్ చేశామా, వాస్తవం పక్కకు పోతుంది; పోనీ ఉన్నది వున్నట్టు చెప్దామా, ఆ ఎఫెక్ట్ రాదు. అందుకే, సాహిత్యం చెప్పగలిగేది జీవితమంతటిది ఉండొచ్చు గానీ, జీవితం మొత్తం తన పూర్తి ముఖంతో సాహిత్యంలోకి వస్తుందన్న నమ్మకం నాకు కలగడం లేదు. ఒక గంభీరమైన విషయాన్ని చెప్పటానికి నేను ఒక పేలవమైన ఘటనను ఉదాహరించి ఉండవచ్చు. సమస్యేమిటంటే, జీవితంలో ఇలాంటి సాహిత్యం పట్టని క్షణం ఎదురైనప్పుడు, అది అప్పటికి ఎంత విలువైనదిగా తోచినా, మరుక్షణానికి మరపున పడుతుంది; దాని పూర్తి రంగులతో సహా అనుభవించిన ఉద్వేగభరితమైన రాత్రి కల కూడా తెల్లవారుతూనే తన డిటెయిల్స్ కోల్పోయినట్లు. అందుకే, నాకేమనిపిస్తోందంటే: ప్రతి మనిషీ తనకే ప్రత్యేకమైన ఒక రాయని పుస్తకాన్ని నిరంతరం చదువుకుంటూ ఉంటాడేమో!