రాజేశ్వరీదేవి: చిరునవ్వు కోసం

నడిబజార్లో అడుక్కున్నానొక
చిన్న చిరునవ్వు కోసం సిగ్గులేకుండా
ఒక మొహమాటపు నవ్వు
చూడాల్సి వచ్చింది విషాదంగా

ఒకానొక ఫ్రేమ్‌లో బిగిసిన నవ్వులో
జీవం ఉండదులే పిచ్చిగానీ
ఖైదీలు ఒకవేళ నవ్వినా
జైలర్‌కి భయపడతారు కదా

ఆకలేసి అన్నం అడగలేదు నిన్ను
దాహమై మంచినీళ్ళు అడగలేదు
బట్టల్లేక దుస్తులూ అడగలేదు
ఒఖ్ఖ చిరునవ్వు అడిగాను
బజారులో సిగ్గులేక

హృదయం నిండదు
ఎంతకీ తీరని దాహమైంది
వేదనలా పట్టిన ముసురు మనసుకి

ఆకాశానికి
బట్టలు తొడిగేంత నాగరికత వాళ్ళది
తెలుసా మరి ఏమనుకున్నావో!