నేలసంపెంగ

కాన్పూర్

వరండాలో పరచుకున్న ఎండ క్రమంగా తగ్గుతూ గోడవైపు జరుగుతోంది. భుజాల మీద పుస్తకాల బస్తాలు మోస్తూ చిన్నపిల్లలు గుంపులుగుంపులుగా కనిపించేదాకా గుర్తు రాలేదు నేనిక్కడ గంటనుంచి నిలబడి ఎదురుచూస్తున్నానని. సంజయ్ వస్తున్న జాడే లేదు. చిరాగ్గా లోపలికొచ్చాను. గదిలో మూలనున్న బల్ల మీద పుస్తకాలు చెల్లాచెదురుగా కొన్ని తెరచి, కొన్ని మూసి పడి ఉన్నాయి. ఒక్కక్షణం వాటి వైపు చూసి, నిరాసక్తంగా బట్టల అల్మారా తెరచి చూశాను. బట్టలేవీ మడతలు పెట్టిలేవు. అనవసరంగా ఇంత సేపు అక్కడ నిలుచున్నాను, కనీసం వీటినైనా సర్ది ఉండొచ్చు. ఏమిటో దేనిమీదా మనసు నిలవడం లేదు. అల్మారా మూసేశాను.

టైముకు రాలేనప్పుడు ఊరికే వస్తానని చెప్పడమెందుకు? సరేలే, ఈరోజేం కొత్తగనుక! ఎప్పుడూ గంటో, రెండు గంటలో లేటే. నేనో వెఱ్ఱిదాన్ని! తెలిసీ ఎదురు చూడడమే. చూసి చూసి విసుగొచ్చేసి ఇంకే పనీ చేసుకోబుద్ధి కాదు. నాకు మిగిలేది కొద్దిపాటి సమయమేనని సంజయ్ ఎందుకర్థం చేసుకోడో! థీసిస్ పూర్తి చేయడానికి నేను ఇంకా ఎక్కువ సేపు చదువుకు కేటాయించాలి. ఈ మాట అతనికి అర్థమయ్యేలా ఎలా చెప్పను!

బల్లముందు కూర్చొని చదవడానికి ప్రయత్నించాను కానీ మనసు దానిమీద నిలిస్తే కదూ. పరదా గాలికి ఎగిరినా చాలు, గుండె దడదడా కొట్టుకుంటోంది. మాటిమాటికీ చూపులు గడియారం ముళ్ళ మీదకు పరుగెడుతున్నాయి. ఏ చిన్న చప్పుడు విన్నా అదిగో వచ్చాడు, ఇదిగో వచ్చాడనే అనిపిస్తోంది. పొరుగింటి మెహతా గారమ్మాయి ఐదేళ్ళది జంకుతూ గదిలోకొచ్చింది.

“ఆంటీ, కథ చెప్తావా?”

“ఇప్పుడు కాదమ్మా, మళ్ళీ చెప్తాను.” కరుగ్గానే జవాబిచ్చాను. ఆ పిల్ల పారిపోయింది.

ఈ మిసెస్ మెహతా ఒకత్తి! నెలల తరబడి తానైతే నా మొహం కూడా చూడదు గాని, పిల్లను మాత్రం నా బుఱ్ఱ తినమని పంపిస్తూ ఉంటుంది. ఆవిడ భర్తే నయం, ఏ పదిపదిహేను రోజులకో కనిపించి పలకరిస్తుంటాడు, ఆవిడే మరీ. అయినా మంచిదే కదా, ఆవిడ నాతో ఎక్కువ పరిచయం పెంచుకుంటే నేనింత మాత్రం స్వేచ్ఛగానూ ఉండడం కుదరదు.

అలవాటయిన అదే శబ్దం! టకటక సంజయ్ అడుగుల చప్పుడు. వచ్చేశాడు! ఎప్పుడూ ఇలాగే.

పెద్ద రజనీగంధ పూలగుత్తి చేతిలో పట్టుకుని చిరునవ్వుతో గుమ్మంలో సంజయ్ నించుంటాడు. బలవంతంగా పుస్తకం మీద ధ్యాస పెట్టాలని నా ప్రయత్నం. చూసి ఊరుకుంటాను. నవ్వుతూ రమ్మనను. అయినా సంజయ్ నవ్వు మొహంతో లోపలికొస్తాడు. పువ్వుల్ని బల్ల మీద పెడుతూ, వెనుకనుంచి నా భుజాల్ని మెల్లగా నొక్కి, “అంత కోపమా?” అంటాడు.

నేలసంపెంగ పూల పరిమళం గదంతా అలముకుంటుంది. “కోపమొస్తే ఎవరికి లెక్క?” కోపంగా అంటాను.

కుర్చీతో సహా నన్ను తనవైపుకు తిప్పుకొని, గారంగా నా చుబుకం పైకెత్తి, “నువ్వే చెప్పు ఏం చేయాలో? క్వాలిటీలో ఫ్రెండ్స్ మధ్య ఇరుక్కుని ఎంత ప్రయత్నించినా రాలేకపోయాను. వాళ్ళందరికీ కోపం తెప్పించి ఎలా రాగలను చెప్పు?” అంటాడు.

‘అవును, నీకు వాళ్ళు తప్పుగా అనుకుంటారనైతే ఉంటుంది, నాగురించైతే ఉండదు.’ అనాలనిపిస్తుంది కానీ ఏమీ అనను, అలా అతని మొహాన్నే చూస్తూ ఉంటాను. ఆ చామనచాయ మొహంపైన చెమట మెరుస్తుంటుంది. ఇంకెప్పుడయినా అయితే ఆ చెమటను నా చెంగుతో తుడిచేదాన్నే, కానీ ఇప్పుడు కాదు. చిన్నగా నవ్వుతాడతను, కళ్ళతో క్షమాభిక్షలడుగుతూ. ఏం చేయను? అంతలోనే అలవాటుగా అతను కుర్చీ చేతిమీద కూర్చొని, బుగ్గ నిమురుతాడు. ఎప్పుడూ ఇలాగే చేస్తుంటాడు, పట్టించుకోనట్టే ఉంటాడు అంతలోనే ఎక్కడలేని ప్రేమ చూపుతుంటాడు. అతనికీ తెలుసు, ఇంక నా కోపం ఎక్కువసేపు ఉండదని. నాకు భలే కోపం వచ్చింది.

లేచి పాత పూలను తీసి పూలకుండీలో కొత్త పూలమర్చాడు, చాలా అందంగా! ఒక్కసారెప్పుడో చెప్పాను, నేలసంపంగి పూలు, ఆ రజనీగంధలు నాకిష్టమైన పువ్వులని. అంతే, మూడు నాలుగురోజులకొకసారి ఇన్ని పువ్వులు తీసుకొచ్చి గదిలో పెట్టే నియమం పెట్టుకున్నాడు. ఈ మధ్య నాకు వీటి అలవాటు ఎంతగా అయిందంటే ఒక్కరోజు గదిలో పువ్వులు లేకపోతే చదవబుద్ధి కాదు, నిద్రరాదు. పువ్వులున్నంత సేపూ సంజయ్ గదిలో ఉన్నట్టే ఉంటుంది.

కాసేపయినాక మేము అలా బయటికి వెళ్ళాం. ఉన్నట్టుండి ఇరా ఉత్తరం సంగతి గుర్తొచ్చింది. ఆ సంగతి చెప్పాలని పొద్దుట్నించీ ఎదురు చూసి, ఈ కోపంలో మరిచేపోయాను.

“నాకు ఇంటర్వూ కాల్ లెటర్ ఎప్పుడైనా రావచ్చట, సిద్ధంగా ఉండమని ఇరా ఉత్తరం వ్రాసింది.”

“ఔనా? కలకత్తా నుంచా?” గుర్తు చేసుకుంటూ అడిగి, ఉత్సాహపడ్డాడు సంజయ్. “నీకక్కడ జాబ్ వస్తే భలే ఉంటుంది కదా!” దార్లో ఉన్నామని ఆగాడు కానీ లేకపోతే ఏం చేసేవాడో! అతనంతగా సంతోషించడం నాకేం నచ్చలేదు. నేను అతనికి దూరంగా, కలకత్తా వెళ్ళిపోవాలని ఎందుకనుకుంటున్నాడు?

“నీకక్కడ జాబ్ వస్తే, నేనూ అక్కడికే బదిలీ చేయించుకుంటాను హెడాఫీసుకు. ఇక్కడి తకరార్లతో విసిగిపోయాను. ఇదివరకే బదిలీ గురించి ఆలోచన వచ్చింది. కానీ నీ కోసమని ఇక్కడే ఉండిపోయాను. వేరే వూరెళితే ఆఫీసు గొడవ వదిలిపోతుంది గానీ, నువ్వు పక్కన లేకుండా ఒంటరిగా ఎలా ఉండడం?”

ఆ గొంతులో వినిపించిన ప్రేమ నా గుండెల్లో నిండిపోయింది. ఉన్నట్టుండి నా కోపం అంతా మాయమయింది. రాత్రి ఎంతో ఆనందంగా మారిపోయింది. చాలా దూరం నడచి మాకిష్టమైన ఒక చిన్న కొండగుట్ట మీదకెక్కి కూర్చున్నాం. చుట్టూ దూరం వరకూ వెన్నెల పరచుకొని ఉంది. పట్నం లాగా ఇక్కడ పొగ, వాసన లేవు. హాయిగా కాళ్ళు జాపుకొని కూర్చున్నాం. ఆపకుండా తన ఆఫీసు గొడవల గురించి ఏదో చెప్తున్నాడు సంజయ్. మధ్యమధ్యలో కలకత్తాలో గడపబోయే కొత్త జీవితం గురించి ఏవో ప్రణాళికలు వేస్తున్నాడు. నేను ఎప్పట్లాగే వింటూ ఉన్నాను, అతన్ని చూస్తూ ఉన్నాను. మెల్లిగా చెప్పాను.

”ఇంటర్‌వ్యూ అంటే భయంగా ఉంది. ఏమడుగుతారో ఏమిటో! ఇదే మొదటిసారి నాకు.”

గలగలా నవ్వేశాడు. “ఎంత పిరికిదానివి! మరి ఇంటికి దూరంగా, ఒక్కదానివే గది తీసుకొని ఎలా ఉంటున్నావు? రిసర్చ్ చేస్తున్నావు, ఎక్కడికైనా రాగలవు, పోగలవు. ఇంటర్‌వ్యూ అంటే భయమా? ఎందుకు?” అంటూ బుగ్గమీద చిన్నగా తట్టాడు. మళ్ళీ తనే “భయపడకోయ్! ఈ మధ్యకాలంలో ఈ ఇంటర్‌వ్యూలన్నీ నామ్‌ కే వాస్తేనే. అక్కడెవరితోనైనా ఇన్‌ఫ్లూయన్స్ చేయించగలవేమో చూడు.”

“కలకత్తా నాకు కొత్త. అక్కడ ఇరా కాక నాకు తెలిసినవాళ్ళెవరున్నారు? తనకు తెలిసినవాళ్ళెవరైనా ఉంటే ఉండొచ్చుగానీ…” నిస్సహాయంగా అన్నాను.

“ఇంకెవ్వరూ తెలీదా? నిశీథ్ కూడా అక్కడేగా ఉన్నాడు?” నా మొహంలోకి సూటిగా చూస్తూ అడిగాడు.

“ఉంటే? నాకేం పని?” ఎందుకో నాకనిపిస్తూనే ఉంది ఇలా అతడి సంగతి మాట్లాడతాడని. చటుక్కున అనేశాను.

“ఏం పని లేదా?” కావాలనే ఆటపట్టిస్తున్నాడు. మండిపోయింది నాకు.

”చూడు సంజయ్, లక్షసార్లు చెప్పాను, అతని మాటెత్తి ఆట పట్టించొద్దని. నాకు సుతరామూ నచ్చదు.”

గలగలా నవ్వేశాడు ఎప్పట్లాగే. నాకు మాత్రం మూడ్ అంతా పాడయ్యింది. తిరిగొస్తూ, నా మూడ్ బాగు చేయడానికి భుజం మీద చెయ్యేసి ఏదో చెప్పబోయాడు. చప్పున చేయి తీసేశాను.

”ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?”

“ఎవరున్నారోయ్ చూడడానికి? చూస్తే చూడనివ్వు. కుళ్ళుకుంటారు.”

“వద్దు. సిగ్గు లేకుండా ఏమిటిది? నాకిష్టం లేదు.”

నాకు నిజంగానే ఇష్టముండదు. నిర్మానుష్యంగా ఉన్నా సరే, బయట ఇలా… అదీ కాన్పూర్‌లో! గదిలోకి వచ్చాక కూర్చోమంటే, వద్దు వెళ్ళాలన్నాడు. చిన్నగా ముద్దుపెట్టి వెళ్ళిపోయాడు. రోజువారీ నియమమే ఇది.

రోజూ బాల్కనీలో నిలబడి అతను వెళ్ళేది చూస్తూ ఉంటాను. అతని ఆకారం దూరమౌతూ, దారి చివర్లో మలుపు దగ్గర తిరిగి మాయమౌతుంది. నేను చూస్తూ ఉంటాను అలా భావరహితంగా, ఏదో కోల్పోయినట్టుగా. కాసేపటికి లోపలికి వచ్చి చదువుతూ కూచుంటాను. రాత్రి నిద్ర పట్టేదాకా నా కళ్ళు బల్ల మీదున్న రజనీగంధ పూలనే చూస్తూ ఉండిపోతాయి. నాకేంటో అవి పువ్వులు కావని, అవన్నీ సంజయ్ ఎన్నోరకాల కళ్ళని, అవి నన్నే చూస్తున్నాయని, నా ఒంటిని నిమురుతున్నాయని, ప్రేమ కురిపిస్తున్నాయనీ భ్రమ కలుగుతుంది. అంతగా అన్ని కళ్ళు నన్ను చూస్తున్నాయనే కల్పన నన్ను సిగ్గులో ముంచుతుంది.

ఈ విషయం ఒకసారి సంజయ్‌కు కూడా చెప్పాను. ఎంత నవ్వాడో! నువ్వు పిచ్చిదానివన్నాడు, వట్టి మూర్ఖురాలనన్నాడు.

ఏమో, నిజమేనేమో! నేను వట్టి పిచ్చిదాన్నేనేమో!

కాన్పూర్

నాకు తెలుసు సంజయ్ మనసులో అప్పుడప్పుడూ నిశీథ్ విషయంలో కొంచెం అభద్రత లాంటిది ఉంటుందని. కానీ నేనెలా నమ్మించనతన్ని? నేను నిశీథ్‌ను ద్వేషిస్తున్నానని, గుర్తొస్తేనే సహించలేనని… అయినా ఆ పద్ధెనిమిదేళ్ళ వయసులో ప్రేమ కూడా ఒక ప్రేమేనా? అదేదో చిన్నతనం, వట్టి పిచ్చితనం. ఆవేశం తప్ప నిలుకడ తెలియని వయసు. వేగమే తప్ప లోతు తెలియని ప్రవాహం అది. చప్పున ఎలా పొంగుతుందో, అదే వేగంతో సద్దు మణుగుతుంది. తర్వాత నిట్టూర్పులు, కన్నీళ్ళు, ప్రపంచమే శూన్యమనిపించడం, చావుని కోరుకోవడం, భరించలేని నిస్పృహ. ఇంకొక ఆధారం జీవితానికి దొరికిన వెంటనే, అవన్నీ మరచిపోడానికి ఒకరోజు కూడా పట్టదు. తర్వాత గుర్తొస్తే అదంతా మూర్ఖత్వమనిపిస్తుంది. తలచుకుంటే నవ్వొస్తుంది. ఆ తర్వాత తెలుస్తుంది – ఆనాటి కన్నీళ్ళన్నీ, నిట్టూర్పులన్నీ ఆ ఫలానావాడి కోసం కాదని, ఆ పొంగు చల్లారగానే బ్రతుకులో ఏర్పడే శూన్యం గురించని.

అందుకే కదా నేను సంజయ్‌ను కలువగానే నిశీథ్‌ని మర్చిపోగలిగాను! నిట్టూర్పులు, కన్నీళ్ళు మళ్ళీ ఎదురుచూపులు, చిరునవ్వులూ అయినాయి. కానీ ఈ సంజయ్ అప్పుడప్పుడూ నిశీథ్ ప్రస్తావన అనవసరంగా తీసుకొచ్చి, సందేహపడుతూ ఉంటాడు. నేను చెప్పినప్పుడు అర్థం చేసుకున్నట్టే ఉంటాడు కానీ ఇంకా ఎక్కడో ఏదో అతని మనసు పీకుతూనే ఉందని నాకు తెలుసు.

సంజయ్‌కి ఎలా చెప్పను? నేను అతన్ని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నానని, నా మనసులో ఇంకెవరూ లేరని, అతనితోనే నా జీవితాన్ని ఊహిస్తున్నానని ఎలా నచ్చచెప్పను? వెన్నెల రాత్రుల్లో, ఏకాంతంగా ఏ చెట్టు క్రిందో కూర్చొని కూడా మేము ప్రేమగా కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని మురిపెంగా మాట్లాడుకోలేదు. అంత మాత్రాన, నేను నా థీసిస్ గురించి, అతను తన ఆఫీసు గొడవల గురించి, ఇంకేదో విషయాల గురించీ మాట్లాడినంత మాత్రాన, మా మధ్య ప్రేమ లేదని అర్థం కాదు కదా! మా ప్రేమ ఆ భావుకత్వపు హద్దు దాటి యథార్థసీమ లోకి ఎదిగిందని అతనెందుకు అర్థం చేసుకోడు? కలల్లో కాక వాస్తవంలో బ్రతుకుతున్నామంతే. మా ప్రేమ చిన్నతనపు ఆకర్షణ కాదు. పరిపక్వమయింది. తుళ్ళిపడే సెలయేరు కాదు. స్థిమితంగా నిండుగా పారుతున్న నది.

సంజయ్ కెలా చెప్పాలిదంతా? నిశీథ్ నన్ను అవమానించాడని, నేను కోలుకోలేనంత దెబ్బతిన్నానని. విడిపోయే ముందొక్కసారైనా నా తప్పేమిటో చెప్పనే లేదు నిశీథ్. లోకం దృష్టిలో నేనెంత పలుచనయ్యాను? ఎంత అపహాస్యానికి గురయ్యాను! ఎన్ని జాలి చూపులకు, తిరస్కారాలకు, హేళనలకు గురయ్యాను! నీచుడు! వాడికి… అతడికి నా మనసులో ఇంకా స్థానముందేమోనని సంజయ్ అనుకోవడం! ఛీ! అతనంటే నాకు ద్వేషం! చెప్పాలంటే, ప్రేమంటే ఆటవస్తువనుకునే వాడి ఉచ్చులో పడకముందే తప్పించుకున్నందుకు నన్ను నేను అదృష్టవంతురాలననే అనుకుంటాను.

సంజయ్! కొంచెం ఆలోచించు. అసలలా ఏమన్నా ఉంటే నీ ప్రతి చర్యకూ ఇంతగా ఎలా స్పందిస్తాననుకున్నావు? నీకింత దగ్గరవుతానని ఎలా అనుకున్నావు? అసలు పెళ్ళికి ముందు నిన్నింత దగ్గరకు రానిచ్చానే, ఇంకొకరెవరైనా ఇలా చేస్తారా? నీమీద ఎంత ప్రేమ ఉందో చెప్పలేను. నమ్ము సంజయ్, మన మధ్య ప్రేమే నిజమైనది. నిశీథ్ ప్రేమ మోసం, భ్రమ, అబద్ధం అంతే!

కాన్పూర్

ఎల్లుండే నేను కలకత్తా వెళ్ళాలి. నిజంగా, భయమేస్తోంది. ఏమవుతుందో? ఒకవేళ ఇంటర్‌వ్యూ టైములో ఇలాగే భయపడితే? సంజయ్‌ను రమ్మన్నా కానీ వాళ్ళ ఆఫీసులో సెలవు దొరకడం కష్టం. కొత్త ఊరు, పైగా ఇంటర్‌వ్యూ! మన వాళ్ళెవరైనా తోడుంటే ఎంతో మేలు. నేనిలా చదువుకోసం ఒక్కదాన్నే గది అద్దెకు తీసుకొని ఉండడం, ఎక్కడికైనా వెళ్ళి రావడం చూసి నేనెంతో ధైర్యవంతురాలినని సంజయ్ అనుకుంటాడు. కానీ, నిజంగా భయమేస్తోంది.

నాకు ఉద్యోగం వచ్చి, నేనూ సంజయ్ అక్కడ కాపురం పెట్టినట్టు ఊహలు వద్దన్నా వస్తున్నాయి. ఆఁ! ఎంత అందమైన ఊహ! ఊహల బుడగల్లో తేలుతుండగానే ఇంటర్‌వ్యూ భయం వచ్చి అంతా ఛిన్నాభిన్నం చేసేస్తోంది.

సంజయ్ నువ్వు నాతో పాటు వస్తే… ఎంత బాగుంటుందో!

కలకత్తా

రైలు హౌరా స్టేషన్ చేరుకోగానే మనస్సులో ఏదో సందేహం, భయం! ప్లాట్‌ఫారం మీద నిలబడిన అంతమంది స్త్రీ పురుషుల్లో ఇరాను వెదికాను. దిగకుండానే కిటికీలోంచి కనిపించినంత దూరం చూస్తే, ఎక్కడా కనిపించలేదు. చివరికి ఒక కూలీని పిలిచి నా చిన్న సూట్కేసును, హోల్డాలును దింపి నేనూ దిగాను. అంత జనాన్ని చూసి నా ధైర్యం జావగారి పొయింది. అంతలో ఎవరిదో చేయి తగిలి ఉలిక్కిపడ్డాను. చూస్తే… ఇరా.

చేతిగుడ్డతో ముఖం తుడుచుకుంటూ,”ఎంత భయపడ్డానో తెలుసా, నీవు కనబడక! మీ ఇంటికెలా చేరాలో ఏమోనని” అన్నాను.

బయటకొచ్చి టాక్సీ ఎక్కాం. నేనింకా తేరుకోలేదు. హౌరా బ్రిడ్జ్ మీదికి టాక్సీ వెళ్ళగానే హుగ్లీ నది మీదుగా వీస్తున్న గాలితో ఆహ్లాదంగా అనిపించింది. ఇరా ఈ వంతెన గురించి ఏదో చెప్తుంటే వింటూ వంతెనను, విస్తారంగా ప్రవహిస్తున్న హుగ్లీనదిని, చిన్న పడవలను, పెద్ద నౌకలను, వంతెననూ ఆశ్చర్యంగా చూస్తుండిపోయాను.

ట్రాఫిక్ వల్ల అక్కడక్కడా ఆగుతూ సాగుతోంది మా ప్రయాణం. ఎటుచూసినా ఎత్తైన భవనాలు, మనుషుల హడావిడి అంతా బ్రహ్మాండంగా అనిపిస్తోంది. అంత పెద్ద నగరం మధ్యలో నేనొక చిన్న బిందువుగా అగుపిస్తుంటే నా అస్తిత్వమే లేదేమో అనిపించింది. ఎక్కడి పాట్నా, కాన్పూర్! ఎక్కడి కలకత్తా! నేను పెద్ద పెద్ద నగరాలేవీ చూడనే లేదు ఇప్పటిదాకా.

ఆ గుంపును చీల్చుకుంటూ మేము రెడ్ రోడ్డు మీదికొచ్చాము. నిశ్శబ్దంగా ఉన్న వెడల్పైన రోడ్డు. రెండువైపులా విశాలమైన మైదానాలు.

“ఇరా, ఇంటర్‌వ్యూలో ఎవరుంటారోనే? నాకు చాలా భయంగా ఉంది.”

“అరె, ఏం కాదు. నీకు భయమేంటే? మాలాంటివాళ్ళం భయపడినా అర్థముంది. కెరీర్ అంతా స్వంతంగా ఏర్పరుచుకున్న నీ లాంటి వాళ్ళకు ఇంటర్‌వ్యూ ఒక లెక్కేముందే? దానిగురించి మర్చిపో. అవునూ, అన్న, వదిన పాట్నాలోనే ఉన్నారా? ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికెళ్తుంటావా?”

“కాన్పూర్ కొచ్చాక ఒకసారి వెళ్ళాను. ఉత్తరాలు వ్రాస్తుంటాను.”

“మరీ విచిత్రమైన వాళ్ళబ్బా! చెల్లెల్ని కూడా చూసుకోలేని వాళ్ళు.”

ఈ ప్రసక్తి నాకిష్టం ఉండదు. ఈ విషయం గురించి ఎవరూ వ్యాఖ్యానాలు చేయకూడదని నా అభిప్రాయం. నేను మౌనంగా ఉండిపోయాను.

ఇరా ఇల్లు చిన్నదే అయినా చక్కగా అలంకరించి ఉంది. వాళ్ళాయన టూర్ కెళ్ళాడని తెలిసి నాకు కొంచెం నిరుత్సాహమైంది. అతనుంటే ఏదైనా నాకు సహాయం చేసి ఉండేవారేమో. కానీ అతను లేకపోతేనే నేను వాళ్ళింట్లో ఫ్రీగా ఉండగలననీ అనిపించింది. వాళ్ళబాబు చాలా ముద్దుగా ఉన్నాడు.

సాయంకాలం ఇరా నన్ను కాఫీహౌస్‌కు తీసుకెళ్ళింది. అనుకోకుండా అక్కడ నిశీథ్! నేను తటపటాయించి చూపు తిప్పుకున్నాను. కానీ అతను చూసి, మా బల్ల వైపుకే వచ్చాడు. తప్పనిసరై అతని వైపు చూడాల్సి వచ్చింది, పలకరించాల్సి వచ్చింది. ఇరాను పరిచయం చేయాల్సి వచ్చింది. ఇరా అతన్ని మాతో పాటు కూర్చోమని ఆహ్వానించింది. నాకు ఊపిరాడడం లేదు.

“ఎప్పుడొచ్చావు?”

“ఈరోజు ఉదయాన్నే.”

“ఉంటావుగా, ఎక్కడ దిగావు?”

ఇరా జవాబిచ్చింది. నిశీథ్ చాలా మారాడు. కవుల్లా గడ్డమదీ పెంచాడదేమిటో! చాయ తగ్గాడు. సన్నబడినట్టున్నాడు.

పెద్దగా మాటలేమీ జరుగలేదు. తిరిగి బయల్దేరాం. ఇరాకు మున్నూ గురించి బెంగ. నాకూ త్వరగా ఇంటికి వెళ్దామనిపించింది. కాఫీహౌస్ నుంచి ధరమ్ తలా వరకూ నడచుకుంటూ మాతోనే వచ్చాడు. ఇరా మాట్లాడుతూనే ఉంది నిశీథ్‌తో, వాళ్ళిద్దరికే మొదట పరిచయముందేమో అన్నట్టు. ఇరా మాటల్లో మా చిరునామా కూడా ఇచ్చింది. మరుసటిరోజు తొమ్మిదింటికి వస్తానని చెప్పి నిశీథ్ వెళ్ళిపోయాడు.

మూడేళ్ళ తర్వాత ఈ కలయిక! వద్దన్నా గతమంతా కళ్ళముందు మెదలింది. ఎంత సన్నబడ్డాడు నిశీథ్! మనశ్శాంతి లేకుండా ఏదో లోతైన బాధను మనసులో దాచుకున్నట్టుగా… నాతో విడిపోవడమేనా ఆ బాధ?

ఆ ఊహ ఎంత తియ్యగా ఉన్నా, తృప్తి, ఆనందం ఇచ్చేదైనా ఇది అబద్ధమని నా మనసుకు తెలుసు. ఒకవేళ ఇది నిజమైతే, ఎవరు చెప్పారు విడిపొమ్మని! అంతా తన ఇష్టానుసారమే గదా చేశాడు! ఉన్నట్టుండి రోషంగా అనిపించింది. ఇతడు కాదూ నన్నవమానించి లోకమంతా చూస్తుండగా అపహాస్యానికి గురిచేసి నన్నొదిలేసినవాడు! అసలు నేనెందుకితన్ని పట్టించుకోవడం? అతను మా బల్ల దగ్గరికొచ్చినపుడే గుర్తుపట్టకుండా ఉండవలసింది. నేను మిమ్మల్ని గుర్తు పట్టలేదే, ఎవరు మీరు అనవలసింది. అప్పుడు అతని వెఱ్ఱినవ్వు చూడవలసింది.

రేపు కూడా వస్తాడుగా. సరే, రానీ. త్వరలో నాకు సంజయ్‌తో పెళ్ళని చెప్పేస్తాను. నేను గతమంతా మరిచిపోయానని కూడా చెప్తాను. నీవంటే నాకసహ్యమని, జీవితంలో ఎప్పటికీ క్షమించలేనని కూడా…

…మూడేళ్ళయిపోయింది గదా, మరి నిశీథ్ పెళ్ళెందుకు చేసుకోలేదింకా? చేసుకోనీ, చేసుకోకపోనీ నాకేంటిట? ఒకవేళ ఇంకా నాపైన ఆశలు పెట్టుకున్నాడేమో? మూర్ఖుడెక్కడో!

సంజయ్! నిన్ను ఎంతగా పిలిచాను నాతో రమ్మని, నువ్వు రానే లేదు. నాకు నువ్వే గుర్తొస్తున్నావు, ఏం చేయమంటావో చెప్పు.

కలకత్తా

ఉద్యోగం దొరకడం ఇంత కష్టమని నేననుకోలేదు. చిన్న ఉద్యోగానికి కూడా స్వయంగా మంత్రులే రికమెండేషన్ చేస్తారని ఇరా అంటుంది. ఇది మరీ అంత చిన్నదేం కాదు. నిశీథ్ పొద్దుట్నించీ ఆఫీసుకు సెలవు పెట్టి ఈ రికమెండేషన్ కోసమే తిరిగాడు అని చెప్పింది. ఇతనికెందుకు నాపని మీద అంత ఆసక్తి? పెద్దపెద్ద వాళ్ళతో పరిచయాలున్నాయని, ఆరునూరైనా ఈ ఉద్యోగం ఇప్పించి తీరుతాననీ అంటున్నాడు. ఏం? ఎందుకని?

నిన్నంతా నేను కఠినంగా ప్రవర్తించాలని, నా దగ్గరకు నిశీథ్‌ని రాకుండా చేయాలనీ చాలా అనుకున్నాను. తొమ్మిదవుతుండగా నేను తయారవుతూ, తలదువ్వుకొని జుట్టు పారవేయడానికి వెళ్తూండగా, ఇంటికి బయట నిశీథ్ తచ్చాడుతున్నాడు. పొడుగైన జుట్టు, కుర్తా పైజామా, ఎప్పట్లాగే. అయితే చెప్పిన సమయానికి ముందే వచ్చాడన్నమాట. సంజయ్ అయితే పదకొండయ్యే వరకూ వచ్చేవాడు కాదు. అనుకున్న సమయానికి రావడం అతనికసలు తెలియనే తెలియదు.

అతను లోపలికి రావడానికి తటపటాయించడం చూసి నా మనసులో ఏదో కదలిక. వచ్చేశాక అనుకున్నట్టు కఠినంగా ఉండలేక పోయాను. కలకత్తా కెందుకు వచ్చానో చెప్పేసరికి అతనికి కొంత సంతోషం కలిగినట్టు అనిపించింది. అక్కడే కూర్చుని ఫోన్ల మీదే అతడు నా ఉద్యోగానికి సంబంధించి అన్ని వివరాలూ తెలుసుకున్నాడు. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలన్న ఆలోచనలు, నిర్ణయాలూ చేసేశాడు. ఫోన్ లోనే మాట్లాడి తన ఆఫీసు నుంచి శెలవు తీసుకున్నాడు.

నేను ఒక విచిత్రమైన పరిస్థితిలో పడ్డాను. అతనంతగా నా పనులన్నీ నెత్తినేసుకొని స్వంత పనుల్లా చేస్తుంటే వద్దనలేకపోతున్నాను, ఒప్పుకోనూ లేకపోతున్నాను. ఆ రోజంతా అతనితో పాటు తిరగాల్సి వచ్చింది కానీ పనికి సంబంధించి తప్ప వేరొక మాట కూడా మాట్లాడలేదతను. నేనూ సంజయ్ గురించి చెప్పేద్దామనే అనుకున్నాను గానీ చెప్పలేకపోయాను. ఒక వేళ ఆ మాట తెలిస్తే నాపట్ల ఆసక్తి చూపిస్తాడో, లేదోననిపించింది.

ఉద్యోగ విషయంలో అతని ప్రయత్నాల మీద నాకు నమ్మకం కలిగింది. ఈ ఉద్యోగం రావడం నాకెంత అవసరం! వస్తే సంజయ్ ఎంతో సంతోషిస్తాడు, పెళ్ళయింతర్వాత కొన్ని రోజులైనా సుఖంగా గడచిపోతాయి.

తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికి సాయంకాలమైంది. అతన్ని కూర్చోమన్నాను. వద్దని నిల్చునే ఉన్నాడు. అతని వెడల్పయిన నుదుటి మీద చెమట మెరుస్తోంది. అదే సంజయ్ అయి ఉంటే? నా చెంగుతో చెమట తుడిచి ఉండేదాన్ని కాదా? అతడూ నన్ను దగ్గరకు తీసుకొని ప్రేమగా చూడకుండా వెళ్ళగలిగి ఉండేవాడా? అనిపించింది.

“సరే, ఇక బయల్దేరుతాను.”

చేతులు జోడించాను యాంత్రికంగా. వెళ్ళిపోయాడు. నేను దిక్కు తోచనట్టు నిల్చుండిపోయాను.

సంజయ్ తెచ్చే రజనీగంధ పూలను చూస్తూ నిద్రపోవడం అలవాటయిన నాకు అక్కడ ఆ పూలు లేకపోవడం ఎంతో వెలితిగా అనిపించింది.

ఈ వేళలో నువ్వు ఏం చేస్తున్నావో సంజయ్! మూడురోజులయింది ప్రేమగా దగ్గరకు తీసుకునే చేతులు దూరమై.

కలకత్తా

పొద్దున్నే ఇంటర్‌వ్యూ అయిపోయింది. నాకు చాలా నెర్వస్‌గా ఉండింది. నేను ఎలా జవాబులివ్వాలనుకున్నానో అలా ఇవ్వలేకపోయాను. కానీ నిశీథ్ వచ్చి చెప్పాడు, దాదాపుగా నాకు ఉద్యోగం ఖాయమైందని. నాకు తెలుసు ఇదంతా నిశీథ్ వల్లనే జరిగి ఉంటుందని.

వాలుతున్న ఎండ నిశీథ్ ఎడమ చెంప మీద పడుతోంది. ఎదురుగా కూర్చున్న నిశీథ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రియంగా అనిపించాడు. నాకన్నా అతడే సంతోషపడుతున్నాడు. అతను ఎవరినీ ఏ సహాయమూ అడిగేవాడు కాదు. అటువంటిది ఈరోజు నా ఉద్యోగం కోసం ఎంతమందిని అడిగాడో! ఏం, ఎందుకని? నేను కలకత్తాకు వచ్చేసి తనతో పాటు, తన దగ్గర ఉండడం కోసమా? ఆ ఆలోచన రాగానే ఎందుకు నాలో ఏదో ఉద్వేగం. అహఁ… అతను అలా జరగాలనుకుంటున్నాడా? అలా అనుకుంటే తప్పు కాదూ! అలా అనుకోవచ్చా? లేదు లేదు, అలాంటిదేమీ లేదు. బహుశా గతంలో నా పట్ల ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపంతో నాకేదైనా ఉపకారం చేద్దామనుకుంటున్నాడేమో. మనసుకు నచ్చజెప్పుకున్నాను. అయితే, అయితే ఉద్యోగం కోసం సహాయం చేస్తే, జరిగినదంతా మర్చిపోతాననుకుంటున్నాడా? క్షమించేస్తా ననుకుంటున్నాడా? అసంభవం. నేను రేపే అతనికి సంజయ్ సంగతంతా చెప్పేస్తాను.

“ఉద్యోగం ఖాయమైంది కాబట్టి ఈ సందర్భంగా పార్టీ చేసుకుందామా?”

పనికి సంబంధించిన మాటలు తప్ప ఇదే మొదటి మాట అతను సరదాగా మాట్లాడడం. నేను ఇరా వైపు చూశాను. ఇరాకు కూడా పార్టీ ఇష్టమే, కానీ పిల్లాడి వల్ల రాలేక పోతున్నాననేసింది. నేనొక్కత్తినీ… అతనితో… ఇబ్బందిగానే ఉంది. ఇంతవరకూ పనిబడి తిరిగాం కానీ ఇప్పుడు సరదాలకు కూడా? వద్దనీ అనలేకపోయాను. లోపలికి వెళ్ళి తయారవుతానన్నాను. అతనికి నీలంరంగు ఇష్టమని గుర్తొచ్చింది. నీలంరంగు చీరలో శ్రద్ధగా జాగ్రత్తగా ముస్తాబయ్యాను. నాలో నాకే ఎన్నో ప్రశ్నలు. ఎవరిని మురిపించడానికి ఇదంతా? నేను నిజంగా పిచ్చిదాన్నేమో.

మెట్ల మీద నిశీథ్, చిన్ననవ్వుతో “ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు.” అన్నాడు. నా మొహం ఎఱ్ఱబడింది. చెవికొనల్లో వెచ్చగా అనిపించింది. అలా అంటాడని నేనస్సలు అనుకోలేదు. ఎప్పుడూ మౌనంగా ఉండే నిశీథ్ ఉన్నట్టుండి ఇలా! నాకిలాంటి మాటలు అలవాటూ లేవు. సంజయ్ నేనేం కట్టుకున్నానో, ఏం పెట్టుకున్నానో ఎప్పుడూ పట్టించుకున్నట్టే లేదు. ఇలా మెచ్చుకోలుగా మాట్లాడినట్టే లేదు అతనికి నామీద అన్ని అధికారాలున్నా కూడా. మరితడికి నామీద ఏ అధికారముందని ఇంత చనువుగా అనగలిగాడు?

కానీ నాకెందుకో అతని మీద కోపం రాలేదు. ఇంకా చెప్పాలంటే అతనలా పొగడడం నచ్చింది కూడా. సంజయ్ ఎప్పుడెప్పుడు ఇలా అంటాడా అని మనసెప్పుడో ఒకసారి తపిస్తుంటుంది. అతడెప్పుడూ ఇలా మాట్లాడి యెరుగడు. రెండేళ్ళకు పైనే అయింది సంజయ్‌తో పరిచయం పెరిగి. రోజూ సాయంకాలం బైటకు వెళ్తాం, ఎన్నిసార్లో ఎంతో శ్రద్ధగా అలంకరించుకుంటుంటాను. మంచి బట్టలు వేసుకుంటాను. ఒక్కసారి కూడా మెచ్చుకోడు. అసలీ విషయాలు అతని మనసులో రానే రావు. చూసీ చూడనట్టుంటాడు. ఇలా ఏదన్నా నాగురించి వినాలని తపించేదాన్ని ఇలా వినగానే మురిసిపోయాను. కానీ, అన్నది నిశీథ్? అతనికేం హక్కుంది?

లేదా? అతనికే హక్కూ లేదా?

ఏదో వివశత్వం, ఏదో బలహీనత. నేనతని మాటకు బదులు పలకలేక పోయాను. ఇలా మాట్లాడడానికి నిజంగా అతనికే అధికారమూ హక్కూ లేదని నిశ్చయంగా అనగలనా? ఊహూఁ…

టాక్సీలో కూర్చున్నాం. సంజయ్ సంగతి ఈరోజెలాగైనా చెప్పాలనుకున్నాను.

“స్కై రూమ్” నిశీథ్ టాక్సీ వాడికి చెప్పాడు.

గాలిని ఒరుసుకుంటూ టాక్సీ కదిలింది. నిశీథ్ జాగ్రత్తగా ఒక పక్కకు ఒదిగి కూచున్నాడు. బండి పొరబాటున దేనికన్నా గుద్దుకున్నా, చేయి కూడా తగలనంత దూరంగా… అంత జాగా వదిలి కూర్చున్నాడు. గాలికి నా సిల్క్ చీర కొంగు రెపరెపలాడుతూ అప్పుడప్పుడూ అతన్ని తాకుతోంది. అతను దాన్ని తీసేసే ప్రయత్నమేదీ చేయలేదు. నా చీర కొంగు తగులుతూ అతనిలో పాత జ్ఞాపకాలేవో రేపుతోందేమో. అతని తనువూ మనసూ నా చీరకొంగు స్పర్శతో ఏవో లోకాల్లో విహరిస్తున్నాయేమో. నా తలపుల్లోని ఈ గెలుపు నా మనసులో చెప్పలేని ఆహ్లాదాన్ని నింపింది.

సంజయ్ మాట చెప్దామనుకుంటూనే ఉన్నాను గానీ చెప్పనే లేదు. ఈ నా వివశత్వం మీద నాకే చిరాకొస్తోంది. నా నోరు పెగలనంటోంది. నేను తప్పు చేస్తున్నాననిపిస్తోంది. కానీ ఏమీ చెప్పలేకపోయాను.

ఈ నిశీథ్ ఎందుకు మాట్లాడడమే లేదు? ఇలా ఒక మూలకు ఒదిగి నిర్వికారంగా కూర్చొని ఉన్న అతన్ని చూస్తే నాకేం నచ్చడం లేదు. ఉన్నట్టుండి సంజయ్ జ్ఞాపకం. ఇదే అతడైతే ఈ పాటికి అతని చేయి నా నడుము చుట్టి ఉండేది. మామూలుగా అయితే దారి వెంట నాకిలాంటివి నచ్చవు కానీ ఈరోజు ఎందుకో ఆ చేతుల్లో ఒదగాలని ఆశగా ఉంది. నాకు తెలుసు ఇక్కడ ఇప్పుడున్నది నిశీథ్ అని, నేనిలా ఆలోచించకూడదనీ. కానీ… నేనేం చెయ్యను? నా ఒంట్లో ఒక సన్నని జలదరింపు. టాక్సీ ఎంత వేగంగా పరుగెడుతోందో అంత వేగంగానూ నేనూ కొట్టుకొనిపోతున్నాను, కోరుకోని దిక్కులవైపు.

టాక్సీ ఆగగానే నేనీలోకం లోకి వచ్చిపడ్డాను. చప్పున తలుపు తీసి బయటపడ్డాను, లోపల ఒక్కక్షణముంటే నిశీథ్ నన్నేం చేస్తాడోనన్నట్టుగా.

“ఇటువైపు నుంచి ఎప్పుడూ దిగకూడదండీ!” టాక్సీవాడు చెప్తుంటే నేనేం చేశానో తెలిసింది. నిశీథ్ అటువైపు దిగి నిల్చున్నాడు. ఇటువైపు నేను. మధ్యలో టాక్సీ.

డబ్బులు తీసుకొని టాక్సీవాడు వెళ్ళిపోయాడు. మేమిద్దరమూ ఎదురెదురుగా. ఉన్నట్టుండి గుర్తొచ్చింది. ఈరోజు టాక్సీకి డబ్బులు నేను కదా ఇవ్వాలి! అతనే ఇచ్చేశాడు. ఇప్పుడేం చేయగలను? మౌనంగా ఇద్దరం లోపలికి నడిచాం. చుట్టూ ఎంతో జరుగుతోంది ఏవో మెరుపులు, ఏవో తళుకులు. నాకివేవీ పట్టలేదు. ఎవరికంటా పడకూడదన్నట్టు, తప్పు చేసినట్టు, ఎవరెప్పుడు పట్టుకుంటారోనన్నట్టు అందరి దృష్టినుంచీ తప్పుకుంటూ వెళ్ళాను.

నిజంగా నావల్ల ఏదన్నా తప్పు జరిగిందా? ఇద్దరమూ ఎదురెదురుగా కూర్చున్నాం. విందు ఇవ్వాల్సింది నేనే కానీ అతనే ఆ బాధ్యత తీసుకున్నట్టున్నాడు. తనే ఆర్డర్ ఇచ్చాడు. బయటేదో కలకలం, మనసులో అంతకన్నా ఎక్కువ కలకలం. ఏదో పోగొట్టుకొన్న భావన. నన్నేనా?

వెయిటర్ కోల్డ్ కాఫీతో పాటు ఏదో తినడానికి పెట్టి వెళ్ళిపోయాడు. నిశీథ్ ఏదో చెప్పాలనుకుంటున్నాడని పదేపదే అనిపిస్తోంది. కాఫీ స్ట్రా నోట్లో పెట్టుకొని కూచున్నాడు.

సిల్లీ ఫెలో! నాకేమీ తెలియదనుకుంటున్నాడల్లే ఉంది. ఈ సమయంలో అతడేం ఆలోచిస్తున్నాడో నాకు బాగా తెలుసు.

మూడు రోజులుగా కలుస్తూ కూడా మా మధ్య ఆనాటి ప్రసక్తి రాలేదు. ఉద్యోగం మాటొక్కటే మా ఆలోచనల్లో. కానీ ఈరోజు… ఈరోజు ఆ మాట వస్తుంది. రావడం సహజం కూడా. కానీ రాకపోవడమే సహజమేమో బహుశా. మూడేళ్ళ క్రిందట ముగిసిపోయిన అధ్యాయాన్ని ఈ రోజు తిప్పి చూసే సాహసం మా ఇద్దరికీ లేదనే అనిపిస్తోంది. తెగిపోయిన బంధాలు తెగిపోయినట్టే. వాటి గురించి మళ్ళీ ఇప్పుడెవరు మాట్లాడతారు? నేను మాట్లాడను. కానీ అతడు మాట్లాడాలి. తెంచినవాడు తనే కాబట్టి తనే ప్రారంభించాలి. నేనెందుకు మాట్లాడాలి, నాకేం పట్టింది? నాకు త్వరలో సంజయ్‌తో పెళ్ళి కాబోతోంది. నేను ఇతనికి సంజయ్ గురించి ఎందుకు చెప్పట్లేదు? ఏదో అశక్తత, ఏదో మోహం నా నోరు పెగలనివ్వడం లేదు. ఉన్నట్టుండి అతనేదో అన్నట్టు అనిపించింది.

“ఆఁ! ఏమన్నావు?”

“నేనేమీ అన్లేదే!”

వెఱ్ఱినవ్వొకటి నవ్వి ఊరుకున్నాను. మళ్ళీ అదే మౌనం మా మధ్య. తినడం మీద ధ్యాస లేదు, ఏదో తిన్నాననిపించాను. బహుశా అతని పరిస్థితి కూడా అదే. అతని పెదవులు కదులుతున్నాయని, స్ట్రాని పట్టుకున్న చేతులు వణుకుతున్నాయని అనిపిస్తోంది.

“దీపా, నన్ను క్షమించావు కదా!“ అని అతడు అడగాలనుకుంటున్నాడు. నాకు తెలుసు.

అడిగెయ్యొచ్చు కదా! ఒకవేళ అడిగాడే అనుకో అప్పుడు నేనతన్ని ఎప్పటికీ క్షమించలేననీ, అతన్ని ద్వేషిస్తున్నాననీ, నీతో కలిసి ఇలా వస్తున్నందుకు, కలిసి కాఫీ తాగినందుకూ నీ నమ్మకద్రోహాన్ని మరిచిపోయాననీ అనుకోవద్దు అనగలనా?

అలా ఆలోచిస్తూ మనసు గతంలోకి జారిపోయింది. కానీ అదేమిటో సహించలేని ఆ అవమానం, ఆ కోపం ఇవన్నీ ఇప్పుడు గుర్తు రావేం? పాట్నాలో గంటలకొద్దీ మౌనంగా ఒకరినొకరు చూస్తూ కూర్చుండిపోయిన అందమైన సాయంకాలాలు, వెన్నెలరాత్రులు మాత్రం గుర్తొస్తాయేం? ఏదో వింతకలల ప్రపంచంలో మనసు, తనువు తన్మయత్వంలో మునిగిపోవడం, ఏ స్పర్శ తాలూకు ప్రమేయమూ లేకుండానే. నేను ఏమన్నా చెప్పబోతే కూడా నా నోటిపై తన వేలినుంచి వద్దు దీప్, ఆత్మీయమైన ఈ క్షణాలు ఇలా మౌనంగానే ఉండనీ అనేవాడు.

ఈరోజూ మనం మౌనంగానే ఉన్నాం, ఒకరి దగ్గరగా ఒకరున్నాం. ఈ క్షణాలు కూడా అటువంటి ఆత్మీయమైన క్షణాలేనా? గొంతు చించుకొని అరవాలని ఉంది కాదు! కాదు! అని. కానీ కాఫీ సిప్ చేయడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. అతని పట్ల నా అసమ్మతి మనసులోని ఏ చీకటి లోతుల్లోనో మునిగిపోబోతోంది.

నిశీథ్ నన్ను బిల్లు తీసుకోనివ్వలేదు. అతని చేతిలోంచి లాక్కోవడానికి ప్రయత్నించి అయినా అతని చేతిలో చేయి కలపాలన్న పిచ్చి ఆలోచనలొచ్చాయి. కానీ అటువంటి అవకాశమేమీ రాలేదు. బిల్లు అతనిచ్చాడు. నేను వద్దని కూడా అనలేకపోయాను. మనసులో తుఫాను లాగా అలజడి. కానీ నిర్వికారంగా వచ్చి టాక్సీలో కూర్చున్నాను. మళ్ళీ అదే మౌనం, అదే దూరం. కానీ నాకు మాత్రం నిశీథ్ నాకు చాలా దగ్గరగా వచ్చేశాడనిపిస్తోంది. చాలా చాలా దగ్గరగా! పదేపదే నా మనసు అతను నా చేయి పట్టుకోవాలి అని కోరుకుంటోంది, అతను నా భుజం మీద చేయి వేయడేం అంటోంది. నాకేం కోపం రాదు, నేను తప్పుగా అనుకోను. కానీ అలాంటిదేమీ జరగలేదు.

నిద్రపోయేటపుడు నేను ఈరోజు కూడా సంజయ్‌ను గుర్తు తెచ్చుకోబోయాను ఎప్పటిలాగానే. కానీ నిశీథ్ మాటిమాటికీ సంజయ్ ఆకారాన్ని తప్పించి తానే వచ్చేస్తున్నాడు.

కలకత్తా

చిరాగ్గా ఉంది నా అనిశ్చితి మీద, నా బలహీనత మీద. ఈరోజు అన్నీ చెప్పేయకుండా, ఎంత మంచి అవకాశం పోగొట్టుకున్నాను! నాకేమయిందో ఏమో, ఏమీ చెప్పలేకపోయాను.

సాయంకాలం నిశీథ్ నన్ను తన వెంట చెరువుగట్టుకు తీసుకెళ్ళాడు. నీటి ఒడ్డున పచ్చిక మీద కూర్చున్నాము. మాక్కొంచెం దూరంగా జనాలు, హడావిడిగా ఉందే కానీ ఆ స్థలం చాలా ప్రశాంతంగా ఉండింది. ఎదురుగా చెరువులో చిన్న చిన్న అలలు లేస్తున్నాయి. చుట్టుపక్కల వాతావరణంలో ఏదో తెలియని వింతైన భావన మనసుపై ప్రభావం చూపుతోంది.

“ఇంక నీవు ఇక్కడికి వచ్చేస్తావు కదూ?” నన్ను చూస్తూ అడిగాడు నిశీథ్.

“ఊఁ…”

“ఉద్యోగం వచ్చింది. తర్వాత, ఏం చేద్దామని?”

ఏదో తెలుసుకోవాలన్న ఆరాటం అతని కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది. ఏదో చెప్పాలన్నది కూడా. నా నుంచి వివరాలు తెలుసుకున్నాక తన మాట చెప్తాడేమో.

“ఏమీ లేదు.” ఎందుకో అలా అనేశాను. నన్నెవరో ఆపుతున్నట్టే ఉంది. నాకూ సంజయ్‌కీ ఉన్న అనుబంధాన్ని గురించి, ఉద్యోగం వచ్చాక మేము పెళ్ళి చేసుకోవడం గురించీ నేనెందుకు చెప్పలేకుండా ఉన్నాను? సంజయ్ ఎంతో మంచివాడు, నీలా మోసగాడు కాదు కచ్చగా అనుకున్నాను. కానీ నోరు తెరిచి చెప్పలేకపోయాను. నిస్సహాయంగా అనిపించి కళ్ళు తడి అయినాయి. మొహం తిప్పుకున్నాను.

“నీవు రావడం నాకెంతో సంతోషంగా ఉంది.”

నాకు ఊపిరాగినట్టుంది అతనింకేం చెప్తాడోనని. కానీ నోరు పెగలలేదు. పిరికిగా, జాలిగా, యాచిస్తున్నట్టుగా అతన్ని చూస్తున్నాను, ఎందుకు చెప్పేయవు నిశీథ్, ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాననీ, నన్ను నీతోబాటే ఉంచేసుకోవాలనుకుంటున్నావనీ, జరిగిందంతా మరిచిపోయి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాననీ చెప్పేయవెందుకు? చెప్పు నిశీథ్, చెప్పు! వినడానికి నా మనసు ఆరాటపడుతోంది. కొట్టుకుపోతోంది. నేను తప్పుగా అనుకోను, కొంచెం కూడా… ఎలా అనుకుంటాను నిశీథ్? ఇంత జరిగినా బహుశా నాకింకా నీమీద ప్రేమే ఉంది.

నాకు తెలుసు – నీవు ఏమీ మాట్లాడవని, ఎప్పట్లాగే మితభాషివనీ. అయినా నీ మాటలు వినాలని ఆత్రుతతో నీ వంక చూస్తున్నాను. కానీ నీ దృష్టి చెరువు నీటిమీదే ఉంది. శాంతంగా, మౌనంగా.

ఈ క్షణాలు ఎలాంటివో మనం గుర్తించకపోయినా గ్రహించలేనివి కావు. నీవు చెప్పు, చెప్పకపో, నాకు తెలుసు. నువ్వు ఇప్పటికీ నన్ను ఇష్టపడుతూనే ఉన్నావు చాలా. నేను కలకత్తా తిరిగి వస్తే, ఈ తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ అతికించాలని ఆశ పడుతున్నావు. నువ్వు ఇప్పుడు కూడా నేను నీ దానిననే నమ్మకంగా ఉన్నావు. నీకు తెలుసు ఇప్పటికీ ఈ దీప నీదేనని. మరి నాకు?

ఈ ప్రశ్నకు బదులిచ్చేంత ధైర్యం నాకు లేదు. నేనెందుకు నిన్ను ద్వేషించానో, అందుకే నా మీద నాకే ద్వేషం పుట్టవచ్చేమో.

రాత్రి మూడొంతులు అయిపోయినట్టుంది.

కాన్పూర్

మనసులో ఎంత ఇష్టం ఉన్నా కూడా నిశీథ్ కున్న ముఖ్యమైన మీటింగ్ వల్ల అతన్ని స్టేషన్‌కు రావద్దు లెమ్మన్నాను. ఇరా వచ్చింది, బండిలో కూర్చోబెట్టి వెంటనే వెళ్ళిపొయింది. లేదు, నేనే బలవంతంగా పంపేశాను. నాకోనమ్మకం, ఎంత వద్దన్నా నిశీథ్ రానే వస్తాడని. ఆఖరు వీడ్కోలు క్షణాల్లో నాకు అతనితో కొద్ది ఏకాంతం కావాలనిపించింది. మనసులో ఎక్కడో చిన్ని ఆశ – వెళ్ళిపోయేటప్పుడైనా ఏమన్నా చెప్పాలనుకుంటాడేమోనని.

ఇక పది నిముషాలలో బయల్దేరుతుందనగా, హడావిడిగా రైలు పెట్టెల్లోకి తొంగి చూసుకుంటూ వెదుక్కుంటూ వస్తున్నాడు నిశీథ్… ఉట్టి పిచ్చివాడు! నేను అతని కోసం బయటే నిలబడి ఎదురుచూస్తూంటానని అంతమాత్రం తెలియకపోతే ఎలా?

పరుగెత్తుకొని అతని వైపుకు వెళ్ళాను, వద్దన్నానుగా ఎందుకొచ్చావూ అంటూ. నిజం చెప్పాలంటే అతను రావడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. బాగా అలసినట్టు కనిపించాడు. పాపం రోజంతా తీరిక లేని పని, పైన నేను బయల్దేరుతున్నానని పరుగున రావల్సి వచ్చింది. అతడి అలసట అంతా ఒక్కసారి మాయమయ్యేలా నేనేం చేయగలను? ఇద్దరమూ మా పెట్టె దగ్గరికొచ్చాం. “కూచునేందుకు స్థలం దొరికిందా?” పెట్టెను పరికిస్తూ అన్నాడు

“ఊఁ”

“నీళ్ళు పళ్ళు ఏమన్నా కావాలా?”

“ఉన్నాయి.”

“హోల్డాలు పరచుకున్నావా?”

నాకు చిరాకేసింది. అర్థమై ఊరుకున్నాడతను. ఒక్కక్షణం కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళలో ఏవో నీడలు చూస్తున్నాను నేను. ఏదో ఉంది అతని మనసులో. అతన్ని కలవరపెడుతోంది, బయటకు రాకుండా ఉంది. చెప్పెయ్యవచ్చు కదా, మనసు తేలిక పడుతుంది.

“అంతగా రద్దీగా లేనట్టుందీవేళ.” చుట్టూ చూస్తూ అన్నాడు.

నేనూ చుట్టుప్రక్కల చూశాను. మాటిమాటికీ గడియారం చూస్తున్నాను. సమయం గడుస్తున్నకొద్దీ నిరాశలో కూరుకుపోతున్నాను. నాపైన నాకే జాలి కలుగుతోంది, అంతలోనే చిరాకూ వేస్తోంది. ఇంక మూడు నిమిషాలుంది. మళ్ళీ మా కళ్ళు కలుసుకున్నాయి.

“ఎక్కు ఇంక. రైలు బయల్దేరుతుంది.”

నిస్సహాయంగా చూస్తూ బండి ఎక్కనని మారాం చేస్తున్నంత మెల్లగా ఎక్కాను. ఎక్కి గుమ్మంలోనే నిలుచున్నాను. అతడు ప్లాట్‌ఫారమ్ మీదున్నాడు.

“చేరాక కబురు చెయ్యి. ఇక్కడ నాకేమన్నా గ్యారంటీగా తెలిస్తే నీకు తెలియజేస్తాను.”

నేనేమీ మాట్లాడలేదు. అతన్నే చూస్తూ ఉండిపోయాను.

రైలు కూత – పచ్చజెండా – మళ్ళీ కూత వినిపించింది. నా కళ్ళలో కలక పడినట్టుంది.

బండి జెర్క్ ఇచ్చి కదిలింది. బండితో పాటు అడుగులేస్తూ, నా చేతి మీద తన చేయి ఉంచాడు. నాకు పులకరింత కలిగింది. గొంతు చించి అరవాలనిపించింది – నాకర్థమయింది నిశీథ్, అంతా అర్థమైంది. అని. ఈ నాలుగు రోజుల్లో నీవు చెప్పలేకపోయినదంతా ఈ ఒక్క క్షణకాలపు స్పర్శతో చెప్పేశావు. నమ్ము, నీవు నా వాడివైతే, నేనూ నీ దానినే. నీకే సొంతమైన దానిని. బండి వేగం పెరిగింది. అతడు చేయి మెల్లగా నొక్కి వదిలేశాడు. తడిగా ఉన్న కనులు అరమూత పడ్డాయి. ఈ స్పర్శ, ఈ సుఖం, ఈ క్షణమే సత్యం, మిగిలినదంతా అబద్ధం, ఏదో మరపుకు రావడానికి, ఇంకేదో నింపుకోడానికి, మోసంచేసే విఫల ప్రయత్నం.

కన్నీటితో ప్లాట్‌ఫారమ్ వెనక్కి జారుతోంటే చూస్తుండిపోయాను. మసకబారుతున్న ఆకారాలతో వీడ్కోలు చెప్తున్న అసంఖ్యాకమైన చేతుల మధ్య నిశీథ్ చేతిని, నా చేయి పట్టుకున్న చేతిని వెదకడానికి ప్రయత్నించి ఓడిపోయాను. బండి స్టేషన్ దాటేసింది, మెల్లగా దూరం పెరిగింది, దీపాలు కనుమరగయ్యాయి. ఈ రైలుబండి రాక్షసుడు నన్ను నా ఇంటి నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నట్టుగా – తెలియని, చూడని దారుల్లో నన్ను తికమక పెడుతున్నట్టుగా అనిపించింది.

బరువెక్కిన మనసుతో పరిచిన హోల్డాలు మీద పడుకున్నాను. కళ్ళు మూయగానే సంజయ్ రూపం… కాన్పూర్ వెళ్ళి నేనేం చెప్పనతనికి? ఇన్నాళ్ళూ అతన్ని మోసం చేస్తూ, నన్ను నేను మోసం చేసుకుంటూ, ఇక చాలు. అతనికి అన్నీ చెప్పేస్తానిక. సంజయ్, నేను తెగి పోయిందనుకున్న సంబంధపు వేర్లెక్కడో మనసు లోతుల్లో ఉండి పోయినాయన్న వాస్తవం నిశీథ్‌ని కలకత్తాలో కలిశాకే నాకు తెలిసింది. నీవెప్పుడూ నిశీథ్ గురించి కొంచెం సందిగ్ధంగానే ఉండేవాడివి, నీకు ఈర్ష్య అనుకొనేదాన్ని. కానీ నీవే గెలిచావు, నేనోడిపోయాను. ఒప్పుకుంటాను.

నన్ను నమ్ము సంజయ్! రెండుమూడేళ్ళనుంచీ నేను భ్రమలో ఉండి, నిన్నూ భ్రమలో ఉంచాను. ఈరోజు ఆ భ్రమలు, మోసాల వలలు తెగిపోయాయి. నేనిప్పటికీ నిశీథ్‌నే ఇష్టపడుతున్నాను. ఇంత స్పష్టంగా తెలిశాక ఇంక ఒక్క క్షణం కూడా నిన్ను మోసం చేయదలచుకోలేదు. ఈరోజు తొలిసారి నా గురించి నాకంతా స్పష్టమైంది. ఇంత స్పష్టంగా తెలిశాక నేను నీ దగ్గర ఏదీ దాచాలనుకోవడం లేదు, నేనే తలచుకున్నా నీతో ఇంక అబద్ధం చెప్పలేను.

ఇప్పుడనిపిస్తోంది, నీ పట్ల నాకున్నది కేవలం కృతజ్ఞత. ప్రేమ కాదు. తండ్రిని, నిశీథ్‌ని పోగొట్టుకొని నేను కుప్పకూలిపోయిన సమయంలో నీవు సహాయం చేశావు. ప్రపంచమే బీడైపోయిందని నేను తపించిన క్షణాలలో నీ స్నేహం నన్ను బ్రతికించి మళ్ళీ మనిషిని చేసింది. నేను అప్పట్లో అది ప్రేమ అనుకున్నాను. కానీ ప్రేమలో ఉండే మైమరపు, అపురూపం, తన్మయత్వం, మాట మూగబోవడాలు మన మధ్య ఎప్పుడూ రాలేదు. నీవే చెప్పు, వచ్చాయంటావా? ఎన్నోసార్లు పెట్టుకున్న ముద్దుల్లోను, ఆ కౌగిలింతల్లోనూ కూడా ఏ ఒక్కసారైనా మనలో ఆ పులకరింత కలిగిందా? నాకు కలగలేదు.

ఆలోచిస్తే, నిశీథ్ వెళ్ళిపోయిన తర్వాత ఏర్పడిన శూన్యాన్ని, ఆ రిక్తతను నీవు భర్తీ చేశావనిపిస్తుంది. నువ్వు అలా లోటు పూరించావే కానీ నీ అంతట నువ్వు నాకు ఇష్టం కాలేదు.

నన్ను క్షమించు సంజయ్! తిరిగి వెళ్ళిపో. నీకు నాలాంటి అనేకులు దీపలు దొరుకుతారు నిన్ను నిజంగా ప్రియంగా కోరుకుంటారు. తొలిప్రేమే నిజమైనదని నాకీ నాడు బాగా తెలిసింది. తరువాతి ప్రేమ కేవలం మొదటి వియోగాన్ని మరపించేదో, పూరించేదో, ఆ ప్రయత్నమో, అంతే.

ఎన్నో ఆలోచనలు సంజయ్ కిలా చెప్పాలి, అలా చెప్పాలని. కానీ చెప్పగలనా అనిపిస్తోంది. చెప్పకపోతే ఎలా? చెప్పాల్సిందే. ఇక ఒక రోజైనా అతన్ని భ్రమలో పెట్టలేను. మనసులో ఒకరిని ఆరాధిస్తూ తనువు ఇంకొకరి పరం చేయడమా? ఛీ!

ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలీలేదు. గదికి చేరుకున్నాను. గది ఎప్పట్లాగే ఉంది ఒక్క రజనీగంధలు మాత్రం వాడి ఉన్నాయి. కొన్ని అక్కడక్కడా రాలి పడి ఉన్నాయి. తలుపు సందులోంచి వేసినట్టున్న కవరు కనిపించింది. సంజయ్ చేతివ్రాత. కవరు తెరిచాను. చిన్న ఉత్తరం.

‘దీపా,
నువ్వు కలకత్తా వెళ్ళాక కబురు చేయనేలేదు. నేను ఆఫీసు పని మీద కటక్ వెళ్తున్నాను. ఐదారు రోజులలో వస్తాను. అంతలో నువూ వచ్చేసి ఉంటావు. కలకత్తాలో ఏమేం జరిగిందో అంతా వినాలనుంది.
నీ
సంజయ్.

ఒక పెద్ద నిట్టూర్పు. పెద్ద భారం తొలగినట్లయింది. ఈ వ్యవధిలో నన్ను నేను కొంచెం సంబాళించుకోవచ్చు.

స్నానం చేసి వచ్చి మొట్టమొదట నిశీథ్‌కి ఉత్తరం వ్రాశాను. అతని వద్ద ఉన్నప్పుడు బిడియంతో నోరే విప్పలేదు, అతను దూరమవగానే బిడియమూ దూరమైంది. అతనేమీ చెప్పకపోయినా నేనంతా అర్థం చేసుకున్నానని స్పష్టంగా వ్రాశాను. అతని ప్రవర్తన వల్ల నేనెంత బాధపడింది, ఎంత కోపపడింది, అతన్ని చూడగానే ఆ కోపమంతా ఎలా కరిగిపోయిందీ అన్నీ వ్రాసేశాను. సొంతమనుకున్న తర్వాత ఇంకెక్కడి కోపం? తిరిగొచ్చాక ఎన్నెన్ని రంగుల కలలమత్తులో మునిగిపోయాను.—

అందమైన కవరులో పెట్టి స్వయంగా పోస్ట్ చేశాను.

రాత్రి పడుకొన్నప్పుడు తెలీకుండానే పూలకుండీ వైపు నా చూపు వెళ్తే, పక్కకు తిరిగి పడుకొన్నాను.

కాన్పూర్

నిశీథ్‌కి ఉత్తరం పోస్ట్ చేసి నాలుగు రోజులైంది. నిన్నే బదులొస్తుందని ఎదురు చూశాను, ఈరోజు ఉదయం సాయంత్రం కూడా పోస్ట్ వచ్చి వెళ్ళిపోయింది. ఏదో వెలితిగా, దేనిమీదా మనసు లేనట్టుగా ఉంది. తిరుగుటపా లోనే బదులెందుకివ్వలేదతను? పొద్దెలా పుచ్చాలో తెలియడం లేదు.

బాల్కనీలో వచ్చి నించున్నాను. ఉన్నట్టుండి ఏదో జ్ఞాపకం – ఈ రెండు మూడేళ్ళ నుంచీ సంజయ్ కోసం ఇదే చోట, ఇదే వేళకు ఎదురు చూసేదాన్ని. ఈ రోజు సంజయ్ కోసం చూస్తున్నానా? లేదా నిశీథ్ ఉత్తరం కోసమా? ఎవరికోసమూ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండూ జరగవని తెలుసు. మరి?

అనాసక్తితో గదిలోకి నడిచాను. సాయంకాలం ఇంట్లో ఉండబుద్ధి కాదు. రోజూ సంజయ్‌తో కలిసి బయటకు వెళ్ళేదాన్ని. ఇంకాసేపు ఇక్కడే ఉంటే పిచ్చి పడుతుందనిపించింది. గదికి తాళం పెట్టి కాళ్ళీడ్చుకుంటూ రోడ్డు మీదికి వచ్చాను.. సాయంకాలపు మసకచీకట్లు మనసును మరింత భారం చేశాయి. ఎక్కడికెళ్ళను? దారి తప్పాననీ గమ్యం మరిచాననీ అనిపిస్తోంది. నేనెక్కడికి వెళ్ళాలో నాకే తెలియడం లేదు. ఏ నిర్ణయమూ చేసుకోకుండానే నడుస్తున్నాను. కానీ ఎంతవరకిలా తిరగను? ఓడిపోయి తిరిగొచ్చాను.

గదిలోకి రాగానే మెహతా గారి పాప టెలిగ్రామ్ వచ్చిందని తెచ్చిచ్చింది. దడదడా కొట్టుకుంటున్న గుండెలతో కవరు తెరిచాను. ఇరా ఇచ్చిన టెలిగ్రామ్ అది.

‘ఉద్యోగం వచ్చింది. శుభాకాంక్షలు.’

ఇంత శుభవార్త విన్నా నాకే సంతోషం కలగలేదు. ఈ కబురు నిశీథ్ తెలుపుతానన్నాడు కదా! ఉన్నట్టుండి నా మనసులో అలజడి, నేననుకున్నదంతా భ్రమేనా? నా కల్పనేనా? నా అంచనా తప్పేనా? కాదు కాదు! నా మనస్సును, తనువును ముంచేసిన ఆ స్పర్శ తాలూకు అనుభూతిని భ్రమ అని ఎలా అనుకోను? దాని ద్వారానే కదా అతని మనసు పొరలన్నీ నా ముందు తెరచుకున్నది? అతని మౌనమే మాటలైన వేళ చెరువు గట్టు ముందు గడపిన ఆ మధురక్షణాలను ఎలా భ్రమ అనుకోను? అవ్యక్తంగా వ్యక్తమైన ఆత్మీయతనో! మరి అతనెందుకు ఉత్తరం వ్రాయనేలేదు? రేపేమైనా వస్తుందేమో! లేక అతన్నింకా ఆ జంకు, బిడియం వదలనే లేదా?

అప్పుడే ఎదురుగా ఉన్న గడియారం తొమ్మిది కొట్టింది. దాన్నే చూశాను. ఇది సంజయ్ తెచ్చిందే. అందుకే ఇది గంటలు కొట్టి కొట్టి నాకు సంజయ్‌ని జ్ఞాపకం చేస్తోంది. ఈ ఎగురుతున్న పరదాలు, ఈ పుస్తకాల ర్యాక్, ఈ బల్ల, ఈ పూలకుండీ అన్నీ సంజయ్ తెచ్చినవే. బల్లపైనున్న కలం కూడా అతను నాకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చాడు.

విడిపోయిన అంతశ్చేతన దారాలను పోగుచేసుకుంటూ ఏదో చదువుదామని కూర్చున్నాను, కుదరలేదు. ఓడిపోయి మంచం మీద వాలిపోయాను.

ఖాళీ పూలకుండీ శూన్యమైన నా మనసు లాగే ఉంది. గట్టిగా కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ నా కళ్ళముందు స్వచ్ఛంగా నీలంగా చెరువు, అందులో లేచి పడుతున్న చిన్న చిన్న అలలు కనిపిస్తున్నాయి. చూస్తూండగానే నిశీథ్ ఆకారం, ఆ మొహంలో ప్రతిబింబిస్తున్న అతని మానసిక సంచలనం నాకు ఇప్పుడూ కనిపిస్తూనే ఉన్నాయి అతని చూపు చెరువు వైపున్నా కూడా. ఏమీ చెప్పలేని అసహాయత, వివశత, సంకటం నాకర్థమౌతూనే ఉన్నాయి. నెమ్మదిగా చెరువు వైశాల్యం కురుచనై, చిన్న వ్రాత బల్లగా మారిపోతూంది. ఒక చేతిలో కలం పట్టుకొని, ఒక చేతివేళ్ళతో క్రాఫు సర్దుకుంటూ నిశీథ్ కూర్చొని ఉన్నాడు. అదే అసహాయత, అదే వివశత, అదే సంకటం. ఏదో వ్రాయాలని వ్రాయలేకపోవడం. ప్రయత్నిస్తుండడం, చేయివణకడం… ఓహ్! అతని సంకటం నా అంతు చూసేలా ఉంది. చప్పున కళ్ళు తెరిచాను. అదే పూలకుండీ, అవే పరదాలు, అదే బల్ల, అదే గడియారం!

కాన్పూర్

చివరికి నిశీథ్ నుంచి ఉత్తరం వచ్చింది. గుండె దడదడా కొట్టుకుంది. ఇంత చిన్న ఉత్తరమా!

ప్రియమైన దీపా,
ఉద్యోగం వచ్చిందన్న టెలిగ్రామ్ నీకు చేరే ఉంటుంది. నేను నిన్ననే ఇరాగారికి ఫోన్ చేసి చెప్పాను. ఆమె టెలిగ్రామ్ ఇస్తానంది. ఆఫీసు నుంచి కూడా సమాచారం వస్తుంది. నీ ఈ విజయానికి నా హృదయపూర్వక అభినందనలు. నీకు ఉద్యోగం వచ్చినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కష్టం ఫలించింది.

మిగతా సంగతులు మరోసారి.

శ్రేయోభిలాషి.
నిశీథ్.

అంతేనా? మెల్లమెల్లగా ఉత్తరం లోని అక్షరాలన్నీ కనుమరుగై, ‘మిగతా సంగతులు మరోసారి’ మాత్రమే కనిపిస్తోంది.

అంటే ఇంకా వ్రాసేందుకు ఏదో ఉందనా? ఇప్పుడే ఎందుకు వ్రాయకూడదు? ఏం వ్రాస్తాడు?

“దీప్!”

వెనక్కి తిరిగి గుమ్మం వైపు చూశాను. రజనీగంధ పూలగుత్తితో నవ్వుతూ సంజయ్! ఒక్కక్షణం నిశ్చేష్టనైనాను, పోల్చుకోడానికి ప్రయత్నిస్తున్నట్టు. సంజయ్ ముందుకు అడుగేశాడు. నాలో చైతన్యం తిరిగి వచ్చింది. ఏదో తెలియని ఉన్మాదంలో పరుగెత్తి అతన్ని అతుక్కుపోయాను.

“ఏమైంది నీకు? పిచ్చి గానీ పట్టలేదు కదా!”

“ఎక్కడికెళ్ళిపోయావు సంజయ్?” నా స్వరం బద్దలైనట్టుగా పలుకుతోంది. అనుకోకుండా కన్నీళ్ళు కారిపోయాయి.

“ఏమైంది? కలకత్తాలో ఉద్యోగం దొరకలేదా? పోతే పోనీవోయ్! దానికెందుకింత బాధపడతావు?”

నేను బదులు పలకలేకపోయాను. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా అతుక్కుపోయాను. నేలసంపెంగల పరిమళం నెమ్మదిగా నా తనువునూ, మనసునూ మళ్ళీ ఆక్రమించుకుంటోంది. చిన్నగా నొసటి మీద ముద్దు స్పర్శ తెలుస్తోంది. ఈ స్పర్శ, ఈ సుఖం, ఈ క్షణమే సత్యం, మిగిలిందంతా అబద్ధం, మిథ్య, భ్రమ అని అనిపిస్తోంది.

అలా ఎంతసేపుండిపోయామో మాకే తెలీదు.


(మూలం: యహీ సచ్ హై. రచయిత: మన్నూ భండారీ. ఈ కథ 1974లో బాసూ చటర్జీ దర్శకత్వంలో రజనీగంధా అనే పేరుతో సినిమాగా తీయబడి ఆ యేటి మేటి చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ మాత్రమే కాక ప్రజాదరణనూ పొందింది. పరిమళ భరితమైన రజనీగంధ పూలను తెలుగులో నేలసంపెంగలని, మెక్సికన్ ట్యూబ్‌రోస్ (Mexican Tuberose) అని ఇంగ్లీషులోను పిలుస్తారు.)