తానొకటి తలచిన…

మర్నాడు ఒక గంట ఆఫీసులో అనుమతి తీసుకొని పన్నెండు గంటలకి ఇంటికి వచ్చి వంట చెయ్యడానికి ఉపక్రమించాడు. తేలికగా అవుతుందని, పిల్లలకి కూడా ఇష్టమని బంగాళాదుంప వేపుడు మొదలుపెట్టాడు. దుంపల తోలు తీసి, ముక్కలుగా తరిగాడు. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఇంత నూనె వేసి, పక్క బర్నర్‌పై కుక్కర్‌లో బియ్యం వేసి నీళ్ళు పోశాడు. తరిగిన బంగాళా దుంప ముక్కలని మూకుడులో వేశాడు. దుంప ముక్కలని ఒంటరిగా వేయించడం భావ్యం కాదని భావించి ఒక ఉల్లిపాయ తరిగి ముక్కలు అందులో వేశాడు. ఐదు పెద్ద బంగాళా దుంపల ముక్కలకి ఒక్క ఉల్లిపాయ సరిపోదేమోనని అనుమానం వచ్చి ఇంకో పెద్ద ఉల్లిపాయ తరిగి ముక్కలు అందులో వేశాడు. అహహా, వంట చేయడం ఇంత సులువా! అని ఆశ్చర్యపడ్డాడు.

ఇంతలో బెడ్‌రూమ్‌లోంచి ప్రభావతి, “ఆ వేపుడు బర్నర్ సిమ్‌లో పెట్టండి!” అని అరిచింది. సరే అని బర్నర్ మంట కొద్దిగా తగ్గించాడు కానీ సిమ్‌లో పెట్టలేదు.

డ్రాయింగ్ రూములోకి వచ్చి కర్ణాటక సంగీతం పాటల కేసెట్ పెట్టాడు. “ఎందరో మహానుభావులు ఈవిడ కూడా పాడిందా?” అని ఆశ్చర్యపడ్డాడు.

“ఈ పాట పాడితే బాల మురళీ కృష్ణ యే పాడాలి కానీ ఈవిడ పాడడమేమిటీ?” అని చిరాకుపడ్డాడు.

“ఎవరు పాడితే ఏం గానీ, ముందు ఆ వేపుడు సంగతి చూడండి. రెండు మూడు మాట్లు కలేపెట్టండి.” అంది ప్రభావతి.

“వెర్రి వదనమా, వేపుడులో శాస్త్ర సూక్ష్మం గ్రహించాలి. బంగాళా దుంపలు, ఉల్లిపాయలు ఒకే ఉష్ణోగ్రతలో వేగు సమయములు వేరు వేరు. మూకుడు నుంచి బంగాళా దుంపలు వేడిని గ్రహిస్తాయి. పైన ఉన్న ఉల్లిపాయలు బంగాళాదుంపల నుంచి వేడిని దొంగిలిస్తాయి. అప్పుడే అవి సరిగ్గా ఉడుకుతాయి. సరిగ్గా ఉడికేదాకా కలియపెట్టరాదు. అది శాస్త్ర విరుద్ధము.” అని ప్రద్యుమ్నుడు బోధించాడు ప్రభావతికి.

ప్రభావతి నెత్తీ నోరూ మొత్తుకుంది. చేతులు గాల్లో తిప్పింది, కేకలేసింది. కానీ ప్రద్యుమ్నుడు వినలేదు. కర్ణాటక సంగీతంలో మునిగిపోయాడు. నాలుగయిదు నిముషాల తరువాత వెళ్ళి కలియపెట్టి వచ్చాడు. కొద్ది సేపటికి కుక్కర్ కూత కూసింది. మళ్ళీ వెళ్ళి కుక్కర్ సిమ్‌లో పెట్టి బంగాళా దుంపలనింకోమాటు కలియపెట్టి నలుపు రంగుకి మారిన వాటి కేసి చూసి, ఇదేదో శాస్త్ర విరుద్ధంగా ఉందే! అనుకున్నాడు. ఎందుకైనా మంచిది అనుకొని ఇంత ఉప్పూ కారం వేసి మరోమారు కలియపెట్టి స్టవ్ ఆర్పి మూకుడు దించేశాడు. ఇంకో రెండు కూతలు తర్వాత కుక్కరు కూడా కట్టేశాడు.

ఒక పదిహేను నిముషాలు అవి చల్లబడడానికి వదిలి ఆఫీసుకి వెళ్లిపోయాడు ప్రద్యుమ్నుడు. ప్రభావతి 2.30 గం.లకి పిల్లలు వచ్చిన తరువాత వారితో కలిసి తింటానని చెప్పింది.

సాయంకాలం ఆరు గంటలకి ప్రద్యుమ్నుడు ఇంటికి వచ్చేటప్పటికి హడావుడిగా ఉంది. సైకియా ఆంటీ, పిళ్లై ఆంటీ, గోస్వామి ఆంటీ, నంబియార్ ఆంటీ ఇంట్లో ఉన్నారు. ప్రద్యుమ్నుడిని చూసి మందహాసాలు, చిరునవ్వులు ఒలికించారు. నంబియార్ ఆంటీ అట్టహాసం చేసింది.

“సైంటిఫిక్‌గా వేపుడు చేశావట కదా?” సైకియా ఆంటీ నవ్వింది. “అన్నం కూడా చిల్లు గరిటతోనే వేసుకున్నారట పిల్లలు!” నంబియార్ ఆంటీ పెద్దగా నవ్వింది. “కొన్ని ముక్కలు నల్లబడి గట్టిగా, కొన్ని నల్లబడినా ఉడకక, అంత సైంటిఫిక్‌గా ఎలా వేయించగలిగావు ప్రద్యుమ్నా!” గోస్వామి ఆంటీ తెరలు తెరలుగా నవ్వింది. “చూస్తే దుంప ముక్క ఏదో ఉల్లిపాయ ముక్క ఏదో తెలుసుకోవడం కష్టంగానే ఉంది సుమా!” పిళ్లై ఆంటీ ఆశ్చర్యపడిపోతూ నవ్వింది.

“నువ్వు ఇంక వంట చెయ్యద్దు నాన్నా. ఆ మెస్ నుంచే మధ్యాహ్నం కేరియర్ తెచ్చుకుందాం ప్లీజ్!” అని పిల్లలు దీనవదనులై అభ్యర్ధించారు. ప్రభావతి వారికి వంతపాడింది. చేసేది లేక ప్రద్యుమ్నుడు ఒప్పుకున్నాడు. ఆ విధంగా ప్రద్యుమ్నపాకం కథ ముగిసిపోయింది. అప్పటి నుంచి ప్రద్యుమ్నుడు వంట జోలికి వెళ్లలేదు.


బీరుమగ్గులో కాఫీ అయిపోయింది. గతం నుంచి బయటపడి, స్నానపానాదులు (ఇంకో మారు కాఫీ) ముగించుకొని పన్నెడుంబావుకి రోడ్డున పడ్డాడు ప్రద్యుమ్నుడు హోటల్ కెళ్లడానికి. తనొకటి తలుస్తే భగవంతుడు మరొకటి చేస్తాడనే సూత్రం మరచిపోయాడు ప్రద్యుమ్నుడు. ఎనభై రూపాయల భోజనం కోసం ఆటోకి రానూ పొనూ వంద రూపాయిలు ఇవ్వడం మూర్ఖత్వం అని భావించి షేర్ ఆటో కోసం వేచి చూశాడు. ఆ పొదుపు పథకం వికటించింది. ఆటో కోసం ఎదురు చూస్తుండగా ఇంతలో పక్క వీధిలోంచి సునంద వచ్చింది. సునంద, సుధాకర్లు ప్రద్యుమ్నుడి పక్క వీధిలో ఉంటారు. పెళ్ళయి రెండేళ్ళు అవుతోంది. ప్రభావతికి సునంద దూరపు స్నేహితురాలు. అంటే ప్రభావతి ఫేసుబుక్కు ఫ్రెండుకి సునంద ఫేసుబుక్కు ఫ్రెండు. ఆ విషయం సునంద ఈ కాలనీకి వచ్చిన తరువాత ఎవరింట్లోనో జరిగిన వరలక్ష్మీ వ్రత కబుర్లలో తెలిసింది. అప్పటినుంచి కొద్ది కొద్దిగా దూరం తగ్గించుకుంటున్నారు ఫేసుబుక్కు కబుర్లతో. ప్రద్యుమ్నుడిని చూస్తూనే అడిగింది సునంద.

“ఎక్కడికి అంకుల్, మిట్టమధ్యాహ్నం బయల్దేరారూ?”

“హోటల్‌కమ్మా. భోజనం చేయడానికి.”

“ఆంటీ లేదా అంకుల్? ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడొస్తారు? మొన్న కలిశాం చెప్పలేదు.”

“లేదమ్మా, ఇక్కడే ఉంది. తల్లీ, కూతురు, పిల్లలు వీసా కోసం వెళ్లారు. హడావిడిగా వెళ్లడంతో వంట చెయ్యడం కుదరలేదు.” వివరణ ఇచ్చుకున్నాడు ప్రద్యుమ్నుడు.

“హోటల్‌కెందుకు, మా ఇంటికి రండి భోజనానికి.” ఆహ్వానించింది సునంద.

“వద్దులే తల్లీ! నీకెందుకు ఇప్పుడు నాకు వంట చేసే ప్రయాస?”

“లేదు అంకుల్, ఏమీ చెయ్యఖ్ఖరలేదు. సుధా మధ్యాహ్నం భోజనానికి వస్తానన్నాడు. ఇద్దరికీ చేశాను. ఇంతక్రితమే ఫోన్ చేశాడు రానని. ఏదో పని పడిందిట. అందుకని రండి.” అని బలవంతపెట్టింది.

మొహమాటపడుతూనే సునందతో వాళ్ళ ఇంటికి వచ్చాడు ప్రద్యుమ్నుడు.

“కూర్చోండి అంకుల్, ఒక్క ఐదు నిముషాలు. కూర, సాంబారు వెచ్చచేస్తాను. అన్నం వేడిగానే ఉంది.” నవ్వుతూ చెప్పింది సునంద.

“ఏం కూర చేసేవమ్మా?” యథాలాపంగానే అడిగాడు ప్రద్యుమ్నుడు.

“వంకాయ అంకుల్. మీకు వంకాయ అంటే చాలా ఇష్టంట కదా. ఆంటీ ఫేసుబుక్కులో పోస్ట్ పెట్టారు. నేను లైక్ కొట్టాను. కామెంటు కూడా పెట్టాను.” హుషారుగా చెప్పింది సునంద.

“ఎలా చేశావమ్మా వంకాయ?” ఆనందంగానే అడిగాడు ప్రద్యుమ్నుడు.

“కొత్త రకంగా. కొత్త పేరు కూడా పెట్టాను. ఇటాలినా ఇండియానా ఎగ్‌ప్లాంట్ కర్రీ.”

“అదేదో అమెరికా రాష్ట్రం కదా తల్లీ?”

“ఇటలీకి నా పెట్టాను కదాని ఇండియాకి కూడా నా పెట్టాను. అంతే. ఆ రాష్ట్రానికి ఏమీ సంబంధంలేదు. ఇటలీ వంటకానికి ఇండియా రుచులు కలిపి చేశాను. కొత్త కొత్త వంటకాలు చేయడం నా హాబీ అంకుల్.” ఉత్సాహంగా చెప్పింది సునంద. కిచెన్‌లోకి వెళ్ళింది అంతే ఉత్సాహంగా.

హతాశుడయ్యాడు ప్రద్యుమ్నుడు. ఎడమకన్ను, కుడికాలు, ఎడమచేయి, కుడి చెవి అన్నీ అదిరాయి అదే వరుసలో. కంచంలోకి ఏ రూపంలో వంకాయ వస్తుందోనని భయపడ్డాడు.

ఇంకో మూడు నిముషాలకి సునంద పిలిచి వడ్డించింది ప్లేటులో. అనుమానంగానే చూశాడు ప్రద్యుమ్నుడు, ఇటాలినా ఇండియానాని. నిలువుగా నరికిన పెద్ద పెద్ద వంకాయ ముక్కలకి తోడుగా ఎర్రగా తెల్లగా చిక్కటి ద్రవం, పేస్ట్‌లా ఉంది ప్లేటులో.

“ఏమేం వేశావమ్మా ఇందులో?” అయోమయంగా అడిగాడు గొంతు ఎండిపోతుంటే.

“బేక్ చేసిన వంకాయ ముక్కలు ఆలివ్ ఆయిల్‌లో లైట్‌గా వేయించి, టమాటో ప్యూరి తగిలించి, పచ్చిమిరపకాయ పీసెస్, అరగ్లాసుడు మిల్క్‌లో కలిపి ఉడికించి, మూడు స్పూన్స్ కర్రీ పౌడర్ వేసి, ఉప్పు, కారం వేసి, పోపు పెట్టి, పైన నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం చల్లాను.” చల్లగా చెప్పింది సునంద.

ధైర్యంగా తినబోతున్న ప్రద్యుమ్నుడిని ప్లేటుతో సహా, కూర ప్లేటు ఫోటో కూడా తీసింది.

“మీరు తిన్నారని తెలిస్తే చాలామంది లైకులు కొడతారు.” అంటూ అప్పటికప్పుడు ఫేసుబుక్కులో పోస్ట్ చేసేసింది.

కష్టపడి ఒక చిన్న ముక్క అన్నంలో కలుపుకొని నోట్లో పెట్టుకున్నాడు ప్రద్యుమ్నుడు. నాలిక మీద రుచి గ్రంధులు ఒక్కమాటు తిరుగుబాటు చేశాయి. మెదడులో పధ్నాలుగు భువనాలు గిర్రున తిరిగాయి. తిరిగి మళ్ళీ కూర రుచి దగ్గరికొచ్చి ఆగాయి.

“బెల్లం కూడా వేసేవా తల్లీ?” నీరసంగా అడిగాడు.

“భలే కనిపెట్టేశారండీ. ఇందాకా చెప్పడం మరిచిపోయాను. రుచి భలే పట్టేస్తారు మీరు. ‘ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మగారు చేసిన వంకాయ కూర రుచి ఇప్పటికీ మా ఆయన నెమరువేసుకుంటారు’ అని ప్రభావతిగారు పెట్టిన పోస్ట్ నిజమేనన్నమాట!” అని ఆశ్చర్యపోయింది సునంద.

“సాంబారు వేస్తారా?” అడిగాడు ప్రద్యుమ్నుడు.

“అప్పుడేనా, ఒక ముక్కే కదా మీరు తిన్నది. మొహమాటపడకండి అంకుల్!” అంటూ ఇంకో రెండు ముక్కలు వేసింది సునంద.

తినలేక, బయటకు రావడానికి శతధా ప్రయత్నిస్తున్న ఇటాలినా ఇండియానాని గొంతులోంచి బయటకు రాకుండా చేయటానికి నానా అవస్థలు పడుతూ, మంచినీళ్ళతో ఉదరకోశంలోకి పంపుతూ, ఎలాగో ఆ ముక్కలు నాలికకు తగలకుండా గొంతులోంచి పొట్టలోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు, అతి కష్టం మీద ప్రద్యుమ్నుడు.

ఆవిడను అడగకుండా ఇంత పెరుగు ప్లేట్లో కుమ్మరించుకొని భోజనం అయిందనిపించాడు. చేతులు కడుక్కుని, ఆవిడకు ధన్యవాదాలు చెప్పి బయటపడ్డాడు వాళ్ళ ఇంట్లోంచి.

రెండు అడుగులు వేశాడో లేదో, ‘హే కృష్ణా ముకుందా ము…’ అంటూ సెల్.

“ప్రముఖ శాస్త్రవేత్త, మన ప్రభావతిగారి ధర్మపతి, శ్రీ డా. ప్రద్యుమ్నుడుగారు ఆస్వాదిస్తున్న నా కొత్త వంటకం ఇటాలినా ఇండియానా ఎగ్‌ప్లాంట్ కర్రీ. వివరాలు, రెసిపి కొద్ది సేపట్లో!” అంటూ మీ ఫోటోతో సహా ఆ వంటకం ఫోటో ఫేసుబుక్కులో పెట్టింది సునంద. మీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, ఆవిడ ఫ్రెండ్స్ లైకులు కొట్టేస్తున్నారు. పది నిముషాల్లో 32 లైకులు వచ్చాయి.” పగలబడి నవ్వింది ప్రభావతి.

“ఆ పోస్ట్ అమ్మాయి షేర్ చేసింది. నేను కూడా షేర్ చేస్తున్నాను. మీ పని ఇక ఇదే. రోజుకొకరు మీకు ఇలా కొత్త రుచులు చూపిస్తారు. ఇంటికొచ్చి మరీ తినిపించిపోతారు. మాతో రావయ్యా మగడా అంటే బీరాలు పోయారు. ఇప్పుడు తిక్క కుదిరిందా….” అంటూ ప్రభావతి ఇంకా ఏదో చెప్పబోతుంటే కోపంతో, భయంతో, బాధతో అసహాయుడైన ప్రద్యుమ్నుడు సెల్ కట్ చేసి మెడికల్ షాపు వైపుకు నడిచాడు ముందు జాగ్రత్త కోసం.

రచయిత బులుసు సుబ్రహ్మణ్యం గురించి: హాస్యరచయితగా బ్లాగ్లోకంలో ప్రసిద్ధులు. ఇటీవలే వారి రచనల సంకలనం "బులుసు సుబ్రహ్మణ్యం కథలు" ప్రచురించారు.  ...