పరికరం

మార్మికమైన క్షణాలవేవో సున్నితంగా నా
గాయాలను తాకుతూ వాటిని రేపాయి

మంద్రమైన అనుభూతులవేవో లోకాల నుంచి
గాలుల్లాగా నాలోంచి నాలోకి వీచాయి

మధురమైన సంగీతమదేదో అమరంగా
నిలిపింది పురాస్మృతుల్ని ఒక గానంగా

తన్మయత్వంలో మరచిపోయాను నన్ను నేను
అలవికాని ఆనందంతో తనివితీర ఏడ్చేదాకా

ఆ గానం నాలోంచే వస్తోందన్న స్పృహే లేదు
మీరంతా కవీ! కవీ! అని నను కీర్తించేదాకా