ఏకాంతం కోసం

ఆలోచనల్లోనే గిన్నెలన్నీ కడిగి తుడిచి సర్దేసిందామె. నల్లగా మురికిపట్టిన కత్తులన్నీ కోసిన బంగాళాదుంపతో రుద్ది కడిగింది. భోజనం చేసే బల్ల, ప్లేట్లు కప్పులున్న అల్మారా, మిగతా వంటిల్లంతా కూడా శుభ్రంచేసి చేతులు తుడుచుకుంది.

…బుజ్జివెధవ పాపం ఎందుకో ఎప్పుడూ అనారోగ్యంగానే వుండేవాడు. వాడి వుంగరాల జుట్టు, నాజూకు రంగు చూసి అందరూ ఆడపిల్లనుకునేవారు. తనూ ఎమిలీ ఎన్నెన్నో చిట్కా వైద్యాలు చేశారు. ఆ వైద్యాలకోసం ఎమిలీ ఆదివారం పత్రిక పొద్దున్నే చదివేది. ఆ పత్రికకి సలహాల కోసం తల్లీ కూతురూ ఎన్నో ఉత్తరాలు కూడా రాసేవారు. అయినా లెన్నీ అసలు తిండి సరిగ్గా తిననేలేదు. ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా వాడు ఒళ్ళుచేయనేలేదు.

అమ్మకంటే వాడికి అమ్మమ్మంటే ప్రాణం. వాడు అమ్మమ్మ బిడ్డ.

“నువ్వు ఎవరి బేబీవీ?” అడిగింది మా పార్కర్, స్టవ్ తుడిచి జిడ్డు పట్టిన కిటికీ మీద సబ్బు రుద్దుతూ.

“నేను గ్రానీ బేబీని!”

ఒక పిల్లవాడి గొంతు తన గుండె కిందుగా నవ్వుతూ చెప్పింది. ఆ గొంతు ఎంతో ఆప్యాయంగా, ఎంతో దగ్గరగా తన గుండెలోంచి వస్తున్నట్టుగా వినిపించి మా పార్కర్ నిలువెల్లా కదిలిపోయింది ఒక్క క్షణం.

గది గుమ్మం దగ్గర అలికిడయింది. ఆమె తలెత్తి చూసింది. పుస్తకాలాయన తయారయి ఎక్కడికో బయల్దేరినట్టున్నాడు.

“మిసెస్ పార్కర్! నేను బయటికెళ్తున్నాను!”

“అలాగేనండి!”

“మీకివ్వాల్సిన డబ్బు బల్లమీద వుంది.”

“అలాగేనండి.”

ఆయన వెళ్ళబోతూ ఆగిపోయాడు.

“అన్నట్టు, కిందటి వారం మీరొచ్చినప్పుడు డబ్బాలోంచి కోకో పొడి బయటకానీ పడేశారా?”

“అబ్బే, లేదండి.”

“వింతగా వుందే. నాకు బాగా గుర్తు, డబ్బాలో ఒక చెంచాడు పొడి మిగిలేవుండాలి. ఇప్పుడు చూస్తే ఖాళీగా వుంది. కనపడకపోతే బయట పడేశారేమోననుకున్నా. నాకు చెప్పకుండా ఏదీ పడేయరు కదా!?” ఆయన గంభీరంగా ముగించి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, తన లౌక్యానికీ తెలివి తేటలకీ ఎంతగానో మురిసిపోతూ. తనేమీ అంత అమాయకుడూ తెలివితక్కువవాడూ కాదనీ, ఇంటి విషయాల్లో అప్రమత్తంగానే వుంటాడనీ తెలియజెయ్యడమే ఆయన ఉద్దేశ్యం.

ఆయన వెళ్ళిపోయిన గుర్తుగా తలుపు ధడాలున మూసుకుంది. మా పార్కర్ తన బ్రష్షులు, గుడ్డలూ తీసుకొని బెడ్రూములోకి నడిచింది చిన్నగా. పక్కలు దులిపింది, దుప్పట్లు తీసి కొత్త దుప్పట్లు పరిచి ముడతలు సరిచేసి వాటిని పరుపు కిందికి నెట్టింది. దిళ్ళు సర్దింది. ఆ ఒంటరితనంలో, నిశ్శబ్దంలో తన మనవడి ఆలోచన ఆమెను కుదిపివేస్తూనే ఉంది.

ఎలాగూ పోక తప్పనప్పుడు వాడంత నరకయాతన ఎందుకు అనుభవించాలన్న ప్రశ్న ఆమెని నిలవనీయడంలేదు. అంత పసి కూన ఒక్కొక్క ఊపిరి కోసం బ్రతుకునంతగా వేడుకోవాలా? ఆ చిన్నారిని అంత చిత్రహింసలు పెట్టి ఆనందించేదెవరు? ఎవరి తృప్తికోసం వాడి పోరాటం? ఆమెకు అర్థంకానిదదే.

వాడి పలుచటి గుండెలో ఏదో మరుగుతున్నట్టు వచ్చే గుర గుర శబ్దం. అది బైటికి రాదు వాడిని ఊపిరి తీసుకోనీయదు. దగ్గినప్పుడల్లా చేతులు కాళ్ళు కదిలిపోయేవి. కళ్ళు ఉబ్బుకొచ్చేవి. ఆ తరవాత అలసిపోయి దిండుకి చేరబడి వాడు గ్రానీ వంక కోపంగా చూసేవాడు.

తను కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

“నేనేం చేయనురా నా తండ్రీ!” చెమటకి తడిసిపోయిన వాడి జుట్టుని మొహం మీంచి పక్కకి జరిపింది. వాడు కోపంగా ఆమె చేయి పక్కకి తోసేసి కళ్ళు మూసుకున్నాడు. గుండెని మెలిపెడుతున్నట్టున్న బాధని ఆ పెద్దావిడ తట్టుకోలేకపోయింది.

ఇక తనవల్ల కాలేదు. చేతిలో వున్న తుడుపు గుడ్డ అలానే వదిలేసింది. ఆమె తన బతుకేదో తాను బతికింది. ఏదొచ్చినా నిబ్బరంగా నిలబడింది. ఆమె ఇంతవరకూ కన్నీళ్ళు పెట్టుకోలేదు బైటివారి ముందైనా తన పిల్లల ముందైనా. కానీ ఇప్పుడు లెన్నీ లేడు. తనకెవరూ లేరు. ఇప్పుడెవరికోసం బ్రతకాలి? తనకు మిగిలిందల్లా ఆ పసికూన ఒక్కడే. ఇప్పుడు వాడూ లేడు. ఈ కష్టాలన్నీతనకే ఎందుకు రావాలి? తనకే ఎందుకవుతుంది ఇలా?

“నాకే ఎందుకవుతుంది ఇలా?”

తెలియకుండానే ఆ ప్రశ్న మా పార్కర్ నోటినుంచి బయటకు వచ్చింది. గుండెను నులిపెడుతున్న బాధతో మా పార్కర్ తనేం చేస్తున్నదో తెలియని స్థితిలో వంటగదిలోకి నడిచింది, కోటు వేసుకుంది, తలకు టోపీ పెట్టుకుంది. ఇంట్లోంచి బైటకు వచ్చింది. ఎక్కడికి పోవాలి? ఎటువైపు నడవాలి? ఏం చేస్తే తన ఆలోచనలనుంచి తను తప్పించుకోగలదు?

బయట చలిగా వుంది. చల్లటి ఈదురుగాలి కత్తులతో కోస్తున్నట్లుగా ఉంది. అందరూ చకచకా నడిచిపోతున్నారు తమ శరీరాలన్నీ కప్పుకుని. పక్క మనిషిని పలకరించడానిక్కూడా ఓపిక, తీరిక లేని మనుషులు, ఎవరికీ ఆమె బాధ పట్టలేదు. ఎక్కడైనా కూర్చుని తీరుబడిగా ఏడవాలని వుందామెకు. కానీ ఇన్నేళ్ళ తరువాత ఏడుద్దామన్నా అవుతుందా? ఇన్నేళ్ళూ గుండెల్లో ఉగ్గబట్టుకువున్న ఏడుపు ఇప్పుడు మాత్రం బయటకు వస్తుందా?

ఆ ఆలోచన రాగానే లెన్నీ గుండెల మీదకెగబాకినట్టుగా అనిపించింది. అవున్నాన్నా, గ్రానీ కిప్పుడు ఏడవాలనుంది. ఏడుపంటూ మొదలుపెడితే అన్నిటికీ ఏడవాలి. రాక్షసిలాంటి వంటమనిషి, భర్త అనారోగ్యం, పుట్టిపోయిన తన పిల్లలు, ఇన్నేళ్ళ ఈ దుర్భరమైన జీవితం చివరికి లెన్నీ దగ్గరికి వచ్చి ఆగేదాకా జరిగిన ప్రతీదానికి ఏడవాలి. తీరిగ్గా పూర్తిగా గుండె బరువు తగ్గిపోయేలా ఏడవాలి. ఇన్నిటికి ఏడవాలంటే చాలా సమయం కావాలి. అయినా సరే. సమయం వచ్చింది. ఇక ఆగదు. తను ఏడవక తప్పదు. ఇక ఏడవాలి. కానీ ఎక్కడ?

“మా పార్కర్ బతుకంతా కష్టాలే కష్టాలు!” అవును. కష్టాలే. బిగబట్టుకున్న పెదవులు వణికాయి.

ఇంటికెళ్ళి ఏడవలేదు, అసలే బిడ్డ పోయిన బాధలో వున్న ఎమిలీ తట్టుకోలేదు, బెదిరిపోతుంది. బయటెక్కడైనా పార్కులో బెంచీ మీద కూర్చోని యేడుద్దామంటే, అందరూ చుట్టుముట్టి ప్రశ్నలడుగుతారు. పుస్తకాలాయనది పరాయి ఇల్లు. అక్కడ ఎలా ఏడవగలదు? ఏ దుకాణం మెట్ల మీదో కూర్చుని ఏడిస్తే పోలీసువాళ్ళు వచ్చి పొమ్మంటారు.

తనకు ఇష్టమైనంతసేపు ఎవరికీ తను కనిపించని చోటు, ఎవరూ తనని ప్రశ్నలడగని చోటు ఒకటి లేదా? ఇన్నాళ్ళకి ఈ ప్రపంచంలో తను పొగిలి పొగిలి ఏడవడానికి ఒక చోటంటూ కనీసం లేదా?

ఇంతలో వాన మొదలయింది. చల్లటి ఈదురుగాలి ఆమెను సూదులతో పొడిచింది. మా పార్కర్ అటూ ఇటూ చూసింది. లేదు, చోటెక్కడా లేదు.

(మూలం: Katherine Mansfield – “The life of Ma Parker.”)

శారద

రచయిత శారద గురించి: ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు రాస్తూ వుంటారు. నీలాంబరి అనే పేరుతో వీరి కథల సంపుటి ప్రచురించారు. ...