ఊపిరి పోసుకునే వేళ…

ఏ భావం యెప్పుడు
నేలను తడిపిందో
నాటుకున్న తలపులన్నీ
పచ్చగా యెలా యెదిగాయో

పైరంతా కంకుల భారానికి
నిండు చూలాలై వంగింది
ప్రతి కంకిలో దూరిన అక్షరాలన్నీ
పాలు పట్టి రంగుమారుతున్నై

రూపుదిద్దుకునే భావాల
పసి పాదాలు
తెమ్మెరలై వచ్చి
తగులుతున్న ప్రతిసారీ
మరో జన్మెత్తుతున్న సంబరం

దిష్టి పక్షుల బారి పడకుండా
పంటసిరి యిలా
ఒడిని నిండుతుంటే
ఎదుగుతున్న కవితను చూసే
మనసు ముంగిట ప్రతిక్షణమూ
అమ్మ మనసంత
ఆకుపచ్చని, వెచ్చని
పులకింత.