యేమో!?

ఆరాటమే వూపిరైన
మనసుకు,
ప్రేమై శ్వాసించడం తప్ప
ఇంకేం తెలుసు?

కలగా కరిగే చూపుకూ
భావమై మిగలడం తప్ప
మాటాడటం యేం తెలుసు?

అందని వెన్నెల జాబిలి
అనంతదూరాల నుంచే
ఆనందమేమో!

దగ్గరై నిలచి
సంభ్రమమో, సందిగ్ధమో అయేకన్న
ఆవిరి రూపమై
మరలే యింద్ర ధనువవడమే
అందమేమో!

కొన్ని భావాలు భ్రమలుగా
మారనంతవరకే
బాగుంటాయేమో!
ప్రశ్న నుంచీ ఆశ్చర్యమవడం
మరింత సందిగ్ధమేమో!