చిత్రకవిత్వరీతులు

చతుర్విధకవిత్వములు

కవిత్వము ఆశు, మధుర, విస్తర, చిత్రకవితలను నాలుగు విధములుగా ఉండునని లాక్షణికుల అభిప్రాయము.

  1. ఆశుకవిత్వమనగా అడిగిన వెంటనే నిరర్గళముగా చెప్పెడి కవిత్వము. అష్టావధాన, శతావధానములు, ఘటికాశత ప్రబంధాదికల్పనలు ఈకోవకు చెందినవి.
  2. దేశికవితాభేదములగు పదములు, గేయములు, కీర్తనలు, రగడలు మున్నగునవి మధురకవిత్వమున కుదాహరణములు.
  3. విస్తారమైన ప్రబంధ, కావ్య, పురాణరచనలు విస్తారకవిత్వమున కుదాహరణములు.
  4. శబ్దవర్ణచిత్రరచనలు, బంధకవిత్వములు చిత్రకవిత్వమున కుదాహరణములు.

ఏకాక్షరి, ద్వ్యక్షరి, పాదభ్రమకము, పాద గోపనము, నిరోష్ఠ్యము, నిర్దంత్యము, నిష్కంఠ్యము, నిస్తాలవ్యము, అనులోమవిలోమాదులు, ప్రహేళికలు మున్నగునవి శబ్దచిత్రముల కుదాహరణములు. అట్లే ఒక పద్యములో ఇతరవృత్తముల నిమిడించుట, చక్రము, పుష్పమాలిక, పద్మము, కంకణముల వంటి చిత్రములలో పొదిగించిన అక్షరములతో పద్యము నల్లుట బంధకవిత్వమున కుదాహరణములు. శబ్దప్రధానములైన అనుప్రాసయమకాదులు కూడ చిత్రకవిత్వమునకు సంబంధించినవే. దండి కావ్యాదర్శములోను, భోజుని సరస్వతీకంఠాభరణములోను వివిధములైన చిత్రకవిత్వలక్షణములు విపులముగా వివరింపబడినవి.

ఆశుచిత్రకవిత్వ ప్రధానాశయము వినోదమే. చిత్రకవిత్వమును కవి ముఖ్యముగా తన పాండిత్యప్రకర్షను ప్రదర్శించుకొనుట కనేక నిర్బంధములకు లోనయి వ్రాయుట జరుగుచున్నది. ఇట్టి నిర్బంధములకు లోనయినను, చక్కని పద్యము నల్లిన కవి యొక్క మేధాశక్తి విస్మయావహముగా నుండుటయు, అట్టి మేధాశక్తికి పాఠకుడు అబ్బురమును, ఆనందమును పొందుటయు ఇట్టి కవిత్వము యొక్క ప్రధాన ప్రయోజనము. ఉత్తమ కావ్యలక్షణములుగా లాక్షణికులు నిర్దేశించిన వ్యంగ్యవైభవము, రసపోషణావకాశము లిందులో నిమిడించుట తరచుగా కష్టసాధ్య మగుటచే నిట్టి కవిత్వ మధమకవిత్వముగా పరిగణింపబడుచు వచ్చినది. ఐనను ఇట్టి కవిత్వమును వ్రాయుటకు అసాధారణభాషాపాండిత్య మవశ్యమగు చున్నదనుటలో సందేహము లేదు. గర్భబంధకవిత్వములు శబ్దక్రమప్రధానములై రసపోషణకనువుగా లేకుండుటచే ఇవి కావ్య శరీరమునకు కణితులవంటివని లాక్షణికు లభిప్రాయపడినారు.

అనుప్రాసయమకాదులును శబ్దప్రధానములైనను, సమర్థులైన కవిపుంగవులు వీనిని రసభంగము కాకుండ ఉపయోగించి కవిత్వమున కత్యంతశోభను చేకూర్చినారు. ముఖ్యముగా మధుర కవిత్వములో నీయలంకారములు కర్ణపేయములై శ్రోత్రానందమును గూర్చుచున్నవి. కవిప్రతిభచే, భాషాపటుత్వముచే ఇవి అయాచితముగా, స్వాభావికముగా చేకూరినచో కావ్యముయొక్క అందము నధికమొనరించుటయే కాక రసపుష్టికి తోడ్పడు నవకాశము గలదు. భోజుడు అనుప్రాసః కవిగిరాం పదవర్ణ మయోఽపి యః, సోఽప్యనేన స్తబకితః శ్రియం కామపి పుష్యతి అన్నాడు. కవివాక్కులలో పదవర్ణమయమైన అనుప్రాసము కావ్యములో పొంది పొసగి కావ్యశోభను పోషించును – అని దీని కర్థము. ఇట్లీ అలంకారములను సమర్థముగా నిర్వహించిన వారిలో పోతన, రామరాజభూషణులను అగ్రేసరులుగా నెన్నవచ్చును. సురభి మాధవరాయలు చంద్రికాపరిణయమందలి చతుర్థాశ్వాసము నంతయు యమకమయముగా చేసినాడు. కాని ఈ నిర్బంధమువల్ల రసపోషణకు కొంత ఆటంక మేర్పడినట్లు తోచుచున్నది. గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో ప్రతిపద్యమును ఏదో యొక చిత్రకవిత్వలక్షణమునకు లక్ష్యముగా సాగినది. ఇందులో చిత్రకవిత్వ ప్రదర్శనము పరాకాష్ఠనందినది. నన్నెచోడుడు, ముక్కుతిమ్మన, పింగళి సూరన, పినవీరనాది ఇతరకవులును తమ పాండితీప్రకర్ష చాటుకొనుటకై కొన్ని పద్యములను చిత్రాలంకారయుతముగా వ్రాసినారు.

సంస్కృతములో ఆదికవి వాల్మీకి సుందరకాండ యందలి పంచమసర్గమంతయు అంత్యప్రాసతో నలంకరించినాడు. మాఘుని శిశుపాలవధలోని ఆఱవసర్గము, కాళిదాసు రఘువంశమునందలి నవమసర్గము యమకమయములై యున్నవి. వేంకటాధ్వరి లక్ష్మీసహస్రములో యమకస్తబకము, చిత్రస్తబకము అను ఆశ్వాసములందలి శ్లోకములన్నియు యమక, బంధకవిత్వమయములై యున్నవి. మహాకవి భారవి, రూపగోస్వామి మున్నగు వారి గ్రంథములలోను చిత్రకవిత్వోదాహరణము లెన్నియో యున్నవి. ఇట్లు సంస్కృతకవు లావిష్కరించిన మార్గములోనే తెలుగుకవులును పయనించినారు.

చ్యుతాక్షర, దత్తాక్షర, చ్యుతదత్తాక్షర ప్రహేళికలు

చిత్రకవిత్వము నందలి ప్రక్రియలలో ప్రహేళిక యనునదొకటి. ఇది తెలుగులో పొడుపుకథ వంటిది. ఇది రసపోషణసమర్థము గాకున్నను ఉక్తివైచిత్రితో వినోదమును కల్గించు నలంకారము. లాక్షణికు లిందులో పలురకములను గుర్తించినను, ప్రస్తుతవ్యాస పరిధిలో చ్యుతాక్షర, దత్తాక్షర, చ్యుతదత్తాక్షరము లనెడు మూడురకములను గుఱించి తెలిసికొనిన చాలును. వీనికి నీక్రింద నిచ్చిన ఉదాహరణములన్నియు భోజసార్వభౌముని సరస్వతీకంఠాభరణమునుండి గ్రహింపబడినవి.

1. చ్యుతాక్షరప్రహేలిక:ఉండవలసిన అక్షరమును వదలిపెట్టి చెప్పిన యెడల అది చ్యుతాక్షరప్రహేలిక యగును. దీనికి ఉదాహరణము:

పయోధరభరాక్రాంతా సంనమంతీ పదేపదే
పదమేకం న కా యాతి యది హారేణ వర్జితా.

పయోధరముల భారముచే నాక్రమింపబడినదియు, అడుగడుగునకు వంగుచున్నదియు నైన ఏది హారరహితమైనచో ఒక్క అడుగు కూడ కదలకుండును? – అని పై ప్రహేళిక కర్థము. ఈ శ్లోకములో విశేషణములు స్త్రీలింగములో నుండుట చేతను; పయోధర, హార, సంనమంతీ, అను శబ్దముల చేతను; స్తనములును, వానిపై నలంకృతమైన హారమును, పయోధరభారముచే వంగుచు నడుగిడుచున్న అంగనయు స్ఫురించుట సహజము. కాని అట్టి స్త్రీ హారవర్జితయైనచో ఒక్క అడుగును ముందుకు సాగకుండుట యేమి? ఇది అర్థవంతముగా లేదు. అందుచేత పయోధర శబ్దమునకు వేఱగు అర్థముండవలెను. దుగ్ధం క్షీరం పయ స్సమమ్ — అని అమరకోశము. అందుచేత పయస్సనగా పాలు, పయోధరము లనగా పాలను ధరించినవి – పాలకుండలు. ఈ పాలకుండలచే నాక్రాంతమైన వస్తువేదో అడుగడుగునకు వంగుచున్నది. అట్టి వస్తువు కావడి యగుట సహజము. కాని కావడి హారము లేక ఒక్క అడుగైనను ముందుకు సాగకుండుట యేమి? కావడికి, హారమునకు గల సంబంధ మేమి? అని యోచించినచో కావడి మోపరి లేకున్నచో కావడి ఒక్క అడుగైనను ముందునకు సాగదనుట స్పష్టము. సంస్కృతములో కాహారః అను పదమునకు కావడిమోపరి యని అర్థము. అందుచేత కాహార అను పదములో చ్యుతమైన (తొలగింపబడిన) కా-అక్షరమును హార-కు చేర్చుకొని, ఈ ప్రహేళికలో సూచితమైన వస్తువు ‘కావడి’ యని గుర్తింపవలెను.

2. దత్తాక్షరప్రహేలిక:
అవసరము లేనిచోట అదనపుటక్షరమును చేర్చినయెడల అది దత్తాక్షరప్రహేలిక యగును. దీని కుదాహరణము:

కాంతాయానుగతః కోఽయం పీనస్కంధో మదోద్ధతః
మృగాణాం పృష్ఠతో యాతి – శంబరో రూఢయౌవనః

బలసిన మూపులు గలవాడును, మదగర్వితుడును, స్త్రీచే అనుగమింపబడినవాడును, మృగములవెంట (అడవి జంతువుల వెంట) జనుచున్నాడు. అతడెవ్వడు? యౌవనవంతుడగు శంబరుడు. – అని పై శ్లోకమున కర్థము. ఈవర్ణనను జూడ నది వేటకాని వర్ణనవలె నున్నది. శ్లోకములో నతడు ‘శంబరు’ డని పేర్కొనబడినాడు. శంబరు డనగా వేటకాడా? మృగ దానవ బౌద్ధేషు శంబరః –- అని నానార్థరత్నమాల. అనగా శంబరశబ్దమునకు ఒకజాతిలేడి, శంబరుడను రాక్షసుడు, బౌద్ధుడు అను అర్థము లున్నవి. వేటకాడను అర్థము లేదు. కాని, కిరాత శంభూ శబరౌ అని శబరశబ్దమునకు కిరాతుడు (వేటకాడు) అనియు శివుడనియు అర్థము లున్నవి. ఇట్లు పరిశీలింపగా వినోదార్థము శ- తర్వాత అనవసరమైన అనుస్వారమును చేర్చి పై ప్రహేళికను నిర్మించినట్లు తేటపడుచున్నది. అందుచే, పై ప్రహేళకలోని శంబర-ను శబర-గా మార్చి అర్థవంతముగా పరిష్కరింపవలెను.

3. చ్యుతదత్తాక్షర ప్రహేళిక: ఉండవలసిన అక్షరమును తొలగించి, దాని స్థానములో వేఱొక అక్షరమును వేసినయెడల నది చ్యుతదత్తాక్షర ప్రహేళిక యగును. దీని కుదాహరణము:

విదగ్ధః సరసో రాగీ నితంబోపరి సంస్థితః
తన్వంగ్యాలింగితః కంఠే కలం కూజతి – కో విటః

పండితుడును, సరసుడును, అనురాగవంతుడును, నితంబ మాధారముగా నిల్చినవాడును, స్త్రీచే కౌగిలింపబడిన కంఠము గలవాడును, మధురముగా కూయుచున్నవాడును ఎవడు? విటుడా? – అని పై శ్లోకమున కర్థము. ఇందులో – విదగ్ధః, సరసః, రాగీ, ఇత్యాదివిశేషణము లన్నియు పుంలింగములో నున్నవి. అందుచే వీనిచేత బోధింపబడు వ్యక్తి విటుడా యని ప్రశ్నించుట కవకాశము కల్గినది. కాని పైవిశేషణము లన్నియు నీటికుండకును సరిపోవుటచే, అట్టి నీటికుండనే సూచించుట ఈ ప్రహేళికా లక్ష్యము. ఘటః అను పదములోని ఘ-కు బదులు వి- అను అక్షరము వేయబడినదని గుర్తించినచో ఈ ప్రహేళికకు పరిష్కార మగును. విదగ్ధః అనగా, పండితుడనియు, బాగుగా కాల్చినదనియు, రాగి యనగా అనురాగవంతుడనియు, ఎఱ్ఱగానున్న దనియు; సరసః అనగా సరసుడనియు, నీటితో కూడినదనియు అర్థములు. నీటికుండను నితంబముపై నానించుకొని, దాని మెడచుట్టును చేతిని జేర్చి స్త్రీలు గొనిపోవుచుండ నందులో నీరు శబ్దించుచుండుట సహజము. ఇట్లు, ఘటః అను పదములోని ఘ-ను చ్యుతము చేసి (తొలగించి), దాని స్థానములో వి-ని దత్తము చేయుట (కూర్చుట)వల్ల ఈ ప్రహేళిక చ్యుతదత్తాక్షరప్రహేళిక యైనది.

పైవిధమైన శబ్దచిత్రములు ప్రహేళికలకే పరిమితము గానక్కఱ లేదు. సమర్థులైన కవులు ఇటువంటి వర్ణచిత్రములను కావ్యములలో కొన్నిచోట్ల విశేషార్థపరికల్పనకై చొప్పించినారు. చంద్రికాపరిణయములోని ఈక్రింది పద్య మిట్టిదానికి ఉదాహరణముగా గమనింపవచ్చును.

అనలమ హీన మై యెసఁగె నౌర త్వదుద్ధతశౌర్యలక్ష్మిచే,
ధనదుఁడు వొందెఁ దా ధర హితస్థితిఁ దావకదానవైఖరిం
గని, యచలవ్రజంబును ముఖస్ఫుటవర్ణవియుక్తిఁ గాంచె నీ
ఘనతరధైర్యవైభవము గన్గొని, మాధవరాయ చిత్రతన్.
(1-68)

ఇది సభాసదులు సురభి మాధవరాయల శౌర్యమును, త్యాగగుణమును, ధైర్యమును గుఱించి చెప్పిన పద్యము. మాధవరాయా! నీశౌర్యలక్ష్మి యెదుట అగ్నితేజమే అల్పమై తోచెను; నీ దానవైఖరి గాంచి (దానగుణమున నీచే జయింపబడినవాడు గనుక, నీయందు విధేయతతో), ధనదుడు (కుబేరుడు) (నీవు పరిపాలించు) ధరయందు హితవైఖరి బూనెను – నీరాజ్యము సంపన్నత గాంచెనని యర్థము; ఘనతరమగు నీధైర్యవైభవమును గని పర్వతములు ముఖమున వివర్ణతను పొందెను. ఇందతయు చాలా చిత్రముగా నున్నది. – అని పై పద్యమున కర్థము. ఇక్కడ, చిత్రతన్ అనుటలో అద్భుతమైన శబ్దచిత్రము సంకేతితమగుచున్నది. ఆ శబ్దచిత్రముతో అనల, ధనద, అచలాదుల కెట్లు న్యూనత కల్గెనో కవి యిట్లు చూపుచున్నాడు:

  1. అనలమహీనమై (అనలము + అహీనమై), అనఁగా అనలములోని అ-కారము హీనము (నష్టము) కాఁగా, అది (నీ శౌర్యలక్ష్మి ముందు) నలమై పోయినది. నల మనఁగా గడ్డిపోఁచ. అనగా నీ శౌర్యము ముందు అగ్నితేజము తృణప్రాయమైనదని అర్థము.
  2. ధనదుఁడు ధరహితస్థితిన్, అనఁగా ధ-కారము లేని స్థితిని పొందుటచే నదుఁ డయ్యెను. న దదాతీతి నదః – అను నిర్వచనము ప్రకారము ఏమియు నియ్యని వాఁడని పేరు నొందెను. అనఁగ నీదాతృత్వముతో బోల్చిన కుబేరుడు అసలు ఏమియు దానము చేయని వాని వలెనే తోచెను.
  3. అచలవ్రజంబు = పర్వతసమూహము, ముఖస్ఫుట = ఆదియందు స్ఫుటముగా నున్న, అనఁగాఁ దొలివర్ణముగానున్న, వర్ణ = అ-వర్ణము యొక్క, వియుక్తిన్ = వియోగము చేత చలవ్రజ మయ్యెను. ధైర్యస్థులను చలనములేని పర్వతములతో బోల్చుట పరిపాటి. కాని నీ ధైర్యమును గని చలింపని అచలములు (పర్వతములు) తమ పేరులోని అ-కారమును గోల్పోయి చలములు (చలించునవి) అయ్యెను. అందుచే చలించెడి యా పర్వతములకంటె చలింపని నీ ధైర్యమే మిన్నగా నున్నది.