జిక్కి పాడిన మూడు పాటలు

గాయని జిక్కి గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదు కాబట్టి తిన్నగా సంగతిలోకి వద్దాం. ఈ సంచికలో జిక్కి పాడిన, అంత తేలికగా దొరకని, మూడు పాటలు విందాం.

మొదటి పాట: మువ్వలు పలికెనురా – ఆకాశవాణిలో పాడింది, తరువాత రేడియో వాళ్లు టి.ఎస్. రికార్డుగా (Transcription Services Records) కూడా విడుదల చేసి వాళ్ల రేడియో కేంద్రాల నుండి మళ్లీ మళ్లీ ప్రసారమయ్యేట్లు కాస్త జాగ్రత్తపడ్డారు. (సుమారుగా) 1960 ముందునాటి లలిత సంగీతం యేదయినా మనకీరోజు అందుబాటులో వుందీ అంటే ఈ టి.ఎస్. రికార్డుల వల్లనే! ఈ లలిత గీతం రాసిందెవరో, బాణీ కట్టిందెవరో నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.


రెండవది: మబ్బుల్లో జాబిల్లి – ఆరుద్ర రాసిన పాట. ఇది, పేదపిల్ల (1951?) అన్న ఒక విడుదల కాని సినిమా కోసం పాడింది. రెండు గ్రామఫోను రికార్డులు మాత్రం విడుదలయ్యాయి. ఆ రికార్డుల పైనున్న వివరాల ప్రకారం జూపిటర్ పిక్చర్స్ అన్న బ్యానరు పైన, పి. ఆర్. మోని (?) అన్న వ్యక్తి సంగీత నిర్వహణలో ఈ పాటలు వచ్చినట్లు తెలుస్తుంది. (రికార్డు నంబరు HMV N69132, రికార్డు రెండవ పక్క ‘కంగారేల’ – ఎ. పి. కోమల, పిఠాపురం నాగేశ్వరరావు పాడిన యుగళ గీతం వుంటుంది.) ఈ పాట వినడం మొదలెట్టగానే ఇదేదో బాగా తెలిసిన బాణీలా వుందే అనుకుంటారు. నిజమే! లతా మంగేశ్కర్ గొంతులో మార్మోగిన ధీరేసే ఆజారే అఖియన్ అన్న ఒక గొప్ప జోలపాటకు (రామచంద్ర ‘అన్నా’ చితల్కర్ అపూర్వ సృష్టి, అల్బెలా, 1951) తెలుగు అనుకరణ. నా దృష్టిలో జిక్కి కూడా గొప్పగా పాడింది. 1968లో నటుడు నాగభూషణం, అల్బెలా అనే హిందీ సినిమా ఆధారంగా ‘నాటకాలరాయుడు’ తీసినప్పుడు ఈ జోలపాటను అదే బాణీలో సుశీల చేత పాడించారు. (‘నీలాల కన్నుల్లో’ – సుశీల కూడా చాలా గొప్పగా పాడింది.)


మూడవది: సౌదామిని(1951) అన్న సినిమాలో పాట. పాట పల్లవి – కుందరదనా వినవే రామకథ, చూసి చాలామంది ఇది ఆధ్యాత్మ రామాయణ కీర్తన అనుకుంటారు. ఆ పోలిక కేవలం పాట పల్లవుల వరకు మాత్రమే నిజం. సినిమా పాటలో చరణాలు మాత్రం సీనియర్ సముద్రాలవి. ఈ పాట కోసం వెతికినంతగా గత పాతిక, ముప్పై యేళ్లలో మరే పాటకోసం నేను వెతకలేదంటే అతిశయోక్తి కాదు. చిట్టచివరకు 2012లో ఎ.సత్యనారాయణగారి దగ్గర రికార్డు దొరికింది. వారికి (ఇలా పబ్లిక్‌గా కూడా) నా కృతజ్ఞతలు! అదిప్పుడు మీ ముందు. (సినిమా విడుదలై 60 ఏళ్లు దాటిపోయాయి కాబట్టి కాపీరైటు సమస్య లేదనే అనుకుంటున్నాను.) సినిమా పాటల పుస్తకంలో ఇచ్చిన వివరాల ప్రకారం (సినిమా ప్రింటు ఇప్పుడు దొరకదు!) ఇది ఒక పరిచారిక మాండు రాగంలో (ఆది తాళం) పాడిన పాట. సంగీతం ఎస్.వి. వెంకటరామన్.


కొసమెరుపు: ఈ వాక్యాలు రాస్తున్నప్పుడే తెలుసుకున్న విషయం ఏమంటే సౌదామిని సినిమాలోని ఈపాట ఇప్పుడు యూట్యూబులో వుందని. రెంటికీ సోర్సూ ఒకటే!