ఒక సందిగ్ధ స్వప్నం – వానొస్తద?

నారాయణ స్వామి కవితా సంకలనం వానొస్తద? తొలిసారి చూసినప్పుడు ‘గత కొన్ని సంవత్సరాలలో స్వామి ఇన్ని కవితలు రాశాడా’ అనుకున్నాను. తన పుస్తకం విడుదల రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అతివృష్టికి దారితీసిందని స్వామే ఒక చోట చమత్కరించాడు. ఈ అతివృష్టి బయటి వర్షానికేనా, లోపలి వర్షానికి కూడా వర్తిస్తుందా అని అనుమానపడ్డాను. పుస్తకం తెరిచాక నా అనుమానం నిజం కాదని తెలిసింది. ఇందులో ఉన్నవి 42 కవితలే. బొమ్మలు, మిత్రవాక్యాలు మొదలైన వాటివల్ల పుస్తకం సైజు కాస్త పెరిగింది.

ఇందులో ప్రతి కవితకు ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ గీసిన బొమ్మ ఉంటుంది. నాకు గుర్తున్నంత వరకు లక్ష్మణ్ మొదటిసారిగా సిద్ధార్థ మొదటి పుస్తకం దీపశిలకు ఇలాగే ప్రతి కవితకు బొమ్మ వేశాడు. ఆ తరువాత నేను చూసినవి ఇంద్రప్రసాద్ నడచి వచ్చిన దారిలో మోహన్, ఆకెళ్ళ రవిప్రకాష్ ఇసుకగుడిలో పి.వెంకటేశ్వర్లు వేసిన చిత్రాలు. ఒక తేడా ఏమిటంటే, వాటిల్లో చిత్రం కవితతోబాటే ఉంటుంది. స్వామి పుస్తకంలో ప్రతి చిత్రాన్ని విడిగా, పూర్తి పేజీలో ప్రచురించారు. లక్ష్మణ్ చిత్రాలు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి. అందువల్ల, అవి పుస్తకానికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.

స్వామి ఇప్పటికే కవిగా లబ్ధప్రతిష్టుడు. తన మొదటి సంకలనానికే ఫ్రీవర్సు ఫ్రంటు పురస్కారం పొందాడు. ఇది తన మూడవ పుస్తకం. ఐనా, ఎందుకో నలుగురు చెప్పే మాటలు చేర్చాలనే ఉత్సాహం కనబరిచాడు. ఇందులో రెండు ముందుమాటలు, రెండు వెనకమాటలు వెరసి నాలుగు మిత్రవాక్యాలున్నాయి. వాటిలో వరవరరావు రాసిందే కాస్త బాగుందనిపించింది. ముఖ్యంగా తల్లిని పోగొట్టుకోవటాన్ని, విప్లవోద్యమానికి దగ్గరై మళ్ళీ దూరం కావటాన్ని కలిపి, స్వామి కవిత్వంలో అస్తిత్వాన్ని, ఉద్యమాన్ని కోల్పోయి మళ్ళీ వెతుక్కునే తపన ఉన్నదనే విశ్లేషణ బాగుంది. ముందుమాట అవసరమనుకుంటే, ఇదొక్కటీ ఉంచితే సరిపోయేది.

ఇన్ని విశ్లేషణల తరువాత, ఇక ప్రత్యేకంగా చెప్పటానికేమన్నా మిగిలిందా అనే సందేహం రావచ్చుగాని, సహ ప్రవాస కవిగా, స్వామికి దాదాపు సమవయస్కునిగా నాకు కలిగిన కొన్ని ఆలోచనలను వివరిస్తాను.

వరవరరావుతో సహా, అందరూ పేర్కొన్న పద్యం అతని తండ్రి గురించి రాసిన ఎలిజీ ‘మళ్ళా వస్తవా.’

బాపూ నీ యాది
తల్లి రొమ్ము తెలవని
నా పెదవుల మీద
తడి ఆరని చనుబాల చారిక

స్వామి పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడని ఈ పద్యం చదివేదాకా నాకు తెలియదు. ఇదివరకు రాసిన కవితల్లో ఎక్కడైనా ఈ ప్రస్తావన ఉందేమో గుర్తులేదు. విరివిగా వాడే అవకాశం ఉన్న ఈ సెంటిమెంటుని ఉపయోగించటంలో నిగ్రహం పాటించటం గొప్ప విషయమే. అదీ, తండ్రి గురించి రాసిన పద్యంలో దానిని చెప్పటం వల్ల, కరుణాత్మకంగా సాగిన ఈ కవితకు బలం చేకూరింది. ఈ కవిత మొత్తంలో తండ్రికి తనమీద ఉన్న ఆపేక్ష, తన భద్రత పట్ల ఆయన పడే ఆందోళన బాగా వ్యక్తమయాయి. తల్లి లేకపోవటం వల్ల కాబోలు చిన్నతనంలో తను అనుభవించిన ఒంటరితనం, భయం మొదలైన వాటి గురించి చిన్నతనం అనే కవితలో వర్ణించాడు.

వెంటాడుతుంది కందిరీగ లాగా కుట్టే
కనికరం లేని ఒంటరితనం

అని ముగిసే ఈ కవిత కూడా ఇందులోని మంచి కవితల్లో ఒకటి.

ఈ సంకలనంలో చెప్పుకోదగ్గ మరొక పర్సనల్ పొయెమ్ తన సహచరి గురించి రాసిన ‘ఇప్పటికీ అంతే!’

లెక్కలేనన్ని నా తప్పుల్ని
చురకత్తుల్తో చీల్చేది నువ్వు
నెత్తురోడే గాయాలని
అనురాగ స్పర్శై మాన్పేది నువ్వు

అంటూ ఆసాంతమూ పరస్పర విరుద్ధాంశాలతో సాగే ఈ కవిత భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని సమర్థవంతంగా చిత్రిస్తుంది. ఎప్పుడైనా స్వీయ అనుభవం నుంచి, సన్నిహితులైన వ్యక్తుల గురించి రాసిన పద్యాల్లో కవిత్వం బాగా పలుకుతుందని పై ఉదాహరణలు తెలియజేస్తాయి.

స్వామి కవితల్లో తరచుగా కనిపించే ఒక అంశం స్నేహ రాహిత్యం – ఒక నమ్మకమైన, ధృఢమైన స్నేహం లేకపోవటం. ప్రవాస జీవితం వల్ల కావచ్చు, పైపై పరిచయాలకే పరిమితమయ్యే ఇక్కడి స్నేహాల వల్ల కావచ్చు, ఉద్యమ జీవితంతోబాటు దూరమైన అప్పటి గాఢ స్నేహాల మీద బెంగతో కావచ్చు ఈ అంశం పదేపదే కవితల్లో చోటుచేసుకుంటుంది. అయితే, దీనికి సంబంధించిన అనేక కవితల్లో వర్చువల్ ఫ్రెండ్‌షిప్ మీద, సోషల్ మీడియాలో సంభాషణల మీద అనేకసార్లు అసంతృప్తి వ్యక్తమౌతుంది. ‘చుట్టూ… ఇంటర్నెట్ కప్పుకున్న శరీరాలు’ (కలుద్దామని), ‘ఎవరూ గడపకి అవతల నిలబడి పిలవరూ, గదిలోకి రారూ అంతా వర్చువల్ ఊహాజనితం’, ‘అంతా ఆన్‌లైన్ పద్మవ్యూహల్లో చిక్కుకుపోయామా’ (యెక్కడైనా ఉన్నామా), ‘గిడసబారిన గోటి కొసల సంభాషణల్లో స్పృశించలేని గుండె చప్పుళ్ళు’ (ఆన్‌లైన్) – వంటి వాక్యాల్లో ఇది స్పష్టమౌతుంది. ఐతే, అంతర్జాల పత్రికల్లో విరివిగానే రాసి, తను స్వయంగా కొంతకాలం అటువంటి పత్రిక నడిపి, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో చురుకుగా పాల్గొంటూ, వాటిని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపించే కవి, తన కవితల్లో మాత్రం వాటిపై అసంతృప్తిని ప్రకటిస్తూ రాయటం ఒక వైరుధ్యంగానే తోస్తుంది. జీవన సరళికి, కవితల్లో వ్యక్తమయే వ్యక్తిత్వానికి మధ్య వైరుధ్యాలు ఏ కవిలో ఉన్నా కొంత నిరాశకలిగిస్తాయి.

ప్రవాస కవులు ఇక్కడి ఋతుశోభకి పరవశించి కవితలు రాయటం తరచుగా జరిగే పనే. ఈ రకమైన కవితల్లో, వసంతం గురించి రాసిన కలల దిక్కు అనే పద్యం విశేషమైనది. ‘నింగిని మెరిసే నెమలీకల /వెల్తురు పింఛాల నులి వెచ్చని /వింజామరలు,’ ‘జుట్టు విరబోసుకున్న వీపింగ్ ఛెర్రీ /పూల శోకమై కలబోసుకునే /శతాబ్దాల ముచ్చట్లు’ వంటి అందమైన పదచిత్రాలతో ఈ కవిత అలరిస్తుంది. వింటర్ గురించి రాసిన మంచు కోత, ముఖం చెట్టు కవితలు కూడా బాగున్నాయి.

ప్రవాస కవుల ఋతువర్ణనలు చదివినప్పుడు నాకొక సందేహం కలుగుతుంది – అమెరికాలో ఋతువులే తప్ప ఇక్కడి మనుషులు, వారి జీవన విధానం మన కవులను కదిలించలేదా? అమెరికన్ మట్టి, ఇండియా మనుషులే మన వారికి కవితాయోగ్యంగా కనిపిస్తాయా? అని. ఇక్కడివారి అనుకూల గుణాల గురించే అక్కర్లేదు, వారెదుర్కొనే కష్టాలనైనా ప్రస్తావించవచ్చును. అటువంటి పద్యం ఒకటి స్వామి రాశాడు. దాని పేరు సెలూన్ నల్లపిల్ల. సెలూనులో జుట్టు కత్తిరించే అమ్మాయి చూపుల్నిబట్టి, ప్రవర్తనను బట్టి ఆమె కష్టాల్ని కవి ఊహించటం ఈ కవిత సారాంశం. ఐతే, ఆమె నల్లపిల్లే కానక్కర్లేదు – ఎవరైనా కావచ్చును. జాతి ప్రస్తావన లేకపోతే కవిత మరింత సాధారణీకరించబడేది. (విషయసూచికలో ఈ కవిత పేరు సెలూన్ పిల్ల అని మాత్రమే ఉంది.) ఏది ఏమైనా, యథాలాపంగా జరిగే క్షురకర్మలో ఒక మానవీయకోణాన్ని ఆవిష్కరించటమన్నది మంచి ప్రయత్నమే.

నల్లవారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఇటీవలి కాలంలో వివిధ సంఘటనల్లో జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన నల్ల జాతికి చెందిన వివిధ వ్యక్తుల గురించి రాసిన ‘శరీరాల్ని ప్రవేశపెట్టండి’ గురించి చెప్పాలి. ఉద్దేశం మంచిదే అయినా, ఈ పద్యం వార్తా కథనాల స్థాయిని మించలేదు. ఇలా సంఘటనల్ని ఏకరువు పెట్టేకంటే, ఏ Black Lives Matter వంటి ఉద్యమకారుల ర్యాలీలోనో ప్రత్యక్షంగా పాల్గొని, ఆ అనుభవాన్ని కవితగా రూపొందించి ఉంటే ప్రభావవంతంగా ఉండేది. లేదా, నల్లవారిపై సానుభూతికి అనుగుణంగా స్నేహంతోనో, సేవాభావంతోనో వారు నివసించే ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ వారి స్థితిగతుల్ని మెరుగుపరిచే కార్యక్రమాల్లో పాల్గొని, ఆ అనుభవానికి అక్షరరూపం ఇచ్చినా కొంత విలువ ఉంటుంది.

ఉద్యమ కవితల్లో భాగంగా తెలంగాణా ఉద్యమానికి సంబంధించిన కవితలు కొన్ని ఈ సంకలనంలో చేర్చారు. టైటిల్ పద్యంతో మొదలుకొని, మంచిగున్నవ?, వెయ్యి మొకాల దేవుడు, జీనా హైతో, జోలపాట – ఇలా అనేక కవితల్లో తెలంగాణా ఉద్యమమే అంశం. స్వామి ఇటీవలి తన కవితలలో ఎక్కువగా తెలంగాణా మాండలికం వాడటం కూడా దాని ప్రభావమే అనుకుంటాను. కాని, ఉద్యమ సమయంలో రాసిన కవిత్వం, పాటలు, నాటకాలు మొదలైనవాటికన్నా దాని ఆశయం గొప్పదని అవి రాసిన వారందరూ అంగీకరిస్తారు. అలాంటి ఆశయమే పరిపూర్ణంగా సిద్ధించాక, ఇటువంటి పద్యాలకు నా దృష్టిలో ఏ ప్రాధాన్యతా లేదు. పోనీ, చారిత్రిక దృష్టితో వీటిని చూడవచ్చు గదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. నిజమే, ఏ ఉద్యమానికైనా ప్రతీకగా నిలిచే రచనలు కొన్ని ఉంటాయి. జాతీయోద్యమ కాలం నాటి ప్రసిద్ధ పద్యాలు, గేయాలు, తెలంగాణా సాయుధ పోరాటానికి చెందిన కొన్ని ప్రముఖ రచనలు ఇప్పటికీ మనం మననం చేసుకుంటూనే ఉంటాము. ఐతే, ఇక్కడ చర్చించే వచన కవితలు ఎక్కువగా కవులు తమ ఆత్మసంతృప్తి కోసం రాసుకొనేవి. అంటే, అవి ఉద్యమంతో ప్రభావితమై రాసినవే గాని, ఉద్యమాన్ని ప్రభావితం చెయ్యగలిగేవి కావని నా నమ్మకం.

ఇంతకుముందు సంకలనాలతో పోలిస్తే, స్వామి శైలిలో కొంత పరిణామం, మరింత పరిణతి నాకిందులో కనిపించాయి. పాద విభజనలో, పదాల ఎంపికలో, పదచిత్రాల కూర్పులో ఎంతో నేర్పు కనిపిస్తుంది. ఒక శిధిల సామ్రాజ్య పతనాన్ని ఒకే ఒక పదచిత్రంతో రూపుకట్టిన ఉనికి అనే పద్యం దీనికొక ఉదాహరణ. కాని, అక్కడక్కడ కొన్ని పద్యాల్లో పొంతన కుదరని పదచిత్రాలు దొర్లాయి. ఉదాహరణకి, నువ్వు లేనప్పుడు అన్న పద్యంలో – ‘తవ్వుకున్నకొద్దీ /అడుగు లేని బావిలోకి /ఒక్కొక్క మెట్టు అనేకసార్లు /ఎక్కిపడిపోవడం’ అని ఉంటుంది. నేల కంటె దిగువన ఉండే బావిలోకి మెట్లెక్కి ఎలా వెళతారో నాకర్థంకాలేదు. అలాగే, ఇదీ మొదలు… అన్న కవితలో ‘కాలం కనికరించని క్షణాలెన్నిటినో /దోసిళ్ళలో పట్టుకుని /ఎదురీదినమో!’ అనే వాక్యం. దేనినైనా దోసిలిలో పట్టుకుని ఎదురీదటం సాధ్యమేనా? వొంటరిగా అనే పద్యంలో పదచిత్రాలు అవసరమైన దానికంటే ఎక్కువగా వాడబడ్డాయి. వాటిలో ‘ఆకాశం చెంపల మీంచి రాలే చీకటి క్షణాల అగాధాలు’ అనే పదచిత్రం కూడా సరిగా అతకలేదు.

స్వామి రెండవ సంకలనం సందుకలో, ప్రవాస కవిగా మారాక తొలి సంవత్సరాలలో రాసిన కవితలుంటాయి. Transplantation వల్ల ఏర్పడే ఒక రకమైన అభద్రతా భావం, బెంగ వంటివి ఆ కవితల్లో నిజాయితీగా వ్యక్తమౌతాయి. ప్రస్తుత సంకలనం ఇక్కడ నివాసిగా స్థిరపడ్డాక రూపొందినది. ఇందులో స్నేహరాహిత్యం పట్ల కొంత దిగులు ఉన్నా ఇక్కడ, ఇండియాలోనూ జరిగిన సమకాలీన సంఘటనలకి రాజకీయమైన స్పందన ఎక్కువ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, ఇండియాలో తన ప్రాసంగికతను నిరూపించుకోవాలనే తాపత్రయం కవిలో ఉన్నట్టు నాకనిపించింది. పుస్తకాన్ని రోహిత్ వేములకి అంకితం ఇవ్వటం మొదలుకొని, అనేక కవితలలో ఎన్నుకున్న వస్తువు ఇటువంటి భావం కలగటానికి దోహదం చేసింది.

అమెరికాలో, ఇండియాలో జరిగే ఆయా సంఘటనల గురించి నిరసన పద్యాలు రాసే ప్రవాస కవులు ఒక సందిగ్ధ పరిస్థితి నెదుర్కొంటారని నేననుకుంటాను. తమ తల్లిదండ్రులను, తోబుట్టువులను ఎవరూ ఎంచుకోలేరు. ఇదే సూత్రం కన్న ఊరికి, మాతృదేశానికి కూడా వర్తిస్తుంది. అందుకే, వారిని/వాటిని విమర్శించే అలవాటు సహజంగా ఏర్పడుతుంది. ఇది వారసత్వంగా వచ్చిన జన్మహక్కు. కాని, స్వచ్ఛందంగా, మహాప్రసాదంగా స్వీకరించిన వేరొక దేశ పౌరసత్వం అదే రకమైన హక్కునిస్తుందా? నక్షత్ర ఖచితమైన పతాకం ముందు నిలబడి ప్రతిజ్ఞ చేసినప్పుడు స్వాధీనపరుస్తున్నది కేవలం మాతృదేశ పౌరసత్వాన్నే కాదు, ఇరువైపులా పదును కలిగిన ఒక ఆయుధాన్ని కూడా అని నాకనిపిస్తుంది. ఐతే, ఇది నైతిక ప్రశ్నేగాని, సాంకేతిక సమస్య కాదు. అందువల్ల దానిని ఎదుర్కోవటమా లేదా అన్నది ఆయా వ్యక్తుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది.