దండోరా

డడ్ డడ్ లబ్ డబ్ లబా డబ్
అదే డప్పు చప్పుడుతో
ఉరుకులూ పరుగులుగా
తేనెచుట్టు ఈగల్లా మేం.

ఊరి చివర వాడలో
ఒంటరిగా ఉంటాడు
డప్పు మోగమంటేనే
ఊరు లోకి వస్తాడు.
ఆదివారం దండోరా!
పాములోయ్ పహారా!
బుడ్డోడిది డప్పు దరువు
వెంబట్నే చిందేస్తూ మేం.

పుల్లనైన చద్దికూడు
చిటికెడంత ఉప్పుతో
దోసెట్లో పట్టినంత
నిలబడి తిని అట్లాగే
డప్పు ఆగకుండానే
వాడ వాడ తిరుగుతుంటే
రాజు వెనుక సైన్యంలా మేం.

ఆగని సంబరం జాతరే లోకం.
పాములోళ్ళ బండ్ల వెనుక
వెతికే పెద్దాళ్ళ నుంచి
కందినతో గడ్డాలూ
మీసాలూ వేషాలూ
కల్లుతాగినోళ్ళలా మేం.

గడిచిపోతూ సూరీడు
వెళ్ళిపోతూ బుడ్డోడు
రేపేమో ఎక్కడో
పూటకూడు ఏమిటో
పొట్టమీద గమ్ముగా
కప్పుకున్న డప్పుతో
పొలిమేరకి దాపులో
ముందుకెళ్తూ వాడు.
వెనక్కి తిరిగి చూస్తూ
వెనక్కి తిరిగొస్తూ మేం.